top of page
Original.png

చిత్రం తెచ్చిన మార్పు

చిత్రం తెచ్చిన మార్పు, కుటుంబ కథ, దాంపత్య జీవితం, విడాకులు, అపార్థాలు, WhatsApp, తెలుగు కుటుంబ కథ, Emotional Telugu Story, Family Relationships, Marriage Story, Parenting

ఒక చిత్రం, ఒక తల్లి సందేశంతో మళ్లీ ఒక్కటైన కుటుంబం – చిత్రం తెచ్చిన మార్పు
ఒక చిత్రం, ఒక తల్లి సందేశంతో మళ్లీ ఒక్కటైన కుటుంబం – చిత్రం తెచ్చిన మార్పు

Chitram Thechhina Marpu - Telugu Family Story | Dr. Lakshmi Raghava Kamakoti

చిత్రం తెచ్చిన మార్పు - తెలుగు కుటుంబ కథ | డా. లక్ష్మీ రాఘవ కామకోటి

Published In manatelugukathalu.com On 18/07/2026


కుటుంబాలు పెద్ద గొడవలతో కూలిపోవు... చిన్న అపార్థాలు పెద్ద అహంకారాలుగా మారినప్పుడు కూలిపోతాయి. భార్యాభర్తల మధ్య సమస్యల్లో పెద్దలు నిప్పు రాజేయడం కాదు, వంతెన కావాలి. "చిత్రం తెచ్చిన మార్పు" కథలో ఒక ఫేస్‌బుక్ చిత్రం, ఒక భావోద్వేగ కవిత, ఒక తల్లి చొరవ ఎలా ఒక కుటుంబాన్ని మళ్లీ కలిపాయో హృదయాన్ని తాకేలా చూపించారు.


తెగేదాకా బిగదీసుకుపోతుంటే

ఎంత కష్టం... ఎంత నష్టం!

రెండు హృదయాలు "స్థానభ్రంశ"మౌతుంటే

ఎంత కష్టం... ఎంత నష్టం!

రెండు మనసులొక్కటై

ఊసులెన్నో పంచుకుని... ఊహల 'మేనా'లో ఊరేగి

ఆ హృదయాలొక్కసారిగ నేలకూలితే

ఎంత కష్టం.. ఎంత నష్టం!

తినే కంచంలో మట్టి పోసుకున్నట్టుగా... 

అల్లుకున్న పూపొదరిల్లును పీకి పారేసి, 

విజయగర్వంతో వికటట్టాహాసం చేస్తే

ఎవరికి కష్టం... ఎవరికి నష్టం?

---------

అంకితం

చిన్న చిన్న కారణాలతో బంగారం లాంటి బంధాలను కాలదన్నుకుంటున్న జంటలకు బాధతో... 


****

ఎంత చక్కటి చిత్రం! ఎంత బరువైన భావవ్యక్తీకరణ!

ఫేస్బుక్ నుంచి లాగౌట్ అవుతూ మనసులోనే అనుకుంది అపర్ణ. 


ఫోటో కోసం ఆ వాక్యాలు రూపొందాయా... లేక... ఆ వాక్యాల కోసమే ఆ ఫోటో తయారయిందా? అనుకున్న అపర్ణ పెదాలపై విరిసిన ఆ నవ్వు... ఏదో గుర్తుకు వచ్చి, పేలవంగా ముగిసి, ఆమె మనసును బలంగా కుదిపినట్టయింది. 


ఆ శిల్పం చిత్రం వైపు మరోసారి చూసింది. ఆ చిత్రం లోని ఇద్దరు వ్యక్తులు వేర్వేరు దిక్కులకు తిరిగి కూర్చోవడం, వాళ్ళ మధ్య తెగుతున్న దారం, పగిలిన గుండె ముక్క... ఇవన్నీ చూడగానే ఆమెకు తన సొంత కూతురు కావ్య, అల్లుడు సందీప్ గుర్తుకొచ్చారు. ఎంతో ఇష్టంగా కోరి చేసిన సంబందం ఇది కావ్యకు. చాలా ఎంతో అన్యోన్యంగా ఉన్న ఆ జంట, ఇప్పుడు విడాకుల వరకు వెళ్ళేలా ఉండటం ఆమె కళ్లముందు కదలాడుతుంది. 


