top of page

బ్రహ్మ కపాలం

'Brahma Kapalam' New Telugu Story Written By Nagavarapu Srinivasa Rao

'బ్రహ్మ కపాలం' తెలుగు కథ

రచన, కథా పఠనం: నాగవరపు శ్రీనివాస రావు

"ఎప్పట్లాగే కనిపించిన వాళ్ళని తిడతాను, గొడవలు పెట్టుకుంటాను అంటే మాత్రం మీతో మేము గుడికి రాము." మా ఇంటికి రెండు గంటల ప్రయాణ దూరంలో ఉన్న ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళదామని అడిగిన నాకు, నా భార్యాపిల్లలనుండి వచ్చిన జవాబిది.


"కనబడ్డ వాళ్లందరితో గొడవలుపడడం, తిట్టడం, తిట్టించుకోడం నాకేమైనా సరదానా? కళ్ళముందు జరిగేవాటిని చూస్తూ ఉరుకోలేకపోవడం నా వీక్నెస్ అని తెలుసుకదా?" అన్నాను నేను.


ఆ వీక్నెస్ ఏమిటో మీకూ తెలియాలంటే నా గురించి కొంచెం చెప్పాలి. ఏ పని చేసినా సాధ్యమైనంతలో నిజాయతీగా, పద్ధతిగా చెయ్యాలని అనుకునేవాళ్లలో నేను ఒకడిని. కాకపోతే, అందరూ అలాగే ఉండాలని అనుకోవడంతోనే చిక్కులొస్తాయి. అయినా, పుట్టుకతో వచ్చిన బుద్ధి కారణంగా ప్రతి దగ్గరా, ముఖ్యంగా ఎక్కడైనా క్యూలలో నిలుచున్నప్పుడు, దైవదర్శనాలప్పుడు కనీసం ఒకరినైనా అనడం, పడడం కామన్.“ఇంట్లో జరిగే పూజల్లో కూడా సాధ్యమైనంత పధ్ధతి పాటిద్దామని నా ఉద్దేశ్యం. 'ఆసనార్ధం అక్షతాన్ సమర్పయామి', 'ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి', అని దేవునికి అన్నిటికీ అక్షతలే సమర్పించే బదులు మన తాహతుకు తగ్గట్టుగా ఆసనం, ఆభరణాలు సమర్పిస్తే బాగుంటుందని నేనంటాను.

ఒకవేళ, మన కోరికల బదులుగా 'బిఎండబ్ల్యూ కారార్ధం అక్షతాన్ దదామి', 'నడుముకి వడ్డాణార్ధం అక్షతాన్ దదామి', 'అమెరికా ఉద్యోగార్థం అక్షతాన్ దదామి' అని ఏ తిరుపతి వెంకన్నో, విజయవాడ కనకదుర్గో, చిలుకూరు బాలాజీయో అంటే మనం ఉరుకుంటామా? నోరేసుకు పడిపోమూ? మనం మాత్రం అక్షింతలతో అన్ని కోరికలు తీరిపోవాలని అనుకుంటాము. ఎంత మంచిదేవుడైనా సరే, ఈతపండిచ్చి తాటిపండు తీసుకోకూడదు.


అలాగే దైవదర్శనానికి వచ్చినప్పుడైనా ఇహలోక చింతలు పక్కనపెట్టి, కొంచెం పద్ధతిగా భక్తితో ప్రశాంతంగా వుంటే, వాళ్ళకే మంచిది అని చెప్పి, లోకాన్ని మార్చడానికే నా ప్రయత్నం” అని చెప్తే నా భార్య, " లోకాన్ని మార్చడానికి నువ్వేమైనా మూలపురుషుడివా? జంధ్యాలగారు చెప్పినట్టు కనీసం 'మూలశంక పురుషుడివి' కూడా కాదు. లోకాన్ని బాగుచేసే తాపత్రయంతో, నువ్వు ఎలాగూ సరిగ్గా దర్శనం చేసుకోవు, మమ్మల్ని కూడా చేసుకోనివ్వవు. అందుకే మళ్లీమళ్లీ చెప్తున్నా, ఏ ఒక్కరితోనూ తగువులాడననీ, ఎవరిమీద కేకలెయ్యననీ, ప్రశాంతంగా నీ పని నువ్వు చేసుకుంటాననీ మాటిస్తేనే గుడికొస్తామని చెప్పి, అలాగే ఒట్టేయించుకుంది.


