top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' పార్ట్ 13



'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 13' - New Telugu Web Series Written By Pandranki Subramani

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 13' తెలుగు ధారావాహిక

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:

కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.


మెస్ లో సహాయకురాలిగా ఉన్న మంజుల రూపవతికి సంబంధించిన రహస్యాలు చెబుతుంది. రూపవతి భర్త మరణించి చాలా కాలమైందన్న విషయం విని ఆశ్చర్యపోతాడు రామభద్రం.


మంజులదేవి, సోమనాథాల వివాహం జరుగుతుంది.

రామభద్రం కోరికపై అతని బావమరిదికి కూడా పని ఇస్తుంది రూపవతి.

తన పిల్లల్ని మంచి స్కూల్ లో వెయ్యలేదని గొడవపడ్డ చెల్లెలు లలితకు సర్ది చెబుతాడు భద్రం.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 13' చదవండి.


“అది కాదు మేడమ్—వాసు పదవ తరగతి గట్టెక్కిన వెంటనే ఉద్యోగంలో చేర్పించాలి. అదే విధంగా వేంకటేష్ విషయంలోనూ-- మీ వద్ద గాని ట్రైనింగ్ తీసుకుంటే కుర్రాళ్ళిద్దరూ దారిలోకి వచ్చి రాటు దేలి బాగుపడతారని కాంతం బలంగా నమ్ముతూంది మేడమ్’ రూపవతి రవంత సేపు ఆగి అంది-


“ముందు మీరు మరీ అణకువగా మేడమ్ అని సంబోధించడం తగ్గించుకోండి. అదంతా తాత్కాలికమైన కలయికని భావిస్తూ మీరు జరిగినదానిని మర చి పోయుంటారేమో గాని— నేను మీ ప్రక్కన పడుకున్నానన్నది నేను మరచిపోను. నేనే కాదు. ఆ మాటకు వస్తే యే ఆడదీ యిటువంటి ఎమోషనల్ సంబంధాలను త్వరగా మరచిపోదు. మీకుందో లేదో నాకు తెలియదు గాని— నాకు మాత్రం మన కలయిక నాకొక యెమోషనల్ ఫీలింగే--


నాపైన అధికారం చూపించడానికి చొరవ చూపించలేక పాయినా కాస్తో కూస్తో హుందాతనంతో మెసలడానికి ప్రయత్నించండి. మరీ మన్నన చూపిస్తూ నన్ను యిబ్బందికి లోను చేయకండి. ఇప్పుడు దీనికి బదులివ్వండి.


నేనెప్పుడన్నాను కుర్రాళ్ళిద్దరినీ పదవ తరగతితో చదువు మానిపించేస్తానని? చదువంటే పదవ తరగతి వరకేనా! ప్లస్ ఒన్ ఆ తరవాత టూ లేదా- ఆ తరవాత గ్రాడ్వేషన్ లేదా- అటు తరవాత అదృష్టం కలిసొస్తే—“


అప్పుడు రామభద్రం ఆమె మాటకు అడ్డు వచ్చాడు- “అంతటి స్తోమత మా కుటుంబానికి లేదు రూపవతీ! అర్థం చేసుకోండి”


“అది నాకు తెలియదా? మీకు తగినంత వసతి గాని ఉంటే మీరీ ఊరికే వచ్చుండేవారే కాదన్నది నాకు తెలియని విషయమా! ”


అతడు తలవంచుకున్నాడు. అప్పుడామె మళ్ళీ అందుకుంది- “చిత్తశుధ్ధిగల విజాయితీ పరులు ఎమోషనల్ గా ఉంటారన్నది నాకు తెలుసు. కాని—ఇంత ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఉండకూడదు. ఇప్పుడు బాగా గుర్తు పెట్టుకోండి. వాసు వేంకటేశ్ యిద్ద రూ మీకు మాత్రమే కాదు. నాకు కూడా కొడుకులే! ఎనీ డౌట్?”