ఇప్పుడు ఈ చిత్రం చూసి ఆమె మనసులో ఒక ప్రశ్న... 

"తను ఈ విషయంగా ఒక ఫోన్ చేసి ఉంటే... 

ఒకసారి ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడించి ఉంటే... 

ఈ రోజు వాళ్ల బిడ్డ తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యేవాడా?"


అసలు కావ్య, సందీప్‌ల మధ్య గొడవ చాలా చిన్న విషయంతో మొదలైంది. 

కావ్య, సందీప్ ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే. కోవిడ్ తర్వాత మారిన కార్పొరేట్ ప్రపంచంలో ఇద్దరికీ వర్క్ ఫ్రమ్ హోమ్. 


ఒకరోజు ఐదేళ్ల కొడుకు చింటు స్కూల్ నుండి వచ్చే సమయం అది. ఆ రోజు కావ్యకు ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉంది. 


ఆమె సందీప్ గదిలోకి వెళ్లి, "సందీప్! సరిగ్గా నాలుగు గంటలకు చింటు స్కూల్ బస్ వస్తుంది. నాకు అదే సమయానికి యు. ఎస్ (US) క్లయింట్‌తో మాట్లాడాలి, ప్రెజెంటేషన్ నాదే. ప్లీజ్, ఒక్క ఐదు నిమిషాలు కిందికి వెళ్లి వాడిని తీసుకురావా?" అంది బ్రతిమాలుతున్నట్టుగా. 


సందీప్ కూడా ల్యాప్‌టాప్ ముందే ఉన్నాడు. "కావ్యా, నాకు కూడా అదే టైమ్‌కి నా మేనేజర్‌తో వన్-టు-వన్ మీటింగ్ ఉంది. నేను లాగౌట్ అవ్వలేను. నువ్వే నీ మీటింగ్ కాస్త అటూ ఇటూ చూసుకోరాదా?" అన్నాడు కాస్త విసుగ్గా. 


"నాకు కెరీర్‌లో ఇది ఎంత ముఖ్యమైన అవకాశమో నీకు తెలుసు. ఎప్పుడూ నా ఉద్యోగాన్ని నువ్వు తక్కువ చేసి చూడటమే!" అంది కావ్య ఆవేశంగా. "నీకు ఎప్పుడూ నీ ఆఫీసే ముఖ్యం…" అన్నాడు సందీప్ అంతే వేగంగా. 


చివరకు కావ్య తన మీటింగ్‌ను మొబైల్‌లో లాగిన్ చేసి, ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని కంగారుగా కిందికి పరిగెత్తింది. కానీ, ఆ కంగారులో సరిగ్గా బస్ దిగుతున్న చింటును పట్టుకోబోయి కావ్య కాలు జారి కింద పడింది, చేతిలోని ఫోన్ స్క్రీన్ పగిలి మీటింగ్ కట్ అయిపోయింది. ఆ రోజు ఆమె ప్రెజెంటేషన్ ఇవ్వలేకపోయింది. 


ఇక్కడితో ముగిసిపోవాల్సిన చిన్న విషయానికి ఇరు కుటుంబాలూ తోడయ్యాయి. 

కావ్య ఏడుస్తూ వాళ్ళ నాన్నకామేశానికి ఫోన్ చేసి చెబితే, ఆయన అల్లుడికి ఫోన్ చేసి, "మా అమ్మాయిని చదివించి, ఉద్యోగం ఇప్పించింది ఇంట్లో పనులన్నీ చేయడానికి కాదు. ఆమె కెరీర్‌ను నాశనం చేసే హక్కు మీకు లేదు" అని కాస్త గట్టిగా మాట్లాడారు. 

