top of page

నమ్మకం విలువ - పార్ట్ 3


'Nammakam Viluva Part 3/3' - New Telugu Story Written By Lakshmi Sarma Thrigulla Published In manatelugukathalu.com On 09/10/2023

'నమ్మకం విలువ - పార్ట్ 3/3' తెలుగు పెద్ద కథ చివరి భాగం

రచన : లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

జరిగిన కథ


మిలటరీలో పని చేస్తున్న దీపక్ ని, ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది అపర్ణ. వాళ్లకు ఒక కొడుకు పుట్టాడు.

కొడుకు నామకరణం రోజున డ్యూటీలో జాయిన్ కమ్మని దీపక్ కి టెలిగ్రామ్ రావడంతో బయలుదేరుతాడు. చైనాతో జరిగిన యుద్ధంలో దీపక్ కనబడకుండా పోతాడు.


ఉద్యోగంలో చేరిన అపర్ణకు పవన్ పరిచయమౌతాడు.

తాను దీపక్ రాకకోసం ఎదురు చూస్తున్నట్లు అతనికి స్పష్టం చేస్తుంది అపర్ణ. అపర్ణ, పవన్ మంచి స్నేహితులవుతారు.


యుద్ధంలో కళ్ళు కోల్పోయిన దీపక్ తిరిగి వస్తాడు.

నిష్కల్మషమైన అపర్ణ, పవన్ ల స్నేహాన్ని అపార్థం చేసుకుంటాడు.


ఇక నమ్మకం విలువ - పార్ట్ 3 చదవండి.దీపక్ కి కావలసిన పనులన్నీ నోటమాటాడకుండా చేస్తుంది అపర్ణ. ఇది జరిగి సరిగా వారంరోజులకు పేపర్‌లో ప్రకటన చూసాడు పవన్.


‘రోడ్డు యాక్సిడెంట్ లో ప్రాణాలుపోయిన ముప్పయి ఏళ్ళ అబ్బాయి అవయవాలను దానం చెయ్యడానికి అతని తల్లితండ్రులు ముందుకు వచ్చారు. కావలసిన వాళ్ళు సంప్రదించగలరు’


అన్న ప్రకటన చూడగానే పవన్ కు ఎంతో ఆనందమేసింది. వెంటనే బయలుదేరివెళ్ళి అన్నీ మాట్లాడుకొని వచ్చాడు.


“అపర్ణ .. నీకో శుభవార్త చెప్పాలి, ఇలా ప్రశాంతంగా కూర్చో, ” అంటూ హడావుడి చేసాడు పవన్.


“పవన్! నా బతుక్కు శుభవార్తలు కూడ ఉంటాయా? ఏంటి నీకు పెళ్ళి సంబంధం వచ్చిందా .. అమ్మాయి పోటో ఏది, ” అడిగింది.


“అబ్బా ..నీకెప్పుడు నా పెళ్ళి గోల తప్పా ఇంకేం ఉండదా? అంతేలే, మీ ఆయన వచ్చాడు కదా! ఇక ఈ సోదరుడితో ఏం పని, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోతాడని ఎదిరిచూస్తున్నావు అవునా, ” అడిగాడు ముఖం చిన్నబుచ్చుకుని.


“నీతోని గెలవలేను కానీ విషయం ఏంటో చెప్పు అవతల నాకు చాలా పనివుంది” నవ్వుతూ చెప్పింది అపర్ణ.


“దీపక్ గారికి కళ్ళు దొరికాయి. ఆపరేషన్ చేయించేద్దాము అపర్ణ, నిన్న నేను హాస్పిటల్ కు వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడి వచ్చాను, రేపు ఆదివారం రోజు రమ్మన్నారు. దీపక్ గారిని తీసుకెళ్లి ఆపరేషన్ చేయించేద్దాం, ఆయనకు చూపు వచ్చిందంటే నీ మీద అనుమానాలన్నీ తొలగిపోయి మీ కాపురం చక్కబడుతుందని నా నమ్మకం, ” అన్నాడు.