అతడు అనుమానం లేదన్నట్టు తల అడ్డంగా ఆడించాడు; ఆమె అందించిన చేతి రుమాలు అందుకుంటూ—కంట నీరు తుడుచుకుంటూ—అప్పుడు మాలిని కాఫీ కప్పుల్ని తెచ్చి వాళ్ళ ముందుంచింది-


“మీకళ్లెందుకో యెర్రబడినట్లున్నాయి మేడమ్! ఓసారి కళ్ళు తుడుచుకోండి”అని తన చేతిరుమాలుని రూపవతి కి అందించింది.


ఆమె పెదవులమీదికి నవ్వుల రేఖ పూసుకుటూ కళ్ళు తుడుచుకుంది. మెస్సు మేడమ్ భావోద్వేగాలకు లోనయిందన్న విషయం మాలినికి తెలియనిదా! ఒక ఆడదాని మనసుని మరొక ఆడదేగా యిట్టే అర్థం చేసుకోగలదు!


ఇద్దరూ కాఫీలు తాగడం పూర్తి చేసిన తరవాత రూపవతి థేంక్సంటూ మాలిని వేపు చూసింది;తర్వాత పిలుస్తాలే అన్న సంకేతం యిస్తూ—ఆ సంకేతాన్ని అందుకున్న మాలిని ఆమె సలహాన్ని పాటిస్తూ అక్కణ్ణించి కదలింది ఖాలీ కప్పుల్ని అందు కుని. అప్పుడు రూపవతి రామభద్రం వేపు తిరిగింది.


”మీకు రెండు విషయాలు చెప్పాలి. వినీ విన్నంతనే డిస్టర్బ్ ఆవకండి. నాకు న్న జీవిత నేపథ్యంతో నేనొకరితో- అంటే అపోజిట్ సెక్స్ తో అంత త్వరగా చేరువవలేను. మగడు లేని ఆడదానిని. నాకూ కొన్ని శారీరకమైన అవసరాలుంటాయి. ఇది కాదనలేని వాస్తవం. ఐనా—నా గత జీవితానుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే నేనెవ్వరికీ కళ్ళకు గంతలు కట్టుకుని చేరువవలేను. అవకూడదు కూడా—

ఇప్పటి సైబర్ క్రైమ్స్ ప్రపంచంలో పరిస్థితి ప్రమాదకరంగా మారవచ్చు. మంగళూరులో గాని యిక్క డ గాని నాకున్న ఆస్తిపాస్తులు తక్కువేమీ కాదు.


ఇదంతా యెందుకు చెప్తున్నానంటే — నేనేమీ అమాయకురాలిని కాను చూసీ చూడటంతోనే మీకు చేరువవడానికి. ఇంకా చెప్పాలంటే మీలో లేని చాకచక్యం వ్యూహాత్మక జీవిత విధానం నాలో మెండుగానే ఉన్నాయి. మరింత సూటిగా చెప్పాలంటే-- ఇక్కడి సిక్కు పంజాబీలు గాని హిందూ పంజాబీలు గాని కన్నడిగులు గాని తక్కువ తిన్నవారేమీ కారు. నాకు చేరువవడానికి పెక్కు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు.


నేను కొరమీనులా తప్పుకుంటూనే ఉంటాను, యుధ్ధ భూమి లో చనిపోయిన నా భర్త బొట్టులేని ఫొటోని పెద్దదిగా అందరికీ కనిపించేలా నా క్యాబిన్ లో పెట్టుకుంటూ-- బ్రతుకాటంటే ఇదే కదా! హ్యూమన్ సైకలాజీ ప్రకారం ఆడాళ్ళలో ఒక నిగూఢమైన గుణాంశం ఉంటుంది, వయసుకీ అనుభవానికీ అతీతంగా—తనకు హాని తలపెట్టని మగతోడు కోసం తపించడం.