ఇటువైపు సందీప్ తల్లి, "మా అబ్బాయి లక్షల్లో సంపాదిస్తున్నాడు. ఈమె ఉద్యోగం చేయకపోతే వచ్చే నష్టమేమీ లేదు. మొగుడితో సమానంగా ఆఫీస్ మీటింగులు అంటూ పంతాలకు పోతే ఎలా? మర్యాద లేదు" అని కామెంట్ చేశారు. 


ఇరు కుటుంబాలు అహంకారంతో నిప్పుకు ఆజ్యం పోశాయి. "నువ్వు తగ్గద్దు అంటే... నువ్వు తగ్గద్దు" అంటూ వెనుక నుండి నూరిపోశారు. ఫలితంగా... కావ్య లగేజ్ సర్దుకుని పుట్టింటికి వచ్చేసింది. రోజులు గడుస్తున్నాయి. కూతురి కాపురం కోసం తపన పడుతున్న అపర్ణకు దేవుడు ఇంకా పెద్ద షాకు ఇచ్చాడు. 


అనుకోకుండా ఒక రోజు కామేశ౦ ఉన్నట్టుండి పడిపొయ్యాడు. అంబులెన్స్ లో అరగంటలో హాస్పిటల్ చేరినా లాభం లేక పోయింది. కార్డియాక్ అరెస్ట్ అన్నారు. నాన్నకు జరగవలసిన కార్యక్ర మాలన్నీ కావ్య నే చూసుకుంది. తోడుగా అపర్ణ అన్నయ్య వచ్చాడు. ఒక్క రోజు మాత్రం సందీప్ వచ్చి వెళ్ళాడు. వారి ఇంటివారెవ్వరూ రాలేదు. ఇది కావ్య మనసుని మరింత గాయపరిచింది.

 

“చూశావా అమ్మా, ఇలాటి పరిస్థితి లో కూడా వచ్చిమేమున్నామని పలకరించలేదు వాళ్ళు. ఆ కుటుంబం లో ఎలా ఇమడాలి? పోనీ సందీప్ అయినా మళ్ళీ రాలేదు. నీ కోసమైనా రావాలి లేదా ఒంటరిగా అంతా చేస్తున్నావా అని నన్ను అడగాలి కదా. ” బాధగా అంటూన్న కూతురికి సమాధానం చెప్పలేక పోయింది అపర్ణ. 


కనీసం అల్లుడు వచ్చిఉండాల్సింది అనిపించింది ఆమెకు కూడా... 

ఒక నెల గడిచాక అపర్ణ కు చింటూ గురించిన బెంగ పట్టుకుంది. పిల్లల పంతాలకు వత్తాసు పలికితే నష్ట పోయేది ఎవరు? భార్యా భర్తల కంటే ఎక్కువ వారి పిల్లలు కాదా? అందుకే కావ్య తో చెప్పింది,

“చింటూ వాళ్ళ నాన్నకు దూరం కాకూడదు కావ్యా. వారానికి ఒక్కసారైనా చింటూ ను తన దగ్గరికి పంపు”

అన్నదానికి కయ్యిమని లేచింది కావ్య. 


“అమ్మా, నీవు అనవసరం గా ఇవన్నీ చెబుతున్నావు. సందీప్ అంతగా చూడాలనుకుంటే స్కూల్ కి వెళ్ళి చూస్తాడులే” అని తిప్పి కొట్టడంతో వూరుకుంది. 


సందీప్ స్కూల్ కి వచ్చి వెడుతున్నట్టు తెలిసి కాస్త మనసు తేలిక అయ్యింది. 

అయినా తల్లిగా కావ్య జీవితం గురించిన బెంగ తగ్గలేదు. 


