top of page
Original.png

చేరువైన దూరం

#MallaKarunyaKumar, #మళ్ళకారుణ్యకుమార్, #చేరువైనదూరం, #CheruvainaDuram, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #కొసమెరుపు


Cheruvaina Duram - New Telugu Story Written By Malla Karunya Kumar

Published In manatelugukathalu.com On 05/12/2025

చేరువైన దూరం - తెలుగు కథ

రచన: మళ్ళ కారుణ్య కుమార్


"విక్రమ్!, నువ్వు ఎలాగైనా ఓ మోటివేషనల్ షో నిర్వహించాలి. " ప్రముఖ పారిశ్రామిక వేత్త విష్ణు తన ఎదురుగా కూర్చొన్న విక్రమ్ తో అన్నాడు. 


"ఓహ్!, మీరు చెప్పిన తర్వాత నో అంటానా?. చెప్పండి, స్కూల్, కాలేజీ, లేక ప్రముఖుల సమక్షంలోనా?. " కుతూహలం తో అడిగాడు. మోటివేషన్ స్పీకర్, లైఫ్ కోచ్ గా పేరు, ప్రఖ్యాతి గాంచిన విక్రమ్ చిరునవ్వు చిందిస్తూ. 


"ఏ విషయం చెప్పినా చేసేయాలన్న మీ కుతూహలం నాకు నచ్చింది. కానీ, మీరు అనుకున్నట్టుగా స్కూల్, కాలేజీ, ప్రముఖుల సమక్షంలో కాదు మోటివేషన్ స్పీచ్ ఇవ్వాల్సింది!. "


 "మరి?. " ఆశ్చర్యపోతూ అడిగాడు విక్రమ్. 

 

 "ఓ వృద్ధాశ్రమం లో!. " తేటతెల్లం చేశాడు విష్ణు. 


 విష్ణు చెప్పింది విని ఆశ్చర్యపోతూ ఆలోచనలో పడ్డాడు విక్రమ్. 'నాకు సమయం లేదని ఎన్నో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ వదులుకున్నాను. కానీ, ఇప్పుడు ఇతను వృద్ధాశ్రమం లో స్పీచ్ ఇమ్మంటున్నాడు!. ఇలా చేస్తే నా ఇమేజ్ ఏమౌతుంది?. తర్వాత నుండి అందరూ నన్ను తక్కువుగా చూస్తారేమో!. ' అని తనలో అనుకుంటూ, చివరికి ఒక నిర్ణయానికి వచ్చాడు. 


"సర్, ఇప్పుడంటే నాకు డేట్స్ ఖాళీలేవు!. తర్వాత ఎప్పుడైనా చూద్దాం. " అని అన్నాడు విక్రమ్ విషయాన్ని దాటవేస్తూ. 


 విక్రమ్ ఆలోచన స్పష్టంగా విష్ణు కు అర్దమైంది. "విక్రమ్!, మీరు నాకు మంచి మిత్రుడు. మిత్రుడు ను ఇంకో మిత్రుడు ఆర్డర్ వేయవచ్చు. కనుక మీరు ఈ ప్రోగ్రామ్ చేసి తీరాల్సిందే. అది కూడా రెండు రోజులు తర్వాత. నా మాట మన్నిస్తారని నేను అనుకుంటున్నాను!. " అని విక్రమ్ ను తన స్నేహం తో కట్టిపడేసాడు. 


 విక్రమ్ సందిగ్ధంలో పడ్డాడు, 'అవును, విష్ణు గారు హోదాలో పెద్ద వ్యక్తైనా నన్ను ఎప్పుడూ స్నేహితుడు లానే భావించారు. ఇప్పుడు అతని మాటను ఎలా కాదనగలను?. అతను నన్ను స్నేహబంధం తో కట్టిపడేసారు. సరే, ఆరోజు ఏదో నాలుగు మాటలు మాట్లాడి వద్దాం. ' అని తనలో అనుకొని, ఒక నిర్ణయానికి వచ్చి, "మీరు కాబట్టి మీ మాట కాదనలేక పోతున్నాను. ఏర్పాట్లు చేసుకోండి, ఎప్పుడన్నది కన్ఫర్మ్ గా ఈ రోజు సాయంత్రానికి నాకు తెలియజేయండి. " అని చెప్పి, అక్కడ నుండి బయలుదేరాడు విక్రమ్. 


