'Blend For The Best' written by Madduri Bindumadhavi
రచన : మద్దూరి బిందుమాధవి
చాలా రోజుల తర్వాత ఊపిరి తీసుకునే ఖాళీ దొరికిందని, మిత్రులిద్దరూ కబుర్లు చెప్పుకుంటూ జుబిలీ హిల్స్ తాజ్ హోటల్ కి వెళ్ళారు.
కౌండిన్య పెసరట్టు ఉప్మా ఆర్డర్ ఇచ్చాడు. "అదేంట్రా లంచ్ టైం అవుతుంటే పెసరట్టు ఆర్డర్ ఇచ్చావ్" అన్నాడు హరీష్.
"రోజూ తినే భోజనమే కదా...ఇవ్వాళ్ళ వెరైటీగా నాలుగైదు రకాల టిఫిన్స్ తిందామని" అన్నాడు.
"నాకు ఫ్రైడ్ రైస్, పనీర్ బటర్ మసాలా తేవోయ్" అన్నాడు వెయిటర్ తో హరీష్.
వెయిటర్ తెచ్చి పెట్టిన ఫ్రైడ్ రైస్ తింటూ, "నిన్న మా హాస్పిటల్ లో ఒకాయన కోవిడ్ నించి ఇంచుమించుగా కోలుకున్నారు. ఇవ్వాళ డిశ్చార్జ్ చేద్దామనుకున్నాము. ఆయన రాత్రి చనిపోయినట్టు ఫోన్ వచ్చింది. మాకందరికీ ఆశ్చర్యం వేసింది. ఏం జరిగిందని డ్యూటీ లో ఉన్న డాక్టర్ ని అడిగితే, ఆ వార్డ్ లో ఉన్న ఇంకొక పేషెంట్ చనిపోయాడు. కోవిడ్ తో చనిపోయాడు కనుక బాడీ కుటుంబ సభ్యులకి ఇవ్వమని చెబుతుంటే విన్నాడు. అంతిమ సంస్కారం లేకుండా అనాధ ప్రేతం లాగా తగలేస్తారు కాబోలు అని తనలో తను గొణుక్కుంటూ పడుకుని, నిద్రలోనే ప్రాణాలొదిలేశాడుట. తనకి కూడా అలా జరుగుతుందని, షాక్ తిన్నట్టున్నాడు" అన్నాడు హరీష్.
"మా దగ్గరయితే, మందులతో పాటు రోజూ ఒక మానసిక విశ్లేషకుడి చేత విడియో సెషన్ ఏర్పాటు చేసి రోగులకి కధల ద్వారా ధైర్యం చెప్పటం, వినోదానికి ఇష్టమైన మ్యూజిక్ వినిపించటం, కాసేపు యోగా చేయించటం జరుగుతున్నది. ఆ ఈ రకమైన కౌన్సిలింగ్ తో రోగులకి బాగా ఊరట కలుగుతున్నది. డెత్ రేట్ బాగా తగ్గింది" అన్నాడు కౌండిన్య.
"ఏమయినా నువ్వు చేస్తున్నది నాకు అంత కరెక్ట్ గా అనిపించట్లేదు" అన్నాడు హరీష్.
"దేని గురించి నువ్వంటున్నది? నేను ఇతర వైద్య విధానాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను, అది కూడా శాస్త్రీయ పద్ధతుల్లో దీర్ఘ కాలిక వ్యాధుల మీద అవి ఎలా పని చేస్తాయో తెలుసుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. అది తప్పెలా అవుతుందిరా? నేను ఆ పద్ధతుల్లో వైద్యం చెయ్యట్లేదు కదా! అవసరాన్ని బట్టి రోగులు ఆ మందులు తీసుకోవచ్చా అని నన్ను అడిగినప్పుడు, వెళ్ళచ్చు...కానీ ఆ రంగంలో అనుభవజ్ఞుల దగ్గరకి వెళ్ళండి అని ధైర్యంగా చెప్పాలంటే ముందు నేను దాని గురించి తెలుసుకుంటున్నాను అంతే!" అన్నాడు కౌండిన్య.
