చిత్రం భళారే విచిత్రం
- Sathyanarayana Murthy M R V

- Jan 1
- 5 min read
#చిత్రంభళారేవిచిత్రం, #ChitramBhalareVichitram, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Chitram Bhalare Vichitram - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy Published In manatelugukathalu.com on 01/01/2026
చిత్రం భళారే విచిత్రం - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
“వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, టమాటా.. కూరలమ్మా.. కూరలు” గట్టిగా పిలుస్తూ బండి తోసుకుంటూ వెళ్తున్నాడు కనకారావు.
“కనకారావ్.. ఒక్క నిముషం ఉండు” అంది నీరజ.
“అలాగే అమ్మా” అని బండి ఆపి నిలబడ్డాడు కనకారావు. నీరజ కూరల బుట్ట తీసుకుని వచ్చి “బెండకాయలు ఎంత?” అని అడిగింది.
“కేజీ. ఎనభై అమ్మా” అన్నాడు కనకారావు. నీరజ వెనకాలే వచ్చిన కిషోర్ ఆశ్చర్యంగా” ఏమిటీ, ఎనభయ్యా? మా ఊరిలో నలభై రూపాయలే. ఆంటీ, ఇతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు” అని అన్నాడు.
“బాబూ, మొన్న నెలరోజుల పాటు వర్షాలు విపరీతంగా కురిసాయి. మధ్యలో వాయుగుండం ఒకటి. కూరగాయల పాదులన్నీ పాడైపోయాయి. దూరం నుండి తెప్పిస్తున్నాం” అన్నాడు కనకారావు.
నీరజ కేజీ బెండకాయలు తీసుకుంది. “టమాటాలు ఎంత?” అడిగింది.
“ఏభై అమ్మా. మీకు నలభైకి ఇస్తాను. ఎవ్వరితో అనకండి” అని కేజీ టమాటాలు కూడా తూచి ఇచ్చాడు కనకారావు. అది విని రెండో సారి ఆశ్చర్యపోయాడు కిషోర్.
“ఆంటీ, టమాటాలు మా ఊరిలో ఇరవై రూపాయలే. ఇతని దగ్గర కొనకండి. మనం రైతు బజారుకి వెళ్దాం. నేను తోడు వస్తాను” అన్నాడు కిషోర్.
“మా ఊరిలో రైతుబజారు లేదు. ఇలా బండి వాళ్ళ దగ్గర కొనుక్కోవాలి” అంది చిన్నగా నవ్వుతూ నీరజ. మిగతా కూరలు కూడా కొని, బుట్టలో వేసుకుని డబ్బులు తేవడానికి లోపలకి వెళ్ళింది. అయిదు కూరలకి నాలుగు వందల రూపాయలు అయ్యాయి. అది చూసి తట్టుకోలేకపోతున్నాడు కిషోర్. ఆవేశంగా వెళ్లి ఇంటి గోడకు చేర్చి ఉన్న రెండు అడుగుల ఇనుప ఊచ తీసుకువచ్చాడు. గత సాయంత్రమే పూల మొక్కలు తెచ్చి ఊచతో గోతులు తీసి వాటిని పాతి, ఊచని గోడదగ్గర పెట్టింది నీరజ.
కిషోర్ ఇనుప ఊచతో, కూరల బండి చుట్టూ గీత గీసాడు. జేబులోంచి చారల గీతలు ఉన్న ఒక ప్లాస్టిక్ బాల్ లా ఉన్న దానిని తీసి, కూరల మధ్య పెట్టాడు. ఇంకో జేబులోంచి ప్లాస్టిక్ రిమోట్ తీసాడు. కళ్ళు పెద్దవి చేసి, బుసలు కొడుతున్న త్రాచు పాములా, తీక్షణంగా కనకారావు కేసి చూసాడు. ఆ కుర్రాడి చేష్టలు అర్ధం కాక అతనికేసి చూస్తున్నాడు కనకారావు.
