top of page
Original.png

సైకిల్ తొక్కడం



Cycle Thokkadam - Telugu Comedy Story | P. Gopalakrishna

Published in manatelugukathalu.com on 15/04/2026

సైకిల్ తొక్కడం - తెలుగు హాస్య కథ | P. గోపాలకృష్ణ

కథా పఠనం: A. సురేఖ

చిన్నప్పుడు మనం చేసిన అల్లరులు…ఇప్పుడు గుర్తు చేసుకుంటే నవ్వు వస్తుందా?

“సైకిల్ తొక్కడం” కథలో ఒక చిన్న బాలుడు సైకిల్ నేర్చుకోవాలనే తపన, జరిగిన ప్రమాదం, మరియు తండ్రి క్రమశిక్షణ—మిమ్మల్ని నవ్విస్తూ ఆలోచింపజేస్తాయి.


చిన్నప్పుడు సైకిల్ తొక్కేవాళ్లని చూస్తే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. అసలు రెండే చక్రాల మీద సైకిల్ ఎలా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళిపోతున్నారో అర్థమయ్యేది కాదు. ఒకసారి ఈ విషయమై మా ప్రసాదం గాడిని అడిగాను, “సైకిల్ తొక్కడం ఎలా?” అంటూ.


వాడేమో ఒక గంటసేపు సైకిల్ తొక్కడం ఎలాగో ఒక పాఠంలాగా చెప్పాడు. నాకైతే ఒక్క ముక్కా అర్థం కాలేదు. ఈ రోజుల్లో అలా పాఠంలాగా చెప్పడాన్ని ‘క్లాస్ పీకడం’ అంటారు. ఇంచుమించు వాడు అలా క్లాస్ పీకాడన్నమాట. వాడు రోజూ వాళ్ల నాన్నగారి సైకిల్ తొక్కడం నేనెన్నోసార్లు చూశాను. “నాకు సైకిల్ తొక్కడం నేర్పిస్తావా?” అని ఆశగా అడిగాను వాణ్ణి.


బహుశా అప్పుడు నేను మూడో తరగతిలో ఉన్నానేమో. “సైకిల్ నేర్పించడం అంత కష్టమేమీ కాదు. ముందు నువ్వు పడిపోకుండా సైకిల్ తొక్కగలిగితే అదే వచ్చేస్తుంది,” అన్నాడు వాడికి తెలిసిన పద్ధతిలో. ఎప్పుడూ అన్ని విషయాల్లో వాడికి సలహా ఇచ్చే నేను, ఇప్పుడు సైకిల్ విషయంలో వాడి శిష్యుడనైపోయాననే ఉత్సాహం వాడిలో స్పష్టంగా కనిపించింది నాకు.


నేను సైకిల్ స్పీడ్‌గా తొక్కుతున్నట్లు, సైకిల్ తొక్కే పందెంలో అందరికంటే ముందు తొక్కి ప్రైజ్ కొట్టేసినట్లు ఊహించుకోసాగాను. “ఏమైందిరా నీకు, మాట్లాడుతూ మాట్లాడుతూ మధ్యలో పరధ్యానంగా ఉంటావు?” నన్ను కుదిపేస్తూ అడిగాడు మా తోనే ఉన్న భాస్కరం గాడు. “సైకిల్ తొక్కుతున్నట్లు ఊహించుకుంటూ ఉంటే చాలా అద్భుతంగా ఉందిరా భాస్కరం,” అన్నాను నేను.


“నిజమే రా, సైకిల్ తొక్కుతుంటే ఈ ప్రపంచమంతా గిరగిరా తిరుగుతున్నట్లు ఉంటుంది అనుకో. మనం ఎక్కడికో వెళ్ళిపోతున్నట్లు అనిపిస్తుందంటే నమ్ము. నువ్వూ తొందరగా సైకిల్ నేర్చేసుకో, చాలా చాలా బావుంటుంది. సాయంత్రం స్కూల్ అయిపోయాక మనం సైకిల్ తొక్కుకోవచ్చు,” అన్నాడు భాస్కరం.