తీరా గుడి దగ్గరి కార్ పార్కింగ్ లోనే నా ఒట్టు గట్టు మీద పెట్టే పరిస్థితి వచ్చింది. 'యద్భావం తద్భవతి' అన్నట్టుగా, ఇలాంటి సంఘటనలకై నేను వెతుకుతానో, లేక నాకే కనిపిస్తాయో తెలియదుకానీ, ఏ పనీ లేనట్టు నించుని ఏదో పనికోసం ఎదురుచూస్తున్న ఒక పుంజీడు జనం నాకంట్లో పడ్డారు. అది చూసి గాభరాపడిన మా ఆవిడ తన కళ్ళతోనే నా ఒట్టు గుర్తుచేసింది. "వాళ్ళు ఖచ్చితంగా ఎవడికో దేవుడి దర్శనం చేయించి, వాడి సేవలో తరించడానికి వచ్చిన గుంపే" అన్న నాతో ఆవిడ, "ఎవడిపనిలో వాడుంటాడు. నువ్వు మళ్ళీ ఏమైనా వేషాలు వేసావంటే మేము ఇక్కడినుంచే జంప్." అని మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. ఆ హెచ్చరికతో 'బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డ హనుమంతుడి'లాగ, మౌనంగా గుడిలోకి దారితీసాను.


అసలే ప్రసిద్ధి పొందిన క్షేత్రం, పైగా సెలవు రోజు కావడంతో, జనం కిక్కిరిసి ఉన్నారు. దర్శనం లైను నత్తలా సాగుతోంది. 'తెలిసినవాళ్లతో చెప్పించడమో, స్పెషల్ దర్శనం టికెట్ తీసుకోవడమో చెయ్యొచ్చుకదా!' అని సణుక్కుంటున్న శ్రీమతి నోటిని, "దర్శనానికి వెళ్ళవలసినది భక్తితోగానీ సిఫార్సులతో కాదు" అని 'ఇంద్ర' సినిమాలో బాలుగారి డైలాగ్ చెప్పి విజయవంతంగా మూయించాను.


'పెళ్ళాం నోరు మూయిస్తే వచ్చే కిక్కే వేరప్పా!' అని ఆనందపడే లోపే, ఇంతకుముందు పార్కింగ్ దగ్గర చూసిన పుంజీడు జనాల పార్టీ ఎంటరవడంతో ఆనందం నీరుగారిపోయింది.


క్యూ లైన్ ని ఆపిమరీ, దేవాలయ సిబ్బంది లోపలకు పంపుతున్న పుంజీడు పార్టీ వాళ్ళ బాస్ కుటుంబం మహిషాసురుడి వంశాంకురాల అవశేషాలలాగా ఉన్నారు. ఖద్దరు బట్టలలో బలవంతాన కుక్కబడిన భర్త, ఆబోతులకు హఠాత్తుగా కోపం తెప్పించే ఎర్ర చీర కట్టుకున్న నల్ల భార్య, ఆ దేహాన్ని భరించలేక ఇహనో ఇప్పుడో పగిలి పోతాయనిపించే జీన్స్, టీ షర్ట్ వేసుకున్న పిల్ల బుల్‌డోజర్ నవ్వుతూ ముందుకొస్తున్నారు.


ఒక్కొక్కరి పదేసి వేళ్ళకు ఉన్న పది, పదిహేను ఉంగరాలు, నల్లటి మెడలో కాంతులీనుతున్న బంగారపు చేంతాడులు, ఆమె చేతులకున్న దిట్టమైన గాజులు, మిగతా ఇద్దరి చేతుల్లో ఉన్న దట్టమైన మండగొలుసులు (బ్రాస్ లెట్), ముగ్గురి హస్తాభరణమైన లేటెస్ట్ వెర్షన్ సగం కొరికిన ఆపిల్ లు, వాళ్ళు గుడినీ, లింగాన్ని మింగి బాగా డబ్బు చేసిన వాళ్లనే విషయం చెప్పకనే చెబుతున్నాయి.


