top of page

బాంధవ్యం


'Bandhavyam' - New Telugu Article Written By Ch. C. S. Sarma

'బాంధవ్యం' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఏయ్! ఆగండి...." అన్నాడు కాశ్యప్.

కాలేజి లాంగ్ బెల్ మ్రోగింది. సమయం సాయంత్రం ఐదు గంటలు.

విద్యార్థినీ విద్యార్థులందరూ క్లాస్ గదుల నుండి బయటికి వచ్చారు.

తమ తమ గృహాలకు బయలుదేరారు.

నలుగురు విద్యార్థినులు కలసి ముందుకు నడుస్తున్నారు.

కాశ్యప్ వారిని సమీపించి ఆ మాటను అన్నాడు.

నలుగురు ఆడపిల్లలు వెనుతిరిగి చూచారు.


"వేదవతీ! నిన్నే!..." అన్నాడు కాశ్యప్.


కాశ్యప్ బి.ఎ ఫైనల్ ఇయర్. విద్యార్థుల నాయకుడు.

వేదవతి ఆమెతోటి వారు ఫస్ట్ ఇయర్ బి.ఎ.

ఆశ్చర్యంతో వేదవతి కాశ్యప్ ముఖంలోకి చూచింది.

కాశ్యప్ ఆమెను సమీపించాడు.


"నీ పేరు వేదవతే కదూ!..." అడిగాడు కాశ్యప్.


అవునన్నట్లు తల ఆడించింది వేదవతి.

"నేనెవరో నీకు తెలుసా!..."


తెలీదన్నట్లు బిక్కముఖంతో వేదవతి తల ఆడించింది. తలను దించుకొంది.

"మాట్లాడు..."


"ఏం మాట్లాడాలి?" మెల్లగా అంది వేదవతి.


"నేనెవరో చెప్పు్. తలను పైకెత్తి నా కళ్ళల్లోకి చూడు" చిరునవ్వుతో చెప్పాడు కాశ్యప్.


"విద్యార్థుల నాయకుడు...."


"ఎవరు?....."


"మీరు....."


"నా పేరు!...."


"తెలీదు...." తలను మరీ వంచి చెప్పింది వేదవతి.


"కాశ్యప్..." వేదవతి ప్రక్కన వున్న జానకీ చెప్పింది.


"వెరీగుడ్ జానూ. నీవు తెలివైనదానివి" నవ్వాడు కాశ్యప్.


’అంటే నేను మొద్దునా!.... ఈయనకు ఎంత పొగరు!....’ అనుకొంది వేదవతి.

"ఏయ్..... నిన్నే!...."


తలను పైకెత్తి కాశ్యప్ ముఖంలోకి క్షణంసేపు చూసి తలను దించుకొంది వేదవతి.


"ఇప్పుడు చెప్పు నా పేరేమిటి?...."


"కాశ్యప్ గారు!...." మెల్లగా చెప్పింది వేదవతి.


"నేను నీకు ఏమౌతానో తెలుసా!..."


తెలీదన్నట్లు తల ఆడించింది వేదవతి.


"నేను మీ మేనత్త అంటే మీ నాన్న చెల్లెలి కొడుకును. నేను నీకు ఏమౌతాను?..."


"బావ..."నవ్వుతూ చెప్పింది జానకీ.


"జానూ!...."


"సార్!...."


"దీనికి చెప్పు. నేను తనకు ఏమౌతానన్నది!...."


"వేదా!.... ఆయన నీకు బావ వరుస..." నవ్వుతూ చెప్పింది జానకి.


వేదవతి... జానకీ ముఖంలోకి తీక్షణంగా చూచింది.


"అవునే... నేను చెప్పింది నిజం..." అంది జానకి.


"అర్థం అయిందా!...." వేదవతిని పరీక్షగా చూస్తూ అడిగాడు కాశ్యప్.

వేదవతి మౌనంగా ఉండిపోయింది.


"ఏయ్ వేదా!..."


తొట్రుపాటుతో కాశ్వప్ ముఖంలోకి చూచింది వేదవతి.


"చూడు. ఇంటికి వెళ్ళి మీ నాన్న గంగాధరం గారికి చెప్పు. నేను ఈ రోజు మా బావతో మాట్లాడానని!.... సరేనా!...." అడిగాడు కాశ్యప్.


సరే అన్నట్లు తల ఆడించింది.