“ ఉహూ.. పిచ్చి పవన్ .. నీకెందుకయ్యా నా మీదింత ప్రేమ, మనిషికి అనుమానమనే పెనుభూతం పట్టిందంటే అది వదలడం చాలా కష్టం పవన్. ఆయన మనసు చాలా మంచిది. వెన్నలాంటి మనస్తత్వం. కాకపోతే ఆయనకు చుట్టుపక్కల వాళ్ళు, వాళ్ళ అమ్మా

నాన్నలు.. ఆయనకు నా మీద లేనిపోనివన్ని చెప్పి ఆయన మనసు విరిచేసారు. ఇప్పుడు కళ్ళు వచ్చి రాగానే నా మీదున్న అపోహలు తొలగిపోతాయని ఎలా అనుకున్నావు పవన్, చెప్పుడు మాటలు నమ్మినంత తొందరగా మంచిని అర్ధం చేసుకోలేరు, సరే ఏదయితే అది అవుతుంది. ముందు కళ్ళకు ఆపరేషన్ చేయిద్దాము, కానీ పవన్ అంత డబ్బంటే ఎక్కడునుండి తేగలము, ” నిరాశ నిస్పృహలతో అడిగింది.


“ అపర్ణ .. నువ్వు ఆధైర్యపడకుండా ఉండు. నీలాంటి మంచి మనిషికి ఆ దేవుడు అంతా మంచే చేస్తాడు, ఇక డబ్బు విషయమంటావా, నేను నా ఎల్ ఐ సి పాలసీ నుండి డబ్బులు తీసుకున్నాను. మన అదృష్టం కొద్ది కళ్ళు దానంచేసే వాళ్ళు దొరికారు. అదే పెద్ద సంతోషకరమైన వార్త” అంటూ తను హాస్పిటల్ వెళ్ళి మాట్లాడిన సంగతి చెప్పాడు.


“పవన్ .. నువ్వు దాచుకున్న డబ్బంతా మా కోసం ఖర్చుపెడితే, రేపు భవిష్యత్తులో నీకు ఎలా? నువ్వు తప్పు చేసావు పవన్, ఎక్కడైనా అప్పు తీసుకోవలసింది కదా! నాతో

ఒక్కమాటైనా చెప్పలేదు, ఇదిగో నా మెడలో ఉన్న బంగారు పుస్తెల తాడును ఇచ్చేదాన్ని. అనవసరంగా తొందరపడ్డావు, ” అంది కోపంగా.


“అబ్బా.. అంటే నేను పరాయివాడిననే కదా నీ ఉద్దేశ్యం, అపర్ణ.. నేను ఎలాగు ఒంటరివాడిని. నేనేం చేసుకుంటాను ఆ డబ్బును, మంచిపని కోసం ఉపయోగపడుతుంది

అంటే అంతకంటే నాకేం కావాలి చెప్పు? అపర్ణ.. నేనొకటి అడుగుతాను మాటిస్తావా నాకు, ” అపర్ణ కళ్ళల్లోకి చూస్తూ అడిగాడు పవన్.


“పవన్ నువ్వు ఏం అడుగుతావో తెలియకుండానే ఎలా మాటివ్వను, అంటే నా మీద నీకు నమ్మకం లేదా? అది సరేగానీ ఇంతకు ఏం అడగాలనుకున్నావు” అంది నవ్వుతూ.


“మీ ఆయనకు చూపు వచ్చే సమయానికి నేను మీకు దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నాను, కానీ రాఖీపౌర్ణిమ రోజు మాత్రం ఎక్కడున్నా నీ దగ్గరకు వచ్చి రాఖీ కట్టించుకుని వెళ్ళిపోతాను, ఈ ఒక్కమాట కాదనవు కదా నాకోసం ” చెప్పాడం ఆపాడు శూన్యంలోకి చూస్తూ.