గుడికొచ్చామన్న సంగతికూడా మరచి ఫోన్ లో గట్టిగా మాట్లాడుతూ, సినిమా విలన్లకు, రాజకీయ నాయకులకు మాత్రమే సాధ్యమైన నవ్వుతో వస్తున్న వారిని చూసి, నాలోని 'రామానుజం' 'అపరిచితుడు'గా మారబోతుండడాన్ని పసిగట్టిన నా అర్ధాంగి, ఎవరు చూడకుండా నా పిర్రమీద గిల్లి, రెండవ నంబర్ ప్రమాదహెచ్చరిక ఎగురవేసింది. ఒట్టుకి కట్టుబడిన నేను చేసేదేం లేక, దిక్కులేనివారికి దిక్కైన దేవుడికి మొరపెట్టుకుందామని, 'సుబ్రహ్మణ్యా! ఏమిటయ్యా ఈ బాధ. ఏకాగ్రతతో నీ దర్శనం చేసుకోనివ్వకుండా ఇలాంటివాళ్లను ఎందుకు రానిస్తావు?' అని మనసులో అనుకున్నాను.


"ఇదే ప్రశ్న మా తండ్రిగారిని అడిగానయ్యా శ్రీనివాసా!" అని నా చెవులకు వినబడింది.

అదేదో సినిమాలో బ్రహ్మానందం లాగా దిక్కులు చూస్తూ, 'నాకెవరివో మాటలు వినిపిస్తున్నాయేమిటీ?' అనుకుంటూ ఉండగా, "అన్నీ అడుగుతారు, మాట్లాడితే ఎవరో అంటారు. నేనయ్యా కుమారస్వామిని." అదే గొంతు విసుగ్గా మళ్ళీ వినిపించింది.


"స్వామీ! నిజంగా నువ్వేనా?" అనుమానంగా అడిగాను.


"నేనేనయ్యా! సన్నాఫ్ శివపార్వతులు, కేరాఫ్ కైలాసం. నీకు చూపించడానికి నా దగ్గర ఆధార్ కార్డు లేదుగానీ, నిజంగా నేనే. అయినా నన్నే సందేహిస్తున్నావా?" కొంచెం గట్టిగా అన్నాడు స్కంధుడు.


"సందేహం కాదుగానీ, కొంచెం అనుమానం. ఇంతకీ నా ప్రశ్నకు మీ తండ్రిగారిచ్చిన సమాధానమేమి, ఆ వృత్తాంతం చెప్పు." అనునయంగా అన్నాను.


"ఒకనాడు మా తండ్రిగారైన పరమశివుడు కైలాసమందలి ఒక పారిజాతవృక్షం కింద కూర్చుని ఉండగా, నేను ఇలాంటివారిని దర్శనానికి ఎందుకు రప్పిస్తావు?" అని అడిగాను అంటుండగా మధ్యలో అడ్డం తగిలిన నేను, "స్వామీ! నాకొక సందేహం. మీ ఇంట్లో సింహాసనాలు, అవీ ఉంటాయికదా! ఎప్పుడూ చెట్లకింద ఎందుకు కూర్చుంటారు?" అని అడిగాను.


దానితో కొంచెం కోపం తెచ్చుకున్న కుమారస్వామి, "చరిత్రడక్కు, చెప్పింది విను. మధ్యలో ఆపితే మాట్లాడను." అన్నాడు.


"నీ భక్తుడిని. అల్పుడిని. నా మీద కోపం ఎందుకు స్వామీ? సరే! తరువాతేమయిందో చెప్పు." అన్నాను.


అప్పుడు మా తండ్రిగారు చిద్విలాసంగా నవ్వి, "వాళ్ళను రప్పించేది నిజమైన భక్తుల కోసమే. ఈ వర్గాన్ని 'క్షేత్రపాపులు' అంటారు. భక్తుల ఏకాగ్రతకు నేను పెట్టే పరీక్షకే వీరి ఆగమనం." అని చెప్పారు. 'శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు' అంటారుకదా! అలాగే శివుని ఆజ్ఞతో వచ్చేవారిని, అదికూడా మీలాంటి భక్తులకోసం వచ్చేవారిని మేము ఆపలేము. కాబట్టి, నీ భార్య చెప్పినట్టు ఏకాగ్రతతో నీ పని నువ్వు చూసుకో అన్నాడు సుబ్రహ్మణ్యుడు.


ఆ కుటుంబ సామూహిక దైవదర్శన ప్రహసనాన్ని క్యూలో నించున్న మేమంతా వేరేదారిలేక తప్పనిసరిగా చూడసాగాం.