"ఓకే. ఇక బయలుదేరండి. రేపు కలుద్దాం. ఆ..... రేపు నీవు నాతో మా యింటికి రావాలి. మా అమ్మ అదే మీ మేనత్త విద్యావతి నిన్ను చూడాలన్నది!.... అర్థం అయిందా!...."


అవునన్నట్లు తల వంచుకొని తలను ఆడించింది వేదవతి.

బిగ్గరగా నవ్వాడు కాశ్యప్.

ఆ నలుగురూ ముందుకు నడిచారు.

కాశ్యప్ వెళ్ళిపోయాడు.

"వేదా!...." అంది జానకి.

"ఏమిటే!...." కోపంతో అంది వేదవతి.


"కాశ్యప్ నీ బావ అన్న విషయం నీకు నిజంగా తెలీదా!..." అడిగింది జానకి.


"తెలీదే!....." అంది వేదవతి.


"చాలా మంచివాడు మీ బావ కాశ్యప్. అన్నింటిలో ఆయనే ఫస్టు. గొప్ప తెలివి కలవాడు. ఆయనంటే నాకు ఎంతో ఇష్టం" చిరునవ్వుతో చెప్పింది జానకి.


జానకి చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తూ ముందుకు నడిచింది వేదవతి.


’అమ్మకాని, నాన్న కాని మా మేనత్త, బావను గురించి ఇంత వరకూ తనకు ఏమీ చెప్పలేదు. కారణం ఏమిటో. మేము వారి ఇంటికి వెళ్లడం కాని, వారు మా ఇంటికి రావడం కాని ఏనాడూ జరుగలేదు. ఏదో బలమైన కారణం వుండి వుంటుంది. ఈ రాత్రి అమ్మను అడగాలి. విషయం ఏమిటో తెలిసికోవాలి’ అనుకొంది వేదవతి.


కాలేజీ వున్నది తాలూకా నగరంలో. వేదవతి వాళ్ళ చిన్న వూరు అక్కడికి నాలుగు కిలో మీటర్లు. రెండున్నర కిలోమీటర్లు పంటపొలాలు. ఆ గ్రామాన్నించి ఇరవైమంది బాలబాలికలు తాలూకా వచ్చి హైస్కూల్లో కాలేజీల్లో చదువుకొంటారు. పంటభూముల గట్లమీద సరదా కబుర్లతో నడుచుకొంటూ వెళతారు. రోడ్డుమార్గం వుంది. అది దాదాపు ఎనిమిది కిలోమీటర్లు. ఆకారణంగా ఆ దగ్గర మార్గంలోనే పిల్లలు నడిచేవారు. తన స్నేహితులతో కలసి తన అమ్మానాన్న, అత్తబావల ఆలోచనలతో తోటివారివెంట ఆ చేలగట్లపై నడవసాగింది వేదవతి.

***

ఆ రాత్రి భోజనానంతరం పడకగదిలో.....

"అమ్మా!....." పిలిచింది వేదవతి.


"ఏమ్మా!...." అడిగింది శ్యామల.


" మా నాన్నకు ఒక చెల్లెలు వుందా!...."


ఆశ్చర్యంగా చూచింది శ్యామల వేదవతి ముఖంలోకి...

"ఇప్పుడు ఆ విషయం ఎందుకు?...." అంది.


"అత్తకొడుకు బావ నన్ను ఈరోజు కలిసి మాట్లాడాడు"


"ఏం మాట్లాడాడు?..."


"తను నాకు బావ వరుస అవుతానని. మా అత్తయ్య అదే వారి తల్లి నన్ను చూడాలంటోందని, రేపు నన్ను వారి ఇంటికి తీసుకొని వెళతానని చెప్పాడు."


"నీవేమన్నావు?...."


"నేను తల ఆడించాను. జానకి చెప్పింది బావ చాలా మంచివాడని. అమ్మా!... ఏ కారణంగా వారికి మనకు మధ్యన మాటలు, రాకపోకలు లేవు?..." ప్రశ్నార్థకంగా తల్లిముఖంలోకి చూస్తూ అడిగింది వేదవతి.


శ్యామల కొన్ని క్షణాలు వేదవతి ముఖంలోకి పరీక్షగా చూచింది.

"జవాబు చెప్పమ్మా!...." ప్రాధేయపూర్వకంగా అడిగింది వేదవతి.


"ఆస్థిపంపకంలో ఏర్పడింది తకరారు!...." అంది శ్యామల.


