top of page

చెట్టు క్రింది పక్షులు


'Chettu Krindi Pakshulu' - New Telugu Story Written By Ch. C. S. Sarma

'చెట్టు క్రింది పక్షులు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

అది.. దాదాపు వంద సంవత్సరాలకు పైబడ్డ మర్రిచెట్టు. ఆ వూర్లో ముఖ్య రహదారిలో ఒక ప్రక్కన వుంది. ఆ వూరు ఓ తాలూకా.


దాని నీడే, కొందరు పేద పక్షులకు ఆశ్రయం. దాన్ని ఆశ్రయించి ఆ చెట్టునీడలో బ్రతుకు తెరువు సాగించేవారు.. చెప్పులు కుట్టే చిన్నసామి.. బుట్ట కూడు (అన్నం) విక్రయించే చిలకమ్మ.. ఎద్దులకు, గుర్రాలకు నాడాలు కొట్టే మీరా సాహెబ్.. బటనీ సుండల్.. శనగ గుగ్గిళ్ళు, వేరుశెనగకాయలు, అమ్ముకునే బాలరాజు.


యీ నలుగురూ చాలా మంచి మిత్రులు. చిన్న సామి, మీరా సాహెబ్ యాభై ఏళ్ళ వయస్సు వాళ్ళు. చిలకమ్మ నడివయస్సు మనిషి. బాలరాజుకు యిరవై ఎనిమిదేళ్ళు. చిలకమ్మ భర్త రిక్షా తొక్కుతాడు. ఆ కారణంగా మధ్యాహ్నం.. రాత్రి.. ఆ ప్రాంతంలో రిక్షాలు నడిపే వారంతా చిలకమ్మ చేతి విందు ఆరగిస్తారు. చిలకమ్మ వంట బాగా చేస్తుంది. పులుసు, వూరగాయ, మజ్జిగ.. యీ మూడూ ఆమె చేసే నవకాయ వంటకాలు.


రిక్షారాయుళ్ళతోపాటు యాచకులు కూడా వూరంతా తిరిగి, మధ్యాహ్నానికి ఆ చెట్టు క్రింద చేరి చిలకమ్మ చేతి వద్ద తిని.. చల్లని తల్లి ఆ మహావృక్షం.. మొదట్లో తలలుపెట్టి, శయనించి విశ్రాంతి తీసుకొంటారు.


చిలకమ్మ మంచిమాటకారి. చిన్నసామి, మీరాసాహెబ్ ను అన్నా అని.. బాలరాజును తమ్ముడూ అని.. ఎంతో అభిమానంతో సిలిచేది. వారు వేరు వేరు కులాల వారైనా, వారి సహజీవనం ఆ చెట్టుక్రిందే కాబట్టి.. వారంతా కలసిమెలసి ఒకే కుటుంబసభ్యులుగా వుండేవారు.


ఆ చెట్టుకు ఎదుటివైపు సినిమాహాలు వుంది. ఆ కారణంగా చిలకమ్మ.. బాలరాజులు, రాత్రి రెండవ ఆట ప్రారంభించేదాకా దుకాణాలు తెరిచి వుంచి పదిన్నరకు మూసేస్తారు.


యిక.. చిన్నసామి.. మీరాసాహెబ్ ఏడున్నర ఎనిమిది తర్వాత.. తమ దుకాణాలను సర్దేస్తారు. వారి తాలూకు సామాగ్రిని ఆ చెట్టు మొదట్లోనే.. కట్టకట్టి పెట్టడం వారి అలవాటు.


వుదయాన్నే పెన్నలో స్నానం చేసి.. చిన్నసామి మీరాసాహెబ్ు తమ దుకాణాలను తెరుస్తారు. బాలరాజు తన తోపు బండితో తొమ్మిదిన్నర గంటల కల్లా చెట్టు క్రిందికి చేరుతాడు. చిలకమ్మ, అన్నం, పులుసు వగైరాలు తయారు చేసికొని, పదిన్నరకు బుట్టతో, బక్కెట్లతో, తన భర్త రిక్షాలో వచ్చి చెట్టు క్రింద దిగుతుంది. భర్త కోటేసు దొరికిన సవారితో ఏ వైపుకో వెళ్ళిపోతాడు.