"నేను ఇప్పుడు గుడిలో ఉన్నాను. మళ్ళీ మాట్లాడతాను." అని ఫోన్ కట్ చేసి ముందుకు కదిలాడు నల్ల బాస్. ఒక చేతిలో సగం కొరికిన ఆపిల్ ఉండడంతో, ఒక చేత్తోనే దేవుడికి హాయ్ చెప్పి, ముందుకు కదులుతుండగా, మళ్ళీ ఫోన్ మోగింది.


బాస్ గారు ఫోనెత్తి కోపంగా, "నేను గుడిలో ఉన్నాను అని చెప్పానుకదా! ఎందుకు మాటిమాటికి ఫోన్ చేస్తావు. బుద్ధి లేదా!" అని మొదలుపెట్టి, సినిమాలో అయితే బీప్ లు వేసి వేసి అలసిపోయే లెవల్ లో బూతులు తిట్టాడు. తిట్టే సందడిలో తను గర్భగుడి ముందు ఉన్న సంగతి, తీర్ధప్రసాదాలు తీసుకుంటున్న సంగతి పట్టించుకోకుండా ముందుకు పోయాడు.


తాము ఇంత కష్టపడి ఏర్పాటుచేసిన దర్శన కార్యక్రమం ఎవడో చేసిన ఫోన్ వల్ల పాడవడం జీర్ణించుకోలేని పుంజీడు బ్యాచ్ నల్లబడ్డ ముఖాలతో నిలబడ్డారు. 'ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా!' అన్నట్టు కుటుంబపెద్ద అడుగుజాడల్లోనే మిగతా ఇద్దరూ ఆపకుండా ఫోన్ లో మాట్లాడుతూ నడిచారు. ఇది చూస్తున్న నన్ను కంట్రోల్ లో పెట్టడానికి 'మూడో ప్రమాదహెచ్చరిక' ఎగరెయ్యబోతున్న మా ఆవిడ నేను ఏమీ అనకపోవడంతో ఆనందపడింది. నేను డైరెక్ట్ గా దేవుడినే అడగబోతున్నాననే విషయం తనకి తెలియదుగా!


నేను సుబ్రహ్మణ్యుడిని చూస్తూ, "స్వామీ! ఇందాక అడిగిన ప్రశ్నకు హెచ్.ఆర్. మేనేజర్ లా ఏదో చెప్పి, మసిపూసి మారేడుకాయ చేసావు. ఇప్పుడు అడగబోయే ప్రశ్నకు సమాధానం చెప్పు. వాళ్ళే కాదు, ఇక్కడ ఉన్న మిగతా భక్తులే కాదు, ఏ గుడిలో చూసినా చేతిలో మొబైల్ ఫోన్ లేకుండా దర్శనానికొచ్చే భక్తులను వేళ్ళమీద లెక్కించొచ్చు. ఫోన్ ల వాడకాన్ని తప్పనిసరై అనుమతించి, 'మీ మొబైల్ ఫోన్ ను అపి ఉంచండి లేదా సైలెంట్ మోడ్ లో పెట్టండి' అని మొత్తుకున్నా ఐటెం పాటల రింగ్ టోన్ లతో హోరెత్తించే భక్తులు వస్తున్నారు. వాళ్ళు నీ ఎదురుగా ఉన్నప్పుడుకూడా చేతిలోనూ, చెవిలోను ఆ ఫోన్ లేకుండా ఉండలేరా? దీనికి కూడా శివుడాజ్ఞ ఏమైనా ఉందా?" అని చిర్రెత్తుకొచ్చి కొంచెం కోపంగానే అడిగాను.


అప్పటికే ఈ తంతంతా చూస్తూ విసుగెత్తి ఉన్న కుమారస్వామి దేవేరులైన దేవసేన, శ్రీవల్లి, ” మేము కూడా ఎప్పటినుంచో విసుగెత్తిపోయి ఇదే ప్రశ్న అడుగుదామనుకుంటున్నాం. ఆ భక్తుడి ప్రశ్నకు జవాబివ్వండి స్వామీ!” అని నా పక్షాన వకాల్తా పుచ్చుకున్నారు. " నిజంగా దీనిలో శివుడాజ్ఞ ఉంది. అది ఒక దేవరహస్యం. నా గృహలక్ష్ములు కూడా నీ పక్షం అయిన తరువాత, నేను ఈ రహస్యం చెప్పకతప్పదు. ఇది ఈకాలంలో అందరి చేతుల్లో వదలకుండా ఉంటున్న మొబైల్ ఫోన్ జన్మరహస్యం." అని సుబ్రహ్మణ్య స్వామి చెప్పడం మొదలెట్టాడు.