అటువంటి మగతోడు కోసం ఊహించుకుంటూ తరించడం. అటువంటి మగాడు యెదురైనప్పుడు ఫిదా ఐపోవడం. ఇది స్త్రీలోని బలహీనమైన గుణాంశమే కావచ్చు. కాని—న్యాయమైన గుణాంశమే-- కాదా?


ఇక రెండవ విషయానికి వస్తున్నాను. మీరు మనుపులా ఒదిగి ఒదిగి తొలగి తొలగి ఉండటానికి ప్రయత్నించ కూడ దు. ఈ ప్రపంచంలో అప్పుడప్పుడు మనిషి ఉన్నవి లేనట్టు—లేనివి ఉన్నట్టు భావన చేయాలి. అటువంటి వ్యక్తికే ర్యాష్ డ్రైవింగు తో సాగే యిప్పటి పోటీ ప్రప్రంచంలో మనుగడ ఉంటుంది. మీది నాదవుతున్నప్పుడు నాది మీదవుతుంది కదా!


ఇక్కడున్న సౌత్ యిండియన్ బిజినెస్ ఫోరంలో నాకు ఆల్టర్ నేట్ మెంబర్ షిప్పు యివ్వబోతున్నారు. వాళ్ళు యేర్పాటు చేసే బిజినెస్ మీట్లకు మీరూ నాతో బాటు హాజరవుతుంటారు“ ఆ మాట విన్నంతనే రామభద్రం ఉలికిపాటుతో- “నేనా! ”అని అడుగుతూ లేచి నిల్చున్నాడు.

“ఔను. మీరే! బిజినెస్ మీట్ లో మీకు తెలిసిన భాషలోనే మీకు తోచిన రీతిలోనే చెప్పవలసింది చెప్తారు. వెళ్ళే ముందు నాతో కలసి హోమ్ వర్క్ తయారు చేసుకునే వెళతారు. తినగ తినగ వేము తీయగనుండు—అలవాటయిన తరవాత అంతా మామూలే—నలుగురు మధ్య మెసలగల స్థాయికి యెదగాలంటే మీకు పొజిషన్ కావాలి. దానికి తగ్గట్టు తగిన డాక్యుమెంటేషన్ కావాలి. అంతే కదా! అది నేను చూసుకుంటాను.


మీ స్వభావరీత్యా ఫ్రాంక్ గా ఈ విషయాలు మీకు తెలియదంటారా-- పర్వాలేదు తెలుసుకోండి. నేర్చుకోండి, మంచి మట్టి బొమ్మను చేయాలనుకుంటే మొదట దుస్తులు మైల పడుతాయన్న శంకను వీడి బంక మన్నులో చేయి పెట్టే తీరాలి. ఇప్పుడు- అంటే ఈ రోజునుంచి మీరు చేయవలసిందల్లా ఒకటే—మీకు మీరు మెంటలీ ప్రిపేర్ కావడం.


ఇప్పటికిప్పుడు అలా చేయడం కుదరదంటే పర్వాలేదు. కావలసినంత టైమ్ తీసుకోండి ఆ తరవాతనే నిదానంగా డ్యూటీలో వచ్చి చేరండి. సరేనా! ”


అతడు మౌనంగా ఆమె ముందు మళ్ళీ కుదురుగా కూర్చున్నాడు; సాధ్వి ముందు ప్రణమిల్లే ఉపాసకుడిలా—

--------------------------------------------------------------------

మెల మెల్లగా డ్రైవింగ్ నేర్చుకుంటూన్న కొత్త డ్రైవర్ లా రామభధ్రంలో మార్పు రాసాగింది. ఐతే—మార్పు మార్పుకోసం రావడం సముచితం కానేరదు. హెచ్చైన స్థాయిని అలవోకగా అందుకోగలిగే మార్పే మనుగడకు అవసరమైన మార్పు. అతడి మాట తీరులో భావ ప్రకటనలో ఫిట్ అండ్ ట్రిమ్ గా మారుతూన్న ఆహార్యంలో దేహభాషలో కూడా మార్పు కొట్టవచ్చినట్టు ప్రస్ఫుటితం కాసాగింది.

