'Bharthanatyam' - New Telugu Story Written By Mohana Krishna Tata
'భర్తనాట్యం' తెలుగు కథ
రచన: తాత మోహనకృష్ణ
"ఏమండీ! వంట పని ఎంత వరకు వచ్చిందండి?"
"అయిపోవచ్చింది కాంతం!"
"తొందరగా కానివ్వండి! అవతల మహిళా మండలి సమావేశానికి టైం కావొచ్చింది!"
"ఒక్క ఐదు నిముషాలు కాంతం..."
"నేను వెళ్తున్నాను... మీరే వేడి వేడిగా తినేసి... అంట్లు తోమేయండి. నేను బయట ఎక్కడో తినేస్తానులెండి..."
ఏమిటో! భర్త అంటే భరించేవాడు అంటారు గాని... మరీ ఇంతలాగ భరించాలని అనుకోలేదు... ఏమిటో ఈ జీవితం... అనుకున్నాడు సుబ్బారావు.
పెళ్ళికి ముందు రాజా లాగా ఉన్న జీవితం... ఇప్పుడు ఇలాగ... రాణి గారి కోసం వంటింటి పాలు...
సుబ్బారావు ఒక రిటైర్డ్ ఉద్యోగస్తుడు. వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు 45 సంవత్సరాలకే.. చదువుకున్న రోజుల్లో బయట ఉండడం చేత కాస్తో కూస్తో వంట నేర్చుకున్నాడు... అది ఇప్పుడు శాపంగా మారుతుందని ఊహించలేదు సుబ్బారావు.
పెళ్ళైన కొత్తలో రోజులు గుర్తొచ్చాయి సుబ్బారావు కు....
ఉదయాన్నే ఆఫీస్ కు బయల్దేరేటప్పుడు, భార్య కాంతం ఎదురొచ్చి సాగనంపేది.. భార్య ఉదయాన్నే లేచి ఆఫీస్ కు లంచ్ తయారుచేసి... అందించేది. అప్పుడు యుద్ధానికి వెళ్తున్న వీరునికి ఉన్న ఫీలింగ్ ఉండేది... సుబ్బారావు కు..
సాయంత్రం రాగానే, పతిదేవునికి ఎదురు వచ్చి, బూట్లు తీసి... కాళ్ళుకడుక్కోవడానికి నీళ్లు ఇచ్చి... తర్వాత తన చేతితో చేసిన కమ్మటి కాఫీ అందించేది...
అప్పట్లో, వంటింటి ముఖము ఎరుగడు సుబ్బారావు..
ఈలోపు సుబ్బారావు కు ఉన్న ఏకైక స్నేహితుడు కాంతారావు వచ్చాడు.
"రారా కాంతారావు! కులాసా? ఆఫీస్ నుండేనా?"
"ఏదో ఇలా ఉన్నాను రా! ఆఫీస్ నుంచే వస్తున్నాను. దారిలో నిన్ను కలిసి పోదామని... "
"ఏమిటి రా ఆఫీస్ లో విషయాలు?"
"ఏముంటాయి రా? నువ్వు రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళాక, ఆఫీస్ లో నీలాగా డెడికేషన్ తో పని చేసేవారే లేరనుకో.. " అన్నాడు కాంతారావు
"ఆ డెడికేషన్ అంతా ఇక్కడ వంటింట్లో చూపిస్తున్నాను అనుకో... ఇప్పుడు"
"తొందరపడి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని అనిపించలేదా సుబ్బారావు?"
"నాకేమైనా సరదా వా చెప్పరా? నీకు తెలుసు కదరా!... నా ఆరోగ్యం గురించి... అందుకే తీసుకోవాల్సి వచ్చింది... "
"ఆఫీస్ లో పులి లాగా ఉండే నువ్వు... ఈ వంటింట్లో గరిట పట్టుకునే పనేమిటి రా? అప్పట్లో ఆఫీస్ లో డిపార్ట్మెంట్ మొత్తం నీ చేతిలో ఉండేది కదా రా?"
"ఏం చేయమంటావ్ చెప్పు... పనిమనిషి దండగ అని, నా కాంతం ఇలా... నాకు ఇక్కడ పోస్టింగ్ ఇచ్చింది... మంచి పోస్ట్ రా తెలుసా?... మనకి ఏమి కావాలో వండుకుని మనమే తినేయొచ్చు.. వేడి వేడి గా. వంటిల్లంతా నా చేతిలోనే ఉంటుంది.... వారానికి ఒకరోజు బయట అలా షికారుకు వెళ్లచ్చు... ఎందుకో అనుకునేవు!... సరుకులు, కూరలు తెచ్చుకోడానికి..”
"మరి చెలెమ్మ ఎక్కడ !"