అప్పటి నుండి తనని ఆలోచనలు సతమతం చేస్తున్నాయి!. ఏదోకటి మాట్లాడుదామని అప్పుడు అనుకున్నాడు. కానీ, ఏం మాట్లాడినా శోధించి మాట్లాడడం తనకు అలవాటు. ఇంతకుముందు ఏ ప్రోగ్రామ్ కు వెళ్లినా ఎటువంటి కష్టం లేకుండా సునాయాసంగా మాట్లాడే వాడు. కానీ, ఇప్పుడు తాను మోటివేషన్ ఇవ్వాల్సింది వృద్దులకు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి, ఎన్నో బ్రతుకు పాఠాలు తమలో నింపుకున్న వృద్దులకు. ఏ మోటివేషన్ ఇవ్వగలనని ఆలోచనలతో తన కారు నడుపుతూ వున్నాడు. ఏ సమాధానం కూడా తట్టడం లేదు. తనకు రోజూ దర్శనం ఇచ్చే పార్క్ దగ్గరకు వెళ్ళి కారు ఆపి, దిగి ఆ పార్క్ వైపుకు నడవడం ప్రారంభించాడు. 


చుట్టూ ఉన్న మనుషుల్ని పరిశీలనగా చూస్తూ నడుస్తున్నాడు. అనుకోకుండా విక్రమ్ ఒక వ్యక్తిని గుద్దుకోవడం జరిగింది. ఒక్కసారిగా అతని వైపుకు చూసాడు. తెల్లని లాల్చీ, పంచి ధరించి వున్నాడు ఆ వ్యక్తి. నుదుటన నామం, తేజోవంతమైన ముఖం. కానీ, అతని చేతిలో ఒక గోనె సంచి వుంది. ఆశ్చర్యం తో అతని వైపు చూసి, 

 "క్షమించండి అంకుల్!. " క్షమాపణ కోరాడు విక్రమ్. 


"ఏమైంది ఈ మనుషులకు!. ఎదురుగా వచ్చే మనిషి కనిపించడు., ప్రేగు బంధం కనిపించదు. తాము చేస్తున్న పనికిమాలిన పనులు కనిపించవు. " ఉరుముతూ చూస్తూ, "పక్కకు తప్పుకో. " అని కోపంతో అన్నాడు ఆ వ్యక్తి. 


ఆశ్చర్యంతో పక్కకు తప్పుకున్నాడు విక్రమ్. విక్రమ్ కాళ్ళ దగ్గర పడి వున్న వాటర్ బాటిల్ తీసి, తన సంచిలో వేసుకున్నాడు. 

ఆశ్చర్యంతో చూస్తూ వున్నాడు విక్రమ్!. 


తర్వాత ఆ సంచిలో నిండిన చెత్త మొత్తం అక్కడ వున్న డస్ట్బిన్ లో వేసి, అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. 


"ఎవరు ఈ వ్యక్తి? ఇలా చెత్త ఏరి ఆ డస్ట్ బిన్ లో వేస్తున్నారు!. చూడటానికి పెద్ద వయస్సు లా కనిపిస్తుంది!. ఈ వయసులో ఇలాంటి పని చేయాల్సిన అవసరం అతనికి ఏమిటి? చూడటానికి ఆర్దికంగా ఎటువంటి లోటు లేదని అతని వేష ధారణ చూస్తుంటే తెలుస్తుంది." అని అక్కడే నిలబడి అతన్ని చూస్తూ, తనలో అనుకుంటున్నాడు విక్రమ్. 


ఇంతలో విక్రమ్ మదిలో అతని గురించి తెలుసుకోవాలి కుతూహలం కలిగింది. ఆ వ్యక్తి వెళ్లిన వైపుకు వెళ్ళాడు. విక్రమ్ కళ్ళు ఆ వ్యక్తిని వెతుకుతున్నాయి. దూరం లో ఓ ఖాళీ ప్రదేశంలో మొక్కలకు నీళ్ళు పోస్తూ విక్రమ్ కంటికి కనిపించాడు. వేగంగా అతని దగ్గరకు వెళ్ళి, 

"అంకుల్!. మీరు ఎవరు?. " అడిగాడు. 


విక్రమ్ ప్రశ్నకు కోపంగా చూస్తూ, "కనిపించడం లేదా మనిషిని?. " అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ఆ వ్యక్తి. 


"కానీ, మీరు ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు?."


 "మనిషిని కాబట్టి?."


"అవును మీరు మంచి మనిషే, అందుకే మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ వయస్సు వారు దిగులుతో, ఆలోచనలతో, నిరాశగా, నిస్సహాయంగా ఉంటారు. కానీ మీరు వాళ్ళందరి కంటే భిన్నంగా చాలా ఉత్సాహం తో ఆనందంతో వున్నారు. ఇంతకీ మీ లైఫ్ సీక్రెట్ ఏమిటి?. " 


విక్రమ్ ప్రశ్నలు, మాటలు ఆ వ్యక్తిని ఆకర్షించాయి. 