"ఇందులో తప్పేముందో నాకర్ధం కావట్లేదు. ఏం చేసయినా రోగులకి స్వస్థత చేకూర్చటం మన వృత్తి ధర్మం. ఇందులో ఈగోలకి తావు లేదు. రోగి లక్షణాలని బట్టి, ఆ టైం కి చుట్టూ ఆవరించి ఉన్న అంటు వ్యాధులని బట్టి మన రంగంలో వచ్చిన లేటెస్ట్ మందులు వాడుతున్నాం. కానీ రోగం అందరికీ ఒకే విధంగా నెమ్మళించట్లేదు అవునా! కొందరికి వెంటనే గుణం కనిపిస్తే, మరి కొందరికి ఎక్కువ టైం పడుతున్నది. కొందరికి వాటితో పాటు మరికొన్ని మందులని కలపాల్సి వస్తున్నది. అంటే మందులకి స్పందించటం అనేది ఒక్కొక్కరి శరీర తత్వాని బట్టి ఒక్కో విధంగా ఉంటుంది" అన్నాడు.
"నువ్వు ఆక్యుపంచర్ కూడా నేర్చుకున్నావా" అనడిగాడు హరీష్.
"నేను ఇందాక చెప్పినట్టు ఏది ఎవరికి బాగా పని చేస్తుందో తెలియాలంటే మనకి ఆ వైద్య విధానం గురించి శాస్త్రీయంగా తెలియాలి కదా! అందుకే ఒక కోర్సుగా మన పురాతన వైద్య విధానమైన "ఆక్యు పంచర్" నేర్చుకున్నాను. ఇందులో కీలకమైన నాడులకి సూది గుచ్చటం ద్వారా ఆ నాడిని ప్రేరేపించి తద్వారా ఆ అవయవానికి కలిగిన అసౌకర్యాన్ని తగ్గిస్తారు. ఇది చైనా లో చాలా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు" అన్నాడు కౌండిన్య.
"జలుబు చేసింది అనగానే మనమ్మ పాలల్లో పసుపో, మిరియాల పొడో కలిపి మన చేత తాగించటం మనకి చిన్నప్పటి నించీ తెలిసిన గృహ వైద్యం. దగ్గొస్తుంటే తేనెలో కరక్కాయ అరగదీసి ఇవ్వటమో తులసి ఆకులు నీళ్ళల్లో మరిగించి కొంచెం తేనె కలిపి ఇవ్వటం అమ్మలందరూ చేసే పనే! ఇవ్వాళ్టి రోజున 'indigestion' అని ఫ్యాషన్ గా చెబుతున్న అజీర్తి కి అమ్మ వంటింటి చిట్కా నెలకోసారి విరోచనాల మందు వేసి, ఆ రోజు చారుతో స్వల్ప సాత్వికాహారం పెట్టేవాళ్ళు. పది రోజులకొకసారి మిరియాలు, బెల్లం చిన్న ముద్దగా నూరి మింగించేవాళ్ళు".
"అలా గడిచిందే కదా మన చిన్నతనమంతా! వాటన్నిటికి మూలమైనది మన ఆయుర్వేదమే కదా! ఇప్పుడు మనం అల్లోపతి చదువుకున్నామని...ఎన్నో ఏళ్ళుగా మన చిన్నా చితకా రోగాలకి విజయవంతంగా పని చేసిన ఆయుర్వేదం, హోమియో పతి అనే సంప్రదాయ వైద్యాల పట్ల చిన్న చూపు కానీ, నిర్లక్ష్యం కానీ మంచిదంటావా?" అన్నాడు కౌండిన్య.
"నువ్వన్నది నిజమే కావచ్చు. కానీ ఇన్నిరకాల మందులు ఏక కాలంలో వాడితే రోగికి గుణం దేని వల్ల కుదిరిందో, రిలీఫ్ దేని వల్ల వచ్చిందో మనకి ఇదమిత్థంగా తెలియదు. పైగా మన వైద్య విధానం అనుసరించేవాళ్ళు, రోగులు ఇట్లా వేరే మందులు తీసుకుంటున్నారని తెలిసీ ఊరుకుంటే మన వాళ్ళే మనని తప్పు పట్టే అవకాశం ఉంది. లీగల్ ప్రాబ్లెంస్ కూడా వస్తాయేమో" అన్నాడు హరీష్.