అతడిలో కానవచ్చే ఈ బెటర్ చేంజ్ ని మొదట అతడి కొడుకులిద్దరూ కనిపెట్టారు,


ఆశ్చర్యానందాలతో తండ్రిలోని హుందాతనంతో కూడుకున్న మార్పుని కనిపెట్టి వాళ్ళిద్దరూ మొదట తల్లి చెవికి చేరవేసారు. కాని—ఆమె తగు రీతిలో వాళ్ళు యెదురు చూసిన రీతిలో స్పందించలేదు. అదంతా తనకు సంబంధం లేని విషయమన్నట్టు దాటవేసింది. అన్నదమ్ములిద్దరూ ఊరుకోలేదు. వెనక్కి తగ్గలేదు.


మధ్యాహ్న భోజనాలయి సేదతీర్చుకుంటూన్న సమయంలో తిన్నగా వెళ్ళి తాతయ్య చెవిలో వేసారు. అప్పు డు రాఘవయ్య నిద్రనుంచి మేల్కొన్నట్టు- “ఔను సుమా! నేనూ అడగాలనుకుంటూనే యేదో మూడ్ లో పడి మరచిపోతు న్నాను. ఏడి—మీ బాబుని పిలవండి అండ పిండ బ్రహ్మాండం యెక్కడుందో అడిగి తెలుసు కుంటాను”


ఆ ఒక్క మాటా విన్నంతనే అన్నదమ్ములిద్దరికీ డబుల్ ఇంజన్ ఫోర్స్ లభించినట్లనిపించింది. భోజనం ముగించి తల్లితో యేదో మాట్లాడుతూ కూర్చున్న తండ్రిని తాతయ్య వద్దకు లాక్కొచ్చారు. ఆలోపల అక్కడ యింటిల్లపాదీ గుమికూడారు. “పిలిచారా బాబూ! ”అని యెదుట నిల్చున్నాడు రామభద్రం.


“ఔను నేనే పిలిచాను. నిన్ను చూస్తుంటే మెస్సులోని చీఫ్ కుక్ లా లేవు. నువ్వు పని చేస్తూన్న ఉద్యోగానికీ వేసుకుంటూన్న డ్రెస్సులకీ పొంతనే లేనట్లుంది. మాకు తెలియకుండా మెస్ లోని ఉద్యోగం గాని మానేసావేంటి? మరెక్కడైనా చేరావేంటి?"రామభద్రం తల అడ్డంగా ఆడిస్తూ బదులిచ్చేలోపల తాయారమ్మ అందుకుంది- “ఔన్రా భద్రం. నేనూ అడగాలనుకుంటూనే మరచిపోతున్నాను. నువ్వు చేస్తూన్న పనికీ నువ్వు వేసుకుంటూన్న దుస్తులకీ యేమైనా పొంతన ఉందా? మీ ఆవిడ అడిగిందా యేంవిటిదంతా అని— అకస్మాత్తుగా వచ్చే మార్పు అపాయకరంగానే మారుతుందంటారు”


అతడు మళ్ళీ తల అడ్డంగా ఆడించాడు. “అటువంటి అపాయకరమైన మార్పేమీ లేదమ్మా! నేనిప్పుడు మాలినీగారితో కలసి బ్యాంకు పనుల్లో క్యాష్ అకౌంటింగులో మేడమ్ కి అసిస్టు చేస్తున్నాను. ముఖ్యంగా బయటి పనులన్నీ నేనే చూసుకుంటున్నాను. బిజినెస్ మీట్స్ కి వెళ్ళేటప్పుడు కూడా నేనే రూపవతిగారితో వెళ్తొస్తున్నాను. సమాచార సేకరణ చేసి యిస్తున్నాను. ఫైల్స్ నంబరింగ్ చేసి అందిస్తున్నాను.