ఎంతసేపైనా అపర్ణ నుండి సమాధానం రాకపోయేసరికి తల తిప్పి ఇటువైపు చూసాడు. రెండుచేతులలో ముఖం దాచుకుని వెక్కుతో కనిపించింది అపర్ణ.


“ఏయ్ అపర్ణ .. ఏమైంది ఎందుకేడుస్తున్నావు? ఇప్పుడేమైందని, నేనేమన్నా తప్పుగా అన్నానా? ఏది ఇలా చూడు, ” అంటూ ముందు కూర్చొని తన చేతులను పట్టుకున్నాడు. ఎర్రబడిన కళ్ళతో ముక్కుపుటాలు ఆదురుతుండగా కోపంగా చూసింది పవన్ వైపు.


“నువ్వు మనిషివా బండరాయివా? అసలు మనసనేది ఉందా నీకు, ఏం తక్కువ చేసానని మమ్మల్ని వదిలి పోతానంటున్నావు, నీ డబ్బంతా ఆయనకోసం ఖర్చుచేయాలనుకున్నావు అప్పుడు గుర్తుకు లేదా? మేము పరాయివాళ్ళమని, అవునులే మేమెవరమని మాతో ఉంటావు అలాగే వెళ్ళిపో, మళ్ళి ఎప్పుడు నా దగ్గరకు రావాలని చూడకు” పౌరుషంగా మాట్లాడుతూ లోపలకు వెళ్ళబోయింది.


“అపర్ణ .. దయచేసి అంతింత మాటలనకు. నేనెక్కడున్నా మీ మేలుకోరేవాడినే, నాకు ఈప్రపంచంలో ఉన్న ఆత్మీయులు ఎవరైనా ఉన్నారంటే అది నువ్వే. నా వల్ల మీ కాపురంలో కలతలు వచ్చాయి. ఇంకా నేను ఇక్కడే ఉంటే, దీపక్ గారికి కోపం వస్తుంది. ఆయన మన బంధాన్ని అర్థం చేసుకున్న రోజు నేను మీ దగ్గరకే వస్తాను, కొన్నాళ్ళు దూరంగా ఉంటే సమస్యలన్ని పరిష్కారం అవుతాయని అనుకున్నాను, అంతే అపర్ణ, ” బాధపడుతూ చెప్పాడు పవన్.


“పిచ్చి పిచ్చి ఆలోచనలు మాను పవన్, నీలాంటి ఉత్తముడిని అనుమానించడమంటే ఎంత పాపమో ఆయనకు తెలియదు, కళ్ళుండి చూడలేని గుడ్డి సమాజానికే నిజం తెలియనప్పుడు, కళ్ళులేని అతను ఏది చెప్పినా నమ్ముతాడు, ఆయనకు కళ్ళు వచ్చాక నువ్వేంటో ఆయన కళ్ళతో చూస్తేగానీ నీపై ఉన్న అనుమానం తీరిపోదు, మనం చెయ్యని తప్పుకు బుద్ధి తక్కువగా పారిపోకూడదు పవన్, ధైర్యం నిలబడి నిజం నిరూపించాలి. అప్పుడే మన బంధానికి విలువ, ఇంకెప్పుడు పిచ్చి ఆలోచనలు చేసి నన్ను బాధపెట్టాలని చూడకు. అర్థమైందా” అంటూ పవన్ చెవిని మెలివేసింది.


అనుకున్నరోజు అనుకున్న సమయానికి దీపక్ కంటి ఆపరేషన్ జరిగింది. దీపక్ కళ్ళు తెరిచే సమయానికి ఎదురుగా ఉంటే ఆవేశపడతాడేమోనని పవన్ బయటే ఉండిపోయాడు. అపర్ణ కూడా అతనికెదురుగా ఉండకుండా పక్కకు నిలుచుంది.


ఎందుకంటే డాక్టర్ ముందే చెప్పాడు అతను కళ్ళు తెరిచే సమయానికి ఎలాంటి ఒత్తిడిలు ఉండకుండా చూసుకోవాలని. అందుకోసం జాగ్రత్త పడ్డారు.