చిన్నసామికి భార్య యిద్దరు ఆడపిల్లలు, మీరా సాహెబ్కు ఒక కొడుకు ఒక కూతురు. ఆ నలుగురిలో.. చిన్నసామి పెద్దకూతురు.. మీరా సాహెబ్ పెద్దకొడుకు నర్సు ట్రయినింగ్ ముగించి హాస్పటిల్లో పని చేస్తున్నారు. చిన్నవాళ్ళు యిరువురూ స్కూల్లో చదవుతున్నారు.


మేలనర్స్.. సుబహన్, నర్స్ వసంత ప్రేమించుకొన్నారు. వారి ప్రేమను పెద్దలు ఆమోదించారు. వారి వివాహం ఆ చెట్టు క్రిందనే జరిగింది. వారు గుంటూరు హాస్పటిల్లో పనిచేస్తున్నారు. వారి బ్రతుకు వారిది. వారు పెద్దలకు సహాయం చేసే స్థితిలో లేరు. వీరూ వారినుంచి ఏమీ ఆశించరు. ఎవరి కష్టం, ఫలం వారిదే.


పిల్లల జీతాలకు ఒక్కోసారి చిన్నసామి, మీరాసాహెబ్, చిలకమ్మ ఒకరినుంచి మరోకరు, చేబదులు తీసికోవడం.. తర్వాత చెల్లించడం పరిపాటి. యధార్థంగా వారందరిదీ.. ఆ చెట్టు క్రింద వున్న వుమ్మడి కుటుంబం.


బాలరాజుకు యింకా పెండ్లి కాలేదు. వయస్సు మీరిన తల్లి.. వయస్సు వచ్చిన చెల్లి సుందరి అతని కుటుంబం. చెల్లెలికి పెండ్లి చేయాలని పైసా పైసా కూడబెడుతున్నాడు బాలరాజు. ఆ చెల్లెలంటే ఆతనికి పంచప్రాణాలు.


కొత్త సినిమా రిలీజ్ అయిన రోజుల్లో అన్నకు సహాయంగా వుండేటందుకు సుందరి చెట్టు క్రిందకు వచ్చేది. అన్నకు సహాయంగా నిలబడేది. సాయంత్రం మీరాసాహెబ్తో కలసి యింటికి ఏడున్నర ప్రాంతంలో వెళ్ళి వంట చేసేది.


మహేష్ బాబు కలేజా సినిమా రిలీజ్ అయింది. వూరి జనమే కాకుండా, సినిమా గొప్పలను విని చుట్టుప్రక్కల గ్రామాల నుంచీ.. జనం రెండు ఎడ్లబండ్లలో సినిమాను వీక్షించేదానికి వచ్చేవారు.

ఆ సమయంలో బాలరాజు.. చిలకమ్మల వ్యాపారాలు బాగా సాగాయి. అన్నకు చిలకమ్మకు సహాయంగా సుందరి ఆ సమయంలో చెట్టుక్రింద చాలా సమయం వుండేది.


* * *


సినిమా ఫిలిమ్ బాక్సుతో విన్సెంట్ అనే రిప్రజన్టేటివ్ ఆ హాలుకు వచ్చాడు. అతని పని ప్రతిరోజూ షోలు అయిపోయిన తర్వాత.. ధియేటర్కు మూడు షోలకు వచ్చిన కలెక్షన్లో డిస్ట్రిబ్యూటర్కు చేరవలసిన పరసెంటేజ్ పైకాన్ని ధియేటర్ యజమాని వద్దనుండి తీసుకొని బ్యాంక్లో జమ చేయడం.. అమ్మిన టిక్కెట్లనే తిరిగి తీసుకొని, మరలా మరో షోకు అమ్మకుండా చూడడం.


విన్సెంట్ నల్లరంగున్న అందగాడే. వయస్సు పాతిక సంవత్సరాలు. తెల్లప్యాంట్, తెల్లపుల్లోవ్స్ షర్టు, కళ్లకు నల్ల అద్దాలు.. వుంగరాల జుట్టు.. చూచేదానికి పెద్ద ఆఫీసర్లా వుంటాడు.



చిలకమ్మ భోజనం చాలా బాగుంటుందని ప్రొజెక్టర్ నడిపేవాళ్ళు.. గేట్ కీపర్లు.. హాలును క్లీన్ చేసే పనివాళ్ళు చెప్పగా విని.. ఆమె భోజనాన్ని చవి చూచేటందుకు ఒకరోజు మ్యేటనీ షో.. ప్రారంభం అయిన తర్వాత మర్రిచెట్టు క్రిందకి వచ్చాడు విన్సెంట్. సిల్వర్ తట్టను బాగా కడిగి, మోదుగు ఆకును అందులోవుంచి అన్నం, పులుసు, వూరగాయలో తట్టను.. చిలకమ్మ విన్సెంట్కు అందించింది.


