top of page
Original.png

బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా



Block Buster hit Cinema | Telugu Comedy Story | Nallabati Raghavendra Rao

బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా | తెలుగు హాస్య కథ | నల్లబాటి రాఘవేంద్ర రావు

Published in manatelugukathalu.com on 27/04/2026

ఒక మనిషి తనకు తానే సన్మానం ప్లాన్ చేసుకుంటే… అది ఎలా ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా?

నల్లబాటి రాఘవేంద్రరావు గారు 'బ్లాక్ బస్టర్ హిట్టు సినిమా' కథలో నవ్వులు పంచుతారు.


చిత్రవిచిత్ర ఈశ్వరరావు అతిపెద్ద కామెడీ హీరో.


ఎంత పెద్ద కామెడీ హీరో అంటే, అతను ఒక నెలలో అర డజను సినిమాలలో హీరోగా నటిస్తాడు.


పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు సైతం ఇతని సినిమాల ధాటికి తట్టుకోలేవు అన్నమాట. అదిగదిగో అంత పెద్ద హీరో అన్నమాట.


ఆ మధ్య సంక్రాంతికి బాగా పెద్ద టాప్ పరమేశ్వర్ 50 కోట్ల బడ్జెట్ సినిమా రిలీజ్ అయింది. అదే రోజు మన చిత్ర విచిత్ర ఈశ్వరరావు రెండు కోట్ల బడ్జెట్ సినిమా రిలీజ్ అయింది. విషయం ఏమిటి అంటే, 50 కోట్ల సినిమాకు టోటల్గా 20 కోట్లు వచ్చి అట్టర్ ప్లాప్ అయిపోయింది. మన చిత్రవిచిత్ర ఈశ్వరరావు రెండు కోట్లతో తీసిన ధనాధన్ సినిమాకు 102 కోట్లు వచ్చాయి అన్నమాట. అది మన చిత్రవిచిత్ర ఈశ్వరరావు హాస్య సినిమాల తాడాఖ, హడావిడి అంటే.


ఆ విధంగా 10 సంవత్సరాల నుండి దూసుకుపోతున్నాడు చిత్రపరిశ్రమలో చిత్రవిచిత్ర ఈశ్వరరావు. అతనికంటే ఎప్పుడో ముందు నుండి ఉన్న కామెడీ హీరోలు అందరూ ఇతని ధాటికి తట్టుకోలేక బురదలో జారిపడిపోయారు.


రాబోయే తరంలో కూడా కామెడీ చేయడానికి ఏ కుర్ర హీరోలు ముందుకు రావడం లేదు అంటే, మన చిత్ర విచిత్ర ఈశ్వరరావు స్టామినాకు నటులు అందరూ ఎంత భయపడుతున్నారో.. పరిశ్రమలో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవచ్చు అన్నమాట.


పరిశ్రమలో ఎన్ని అవార్డులు ఉన్నాయో, అన్ని అవార్డులు ఒక్క అవార్డు మిగలకుండా అన్ని తన బుట్టలో వేసుకున్నాడు.


అలాగే ఎందరెందరు పెద్దలు, మహానుభావులు సన్మాన సత్కారాలు చేయడానికి అవకాశం ఉన్నదో అందరందరూ పెద్దలు, మహానుభావులు కూడా అతనికి సన్మాన సత్కారాలు చేసి పడేశారు. ఆ ఘనతలు కూడా అవన్నీ కూడా అతని తట్టలో వేసేసుకున్నాడు.


ఇదంతా చిత్రవిచిత్ర ఈశ్వరరావుకు సంబంధించిన ఉపోద్ఘాతం.. ప్రథమ అధ్యాయం సమాప్తం.


***


ఇక రెండవ అధ్యాయం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించవలసిన అవసరం లేదు, ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రారంభమైపోయి తీరుతుంది... అంటే విశ్రాంతి తర్వాత రీలు విషయానికి వస్తే...


చిత్ర విచిత్ర ఈశ్వరరావుకు ఒకరోజు ఒక గొప్ప ఐడియా వచ్చింది. ఎగిరి గంతులు వేశాడు, కిందపడ్డ కాళ్లు విరిగిపోకుండా నిలదొక్కుకోగలిగాడు. వెంటనే తన తోటి హాస్య నటులు అందరినీ కాల్ చేసి రప్పించి, వారందరి మధ్యన కూర్చుని ఈ విధంగా ప్రసంగించాడు.