తన పని ఆపి, "నీకు వేరే పని లేనట్లుంది!. సరే, నీ ప్రశ్నలకు సమాధానాలు నా దగ్గర వున్నాయి!. నా వయస్సు వాళ్ళు దిగులుతో ఉంటారు. నిజమే, నేను ఆ దిగులు నుండి బయటకు వచ్చిన వాడినే, జీవితమంటే ఏమిటో తెలిసింది!. అందుకే ఇలా మొక్కల్ని పెంచుతూ, పడిన చెత్తను ఏరుతూ నాకు కలిగిన సహాయాన్ని ఈ మానవాళికి చేస్తున్నాను. పరోపకారార్ధం ఈ శరీరమని అన్నారు కదా. అందుకే నా బాధను, నిరాశను వదిలి. నా వంతు కృషి చేస్తున్నాను. భావి తరాలకు మంచి పర్యావరణం బహుమతి ఇవ్వాలని నా కోరిక. " నవ్వుతూ చెప్పి, అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. 


ఆ క్షణం వేల సూర్యుల ప్రకాశించే జ్ఞాన కాంతి తన మెదడు లో ఉద్భవించింది. వృద్దులకు ఏ మాట చెప్పాలి, వాళ్లకు ఏ మోటివేషన్ ఇవ్వాలో విక్రమ్ కు అర్దమైంది. మళ్ళీ తాను మొదట్లో మోటివేషన్ ప్రారంభించిన నాటి మాట గుర్తుకు చేసుకున్నాడు. 


"మనం చెప్తున్నది కొత్త విషయం కాదు. ఈ సమాజంలో నలిగి నలిగి సమస్య గా మారిన ఓ సమస్య ను, ఈ సమాజంలో జీవించే వ్యక్తులు నుండి సమాధానం వెతికి తిరిగి చెప్పడమే. ఇందులోనే కదా నేర్పు కావాలి. " అన్న మాట గుర్తుకు వచ్చింది. ఆనందంతో, వికసిత వదనంతో అక్కడ నుండి ముందుకు కదిలాడు. 


ఆ రోజు సాయంత్రం విష్ణు విక్రమ్ కు ఫోన్ చేసి, రెండు రోజులు తర్వాత ప్రోగ్రాం వుందని చెప్పాడు. ఇంతకు ముందు వృద్దులకు తాను స్పీచ్ ఇవ్వడమేమిటని సందిగ్ధ పడిన విక్రమ్. ఇప్పుడు ఎప్పుడు స్పీచ్ ఇద్దమా అని కుతూహలంతో వున్నాడు!. 

ఆ రోజు రానే వచ్చింది. విష్ణు భారీగా ఏర్పాట్లు చేయించాడు. కానీ, అక్కడ వున్న వృద్ధుల్లో ఎటువంటి ఉత్సాహం కలగడంలేదు. 


ప్రోగ్రాం స్టార్ట్ అయ్యింది. మైక్ అందుకున్నాడు విక్రమ్. ముందు కొంత సేపు మాట్లాడిన తర్వాత తన స్పీచ్ మొదలు పెట్టాడు. రెండు మాటలు మాట్లాడిన తర్వాత ఆగి అందరి వైపు చూసాడు. ఎదురుగా కూర్చొన్న వృద్దులు అందరూ దీనంగా ముఖాలు పెట్టుకొని వున్నారు. ఒకరి ముఖంలో కూడా ఆసక్తి లేదు. 


అందరినీ మరొక్క సారి చూసాడు, "నేటి పౌరులే రేపటి వృద్దులు. నిర్లక్ష్యం తగదు. ఓ సమాజమా. " గట్టిగా అరుస్తూ అన్నాడు. 


ఒక్కసారిగా అందరి చూపులు విక్రమ్ వైపుకు తిరిగాయి. అక్కడ వున్న కొందరు యువకులు, ప్రముఖ వ్యక్తులు అందరూ ఆశ్చర్యంతో చూస్తున్నారు. ఆ వాక్యానికి వచ్చిన స్పందన చూసి, "ఇదే సరైన సమయం" అనుకొని తాను చెప్పదలుచుకున్న స్పీచ్ మొదలు పెట్టాడు. వాళ్లను తన మోటివేషన్ స్పీచ్ తో కట్టిపడేసాడు. విస్మయం తో, ఉత్సాహంతో వింటూ వున్నారు. 


