బేతాళ పంచవింశతి
- Karlapalem Hanumantha Rao

- May 7
- 5 min read

Bhethala Panchavimsathi - Telugu Literary Article | Karlapalem Hanumantha Rao
బేతాళ పంచవింశతి - తెలుగు సాహిత్య వ్యాసం | కర్లపాలెం హనుమంతరావు
Published In manatelugukathalu.com On 07/05/2026
భారతీయ కథా సంప్రదాయంలో శాశ్వత స్థానం సంపాదించిన “బేతాళ పంచవింశతి” కేవలం వినోద కథల సమాహారం మాత్రమే కాదు; అది మన సంస్కృతి, తాత్వికత, మానవ స్వభావాల ప్రతిబింబం. విక్రమార్కుడు – బేతాళుడి సంభాషణల ద్వారా సాగే ఈ కథలు శతాబ్దాలుగా పాఠకులను ఉత్కంఠకు గురిచేస్తూనే ఉన్నాయి. కర్లపాలెం హనుమంతరావు రచించిన ఈ వ్యాసం, బేతాళ కథల చరిత్ర, సాహిత్య ప్రాధాన్యం, వాటి వెనుక ఉన్న మర్మాన్ని ఆసక్తికరంగా విశ్లేషిస్తుంది.
బేతాళ కథలను గురించి తెలుగువాళ్లకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బాలల మాస పత్రిక 'చందమామ' చలవ వల్ల తెలుగునాట తరాల బట్టి బేతాళుడు ప్రతీ ఇంటికీ నెలకో సారొచ్చి చక్కని కథ వినిపించే కథల భూతంగా చిరపరిచితుడు.
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు మీది శవాన్ని భుజాన వేసుకొని స్మశానం కేసి నడవడం, శవంలోని బేతాళుడు మహారాజుకు దారిశ్రమ తెలియకుండా కథలు అల్లి చెప్పడం అప్పట్లో ఓ రివాజు. విక్రమార్కుడు వినే ఆ వింత కథలను 'చందమామ' పాఠకులు చిన్నా పెద్దా తేడా లేకుండా ఎంతో ఉత్కంఠతో చదివడం అప్పట్లో అదో మోజు. ఆ మైమరుపుకు కారణం నెలకో తీరులో సాగే కథలలో కొనసాగే కొసమెరుపు.
బేతాళుడి ప్రశ్నలకు జవాబులు తెలిసీ పెదవి విప్పకుంటే రాజు తల వెయ్యి వక్కలయ్యే ప్రమాదముంది. విక్రమార్కుడు ఆ నెల ఏ తెలివైన బదులు పలికి గండం నుండి తప్పుకుంటాడోనని దిగులు! చిత్ర విచిత్రమైన భావోద్వేగాలతో దశాబ్దాలపాటు చందమామ పాఠకులను ఉర్రూతలు ఊగించిన బేతాళుడు ఎవరు? చిక్కుముడి కథల అసలు పరమార్థం ఏమిటి? బేతాళ కథలు రేకెత్తించే పలు సందేహాలు నివృత్తి కావాలంటే 'బేతాళ పంచవింశతి' గురించి కొంతయినా తెలుసుండాలి.
అనగనగా ఒక వీరుడు. పేరు విక్రమసేనుడు. ప్రతిష్టాపురానికి ఆయన రాజు. శీలభద్రుడనే ఓ యోగి పదేళ్ల పాటు ప్రతీ రోజూ క్రమం తప్పకుండా రాజుగారికి రోజుకో పండొకటి కానుకగా అర్పించాడు. నిజానికి ఆ బహుమానాలన్నీ మణులు, మాణిక్యాలు! రాజు నిలదీసిన మీదట బేతాళుడి వివరాలు బయటపడతాయి. కోరుకున్న రూపంలోకి మారిపోగల కామరూప శక్తి మాయా బేతాళుడి బలం. ఆ భూతాన్ని తన పరం చేయమని వేడుకుంటాడా తాంత్రిక యోగి.
