top of page

చావులో సుఖం


'Chavulo Sukham' - New Telugu Story Written By Penumaka Vasantha

Published In manatelugukathalu.com On 16/10/2023

'చావులో సుఖం' తెలుగు కథ

రచన: పెనుమాక వసంత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

"ఈశ్వరమ్మ నిన్న పోయిందంటా! ఇయాల ఊరికి తెస్తారంటా!" వూళ్లో వాళ్లకి చెప్పింది సత్తెమ్మ.


"అవునా! మొన్ననేగా వచ్చి వూరికి అందరినీ పలకరించి పోయింది" అంది కోటమ్మ.


"అయ్యో! ఇంతలోకే ఏమైం”దని అందరూ చెవులు కొరుక్కుంటున్నారు. ఇంతలో వాన్ వచ్చింది సిటినుండి. వానులో నుండి ఈశ్వరమ్మను తీసి సొంతింటి వరండాలో పడుకోపెట్టారు.


ఇద్దరు కొడుకులు కళ్లనీళ్లు తుడుచుకుంటూ ఉన్నారు. ఈశ్వరమ్మ చిన్నప్పటి ఫ్రెండ్స్ చెప్పుకోసాగారు..


‘ఎంత చక్కగా ఉండేది. చిన్నప్పటినుండి కష్టపడటమే కానీ సుఖపడిందిలేదు. వూళ్లో హైస్కూలులో టెన్త్ వరకు చదువుకుంది. ఈశ్వరమ్మ వాళ్లది పెద్ద సంసారము అన్నలు పెళ్ళిళ్ళు చేసుకునిపోయారు. అక్కల పెళ్ళిళ్ళయ్యాయి. చివరి పిల్ల ఈశ్వరమ్మ పెళ్లికి నాన్న మంచంలో ఉంటే ఆస్థీ ఉందని వూళ్లోనేవున్న దూరపు చుట్టం గురవయ్యకు ఇచ్చి చేశారు. మొగుడు పెద్ద బాగోడు. పెద్ద బట్టల షాపు పక్కనున్న పేటలో ఉండేది. నష్టాలొచ్చి పిల్లలు పుట్టే సమయానికి ఆస్తంతా కరిగిపోయింది. గురవయ్యఈశ్వరమ్మను బాగా చూసుకునేవాడు. చివరికి వూళ్లు తిరిగి సైకిల్ పై బట్టలు అమ్ముతుండేవాడు గురవయ్య. ఇంట్లో గడవటం కోసం పొలం పనులకు మాతోపాటు వచ్చేది. చక్కనిదవటంవల్ల చాలామందివెనక బడుతున్నా చూసేదికాదు.


ఒకసారి ఆ వూరి ప్రెసిడెంట్ "ఇంతలా వొళ్ళు కట్టపెట్టుకోవటం ఎందుకు నాకాడ ఉంటే నీకుఇల్లు జరుపుతాగా!" అన్నాడు చుట్ట నోట్లో పెట్టుకుని ఈశ్వరమ్మ వైపు ఆశగా చూస్తూ.


కొడవలి చూపిస్తూ "డబ్బు లేకపోవచ్చు కులం తక్కువ అవొచ్చుకానీ ఒళ్ళమ్ముకునే బుద్దిలేదు. ముందు నీ పెళ్లాన్ని కాపలా కాసుకో. నువ్వు డబ్బు ఇస్తున్నాచాలక ఎవరెంట పడుతుందో చూసుకోండి ముందు తమరూ!" అన్నది.


