top of page

నమ్మకం విలువ - పార్ట్ 1


'Nammakam Viluva Part 1/3' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

'నమ్మకం విలువ - పార్ట్ 1/3' తెలుగు పెద్ద కథ ప్రారంభం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

గల్లు గల్లుమని గజ్జెల సవ్వడి చేస్తూ ఇంటిముందు కచ్చరం బండి ఆగేసరికి, పరుగు పరుగున బయటకు వచ్చాడు ఆనందరావు. ఆనందరావును చూసి ఒక్కొక్కరు బండి దిగి ఆయనను అనుసరించారు. తన కూతురు అపర్ణను చూసుకోవడానికి వస్తున్నారని వాళ్ళకు మర్యాదలు బాగా చెయ్యాలని హడావుడి పడుతున్నాడు ఆనందరావు.


"ఏమేవ్ .. వాళ్ళు వచ్చేసారు మంచినీళ్లు తీసుకుని ఇలారా," భార్యను కేకవేసాడు.


"ఆ వస్తున్నానండి," అంటూ మెల్లెగా సమాధానం ఇస్తూ భుజాల నిండుగా పైట కప్పుకుని చిరునవ్వుతో మంచినీళ్లు వాళ్ళందరికి ఇచ్చింది సుశీల.


"ఆ ఇచ్చింది చాలుగానీ లోపలకు వెళ్ళి ఫలహారాలు స్వీటు పట్రా, అట్టే సమయం లేదు వర్జం వచ్చేస్తుంది, అలాగే పొయ్యిమీద చాయ్ పెట్టిరా," ఆమెకు మాత్రమే వినపడేలా దగ్గరకు వచ్చి చెప్పాడు. సరేనంటూ తలూపి లోపలకు వెళ్ళిపోయింది సుశీల.


"ఆనందరావుగారు .. ఇప్పుడవన్నీ ఎందుకండి, వర్జం వస్తుందన్నారు కదా ముందుగా అమ్మాయిని తీసుకరండి, తరువాత తీరికగా మీరు ఇచ్చే ఫలహారాలన్నీ లాగించేద్దాము," నవ్వుతూ అన్నాడు పెళ్ళి కొడుకు తండ్రి పురుషోత్తం.


"అయ్యో అలా అనకండి పురుషోత్తంగారు. ఏదో లాంఛనంగా తినండి, మీరన్నట్టుగా మా అమ్మాయి మీకు నచ్చిందంటే మీకు నచ్చినవన్ని అలాగే కానిద్దురూ .. ఏమేవ్ ఎంతసేపు," అంటూ తనే లోపలకు వెళ్ళి భార్యతోపాటుగా ఫలహారాలు పట్టుకవచ్చాడు.


"బాబు .. ఆమ్మాయివైపు నువు కన్నెత్తి కూడా చూడడంలేదు, నీకు పెళ్ళిచేసుకోవడం ఇష్టంలేదా? లేకపోతే మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టంలేదా,"


ఫలహారాలు తినడం అమ్మాయిని చూడడం అయింది. కాకపోతే అబ్బాయి అలా మౌనంగా ఉండేసరికి అలా అడిగాడు ఆనందరావు.


"అబ్బే అలాంటిదేం లేదన్నయ్యా.. మా వాడికి మొహమాటం ఎక్కువ, ఆడపిల్లలను కన్నెత్తి చూడడంటే నమ్ము, ఓరేయ్ అమ్మాయిని చూడరా.. ఎంత చక్కగా ఉందో. చూడడానికి చామన చాయ అయినా ముఖంలో ఎంతో కళ ఉంది, తలెత్తి అటువైపు చూడు. నువ్వు బలవంతంగా వచ్చావు అనుకుంటారు, మనకు ఇంతకంటే మంచి సంబంధం దొరకదు నా మాటవిను," ఆనందరావుతో చెబుతూ కొడుకు దీపక్ ను బ్రతిమాలుకుంది భారతి.


"అబ్బే అదేం లేదండి.. నేను మీ అమ్మాయిని చూసాను, తనకు వంక పెట్టేదేమి లేదు కాకపోతే నేనొకసారి తనతో మాట్లాడాలి అనుకున్నాను," నవ్వుతూ అడిగాడు దీపక్.