ఒక్కోసారి అపర్ణ మనసులో "ఇద్దరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సర్దుకుంటుందేమో" అనిపించినా, ఆమెకు కావ్య పంతం తెలుసు కనుక వెనకడుగు వేసి, మౌనంగా ఉండిపోయింది. ఆ మౌనమే ఇప్పుడు ఒక పెద్ద శాపంగా మారి ఈ రోజు చింటు జీవితాన్ని మార్చేసింది. 


నిజంగా ఈ గొడవల మధ్య నలిగిపోతున్నది మనమడు చింటూ నే. స్కూల్ దగ్గర మాత్రమే తండ్రి ని కలుస్తూ మిగతా రోజుల్లో తల్లి దగ్గర ఉంటూ... వాడి మనసు ఎంత వికలమైపోతోందో అపర్ణ గుర్తుచేసుకుంటుంది. మొన్ననే చింటు అడిగాడు"అమ్మమ్మ, నా ఫ్రెండ్స్ అందరితో వాళ్ల మమ్మీ డాడీ కలిసి ఉంటారు. నాన్న నాతో ఎందుకు ఉండరు? నేను బ్యాడ్ బాయ్‌నా?" అని. ఆ ప్రశ్న అపర్ణ గుండెను పిండేసింది. తినే కంచంలో మట్టి పోసుకోవడం అంటే ఇదే కదా!


 ఈ రోజు ఈ fb పోస్ట్ వల్ల అపర్ణ మనసులో ప్రశ్నల పరంపర మొదలైంది

"ఫోన్ చేసి ఒక్కసారైనా అల్లుడితో వివరంగా మాట్లాడి ఉంటే ఏమయ్యేది?"


"ఇద్దరినీ ఒకదగ్గర కూర్చోబెట్టి, గట్టిగా మందలించి మాట్లాడించి ఉంటే... ఈ రోజు ఆ చిన్నారి బిడ్డ తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యేవాడా?"


విజయగర్వంతో వికట్టహాసం చేస్తున్నది ఇరు కుటుంబాల అహాలే తప్ప, అక్కడ గెలుస్తున్నది ఎవరు? ఇద్దరికీ నష్టమే కదా! ఒక్కసారిగా వీపు మీద ఎవరో చరిచినట్టయ్యింది అపర్ణకు. ఇక ఆలస్యం చేయకూడదు అనిపించింది. ఎవరు ఏమనుకున్నా, ఏమన్నా పర్వాలేదు, ఒక తల్లిగా తనే చొరవ తీసుకోవాలి. ఆమె కావ్యకు వేరుగా, సందీప్‌కు వేరుగా సందేశం పంపితే మళ్ళీ అపార్థాలు వస్తాయి.


అందుకే ఇద్దరినీ కలిపి ఒక WhatsApp Group క్రియేట్ చేసి

ఆ గ్రూప్‌లో ఈ శిల్పం చిత్రం పెట్టి, అక్కడ రాసిన కవితను పోస్ట్ చేసింది. దాని కింద ఇలా రాసింది


"పిల్లలూ, మీ ఇద్దరి మధ్య సంబంద దారం తెగిపోతుంటే చూస్తూ మౌనంగా ఉన్నందుకు ఈ తల్లిగా నన్ను క్షమించండి. మీ వెనుక ఉండి నిప్పు రాజేసిన మా అందరిదీ తప్పే. కానీ మీరు కూడా మీ పంతాల కోసం అదే తప్పు చేస్తూ అమాయకపు చింటు జీవితాన్ని బలి చేయకండి. 


తెగిపోయిన దారం మళ్లీ ముడి వేయొచ్చు... 

కానీ ప్రయత్నం చేయకముందే వదిలేయొద్దు. 