“వాడు స్కూల్‌కే రాడు కదరా సరిగ్గా, ఇంక స్కూల్ అయిపోయేదాకా వాడికేం పని? హాయిగా ఎప్పుడు కావాలంటే అప్పుడే సైకిల్ తొక్కుకోవచ్చు కదా!” అన్నాడు ప్రసాదం గాడు. వాళ్ల మాటలు వింటూ ఉంటే, స్కూల్‌కి వెళ్ళడం మాట అటుంచితే, సైకిల్ గిరగిరా నా కళ్లముందు తిరుగుతూ కనిపిస్తోంది. నేనేమో సైకిల్ మీద రకరకాల విన్యాసాలు చేస్తున్నట్లు ఊహించుకోసాగాను. అప్పటికే మా ఊళ్లలో కొందరు మాకంటే పెద్దవాళ్లు సైకిల్ హ్యాండిల్ వదిలేసి తొక్కడం, వెనకాల ఇంకొకర్ని కూర్చోబెట్టి తొక్కడం, మా అన్నయ్య లాంటి మరికొందరు ముగ్గురు కూడా సైకిల్ మీద షికార్లు వెళ్ళడం— ఇవన్నీ రంగులరాట్నం లాగా నా కళ్లముందు గిరగిరా తిరగసాగాయి.

ఇప్పుడు నాకున్న ఒకే ఒక్క కోరిక, అదీ చాలా బలమైన కోరిక— ఎలాగైనా సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి.


సైకిల్ తొక్కడం వచ్చేస్తే అమ్మ కొట్టు దగ్గరికి వెళ్ళి పంచదార తెమ్మన్నా, అగ్గిపెట్టె తెమ్మన్నా, లేకపోతే ఏమైనా కొనుక్కు రమ్మన్నా క్షణంలో తెచ్చి ఇవ్వచ్చు. స్వతహాగా నాకో అలవాటు ఉండేది. మీరంతా నవ్వితే నవ్వుకోవచ్చుగాక, ఏదైనా వస్తువు కొట్టు దగ్గరికి వెళ్ళి కొనుక్కొని తీసుకుని రమ్మంటే డబ్బులు జేబులో వేసుకొని వెళ్ళేవాడిని... దారిలో గోడమీద కొత్త సినిమా పోస్టర్ కనిపించినా, లేదా రోడ్డు మీద ఏదైనా కాగితం కనిపించినా అందులో ఏముందో చదువుకుంటూ నేను చెయ్యాల్సిన పని మరిచిపోయేవాడిని.


అలా మరిచిపోయిన నేను ఫ్రెండ్స్‌తో ఆటల్లో పడిపోవడమో, లేకపోతే ఇంకో పనిలో నిమగ్నమైపోవడమో చేసేవాడిని. లేదా మా వీధి చివర రామాలయం అరుగుమీద పెద్దవాళ్లు ఏమైనా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ల మాటలు వింటూ అక్కడే కాలం గడిపేసేవాడిని.


ఎప్పటికో ఆకలి వేసి ఇంటికి వెళ్ళేసరికి ఏమవుతుందో నేను ప్రత్యేకంగా మీకు చెప్పనక్కర్లేదనుకుంటాను. అమ్మ నాకోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూసి, ఎవరో ఒకరిచేత కావలసిన వస్తువు తెప్పించుకునేది. అది తరుచుగా మా ప్రసాదం గాడో, లేదా భాస్కరం గాడో అయ్యేవాళ్లు. “ఒరేయ్ బాబూ, మా వాడు ఎక్కడున్నాడో కొంచెం చూసి పిలవండిరా,” అని అమ్మ వాళ్లకి చెప్తే, వాళ్లు “మీ వాడు అసలు మాకు కనపడనే లేదు,” అని చెప్పేవాళ్లు.