"అంతేనా నేనింకా నీకు మా అమ్మాయిని చేసుకోవడం ఇష్టంలేదేమోనని భయపడ్డాను,


అపర్ణ .. అబ్బాయి నీతో మాట్లాడుతాడట గదిలోకి తీసుకవెళ్ళు, ఈ లోపల మేము మాట్లాడుకుంటాము," కూతురితో చెప్పాడు ఆనందరావు.


దిగ్గున లేచి గదిలోకి దారి తీసింది అపర్ణను అనుసరించాడు దీపక్. అపర్ణకు దీపక్ చాలా నచ్చాడు పోటో చూసినప్పుడే అనుకుంది. ఇతను చాలా బాగున్నాడు నన్ను నచ్చితే బాగుండు అనుకుని దేవుడికి పదే పదే దండం పెట్టుకుంది.


"అపర్ణ.. నేనడిగిన వాటికి మీరు సరైన సమాధానం ఇవ్వండి, మీకు ఇష్టం లేకపోయినా పరవాలేదు. నేను నా మనసులో ఉన్న విషయం చెబుతాను, మీరు ఎవ్వరికి భయపడవలసిన పనిలేదు ఏమంటారు," అడిగాడు కిటికీ దగ్గరగా నిలబడి.


"చూడండి దీపక్ గారు.. మీరు ఏమి అడగాలనుకుంటున్నారో అడగండి, మనిద్దరికి రాసి పెట్టి ఉంటే ఈ పెళ్ళి జరుగుతుంది, ఇద్దరి మనసులు కలిస్తేనే కదా మూడు ముళ్ళు వేయించుకునేది, చెప్పండి మీరు ఏం అడగాలనుకుంటున్నారో," అంది అపర్ణ. మనసులో మాత్రం కంగారుగా ఉంది ఇతనికి నేను నచ్చలేదేమో. లేదంటే ఎవరినైనా ప్రేమించాడేమో.. చూద్దాం ఏం చెబుతాడో అనుకుంది.


"నాకు పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు,"


"అంటే పెళ్ళి చేసుకోవడం ఇష్టంలేదా? లేకపోతే నన్ను చేసుకోవడం ఇష్టం లేదా," అతని మాటలకు మధ్యలోనే అడ్డు వస్తూ అడిగింది ఆత్రుతగా.


"అయ్యో అపర్ణ .. నన్ను మొత్తం చెప్పని, నేను మిలటరీ లో ఉన్నవాణ్ణి నీకు ఆ సంగతి తెలుసు, మాములుగా అయితే మిలటరీలో ఉద్యోగం చేస్తున్నావాడికి పిల్లనివ్వడానికి ఏ తల్లితండ్రులు ముందుకురారు, ఎందుకంటే వాళ్ళ జీవితాలు ప్రాణాలతో చెలగాటం ఆడుతాయి కాబట్టి, మరి మీరు ఎలా ఒప్పుకున్నారో నాకు తెలియదు, కానీ! నాకు పెళ్ళి చేసుకుని ఒక అమాయకురాలి జీవితం నాశనం చేయడం ఇష్టంలేదు, నేను ఎంత వద్దని చెబుతున్నా మా అమ్మ చచ్చిపోతానని బెదిరించి మీ సంబంధానికి తీసుకవచ్చింది,


నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈ పెళ్ళి ఇష్టం లేదని చెప్పాలి, నిన్ను కోరుకొనేది ఇదే అపర్ణ, నాలాంటి వాడికి పెళ్ళి పిల్లలు వంటి ఆశలు పెట్టుకోకూడదు," బాధతో చెప్పాడు.


పకపకా నవ్వింది అపర్ణ. "ఎంత ఆమాయకులండి మీరు .. ఇదేనా మీరు చెప్పాలనుకున్నది, ఇంకా నయం నేను నచ్చలేదని చెబుతారేమోనని భయపడిపోయాను," ఇంకా నవ్వుతూనే అంది.


"అదేంటి మీకు ఇష్టం లేదా పెళ్ళి చేసుకోవడం, అమ్మయ్యా మనిద్దరం కోరుకున్నది ఒకటేనన్న మాట," పెద్దగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు దీపక్.