ఆమెగారితో అలా కలసి ముఖ్యమైన పనులపైన వెళ్తున్నప్పుడు మునుపటి దుస్తులు వేసుకోవడం కుదరదని యెవరో డ్రెస్ డిజైనర్ ని పిలిపించి ఇటువంటి కొత్త విధమైన డ్రెస్సులు వేసుకోమన్నారు రూపవతి గారు. దీనికి తగ్గట్టు నా జీతం కూడా పెంచారు”


“నీ జీతం మాట తరవాతి సంగతి. నువ్వు యివన్నీ చేస్తుంటే, మొన్న మొన్ననే నీకిచ్చిన ఛీఫే కుక్ పోస్టు సంగతేమి కావాలి?" రాఘవయ్య కళ్ళు పెద్దవి చేసుకుంటూ అడిగాడు.


“సోమనాధం గారితో కలసి కొత్త చీఫ్ కుక్ ని సెలక్ట్ చేసారు రూపవతి గారు”


కొడుకు మాటలకు అసంతృప్తి తెలియ చేసేలా తల అడ్డంగా ఊపుతూ రాఘవయ్య స్పందించాడు- “నాకేమిటో ఇదంతా విచిత్రం గానే తోస్తూంది. నువ్వు చదివిన చదువేమిటి? దానికి తగ్గట్టు నువ్వు నేర్చుకున్న పనేమిటి? నువ్విప్పుడు చేస్తూన్న నిర్వాకం యేమిటి! బయటకు రాలేని రుబ్బ రోలులోకి తల దూరుస్తున్నావేమో! అలవాటు లేని గుర్రమెక్కి యెత్తు పళ్ళాలపై సవారీ చేస్తున్నావేమో”


రామభద్రం బదులివ్వ కుండా ఊరకుండిపోయాడు. అప్పుడు కాంతం భర్తకు వత్తాసుగా అంది- “బాస్ చెప్పింది చెప్పినట్టు చేయాలి కదా మాఁవగారూ! ”


“నువ్వూరుకోమ్మా! మా మధ్య అడ్డురాకు. ఐనా నేను అడిగి తెలుసుకుంటూనే ఉన్నాగా! “అని అటు తిరిగాడు రాఘవయ్య.

“సరే—రూపవతిగారు యిస్తూన్న పనుల్ని నువ్వు తు చా తప్పకుండా చేసి ముగిస్తున్నావే అనుకో-- మరి—మీ బావ వాసుదేవరావు గతేమి కాను? ఇటువంటి పనుల్ని చేయడానికేగా వాసు దేవరావుని పనిలో చేర్చుకున్నదీ! అతనికి నీలా వంటపని రాదుగా! ఇక అతడి ఉనికి మెస్సుకి అవసరం లేదని తలపోసి మెస్సు ఓనర్ అతణ్ణి ఉద్యోగంలోనుంచి తీసి వేస్తే మీ చెల్లి గతేమి కాను—ఆలోచించావా! ”


రామభద్రం కొన్ని క్షణాలు మిన్నకుండిపోయాడు. అప్పుడు కాంతం మళ్ళీ కలుగచేసుకుంది. ”అలా జరగదు మాఁవగారూ! రూపవతి మేడమ్ అటువంటి వ్యక్తి కాదు. ఆమెది పెద్దమనసు”


“అటువంటి వ్యక్తి వాసుదేవరావుని కాదంటే--- ఎంతైనా రూపవతిగారు ప్రపంచ జ్ఞానం గల బిజినెస్ లేడీ కదా! “


“పని వాళ్ళను అలా ప్రత్యమ్నాయం చూపించకుండా ఉన్నపాటున రోడ్డున పడవేసే వ్యక్తి కాదంటున్నాను”


“నువ్వంటే సరిపోతుందా కోడలు పిల్లా! డబ్బున్నవాళ్ళ మూడ్స్ యెప్పుడెలా మారుతుంటాయే యెవరు చెప్పొచ్చారు—“