"నాకే ఎదురు తిరుగుతావా!? ఈ వూళ్లో ఎట్టా బతుకుతావో చూస్తానని" ఈశ్వరమ్మకు ఆవూళ్లో ఆసాముల్ని పొలం పనులు ఇవ్వకుండా చేసాడు ప్రెసిడెంట్. పొలం పనులులేక భర్తకు బేరాలు లేక చాలా ఇబ్బందులు పడింది. ఈలోపు ఈశ్వరమ్మ అన్నయ్య సిటీలో బట్టల షాపులో ఈశ్వరమ్మ మొగుడికి ఉద్యోగం వుంది రమ్మంటే భర్త గురవయ్యను తీసుకుని సిటీ చేరింది.సిటీలో బట్టల షాపులో చేరి గురవయ్య పని చేస్తుంటే ఈశ్వరమ్మఇంటి పైనున్న ఒక మారేజిబ్యూరోలో చేరి వచ్చిన వాళ్లకు గ్రూపువాళ్ళు చెప్పినట్లు పెళ్లిసంబంధాల గురించి మాట్లాడుతూ ఉండేది. పిల్లలిద్దరూ చిన్నపిల్లలు అవటంతో వాళ్ళని స్కూలుకు పంపి భర్తను షాపుకు పంపుతూ కష్టపడేది. పిల్లలు హైస్కూల్ చదువుకు వచ్చేసరికి గురవయ్యకు జబ్బుచేసి చనిపోయాడు. ఇక మొత్తం భారం ఈశ్వరమ్మ మీద పడింది.


తను చేస్తున్న బ్యూరోలో బాగా చేయటంవల్ల ఆ బ్రాంచును ఒక్కతే చూసుకునే స్తాయికు వచ్చింది. పెద్ద పిల్లాడు టెన్త్ అవ్వగానే పాల్టెక్నికులో జాయిన్ చేసింది. అయినా అపుడప్పుడు ఊరికి వచ్చి, ఇల్లు చూసుకుంటూ ఉండేది. ఒక పొర్షన్ అద్దె కిచ్చి, ఇంకో పోర్షన్ తను వచ్చినప్పుడు వుండటానికి ఉంచుకుంది.


మళ్ళీ బ్యూరో నుండి రాగానే ఈవెనింగ్ బట్టలు అమ్ముతూ ఉండేది. పిల్లాడు పాలిటెక్నిక్ అవ్వగానే ఉద్యోగంలో జాయినయ్యాడు. పెద్దపిల్లాడి సాయంతో చిన్న పిల్లాడిని చదివించింది.


ఊరిలో ఈశ్వరమ్మకు తులసమ్మ బెస్ట్ ఫ్రెండ్ వుండేది. తనతోనే తన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉండేది. పెద్ద పిల్లాడుకు బాగా డబ్బున్నమంచి సంబంధం దొరికితే పెళ్లి చేసింది. వాళ్ళని పెళ్లవగానే వేరు పెట్టింది. చిన్నపిల్లాడు కృష్ణా డిగ్రీతో చదువు మానేసి ఫ్రెండ్సుతో తిరుగుతున్నాడు జులాయిగా. ఉద్యోగం చూసుకోరా! అంటే వినేవాడు కాదు.


పెద్దాడు సెటిలయ్యాడు చిన్నాడి గురించి దిగులనేది తులసమ్మతో. ఒకసారి ఈశ్వరమ్మ కొడుకు చిన్నాడు కృష్ణ కనపడతే. "మీఅమ్మ ఇప్పటివరకు మీ గురించి కష్టపడింది. మీరు పెద్దయి మీ అమ్మను పువ్వుల్లో పెట్టి చూసుకోమని చెప్పను కానీ మానసికంగా మీ అమ్మకు బలాన్ని ఇస్తే అది సంపాదించటానికైనా దానికి ఓపిక ఉంటుంది. ఖాళీగా వుండకుండా ఏదొక ఉద్యోగంలో చేరి మీ అమ్మను సంతోషపెట్టూ. కాసేపు పోచుకోలు కబుర్లు చెప్తారే కానీ! నీ ఫ్రెండ్స్ ఎవరూ ఒకపూట తిండి పెట్టరు. మీబాగు కోసం ఇంకా ఉద్యోగం చేస్తుంది మీఅమ్మ" అనిచెప్పటంతో అమ్మ కష్టం చూసి, ఒక ఉద్యోగం చూసుకున్నాడు కృష్ణ.