"ఆగండాగండి .. నేను మిమ్మల్ని పెళ్ళిచేసుకోవడానికి ఒప్పుకుంటున్నాను, దేశానికి సేవ చేసే మీరు దేశాన్ని వెన్నుముకలా కాపాడుకుంటున్న మీరు భర్తగా లభించడం

నేను చేసుకున్న పుణ్యం, మీలాంటి దేశసేవ చేసే నాయకులకు ఒక్కరోజు భార్యగా బ్రతికినా చాలు, అంతే కాదు రేపు నాకు పుట్టబోయే నా కొడుకును కూడా దేశాన్ని కాపాడే సైనికుడిగా తయారుచేస్తాను," అంది ధృడంగా.


ఆశ్చర్యంతో అపర్ణ నే చూడసాగాడు దీపక్. తానోకటి అనుకుంటే దైవమొకటి తలచే అన్నట్టుగా. ఈ పిల్లేంటే తుమ్మితే ఊడిపోయే జీవితాలు మావి అంటే నమ్మదు.

"అపర్ణ .. నీకు తెలియదు మా జీవితాల గురించి, ఎప్పుడు యుద్ధానికి పిలుపు వస్తుందో తెలియదు, ఉన్నపళంగా వెళ్ళిపోవాలి అలా వెళ్ళినవాళ్ళం మళ్ళి తిరిగి వస్తామో లేదో తెలియదు నిత్యం చస్తూ బ్రతకాలి, మా మీద మాకే నమ్మకం ఉండదు అలాంటిది..పెళ్ళిచేసుకుని భార్యబిడ్డలను అధోగతి పాలు చెయ్యడం ఎంతవరకు సమంజసం చెప్పు," అడిగాడు ఆవేదనగా.


"ఎందుకండి అంతగా బాధపడుతున్నారు, మీరు చేసే ఈ మంచిపనిలో నేను సమిధను కావాలని ఉంది, మీ ఆలోచన విధానం బాగానే ఉంది కాకపోతే, అందరు మీలా భయపడుతుంటే ఏ వీర జవాను పెళ్ళిచేసుకోడు, ఇంకెవ్వరు సైనికులుగా రావాలని అనుకోరు, యుద్ధం లో ప్రాణాలుపోయినా చరిత్రలో నిలిచిపోతారు, మీతోపాటు నేను

శాశ్వతంగా చరిత్రలో ఉండిపోతాను నా మాట కాదనకండి," దీపక్ రెండు చేతులుపట్టుకుని బ్రతిమాలుకుంది అపర్ణ.


"అదికాదు అపర్ణ .. నేను చెప్పేది విను,"


"వినను నేనింకేం వినను .. మీరు నాకు నచ్చారు మన పెళ్ళి జరుగుతుంది, ఇంతకు మీకు నేను నచ్చానా లేదా చెప్పండి," అతని మాటలకు అడ్డువస్తూ అడిగింది.


"అపర్ణ .. నిన్ను నచ్చకపోవడం ఏంటి? మా అమ్మకైతే తెగ నచ్చేసావు, నువ్వు నచ్చడమే కాదు నీ మాటలు నాకు కొండంత స్పూర్తినిచ్చాయి, నాకు చాలా ఆనందంగా

ఉంది నీతో జీవితాన్ని పంచుకోవడానికి నేను సిద్ధం, పద మన కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు," నవ్వుతూ చెప్పాడు దీపక్.


****** ******* ******* ******* ******

అందరి మనసులు ఉత్సాహంగా ఉన్నాయి. చకచకా పెళ్ళి పనులన్నీ జరుగుతున్నాయి. అనుకున్న ముహూర్తం రానే వచ్చింది అంగరంగ వైభవంగా పెళ్ళి జరిపించారు ఆనందరావు దంపతులు. కొడుకు మనసు మారి చక్కటి అమ్మాయిని పెళ్ళి చేసుకున్నందుకు సంతోషంతో పొంగిపోయారు పురుషోత్తం దంపతులు. అపర్ణా దీపక్ సంసారం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. అత్యవసరం అనుకున్నప్పుడు ఉద్యోగానికి వెళ్ళి వస్తున్నాడు దీపక్.


