top of page
Original.png

బతకాలనీ..

Aug 8
4 min read


రోడ్డుపక్కన నరికివేత ముప్పును ఎదుర్కొంటున్న వేపచెట్టు, చుట్టూ చెట్ల నరికివేత ఆనవాళ్లు మరియు గతంలో దాని నీడలో ఆడుకున్న పిల్లల జ్ఞాపకాలను ప్రతిబింబించే దృశ్యం.

Bathakalanee - Telugu Inspirational Story | Naga Suneetha Pokala

బతకాలనీ తెలుగు ప్రేరణాత్మక కథ | నాగ సునీత పోకల

Published in manatelugukathalu.com on 08/08/2026


“బతకాలనీ” ఒక చెట్టు ఆత్మకథ రూపంలో సాగిన హృదయస్పర్శి పర్యావరణ కథ. ‘తాని’ అనే వేపచెట్టు తన జీవితంలో చూసిన పచ్చని ప్రపంచం, తనతో స్నేహం చేసిన మరో చెట్టు నరికివేత, తన నీడలో ఆడుకున్న పిల్లల జ్ఞాపకాలు, చివరకు తనను కూడా నరికివేయడానికి జరుగుతున్న ప్రయత్నాన్ని మనసును కదిలించేలా వివరిస్తుంది. చెట్ల ప్రాధాన్యత, పర్యావరణ పరిరక్షణ, మానవ బాధ్యత, ప్రకృతితో మనిషికి ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసే ఈ కథ ప్రతి ఒక్కరినీ ఒక్కసారి ఆలోచింపజేస్తుంది.


“ఏంటి? శీర్షికను చూసిన మీరు చెట్టుకి ఆత్మకథ ఉంటుందా అని ఆశ్చర్యపోతున్నారా? ఏం? మనుషులకేనా మనోభావాలు, మాకుండవా? మీకు ప్రాణం ఉంది, మాకు ప్రాణం ఉంది. మీరెలా పెరుగుతారో, మేమూ అలాగే పెరుగుతాము. మీకు హృదయం ఉంది, మాకు హృదయం ఉంది. కానీ మా హృదయాన్ని చూసే మానవులే కరువైపోయారు. ఈ సోదంతా ఎందుకుకానీ, కథలోకొచ్చేస్తా.


నా పేరు ‘తాని’. నేనొక వేపచెట్టును. ఓ గ్రామంలో రోడ్డుపక్కన నేను మొలకెత్తాను. నేను పుట్టినప్పుడు నా చుట్టూ ఎన్నో చెట్లు ఉండేవి. నేను పెద్దయ్యేసరికి నా చుట్టూ ఉన్న చెట్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మొదట మా ఊరు పచ్చని చెట్లతో కళకళలాడేది. ఇప్పుడు మాత్రం పచ్చదనం వీడిన మోడులా మారిపోయింది.


నేను మొలకెత్తిన చోటుకు కొంచెం దూరంలో ఓ టేకు చెట్టు ఉండేది. దాని పేరు ‘సుగుణ’. అది నా ప్రాణ స్నేహితురాలు. మేమిద్దరం ఎంతో చక్కగా మాట్లాడుకునేవాళ్లం. ఒకరి కష్టసుఖాలను ఒకరం పంచుకునేవాళ్లం. మారుతున్న సమాజానికి మేము బలిపశువులమవుతున్నామని ఎంతో బాధపడేవాళ్లం.


నేను రోడ్డుపక్కన ఉన్నాను కాబట్టి స్కూల్‌కు వెళ్లే పిల్లలంతా నా దగ్గరికి వచ్చేవారు. వారి స్కూల్ బస్సు వచ్చేవరకు ఎంతో చక్కగా నా నీడలోనే ఆడుకునేవారు. వారి కేరింతలను, వారి ఆటలను చూసి నేను ఎంతో సంతోషించేదాన్ని. ఆ క్షణంలో నా కొమ్మలను నా చేతులుగా మలుచుకుని, నా వేర్లను నా కాళ్లుగా చేసుకుని, భూమిని చీల్చుకొని బయటికి వచ్చి వారితో కేరింతలు కొడుతూ ఆడుకోవాలనిపించేది.


కానీ ఏం లాభం? నేను కదలలేను. భూమిలోంచి నా వేర్లు బయటికి వస్తే నేను మరణిస్తాను. పిల్లలు ఆడే ఆటలను చూసి, నేను ఆడుతున్నట్లు ఊహించుకొని నా మనసుకు సర్దిచెప్పుకునేదాన్ని. ఇలా ఆ ఊరి పిల్లలంతా కేరింతలు కొడుతూ నా చుట్టూ తిరుగుతూ ఎంచక్కా ఆడుకునేవారు.


