పవిత్ర బంధం
- Yasoda Gottiparthi
- 5 minutes ago
- 4 min read

Pavithra Bandham - Telugu Family Story | Yasoda Gottiparthi
పవిత్ర బంధం - తెలుగు కుటుంబ కథ | యశోద గొట్టిపర్తి
Published In manatelugukathalu.com On 14/04/2026
ప్రేమ అంటే కేవలం కలిసే ఉండటం కాదు…అవసరమైనప్పుడు త్యాగం చేయడం.
ఈ కథలో ప్రతి పాత్ర ఒక భావాన్ని చెబుతుంది—అహం, ప్రేమ, బాధ, త్యాగం…చివరికి “పవిత్ర బంధం”గా మారే అనుబంధం.
దుబాయ్ నుండి హైదరాబాద్‌కు ఎమిరేట్స్ "ఎయిర్‌బస్ బోయింగ్ 312" ర్యాంప్ పైకి రాగానే, ప్రయాణీకులు బోర్డింగ్ పాస్‌లతో ఒకరి వెనుక ఒకరు నడుస్తూ, ఫ్లైట్‌లోకి అడుగు పెడుతూ, ఎయిర్ హోస్టెస్‌లకు "గుడ్ మార్నింగ్" చెబుతూ, పేరు, సీట్ నంబర్ వెతుకుతూ, చేతిలో క్యాబిన్ బ్యాగ్‌ను సీటు పైన రాక్‌లో పెట్టే ప్రయత్నం చేస్తుంటే, "గుడ్ మార్నింగ్, కెన్ ఐ హెల్ప్ యు?" అంటూ ఎయిర్ హోస్టెస్ ప్రతి ఒక్కరినీ సీట్ బెల్ట్ పెట్టుకోమని సూచించింది.
సీట్లో ఉన్న భర్తకు మాత్రం తానే చేతి నుండి తీసుకుని బెల్ట్ వేసింది.
ఆ చూపుల జల్లులలో తడిసి ముద్దవ్వాల్సిన సునీతకు అవి నిప్పుల సెగలా తోచాయి.
"థాంక్యూ, సునీత."
చేయి మంటలో కాలినట్టయ్యింది. చందన్ ఏదో చెప్పబోతుండగా...
"మేడం! కాస్త బెల్ట్ వేస్తారా?" అనగానే వెనక్కి తిరిగి, చేయి తిరగక అవస్థ పడుతున్న ఒక పెద్దాయనకు సీట్ బెల్ట్ వేసి, తగిన సూచనలు చేస్తూ, అందరినీ గమనిస్తున్న సునీత, విండోలను తెరిచి ఉంచమని దృష్టి సారించింది.
ఫ్లైట్ టేకాఫ్ తీసుకుని ఆకాశంలోకి దూసుకుపోతుంది. అనంత ఆకాశంలో చిన్న విత్తనం నుండి పెద్ద వృక్షం అన్నట్టు చిన్న విండోల నుండి ఆకాశంలోకి ఆసక్తిగా చూస్తుంటే, వెండి మబ్బులన్నీ దూదిపింజలుగా మారి కలుస్తూ, విడిపోతూ చెల్లాచెదరవుతూ చూడటానికి ఎంత బాగున్నాయో! కాసేపట్లో కనబడవు. అంధకారంలో కొట్టుమిట్టాడుతూ ఆనందం వెంట బాధ ఉంటుంది అన్నట్టు ఓదార్పు తనంతట అదే వస్తుంది.
(గతంలోకి...)
"సరదాగా సైకిల్ నేర్పమంటే బెట్టు చేస్తున్నావు. ఖర్చు, కష్టం అన్నట్టు చూస్తున్నావా, శేఖర్?"
"అమ్మాయిగారికి సైకిల్ తొక్కడం అవసరమా అనుకుంటున్నావా? నోరు మెదపవేంటి?"
పెడల్ మీద కాలు పెడితే కింద పడతాననే భయంతో గట్టిగా అరిచింది సునీత.