ఆ సమయంలో బాలరాజు చెల్లెలు అన్నకు సహాయంగా తోపుడు బండి ముందు వుండటాన్ని విన్సెంట్ చూచాడు. దాదాపు యిరవై ఏండ్ల ప్రాయంలో, అచ్చటేత తెలుగు ఎంకిలా.. ఎంతో ఆకర్షణీయంగా గోచరించింది సుందరి విన్సెంటు. 'ఆ పిల్ల పూర్ణవికసిత అనాఘ్రాణ పుష్పంలా వుంది. మకరందాన్ని ఆస్వాదించాలి.' మదిలో విన్సెంట్ నిర్ణయించుకొన్నాడు.


ఆ కారణంగా.. రాత్రి ఫస్టు షో ప్రారంభంకాగానే చిలకమ్మ భోజనాన్ని ఆస్వాదించేవాడు విన్సెంట్. చిలకమ్మతో మాట కలిపి.. తనకు కావలసిన వివరాలను సేకరించాడు. తన చూపులతో సుందరిని తనవైపుకు ఆకర్షించాడు.


బాలరాజు తల్లి అనారోగ్య కారణంగా ఆ రోజు అతను హాస్పటిల్కు తల్లితో వెళ్ళాడు. ఒంటరిగావున్న సుందరితో మాట కలిపాడు. వేరుశనగకాయలు కొన్నాడు. రెండు ఫ్రీ పాసులు సుందరికి యిచ్చి.. రెండవ ఆటకు సినిమాకు రమ్మన్నాడు విన్సెంట్.


స్నేహితురాలితో సుందరి రెండవ ఆటకు వెళ్ళింది. గేటు దగ్గర విన్సెంట్ను చూచింది. హాల్లోకి పోయి కూర్చొని, అతని సైగను గమనించి బయటికి వచ్చింది. సైకిల్పై అతనితో వూరి చివరవున్న అతని బసకు వెళ్ళింది.


గది తలుపులు తెరచి విన్సెంట్ సుందరిని లోనికి నవ్వుతూ ఆహ్వానించాడు. 'నీవు నాకు ఎంతగానో నచ్చావు. మనం పెండ్లి చేసుకొందాం.' ఎంతో ప్రేమగా పలికాడు. అతని మాటలను నమ్మింది సుందరి. విన్సెంట్ కౌగిలిలో కరగిపోయింది. పరస్పర ఆకర్షణ కౌగిలితో మొదలై గంటలో అంతా ముగిసిపోయింది. విన్సెంట్ · ప్లాన్ సవ్యంగా ఫలించింది. సుందరికి క్రొత్త అనుభవం. అయినా ఏదో ఆనందం పరవసించి సర్వస్వాన్నీ అర్పించింది.


సైకిల్ మీద హాలు దగ్గర దించాడు సుందరిని. సుందరి స్నేహితురాలిని కలిసింది. “ఎక్కడకి వెళ్ళావే..” స్నేహితురాలి ప్రశ్నకు 'అన్నతో బండి దగ్గర వున్నా’ అనే అబద్ధాన్ని అందంగా పలికింది సుందరి.


తర్వాత.. వారి కలయిక పగలే ప్రారంభం అయింది. యిలా నెలరోజులు గడిచాయి. సుందరి నెల తప్పింది. ఆ విషయాన్ని విన్సెంట్కు చెప్పింది. విన్సెంట్ నవ్వి.. 'భయపడకు మనం త్వరలో పెండ్లి చేసుకుంటాం.' ఎంతో అనునయంగా చెప్పాడు. సుందరి అతని మాటలను నమ్మింది.

ఆ మరుదినం విన్సెంట్ వూరికి వెళ్ళిపోయాడు సుందరికి చెప్పకుండానే. పదిహేను రోజులు గడిచాయి. అతని స్థానంలో అతను వెళ్ళిన మరసటి రోజే మరో రిప్రజెంట్ వచ్చాడు.