రేపు సాయంత్రం నేను మీ ఇద్దరూ కలవడం కోసం ఇంట్లో ఎదురుచూస్తుంటాను. చింటు కోసం కలవండి. " అని మెసేజ్ పంపినా మనసులో గాబరా తగ్గలేదు. అసలు ఈ గ్రూప్ ని వారు ఇద్దరూ చూస్తారా? అన్నది ఒక పెద్ద ప్రశ్న అయితే చూశాక తన కోరికను మన్నిస్తారా??.. మనసు అలజడిని ఆపడానికి దేవుడి దగ్గర దీపం వెలిగించి “నా ప్రయత్నానికి తోడుగా ఉండు స్వామీ“ అని మనసారా కోరుకుంది. 


రోజంతా ఎటువంటి సమాదానమూ రాలేదు. ఒకవేళ తన పోస్ట్ చూసినా కావ్య, సందీప్ ఇద్దరూ నిశ్శబ్దంగా ఉండిపోయారేమో అని అనుమాన పడింది అపర్ణ. 


కావ్య మామూలుగా ఆఫీసుకు వెళ్ళి పోవడం తో కాస్త కోపం కూడా వచ్చింది. ఇక వీరి కలయిక సాధ్యమేనా అన్న అనుమానం వేసింది. 


ఇంటి దగ్గరే ఉన్న వెంకటేశ్వరుడి గుడిలో అర్చన చేయించి, ఇక భారం నీదే స్వామీ’ అని నమస్కారం పెట్టుకుని వచ్చింది. 


సాయంత్రం ఇంటి ముందు ఆగిన కార్లోంచి దిగుతున్న అల్లుడిని చూసి ఎంతో సంతోషం అయ్యింది. 


సాధ్యమైనంత నార్మల్ గా పలకరిస్తూ మంచినీళ్లు, కాఫీ ఇచ్చింది. మామగారి తర్వాత ఎలా ఉంటున్నారు అంటూ అతి సామాన్యంగా అడిగాడు సందీప్. ఆయన లేని కొరతను కొంతవరకూ చెప్పింది.. ఇంతలో చింటూ స్కూల్ బస్ రావటం జరిగినది. ఇంట్లోకి రాగానే చింటు పరిగెత్తుకెళ్లి తండ్రిని హత్తుకున్నాడు. సందీప్ చింటూ ని ముద్దు పెట్టుకుని దగ్గర కూర్చో బెట్టుకుని ఆప్యాయంగా చెయ్యివేసి మాట్లాడుతున్నాడు. అప్పుడు కావ్య ఆఫీసు నుండీ వచ్చింది. ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూస్తే సంతోషం అనిపించింది. 


“ఆఫీసు నుండీ తొందరగా వచ్చేసావే కావ్యా” అంటూన్న అతని మాటకు “అవును ఈ రోజు పని తొందరగా అయ్యింది” అంది నార్మల్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ... 

‘కూర్చో’ అంటూ కాస్త పక్కకు జరిగాడు సోఫాలో. కావ్య అప్రయత్నంగా కూర్చుంది అతని పక్కనే. 


సందీప్ కోసం చేతిలో ప్లేట్ లో స్వీటు, మురుకులు పెట్టుకుని అక్కడికి వచ్చిన అపర్ణ కు ఆ దృశ్యం మనోహరంగా అనిపించి కళ్లల్లో ఆనందబాష్పాలు నిండాయి. 

సందీప్ కావ్యతో ఏదో మాట్లాడబోతూంటే అపర్ణ టిఫిన్ ప్లేట్ సెంటర్ టేబల్ మీద పెట్టి పక్కకు తప్పుకుంది. 


"సారీ కావ్యా, ఆంటీ మెసేజ్ చూసిన తర్వాత రాత్రంతా నిద్రపట్టలేదు. చింటూ ఫోటోలు చూస్తూ కూర్చున్నాను. మనం ఎక్కడ తప్పిపోయామో అప్పుడు అర్థమైంది. దూరంగా ఉన్నానన్న మాటే కానీ నీవూ చింటూ లేకుండా నరకం అనుభవిస్తూ ఉన్నాను. ఎన్నో సార్లు ఫోను చేద్దామనుకున్నా.. ”


“నేనూ ఆ కవిత మూడుసార్లు చదివాను. కోపం తగ్గాక... నా తప్పు కూడా కనిపించింది అంతే కాదు ఈ మధ్య నాకూ జీవితం ఇదికాదు అనిపిస్తూంది. అయినా మీకూ నేను, చింటూ కావాలని అనిపించాలి.. అని ఫోన్ చేయలేదు... ” మెల్లిగా అంది కావ్య.


