top of page

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై' పార్ట్ 14


'Ika Jeevitham Udvega Purithamai - Utthunga Tharangamai - 14' - New Telugu Web Series Written By Pandranki Subramani And Published In manatelugukathalu.com On 09/10/2023

'ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై - 14' తెలుగు ధారావాహిక చివరి భాగం

రచన : పాండ్రంకి సుబ్రమణి

(ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ:


కుటుంబ పోషణ కోసం ఢిల్లీలోని ఒక మెస్ లో కుక్ గా చేరుతాడు రామభద్రం. ఒకరోజు అతనికి కలలో ఆ మెస్ నిర్వాహకురాలు రూపవతి ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అతనిలో అలజడి మొదలవుతుంది.


తన ఊరికి వెళ్లి రావడం కష్టంగా ఉందని, పని మానేసి వెళ్ళిపోతానంటాడు భద్రం. కుటుంబాన్ని ఢిల్లీకి తీసుకురమ్మని, అవసరమైన సహాయం చేస్తానని చెబుతుంది రూపవతి.


ఢిల్లీకి చేరుకున్న భద్రం కుటుంబానికి వసతి చూపిస్తుంది రూపవతి. రూపవతి ప్రవర్తన కాస్త అసహజంగా కనిపిస్తుంది భద్రానికి. ఆమెతో నిగ్రహంగా వ్యవహరించాలని అనుకుంటాడు.


మెస్ లో సహాయకురాలిగా ఉన్న మంజుల రూపవతికి సంబంధించిన రహస్యాలు చెబుతుంది. రూపవతి భర్త మరణించి చాలా కాలమైందన్న విషయం విని ఆశ్చర్యపోతాడు రామభద్రం.


మంజులదేవి, సోమనాథాల వివాహం జరుగుతుంది.

రామభద్రం కోరికపై అతని బావమరిదికి కూడా పని ఇస్తుంది రూపవతి.


తన పిల్లల్ని మంచి స్కూల్ లో వెయ్యలేదని గొడవపడ్డ చెల్లెలు లలితకు సర్ది చెబుతాడు భద్రం.

అతనికిస్తున్న విలువ తన భర్తకివ్వడం లేదని వాపోతుంది లలిత.


'ఇక జీవితం ఉద్వేగ పూరితమై, ఉత్తుంగ తరంగమై- పార్ట్ 14' చదవండి.


ఢిల్లీ నగరంలో పండగరోజులు ఒకటి తరవాత ఒకటిగా ఆకాశ తోరణాలలా ప్రవేశించి సందడి చేయసాగాయి. ఇక రానున్నది, మరుసటి నగర మహోత్సవం హోళీ రంగుల పండగ జాతరలా రావలిసిందే! ఇక నగరాన్ని రంగులమయం చేసి మేళతాలాలతో మిన్నూ మన్నూ యేకం కావలసిందే--


ఒక రోజు ఉదయం అనుకోకుండా చెప్పాపెట్టకుండా రూపవతి రామభద్రం ఇంటికి వచ్చింది. మెడకు చుట్టుకున్న స్కర్ఫ్ ని వదులు చేస్తూ- ఇయర్ మఫ్ ని తీసి చేతిలోకి తీసుకుంటూ గ్లవ్స్ ని ఊడతీసుకుంటూ డోర్ బెల్ నొక్కింది.


ఆమెను చూసిన వెంటనే భద్రం అమ్మానాన్నలిద్దరూ లేచి చేతులు జోడించి ఎదుర్కోలు పలికారు. వాళ్ళు చూపించిన మన్ననకు ఆమె నిజంగానే చిన్నబుచ్చుకుంది- చిన్నగా మందలించింది కూడాను--


“మీరిద్దరూ పెద్దవారు. మా అమ్మానాన్న లంతటి వారు. మీరలా నాకు చేతులెత్తి నమస్కరించే ముందు నా ఆయుష్షు గురించి కూడా కొంచెం ఆలోచించాలి కదా! ”