“హలో దీపక్ .. ఇప్పుడు నీ కళ్ళకు కట్లు విప్పుతున్నాము, నువ్వు మెల్లిగా కళ్ళు తెరచి ఎదురుగా ఉన్న నన్ను చూడాలి. ఎలా కనిపిస్తుందో చెప్పాలి సరేనా” అడిగాడు డాక్టర్.


“డాక్టర్ .. నేను కళ్ళు తెరిచే సమయానికి ఎదురుగా నా భార్య.. పవన్ ఉండాలి అనుకుంటున్నాను, దయచేసి వాళ్ళను పిలవండి డాక్టర్” చెప్పాడు దీపక్.


“కానీ దీపక్ మీ వాళ్ళెవరు ఇక్కడలేరు, ముందు నీ కళ్ళు ఎలా పని చేస్తున్నాయో చూడాలి కదా! తరువాత వాళ్ళను పిలుస్తాను” అంటూ కట్టు విప్పబోయాడు. ఆపరేషన్ అయిన తరువాత డాక్టర్ దగ్గర దీపక్ ఎలా అనుమానపడుతున్నాడో అన్ని విషయాలు చెప్పాడు పవన్. ఆయన కళ్ళు తెరిచాక ఎలాంటి గొడవచేస్తాడోనని భయంగా ఉందని కూడా

చెప్పాడు.


“సార్ నేను ఇన్నాళ్ళు నిజంగానే గుడ్డివాడినయ్యాను, నా భార్య ఎలాంటిదో తెలిసి కూడా మూర్ఖుడిలా ప్రవర్తించాను, ఇప్పుడు కళ్ళు వచ్చాక కూడా నా అపర్ణను నేను చూడకపోతే మా బంధానికి విలువేలేదు, ఈ కళ్ళతో నేనిప్పుడు నా భార్యను పవన్ చూడాలి, దయచేసి వాళ్ళను పిలవండి, ” అంటూ డాక్టర్ రెండుచేతులు పట్టుకుని బతిమాలాడు.


పక్కనే ఉన్న అపర్ణ వైపు చూసాడు డాక్టర్ ఏం చెయ్యడమా అన్నట్టుగా. ఒక్క పరుగులో వెళ్ళి పవన్ వెంటబెట్టుకుని వచ్చి దీపక్ ఎదురుగా నిలుచున్నారు.


“దీపక్ .. నువ్వునుకున్నట్టుగా మీ వాళ్ళు నీ ఎదురుగా ఉన్నారు, కానీ! నువ్వు కళ్ళు విప్పిన తరువాత ఎలాంటి ఆవేశానికి గురి కాకూడదు, నువ్వు నీ కళ్ళతో లోకాన్ని చూడాలంటే ప్రేమగా కళ్ళు తెరిచి నీ వాళ్ళను చూడు, లేదంటే మేము పడిన కష్టమంతా వృధా అవుతుంది, ” అనునయంగా చెబుతూ కళ్ళకున్న కట్లు విప్పాడు.


మెల్లిగా కళ్ళు తెరిచి చూసాడు మసక మసకగా కనిపించింది. భయపడిపోయాడు కళ్ళు రాలేదోమోనని.


“దీపక్.. ఇలా చూడు కళ్ళను కొంచెం పెద్దగా తెరువు కనిపిస్తుంది, ” చెప్పాడు డాక్టర్.


రెప్పలను టపటపాడించాడు కళ్ళముందున్న మసకలు తొలగిపోతున్నాయి. అతని మనసులో మాలిన్యంలా. మంచంకు కొంచెం దూరంగా నిలుచున్న అపర్ణ ను చూసాడు.


ఆ పక్కనే ఉన్న పవన్ వైపు చూసాడు కళ్ళు ఆనందంతో మెరిసాయి. ముఖాన చిరునవ్వుతో “అపర్ణ .. ఇలా నా దగ్గరకు రావా, ” అన్నాడు చేతులు చాస్తూ.