"ఇంతకు ముందు మన చిన్నతనంలో 'శ్రీరాం లాగూ' అనే అల్లోపతి డాక్టర్ 'డాబర్ చ్యవన ప్రాశ్' కి బ్రాండ్ ఎంబాసడర్ గా ఉన్నప్పుడు, అతని మెడికల్ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తాం అనేటంత వరకు పరిస్థితి వచ్చింది గుర్తు లేదూ" అన్నాడు.
"ఏ వైద్య విధానాన్ని కించపరచకూడదనేది నా సిద్ధాంతం! అందుకే నేను ఆ వైద్య విధానాన్ని ఒక డిప్లొమా గా పూర్తి శాస్త్రీయంగా నేర్చుకుంటున్నాను. అలా నేర్చుకోవటాన్ని ప్రభుత్వం నిషేధించలేదు కూడా! ఏ వైద్య శాస్త్రమైనా మానవ శరీరాన్ని, జీవక్రియలని, ముఖ్య ఆర్గాన్లని అనాటమీ ద్వారా నేర్పిస్తుంది. కాబట్టి అల్లోపతి కాని దాన్ని శాస్త్రీయం కాదు అని చెప్పలేము."
"ఒక్కటే తేడా ఏమిటంటే సంప్రదాయ వైద్య విధానాల్లో "పాథాలజీ టెస్ట్స్" లేవు. శస్త్ర చికిత్సలు కూడా లేవు అని వాదిస్తున్నారు. కానీ మనం చిన్నప్పుడు "చరక సంహిత" "శుశ్రుతము" అనే వైద్య విధానం గురించి పాఠాల్లో చదువుకున్నాం! ఆ గ్రంధాల రచయిత "ఆచార్య శుశ్రుతుడు" విశ్వామిత్ర మహర్షి కుమారుడని, ఆయన షుమారుగా క్రీ.పూ ఆరవ శతాబ్దం వాడని కొందరు చరిత్ర కారులు చెబుతారు. ఆయన వేద సంస్కృతంలో "శస్త్ర చికిత్సా విధానం" మీద ఒక గ్రంధం రచించాడు. బ్రిటిష్ వాళ్ళు 2000 సం. లో తమ మిలీనియం ప్రచురణల్లో మొదట ప్రస్తావించిన వైద్యుడి పేరు మన ఆచార్య శుశ్రుతుడిదే అని ఈ మధ్యనే చదివాను. ప్రసిద్ధ భారత చరిత్ర పరిశోధకుడు "విల్సన్" ఆచార్య శుశ్రుతుడు క్రీ.పూ 9-10 శతాబ్దాల కాలం నాటి వాడని చెప్పాడు. అంటే అంత పాతకాలంలో శస్త్ర చికిత్సలు కూడా చేసి, మనుషుల ప్రాణాలు కాపాడగలిగిన మన సంప్రదాయ వైద్య విధానం అంతా ట్రాష్ అనీ, పనికి మాలింది అనీ అనలేము కదా!"
"ఈ అల్లోపతి వైద్య విధానం బాగా వృద్ధి చెందింది 50-60 ఏళ్ళ క్రితమే కదా! అంతకు ముందు మనుషులు బ్రతికారు కదా! ఇప్పటికీ సంప్రదాయ పద్ధతిని పాటించే ఆనందయ్య లాంటి వారు, నారాయణ మూర్తి (కర్ణాటక లో క్యాన్సర్ వైద్యం చేస్తున్న వ్యక్తి) గారి లాంటి వారు ఈ రోజుల్లో వస్తున్న కొత్త కొత్త సమస్యలకి కూడా వారి పద్ధతిలో వారు మందులు కనుక్కుంటున్నారు, వైద్యం చేస్తూనే ఉన్నారు. ఆ మందుల వల్ల ఏ విధం గానూ రోగ నివారణ జరగకపోతే ఇంతమంది వారి దగ్గరకి వెళ్ళరు అని నా వాదన" అన్నాడు కౌండిన్య.