"అంటే....!"


"మీ అత్తయ్య తండ్రి భూములను తోటదొడ్లని మీ నాన్నగారికి అత్తయ్యకు సక్రమంగా పంచలేదట. ఎక్కువభాగం మీ అత్తయ్యకు వ్రాసి ఇచ్చాడట. ఆయన చనిపోయాడు. ఆకారణంగా ఆ ఇంటికి, మన ఇంటికి రాకపోకలు, మాట మంచి లేదు. మీ నాన్న తత్త్వం, తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్ళూ అనేరకం. వారిని ఎవరూ మార్చలేరు. " జిజ్ఞాసగా చెప్పింది శ్యామల.


"ఓహో అదా సంగతి!....." సాలోచనగా అంది వేదవతి.


"అమ్మా ఒక్కమాట అడగనా!...."


"అడుగు...."


"నిజం చెప్పాలి!"


"అబద్ధం చెప్పడం నాకు అలవాటు లేదే!...."


"మా అత్తయ్య నీలా మంచిదా లేక చెడ్డదా?"


"చాలామంచిది కానీ ఆమె భర్త భాస్కరమూర్తి మంచివాడు కాదు... వ్యసనపరుడు. వారి వివాహానికి ముందు మంచివాడుగా నటించి మీ తాతయ్య సత్యమూర్తిని మోసంచేసి మీ అత్తయ్య విద్యావతిని పెండ్లి చేసుకొన్నాడు. వివాహం అయిన వారం రోజులకు ఆయన తత్త్వం బయటపడింది. జూదరి, త్రాగుబోతు. బహుశా ఆ అల్లుడి ఆ అవలక్షణాల కారణంగా మీ తాత మీ అత్తకు ఎక్కువ భాగం ఆస్థితో ఇచ్చి వుండవచ్చు."

"అత్తయ్య భర్త వున్నాడా అమ్మా!..."


"లేడు పది సంవత్సరాల క్రింద మీ తాతగారి కంటే ముందు చనిపోయారు. అల్లుడు మంచివాడు కాడని మీ తాతయ్య మీ అత్తయ్య దగ్గిరే వుండేవారు. ఐదేళ్ళ క్రిందట వారు గతించారు" చెప్పింది శ్యామల.

"అమ్మా! రేపు నేను బావతో వారి ఇంటికి వెళ్ళనా!"

శ్యామల వేదవతి ముఖంలోకి కొన్ని క్షణాలు పరీక్షగా చూచింది.

"చూడు వేదా!... నాకు ఈ పగలు, ప్రతీకారాలు నచ్చవు. కానీ నేను మీ నాన్నగారికి చెప్పలేను. ఆయన నా విషయంలో తన ధర్మాన్ని సక్రమంగా నెరవేరుస్తారు. నేనూ వారి విషయంలో అంతే. నేను ఏనాడూ వారికి ఏ విషయంలోనూ సలహా ఇవ్వలేదు. ఇవ్వను. కారణం వారు నా మాటను కాదంటే నాకు బాధ కలుగుతుంది. నాకు అనవసరమైన విషయాల్లో నేను జోక్యం కలిగించుకోకుండా వుండడంలోనే వుంది నాకు మనశ్శాంతి. ఇక నీ ప్రశ్నకు జవాబు!.... నీ వుద్దేశ్యం ఏమిటి?..." గంభీరంగా అడిగింది శ్యామల.

"వెళ్ళి అత్తయ్యను చూడాలని వుందమ్మా!...." మెల్లగా చెప్పింది వేదవతి.

"సరే, వెళ్ళిరా!...." చిరునవ్వుతో చెప్పింది శ్యామల.

అమ్మ సరే అన్నందుకు వేదవతికి ఎంతో సంతోషం.

"మా అమ్మ బంగారం" తల్లి ముఖాన్ని తన చేతుల్లోకి తీసికొని నొసటన ముద్దుపెట్టింది వేదవతి.