 కొంత సమయం మాట్లాడిన తర్వాత తన స్పీచ్ ముగించాడు విక్రమ్. మొత్తం చప్పట్లు తో ఉత్సాహం తో తమ ఆనందం తెలుపుతున్నారు. అంతటి తో తన స్పీచ్ ముగిసింది. 


తర్వాత సంగీత కచేరి ప్రారంభం అవ్వబోతుంది. విక్రమ్ విష్ణు కలవడానికి అక్కడ నుండి బయటకు వెళ్ళాడు. విష్ణు తన రూం లో కూర్చొని వేరే వాళ్లతో మాట్లాడుతూ వున్నాడు. విక్రమ్ ను చూసి వాళ్లను పంపించి, విక్రమ్ దగ్గరకు వచ్చాడు. "మీ ముఖం చూస్తుంటే అర్దం అవుతుంది విక్రమ్, మీరు స్పీచ్ ఎలా ఇచ్చారో!. నాకు తెలుసు, మీ మాటలు వింటే వాళ్ళు కొంత సమయం అయినా రిలాక్స్ గా ఫీల్ అవుతారు. " అని విక్రమ్ ను హత్తుకుంటూ అన్నాడు విష్ణు. 


"మీరు ముందు ఈ మాట చెప్పినప్పుడు నేను కాస్త అసహనంగా ఫీల్ అయ్యాను. కానీ, ఇప్పుడు వాళ్ల కళ్లలో ఆనందం చూసి, నాకు చాలా సంతోషం కలిగింది. మీకు ఇలాంటి ఐడియా రావడం, మీరు ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం చాలా అభినందనీయం!. " 


"విక్రమ్! ఇక్కడున్న వృద్ధులైన తల్లితండ్రులు వేరేవేరే కారణాలు వలన తమ పిల్లలకు దూరమై ఇక్కడకు చేరుకున్నారు. నాకు తోచిన సహాయం చేసి, వాళ్లను బాగా చూసుకోవడం నా బాధ్యత అనుకుంటాను. నేను కూడా నా తల్లితండ్రులుకు దూరమై చాలా బాధపడుతున్నాను. తల్లి శాశ్వతంగా దూరం అయ్యింది. తండ్రి నా తీరు నచ్చక దూరం అయ్యారు. "


"ఏం చెప్తున్నారో అర్దం కావడం లేదు?. " అయోమయంతో అడిగాడు. 


 "నేను ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్ళాను. రెండు సంవత్సరాలు అయ్యాయి. ఇంటి ముఖం కూడా చూడలేదు అక్కడే వున్నాను. ఒకరోజు మా అమ్మగారికి అనారోగ్యం అని ఫోన్ వచ్చింది. నేను సెలవు తీసుకొని బయలు దేరాలనుకున్నాను. కానీ, కంపెనీ వాళ్ళు నెల రోజులు వరకు సెలవు ఇవ్వడం కుదరదన్నారు. బతిమలాడాను. అయినా ఒప్పుకోలేదు. అలా మూడు రోజులు గడిచాయి. అసలు విషయం చెప్పినా వాళ్ళు కనికరం చూపలేదు.


ఓపిక నశించింది వాళ్లతో గొడవ పెట్టుకొని ఉద్యోగం వదిలేసి వచ్చాను. శాశ్వతంగా ఇక్కడికి. ఇంటికి వచ్చే సరికి తెలిసింది అమ్మ నాకు శాశ్వతంగా దూరం అయ్యిందని. తర్వాత నాన్న నా మీద కోపం తో మాట్లాడే వాళ్ళు కాదు. అమ్మ నా కారణంగానే దూరమైందని నాన్న కు కోపం. నా బాధ ఎవరికి చెప్పుకోలేక నాలో నేను కుమిలిపోయే వాడిని. నాన్న తో ఎంత మాట్లాడుదామని ప్రయత్నం చేసినా నా దగ్గర నుండి వెళ్ళిపోయే వారు. 


ఇక్కడే నాన్న తో కలిసి వుండాలని నిర్ణయం తీసుకొని, ఇక్కడే వ్యాపారం మొదలు పెట్టాను. లాభాలు వచ్చి వృద్ధిలోకి వచ్చింది వ్యాపారం. కానీ, నాన్న మాత్రం నా దగ్గరకు చేరలేదు. అతని కోసం ఇప్పటికి కూడా నిరీక్షిస్తున్నాను. " కన్నీటిని తుడుచుకుంటూ చెప్పాడు విష్ణు. 