తర్వాత తులసమ్మకు ఫోన్లో కృష్ణా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడనీ సంతోషపడుతూ చెప్పింది ఈశ్వరమ్మ. కృష్ణా జాబులో కుదురుగా వున్నాడని సంబంధాలు చూస్తుంటే తులసమ్మ సలహా ఇచ్చింది. "పెద్ద పిల్లాడికి నీవు చూసే మారేజ్ బ్యూరో నుండి పెద్ద సంబంధం చూసి చేసావు. ఇపుడు చిన్నాడికి కూడా మళ్ళీ గొప్ప సంబంధాలు తెస్తే వచ్చే పిల్ల నీకు కూడు పెట్టదు. మనూర్లో ఉన్న ఒక పేద పిల్లను చేసుకో”మంది.


"అదీ నిజమేనోయ్!" అంటూ తనకు దూరపుచుట్టాల్లోనీ అమ్మాయిను చేసుకుంది. ఈ కోడలు కాస్త మంచి పిల్లయినా, పెళ్లవ్వగానే వీళ్ళను దూరం పెట్టింది. వాళ్లకు బాధ్యతలు తెలియాలని. సెలవురోజు ఇద్దరు పిల్లల్ని ఇంటికి పిలిచేది. ఎపుడైనా ఆదివారం ఊరికొచ్చి ఉండి వెళ్ళేది. బాధ్యతలు తీరాయి ఇంకో ఐదేళ్లు ఉద్యోగం చేసి అపుడు ఊరికి వచ్చి ప్రశాంతంగా ఉంటాననేది.


చిన్నపిల్లాడుకు చిన్న ఉద్యోగమనీ, వాళ్లకు సంపాదించింది ఇస్తూ ఉంది. మొన్న వచ్చినపుడు ఉద్యోగం మానేస్తానన్నావు ఎపుడొస్తావు ఊరి కంటే ‘ఇపుడే రావాలనుకోవటం లే’దంది. చిన్నాడికి ఇద్దరు అమ్మాయిలు కొన్నాళ్ళు వాడికీ ఆధారంగా నేను అక్కడ ఉండాలనేది.


పిల్లలకు ఒక స్థాయి వచ్చేదాకా కష్టపడుతునే వుంది. ఈవెనింగ్ బట్టలషాపు చిన్నకోడలికి అప్పజెప్పిందితను కాసేపు కూర్చునేది షాపులో. పెద్దవాడు ఎపుడన్నా చుట్టం చూపుగా వచ్చి అమ్మను చూసి వెళ్తాడు. చిన్నాడు కృష్ణా అమ్మను కనిపెట్టుకుని ఉంటాడు. పెద్దాడు పిల్లకు పెళ్లి చేసాడు పిల్లాడు చదువుకుంటున్నాడు. పెద్దాడు అంతా తమ్ముడుకు సంపాదించి ఇస్తున్నావనీ పైకి అనకపోయినా లోపలున్న భావాన్ని గ్రహించి ఒక లక్ష రూపాయిలు ఇచ్చింది మనవరాలిపెళ్లికి బహుమతిగా. అపుడు పెద్ద కోడలు ఎంతో ఆప్యాయంగా ఈశ్వరమ్మని పలకరించింది.


"ఊరికి వచ్చినపుడు చెపితే వూరి జనాలు నీ కష్టార్జితం దగ్గర పెట్టుకోకపోయావా! లేనినాడు అక్కరకు వచ్చేది పెద్దకొడుకు బానే సంపాదిస్తున్నాడుగా ఈశ్వరమ్మ" అన్నారు.


"ఇప్పటి పిల్లలకు మనం ఇచ్చే డబ్బువల్ల మనకు విలువ ఇచ్చే రోజులు వచ్చాయి కానీ మా అమ్మనాన్న అనుకునే రోజులు పోయాయి. నిజానికి వాడు ఎపుడూ ఇవి చేతిలో ఉంచుకోమ్మా అని ఒకరూపాయి ఇచ్చింది లేదు. మా ఇంటికి వచ్చి నాల్గురోజులు వుండమ్మానీ అననులేదు. ఇక పైనా అత్తయ్యగారు మనదగ్గరికి రారు చిన్నకొడుకుదగ్గరే వుంటారని కోడలనటం.. నేను ఎపుడన్నా వస్తె నీకు ఎక్కడలేని జబ్బులు వస్తాయిగా అందామని నోటిదాకా వచ్చినా మళ్ళీ తగాదేలే నా వల్లనీ, నోరుమూసుకుని రావటం.