సుందరి భయంతో.. బాధతో ఏకాంతంలో ఎంతగానో పడ్చేది.. ఒకరోజు ఆ స్థితిలో ఆమెను చూచిన బాలరాజు కారణాన్ని అడిగాడు. జరిగిన తప్పును గురించి రోదిస్తూ చెప్పింది సుందరి.

బాలరాజు ఆగ్రహావేశాలతో.. అవమానంతో వూగిపోయాడు. కట్టలుతెగిన కోపంతో సుందరిని తిట్టాడు.. కొట్టాడు. బోరున తనూ ఏడ్చాడు. తనకంటూ తోడునీడగా వుంటున్నది ముగ్గురు. చిన్నసామి, మీరాసాహెబ్, చిలకమ్మ. తన హృదయాన్ని బద్ధలు కొట్టిన ఆ విషయాన్ని ఎంతో వేదనతో ఆ ముగ్గురికీ చెప్పాడు.


వారు ఎంతగానో ఆశ్చర్యపోయారు. బాలరాజును ఓదార్చారు. తీవ్రంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చారు. సినిమా హాలు యజమాని కోటేశ్వరరావుగారిని కలిసి విషయాన్ని చెప్పి విన్సంట్ను కలుసుకోవాలనుకొన్నారు. కోటేశ్వరరావును కలిశారు. సుందరికి జరిగిన అన్యాయాన్ని గురించి ఏడుస్తూ చెప్పారు. విన్సెంట్ అడ్రస్ అడిగారు.


కోటేశ్వరరావు మెయిన్ డిస్ట్రిబ్యూటర్కు ఫోన్చేసి విన్సెంట్ అడ్రస్ అడిగాడు. వాడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని, అడ్రస్ తన వద్దలేదని ఆ పెద్దమనిషి చెప్పాడు. అది విని నలుగురూ ఎంతగానో బాధ పడ్డారు. సుదీర్ఘంగా ఆలోచించి ఆ పిల్ల భవిష్యత్తు బాగుండాలని.. తనకు బాగా తెలిసిన లేడీ డాక్టర్ అడ్రస్ యిచ్చి అబార్షన్ చేయించమని వారికి సలహా యిచ్చాడు. తమ ప్రయత్నం ఫలించినందుకు ఆ నలుగురూ కోటేశ్వరరావుకు నమస్కరించి.. తీరని దుఃఖంతో అక్కడనుంచి వెళ్ళిపోయారు.


రిక్షాతోలే మల్లిగాడు ముందుకు వచ్చి సుందరిని పెండ్లి చేసికొంటానని జాగ్రత్తగా చూచుకొంటానని.. ఆ నలుగురికీ చెప్పాడు. చిన్నసామి, మీరాసాహెబ్, చిలకమ్మ.. బాలరాజును ఒప్పించారు. రేపు.. సుందరికి మల్లిగాడికి పెండ్లి.


మోసపోయి అన్నకు తల్లికి తలవంపులు తెచ్చిన సుందరి అవమానంతో ఆ రాత్రి.. వురి వేసుకొని తన సమస్యను.. శాశ్వతంగా మరచిపోయింది. మట్టిలో కలసిపోయింది. తన వారందరికీ తీరని దుఃఖాన్ని మిగిల్చింది.


దాదాపు నెలరోజులు చిన్నసామి, మీరాసాహెబ్, చిలకమ్మ, బాలరాజు.. మర్రిచెట్టు క్రింద తమ దుకాణాలను తెరవలేదు. పోయిన వారితో బ్రతికివున్నవారు పోబోయేది లేదుగా!.. వుపాది లేందే బ్రతుకు సాగదుగా!.. మనస్సులో బాధను ప్రక్కకు నెట్టి.. బ్రతుకు తెరువును మరలా సాగించారు ఆ నలుగురు.


అర్ధరాత్రి సమయం. చెట్టుక్రింద పడుకొని వున్న యిరువురు యాచకులు బెదిరిపోయారు. గాజులు, గజ్జెల సవ్వడి విని, భయంతో కళ్ళు తెరిచి చూచారు. సుందరి రూపం వారికి గోచరించింది. తల విరబోసుకొని.. ఆమె ఏడుస్తూ వుంది. ఆ ఆకృతిని చూచి వారు లేచి పరుగెత్తిపోయారు.