"చూడు వేదా!.... నా విషయంలోనూ, మీ అత్తయ్య విషయంలోనూ మాకు వచ్చిన మగవారు ఒకరకమైనవారు. వారికి స్త్రీ పట్ల గౌరవం తక్కువ. పురుషాధిక్యత ఎక్కువ. నీకు నీ భావి జీవితంలో అలాంటివారు తారసపడకూడదని నేను నిత్యం ఆ దైవాన్ని ప్రార్థిస్తాను. మన సంకల్పం మంచిదైతే మన కోరిక ఒకనాటికి తీరుతుందనేది నా విశ్వాసం రా! మనస్సున మంచి ఆలోచనలతో పదిమందికి మేలుకోరి సాయం చేయడం అన్నది మన ధర్మం. దాన్ని నేను పాటిస్తాను. నీవూ నా మాటలను అర్థం చేసికొని గొప్పగా బ్రతకాలి వేదా!" అనునయంగా చెప్పింది శ్యామల.

ఆ తల్లీ కూతుళ్ళు మంచాలపై వాలిపోయారు.

***

"అమ్మా!....." పిలిచాడు కాశ్యప్. అతని ప్రక్కనే వేదవతి వుంది. వంట ఇంట్లోవున్న విద్యావతి హాల్లోకి వచ్చింది. కొడుకును అతని ప్రక్కనే వున్న వేదవతిని చూచింది.

"అమ్మా! ఈ పిల్ల ఎవరో తెలుసా!" వ్యంగ్యంగా వేదవతి ముఖంలోకి చూచి నవ్వాడు కాశ్యప్.

’పిల్లా..... నేనేం పనిపిల్లనా!..... ఎంత తుస్కారం. అలాగనేనా పరిచయం చేసేది. మనిషి పొగరు జాస్తి’ అనుకొంది వేదవతి.

తలను పైకెత్తి విద్యావతి ముఖంలోకి చూచింది. వినయంగా చేతులు జోడించింది.

విద్యావతి వేదవతిని సమీపించింది. పరీక్షగా ఆమె ముఖంలోకి కొన్ని క్షణాలు చూచింది విద్యావతి.

"అమ్మా!.... నీ కోడలి పేరు వేదవతి" నవ్వుతూ చెప్పాడు కాశ్యప్.

కొన్ని క్షణాల తరువాత "అమ్మా! చూడలన్నావుగా తీసుకొచ్చాను. ఏం మాట్లాడాలనుకొన్నావో మాట్లాడు" చిరునవ్వుతో చెప్పాడు కాశ్యప్.

విద్యావతి వేదవతి చేతిని తన చేతిలోకి తీసుకొంది.

"రామ్మా!..... కూర్చో!...." ప్రీతిగా చిరునవ్వుతో పలికింది.

వేదవతి సోఫాలో కూర్చుంది.

"నీపేరు?..." అడిగింది విద్యావతి.

"వేదవతి...." మెల్లగా చెప్పింది వేదవతి.

"నీవు ఇక్కడికి వస్తున్న విషయం మీ అమ్మానాన్నలకు తెలుసా!"

తల ఆడించింది వేదవతి. "అమ్మతో చెప్పాను. వెళ్ళమంది."

"నేను నీకు ఏమౌతానో తెలుసా!...."

తెలుసన్నట్లు తల ఆడించింది వేదవతి.

"ఏమౌతుంది?...." నవ్వుతూ అడిగాడు కాశ్యప్.

"అత్తయ్య....!" మెల్లగా తల వంచుకొని చెప్పింది వేదవతి.

"తలను పైకెత్తు...." అన్నాడు కాశ్యప్.

"రేయ్!..... ఏమిటిరా ఆ గద్ధింపు. అమ్మా వాడిమాట తీరు అంతే. భయపడకు. ఒక్కక్షణం వస్తాను" వేగంగా వంటగది వైపుకు నడిచింది విద్యావతి.

కాశ్యప్ తన గదిలో ప్రవేశించాడు.

ప్లేట్లో లడ్లు రెండు, మురుకులతో హాల్లోకి వచ్చి విద్యావతి ప్లేటును వేదవతికి అందించింది.

"వీడేడి?...." అడిగింది విద్యావతి.

"ఆ గదిలోకి వెళ్ళారు!" అంది వేదవతి.

"తినమ్మా!..." ప్రేమగా పలికింది విద్యావతి.

"మంచినీళ్ళు కావాలి!..."

"ఆఁ..... తెస్తాను తిను" వంటగదిలోకి వెళ్ళింది విద్యావతి. రెండుక్షణాల్లో నీళ్ళగ్లాసుతో వచ్చి, గ్లాసును వేదవతికి అందించింది.

మంచినీళ్ళు త్రాగింది వేదవతి.

"తిను వేదా!...." అంది విద్యావతి.