శైవ తాంత్రిక సంప్రదాయానుసారం బేతాళుడు ఒక భూతం. మంత్ర తంత్రాలతో వాడిని వశం చేసుకోవడం సులభం. స్మశానాలలో, శవాలలో నివాసముండే వాడు తన వశమయితే సర్వశక్తులు సిద్ధిస్తాయని యోగి దురాశ. సాహసం,
మేధస్సులకు సైదోడుగా బోలెడంత సహనం గల విక్రమసేనుడే తన వాంఛితం ఈడేర్చే సమర్థుడని భావించే యోగి ఇంత మంత్రాంగానికి పూనుకున్నాడు. సన్యాసి దురూహ పసిగట్టని రాజు ఎన్ని రాత్రులైనా జాగారాలు చేసి బేతాళుడిని యోగికి అప్పగించాలని పంతం పడతాడు. విక్రమసేనుడి ప్రయత్నాలను ఎప్పటికప్పుడు భంగం చేసే బేతాళుడి ప్రయాస నేపథ్యంగా సాగే పాతిక విచిత్ర కథల సమాహారం 'బేతాళ పంచవింశతి'.
పంచ వింశతి అంటే ఇరవైకి ఐదు అదనం. బేతాళుడు చెప్పిన పాతిక కథలు కాబట్టి ఇవి 'బేతాళ పంచవింశతి' పేరుతో సంస్కృత సాహిత్యంలో సుప్రసిద్ధ కథాకావ్యంగా ప్రసిద్ధిచెందాయి. ‘చందమామ’ పత్రికలో నిరంతరాయంగా కొనసాగిన కల్పిత కథలన్నింటికీ బేతాళ పంచవింశతిలోని కథలే ప్రేరణ.
జక్కన తెలుగు 'విక్రమార్క చరిత్రము' తెలుగునాట విస్తారంగా ప్రచారంలోకి వచ్చినప్పటి నుండి విక్రమసేనుడు విక్రమార్కుడుగా మారిపోయాడు.
బేతాళుడి పుట్టుక కథ చాలా ప్రాచీనమైనది. జనశ్రుతిగా వినవచ్చిన ఈ కథలను అజ్ఞాత కవి ఎవరో గ్రంథస్థం చేసినట్లు సాహిత్య పరిశోధకులు భావిస్తున్నారు. బేతాళ కథల మూలాలు శైవ తాంత్రిక సంప్రదాయంలోనే ఉన్నప్పటికీ, బౌద్ధుల తాంత్రిక యోగ సంప్రదాయంలోకీ వచ్చి తిష్ట వేశాడీ బేతాళుడు.
క్రీ.శ ఒకటవ శతాబ్ది, శాతవాహనుల కాలం నాటి ప్రాకృత భాషాకవి గుణాఢ్యుడు పైశాచి భాషలో రాసిన బృహత్కథలోని కొన్ని కథలే బేతాళ కథలని ఒక విశ్వాసం.
బృహత్కథాలహరి కాశ్మీరం ప్రతిలో బేతాళ పంచవింశతి ప్రస్తావన ఉన్నట్లు పాశ్చాత్య పండితుడు వింటర్ విట్స్ కూడా భావించాడు. ప్రాకృతం నుంచి సంస్కృతంలోకి అనువాదమయిన క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలో, సోమదేవుడి కథాసరిత్సాగరంలో కనిపించే బేతాళ కథలు నేపాళ కవి బౌద్ధస్వామి సంస్కృత బృహత్కథాశ్లోకసంగ్రహంలో కనిపించవు!
బేతాళ పంచవింశతికి మూలమని భావించే కాశ్మీరం ప్రతి ప్రస్తుతం అలభ్యం. ఈ నేపథ్యంలో నిజానిజాలు నిర్ధారించడం కష్టం. ఆయా కాలాలలో కవులు తమ సమకాలీన సాంఘిక పరిస్థితులకు తగ్గట్లుగా ఈ కథల్లో మార్పులు చేసుకున్నారు. ఆ కారణంగా ఏవి మూల రూపాలకు దగ్గరివో, ఏవి చొప్పించిన ప్రక్షిప్తరూపాలో నిగ్గుదేల్చడమూ క్లిష్టతరమే ప్రస్తుతం!