***********
"భోజనంలో ముఖ్యమైన అన్నమో.. చపాతీతోనో పాటు నూనెలు.. ఉప్పు కారాలతో పాటు ఇతర ఔషధ గింజలు (మిరియాలు, ధనియాలు, మిరపకాయలు, నిమ్మరసం) కలిపిన కూరలు, పప్పులు, పెరుగు, పండ్లు..ఇలా అనేక రకాలు మిళితం చేసి తింటేనే కదా, శరీరానికి కావలసిన పోషకాలు అందుతాయి. ఇప్పుడు నువ్వు తింటున్న పనీర్ బటర్ మసాలా లో ఎన్ని పదార్ధాలు కలిసి ఉన్నాయంటావ్? జీవితంలో ఆహారం కానీ, బట్టలు (నూలు, సిల్క్, సింథెటిక్) కానీ మిళితం చెయ్యటం అనేది అనివార్యం."
"వైద్యంలో మాత్రం నేరం ఎలా అవుతుందిరా? ఎవరి అంతిమ ధ్యేయమైనా మన దగ్గరకి సహాయం కోరి వచ్చిన వారికి సాంత్వన చేకూర్చటమే కదా! ఏ రసాయన మందులు వాడకుండా ఆయుర్వేదం మందులు, యోగాసనాలు...ప్రాణాయామం ద్వారా మన పూర్వీకులు అనేక రోగాలకి వైద్యం చేసే వారు. ఉదాహరణకి
"రామాయణంలో లక్ష్మణుడు మీద రావణుడు శక్తి బాణం వేసినప్పుడు..లక్ష్మణుడు భూమి మీద పడిపోయినప్పుడు, అతను మరణించాడని రాముడు ఎంతో దుఃఖించాడు. అప్పుడు వానరులలో వైద్యం తెలిసిన సుషేణుడు
"సౌమ్య శీఘ్రమితో గత్వా శైలమౌషధి పర్వతం
పూర్వం తు కధితో యోసౌ వీర జాంబవతా తవ,
దక్షిణే శిఖరే జాతాం మహౌషధిమిహానయ
విశల్య కరణీం నామ్నా సావర్ణ్య కరణీం తథా
సంజీవకరణీం వీర సంధానీం చ మహౌషధీం,
సంజీవనార్ధం వీరస్య లక్ష్మణస్య మహాత్మనః"
[పూర్వం జాంబవంతుడు చెప్పిన ఔషధి పర్వత మను పర్వతమునకు శీఘ్ఫముగా వెళ్ళి, దాని దక్షిణ శిఖరమునందు మొలచిన విశల్య కరణి, సావర్ణ్య కరణి, సంజీవ కరణి, సంధాని అను మహౌషధులను మహాత్ముడూ, వీరుడూ అయిన లక్ష్మణున్ని జీవింపచెయ్యటానికి ఇక్కడకు తీసుకొని రమ్ము] అని హనుమని ఆదేశిస్తాడు."
"ఇందులో చెప్పిన విశల్య కరణి అనే ఔషధం...శరీరంలోకి ప్రవేశించిన విషాన్ని విరిచేసి ప్రాణ ప్రమాదం రాకుండా కాపాడుతుంది."
"సావర్ణ్య కరణి అనే ఔషధం విష ప్రయోగం వల్ల నల్లబడిన శరీర వర్ణాన్ని మళ్ళీ మామూలుగా మారుస్తుంది."
"సంజీవ కరణి ఇంచుమించు పోబోతున్న ప్రాణాన్ని నిలబెట్టి, పునర్జీవితులని చేస్తుంది."
"సంధాన కరణి అనే ఔషధం విరిగిన ఎముకలు అతుక్కునేట్లు చేస్తుంది."
"ఇప్పుడు కూడా మన దేశం లో చాలా మంది, ఫ్రాక్చర్లు అయినప్పుడు, అవయవాలు మెలికలు తిరినప్పుడు ... సంప్రదాయ వైద్య విధానాలైన పుత్తూరు, కేపాల్ కట్లు కట్టించుకోవటానికి వెళ్ళటం చూస్తూనే ఉన్నాం! ఆ వైద్యం చేసేవారు ఒక ఒడుపుతో కట్టు కడతారు. కొన్ని రోజులు ఆహార నియమాలు పాటించమంటారు. అది సరయినది అని నేను సమర్ధించట్లేదు. కానీ జనం నమ్మకంతో వెళుతున్నారు కదా అంటున్నా!"