''మై డియర్ హాస్యనటుల్లారా, మీకు అందరికీ శతకోటి కాదు ఇంకా ఎక్కువ నమస్కారాలు పెడుతున్నా. విషయం ఏమిటి అంటే.. ఏ మనిషికైనా శిఖరం మీద కూర్చోవాలని ఉంటుంది.. గతంలో మన అత్యుత్సాహం గారు, విరోచనాలుగారు ఇంకా డిప్పరావు గారు.. ఇప్పటి ఘనాపాటి అయోమయం గారు లాంటి మహానుభావులు అందరూ మన కేటగిరీకి సంబంధించిన వారే. వాళ్లు అందరికీ సన్మానాలు జరిగాయి. అయితే నాకు కూడా చాలా సన్మానాలు జరిగాయి.


ఇదంతా.. ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు ఒక గొప్ప ఆశ కలిగింది. అది ఏమిటి అంటే, ఆ మహా హాస్యనటులు అందరికన్నా గొప్పగా... భారీ ఎత్తున అంటే మామూలుగా కాదు సుమా, అత్యంత భారీ ఎత్తున, కచ్చితంగా చెప్పాలంటే వింటున్నారా.. ప్రపంచమంతా ఆశ్చర్యపడే అంత భారీ ఎత్తున.. ప్రపంచంలో ఎవరికీ జరగనంత భారీ ఎత్తున

ఘన భారీ ఎత్తు సన్మానం పొందాలి అని ఉన్నది. అంతటి గొప్ప ఖ్యాతి పొందాలి అనే ధ్యేయంతో ఉన్నాను.'' ఇంకా తల ఊపుతూ చెప్పుకుపోతున్నాడు చిత్ర విచిత్ర ఈశ్వరరావు.


తోటి కామెడీ నటులకు ఈ కామెడీ ఏమిటో అర్థం కాక మండిపోయింది. "ముందు విషయం చెప్పవయ్యా బాబు!" అంటూ కేకలు పెట్టారు.


''వస్తున్నా.. ఈ ప్రపంచంలో ఎవరికీ జరగనంత అతి భారీ ఎత్తున సన్మానం అన్నాను కదా. అందుకు రెండు లక్షలు కావాల్సి వస్తుందని నా యొక్క ఐడియా. మరి అంత డబ్బు మనకు ఎలా వస్తుంది..?


వస్తుంది, దానికి నా దగ్గర ఒక ఐడియా ఉంది. మీ 50 మంది తలా 2000 వేసుకోండి చాలు. లక్ష రూపాయలు అవుతుంది కదా. ఇది మీకు పెద్ద సమస్య కాదు. మరొక లక్ష నేను ఇస్తాను. ఆ రెండు లక్షలతో మీరే నాకు అతి భారీ ఎత్తున సన్మానం జరిపించాలి. అలా మీరు ఒప్పుకోకపోతే భవిష్యత్తులో ఏ సహాయ సహకారాలు నా నుండి మీకు ఉండవు.


నాకు తృప్తి ఉండడం లేదు. గతంలో పద్మవిభూషణ్ పొందిన మహామహులకన్నా భారీ ఎత్తున నా సన్మానం జరిగి తీరాలి. ఈ విషయం ప్రపంచ చలనచిత్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి ఉండాలి.. గిన్నిస్ బుక్ లో పెద్ద పెద్ద అక్షరాలతో రాయాలి.


ఏ దేశం నేను వెళ్లినా అక్కడ అందరూ నన్ను గుర్తుపట్టి జేజేలు పలికి నాకు అతి భారీ ఊరేగింపు చేయాలి.

అలా చేయాలి అంటే.. నా సొంత గడ్డ మీద ముందుగా అతి భారీ ఎత్తున సన్మానము జరగడం ముఖ్యం కదా.


కావున హాస్యనటుల్లారా, నేను అనుకున్నట్లుగా అతి భారీ ఎత్తున ఏ ఒక్క వ్యక్తికీ జరగనంత అత్యంత భారీ ఎత్తున.. నాకు సన్మానం జరగాలి. చెప్పిందే చెప్తున్నాను అనుకోకండి, మీ గుండెల్లో 'అతి భారీ ఎత్తు' అన్న పదం నాటుకు పోవాలి.


అలా చేసినట్లయితే భవిష్యత్తులో అన్ని విషయాలలోనూ నేను మీకందరికీ సహాయపడతాను, అంతే కాదు మీ కష్ట సుఖాలు కూడా పంచుకుంటా.


ఆలోచించి నాకు ఒక గంటలో చెప్పండి'' అంటూ చిత్ర విచిత్ర ఈశ్వరరావు తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.