వెంటనే పడకుండా పట్టుకుని, "అమ్మాయిగారు చూశారా! కాస్త అయితే పడేవారు. హాయిగా కారులో తిరిగే మీకు ఈ కష్టం ఎందుకండీ?"
"కొన్ని రోజుల నుండి నేర్పించమని అడుగుతుంటే లేదంటావా?"
"చేయి వదలకు, నాన్నని పిలుస్తాను" అని బెదిరించింది.
"పిలవండి. సైకిల్ కొనివ్వమంటే కొనివ్వలేదు నాన్నగారు మీకు. నా పాత సైకిల్ ఎక్కనిస్తారా?"
వెంటనే ముఖం చిన్నబుచ్చుకుని వెళ్లబోతుంటే... "ఆగండి, రేపు మీ కోసం కొత్త సైకిల్ తెస్తాను. మన తోటలో ఒక స్థలాన్ని సిద్ధం చేస్తాను. అక్కడ నేర్చుకుంటారు మీరు," అనగానే సంతోషంగా గుమ్మంలోకి వెళ్లింది.
సైకిల్ స్టాండ్‌పై చేయి పెట్టినప్పుడు, పెడల్‌పై కాలు పెట్టి ముందుకు వెనక్కి తిప్పుతూ నేర్చుకోవాలనే ఇష్టంతో చేయి చేయి కలిసినా, దూరం జరగలేదు.
"అమ్మాయిగారు, మీరు భూమి మీద నడుస్తున్న అందని దేవతండి. ఆకాశమే మీ గమ్యం. అందుకోలేని ప్రాణం నాది. ఆరాధించడమే తప్ప అర్హత లేని, చిగురులు తొడిగిన నా ప్రేమ చితి వరకు మీ కోసం ఎదురుచూస్తూ ఉంటుంది..." అని లోలోపల ఆలోచిస్తూ,
"శేఖర్, నువ్వు శిఖరమంత ఎత్తు కనిపిస్తున్నావు. నిన్ను చేరలేని అసహాయత నాది. పొలం పుట్ర తిరుగుతూ పంటలు పండిస్తూ పదిమంది కడుపు నింపుతూ, నాన్నగారికి నమ్మిన బంటుగా నడుచుకోవాలి నువ్వు. నాన్న చేతినీ నీ చేతిలో పెట్టి వెళ్తున్నాను," అంటూ కళ్ళలో నీరు కనపడకుండా కదిలింది.
ఈ నేల నన్నెంతో సంతోషంతో ముంచెత్తి సాగనంపుతూ ఆశీస్సులు ఇస్తూ ఉంది. అమ్మానాన్నలతో సహా అందరూ ఆనందంతో ఉన్నారు. పంచిన అనురాగం మరింత బలంతో ముందుకు సాగాలి — అదే నా లక్ష్యం.
డిగ్రీలో మొదటి స్థానంలో నిలిచిన తను, ఎన్నో ప్రవేశ పరీక్షలు రాసి ఉద్యోగం కోసం ఎదురుచూస్తోంది.
ఐదు ఫీట్ల ఎనిమిది ఇంచులతో, ఒడ్డు పొడుగు, బంగారు వర్ణంలో, నిండు చందమామ లాంటి మోముతో, రింగుల పొడవైన జుట్టు, సన్నని నాజూకు తనువుతో చూడగానే ఆకర్షింపబడే శరీర సౌష్టవం సునీతది.
"చూడమ్మా! వీడు నా అన్నయ్య కొడుకు చందన్. 'చందు' అని కూడా పిలవవచ్చు," అంది పిన్ని.
"హలో చందు గారు!" అంటూ వినయంగా పలకరించగానే, "హాయ్! ప్రయాణం బాగా జరిగిందా? మీకు రేపు ఆఫీసులో చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది."
"అవునా! నేనేమీ ప్రిపేర్ కాలేదు," అని టెన్షన్ పడుతుంటే, "అంత ఆందోళన పడాల్సిన పని లేదు. మీకు ఇతర భాషలలో ప్రవేశం ఉందా? విద్యా అనుభవంతో ఉద్యోగాన్ని అర్థం చేసుకున్నారా? ప్రయాణికుల పట్ల మీ సహనం, ఓర్పు, ఒత్తిడిని తట్టుకునే శక్తిని పరిశీలిస్తారు — అంతే."
