top of page

నమ్మకం విలువ - పార్ట్ 2


'Nammakam Viluva Part 2/3' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla

'నమ్మకం విలువ - పార్ట్ 2/3' తెలుగు పెద్ద కథ రెండవ భాగం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ

మిలటరీలో పని చేస్తున్న దీపక్ ని, ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అపర్ణ.

వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు.

కొడుకు నామకరణం రోజున డ్యూటీలో జాయిన్ కమ్మని దీపక్ కి టెలిగ్రామ్ రావడంతో బయలుదేరుతాడు.

చైనాతో జరిగిన యుద్ధంలో దీపక్ కనబడకుండా పోతాడు.

ఉద్యోగంలో చేరిన అపర్ణకు పవన్ పరిచయమౌతాడు.

తాను దీపక్ రాకకోసం ఎదురు చూస్తున్నట్లు అతనికి స్పష్టం చేస్తుంది అపర్ణ.


ఇక నమ్మకం విలువ - పార్ట్ 2 చదవండి.


“అరెరే .. మీరు అపార్థం చేసుకుంటున్నారు, మీ నమ్మకాన్ని నేను వమ్ము చేయడంలేదు, నేను ఎవరులేని ఏకాకిని మీలాంటి ఉత్తమురాలికి ఏ విధంగా సహాయం

చెయ్యగలనా అని అనుకున్నాను, మీకు ఎలాంటి సహాయం కావాలన్న సంకోచం లేకుండా నన్ను అడగండి ఒక స్నేహితుడిలాగా,” అన్నాడు పవన్.


“ పవన్ గారు మీరు నిజంగా నాకు స్నేహితుడిలాగా ఉండగలరా? నేనిప్పటివరకు ఎవరిని ఏది ఆశించలేదు, ఒంటరి ఆడవాళ్ళకు రక్షణ కావాలి మీ నుండి నాకు దొరుకుతుందా,” పవిత్రమైన మనసుతో అడిగింది అపర్ణ.


“తప్పకుండా అపర్ణగారు .. నేను ఇప్పటివరకు ఎవరికి ఉపయోగపడిందే లేదు,

మీకు ఎప్పుడు ఏ సహాయం కావాలన్నా ఆత్మీయుడిగా నాకు చెప్పండి,” సంతోషంతో

చెప్పాడు పవన్.


“చాలా చాలా ధన్యవాదాలు పవన్ గారు, ఇక ఇప్పటినుండి మన మధ్య గారు అండీలు

ఉండకూడదు ఏమంటారు,” నవ్వుతూ అడిగింది అపర్ణ.


“అదిగో మళ్ళీ రు అన్నావు కదా అపర్ణ,” తను నవ్వుతూ అడిగాడు ఇద్దరు నవ్వుకున్నారు. ఆరోజు నుండి అపర్ణకు చేదోడు వాదోడుగా ఉంటూ తనను కంటికి రెప్పలా

చూసుకుంటున్నాడు. అపర్ణకు ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. తల్లి తండ్రి ఊర్లో పనులున్నాయంటూ వెళ్ళినప్పటినుండి బాబును చూసుకుంటూ ఒంటరిగా ఉండడంతో

మనసులో భయం చోటుచేసుకుంది. బాబుకు రెండో ఏడు వచ్చింది మాటలు వస్తున్నాయి. అమ్మా.. నాన్న కావాలి అని అడగడం మొదలుపెట్టాడు. వాడికి ఊహ తెలిసినప్పటినుండి పవన్ తో చాలా దగ్గరయ్యాడు. పవన్ కు బాబు ప్రణయ్, అపర్ణ వీళ్ళ లోకంలోనే మునిగిపోయాడు. స్వంత తోబుట్టువు కూడా అంత బాగా చూసుకోరేమో

అన్నంతగా కలిసిపోయాడు. కాలచక్రం గిర్రున తిరిగి దీపక్ వెళ్ళి మూడో సంవత్సరంలో అడుపెట్టింది.