**


మంచి రసపట్టులో సాగుతున్న కథ ఇప్పుడు ప్రీ క్లైమాక్స్ స్థాయికి వచ్చేసింది.


పాల్గొన్న అందరూ చిత్ర విచిత్ర ఈశ్వరరావు ప్రతిపాదన గురించి గుంపుగా కూర్చుని మాట్లాడుకోవడం మొదలు పెట్టారు.


వచ్చిన వారిలో సింగినాదం, మహదానందం, కోటి లింగం, అప్పలనాయుడు, జిగురు బాబు, తంబి స్వామి, గుణపయ్య, గంగరాజు, సుబ్బిశెట్టి లాంటి ప్రముఖ హాస్య నటులందరూ ఒక నిర్ణయానికి వచ్చారు.


సాటి హాస్యనటుడు గనుక, అందులోనూ మంచి రేంజ్ లో ఉండి చిత్ర పరిశ్రమను స్టార్ హీరోలతో సమానంగా దున్నేస్తున్నాడు కనుక.. అతని కోరిక, ఆ ప్లాను ధర్మము, సహజము అనిపించింది అందరికీ.


అతను కోరినట్లు అక్షరములో ఒక అక్షరం కూడా పొల్లు పోకుండా తూచా తప్పకుండా... అతి భారీ ఎత్తున సన్మానం చేయడానికి వాళ్ళందరూ నిశ్చయించేసుకున్నారు.


వెంటనే వాళ్ళందరూ మహదానందంగా చిత్ర విచిత్ర ఈశ్వరరావు రూములోనికి వెళ్లి తమ సమ్మతిని తెలియజేశారు. అందుకు వచ్చే నెల 1వ తారీకు ఉదయం మంచి ముహూర్తం కూడా నిర్ణయం చేశారు.


''ఈశ్వరరావు, సమయం వారం రోజులే ఉంది కనుక మేము అందరం ఆ ఏర్పాట్లలో తలమునకలై రాత్రింబవళ్లు కష్టపడతాం. నువ్వు ఏమాత్రం అనుమానించకుండా నిశ్చింతగా పడుకో. నీ ఆశ, కోరిక, ఆశయం అన్నీ కలిపి మేము తీర్చేస్తాం. అయినా నువ్వు కోరింది సమంజసం, ధర్మం అయిన చాలా చిన్ని కోరిక. సాటి నటులుగా ప్రాణ మిత్రులుగా ఆమాత్రం నీకు సహాయపడకపోతే మా జన్మలు వేస్ట్. చాలా ప్లానులు, చాలా పనులు ఉన్నాయి మాకు. ఇక మేము వెళ్తాము'' అంటూ అతని దగ్గర మిగిలిన ₹1,00,000 తీసుకొని వెళ్ళిపోయారు.


మిత్రుల సహాయ సహకారాలకు ఆనందపడిపోయిన చిత్ర విచిత్ర ఈశ్వరరావు.. తనకు అత్యంత భారీ ఎత్తున జరగబోయే సన్మానం గురించి తన వరకు ఏం చేయాలో ఆలోచించడం మొదలు పెట్టాడు, బంగారు కలలు కనడం మొదలుపెట్టాడు.


***


ఇప్పుడు స్టోరీ క్లైమాక్స్ స్థాయికి దగ్గరగా వచ్చేసింది.


వెంటనే ఫోన్ చేసి తన మిగిలిన మిత్రులు అందరికీ ఆ సమయానికి రావాల్సిందిగా చెప్పాడు. రాష్ట్రాల నలుమూలల నుండి కనీసం 1000 మంది మిత్రులకు వచ్చే అవకాశం ఉంది. అందుకు వాళ్లందరికీ తగు బస ఏర్పాటు, బస్సు ఏర్పాటు కూడా చేయించాడు. తను తన కుటుంబ సమేతంగా నూతన పట్టు వస్త్రాలు తెచ్చుకొని సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు సరికొత్త గోల్డ్ కలర్ చెప్పులు, అతి ఖరీదైన స్టోన్స్ మోడల్ చేతి వాచి తెప్పించి ఉంచుకున్నాడు. అత్యంత ఖరీదైన ఫారిన్ కళ్ళజోడు కూడా తెప్పించి సిద్ధంగా పెట్టుకున్నాడు.