“అమ్మ చెప్పిన పని చెయ్యడానికి కొట్టు దగ్గరికి నా కళ్లముందు నుండి వెళ్ళినవాళ్లు నాకో మాట చెప్పాలి కదా! నీ కోసం మీ అమ్మ ఎదురుచూస్తోంది, నీకేదో పని చెప్పిందిట కదా అని గుర్తు చెయ్యొచ్చుగా!” అసలు అలాంటివేం చేసేవాళ్లు కాదు. దానికి వాళ్ల కారణం వాళ్లకి ఉంటుంది కదా!


అమ్మ చెప్పిన పని చేసిపెడితే ఇంటికి వెళ్ళాక తినడానికి వాళ్లకి ఒక జంతిక లేదా చేగోడీలు లాంటివి పెట్టేది. వాటికోసం వాళ్లు నా మీద చాడీలు కూడా చెప్పేవాళ్లు అప్పుడప్పుడు. ఇదంతా సరే, మళ్లీ అసలు టాపిక్‌లోకి వచ్చేద్దాం. చూసారా? నేను ఎప్పుడూ ఇంతే. ఏదో చెప్పాలని ఏదో చెప్తున్నా కదా. ఇప్పుడు మన టాపిక్ సైకిల్ తొక్కడం గురించి. సైకిల్ తొక్కడం వస్తే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మ చెప్పిన పనులు తక్షణం చేసేయొచ్చు. ఫలితంగా అమ్మ చేతిలో రోజూ చీవాట్లు, దెబ్బలు తినవలసిన పని ఉండదు.


ఐతే ఇప్పుడు సైకిల్ తొక్కడం నేర్చుకోవాలి. తక్షణం చేయాల్సిన పని ఇదే. వెంటనే నా ఆలోచనని అమలు చేయాలని మనసు ఆరాటపడసాగింది. కానీ ఇప్పుడు తొందరపడితే తరువాత లేనిపోని సమస్యలు వస్తాయి. అందుకే ఆలోచనకి అంతం లేకుండా ఆలోచిస్తూ రామాలయం అరుగుమీద కూర్చున్నాను. “ఏమైందిరా, మళ్లీ ఆలోచనలో పడ్డావు?” అడిగాడు భాస్కరం గాడు.


మీకు ఇక్కడ ఒక విషయం తప్పక చెప్పాలి. ఇప్పుడున్న పిల్లలు తమ తెలివి తేటలన్నీ సెల్‌ఫోన్ల మీదా, టీవీలలో వచ్చే సీరియల్స్ మీదా, ఇంకా సినిమాల మీదా, పనికిమాలిన విషయాల మీద పెట్టడం అందరికీ తెలిసిన విషయమే. మా వరకు అయితే వేరే ఎంటర్‌టైన్‌మెంట్ ఏదీ లేకపోవడం వలన, చదువు, ఆటలు తప్ప వేరే ఏ విషయాల్లోనూ మాకు అంతగా ప్రవేశం లేదంటే అతిశయోక్తి కాదేమో. అందుకే మా ఆలోచనలకు, ఇప్పటి యువత ఆలోచనలకు చాలా తేడా ఉంటోంది.


మొత్తంమీద నా కోరిక నెరవేరే రోజు రానే వచ్చింది. మా నాన్నగారు సైకిల్ ఇంట్లో వదిలేసి, ఎక్కడికో ఊరు వెళ్లారు. సైకిల్ మీద ఆ ఊరు వెళ్లడానికి ఎక్కువ దూరం కాబట్టి, కొంతదూరం నడిచి వెళ్ళి, అక్కడినుండి బస్ ఎక్కి వెళ్ళారన్నమాట. ఇంక మనకి హద్దు ఏముంది? మధ్యాహ్నం అమ్మ భోజనం చేసి, న్యూస్‌పేపర్ చదివే టైమ్— అంటే అమ్మ నిద్రపోయే టైమ్ అన్నమాట. అప్పటికే ప్రసాదం గాడికి, భాస్కరం గాడికి, ఇంకా చంద్రం గాడికి విషయం చెప్పాను— “నేను సైకిల్ తెస్తాను, నాకు సైకిల్ నేర్పించమని.”