ఇప్పుడు చతుర్ముఖుడైన బ్రహ్మదేవునికి ఒకప్పుడు అయిదు ముఖాలుండేవి. ఒకనాడు బ్రహ్మగారు శివపార్వతుల కళ్యాణం తన నాలుగు ముఖాలతో నాలుగు వేదాలలో మంత్రాలూ చదువుతూ, తలమీదనున్న ఐదో ముఖంతో వాటి అర్ధాన్ని వివరిస్తూ అద్భుతంగా జరిపిస్తున్నాడు. వివాహానికి ప్రపంచంలో ఉన్న జీవజాలమంతా హాజరై, ఆనందిస్తున్నారు. ఒక్క శనిదేవుడు మాత్రం దూరంగా నిల్చుని కోపంగా చూస్తున్నాడు. మరి అతనికి ఆహ్వానం పంపడం మరచిపోయారో లేక పెళ్ళిలో ఈ శనిగాడు ఎందుకు అనుకున్నారో కానీ, మొత్తానికి ఆ శని దృష్టినుండి తప్పించుకోలేకపోయారు.


పెళ్లి సంబరం ముగిసేవేళలో విష్ణువు శివునితో వివాహక్రతువుని చక్కగా జరిపించిన బ్రహ్మగారికి సముచితమైన దక్షిణ ఇమ్మని చెప్పాడు. సరిగ్గా ఇలాంటి సమయంకోసం ఎదురుచూస్తున్న మన శని బ్రహ్మగారిలో ఆవహించాడు. అప్పుడు బ్రహ్మ, "శివా! నీవు సర్వేశ్వరుడవంటారు కదా! ఇప్పుడు సతీసమేతంగా నా అన్ని ముఖాలకు అభిముఖంగా నిలబడి దక్షిణ ఇవ్వు. లేదంటే, నాకంటే అధముడినని అంగీకరించు." అన్నాడు.


నాలుగు ముఖాలకు ఎదురుగా నించోవచ్చుగానీ, పైనున్న ఐదో ముఖానికి ఎదురుగా ఉండడం అసాధ్యమని తెలిసీ అలాంటి కోరిక కోరిన బ్రహ్మపై శివునకు కోపం వచ్చి, బ్రహ్మ గర్వానికి కారణమైన ఐదో తలను ఖండించాడు. అప్పటికే శనిప్రభావంలో ఉన్న బ్రహ్మ తన శరీరం నుండి వేరుపడ్డ ఆ కపాలమే భిక్షాపాత్రగా శివుని చేతికి అంటుకుంటుందనీ, అప్పటినుండి శివుడు భిక్షమెత్తుకుని తినవలసి ఉంటుందనీ శపించాడు.


ఆ కపాలాన్ని తనచేతినుండి వదిలించుకుందామని శివుడు ఎంత ప్రయత్నించినా అది శివుని చేతిని వదలకుండా పట్టుకుంది. అప్పుడు విష్ణువు బ్రహ్మను శాంతపరచి, శాపవిమోచనం చెప్పమంటే, ఆ భిక్షాపాత్ర ఎప్పుడైతే పూర్తిగా నిండుతుందో అప్పుడు తనంతటతానే విడిపడుతుందన్నాడు బ్రహ్మ. ఆ కపాలంలో అన్నపూర్ణాదేవితోసహా ఎవరు ఎంత భిక్షవేసినా, శాపప్రభావం వల్ల హరించుకుపోయి కపాలం నిండటంలేదు. అప్పుడు విష్ణువు సలహాతో లక్ష్మీదేవి ధాన్యలక్ష్మి రూపంలో భిక్షవేస్తే, కపాలం నిండి శివుని చేతినుండి విడివడింది. అందరూ ఆనందంగా ఎవరి లోకాలకు వాళ్ళు వెళ్లిపోయారు.


బ్రహ్మ బాధగా విష్ణువు వద్దకు వచ్చి, "నేను ఇచ్చిన శాపానికి విరుగుడు చెప్పి, నా ఘనతను తగ్గించుట మీకు తగునా! లోకంలో ఏ తల్లితండ్రులైనా కొడుకు తప్పుచేసినా మూడోకంటివాడికి తెలియకుండా కాపాడుతారు. కానీ మీరు, మీ స్నేహితుడైన 'మూడో కంటి' వాడి కోసం స్వంత కడుపునుండి అదే నాభినుండి పుట్టిన కొడుకుకి అన్యాయం చేసారు. నాకు తగిన న్యాయం చెయ్యండి." అని అడిగాడు.