“చూడు కూరలబ్బీ, నువ్వు మా ఆంటీని మోసం చేసి, ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నావు. నీ కూరల బండిలో బాంబు పెట్టాను. నువ్వు వెంటనే ఇక్కడినుండి వెళ్ళిపో. ఇంకా డబ్బులు కోసం అంటూ ఇక్కడే ఉన్నావా, ఈ రిమోట్ తో నీ బండి పేల్చేస్తాను” అన్నాడు కిషోర్ ఆవేశంగా కుడి చేతితో కుడి తొడమీద కొడుతూ.
కనకారావుకి మతి పోయింది అతని మాటలకి. వళ్ళంతా చెమటలు పట్టేసాయి. ‘అమ్మో, ఈ కుర్రాడు రాయలసీమ నుంచి వచ్చినట్టున్నాడు. బతికుంటే పల్లీలు అమ్ముకుని అయినా బతకచ్చు’ అని నిశ్చయించుకుని, “బాబూ ఆ బాంబు నీచేతులతోనే తీసేయ్. నేను వెళ్లి పోతాను” అన్నాడు భయంగా.
కిషోర్ గంభీరంగా నడుచుకుంటూ వెళ్లి, కూరల మధ్యన ఉన్న ప్లాస్టిక్ బాల్ తీసి జేబులో వేసుకున్నాడు. అంతే.. మెరుపు వేగంతో కూరల బండి తోసుకుంటూ వీధి చివరవరకూ వెళ్ళిపోయాడు కనకారావు.
లోపలనుండి వచ్చిన నీరజ, కూరల బండి అతను లేకపోవడంతో కిషోర్ ని అడిగింది, అతను ఏమయ్యాడని?. దానికి చిన్నగా నవ్వి “వాడికి స్పాట్ పెట్టాను. భయపడి పారిపోయాడు” అని ఇంట్లోకి వెళ్ళిపోయాడు కిషోర్, పెద్దగా అంగలు వేసుకుంటూ. ‘మావాడు బాలకృష్ణ సినిమాలు ఎక్కువ చూస్తాడు’ అని ఆడపడచు వనజ చెప్పిన మాటలు గుర్తుకువచ్చి నవ్వుకుని లోపలకు వెళ్ళింది నీరజ.
వారంరోజులకు వాళ్ళు వెళ్లిపోయాక, భయపడుతూ వచ్చిన కనకారావుని అడిగింది నీరజ, “ఆరోజు డబ్బులు తీసుకోకుండా ఎందుకు వెళ్ళిపోయావు?” అని. కనకారావు, ఆరోజు కిషోర్ చేసిన హడావిడి నీరజకు చెప్పాడు. అదివిని పగలబడి నవ్వింది నీరజ.
***************
“రా వదినా రా” అంటూ ఎంతో ఆనందంగా ఆహ్వానించింది నీరజ.
వినీల చిరునవ్వులు చిందిస్తూ పిల్లాడిని తీసుకుని లోపలకు వచ్చింది.
“ఏరా డుంబూ ఎలా ఉన్నావ్?” అంటూ మేనల్లుడి బుగ్గలు పట్టుకుని ఆప్యాయంగా అడిగింది నీరజ.
“ఓకే.. ఫైన్” అని కళ్ళు వింతగా ఆర్పుతూ సోఫాలో కూర్చున్నాడు పదేళ్ళ డుంబూ, అనే దామోదర్.
నీరజకు వాడు అంటే చాలా ఇష్టం. వాడు జానపద గీతాలు బాగా పాడతాడు. ఆరోజు భోజనంలో వాడికి ఇష్టం అని ‘బొబ్బట్లు’ కూడా చేసింది నీరజ.
“నేను ఇంటి ఆడపడుచుని అయినా నాకంటే నువ్వు వాడినే బాగా చూస్తావు ఎప్పుడూ” అంది వినీల.