జంబలదత్తు గద్య రూపంలో, వల్లభదేవుడు సంక్షిప్త రూపంలో, మరో పేరు తెలియని కవి క్షేమేంద్రుడి బృహత్కథామంజరిలోని పద్యరూప కథలను గద్యంలోకి మార్చి రాసినట్లు చెబుతారు. గద్య పద్య మయ హృద్యశైలిలో కూర్చిన 12వ శతాబ్ది నాటి శివదాసు కృతే ఉన్నంతలో మూల రూపానికి కాస్త సమీపంగా నడిచినట్లు ఇప్పటి విమర్శకులు భావిస్తున్నారు.
తెలుగులో వెన్నెలకంటి అన్నమయ్య రాసిన షోడశకుమార చరిత్రములోని కొన్ని కథలు ఈ బేతాళ పంచవింశతి నుంచి ప్రేరణ పొంది రాసినవంటారు. చిన్నయసూరి కాలం వరకు సామాన్య పాఠకులు వెన్నెలకంటివారి కావ్యాన్ని బేతాళ పంచవింశతిగానే పిలుచుకొనేవాళ్లు కూడా! మిక్కిలి మల్లికార్జునుడనే కవీ బేతాళ పంచవింశతి పేరుతో మరో కావ్యం రాసినట్లు ఆరుద్ర (సమగ్రాంధ్ర సాహిత్యం మూడవ సంపుటి) పేర్కొన్నారు. కూచిరాజు ఎర్రన సకలనీతి కథావిధానంలో కూడా బేతాళ పంచవింశతి కథలు కొన్ని కనిపిస్తాయి.
వెన్నెలకంటి, ఎర్రనల కన్న ముందే పద్మనాయక యుగంలో కవి వల్లభుడు తన వంతుగా మరో బేతాళ పంచవింశతి పుష్పాన్ని తెలుగు సాహిత్య తోరణానికి జతచేశాడు. పోతరాజు అనే కవి రాసినట్లు చెప్పుకొనే మరో పది బేతాళ పంచవింశతి పద్యాలను ఒక అజ్ఞాత సంధాత వెలికితీసినట్లు విదితమవుతోంది.
ఆలయ నిర్మాణాలలో పేరు ప్రఖ్యాతులు గడించిన పద్మనాయక రాజుల నాటి రేచర్ల గోత్రీకుడు బేతాళరెడ్డిని ప్రస్తుతిస్తూ చిన్న వీరయ్య అనే కవి సంస్కృతంలో ఒక లఘుకావ్యం రచిస్తే, బంగారు రంగప్ప దానిని ‘బేతాళ చరిత్ర’ పేరుతో ద్విపద కావ్యంగా అనువదించాడు. ఆ అనువాదం తరచూ బేతాళ కథలుగా పొరపడటం జరుగుతోంది.. ఇది గమనీయం.
బేతాళ పంచవింశతిలో బేతాళుడు విక్రమసేన మహారాజుకు ప్రతీ రాత్రి ఒకటి చొప్పున వరుసగా రెండు డజన్ల కథలు చెపుతాడు. తెలివైన పద్మావతి పంపిన మర్మ సందేశాలను మంత్రిపుత్రుడు తన బుద్ధికుశలతతో పరిష్కరించి యుక్తియుక్తంగా ఆమెను తన రాకుమారుడికి జతచేసిన మొదటి కథ నుంచి, బాలుడి మృత దేహంలోనికి పరకాయప్రవేశం చేసే ముందు రోదనలు, నృత్యాలతో ఓ ముసలి యోగి చేసిన హంగామా దాకా ఎక్కడా ఆగకుండా, నడక మందగించకుండా సాగుతుంది బేతాళుడి కథాప్రవాహం.