రెండేళ్ళ వైవాహిక జీవితంలో అపర్ణకు కొడుకు పుట్టాడు. దీపక్ ఆనందానికి అంతులేదు. దేశాన్ని కాపాడటానికి మరో సైనికుడు పుట్టాడన్న సంతోషంతో పొంగిపోయింది అపర్ణ. బారసాల ఘనంగా చెయ్యాలని తాత అమ్మమ్మ అయ్యామని అటు ఆనందరావు దంపతులు. నానమ్మ తాతను అయ్యామని ఇటు పురుషోత్తం దంపతులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసారు. చుట్టపక్కాలందరిని పిలిచి ఘనమైన కానుకలు ఇవ్వాలనుకున్నారు. తెల్లవారితే బారసాల చుట్టపక్కాలు రావలసిన వాళ్ళు ముందే వచ్చారు.


అంతా సాఫీగా సాగిపోతుందనుకున్న సమయానికి అర్జంట్ గా రావాలని ట్రంకాల్ వచ్చింది ఒక్కసారిగా గుండె గుభేలు మంది దీపక్ కు.


"ఏంటి అలా ఉన్నారు ఏమైంది? ట్రంకాల్ వచ్చింది ఎక్కడనుండి," భర్త మౌనం చూసి అడిగింది అపర్ణ.


"అపర్ణ .. చైనాతో యుద్ధం మొదలైందట అర్జంటుగా సిపాయిలందరు రావాలని ట్రంకాల్ చేసారు, తక్షణమే వెళ్ళిపోవాలి ఉన్న పళంగా బయలుదేరమన్నారు, రేపు మన బాబుకు బారసాల పెట్టుకున్నాము, నేను లేకపోయినా పరవాలేదు మీరందరు దగ్గరుండి వాడికి పేరు పెట్టండి, నువ్వు త్వరగా వంటచేస్తే తిని వెళ్ళిపోతాను," బాధపడుతూ చెప్పాడు.


"అదేంటండీ ఒక్కరోజు ఆగి వెళితే సరిపోతుంది కదా! అందరిని పిలిచాము, బాబు బారసాలకు మీరు లేకపోతే ఎంతమంది ఉన్నా ఎందుకండి, నా మాట వినండి తొందరపడకండి రేపు బారసాల అవడంతోనే వెళ్ళిపొండి," ఆరాటంగా అడిగింది అపర్ణ.


"లేదు అపర్ణ .. ట్రంకాల్ వచ్చిందంటే అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది, ఏ మాత్రం ఆలస్యం చేసినా వందల మంది ప్రాణాలు పోతాయి, మన అదృష్టం బాగుండి నేను తిరిగి వస్తే అప్పుడు చూద్దాం, నా బాబుకు నేను పేరు చెబుతాను నువ్వే ఆ పేరు పెట్టు అపర్ణ, వాడు మన ముద్దుల గారాలపట్టి కదా! వాడికి "ప్రణయ్" అని పెట్టు,"అంటూ ఆర్తిగా భార్యను దగ్గరకు తీసుకుంటూ చెప్పాడు.


దీపక్ వెళ్ళిపోయాడు జరుగవలసిన బారసాల ఆగిపోయింది. దీపక్ వెళ్ళాడన్న బాధతో అపర్ణ బారసాల చెయ్యడానికి ఒప్పుకోలేదు. దీపక్ మీద బెంగతో అపర్ణ కృశించిపోయింది.

అపర్ణ తల్లి తండ్రులు అపర్ణతో ఉంటూ పిల్లవాడిని చూసుకుంటూ కాలం వెళ్ళదీస్తున్నారు.


రోజులు నెలలు గడుస్తున్నాయి కానీ దీపక్ జాడ లేదు, యుద్ధం అయిపోయిందా ఇంకా నడుస్తుందా అనే విషయం కూడా తెలియడంలేదు. ఎవ్వరిని అడిగినా తెలియదనే చెబుతున్నారు. అసలు దీపక్ ఉన్నాడా లేదా అనేది కూడా తెలియడంలేదు. మెల్లె మెల్లెగా బాబును చూస్తూ మనుషులతో కలవడం మొదలుపెట్టింది అపర్ణ.