“ టెలిగ్రాం,” అన్న పిలుపుతో పరుగున వచ్చి అందుకుంది అపర్ణ. టెలిగ్రాం చూడగానే దీపక్ వచ్చినంతగా సంబరపడిపోయింది. అంతలోనే ముఖంలో భయాందోళనలు చోటుచేసుకున్నాయి. అందులో ఏముందో ఏమి వినవలసివస్తుందోనని భయంతో అలాగే నిలబడిపోయింది.


“ ఏమైంది అపర్ణ .. ఎక్కడినుండి వచ్చింది టెలిగ్రామ్ ఏది నన్ను చూడని,” అంటూ అపర్ణ

చేతిలోనుండి తీసుకుని చూసాడు. “ ఏయ్ అపర్ణ .. నాలుగురోజుల్లో మీ ఆయన వస్తున్నాడట, అందుకే టెలిగ్రామ్ ఇచ్చాడు ఇంకేం మనందరం సంబరాలు చేసుకోవచ్చు,”

సంతోషంతో అన్నాడు పవన్.


“ నిజమా .. ఆయన వస్తున్నారా? అబ్బా ఎంతటి శుభవార్త, పవన్ మనకు బోలెడంతా

పని ఉంది, ఇల్లంతా సర్దాలి బజారుకు వెళ్ళి సామాన్లు తేవాలి, అలాగే ఆయనకు సంబంధించిన బట్టలన్నీ తేవాలి, ఆ అన్నట్టు మా ఆయన కూడా సుమారుగా నీ అంతే

ఉంటాడు కాబట్టి నీ సైజు తేవచ్చేమో, ఓరేయ్ చిన్నా .. మీ నాన్న వస్తున్నాడురా, నీకు

బోలెడన్ని బొమ్మలు తెస్తున్నాడేమో,” అంటూ చిన్నపిల్లలా సంతోషపడిపోతూ కొడుకును

ముద్దులతో ముంచెత్తింది.


“అపర్ణ.. మీ ఆయన వచ్చాక నన్ను దూరం పెడతారా,” బాధపడుతూ అడిగాడు పవన్.


“పవన్ నీకెందుకొచ్చింది ఈ ఆలోచన, ఇన్నాళ్ళుగా తోబుట్టువు కంటే ఎక్కువగా చూసుకున్నావు, ఏ ఒక్కరైనా మా బంధువుల్లో ఎలా ఉన్నావు అంటూ అడిగిన పాపాన పోలేదు, ఏ రక్తసంబంధం లేకపోయినా మాకు అండగా నిలిచావు, అలాంటి నిన్ను ఎందుకు దూరం చేసుకుంటాను చెప్పు,” అడిగింది ఆప్యాయంగా కళ్ళలో నీళ్ళు ఉబికివచ్చాయి అపర్ణకు.


“ఏయ్ అపర్ణ నేనేదో ఊరికే తమాషాకు అన్నాను అంతమాత్రానికే ఆ కన్నీళ్ళేంటి,”

తను కళ్ళు తుడుచుకుంటూ అడిగాడు. సరిగ్గా నాలుగురోజులనాడు ఇంటి ముందు

మిలటరీ జీపు ఆగింది. ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఎదురుచూస్తున్న అపర్ణ ఒక్క

ఉదుటన పరుగెత్తుకుంటూ వచ్చింది భర్తకోసం. జీపులోనుండి జవాను దిగి చేయి అందించాడు దీపక్ కు. తడుముకుంటూ కర్ర సాయంతో కిందకు దిగాడు దీపక్.

నల్లటి అద్దాలవెనుక అంతా చీకటిమయం ఏమి కనిపించడంలేదు. దీపక్ పరిస్థితి చూసి హతాశురాలైంది అపర్ణ. తను చూస్తుంది తన దీపక్ నేనా ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు. మనసంతా గందరగోళంగా అయిపోయింది. తట్టుకోలేక పరుగెత్తుకుంటూ వెళ్ళి దీపక్ ను గట్టిగా పట్టుకుంది.


“ఏమండి ఏంటండి ఇది .. మీకు కళ్ళు ఎలా పోయాయి, దేవుడా ఎంత అన్యాయం చేసావు,” అంటూ బోరుమని ఏడవసాగింది.