కానీ ఆ ఆనందం నాకు కొద్దికాలమే దక్కింది. రోడ్డుకు అడ్డుగా వస్తుందని, చివరిగా మిగిలిన నా స్నేహితుణ్ని కూడా చంపేశారు. ఇక నేను నా మనోభావాలను ఎవరితో పంచుకోవాలి? రోజంతా కబుర్లు ఎవరితో చెప్పుకోవాలి? ఒంటరి జీవితం ఎంత భయంకరంగా ఉంటుందో మీకు తెలుసా!


ఈ రోజు నా స్నేహితుణ్ని చంపేశారు. రేపు నన్ను చంపేస్తారు. ఇంకో రోజు ఇంకో చెట్టును నరుకేస్తారు. మమ్మల్ని చంపడం మీకు ఓ సరదా పనిలా అనిపిస్తుంది కదా?

ఇంటి నిర్మాణం కోసమో, రోడ్ల వెడల్పు కోసమో, కాగితాల తయారీ కోసమో మమ్మల్ని చంపుతున్నారు. ఒక చెట్టును నరికితే ఇంకో రెండు చెట్లను పెంచాలనే ఇంగితజ్ఞానాన్ని మీరు మర్చిపోయారు.


ఇవన్నీ ఆలోచిస్తుంటే నా కళ్లల్లో నీళ్లు ఆగడం లేదు. మీ మీద అసహ్యం వేస్తుంది. మా పట్ల బాధ్యతారహితంగా ప్రవర్తించే మిమ్మల్ని చూస్తుంటే నా కొమ్మల మధ్య మీ మానవజాతిని బంధించి, నా వేర్లతో నొక్కి చంపాలన్నంత కోపంగా ఉంది.

కానీ నేనలా చేయలేను. మీకు కావాల్సిన ఆక్సిజన్‌ను ఇచ్చి, మీ ప్రాణాలను అనుక్షణం కాపాడే నేను అలా అస్సలు చేయలేను. అయినా అలా చేస్తే మీకూ మాకూ తేడా ఏముంటుంది?


ఈరోజు నా నీడలోనే కూర్చొని, నేను రోడ్డుకు అడ్డొస్తున్నానని నన్ను నరికేయాలని మాట్లాడుకుంటున్నారు. ఇది విన్న నాకు ఒక్కసారిగా గుండె గుభేలుమంది. ప్రాణభీతి పట్టుకుంది. ఎప్పుడు చంపేస్తారో ఏమోనని క్షణక్షణం భయంతో బ్రతుకుతున్నాను.

నేను మీ కారణంగా నా చుట్టూ ఉన్న స్నేహితులందరినీ, చివరిగా మిగిలిన నా ప్రాణ స్నేహితుణ్ని కోల్పోయాను. ఇది సరిపోదన్నట్లు నన్ను కూడా చంపాలని పన్నాగాలు పన్నుతున్నారు.


“మేము మీకేం పాపం చేశాము? రోడ్డుపక్కన పుట్టడం నేను చేసిన తప్పా? మీకు నీడనివ్వడం మేము చేసిన పాపమా? మీకు ప్రాణవాయువునిచ్చి, అనుక్షణం మిమ్మల్ని సజీవంగా ఉంచడం మేము చేసిన అపరాధమా?


మేము మీ కోసం ప్రతి క్షణం కృషి చేస్తాము. కానీ మీకు మాత్రం మా దప్పిక తీర్చడానికి కూడా తీరిక లేదు. నేను పెరగడానికి మీరు ఎలాంటి కృషి చేయలేదు. వర్షపు నీటిపైనే ఆధారపడి నేను నా దప్పికను తీర్చుకుంటున్నాను.


నన్ను పెంచడానికి కూడా తీరిక లేని మీరు నా పైనే ఆజమాయిషీ చేస్తున్నారు. మీకేం హక్కుందని మీరు మమ్మల్ని నరుకుతున్నారు?


పూర్వకాలంలో ఎటు చూసినా ఈ భూమి పచ్చని చెట్లతో కళకళలాడేది. కానీ ఇప్పుడు మాత్రం పచ్చదనం వీడిన మోడులా మారిపోయింది. దీనికంతటికీ కారణం ముమ్మాటికీ మీరే.


రేపో మాపో నేను పోతాను. ఇంకో రోజు ఇంకో చెట్టు, దాని తర్వాత మరో చెట్టు పోతుంది. ఇలా రోజురోజుకు మా సంఖ్య తగ్గిపోతుంటే ప్రకృతి ప్రళయ గర్జన చేస్తుంది. అంతేకాకుండా జీవరాశికి ఆక్సిజన్ కొరత ఏర్పడుతుంది.


మీరొక్కరు చేసే తప్పులకు ఈ భూమ్మీద ఉన్న జీవరాశి మొత్తం ఇబ్బందులకు లోనవడం ఎంత మాత్రం న్యాయం? మీరే చెప్పండి. ఈ విషయం మీ మూర్ఖపు మెదడుకు ఎప్పుడర్థమవుతుందో ఏమో!