అది నిష్టూరంతో కూడిన ఆనందం అని నీరజకు బాగా తెలుసు. ఆ సాయంత్రం డుంబూ చేత తనకు ఇష్టమైన పాటలన్నీ పాడించి మురిసిపోయింది నీరజ. వాళ్ళు ఇద్దరినీ అలా చూసి చాలా సంతోషించింది వినీల. బ్యాంకు ఆఫీసర్ గా పనిచేస్తున్నానన్న ‘గర్వం’ ఏనాడూ నీరజ ప్రదర్శించదు. చాలా కలుపుగోలు మనిషి. అందుకనే పెద్దన్న గారి ఇంటికి వెళ్ళకుండా, తరుచూ నీరజ ఇంటికే వస్తుంది వినీల.
వారం రోజులు గడిచాయి. ఆదివారం ఉదయం సింహాచలం పెరట్లో అంట్లు తోముతోంది. ఆమె కూతురు ఏడుస్తూ “నాకు డబ్బులు ఇయ్యి. నేను సినిమాకు వెళ్తాను” అంటోంది.
“ఇప్పుడు కుదరదు. పై వారం వెల్దువుగాని” అని అంది సింహాచలం.
కూతురు ఆమె మాటలు వినడంలేదు. ఇంకా ఏడుస్తూనే ఉంది. ఇది అంతా గమనించాడు డుంబూ. నెమ్మదిగా ఆ అమ్మాయి దగ్గరకు వచ్చాడు. గట్టిగా ఆ అమ్మాయిని కౌగలించుకున్నాడు.
“బాధపడకు. పై వారం వెళ్ళు సినిమాకు. హ్యాపీ గా ఉండు” అని అన్నాడు డుంబూ.
అతని చర్యకి ఆ అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఆమె ప్రయత్నం లేకుండానే ఆమె ఏడుపు ఆగిపోయింది. సింహాచలం గిన్నెలు తోమడం ఆపి, నోరు తెరుచుకుని వాళ్ళు ఇద్దరికేసీ చూస్తూండిపోయింది.
సింహాచలంకి టీ పట్టుకొచ్చిన నీరజ ఆ దృశ్యం చూసి అవాక్కైపోయింది.
కొద్దిసేపటికి తేరుకున్న నీరజ “ఏమిటిరా డుంబూ ఇది?” అంది. ఆ అమ్మాయిని వదిలి అత్త దగ్గరకు వచ్చాడు డుంబూ. “ఏమీ లేదు అత్తా. ఆ అమ్మాయి ఏడుస్తూఉంటే ‘ఫ్రెండ్లీ హగ్’ ఇచ్చాను. చూడు ఏడుపు మానేసింది” అన్నాడు నవ్వుతూ.
తొమ్మిదేళ్ళ ప్రమీల సిగ్గుగా వాళ్ళ అమ్మ వెనకచేరి డుంబూ కేసి ఆసక్తిగా చూస్తోంది. సింహాచలం, నీరజ కూడా నవ్వుకున్నారు వాడి మాటలకి.
ఆరోజు సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన భర్తకి, డుంబూ ‘ఫ్రెండ్లీ హగ్’ గురించి చెప్పగానే అతను కూడా గట్టిగా నవ్వాడు. “శంకర్ దాదా ఎం. బి. బి. ఎస్. సినిమా చాలా మంది మీద ప్రభావం చూపింది’ అన్నాడు కేశవ.
******************
ఒకరోజు బ్యాంకు నుండి ఇంటికి వచ్చిన నీరజ ఇంటిముందు ఉన్న కారు చూసి ఆశ్చర్యపోయింది.
స్కూటీ పార్కు చేసి, లోపలకు రాగానే కేశవతో మాట్లాడుతున్న సుప్రజను చూడగానే ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. సుప్రజ, కేశవ పినతండ్రి రాఘవరావు కూతురు. తూర్పు గోదావరి జిల్లాలో ఒక మండలానికి తహసీల్దార్ గా పనిచేస్తోంది. పక్కనే ఆమె పిల్లలు శ్రీదేవి, శ్రీకృష్ణ ఉన్నారు. కుశలప్రశ్నలు అయ్యాకా ‘భీమవరం వెళ్తూ అన్నయ్యని ఒకసారి చూద్దామని వచ్చాను’ అంది సుప్రజ.