చిత్ర పరిశ్రమలో అతి పెద్ద నటులు అందరికీ స్వయంగా వెళ్లి చెప్పాడు. ఆ సమయానికి వచ్చి తనకు అత్యంత భారీ ఎత్తున, ప్రపంచంలో ఏ నటుడికీ జరగనంత అత్యంత భారీ ఎత్తున జరగబోయే సన్మానాన్ని కళ్లారా చూసి తరించవలసిందిగా కోరాడు.


ముందుగా వచ్చిన వాళ్లకి బహుమతులు కూడా ప్రకటించాడు. కార్యక్రమం ఆఖరి వరకు ఉండి ఆనందించి వెళ్లిన వారికి మంచి భోజనం కూడా ప్రకటించాడు.


తను ఆ సమయంలో ఎలా ప్రసంగించాలో రకరకాల ట్రైల్స్ వేసుకొని గుండెపుటల్లో ఫిక్స్ చేసుకుని ఉన్నాడు.


ఒకటో తారీకు రానే వచ్చింది.

క్లైమాక్స్ కథ తన్నుకొంటూ వచ్చేసింది.


చిత్రవిచిత్ర ఈశ్వరరావు మహదానందంగా తయారై తన కుటుంబంతో సహా సిద్ధంగా ఉన్నాడు. ఊరంతా ఒకటే హడావిడి. జనం రకరకాలుగా మాట్లాడుకుంటూ ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు.


తొమ్మిది గంటలకు ఆ యాభై మంది హాస్యనటులు చిత్ర విచిత్ర ఈశ్వరరావు ఇంటికి వచ్చారు, అతనిని సన్మాన ప్రదేశానికి తీసుకు వెళ్ళడానికి.


''మనం మాట్లాడుకున్న దగ్గర నుండి మీరందరూ బిజీలో ఉన్నట్టు ఉన్నారు. నేను మీకు చాలా సార్లు ఫోన్ చేశాను, పలకలేదు. సరే, నా బిజీలో నేను ఉన్నాను. ఏర్పాట్లు ఘనంగా జరిగాయి కదా. ఇంతకీ నాకు అత్యంత భారీ ఎత్తున జరగబోయే సన్మానం ఏ ప్రదేశంలో ఏర్పాటు చేశారు? అన్న విషయమే నాకు తెలియదు, చాలా సస్పెన్స్ లో పెట్టారు. సరే ప్రతిసారి మీకు ఫోన్ చేయడం ఎందుకని నేను ఊరుకున్నాను.. సరే ఆ ప్రదేశానికి వెళ్దాం పదండి'' అంటూ ఆ వచ్చిన 50 మంది తన తోటి హాస్యనటులతో చెప్పి ఆ సన్మానం జరగబోయే ప్రదేశానికి బయలుదేరాడు. అతని వెనుకగా అభిమానులు, బంధుమిత్రులు తరలి వస్తుండగా... మేళతాళాలు మోగుతుండగా మహారాజ వైభవంగా అతను నడుస్తున్నాడు.


అలా అలా నడుస్తున్నారు. చాలా దూరం నడుస్తున్నారు. ఒక మహా సంబరం లాగా నడుచుకుంటూ వెళ్తున్నారు

జనప్రవాహం. చిత్రవిచిత్ర ఈశ్వరరావు అటు ఇటు దూరంగా కూడా చూస్తున్నాడు, కళ్ళు పెద్దవి చేసుకొని తన సన్మానం జరగబోయే ప్రదేశం గురించి. అబ్బే.. ఎక్కడా కనిపించడం లేదు. సుదూర ప్రాంతంలో కనుచూపుమేరలో ఎక్కడా ఏ హడావిడి కనిపించడం లేదు. బాజాభజంత్రీలు, జెండాలు, బ్యానర్లు, లౌడ్ స్పీకర్లు.. అబ్బే ఏమీ కనిపించడం లేదు. ఏంటి ఇంత సస్పెన్స్ లో పెట్టారు వీళ్ళు? చిత్రవిచిత్ర ఈశ్వరరావు సహనం కోల్పోతున్నాడు, అసహనానికి గురవుతున్నాడు.


"ఎక్కడయ్యా ఆ ప్లేస్? ఎక్కడో చెప్పండి. ఇంకా ఎంత దూరం నడిచి వెళ్లాలి? ఒక గొప్ప వ్యక్తికి భారీ ఎత్తున, అతి భారీ ఎత్తున సన్మానం చేసే విధానం ఇదేనా?'' అంటూ పక్కనున్న వాళ్ళను ప్రశ్నించాడు.