అనాథలైన తల్లీ కూతుళ్లు విధివశాన ఓ తండ్రి, కొడుకులకు భార్యలవుతారు. ఈ రెండు జంటలకు కలిగిన సంతానం మధ్య సంబంధాలలో సంక్లిష్టత ఏర్పడినప్పుడు ఆ తికమక సంబంధాల సమస్యకు రాజు నుండి సబబైన సమాధానం రాదు. అక్కడికి బేతాళుడి ప్రశ్నలు ఆగిపోయినా ఆ మరుసటి రాత్రి జరిగిన పతాక సన్నివేశాలతో కథాకావ్యం సుఖాంతంగా ముగిసిపోతుంది.
నడిమధ్య కథలలో పునరుజ్జీవితురాలైన మందారవతి, మనుషుల పాప పుణ్యాలను గూర్చి చర్చించే చిలుక గోరింక, యజమాని కోసం సకుంటుంబంగా సాహస త్యాగాలకు ఒడిగట్టే భృత్యుడు వీరవరుడు, ఉమ్మడి ప్రజ్ఞల కారణంగా పునరుజ్జీవించిన సమప్రభను ఎవరు ఏలుకోవాలన్న మీమాంసలో పడిన బ్రాహ్మణ కుమారులు, తలలు, మొండేలు తారుమారుగా అతికించుకొని తిరిగి బతికిన భర్త, సోదరులలో ఎవరి పాణి గ్రహించాలో అంతుబట్టని యువతి ధర్మసంకటం వంటి వింత చిక్కుముడులు ఉక్కిరి బిక్కిరి చేసేస్తాయి కొన్ని కథలలో.
వివాహమైనా భర్త అనుమతితో ఇల్లు దాటిన ఇల్లాలు, కాముకుడైనా నిష్కలంకమైన ప్రేమ ప్రదర్శించే మరో చోరుడు, లోకం ఊహించలేని దుష్టపాత్రల శిష్టస్వభావాలు విస్తుగొలిపిస్తాయి మరికొన్ని కథలలో!
సముద్రగర్భ నగరాలు, దివ్యలావణ్యంతో మెరిసే రాజకుమారీలు, కలువల తాకిడికే దేహం కందే అతి సుకుమారులు, చంద్రకిరణం సోకినా వళ్లు కాలే వయ్యారిభామలు, దంపుడు బియ్యం దెబ్బల మోతకే చేతులు బొబ్బలెక్కే అబ్బురాండ్రు.. ఊహకైనా అందని చిత్ర విచిత్ర పాత్రలు ఇంకొన్ని కథలలో!
సుఖలాలసులైన యశఃకేతు వంటి దౌర్భాగ్య మహారాజులు, అమృతం తాగినా విషం మింగినట్లు మరణించే హరిస్వాములు వంటి దురదృష్ట జాతకులు, వధ్యశిల ఎక్కిన ముష్కురుని కోరి మరీ వరించి సతీ సహగమనానికి సిధ్ధపడ్డ సుగుణశీలులు.. పాఠకులకు ఊపిరి సలుపనీయని విచిత్ర వ్యక్తులు దాదాపు అన్ని కథలలో!
మంత్ర గుళికల మహిమతో ఇద్దరికి ఇల్లాలైన శశిప్రభ సంకటస్థితి నిజజీవితంలో మనకే ఎదురైతే కిం కర్తవ్యం? నాగు రక్షణ కోసం స్వీయ దేహాన్ని శంఖచూడుడంత సంతోషంగా గరుత్మంతునికి మనం సమర్పించుకోగలమా? ధర్మం, మోహం మధ్య నలిగే దుర్భర పరిస్థితులు గనక మనకే తటస్థిస్తే ‘సుందరి ఉన్మాదం' కథలోని మహారాజుకు మల్లే సులువుగా మనం ఉసురు తీసుకోగలమా? జీవితమంటే కష్టనష్టాల కలినేతన్న తత్వం తెలిసినప్పటికీ బేతాళ కథల్లో మాదిరి నిజంగానే కష్టాలు తటస్థిస్తే బేతాళ కథలలోని పాత్రలంత విశుద్ధంగా, విస్పష్టంగా, విచిత్రంగా ప్రవర్తిస్తామా? అభీష్టవరదాయినీ మంత్రవిద్యను నేర్పే సాధనాక్రమంలో అనూహ్యంగా గురుశిష్యులిద్దరూ ఆ మంత్రవిద్యనే పోగొట్టుకొంటారో ఒక కథలో!