భాషకందని భావం మనసులో మెదిలి ఉప్పొంగిన హృదయంతో పరుగున వెళ్ళి దీపక్ చేతులను పట్టుకుని తన పెదవులతో ముద్దాడింది అపర్ణ. మనసు ఆనందతాండవం చేస్తుండగా పరవశించిన మోముతో చిరునవ్వు చిందిస్తూ.


“ఏమండి .. మీరు చూస్తున్నారు మీకు చూపు వచ్చింది, విధి మనను విడదియ్యాలని చూసిన ఆ దేవుడికి మన మీద దయ ఉండి మనను కలిపాడు, ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్లకండి, ” కళ్ళవెంబడి ఆనందభాష్పాలు వస్తుండగా చెప్పింది.


“అపర్ణ .. నన్ను క్షమిస్తావా? నేను నిన్ను చాలా కష్టపెట్టాను, ఒంటరిగా ఎన్ని కష్టాలు పడినావోనని ఆలోచంచిక నిన్ను అనుమానంతో అనరాని మాటలన్నాను, అసలు నేను ఇలా బతికి బయటపడ్డాను అంటే అది నువ్వు పెళ్లికి ముందు చెప్పిన ధైర్యమే నన్ను ఇలా బతికించింది, నా కళ్ళు పోయినా నువ్వు నన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసాకుంటావన్న భరోసాతో నీ దగ్గరకు వచ్చాను, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళు నా మనసులో నీ మీద పవన్ మీద విషబీజం నాటారు.


దానితో నేను మంచి చెడు ఆలోచించక నిన్ను అనుమానించాను, నువ్వు నా కోసం ఎదిరిచూస్తావన్న నమ్మకం కోల్పోయాను, ఒంటరిగా బతుకు బండిని లాగుతున్న నీకు ఒక తోబుట్టువుగా నిలిచిన పవన్ కూడా అనుమానించాను, నాలో ఇలాంటి విషపు బుద్ధి ఉంది కనుకనే ఆ దేవుడు నా కళ్ళను పోగొట్టాడు” అంటూ చెప్పడం ఆపాడు దీపక్.


“ఏమండి ఇప్పుడవన్నీ తలుచుకొని బాధపడకండి, మీరు కావాలని ఏది చెయ్యలేదు. మన జాతకంలో ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోవాలి అని రాసి పెట్టి ఉంది, దాన్ని ఎవరు తప్పించలేరు కదా! మీరన్నట్టుగా ఆ దైవం మనయందు ఉన్నాడు కాబట్టి తొందరలోనే మీకు చూపు వచ్చింది, ఈ సమయంలో మీరు హైరానా పడకూడదు. ఇప్పుడే కళ్ళు తెరిచారు, ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా మాట్లాడుకుందాము” అంటూ భర్త చేతిని తన చేతిలోకి తీసుకుంటూ చెప్పింది అపర్ణ.


“అపర్ణ .. నన్ను మాట్లాడనివ్వు నాకేం కాదు నాది రాటుదేలిన శరీరం, పవన్.. ఇలా రా నా ముందుకు” అపర్ణ వెనకాల నిలుచున్న పవన్ ను పిలిచాడు. అడుగులో అడుగు వేస్తూ ముందుకు వచ్చాడు పవన్.


“పవన్ .. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండ పెడుతున్నాను నన్ను క్షమించు” రెండుచేతులు జోడించి ప్రాధేయపూర్వకంగా అడిగాడు.


“అయ్యో మీరలా అనకూడదు ఇందులో నేను చేసిన సహాయం ఏమి లేదు, అపర్ణ మంచితనమే మిమ్మల్ని కాపాడింది అంతే” తడబడుతూ అన్నాడు.