నువ్వు ఎంతో కష్టపడి సంపాదించింది మాకెందుకు నువ్వే వుంచుకోమ్మా! అనలేదు కొడుకు. డబ్బులిచ్చి మంచి పని చేసాననిపించింది" అంది ఈశ్వరమ్మ.


ఇక చిన్నాడి పిల్లలకు సంపాదించాలనేది. అప్పటినుండి పొద్దునపూట సంబంధాలు చూసి వచ్చే కమిషన్లు మళ్ళీ దాస్తూ వచ్చింది. చిన్నాడు కృష్ణ పెద్ద పిల్లకు ఇంజనీరింగ్ ఫీస్ కట్టింది. పిల్లకు ఉద్యోగం వచ్చింది. తనే ఒక మంచి సంబంధం చూసీ పెళ్లి చేసింది.


మొన్నీమధ్య ఊరు వచ్చినప్పుడు వూళ్లో వాళ్ళు "ఎపుడొచ్చి ఇక్కడుంటావు" అంటే "నా మారేజ్ బ్యూరో బాధ్యతలు కృష్ణకు అప్పజెప్పి వస్తాను శాశ్వతముగా ఇక్కడికి. "


మొన్న రెండురోజుల క్రితం వచ్చి ఇల్లు బాగుచేయించి వెళ్ళింది. "ఈసారి వస్తె ఇక సిటీ పోయ్యేది లేదు. రెస్ట్ తీసుకోవాలి ఇప్పటికే చేసిచేసి అలిసిపోయాను. గుడి కెళ్ళి రావటం హాయిగా సాయంత్రాలు ఇంటి అరుగు మీద కూర్చుని మీతో పాటు మాట్లాడుకుని ఇంట్లోకి పోయి టివి చూస్తూ అన్నము తిని పడుకుంటానని చెప్పి వెళ్ళింది.


"మనూరికి ఈసారిశాశ్వతంగా ఇట్లా ఉండిపోవటానికి వస్తావని మేమనుకొలేదు. మాకు వచ్చినప్పుడల్లా చీరలు తెస్తూ ఉండేదనీ" ఫ్రెండ్స్ ఏడిచారు.


తులశమ్మ ఈశ్వరమ్మకు దండేస్తూ "మన పుట్టిల్లు అత్తిల్లు ఇదేవూరు కావటం చిన్నప్పటినుండి ప్రాణస్నేహితులం కావటంనన్నొదిలి ఎట్లా వెళ్ళావు!? ఈశ్వరి” అంటూ ఏడ్చింది.

“నిన్న పొద్దున ఫోన్లో మాట్లాడింది మీ అమ్మ ఎట్లా పోయింది కృష్ణా" అన్న తులశమ్మతో "నిన్న సాయంత్రం షాపులో బట్టలు అమ్ముతూ ‘కృష్ణా నాకేదో గుండెల్లో నొప్పిగా వుందిరా’ అంది. ‘లేమ్మా ! హాస్పిటలుకు వెళదా’మనెలోగా కిందకు ఒరిగిపోయింది. వెంటనే మా పక్క షాపులో ఆర్ఎంపీ డాక్టర్ ఉంటాడు. ఆయనొచ్చి చూసేసరికి ప్రాణం పోయింది. తెల్లవారుజామున వాన్ మాట్లాడుకుని తెచ్చాము. మా కోసం ఎంతో కష్టపడింది. ఇక మమ్మలని ఎవరు చూస్తారు ఇంత ప్రేమగా!" అంటూ కొడుకులు కంటనీరు పెట్టారు.