తండ్రి కోసం చేసిన పిండప్రధానంలో విచిత్రమైన ధర్మసంకటం ఎదుర్కొంటాడో కన్నకొడుకు మరో కథలో! కాసుల కోసం కన్నవాళ్లు, స్వీయ ప్రాణరక్షణ కోసం మహారాజు.. ఇలా తలా ఒక స్వార్థ ప్రయోజనార్థం దైవోపహతుడైన ఏడేళ్ల బాలుణ్ణి బలివ్వడానికి సిద్ధపడ్డారని మరో కథలో! వింటేనే చాలు వెన్నులో వణుకు పుట్టించే అరుదైన ఘటనలు నిజంగా కంటి ముందే జరుగుతుంటే పాఠకుల మానసిక పరిస్థితుల మాటేమిటి? మోహాతిశయంతో ప్రాణాలు విడిచిన స్త్రీని చూసి తట్టుకోలేక ప్రాణాలు విడుస్తాడా ఎంత ప్రియుడైనా కథల్లో కాకుంటే నిజ జీవితంలో?
ఇదే అబ్బురమనుకుంటే భార్య, భార్యాప్రియుల అర్థాంతర మరణ వార్త విని స్వీయ ప్రాణాలు సైతం తృణప్రాయంగా త్యజిస్తాడు అసలు భర్త మరీ విడ్డూరంగా మరో కథలో! చచ్చిన సింహానికి జీవం పోసి బతికించి దాని దాడికి బలయి చచ్చిన మూర్ఖ విద్వాంసుల వంటి వారి మూఢత్వాన్నీ వదలకుండా చెప్పినందుకే బేతాళ కథలు సంస్కృత సాహిత్య రంగాన కథల ఖజానాగా స్థిరపడ్డాయి శాశ్వతంగా. భారతీయుల కథాకల్పనా పటిమకు బేతాళ పంచవింశతిలోని ప్రతీ కథా ఒక విశిష్ట ఉదాహరణ.
కథలోని విక్రమసేనుడు వాస్తవానికి త్రివిక్రమసేనుడని సాహిత్య విమర్శకులు భావిస్తున్నారు. ఆ త్రివిక్రముడి అభీష్టం మేరకు ‘బేతాళ పంచవింశతి’ శతాబ్దాల కిందటే ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమయింది. పలు ప్రపంచ భాషలలోకి తర్జుమా కావడమే బేతాళ కథల ప్రాముఖ్యానికి నిదర్శనం. 'బేతాళ పంచవింశతి' ప్రసంగ, శ్రవణాలు జరిగే చోట యక్ష, బేతాళ, పిశాచ, రాక్షసాది దుష్టశక్తుల సంచారం నిషిద్ధమని భూతం పాఠకులకిచ్చిన అభయం బేతాళ కథలని భారతీయ పురాణాల స్థాయికి పెంచే ప్రయత్నంగా భావించవచ్చునేమో!
ఆ కథల కమామిషు ఎటు పోయినా ఇప్పటి తరాలకు మాత్రం కథల బేతాళుడి పరిచయం ‘చందమామ’ మాసపత్రిక పఠన పుణ్యఫలమే. సాహసాద్భుతాలతో కూడిన బేతాళ కథల నిర్మాణం భారతీయుల కథనకౌశలానికి ఆటపట్టు. అయితే ఆ పట్టు ఏ మాత్రం సడలకుండా దశాబ్దాల తరబడి కథలు కల్పించి మరీ బేతాళుడి నోట చెప్పించినందుకు తెలుగువారందరం 'చందమామ' కు మనసారా అభివందనాలు తెలుపుకొందాం.
సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి కొన్ని ఇతర రచనలు:
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.









Comments