"ఏం చెప్పమంటావు! నేను రిటైర్ అయి డ్యూటీ దిగాక... ఆవిడా డ్యూటీ తీసుకుంది మహిళా మండలి లో.. అదేదో పెద్ద పోస్ట్ అంట... ఎప్పుడూ అక్కడే... ఇప్పుడు పెత్తనం అంతా ఆవిడదే... "
"నీకు సాయంగా పిల్లలు లేని లోటు తెలుస్తున్నది సుబ్బారావు"
"మా ఆవిడ అంత అవకాశం ఇవ్వలేదు రా, అని కంట నీరు పెట్టుకున్నాడు"
"బాధపడకు రా! అన్ని అవే సర్దుకుంటాయి లే! నేను ఇంక బయల్దేరుతాను... నీ చెలెమ్మ ఇంట్లో నా కోసం ఎదురుచూస్తుంది.. "
"అలాగే!"
సుబ్బారావు భోజనం చేసి... కాస్త విశ్రమించి... మళ్ళీ వంటిట్లోకి అంట్ల పని పట్టడానికి దిగాడు.
కాంతం పొద్దుపోయాక వచ్చింది. అప్పుడు టైం రాత్రి 8.
"ఏవయ్యా! రాత్రికి టిఫిన్ ఏమిటి చేస్తున్నావ్? చపాతీ పిండి కలిపి, వేడివేడి గా నాలుగు చెపాతీలు వెయ్యి"
"అలాగే కాంతం!"
"మరచానండీ చెప్పడం!.. రేపు ఇంటికి నా మహిళా మండలి సభ్యులు వస్తున్నారు... "
"అయితే ఏమిటి చెయ్యాలి"
"నాకేమైనా సెలవిస్తావా? అలాగ బయటకు వెళ్తాను"
"ఎందుకంత సంబరం?"
"వాళ్ళు ఉదయం వచ్చి రాత్రి వరకు ఇక్కడే ఉంటారు... కాఫీ, ఫలహారం దగ్గర నుంచి రాత్రి టిఫిన్ వరకు అన్ని మీరే చూసుకోవాలి.. "
"ఏం వండాలో కూడా చెప్పేస్తే... ప్లాన్ చేసుకుంటాను కాంతం!"
"మీరే మార్కెట్ కు వెళ్ళి.. కావాల్సిన సామానులు తెచ్చుకుని, రేపటికి రెడీ చేసుకోండి... "
(అలాగే లేవే! నాకు తప్పుతుందా! అని గొణుక్కున్నాడు సుబ్బారావు.. )
"మీ స్నేహితుల దగ్గర. నేను వంటవాడిలాగా ఉంటే బాగోదు కదే!"
"ఏమీ పర్వాలేదు! మా అయన వంట బాగా చేస్తారని, వాళ్ళకి చెప్పాను! మీరు ఏమి మొహమాట పడనక్కరలేదు"
(మాకు మంచి పోస్ట్ ఇచ్చావు మరి... గొప్పగా చెప్పుకోడానికి... మళ్ళీ గొణుక్కున్నాడు సుబ్బారావు.. )
"ఏమైనా అన్నారా?"
"ఏమిలేదు! ఇంతమందికి వండడం... నా అదృష్టం అని అంటున్నాను అంతే!"
ఉదయం లేచిన దగ్గర నుంచి... వంటింట్లో నేను చేసే నాట్యం.. ఎవరూ చేయరేమో.. ఆ నాట్యం మా ఆవిడ ఆడించడం... ఇంకా రంజుగా ఉంది... ఇదంతా నా ఖర్మ!.. వర్లించుకున్నాడు సుబ్బారావు
నాట్యాలలో భరతనాట్యం లాగా.. ఈ భర్తనాట్యం కూడా చేర్చాల్సిందే! అనుకున్నాడు సుబ్బారావు.
**********************
తాత మోహనకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం:
నా పేరు తాత మోహనకృష్ణ. నాకు చిన్నతనం నుండి కథలంటే ఇష్టం. చందమామ, వార పత్రికలలో కథలు, జోక్స్ చదివేవాడిని. అలా, నాకు సొంతంగా కథలు రాయాలని ఆలోచన వచ్చింది. చిన్నప్పుడు, నేను రాసిన జోక్స్, కథలు, కొన్ని వార పత్రికలలో ప్రచురింపబడ్డాయి. నేను వ్రాసిన కధలు గోతెలుగు.కామ్, మనతెలుగుకథలు.కామ్ లాంటి వెబ్ పత్రికలలో ప్రచురింపబడ్డాయి. బాలల కథలు, కామెడీ కథలు, ప్రేమ కథలు, క్రైం కథలు రాయడమంటే ఇష్టం.
ధన్యవాదాలు తాత మోహనకృష్ణ
Comments