''వచ్చేసామండి, దగ్గరికి వచ్చేసాం ఇదిగో రండి.''.. అంటూ ఆ కూడా వచ్చిన ముఖ్య హాస్య నటులు 50 మంది ఊరికి బాగా చివర, బాగా పెద్ద ఎత్తుగా ఉన్న వాటర్ ట్యాంక్ దగ్గర ఆగారు.


''సార్, ఇప్పుడు మా ఈ 50 మంది.. మీతో సహా పైకి వెళ్దాం రండి.'' అంటూ అతి పెద్ద వాటర్ ట్యాంకు చుట్టూ ఉన్న మెట్లను అతి బలవంతంగా ఎక్కిస్తూ పైకి తీసుకెళ్తున్నారు చిత్రవిచిత్ర ఈశ్వరరావుని.


నాలుగు రౌండ్ల మెట్లు, అనగా రమారమీ 500 మెట్లు ఎక్కించి వాటర్ ట్యాంక్ బాగా పైభాగానికి శిఖరం మీదకు తీసుకు వెళ్లారు చిత్రవిచిత్ర ఈశ్వరరావుని.


అప్పటికే చిత్రవిచిత్ర ఈశ్వరరావు కొత్త బట్టలు పూర్తిగా నలిగిపోయాయి. చెమట వాసనతో చిరాకు పెడుతున్నాయి. మెడలో వేసిన గులాబీ పువ్వుల దండ బాపతు దారం మాత్రమే కనిపిస్తుంది. రేకలన్నీ నడుచుకుంటూ వచ్చిన దారి పొడుగునా ఎప్పుడో రాలి పడిపోయాయి.


పూర్తిగా స్పృహ కోల్పోయి కింద పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు.. ద గ్రేట్ త్వరలో అత్యంత భారీ ఎత్తు సన్మాన గ్రహీత మన చిత్రవిచిత్ర ఈశ్వరరావు గారు.


''మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. అతి భారీ ఎత్తున సన్మానమని ఇక్కడికి తీసుకొచ్చారు ఏమిటి?'' కోపంగా ప్రశ్నించాడు అందరినీ చిత్రవిచిత్ర ఈశ్వరరావు.


''అయ్యా ఈశ్వరరావు గారు, మేము ఏమాత్రం తప్పు చేయలేదు.. మీరు అడిగినట్లుగానే చేసాము.


మీరే చెప్పండి.. ఒక్క అక్షరం కూడా పొల్లుపోకుండా తూచా తప్పకుండా మీరు చెప్పినట్లే చేశాము.


మీరు ఏమన్నారు.. ప్రపంచంలో ఎవరికీ జరగనంత అతి భారీ ఎత్తున సన్మానం జరగాలి అన్నారు. 'భారీ ఎత్తున' అన్న పదం మేము మరిచిపోకుండా మా గుండెపుటల్లో చెక్కేసుకోవాలి అన్నారు.


ఇప్పుడు ధర్మంగా చెప్పండి, ఇంత భారీ ఎత్తు మీద... 500 మెట్లు ఎక్కి నిలబడ్డ ఈ భారీ సిమెంట్ వాటర్ ట్యాంక్ అంత భారీ ఎత్తు మీద.. మీకు సన్మానం జరుగుతుంది కదా. ప్రపంచంలో ఎవరికైనా ఇంత భారీ ఎత్తున సన్మానం జరిగిందా? మీరే చెప్పండి.''


అంటూ కూడా వచ్చిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, అతి భారీ ఎత్తున సన్మానం పొందుకున్న చిత్రవిచిత్ర ఈశ్వరరావు చుట్టూ తిరుగుతూ. వాటర్ ట్యాంక్ కింద చుట్టూరా తలలు పైకెత్తి చూస్తున్న జనం అందరూ కూడా తప్పక చప్పట్లు కొట్టారు.


అంతే చిత్రవిచిత్ర ఈశ్వరరావు పూర్తిగా స్పృహ కోల్పోయి ఆ అతి భారీ ఎత్తు సిమెంట్ వాటర్ ట్యాంక్ మీద కూలపడిపోయాడు పాపం!


***


ఆరోజు రిలీజ్ అయిన


"అత్యంత భారీ ఎత్తు సన్మానం " అనే సినిమా


మార్నింగ్ షో చూసి


ఇంతవరకు వెండితెర మీద జరిగిన ఈ కథ అంతా గుర్తు చేసుకొని బయటికి వస్తున్న జనం ఆడ, మగ, పిల్ల, మేక కిలకిల, కళకళ, గలగల కిందమీద పడిపోయి నవ్వేసుకుంటూ తమ ఇళ్లకు వెళుతున్నారు.


సమాప్తం


నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.







రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page