అప్పుడు తాయారమ్మే మాట కలిపింది. “దేవత వంటి నీ వంటిదానికి పొర్లు దండాలు పెట్టినా సరిపోదమ్మా! మమ్మల్నే కాకుండా మా అల్లూడూ అమ్మాయీ బిడ్డా పాపలతో అష్ట కష్టాలు పడుతూ వచ్చినప్పుడు కాదూ కూడదూ అనకుండా నువ్వు ఆదుకున్నావు చూడూ— మరు జన్మగాని ఉంటే నీ కడుపున పుట్టాలని ఉందమ్మా! ”


“మరు జన్మలోనైనా నా కడుపు పండలని కోరుకుంటున్నారు చూడండీ- ఇది నాకు బాగా నచ్చింది. ఏవీ-- మీరు తింటున్నమాత్రలూ బిళ్లలు ఓపారి చూపించండీ” అంటూ కుర్చీలో కూర్చుంది.


ఆ లోపల కాంతం భవ్యంగా ప్లేటులో బిస్కట్లు పెట్టి మంచి నీళ్ళ గ్లాసు తీసుకు వచ్చి అందిచ్చింది. దానిని నిశ్శబ్దంగా అందుకుంటూ తాయారమ్మ చేతినుండి మందుబిళ్లల స్ట్రిప్స్ తీసుకుని పరీక్షిస్తూ అంది- “దీనిని బట్టి తెలుస్తూనే ఉంది మీరు కరెక్టుగా కరెక్ట్ టైముకి మందులు తీసుకుంటున్నారని— కాని మీ ఆరో గ్యం విషయంలో మరొక అంశం ఉంది ఆంటీ! ఆరోగ్యం మందుల వల్ల కొంతవరకే కుదుటపడుతుంది. మిగతాదంతా మీ వల్ల మీరే పుంజుకోవాలి.


తప్పని సరిగా ఉదయం ఒకసారి సాయంత్ర మరొకసారీ నడక సాగించాలి. అంకుల్ గారికి ఫిజియో థెరపిస్ట్ ఇచ్చిన సలహా ప్రకారం ఆయనను కూడా బైటకు తీసుకువెళ్తుండాలి. ఏరీ కుర్రకాయలిద్దరూ-- “ అంటూ హోమ్ వర్కు చేసుకుంటూన్న ఇద్దరి వద్దకూ తానూగా లేచి వెళ్లి రెండు చాక్లెట్ బార్ లు అందిచ్చి అక్కున చేర్చుకుంది.


వాటిని అందుకున్న వెంటనే పెద్దోడు వాసుదేవరావు, చిన్నోడు వేంకటేశమూ ముక్తకంఠంతో “థేంక్యూ ఆంటీ! ” అంటూ ఆమె ముందు తలలు వంచుకుని నిల్చు న్నారు.


మొన్నొకరోజు ఇద్దరూ ఆమెతో మెస్సులోనే రోజంతా ఉండటాన మునుపటి బెరుకుకి దూరమై ఆమెకు దగ్గరయి ఆమెతో ఇమిడిపోసాగారు. వాళ్ల ఆప్యాయతకు స్పందించిందామె- “చాక్లెట్లు తీసుకుని థేంక్స్ చెప్తే చాలదురోయ్! నేను ఇక్కడ ఒంటరిదానిని. రేపు నాకు తోడుగా ఉండమంటాను- ఉంటారా? ”


ఇద్దరూ భవ్యంగా తలలూపారు. అప్పుడు అందామె- “ఇప్పుడు మీరు చూస్తూన్న టీ వీ సెట్ చిన్నది. నా వద్ద ఒక పెద్ద టీవీ సెట్ అదనంగా ఉంది. రెండు రోజుల్లో ప్యాక్ చేసి ఎలక్ట్రీసియన్ తో పంపిస్తాను. సరేనా! ” అంటూ గోడకు వ్రేలాడుతూన్న తన చిత్రపటం వేపు ఓసారి దీర్ఘంగా చూసి తలవంచుకుంది. తనంటే ఈ యింటిల్లపాదికీ యెంతటి అభిమానం!