కాశ్యప్ ఫ్రెష్ అయ్యి డ్రస్ మార్చుకొని హాల్లోకి వచ్చాడు. మెల్లగా తింటున్న వేదవతిని చూచాడు.

"వేదా....! అన్నింటినీ తినాలి" అన్నాడు కాశ్యప్.

క్షణంసేపు కాశ్యప్ ముఖంలోకి చూచి, వేదవతి తినసాగింది.

"ఎలా వున్నాయి?...."

"చాలా బాగున్నాయి అత్తయ్యా!...."

"ఏమన్నావ్?..." అడిగాడు కాశ్యప్ సోఫాలో కూర్చుంటూ.

బెదురుచూపులతో కాశ్యప్ ముఖంలోకి చూచింది వేదవతి. వంటగదిలోకి వెళ్ళి ఆ పలహారపు ప్లేటు తీసికొని వచ్చి కాశ్యప్‍కు అందించింది విద్యావతి.

విద్యావతి... వేదవతి ప్రక్కన సోఫాలో కూర్చుంది. ప్రీతిగా ఆమెను చూడసాగింది.

కాశ్యప్ తినడం ప్రారంభించాడు.

"నేను తినేలోపల వాటిని నీవూ తినాలి" అన్నాడు.

వేదవతి సరే అన్నట్లు తల ఆడించింది.

"అమ్మగారూ!...."

వాకిటినుండి పిలుపు....

తన చేతిలోని ప్లేటును టీపాయ్ పై వుంచి సింహద్వారాన్ని సమీపించాడు కాశ్యప్.

"అయ్యా దండాలు..."

"ఏమిటి గోపన్న ఇలా వచ్చావ్?...."

"కౌలు డబ్బులు బాబు. ఈ సంవత్సరం పంటలు బాగా పండలేదు బాబుగారూ!... పాతిక బస్తాలు రావలసిన దిగుబడి పదిహేను బస్తాలే వచ్చినాయి అయ్యా. ఇదిగో డబ్బు" నోట్లకట్టను కాశ్యప్‍కు అందించాడు గోపన్న.

గోపన్న కాశ్యప్ భూములను కౌలుకు సాగుచేస్తాడు. మాటప్రకారం వారికి ఇవ్వవలసిన డబ్బును ఏ సంవత్సరం కూడా ఇవ్వలేదు. పంట సరిగా పండలేదని, మూడువంతులు తాను కాజేసి ఒక వంతు ధాన్యపు విలువను వారికి ఇస్తాడు. మోసగాడు.

"సరే....! ఇక నీవు వెళ్ళు...." అన్నాడు కాశ్యప్. గోపన్న వెళ్ళిపోయాడు.

"అమ్మా!.... గోపన్న పోయినసారి పాడిన పాటనే ఇప్పుడూ పాడాడు" నవ్వుతూ డబ్బును తల్లికి అందించాడు.

"ఏం చేద్దాం వాడు ఏది చెప్పినా నమ్మాల్సిందే. మనం ఏమీ చేయలేము కదా!...." విచారంగా అంది విద్యావతి.

వేదవతి తినడం ముగించి ఖాళీప్లేటును క్రిందపెట్టబోయింది. కాశ్యప్ తన ప్లేట్లో వున్న లడ్డును తీసి వేదవతి ప్లేట్లోవేసి...

"నేను తినేంతవరకూ మెల్లగా ఆ లడ్డును తిను" నవ్వుతూ చెప్పాడు కాశ్యప్.

వేదవతి జాలిగా కాశ్యప్ ముఖంలోకిచూచింది.

"తినమ్మా!..." చిరునవ్వుతో చెప్పింది విద్యావతి.

కాశ్యప్, వేదవతిలు తినడం ముగిసింది.

విద్యావతి "వేదా....!"

"అత్తయ్యా!...."

"కాఫీయా, టీయా?"

"ఏదైనా సరే అత్తయ్యా!...."

"కాశ్యప్‍కు టీ ఇష్టం"

"నాకూ...."

"టీనే ఇమ్మంటావా!...." వేదవతి ముగించకముందే అంది విద్యావతి.

కాశ్యప్ వేదవతి ముఖంలోకి చూచి నవ్వాడు.

వేదవతి సిగ్గుతో తలదించుకొంది.

విద్యావతి ఇరువురికీ టీ గ్లాసులు అందించింది. త్రాగారు...