"ఓకే అండి... కానీ మీకు ఈ విషయాలు ఎలా తెలుసు?"
"నేను కొన్నాళ్లు ఎయిర్ హోస్టెస్‌గా చేసి, తర్వాత పైలట్‌గా ఎయిర్‌లైన్ శిక్షణ పూర్తి చేశాను."
"మీ నుండి చాలా తెలుసుకోవచ్చు కదా!" అనుకుంటూ ఆయన్ని అనుసరించింది.
**********
బాబూరావు వందల ఎకరాల పొలాలను సాగు చేస్తూ, పచ్చని చేలలో, తోటలలోనే కాలక్షేపం చేస్తూ, కూతురు సునీతను ప్రాణంగా చూసుకుంటూ ఆ దంపతులు జీవిస్తున్నారు.తమ్ముడు చిన్నారావు మాత్రం పట్నంలో బిజినెస్ మ్యాన్‌గా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ, ఉన్న భూములను అమ్మేయాలంటాడు.
కూతురు సునీత ఉద్యోగం చేస్తూ, విమానాల్లో తిరుగుతూ తనను ఈ స్థితికి తెచ్చిందని ఆయన భావిస్తాడు.కన్నతల్లి లాంటి భూమిని వదలడం ఇష్టం లేక, తమ్ముడు తన వ్యాపార నష్టాలను పూడ్చుకోవడానికి భూమిని తనఖా పెట్టమంటే బాబూరావు ఒప్పుకోలేదు. పంపకాలు చేయమని పట్టుబట్టిన తమ్ముడికి, వ్యవసాయ భూమిని పంచినట్లే వ్యాపారంలోనూ వాటా ఇవ్వమని అడిగేసరికి, చిన్నారావు తెలివిగా మాట మార్చాడు. "భూమిని సాగు చేద్దాం, మూడు పువ్వులు ఆరు కాయలుగా అభివృద్ధి చేద్దాం," అంటూ అన్నను సంతోషపెట్టాడు.
సునీత ఎయిర్ హోస్టెస్ కోర్స్ పూర్తి చేసి, ఇంటర్వ్యూలకు హాజరవుతోంది.
"ఒక్కగానొక్క కూతుర్ని నీ పిల్లలతో సమానంగా సిటీలో చదివించావు. అన్ని రంగాల్లో ఆడపిల్లలు మగవారితో సమానమని నిరూపిస్తూ, ఆమె ఆకాశ మార్గాన విహరిస్తోంది."
"ఒకవైపు సంతోషంగా ఉన్నా, మరోవైపు ఒంటరితనాన్ని భరించలేకపోతున్నానురా!"
"అన్నయ్యా! మన ఊరికి సమీపంలోని ఏరోడ్రోమ్‌ను ప్రభుత్వ ఎయిర్‌పోర్ట్‌గా మార్చబోతున్నారు. సునీత లోకల్ ఫ్లైట్స్‌లోనే పనిచేయవచ్చు. మన భూములకు కూడా ధర పెరుగుతుంది."
"ధర ఎంత పలికినా భూమిని అమ్మే ప్రసక్తే లేదు," అని బాబూరావు ఖచ్చితంగా చెప్పాడు.
"సునీతకు పెళ్లికొడుకుని చూడాలనుకున్నాము కదా!"
"సునీతను చందన్ ఇష్టపడుతున్నాడు. సునీత మన మాట కాదనదు. పెళ్లి కోసం కొంత ఖర్చవుతుంది. పండిన పంటలు మార్కెట్‌కు పంపిద్దాము. వచ్చిన డబ్బులతోనే జరిపించేద్దాము," అన్నాడు.
"అన్నయ్యా! కట్న కానుకల కోసమైనా చేతిలో డబ్బు ఉండాలి కదా."