మీరు చేసే పనులకు నాకు రోజురోజుకు బ్రతుకు మీద ఆశ చచ్చిపోతుంది. నన్నెప్పుడు చంపేస్తారో ఏమోనన్న భయంతో బ్రతకలేక చస్తున్నాను. దీనికంటే మించిన నరకం మరొకటి ఉంటుందా? మీరే చెప్పండి. మీరు ఇంకా మారరని నాకర్థమైంది.


చివరికి నన్ను చంపేసే రోజులు దగ్గరకొచ్చాయి. ఈరోజు ఉదయం కొంతమంది వ్యక్తులు నన్ను నరకాలని మాట్లాడుకుంటుంటే విన్నాను. ఇక ఇదే నా చివరి రోజని నా కర్తమైంది. ఇక చేసేదేమీ లేక నా జ్ఞాపకాలన్నింటినీ గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టాను.


నన్ను రేపు నరికేస్తే పిల్లలు రేపటి నుంచి ఎవరి చుట్టూ తిరుగుతూ ఆడతారు? ప్రయాణికులకు అలసట వస్తే నీడనెవరిస్తారు? తేనెటీగలకు తేనె పెట్టుకోవడానికి కొమ్మలెవరిస్తారు? ఇవన్నీ తలుచుకుంటుంటే నాకు ఏడుపు ఆగడం లేదు.

చివరికి నా ఆయుష్షు తీరిపోయినట్టుంది. అందుకే ఒక వ్యక్తి నన్ను చంపడానికి విద్యుత్తు రంపాన్ని తెస్తున్నాడు. దాన్ని చూస్తుంటే నా కొమ్మలన్నీ వణికిపోతున్నాయి. నా వేపకాయలన్నీ భయంతో తపతపమని కింద రాలిపోతున్నాయి. అతను నా దగ్గరికి వచ్చేకొద్దీ నా గుండెలో రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టాయి.


అక్కడి నుంచి పారిపోవాలనిపించింది. కానీ నేను పారిపోలేను కదా!

ఇవే నా చివరి క్షణాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. గుండెను రాయి చేసుకుని నిటారుగా నిల్చున్నాను. చివరికి అతను నా దగ్గరికొచ్చేశాడు. రంపాన్ని పైకెత్తాడు.

అప్పుడే ఒక కత్తి పట్టుకొని అక్కడున్న వ్యక్తి, “ఆగు!” అని గట్టిగా అరిచాడు.

“అమ్మయ్య!” అని అనుకున్నాను. పర్వాలేదు, మానవజాతిలో కూడా మంచివాళ్లున్నారనుకున్నాను.


కానీ అంతలోనే నా ఊహలన్నీ తలక్రిందులయ్యేటట్లు, “నేను పైకెక్కి దీని కొమ్మల్ని నరుకుతాను. తర్వాత నువ్వు దీని కాండాన్ని కోయి,” అని చెప్పాడు.


ఒక్క క్షణం ప్రశాంతతకు గురైన నా మనసులో మళ్లీ రైళ్లు పరిగెత్తడం మొదలుపెట్టాయి.

ఇక నా చావు తప్పదని, బ్రహ్మదేవుడు ఇక్కడి వరకే నాకు ఆయుష్షు రాశాడని అనుకున్నాను.


కత్తి పట్టుకున్న వ్యక్తి నా మీదకెక్కాడు. నా అనుమతి లేకుండా నా మీదకెక్కడమే కాకుండా, నా కొమ్మలను నరకడం మొదలుపెట్టాడు. ఆ కత్తి పోట్ల బాధను తట్టుకోలేక కన్నీళ్లు ఏరులై పారుతున్నా, అతను పట్టించుకోకుండా నా కొమ్మలన్నీ నరికేసి నన్నో మొండెంలా చేశాడు. అక్కడే నా అర్ధప్రాణం పోయింది.


ఇక రంపం పట్టుకుని ఉన్న వ్యక్తి తన పనిని మొదలుపెట్టాడు. రంపంతో నా కాండాన్ని నరికి, నిటారుగా నిలబడి ఉన్న నన్ను పడుకోబెట్టేశాడు. దీంతో మిగిలి ఉన్న నా అర్ధప్రాణం కూడా పోయింది.


ఇక్కడితో నా జీవితం ముగిసిందనుకుంటున్నారా? అస్సలు లేదు.

నా నుంచి రాలిన వేపకాయల్లోంచి మళ్లీ కొత్తగా పుట్టుకొస్తున్నాను. మళ్లీ మీ మానవజాతి చేతిలో చావడానికి.


దయచేసి ఇప్పుడైనా నన్ను బతకనివ్వండి.

బతకనిస్తారు కదూ!


నాగ సునీత పోకల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 




మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



పరిచయం: నాగ సునీత పోకల



2 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Rated 5 out of 5 stars.

Super chala bagundi.

Like

Rated 4 out of 5 stars.

బాగుంది అండి.

Like
bottom of page