అప్పుడే పక్కన ఏదో శబ్ధమైనట్టు వినిపించడం తో విష్ణు, విక్రమ్ అటువైపుకు చూశారు. 

"అంకుల్!, మీరా.. రండి, రండి. " అని అంతకు ముందు తనకు కలిసి, తనకు ప్రేరణ కలిగించిన వ్యక్తిని చూసి అతని వైపుకు పరుగుతీశాడు విక్రమ్. 


విష్ణు కూడా ఆశ్చర్యంతో పరుగుతీస్తూ అతని దగ్గరకు చేరుకొని, వేగంగా అతని పాదాలు మీద పడి, "నాన్న! వచ్చారా. " అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు. 

విష్ణు ను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయాడు విక్రమ్. కాసేపటి తర్వాత అతను ఎవరన్నది విక్రమ్ కు బోధపడింది. 


"విష్ణు!.. నిన్ను అర్థం చేసుకోలేక పోయాను. నువ్వు రాక పోయే సరికి, మీ అమ్మ నాకు దూరం అయ్యే సరికి నాలో బాధ ఎక్కువైంది. విచక్షణ కోల్పోయాను. తర్వాత మామూలు మనిషి అయ్యాను. కానీ, నీ మీద కోపం పోలేదు. ఈ రోజు ఆ దైవమే నన్ను ఇక్కడకు పంపించాడు. నా స్నేహితుడు ఆహ్వానం మేరకు ఇక్కడకు వచ్చాను. ఇదుగో ఈ బాబు స్పీచ్ ఇస్తున్నాడని తెలిసి ఆశ్చర్యం తో, కుతూహలం తో వింటూ ఉండి పోయాను. ఇతను చాలా బాగా స్పీచ్ ఇచ్చాడు. ఇతన్ని అభినందించడానికి ఇతని వెనుక పడ్డాను. నిన్ను చూసి ఆగిపోయాను.. మీ మాటలు విన్నాను. నాకు నిజం దేవుడు ఈ విధంగా తెలియజేశాడు. అపార్థం తో నిన్ను ఇన్ని రోజులు దూరం చేసుకున్నాను. వీలైతే నన్ను క్షమించు రా. " అంటూ ఆప్యాయంగా కొడుకును కౌగలించుకున్నాడు తండ్రి. 


"ఇప్పటికైనా నా దగ్గరకు చేరుకున్నారు. నన్ను క్షమించారు అంతే చాలు. " ఆనందంతో కన్నీళ్లు కార్చుతున్న తన కళ్లను తుడుచుకుంటూ అన్నాడు విష్ణు. 


తండ్రి కొడుకులు కలవడం చూసి ఆనందించాడు విక్రమ్. ' ఒక చిన్న అపార్థం ఎంత బాధను మిగిల్చింది. ఇన్నాళ్లు కొడుకు తప్పు చేసాడు అని అపార్థం తో కొడుకును దూరం పెట్టాడు తండ్రి. విష్ణు గారు ఎంతలా బాధపడి ఉంటారు. ఊహించుకుంటే గుండె తరుక్కు పోతుంది. ఇక మీదట ఇలాంటి అపార్దల పట్ల ప్రజలకు అవగాహన కలిగేలా ఒక స్పీచ్ ఇవ్వాలి. ' అని మరో స్పీచ్ కు మ్యాటర్ సిద్దం చేసుకున్నాడు విక్రమ్. 

 

 ***సమాప్తం****

మళ్ళ కారుణ్య కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం


కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నా పేరు మళ్ళ కారుణ్య కుమార్అమ్మవారి పుట్టుగ (గ్రామం)శ్రీకాకుళం జిల్లా.

విద్య : ఫార్మసీఉద్యోగం : ప్రైవేట్ ఉద్యోగం.

సాహితీ ప్రస్థానం : నేను కథలు,కవితలు రాస్తాను.యిప్పటి వరకు చాలా కథలు,కవితలు వివిధ పత్రికల్లో సాక్షి,ప్రజాశక్తి,తపస్వి మనోహరం,సుమతీ,తెలుగు జ్యోతి,సహరి,సంచిక,జాగృతి ప్రింట్/అంతర్జాల మాస/వార పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.

పురస్కారాలు :1.లోగిలి సాహితీ వేదిక యువ కవి పురస్కారం.2.సుమతీ సాహితీ సామ్రాట్ పోటీలలో ద్వితీయ స్థానం.3.సుమతీ మాసపత్రిక వారి దీపం ఉగాది పురస్కారం.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page