"లోకపాలన కోసం స్వపర బేధం చూడకూడదనే నియమానుసారం శాపవిమోచనం చేశాను. కానీ, నా కొడుకువికాబట్టి నీకిదే ఒక వరమిస్తున్నాను. ఇప్పుడు కిందపడి విరిగిపోయిన నీ కపాలం ముక్కలు రానున్న కాలంలో మొబైల్ ఫోన్ లుగా మారి, మానవులందరి చేతులకు అంటుకుంటాయి.


వారు వదిలించుకుందామన్నా వీల్లేనంతగా వారి జీవితాలను శాసిస్తాయి. ఒకవేళ బలవంతంగా ఎవరైనా తీసినా లేదా వదలవలసివచ్చినా శరీరంలో ఒక భాగం పోయినట్లు అందరూ బాధపడతారు. కులమత, వర్ణవర్గ తారతమ్యాలు లేకుండా సర్వకాల సర్వావస్థలయందు అందరి చేతులను అంటుకుని ఉండే ఈ బ్రహ్మకపాల శకలాలు, శివుని చేతిలోనుండి ఒక్క కపాలం తీసినందుకు పరిహారంగా అందరి చేతులకు అంటిస్తాను." అని వరమిచ్చాడు విష్ణువు.

"తథాస్తు" అన్నాడు శివుడు. అందుకని ఈ మొబైల్ విషయంలో నేను, నాతోపాటు దేవతలందరం అశక్తులం అని ముక్తాయించాడు కుమారస్వామి.


మా రాజకీయాలలో జరుగుతున్నట్లే పుత్రవాత్సల్యంతో జరిగిన ఈ క్విడ్ ప్రోకోకి పరిహారమే లేదా? అని ఆవేదనతో అడిగిన నాకు, జ్ఞాన మూర్తులైన దేవసేన, శ్రీవల్లి మాతలు ఇలా చెప్పారు. "మా స్వామి చెప్పిన కథలోనే పరిష్కారం ఉంది గమనించలేదా? శ్రీమహాలక్ష్మి, విద్యాలక్ష్మి అవతారంలో వచ్చి, అందరిలోని ప్రజ్ఞను మేల్కొలిపి, అవసరమైనంత వరకే, అవసరమైనప్పుడే మొబైల్ వాడే విచక్షణాజ్ఞానాన్ని అందరికీ కలిగించినప్పుడు శాపవిమోచనం అవుతుంది."


అటువంటి మహత్తరమైన కాలం ఎప్పుడొస్తుందో అని అడుగుదామనుకున్న నాతో సర్వాంతర్యామైన స్కంధుడు 'వచ్చినప్పుడొస్తుంది. అందాకా మౌనంగా నీ పని నువ్వు చేసుకో' అని చెప్పాడు. ఈలోగా నా మొబైల్ వైబ్రేషన్ మొదలవ్వడంతో, ఫోన్ ఎత్తి మాట్లాడడానికి హడావిడిగా బయటకు పరుగెత్తాను.


సమాప్తం


నాగవరపు శ్రీనివాస రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్టు పాఠకుడిగా ముదిరి రచయితగా మారిన చిరు రచయితను నేను. స్వస్థలం శ్రీకాకుళం. ఉద్యోగరీత్యా 25 సంవత్సరాలుగా కర్ణాటక లోని మంగళూరు వాసం చేస్తున్న ప్రవాసాంధ్రుడిని. ఎప్పుడూ చదవడం, అప్పుడప్పుడు రాయడం అభిరుచులు.


320 views1 comment

1 Comment


కథను రసవత్తరంగా ముందుకు నడిపించారు, అంతా బాగుంది కానీ త్రిమూర్తుల మధ్య గొడవలకు మనిషి చేతికి అంటుకున్న మొబైల్కు తార్కికం కుదరటం లేదు. ఇంకొంచెం ఆలోచించి కారణం మరోలా పెట్టి వుంటే కథ ఇంకా బాగుండేది. కథ మొదలంతా పురాణేతిహాసం. ఇంక కథ ముఖ్య ఉద్దేశ్యమే మొబైల్ను మనుషులు వదిలించుకోలేకపోవటం, దానికి కారణం సమంజసంగా వుండాలి కదా అనిపించింది. మంచి ప్రయత్నం.

Like
bottom of page