"అమ్మా!.... నేను బులెట్‍పై వేదను వాళ్ళ వూర్లో దించివస్తాను. ఆ.... వేదా!.... మీ నాన్నగారికి చెప్పు. నేను రెండురోజుల్లో వారిని వారి ఇంట అంటే మీ ఇంట్లో కలవబోతున్నానని. సరేనా!...."

"అలాగే..." మెల్లగా అంది వేదవతి.

బయటికి నడిచి కాశ్యప్ బులెట్‍ను సమీపించి స్టార్ట్ చేశాడు. విద్యావతి, వేదవతులు బులెట్‍ను సమీపించారు. వేదవతి కూర్చుంది.

"అత్తయా!... వెళ్ళివస్తాను" అంది వేదవతి చిరునవ్వుతో.

"మంచిది తల్లీ జాగ్రత్త" అంది విద్యావతి.

కాశ్యప్ బులెట్‍ను కదిలించాడు.

***

కాశ్యప్ తన మేనమామ గంగాధరం ఇంటికి వచ్చాడు.

వరండాలో కూర్చొని వున్న గంగాధరం ఆశ్చర్యపోయాడు.

"నమస్కారం మామయ్యా!..."

గంగాధరం ముఖంలో రంగులు మారాయి.

"నేను మీ చెల్లెలు వేదవతి కొడుకును మామయ్యా. మీతో మాట్లాడాలని వచ్చాను."

"ఏం మాట్లాడాలి!..."

"వేదవతిని గురించి మామయ్యా!..."

"నా కూతురు వేదవతిని గురించి మాట్లాడేదానికి నీవెవరు?"

"ఆఁ మంచిప్రశ్న" నవ్వాడు కాశ్యప్.

వీరి సంభాషణ విన్న శ్యామల, వేదవతులు సింహద్వారం వెనుక వైపుకు చేరారు.

"మామయ్యా!.... మా తాతయ్య మా అమ్మకు ఆస్థిని ఎక్కువగా ఇచ్చి మీకు తక్కువగా ఇచ్చారని ఆయనను వారి జీవితకాలంలో ద్వేషించి, అమ్మనూ నన్నూ మీరు వెలివేశారు."

జేబునుంచి ఒక కవర్ తీసి గంగాధరానికి అందించాడు.

"ఆ కవర్‍లో దస్తావేజును చూడండి. పదిఎకరాల పంట భూమిని మా అమ్మ మీపేర వ్రాసి సంతకం చేసింది. ఇక మాకు మిగిలి వున్నది పదిహేను ఎకరాల మెట్టభూమి.

నెలరోజుల్లో నా పరీక్షలు పూర్తి అవుతాయి. నేను ఉద్యోగానికి వెళ్ళను. మాకున్న పదిహేను ఎకరాల మెట్టభూమిని సాగుచేస్తాను. మాకు కావలసినవాటిని పండిస్తాను. నా శక్తిమీద నాకు నమ్మకం వుంది.

రెండవ విషయం వేదవతి నా మరదలు. తను నాకు చాలా ఇష్టం. నేను ఆమెను పెండ్లి చేసికొంటాను. మీరు మంచి మనస్సుతో నా కోర్కెను తీరుస్తారని నా నమ్మకం. ఎవరూ ఏదీ ఈ భూమిమీద శ్వాశతం కాదు. ఆ విషయం మీకూ తెలిసిందే. ఆస్థికోసం.... పంతాలు, పట్టింపులు, పగలు, ద్వేషాలు, అమానుష చర్యలు మామయ్య. వేదవతి నాది. నన్ను కాదని మీరు వేదవతిని వేరొకరికి ఇచ్చి వివాహం చేయలేరు. వేదాకు కూడా నేనంటే ఇష్టం. మంచి మనస్సుతో ఆలోచించి తెంపేసుకొన్న బాంధవ్యాన్ని మా వివాహంతో కలిపి అందరం ఆనందంగా వుండేలా చూడండి మామయ్యా!.... వస్తాను" వేగంగా నడిచి బులెట్‍ను స్టార్ట్ చేశాడు.

ఆ శబ్దానికి శ్యామల, వేదవతి వరండాలోకి వచ్చారు. గంగాధరాన్ని చూచారు. వారి మూసిన కళ్ళనుండి కన్నీరు జలజలా క్రిందికి జారాయి. శ్యామల, వేదవతుల వదనాల్లో ఎంతో ఆనందం.

***

సమాప్తి

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.






48 views0 comments
bottom of page