మాది ఎత్తరుగుల ఇల్లు. ఎలాగో అవస్థపడి అమ్మకి మెలకువ రాకుండా సైకిల్ కిందికి దింపేసాము. ‘సైకిల్ ఎక్కి తొక్కేయడమే’ అనుకున్నాను నేను. “అలా కాదు, రామాలయం దగ్గర డౌన్ ఉంది కదా. అక్కడినుండి తొక్కడం సులభంగా ఉంటుంది. నేను అక్కడే మొదట నేర్చుకున్నాను,” అన్నాడు ప్రసాదం గాడు. ఎలాగో సైకిల్ నడిపించుకుంటూ రామాలయం దగ్గరకి చేరుకున్నాను. అప్పటికే మధ్యాహ్నం కావడం వలన అందరూ పనులతో అలసిపోయి నిద్రపోయే టైమ్. మగవారు ఉద్యోగాలకు వెళ్లిపోయే టైమ్. వీధంతా నిశ్శబ్దంగా ఉంది.


వీధి చివర కొట్లో సావిత్రమ్మ విసనకర్రతో విసురుకుంటూ, కునుకుపాట్లు పడుతోంది. ఆమె అలా కునుకు తీస్తూ ఉంటే, అప్పుడప్పుడు కొందరు ఆకతాయిలు శబ్దం చేయకుండా దుకాణం దగ్గరకు వెళ్లి, చాక్లెట్లు, బిస్కట్లు దొంగతనంగా తెచ్చుకోవడం నాకు తెలుసు. “ఒరేయ్, నేను ముందుకు పట్టుకుంటాను,” అన్నాడు భాస్కరం గాడు. “మేమిద్దరం వెనకాల పట్టుకున్నాం,” అంటూ చంద్రం గాడు, ప్రసాదం గాడు నన్ను సైకిల్ ఎక్కమన్నారు.


సైకిల్ ఎలా ఎక్కాలో తెలియని నేను, పెద్దవాళ్లు సైకిల్ ఎక్కినట్లు పెడల్ మీద కాలు పెట్టి ఎక్కబోయాను. ఎలాగో నానా అవస్థపడి వాళ్లు సైకిల్ పడిపోకుండా పట్టుకుని నన్ను పైకి ఎక్కించారు.


సైకిల్ సీట్ మీద కూర్చుంటే ఎక్కడో ఆకాశంలో కూర్చున్నట్లు అనిపించింది నాకు. సైకిల్ నా సొంతమైనంత గర్వంగా, నేను సింహాసనం మీద కూర్చున్న మహారాజులా, సైకిల్ పట్టుకున్న వాళ్లేమో నా భటుల్లాగా కనిపించ సాగారు.


నేను గర్వంగా, “నేను సైకిల్ తొక్కగలను, వదిలేయండిరా!” అన్నాను. అంతే, వాళ్లు సైకిల్ వదిలేయడం, రామాలయం డౌన్‌లోంచి రివ్వున సైకిల్ దూసుకుపోవడం జరిగిపోయింది. భాస్కరం గాడు చెప్పినట్లు ప్రపంచం గిర్రున రంగులరాట్నం తిరిగిపోతుంటే గట్టిగా కళ్లుమూసుకున్నాను.


మరుక్షణం ‘ధబ్’ మని శబ్దం, ఏదో మొహానికి తగిలినట్లు అనిపించి కళ్లుతెరిచేసరికి, నేను సావిత్రమ్మ కొట్లో పడి ఉన్నాను. నా మీద సైకిల్, సైకిల్ మీద సావిత్రమ్మ పడి, నాకు లేవడం కష్టంగా అనిపించింది. అసలు అదంతా ఎలా జరిగిందో నాకు అర్థం కాలేదు.