“చూడు పవన్ .. మీరిద్దరు ఇంట్లో మాట్లాడుకున్నది అంతా నేను విన్నాను, అందరుండి కూడా ఒంటరిని చేసిన అపర్ణకు తోడుగా నిలవడమే కాకుండా, నా కోసం ఎంత శ్రమకోర్చి కంటి ఆపరేషన్ చేయించావు, స్వంత మనుషులనే పట్టించుకోని ఈ రోజులలో మా కోసం దాచుకున్న డబ్బంతా ఖర్చుచేసి మానవత్వం చాటుకున్నావు, ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం చెప్పు? నా భార్యబిడ్డలను ప్రాణంగా చూసుకున్నావు ఇంతకంటే ఏమి చెయ్యాలి చెప్పు, ” అడిగాడు పవన్ చేతులను కళ్ళకద్దుకుంటూ.


“దీపక్ గారు .. మీరు ఎక్కువగా మాట్లాడకండి, ఇప్పుడేగా మీ కళ్ళకు కట్లువిప్పారు. కాస్త విశ్రాంతి తీసుకోండి, మీరు ఇంటికి వచ్చాక నాకు వీలునప్పుడు తీరికగా వస్తాను అప్పుడు మాట్లాడుకుందాము, ” అన్నాడు పవన్.


“అదేంటి పవన్ .. నువ్వెక్కడి వెళుతున్నావు, ” ఆశ్చర్యంతో ఇద్దరు ఒకేసారి అడిగారు.


“అపర్ణ .. నేను నా పాత స్నేహితుడు రాము దగ్గరకు వెళుతున్నాను, ఇకనుండి నేను అక్కడనే ఉంటాను. అప్పుడప్పుడు మీ దగ్గరకు వస్తాను, ” తల కిందకు వంచుకొని చెప్పాడు.


“బాగుంది పవన్.. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకుని నన్ను ఇబ్బందిపెట్టాలనుకుంటున్నారు, మీరు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాలి అంతే కదా!

నేనంటూ ఒక మనిషిని బాధపడుతుంది అనే ఆలోచన ఉంటే ఇలా నన్ను వదిలేసి వెళ్ళరు, సరే వెళ్ళు పవన్ కానీ మళ్ళి రావాలని మాత్రం అనుకోకు, ఇప్పటికే నా భర్తతో

చాలా మాటలు పడ్డాను, ” అంది వస్తున్న దుఃఖాన్ని లోలోన అదిమిపెడుతూ.


“అపర్ణ .. ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది, పవన్ వెళ్ళిపోతానంటుంటే పొమ్మంటున్నావేంటి? నేను తప్పు చేసానని ఒప్పుకున్నాను కదా! ఇంకా నువ్వు అదే మనసులో పెట్టుకుని పవన్ ను వెళ్ళిపొమ్మంటున్నావా వద్దు అపర్ణ, పవన్ మనతోనే ఉంటాడు. అతడు వెళ్ళిపోవడం నాకిష్టంలేదు, పవన్ నేను ఏదో పొరపాటులో నిన్ను అపర్ణను అపార్థం చేసుకున్నాను, దానికోసం నువ్వు మీ అక్కను విడిచి వెళ్ళిపోతావా నీకు ఇది న్యాయమనే అనిపిస్తుందా, ” ఆవేదనగా అడిగాడు దీపక్.


ఆశ్చర్యంతో దీపక్ వైపు చూస్తూ “ఏమన్నారు మీరు.. అపర్ణను నాకు అక్క అని కదా! నిజంగా వినడానికి ఎంత బాగుంది, అంటే మీరు నిజంగా అపర్ణను నమ్ముతున్నారు కదూ,

ఓహో ఎంత ఆనందంగా ఉంది. మీరిద్దరు ఇలా కలిసి ఉండాలన్నదే నా కోరిక, ఏయ్ అపర్ణ..

ఇది నిజంగా నీ అదృష్టం కాదు నాది, ఎందుకంటే నేను ఎవరులేని ఏకాకిని. నాకు నా అనే వాళ్ళున్నారంటే ఎంత అదృష్టవంతుడిని, ” పొంగిపోతూ దీపక్ చేతులను కళ్ళకద్దుకున్నాడు ఆనందంతో.