మరుదినం.. భయం భయంగా ఆ యిరువురూ చెట్టుక్రిందికి వచ్చారు. చిన్నసామికి, మీరాసాహెబ్క, చిలకమ్మకు, బాలరాజుకు రాత్రి తాము చూచిన.. సుందరి ఆకారాన్ని గురించి చెప్పారు. ఆ నలుగురూ.. వారి మాటలను నమ్మలేదు.


రెండవ ఆట సినిమా ప్రారంభం అయింది. బీడీ.. కాల్చుకొనే దానికి గేట్ కీపర్ కనకయ్య సైకిల్ స్టాండు దగ్గరికి వచ్చాడు. సుందరిని, విన్సెంట్.. యీ కనకయ్య సైకిల్ మీదనే.. తన రూమ్కు తీసుకొని వెళ్ళాడు. తనముందు నిలబడిన సుందరి వికృతాకారాన్ని చూచి కనకయ్య నేల కూలాడు. మరో గేట్ కీపర్ కాంతయ్య కూడా యీ సన్నివేశాన్ని చూచాడు. వాడు వెళ్ళి మిగతా హాలు సిబ్బందికి తను చూచిన దృశ్యాన్ని.. కనకయ్య స్థితిని గురించి చెప్పాడు.


అందరూ కలసి కనకయ్యను సమీపించారు. ముఖంపై నీళ్ళు చల్లారు. తేరుకున్న కనకయ్య తను చూచిన సుందరి గురించి చెప్పాడు ఎంతో భయంతో. కొందరు నమ్మలేదు, కొందరు నమ్మారు.

ఆ మరుసటి రోజు కూడా కనకయ్యకు సుందరి దర్శనం యిచ్చింది.. “నా చావుకు నీవూ కారణమేరా!.. నిన్ను నేను చంపుతా. సుందరి మాటలు విని కనకయ్య.. హడలిపోయాడు. సైకిల్మీద యింటికి వెళుతున్న కనకయ్య సైకిల్ వెనుక క్యారియర్ పై కూర్చుంది. “ఒరే!.. కనకా!..” వీపున చేయి వేసింది సుందరి.


కనకయ్య హడలిపోయాడు. వెనక్కు తిరిగి చూచాడు. క్యారియర్ పై సుందరి. వికటంగా నవ్వుతూ తన్నే చూస్తూ వుంది. కనకయ్య గుండె పగిలిపోయింది. సైకిల్ బ్యాలెన్సు తప్పింది. ఎదురుగా వస్తున్న లారీకి గుద్దుకుంది. సైకిల్ ముక్కలైపోయింది. కనకయ్య తల పగిలి పోయింది. లారీ అతనిపై వెళ్ళిపోయింది. కనకయ్య కథ ముగిసింది.


వూరంతా పుకారు.. సుందరి దయ్యం అయిందని.. కనకయ్యను చంపిందని. భయంతో హాల్లో పనిచేసే సిబ్బంది రావడం మానేశారు. జనం రాత్రిపూట ఆ ప్రాంతంలో తిరగడం లేదు. సినిమా హాలు మూతపడింది. సుందరి దయ్యం అయ్యి మర్రిచెట్టుపై వుందని.. రాత్రి సమయంలో సినిమాహాలు ఆవరణంలో.. తిరుగుతూ వుందని వూరంతా పుకారు ప్రబలింది.


తనకు జరిగిన నష్టానికి కోటేశ్వరరావు తల్లడిల్లిపోయాడు. మునిసిపల్ అధికారులతో మాట్లాడి రాత్రికి రాత్రి.. ఆ వట వృక్షాన్ని నేలమట్టం చేయించాడు. అక్కడ చెట్టు వుండిన ఏ ఆనవాలు లేకుండా చేశాడు సూర్యోదయానికి ముందే.


మరుదినం చిన్నసామి, మీరాసాహెబ్, చిలకమ్మ, బాలరాజు.. అక్కడికి వచ్చారు. ఎన్నో ఏళ్ళుగా తమకు ఆశ్రయంగా నిలచివున్న ఆ మహావృక్షం మాయం అయిపోయినందుకు ఎంతగానో బాధపడ్డారు. ఒకరిని పట్టుకొని ఒకరు ఏడ్చుకున్నారు. గూడులేని పక్షులమై పోయామని వాపోయారు.


అందరూ కలసి ఆ వూరు వదలి.. మరో వూరి వైపుకు బయలుదేరారు ఆ చెట్టుక్రింది పక్షులు.


* * *

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


Podcast Link:

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.


76 views0 comments

Comments


bottom of page