టీవీ ఊసు విన్నంతనే కాంతం కళ్లూ పిల్లకాయలిద్దరి కళ్ళూ ఫెళ్ళున మెరిసాయి. అప్పుడు కాస్తంత ఎడబాటు తరవాత ఈజీ చైర్లో సర్దుకుంటూ రాఘవయ్య అన్నాడు-- “చూసావమ్మా! పెద్ద టీవీ ఊసెత్తగానే ఇంటి ముంగిట యెంతటి కళ పరచుకుందో! వాళ్ళబామ్మ తిరుపతి బ్రహ్మోత్సవాలు శ్రీశైలం శివ పార్వతుల కళ్యాణోత్సవాలు యెక్కువగా చూస్తుంటుంది”


అందరూ నవ్వుతుండగా రూపవతి వెళ్ళి సోపాలో యథా స్థానంలో కూర్చుంది. అప్పుడక్కడకి రామభద్రం స్నానం ముగించి వచ్చి- “మీరా మేడమ్! ఎప్పుడొచ్చారు? వెండీ జరీ అంచు మైసూరు పట్టుచీర కట్టుకున్నట్టున్నారు విశేషమా మేడమ్?" అని అడిగాడు.


“ఔను. విశేషమే! శ్రావణ మాసం చివరి శుక్రవారం కదూ- గౌరీ వ్రత మహోత్సవం. పాలాభిషేకం చేయించడానికి అమ్మవారి గుడికి వెళ్ళాను. మీరు నాకు తోడుగా వస్తారని- నాకు పూలూ పళ్లూ తెచ్చిస్తారని మీకు మూడు సార్లు ఫోను చేసాను నిన్నరాత్రి. మీరు ఉలక లేదు. పలకలేదు. ఇంతకీ యెక్కడికెళ్ళారు? ”


“సారీ మేడమ్! సెల్ ఫోను ఇంట్లో పెట్టి వెళ్లిపోయాను”

“అది సరే- ఇంతకీ యెక్కడికి వెళ్ళారని?"

“కరోళ్ బాగ్ దాటి వెళ్లాల్సి వచ్చింది. సెంట్రల్ హెల్త్ డిపార్టుమెంటు వారు ఇ యెస్ ఐ ప్రక్కన ఫార్మసీ షాప్ తెరిచారు. మందులు కంట్రోల్ ధరలకి ఇస్తున్నారు. అమ్మకీ బాబుకీ మందులు కొనాలి కదా! అన్నీ ఖరీదైన లైఫే సేవింగ్ డ్రగ్సే కదా! కొంచెం తక్కువ ధరలకి ఇస్తారని క్యూలో నిల్చున్నాను. నానుండి స్పందన లేదని కోపగించుకోలేదు కదా! ”


రూపవతి మాట్లాడలేదు. చెదరని నవ్వుతో విస్ఫారిత నేత్రాలతో అతడి ముఖంలోకి తదేకంగా చూడసాగింది. అతడు ఆమె చూపుల నుండి చూపులు మరల్చుకుని ఉలికి పాటుతో వెనక్కి తిరిగి చూసాడు. అత్తా కోడళ్ళిద్దరూ చూపు తిప్పుకోకుండా నిశ్శబ్దంగా నిగూఢంగా రూపవతినే తదేకంగా చూస్తూ నిల్చున్నారు. అతడికి ఆశ్చర్యంతో బాటు ఒకింత అసహనం కూడా కలిగింది.


”ఇందులో అంతగా చూడాల్సిందే ముంది? రూపవతి కట్టుకున్నది పట్టు చీరేగా! అంతకు మొందెప్పుడూ చూడనట్టు దీనిని అంతగా గుచ్చి గుచ్చి చూడటానికేముంది? రూపవతి కట్టుకున్నది ఖరీదైన మైసూరు పట్టుచీరే కావచ్చు. కాని అంతగా పట్టి పట్టి చూడటం సభ్యతకు భంగపాటు కదూ! ” అనుకుంటూ, మనసు పొరన పరిపరి విధాల తలపోస్తూ వాళ్లిద్దరూ చూస్తూన్న దిక్కున చూపులు సారించాడు అసంకల్పితగా--.