“చాలా సంతోషం. ఈ రూపేణా అయినా మా ఇంటికి వచ్చావు. అయిదేళ్ళు అయ్యింది నువ్వు వచ్చి” అంది నీరజ. ‘పిల్లలు ఏం చదువుతున్నారు?” అని అడిగింది.
“శ్రీకృష్ణ ఏడవతరగతి, శ్రీదేవి అయిదవతరగతి” అంది సుప్రజ. పిల్లలు ఇద్దరికీ ‘హాయ్’ చెప్పింది నీరజ.
వాళ్ళు కూడా ‘హాయ్ ఆంటీ’ అని అన్నారు. మర్నాడు ఆఫీస్ పనిమీద భీమవరం వెళ్ళింది సుప్రజ. పిల్లలు ఇద్దరూఇంట్లో ఉన్నారు. నీరజ బ్యాంకుకి సెలవు పెట్టి వాళ్ళతో కబుర్లు చెప్పింది.
శ్రీకృష్ణ మాట్లాడిన పదినిముషాలలో వాళ్ళ ‘రాధిక మేడం’ గురించి చాలా సార్లు ప్రస్తావించడం గమనించింది నీరజ. “రాధిక మేడం నీకు ఏ సబ్జెక్టు చెబుతారు?” అడిగింది శ్రీకృష్ణని, నీరజ.
“ఇంగ్లీష్. ఆమె లెసన్ చెబుతుంటే క్లాస్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ ఆంటీ. చాలా స్వీట్ వాయిస్ ఆమెది”మెరుస్తున్న కళ్ళతో అన్నాడు శ్రీకృష్ణ. అది గమనించింది నీరజ. పిల్లలతో కేరమ్సు ఆడింది నీరజ. ‘దాడి’ ఆట నేర్పింది ఇద్దరికీ. వాళ్ళు చాలా సంతోషించారు.
ఆ మర్నాడు సుప్రజ, పిల్లలతో కలిసి వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది. సుప్రజకి, పిల్లలకి బట్టలు పెట్టింది నీరజ. రెండు రోజులు గడిచాకా గెస్ట్ రూమ్ సర్దుతుంటే తలగడ కింద ఒక లెటర్ కనిపించింది. అది చదివి నీరజ ఆశ్చర్యపోయింది. సాయంత్రం కేశవ వచ్చాకా అతనికి ఇచ్చింది ఆ ఉత్తరం.
“డియర్ రాధా. మీరు క్లాస్ లోకి రాగానే నాలో కొత్త ఉత్సాహం కలుగుతోంది. మీరు లెసన్ చెబుతున్నంతసేపూ కన్నార్పకుండా మిమ్మల్నే చూస్తున్నాను. మీరు క్లాస్ విడిచి వెళ్ళగానే నాకు చాలా చిరాకు కలుగుతోంది. మిగతా సబ్జెక్టులు కూడా మాకు మీరే చెబితే బాగుంటుంది. ప్రిన్సిపాల్ గారికి ఆ విషయం చెప్పాలని అనుకుంటున్నాను. మీకు పెళ్లి కాలేదని తెలిసింది. నా చదువు అయ్యి, ఉద్యోగం రాగానే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. అంతవరకూ మీరు తొందరపడకండి. మన ఇద్దరి పేర్లు కూడా బాగా కలిసాయి. ‘కృష్ణ-రాధ’. ఓహ్.. సూపర్.. ” ఉత్తరం చివర మురళి ఊదుతున్న కృష్ణుడి బొమ్మ ఉంది.
ఉత్తరం చదివిన కేశవ చిన్నగా నవ్వి, “ఈ పిల్లలతో మనకు మరో అనుభవం అన్నమాట” అని అన్నాడు. నీరజ కూడా చిరు దరహాసం చేసింది.
సమాప్తం.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






@mrvsmurthy311
•15 hours ago
ధన్యవాదాలు మేడం. చక్కగా చదివారు..