“అపర్ణ.. నేను నేను ఎవరిని చూడలేని గ్రుడ్డివాడిని, నిన్ను కంటికి రెప్పలా కాపాడలనుకున్న నేను గుదిబండలా నీ మెడకు పడతానని అనుకోలేదు, ఎలా ఉన్నావు

అపర్ణ.. మన బాబు ఏడి,” అడిగాడు అపర్ణను తడుముతూ.


“అపర్ణ .. ఏంటిది మీ ఆయనను ఇంటిలోకి తీసుకరాకుండానే బయటనే నిలబెట్టి

ఆయనను బాధపెడుతున్నావు, ముందు లోపలికి రండి ఇదిగో నువ్వు బాబును తీసుకో,

నేను దీపక్ గారిని తీసుకవస్తాను,” అంటూ దీపక్ ను చెయ్యి పుచ్చుకుని లోపలికి తీసుకవచ్చాడు పవన్. కొత్త గొంతు వినే సరికి దీపక్ హృదయంలో ఎక్కడో ముల్లు గుచ్చుకున్నట్టయింది.


“అపర్ణ .. నేనొకటి అడుగుతాను నిజం చెబుతావా? నేను అడగచ్చో లేదో నాకు అర్ధం కావడంలేదు,” చెప్పడం ఆపాడు దీపక్. ఇంటికి వచ్చి నాలుగురోజులవుతుంది ఎవరో ఒకరు రావడం దీపక్ ను చూసి వెళ్ళడం హడావుడిగా అయిపోయింది. అపర్ణకు ఊపిరి సలపనంత పని మీదపడింది. బాబును పవన్ చూసుకోవడంతో కొంత ఊరట కలిగింది అపర్ణకు. పవన్ అపర్ణకు దగ్గరుండి అన్ని సహాయం చేస్తుంటే ఇంటికి వచ్చిన వాళ్ళు తలోరకంగా దీపక్ ముందే అనుకునేవాళ్ళు.


దీపక్ మనసు పరి పరి విధాలుగా ఆలోచించడంమొదలుపెట్టింది. ఇన్నాళ్లు తను లేడు. వస్తానో రానో కూడా తెలియదు. ఒంటరిగా ఉండలేకా పవన్ కు దగ్గరయినట్టుంది. ఇప్పుడు నేను వచ్చినా కళ్ళు కనిపించవు కనుక వాళ్ళ ఆటలు అలానే సాగుతాయి. ఛీ ఛీ అపర్ణ ఇంతకు తెగిస్తదనుకోలేదు నా కోసం ఎన్నాళ్ళైనా ఎదిరిచూస్తుందనుకోని, రెక్కలుకట్టుకుని వాలిపోయాను ముందే అపర్ణ విషయం తెలిసుంటే ఇంతదూరం రాకుండానే ఉండేవాడిని. ఇది విన్నప్పటినుండి నా మనసు కుతకుతలాడుతుంది మనసులో బాధపడపతూ తలపట్టుకుని కూర్చున్నాడు దీపక్.


“ఏమండి .. తలనొప్పిగా ఉందా ? జండుబామ్ రాస్తానుండండి,” తేవడానికి వెళుతుంటే.


“అపర్ణ .. నాకేం తలనొప్పి లేదు నీ సేవలు నాకేం అవసరంలేదు, ఉన్నారుగా నీ సేవలు అందుకునేవాళ్ళు,” చిటపటలాడుతూ అన్నాడు దీపక్.“ ఏమంటున్నారు మీరు .. ఎందుకంతా కోపంగా ఉన్నారు, వచ్చినప్పటికంటే ఇప్పుడు చాలా చిరాకు పడుతున్నారు, నేను మిమ్మల్ని సరిగా చూసుకోవడంలేదా? ఏమైనా ఇబ్బందిగా ఉంటే చెప్పండి హాస్పిటల్ కు వెళదాము, అందరు వచ్చి మిమ్మల్ని పరామర్శించి వెళుతుంటే బాధగా ఉందా? చెప్పండి,” అంటూ భర్త చెయ్యి పట్టుకుంది లాలానగా.