అప్పుడు గాని అతడికి తెలిసి రాలేదు. ఇద్దరాడాళ్లూ కన్నార్పకుండా తేరిపార చూస్తున్నది రూపవతి కట్టుకున్న పట్టుచీర వేపు కాదని- మెడన మెరుస్తూన్న వజ్రాల హారం వేపూ కాదని-- ఉబ్బి పైకి కనిపించీ కనిపించని రీతిన గుండ్రంగా లేచిన రూపవతి పొత్తి కడుపు వైపునని. అతడు ఖంగుతిన్నట్టయాడు. ఇది చెప్పడానికే కాబోలు రూపవతి తనను ఉదయమే గుడికి రమ్మనమని చెప్పడానికి రాత్రి అన్ని సార్లు ఫోను చేసింది!


అతడి గుండె ఉన్నపళాన నిట్టూర్చింది. మెల్లగా కదలి వెళ్లి రూపవతి ప్రక్కన యాంత్రికంగా చోటు చూసుకని కూర్చున్నాడు. ఆమె కుడిచేతిని తన రెండు చేతుల్లోకి అందుకుని అన్నాడు- “రియల్లీ సారీ రూపవతీ! రాత్రి కరోళ్ బాగ్ వేపు వెళ్లిపోయి నీ కాల్ మిస్సయాను. రియల్లీ సారీ! ”


ఆమె యేమీ అనలేదు. గుడినుండి తెచ్చుకున్న మాఁవిడాకు నుండి కుంకుమ తీసి అతడి నుదుట పూసింది. అమ్మవారి ప్రసాదం అందించింది.


ఈసారి అత్తాకోడళ్లతో బాటు రాఘవయ్యకూడా కన్నార్పకుండా ప్రక్క ప్రకనే కూర్చున్న కొడుకునీ రూపవతీనీ మార్చి మార్చి చూడసాగాడు. అప్పుడు వాళ్ళ కళ్ళకు రూపవతిలో యజమానురాలి హుందాతనం ఏ కోశానా కనిపించడం లేదు. అదొక అనుపమ అనురాగ స్రవంతి కదూ! ఎవరొచ్చి ఆడ్డుకున్నా ఆగని గంగా ప్రవాహం కదూ!


ఇక పైన జీవితం ఇలానే ఉంటుంది మరి, ఎవరి అదుపుకీ అందని రీతిన-- ఇలానే ముందుకు సాగిపోతుంది బ్రతుకు బాటలోని యెగుడు దిగుళ్ళ గులక రాళ్ళను దాటుకుంటూ--- వాళ్ళిద్దరి మధ్యా క్రమ క్రమంగా పల్లవించనారంభించిన సుమదళ పరిమళాల వీచికల గురించి వాళ్ళకు అంతవరకూ తెలియదేమో! తెలిసినా తెలియనట్టు భావ ప్రకటన కనిపించేలా మెసలు కుంటున్నారేమో!


కోడలూ అత్తమామలిద్దరూ ఏదో చెప్పాలనే అనుకుంటున్నారు. కాని- చెప్పలేక పోతున్నారు. ఏదో అడగాలనే అనుకుంటున్నారు. కాని— అడగలేకపోతున్నారు. నోటి మాట కంటే ఉదయకాల నిశ్శబ్ద ప్రవాహం వంటి మౌనం అర్థవంతమైనదీ నిగూఢమైనదీ అంటారు అందుకేనేమో!


ఇది ఆట కదరా-- బ్రతుకాట కదరా! బొంగరాల తిప్పుడు పోరాటంలో రథ చక్రాల హోరులో ఊహకందని విచిత్ర సయ్యాట కదరా!