"సరే రా! మన భూమి పరులకెందుకు పోనివ్వాలి. సునీత, చందన్ పేరు మీదనే కొంత రాసిద్దాము."
ఆ మాటలు విన్న చందన్ సమ్మతించడంతో, బాబూరావు తన అల్లుడిని మెచ్చుకుని పెళ్లి ఘనంగా జరిపించాడు.
కొన్నాళ్లకు వారు దుబాయ్‌లో స్థిరపడ్డారు. బాబూరావు తన ఆస్తిని తన కూతుళ్లకు రాసివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాడు.
తన సేవలో జీవితాన్ని అంకితం చేసిన శేఖర్ పేరు మీద కూడా కొంత భూమి రాస్తానంటే చిన్నారావు నిరాకరించాడు.
"అయ్యగారు! నా కోసం గొడవ పడకండి. మీ ప్రేమాభిమానాలు ఉంటే చాలు. నేనే దూరంగా వెళ్లిపోతాను," అని శేఖర్ హైదరాబాద్ చేరుకుని, జరిగిందంతా సునీతకు ఫోన్‌లో వివరించాడు.
"శేఖర్, నువ్వు నాన్నగారి దగ్గరే ఉండు. నాన్నకు నేను నచ్చచెబుతాను," అంది సునీత.
"నాన్నగారు, ఆస్తి కోసం తొందరేమీ లేదు. నేను మంచి లాయర్‌తో మాట్లాడతాను."
"విలువైన ఉద్యోగాన్ని వదిలి రావాల్సిన పని లేదు. వీలైనప్పుడే రండి," అని ఆయన చెప్పారు.
"ఏమండీ! నేను దగ్గరకు వస్తే దూరం జరుగుతారు. నన్ను నచ్చే కదా పెళ్లి చేసుకున్నారు?" అని సునీత చందన్‌ను నిలదీసింది.
ఒకరోజు చందన్ మరొక స్త్రీతో గదిలోకి వెళ్లడం చూసిన సునీత రోత చెంది, "నా జీవితాన్ని నాశనం చేశారు. ఇక ఇక్కడ ఉండలేను," అని తన తండ్రి దగ్గరకు బయలుదేరింది.
"వెళ్లు... నేను మంచివాడినే అని చెప్పినా నువ్వు నమ్మవు," అన్నాడు చందన్.
ఆయన కూడా ఆమె వెంటే ఫ్లైట్‌లో బయలుదేరాడు.
చందన్ అంతకుముందే శేఖర్ దగ్గరకు వెళ్లి, "మామగారిని కంటికి రెప్పలా చూసుకున్నావు. ఇప్పుడు సునీతను కూడా చూసుకోవాల్సిన సమయం వచ్చింది," అన్నాడు.
"ఏమంటున్నారు బాబూ? నాకేమీ అర్థం కావడం లేదు."
"శిక్షణలో ప్రమాదం జరిగి నా నడుముకు దెబ్బ తగిలింది. సంసార సుఖానికి దూరం ఉండాలని డాక్టర్లు చెప్పారు."
సునీతకు నిజాన్ని చెప్పలేక, తనను తాను దుర్మార్గుడిగా చూపించుకున్నాడు చందన్. సునీత మానసికంగా కృంగిపోయింది.
"ఇప్పుడు సునీతకు తోడుగా ఉండాల్సిన బాధ్యత నీదే," అని శేఖర్‌కు చెప్పాడు.
బాబూరావు నిజం తెలుసుకుని చందన్‌ను పంపేశాడు. సునీత పల్లెటూర్లో శేఖర్‌తో గడుపుతూ ప్రశాంతత పొందింది.
"నీ చేయి వదలను," అంటూ శేఖర్ కౌగిలిలో వాలింది.
తండ్రి వారిద్దరికీ వివాహం జరిపించి ఒక "పవిత్ర బంధం" ఏర్పాటు చేశాడు.
శుభం
యశోద గొట్టిపర్తి గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
యశోద గొట్టిపర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: యశోద గొట్టిపర్తి
హాబిస్: కథలు చదవడం ,రాయడం