“ఇది నిజం పవన్.. ఇప్పుడు నాకంటే కూడా నువ్వే దగ్గరివాడివి, ఎందుకో తెలుసా? నేను నమ్ముకున్న ఉద్యోగమే నాకు ముఖ్యమనుకుని పొత్తిళ్ళలో ఉన్న చంటిబిడ్డను భార్యను వదిలేసి వెళ్ళిపోయాను వాళ్ళ కర్మకు వాళ్ళను వదిలేసి.


కానీ ఏ సంబంధలేని నువ్వు ఆపద్భాందవుడిలా తోడుగా నిలిచి వాళ్ళను రక్షించావు, కల్మషంలేని మంచి మనసుతో ఆదుకున్నావు, ఇంకా ఇంతకంటే ఏం కావాలి చెప్పు పవన్, నీకు నిజంగా మేము కలిసుండాలి అనుకుంటే ఈ బావ మాట విను, నువ్వింకేమి మాట్లాడినా మిమ్మల్ని విడిచి నిజంగానే నేను దూరంగా వెళ్ళిపోతాను, అప్పుడెలాగు నువ్వే చూసుకోవాలి ఏమంటావు, ” బతిమాలుతున్నట్టుగా అడిగాడు దీపక్.


ఆనందం ఆశ్చర్యంతో దీపక్ ను అపర్ణ ను చూస్తూ కళ్ళు తుడుచుకున్నాడు పవన్.


“ మీరు నిజంగా నాకు అంతటి అదృష్టాన్ని ఇస్తున్నారా ! ఇది నిజమా, అంటే ఇప్పుడు మీరు అక్కా బావ కదా! హే భగవాన్ చూసావా నన్ను ఒంటరివాడినన్నావు కదా.. ఇప్పుడు చూడు నాకు ఒక కుటుంబం ఉంది, ” అంటూ సంతోషంతో పొంగిపోయాడు.


ఆనందంగా ప్రణయ్ తో పాటుగా కలిసి అందరు ఒకే కుటుంబంలా కలిసిపోయారు.


=================================================================================

సమాప్తం

========================================================================

లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ లక్ష్మీ శర్మ త్రిగుళ్ళ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : లక్ష్మి శర్మ త్రిగుళ్ళ

నా గురించి కొన్ని విషయాలు ప్రస్తావిస్తాను, నేను సికింద్రాబాద్ లాలాపేటలో వుంటాను,

నాకు చిన్నప్పటి నుండి కథలు రాయడంమన్న చదవడంమన్న చాలా ఇష్టం, 1991 నుండి రాయడం మొదలుపెట్టాను, ఎక్కడ ఏ పేపర్ కనిపించినా రాసాను, కానీ ఎవరికి చూపలేదు చెప్పుకోలేదు, ఈమధ్యనే మా అమ్మాయిలు మావారు చూసి కథలు బాగున్నాయి కదా ఏదైనా పత్రికకు పంపమంటే పంపంస్తున్నాను, కర్నూలు గణేశ్ పత్రిక లో నేను రాసిన కవితలు కథలు చాలా వచ్చాయి.ఈ మధ్యలో నేను రాసిన కథలన్నీ ( మబ్బులు వీడిన ఆకాశం ) అనే కథల సంపుటి వచ్చింది, (కిన్నెర ఆర్ట్ పబ్లికేషన్స్) వారిచేత.


ఇంకా ముఖ్యంగా, (మన తెలుగు కథలు కామ్) యాజమాన్యం వారి ప్రోత్సాహం , నాకు ప్రశంసా పత్రాలు ఇవ్వడంతో నాలో ఇంకా ఉత్సాహం పెరిగింది.

మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతూ,

లక్ష్మి శర్మ

లాలాపేట సికింద్రాబాద్

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.

37 views0 comments

Comments


bottom of page