----------------------------------------------------------

బ్రతుకు తీగెలు(రచనకు నేపధ్యం)


నేను కొన్నేళ్ళకు ముందు మా డిపార్టుమెంటు వాళ్ళు నిర్వహించిన అఖిల భారత అకౌంట్సు పరీక్షల్లో ఉత్తీర్ణుడనయిన తరవాత నన్ను ఢిల్లీ హెడ్ క్వార్టర్సులో సూపరింటెండుగా నియామకం చేసారు. అప్పుడక్కడ వాస్తవంగానే దక్షిణ భారతీయులు అధికంగా నివసించే కరోళ్ బాగ్ లో ఉండవలసి వచ్చింది—ఒంటరిగానే—అక్కడ మహదేవన్ అనే మెస్సులో రూము తీసుకుని ఉండేవాణ్ణి కొంతమంది సహ రూమ్ మేట్సుతో కలసి.


నిజంగా అక్కడ పంజాబీలు- ఉత్తరాది వాళ్ల ఉనికి ఎక్కువ కాబట్టి నేను నదినుండి తీరానికి విసిరి వేయబడ్డ చేపలా తల్ల డిల్లేవాణ్ణి. ఆఫీసులోనూ బైటా అన్ని చోట్లా దాదాపు స్త్రీ పురుషులందరూ గోదుమ రంగులోనే గోచరించేవారు. పంజాబీ హిందీ భాషల్లోనే మాట్లాడుతూ ఎదురు వచ్చేవారు. నాకు నా తోటి రూము మేట్సుకీ పంజాబీ మాట అటుంచి హిందీ కూడా వచ్చేది కాదు. ఎందుకంటే—ప్రమోషన్ తీసుకుని వచ్చిన వాళ్ళమంతా దక్షిణాది వాళ్లమే—


అప్పుడక్కడ మేమందరమూ ప్రతి సాయంత్రమూ గుమికూడి మనసార తెలుగులో మాట్లాడుకునేది మహదేవన్ మెస్సులోనే—అప్పుడు నా వయసు దగ్గర దగ్గర ముప్పై నాలుగుంటాయి. కష్టాలతో కలబోసినా అప్పటి జ్ఞాపకాలన్నీ యుక్త వయసులోని మధురాను భూతులే—అచ్చటి చుట్టు ప్రక్కల పరిసరాలను చూసి స్నేహ పరిమళాలను అనుభవించి వ్రాసినదే ఈ చిన్నపాటి నవల—


ఇక ఇప్పటి నా సాంగత్యం గురించి-- చదవుతూ గడపడమే—ఎందుకంటే ఏడేళ్ల క్రితమే ఉద్యోగ విరమణ చేసాను.


నా ఉద్యోగ విరమణ గురించి ఒక చిన్న మాట చెప్పాలి. మా స్వస్థలం విజయనగరమైనా ఉద్యోగ రీత్యా స్థిర పడింది చెన్న ప్పట్నంలోనే! అఖిల భారత సర్వీసు కాబట్టి నేను రాజస్థాన్ నుండి గుజరాత్ వెళ్లి(అక్కడ భూకంపం మత కలహాలు సంభవించి నప్పుడు నేనక్కడే ఉన్నాను) అక్కణ్ణించి భాగ్యనగరానికి బదలీపైన వచ్చి ఇక్కడే ఉద్యోగ విరమణ చేసాను. ఇక్కడే స్థిరపడ్డాను,


ఈ నవలలోని పాత్రలు వాటి పేర్లు వాటితో సంబంధం కల్పించిన సంఘటనలు కేవలం కల్పితాలే తప్ప—ఎవరినీ ఉద్దేశించి వ్రాసినవి కావని తెలియ చేస్తున్నాను.

- పాండ్రంకి సుబ్రమణి


=======================================================================

సమాప్తం

ఇక జీవితం ఉద్వేగ పూరితమై - ఉత్తుంగ తరంగమై ధారావాహికను ఆదరించిన మా ప్రియమైన పాఠకులకు మనతెలుగుకథలు.కామ్ తరఫున, రచయిత శ్రీ పాండ్రంకి సుబ్రమణి గారి గారి తరఫున మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము.

=================================================================================

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.




40 views0 comments
bottom of page