ఎలాగు తల్లితండ్రులు బాబును చూస్తున్నారు కదా అని తను చిన్న ఉద్యోగం వెతుక్కుంది. రోజులు గడిచిపోతున్నాయి దీపక్ వస్తాడన్న మినుకు మినుకు మనే ఆశతో బతుకును వెళ్ళదీస్తుంది అపర్ణ.


"ఏమిటండి అపర్ణగాను ఇంత చిన్న వయసులో మీరిలా ఉండడం భావ్యం కాదండి, చూడండి మేమందరం ఎలా గలగల నవ్వుతూ పని చేసుకుంటున్నామో, మీరు మాతోపాటే ఉంటున్నారు కానీ ఏమి మాట్లాడరు, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నవాళ్ళలా మీలో మీరే కుమిలిపోతారు, మాతో చెబితే మీ కష్టమేంటో కొంచెమైనా తీర్చగలమేమో

చూడండి, మీరిలా మౌనదేవతలా ఉంటే చూడలేకపోతున్నాను," బ్రతిమాలుతున్నట్టు అడిగాడు పవన్. అపర్ణతో ఆఫీసులో పని చేస్తున్నాడు పవన్.


"అబ్బే అదేం లేదండి.. నేను ఎక్కువగా ఎవరితో కలవనండి, మీరనుకున్నంతగా నాకు కష్టాలు ఏమి లేవు నా గురించి మీరంతగా ఆలోచించకండి," అంది అక్కడనుండి లేచివెళుతూ.


"అపర్ణగారు .. మీ గురించి నాకంతా తెలుసు, కాకపోతే మీ నోటినుండి విందామని అడిగాను, ఇంత అందమైన మీ జీవితం ఇలా అడవి కాచిన వెన్నెలలా అయిందని తెలుసు, ఇంతకాలం మీరు ఎదిరి చూస్తున్న మీ భర్త వస్తాడో రాడో తెలియదు, అసలు ప్రాణాలతో ఉన్నాడో లేదో కూడా తెలియదు, అలాంటి మనిషికోసం మీరు ఎన్నాళ్ళని

ఎదిరి చూస్తారు," అడిగాడు కాస్త చనువు తీసుకుంటూ.


ఆశ్చర్యపోతూ పవన్ వైపు చూసింది."మీకు మీకు నా గురించి ఎలా తెలుసు? ఇంతవరకు నేనెవరికి చెప్పలేదు, కొత్త ఊరు కొత్త మనుషుల మధ్యకు వచ్చాననుకున్నాను, నా గురించి ఎవ్వరికి ఏ విషయం తెలియదనుకున్నాను మీకు ఎలా తెలుసు," అడిగింది.


"మనసుంటే మార్గం ఉంటుందని .. మీరు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, ఎప్పుడూ ఏదోఆలోచిస్తూ తప్పదన్నట్టు జీవితాన్ని నెట్టుకొస్తున్నారనిపించింది, మొదటిసారి మిమ్మల్ని చూడగానే నా మనసులో ముద్రవేసుకుంది మీ రూపం, అందమైన గులాబీని

చూస్తుంటే ఎవరికిష్టం ఉండదు చెప్పండి, మిమ్మల్ని మాట్లాడించే శక్తిలేదు ఎలా .. ఎలాగైనా మీ బాధ తెలుసుకోవాలని అని చాలా రోజులనుండి చూస్తున్నాను," చెప్పాడు.


"మీరు చాలా పొరపడుతున్నారు నా భర్త ఎప్పటికైనా తిరిగివస్తాడన్న నమ్మకం నాకుంది, మీ మనసులో చెడు ఉద్దేశం ఉంటే గనుక నాతో మాట్లాడకుండా ఉండడం మంచిది," అంది.

=================================================================================

ఇంకా ఉంది..

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.49 views1 comment

1 Comment


@swapnaj8931 • 1 day ago

Super Katha attayya, part-2 Kosam eduruchustam. Twaraga pettandi.

Like
bottom of page