చిన్నకోడలు రమ్య "అత్తమ్మా! లే నువ్వు లేకపోతే మాకు ఎవరు దిక్కు!? నన్ను ఒక కూతురులానే చూసుకుం”దంటూ ఒకటే ఏడుపు.


ఎపుడూ ఒక హ్యాండ్బ్యాగ్ ఈశ్వరమ్మ చేతిలో ఉండేది. పిల్లలతో "ఒరే! ఇది నేను పోయినా కూడా నా పక్కనే వుండా”లనేది. " దానిలో ఎపుడూ! వాటర్ బాటిల్ ఎవరికి ఎంత ఇవ్వాలి ఎంత ఖర్చు పెట్టేది రాసి పెట్టుకునేది. ఆ హ్యాండ్బాగ్ ఈశ్వరమ్మ పక్కన పెట్టారు. అందరూ ఈశ్వరమ్మ ప్రాణం ఆ హ్యాండ్బ్యాగ్ లో ఉండేదనుకున్నారు.


చివరి మనవరాలు ఈ హ్యాండ్బ్యాగ్ లో ఏముందోనని తీసింది. అందులో లోపల అరలో డబ్బుంది. ఎంతానీ!? తీసిచూస్తే లక్ష రూపాయిలున్నాయి. "ఈ డబ్బు ఎవరికైనా అర్జెంటుగా రోగం వస్తె ఉపయోగపడుతుందని నేను ఎప్పటినుండో దాస్తున్నది. నాకు ఈమధ్య తరుచూ గుండెల్లో నొప్పి వస్తుంది. హాస్పిటలు కెళ్దామంటే బోలెడు డబ్బు ఖర్చని వూరుకుంటున్నా. ఈలోపు నేపోతే దినవారాలకు ఉంటాయిలే!" అని రాసిన చిన్న చీటీ వుంది.


"చివరకు నీ దినవారాలకు కూడా నువ్వే డబ్బు మాకు పెట్టీ పోయావామ్మా!" అని పిల్లలు ఏడిచారు.


అక్కడి వాళ్ళు "నిజముగా కష్టజీవి ఈశ్వరమ్మ. మాతో సుఖంగా ప్రాణం పోవాలనేది. ఎవరి చేతా చేయించుకోనూ, ఎవరి పైసాను తీసుకోననేది అలాగే తన దినవారాలకు డబ్బిచ్చి పోయింది. ఎన్నాళ్లకైనా పోవాల్సిందే. ఇట్లాంటి చావు ఎవరికొస్తుంది. ఇంకా ఉండి అందరికీ భారమయ్యేకన్నా చిటికెలో ప్రాణం ఇట్లా పోవా”లన్నారు.


తులసమ్మ "కృష్ణ, మీ అమ్మ డబ్బు మీరుంచుకుని దినవారాలకయ్యే డబ్బు మీరు ఖర్చు పెట్టండి. ఇన్నాళ్లు కష్టపడి మిమ్మలని చూసుకున్నందుకు మీ అమ్మ రుణం. ఇట్లా తీర్చుకోండి. ఆ డబ్బును మీ నల్గురు పిల్లల పేర ఈశ్వరమ్మ పేరు మీద ఫిక్సెడ్ చేయండి. "


అలాగేనని తులసమ్మ మాటలకు తలవూపారు కొడుకులు.


ఊరి మాజీ ప్రెసిడెంటు వచ్చి చూసి "నిప్పులాంటి మనిషి. తన కట్టాన్ని నమ్ముకుంది. ఎవరి దగ్గరా చేయిచాచకుండా బతికింది. ఇదీ చావంటే" అని మెచ్చుకున్నాడు.

***

పెనుమాక వసంత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పెనుమాక వసంత గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

పేరు వసంత పెనుమాక, గృహిణి. రచనలు చేయటం, పాటలు వినటం హాబీస్. మన తెలుగు కథలకు కథలు రాస్తున్నాను. ధన్యవాదములు.
32 views0 comments

Comentarios


bottom of page