ఒక్కసారిగా అపర్ణ చేతిని విదిలించికొట్టాడు కోపంగా. “నాకు ఎవ్వరిమీద కోపంలేదు నామీద

నాకే కోపంగా ఉంది, నా వాళ్ళు అని నమ్మివచ్చిన నాకు ఇలా పరాయివాడిలా అయిపోతానని అనుకోలేదు, నాకోసం ఎన్నాళైనా కాచుకుని ఉంటావనుకున్నాను, ఇలా పక్కదారులు పడతావని తెలిసుకోలేకపోయాను, ఛీ ఛీ నీ నీడనే నేను భరించుకోలేకపోతున్నాను నీతో కలిసుంటానని ఎలా అనుకున్నావు, ఆనాథ శరణాలయాలు చాలానే ఉన్నాయి, నా అంధకార జీవితం అక్కడనే గడుపుతాను,” అంటూ వెళ్ళడానికి లేచి నిలబడ్డాడు కొత్తచోటు తూలి కిందపడబోయాడు. గబుక్కున పట్టుకున్నాడు పవన్ అప్పటివరకు దీపక్ మాట్లాడుతున్నదంతా విని.


స్థాణువులా నిలబడిపోయి దీపక్ నే చూస్తున్నది. పవన్ అపర్ణ వైపు చూస్తూ, నువ్వు కాసేపు ఆగు నేను మాట్లాడుతాను అంటూ సైగ చేసాడు.


“దీపక్ గారు .. మీరిలా ప్రశాంతంగా కూర్చోండి ముందు, మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు అపర్ణ పవిత్రమైన మనసుతో మీకు సేవలు చేస్తున్నది, మీరనవసరంగా ఏదేదో ఊహించుకొని తనను బాధపెడుతున్నారు,” అనునయంగా చెబుతూ మంచం మీద కూర్చోబెట్టాడు దీపక్ ను.


“నీ గీతోపదేశాలు వినడానికి నేను సిద్ధంగా లేను, తప్పు చేసిన ప్రతివాడు నీతులు బోధిస్తాడు, గురివింద తన నలుపు ఎరగనట్టు చూసేవి నిజం కాదనుకుంటారు, ఎప్పుడు చూసినా నా ఇంట్లోనే ఉంటూ కావలసిన సుఖాన్ని పొందుతున్నావు కదా ! అలా చెప్పకపోతే ఇంకోలా నువ్వెందుకు చెబుతావు, నన్నెందుకు ఆపుతున్నావు మీకు అడ్డంగా నేనుండలేను నన్ను వెళ్ళనియ్యి,” అంటూ పవన్ తోసేసాడు ఆవేశంగా.


“దీపక్ గారు .. మీరేమైనా అనుకోండి, గంజాయి వనంలో తులసి మొక్కలాంటిది అపర్ణ.

మీరు తననే అనుమానిస్తే మీకు అంతకంటే పాపం మరొకటిలేదు, మీరు వెళ్ళినప్పటినుండి మీకోసమని ఎదిరిచూడని రోజులేదు, నా అనుకున్న వాళ్ళెవరు పది రూపాయల సాయం చెయ్యలేదు, పసికందును పెట్టుకుని పూట గడవడమే కష్టమైన రోజులు గడిపింది, తన చదువుకు ఉద్యోగం రావడం కూడా కష్టమే, ఎలాగోలా తన తెలివితో చిన్న పాటి ఉద్యోగం సంపాదించుకుంది, మగతోడు లేకుండా బతకడమంటే ఎంత కష్టమో అనుభవించింది, నాకంటూ దిక్కెవరులేని నన్ను తన స్వంత తోబుట్టువులా చూసుకుంటుంది, తోడబుట్టినది కాకపోయినా నేనే తనకు ఒక అన్నగా,

ఒక నాన్నగా తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నాను,” చెప్పడం ఆపి మంచినీళ్లు

తాగాడు పవన్.