"అలా ఆ వైద్య పద్ధతులు తమని తాము అవసరం వచ్చినప్పుడు నిరూపించుకుంటున్నాయి కనుకనే, అవి అంతరించిపోకుండా ఇన్ని వేల సంవత్సరాలు నిలిచి ఉన్నాయి. ముందు ముఖ్యంగా మనకి మన సంస్కృతి పట్ల, జ్ఞానం పట్ల ఒక నమ్మకం, గౌరవం ఉండాలి. తరువాత అవసరం వచ్చినప్పుడు అవి నేర్చుకునే ప్రయత్నం చెయ్యాలి. నేను ఇప్పుడు చేస్తున్నది అదే!"
"ఇప్పుడు ప్రతీది ఒక వివాదమే! మందులు తయారు చేసే పెద్ద పెద్ద అంతర్జాతీయ కంపెనీలు వాళ్ళ స్వార్ధం కోసం, లాభాపేక్ష కోసం మన సంప్రదాయ వైద్య విధానాల మీద బురద జల్లుతున్నారని అంటున్న వారు కూడా ఉన్నరు. మనకి అవన్నీ అనవసరం అనుకో! నా ధ్యేయమల్లా నా దగ్గరకి వచ్చే రోగులు తమ రోగం తగ్గి సంతోషంగా వెళ్ళాలి. వారి రోగం మన ఆదాయ వనరు కాకూడదు! నీకు తెలుసా కొన్ని ఐరోపా దేశాల్లో ఒకే హాస్పిటల్ రూఫ్ కింద అల్లోపతి, హోమియోపతి కన్సల్టెంట్స్ ఉంటారు. ఒక వైద్య విధానం పాటిస్తుంటే, రెండోది నిషిద్ధం అనే దురభిప్రాయం మనకే!"
"ఈ కరోనా నేపధ్యంలో అందరినీ ఇప్పుడు "ప్రాణాయామం" లాంటి కొన్ని శ్వాస సంబంధిత వ్యాయామాలు కూడా చెయ్యమంటున్నారు" అని తినటం అయింది అన్నట్టు లేచి "వెళదాం పద" అని లేచి నిలబడ్డాడు కౌండిన్య.
********
నవ్వుకుంటూ ఇంటికొచ్చిన మిత్రులని చూసి, "చాలా ఆలస్యమయింది. త్వరగా కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తా" అన్నది కౌండిన్య భార్య వైజయంతి.
"మేము భోజనమంత టిఫిన్ తిన్నాం చెల్లాయ్. నువ్వు భోంచేసెయ్యమ్మా. ఇవ్వాళ్ళ మీ ఆయన నాకు జ్ఞాన స్నానం చేయించాడు. ఇంటికెళ్ళి దాని గురించి ఆలోచించాలి." అని కౌండిన్య వంక తిరిగి "మా కజిన్ చాలా రోజుల నించి 'ఎగ్జిమా' తో బాధ పడుతున్నాడు. నీ నమ్మకం ప్రకారం అతన్ని ఒక మంచి అనుభవజ్ఞుడైన హోమియోపతి డాక్టర్ దగ్గరకి వెళ్ళమని సలహా ఇస్తాను" అని బయలుదేరాడు హరీష్.
***శుభం***
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
మనతెలుగుకథలు.కామ్ లో రచయిత్రి ఇతర రచనలకు క్లిక్ చేయండి.
నేను బ్యాంక్ ఆఫీసర్ గా 32 సం లు ఉద్యోగం చేసి, పదవీ విరమణ చేశాక దాదాపు అరవయ్యేళ్ళ వయసులో కథలు వ్రాయటం ప్రారంభించాను. సామెతలు, శతక పద్యాల మీద ఎక్కువ కథలు వ్రాశాను.
సరదాగా కాలక్షేపానికి ప్రారంభించిన వ్యాపకం.. ఇష్టంగా మారటానికి, ప్రచురణ కర్తల ప్రోత్సాహం, పాఠకుల స్పందనే కారణం. మీ ప్రోత్సాహం ఇలాగే కొన సాగగలదని ఆశిస్తూ.. మీ కందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు
Comentarios