ఆ మాటలతో ఆర్తిగా కావ్య భుజం మీద చేయి వేసి నొక్కాడు సందీప్ ప్రేమను తెలుపుతూ, 

“ఇంకో విషయం చెప్పనా.. fb లో ఆ పోస్ట్ పెట్టింది నా ఫ్రెండే. నేను పడుతున్న బాధను గమనించి అతను రచయిత కాబట్టి ఆ పోస్ట్ పెట్టి నాకు చూపించాడు. అది నీవు చూడాలని అనుకున్నాం. అనుకోకుండా మీ అమ్మ చూశారు. మా నాన్న నాకు చూపించి ఇది ఒకసారి చూడు“ అన్నారు. 


మనం దూరం కావడానికి ఒక విధంగా పెద్దవారు కూడా కారణం కాబట్టి వారిలో మార్పు కూడా అవసరం అనుకున్నా” ఆమాటకు కావ్య తలెత్తి సందీప్ ని చూసింది. 


“ఏమైతేనే౦, చివరకు వాళ్ళు కూడా తగ్గేలా చేసామా లేదా?” అంటూ నవ్వుతున్న సందీప్ తో

“ఇది మన ఇద్దరి సమస్య బాబూ... మధ్యలో ఇన్ని పంతాలు ఎందుకు?” అంటూ అతని భుజం మీద వాలింది కావ్య. 


హాల్‌లోని సోఫాలో ఆ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని కూర్చున్న దృశ్యం... fb లో వచ్చిన చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంది. అందులో విగ్రహాలు విడిపోయి ఉన్నా హృదయాలు ముడిపడ్డాయి. ఇలాంటి విషయాలలో పెద్దలు అహాలకు పోయి నిప్పు రాజేయకుండా, అపర్ణ గారిలా పెద్దరికం వహించి చొరవ తీసుకుంటే ఏ సంసారమూ కూలిపోదు. పిల్లల గొడవల్లో పెద్దలు న్యాయమూర్తులు కాకూడదు. మధ్యవర్తులు కావాలి. 


చిత్రం లో తెగిపోతున్న ఆ హృదయపు భాగానికి అపర్ణ తన పెద్దరికంతో ఒక బలమైన, శాశ్వతమైన ముడి వేసింది!


***$***


డా. లక్ష్మీ రాఘవ కామకోటి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

 ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

డా. లక్ష్మీ రాఘవ, విశ్రాంత జంతుశాస్త్ర రీడర్ రచయిత్రి మరియు ఆర్టిస్టు

సాహితీ ప్రయాణం – 1966 లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక లో మొదటి కథ.

ఇప్పటి దాకా ఏడు కథా సంపుటాలు, ఒక స్మారక సంచిక, ఒక దేవాలయ చరిత్ర ప్రచురణ.

గుర్తింపునిచ్చిన కొన్ని పురస్కారాలు.

కన్నడ భాషకు అనువదింపబడిన ”నా వాళ్ళు’, “అనుభ౦ధాల టెక్నాలజీ” అన్న రెండు కథా సంపుటులు, .

అనేక సంకలనాలలో కథలు.

కథల పోటీ నిర్వహణ, పోటీలలో న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం సాహిత్యపు అనుభవం.


రచనలే కాకుండా కళల పై ఆసక్తి, ఆర్టిస్టు గా "wealth out of waste “అంటూ ఎక్జిబిషన్ ల నిర్వహణ



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page