“బాగుంది నువ్వు అల్లిన కథ శభాష్, ఇద్దరు కలిసి నాటకం బాగానే ఆడుతున్నారు

ఎలాగు కళ్ళులేవు, మనమేం చెప్పినా నమ్ముతాడని అనుకుంటున్నారు కదూ, చూడండి

నేను పుట్టుకతో గుడ్డివాడిని కాదు నాకు ఎవరెటువంటి వాళ్ళో అన్ని తెలుసు, మీ నంగనాచి కబుర్లకు నేను లొంగిపోతాననుకుంటున్నారా? జరుగు పక్కకు నన్ను వెళ్ళనియ్యి, అంతేకాదు నా రక్తం పంచుకుపుట్టిన నా బిడ్డను కూడా నాతో తీసుకవెళతాను, ఎక్కడ నా బిడ్డా మర్యాదగా వాడిని తెచ్చి నాకివ్వండి,” అంటూ గట్టి గట్టిగా అరవసాగాడు.


“ఏమండి .. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు, నేను ఎలాంటి దానినో మీకు తెలియదా? మీకోసం ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఎప్పడెప్పుడు వస్తారని ఎదురుచూస్తున్నాను, నేను మీరనుకున్నంత దుర్మార్గురాలిని కాదండి నన్ను నమ్మండి,” అంటూ కాళ్ళు పట్టుకుంది అపర్ణ.


“ఛీ ఛీ నీ మొసలి కన్నీళ్ళు చూసి కరిగిపోతాననుకున్నావా? నా కొడుకును నాకు అప్పగించు వెళ్ళిపోతాను,” కాలుతో ఒక్క తన్ను తన్నాడు. అంతదూరంపడిపోయింది.


“అమ్మా.." అంటూ ఏడుస్తూ వచ్చాడు ప్రణయ్. భయంగా తండ్రివైపు వేలు చూపెడుతూ,.

“అమ్మా.. ఈ నాన్న నాకు వద్దు.. నిన్ను కొడుతున్నాడు, మా నాన్న మంచివాడు అన్నావు కదా! నాన్న వచ్చాక నన్ను ప్రేమగా చూసుకుంటాడు అన్నావు, ఇంకేమో మంచి మంచి బొమ్మలు కొంటాడు నేను ఏది అడిగితే అది కొనిస్తాడని చెప్పావు, మరి ఇప్పుడేమో ఈ నాన్నకు ఎందుకంతకోపం నిన్ను చూస్తే,” ముద్దు మాటలతో అడిగాడు తల్లి దగ్గరకు వచ్చి.


“ఉష్.. అలా అనకూడదు నాన్నను మీ నాన్నకు నా మీద కోపంలేదు, నువ్వు బయటకు వెళ్ళి ఆడుకో పో,” అంది కొడుకుతో లాలనగా.


“కాదు.. నాన్న నిన్ను కాలితో తన్నాడు నేను చూసాను, అదిగో పవన్ మామ కూడా చూసాడు, నాన్న వచ్చినప్పటినుండి కోపంగానే ఉన్నాడు నిన్ను కొడితే నాకు ఏడుపువస్తుంది,” తల్లిని పట్టుకుని బోరుమని ఏడిచాడు చిన్న హృదయం తట్టుకోలేక.


దీపక్ మనసంతా గందరగోళంగా అయింది. చిన్నపిల్లవాడి ముందు తనొక రాక్షసుడిలా ప్రవర్తించానని బాధపడసాగాడు. కొడుకును అక్కున చేర్చుకుని తన కర్మ ఇలా ఉందేంటని

విలపించసాగింది అపర్ణ. తన వల్లనే ఈ కుటుంబానికి కలతలు వచ్చాయని మనసులో రోదించాడు పవన్. ఎవరి మనసుల్లో వాళ్ళు పడే బాధకు ఎవరు పరిష్కారం చెప్పాలో ఎవరికి అర్థం కాకుండా ఉన్నది. ఎవరు ఎవరితో మాట్లాడకుండా మౌనంగా ఉండసాగారు.

=================================================================================

ఇంకా ఉంది..

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.
30 views2 comments

2 Comments


@sowmyakoride9848 • 35 minutes ago

Chala bagundi story

Like

@nagajyothimalekar6663 • 1 day ago

చాలా బాగుంది కథ లక్ష్మి గారు

Like
bottom of page