“ఔను నాన్నగారూ! కాంతం చెప్పినట్టు రూపవతిగారు యెవర్నీ రోడ్డున పడవేయరు. ఐనా—ఇప్పుడు వాసుదేవరావు ఊరకే లేడుగా! ఐటీ- జీ యెస్టీ రిటార్నల పనితోబాటు కంప్యూటర్ సిస్టమ్ అప్డేషన్ వర్క్ మేడమ్ అతడికేగా అప్పజెప్పారు. నాలాగే పనికి తగ్గట్టు అతడికీ జీతం పెంచారు. ఇది లలిత మీకు చెప్పలేదా?"


ఈ చివరి క్వరీతో రాఘవయ్య భార్య వేపు ఓచూపు చూసి ఊరకుండి పోయాడు. కమల కాంతం పెదవులపై నవ్వులు వెదజల్లుతూ చేతిలోని ముబైల్ ఫోనుని అత్తగారికి అందించింది; అంత మంచి విషయాన్ని యింతవరకూ కూతురు యెందుకు చెప్పలేదో కనుక్కోమని చూపులతో సంకేతం యిస్తూ-- తాయారమ్మ ముబైల్ అందుకోలేదు. కళ్ళు పెద్దవి చేసుకుంటూ స్పందించింది“ లలిత మాట్లాడింది. బాగానే విషయం చెప్పింది. మాటలో మాటగా మరొకటి కూడా చెప్పింది నొచ్చుకుంటూ—”


రామ భద్రం విస్మయాత్మకంగా చూస్తూ కలుగచేసుకున్నాడు- “నొచ్చుకుందా! ఇందులో నొచ్చుకోవడానికేముందమ్మా? ఫిక్స్ చేసిన వేత్తనం తక్కువగా ఉందనా--”


“కాదు. ఈ పాటికి కారణం నీకు తెలిసే ఉంటుంది! ”


“చెప్పకుండా కారణం యెలా తెలుస్తుందమ్మా! ”ఆ మాటతో కాంతం ఎలర్టయింది. తన ఆడపడుచువి ఒకటా రెండా! చెప్పలేని గొంతెమ్మ కోరికలు! ఇంతకూ ఆవిడ అసలు పిర్యాదేమిటో-- అప్పుడు తాయారమ్మ భర్త వేపు ఓ చూపు విసిరి గుట్టు విప్పింది-


“రూపవతి మేడమ్ గారు వాసుదేవరావుకి యే మాత్రమూ ప్రాముఖ్యత యివ్వడం లేదట. ముఖ్యమైన వ్యవహారాలలో నీతో మాత్రమే చర్చిస్తుందట. నిన్ను మాత్రమే బయటి పనులకు తీసుకెళ్తుందట. ఎంతైనా అల్లుడు చదువుకున్న అబ్బాయి కదూ! అది కూడా ఆమెగారు కాస్తంత గుర్తు పెట్టుకోవాలి కదా!


ఆమె మరచిపోతేనేం-- నువ్వు ఓరగా గుర్తు చేయవచ్చుకదా! ఈ కారణం చేత మెస్సు వర్కర్లు యితర సిబ్బందీ నీపట్ల చూపిస్తూన్న మన్నన మీ బావగారి పట్ల చూపించడం లేదట. ఇది చెప్పి లలిత చాలా నొచ్చుకుందిరా! ”


రామభద్రం తల్లి వేపు ఓసారి నిదానంగా చూసి, యిక మాట్లాడటానికేమీ లేదంటూ భుజాగలేగరేసి గడప వేపు నడిచాడు, కమల కాంతం తల వంచుకుని వెళ్తూన్న భర్తను సమీపించాలని రెండడుగులు వేసి, పిమ్మట యేమను కుందో యేమో చప్పున ఆగిపోయింది;కొడుకులిద్దరి వేపూ తదేకంగా చూస్తూ—

=======================================================================

ఇంకా వుంది

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.





28 views0 comments
bottom of page