“బాబోయ్, చచ్చిపోయాను,” అంటూ సావిత్రమ్మ ఆపసోపాలు పడుతూ నిద్రమత్తు వదిలి ఎలాగో కష్టంగా లేచింది. “చిన్నబాబూ, రక్తం!” అంటూ గబరాగా అరుస్తూ ఉంటే నాకు క్షణం పాటు ఏమీ అర్థం కాలేదు.


ముందుగా తేరుకున్న ఆమె, నన్ను సైకిల్ కిందనుండి పైకి లాగి ఎత్తుకుని ఇంటికి తీసుకెళ్లి, నిద్రపోతున్న అమ్మని నిద్రలేపి నన్ను అప్పగించింది. ఆమె వెనకాలే వాళ్ల అబ్బాయి వెంకటరమణ వచ్చి సైకిల్ ఇంటిముందు పెట్టి వెళ్లిపోయాడు.


“నిన్ను సైకిల్ తీసుకుని రమ్మని ఎవరు చెప్పారు నాన్నా?” అంటూ అమ్మ గోల పెట్టి ఏడవసాగింది.


దెబ్బలు శుభ్రం చేసి, ఇంట్లో ఉన్న మందు దెబ్బల మీద వేస్తూ ఉండగా నాన్నగారు ఊరునుండి వచ్చారు. జరిగిందంతా విని ఒక్క మాట కూడా అనకుండా హాస్పిటల్‌కి తీసుకెళ్లి ఇంజెక్షన్ చేయించి, మందులు కొని ఇంటికి తీసుకొచ్చారు.


నన్ను కొడతారేమో అని నేను భయపడని రోజు లేదంటే నమ్మండి. ఆశ్చర్యంగా ఒక్కటంటే ఒక్క మాట కూడా అనలేదు.


తర్వాత ఏడాదికో, రెండేళ్లకో ఒకసారి అమ్మని అడిగాను, “సైకిల్ తొక్కడం నేర్చుకుంటాను,” అని. పక్క గదిలో పని చేసుకుంటున్న నాన్నగారు అది విని, “ఇంకోసారి ‘సైకిల్’ అనే పదం నీ నోట్లోంచి వినిపిస్తే ఏం చేస్తానో చెప్పను,” అన్నారు కూల్‌గా.


ఆ రోజుల్లో క్రమశిక్షణ అంటే అలాగే ఉండేది. ఎంత అల్లరి చేసినా దానికి ఒక హద్దు ఉండేది. ఆ హద్దు దాటకుండా ఉన్నంత సేపూ మనల్ని ఏమీ అనేవారు కాదు. ఇప్పటిలాగా విచ్చలవిడిగా పిల్లలు వీధుల్లో తిరగడం, నోటికి వచ్చినట్లు మాట్లాడడం ఇలాంటివేమీ ఉండేవి కావు.


ఆ రోజుల్లో మాకు నేర్పించిన క్రమశిక్షణ వేరు. అందుకే కాస్తో, కూస్తో చదువుకున్నవాళ్లు కూడా జీవితంలో ప్రయోజకులయ్యేవారు. ఇప్పుడు అలాంటివి చాలా అరుదుగా కనిపించే విషయాలు.


నాన్నగారు సైకిల్ తొక్కే విషయంలో తన నిర్ణయం ప్రకటించేశాక, నేను సైకిల్ ముట్టుకున్నదీ లేదు, నేర్చుకున్నదీ లేదు. కానీ ఇప్పుడు ఉద్యోగ అవసరాల కోసం చాలా ప్రయాసపడి టూ-వీలర్ నడపడం నేర్చుకున్నాను.


సైకిల్ కూడా తొక్కడం వచ్చు కానీ, ఇప్పటికీ సైకిల్ తొక్కాలంటే ఆనాటి ఆ చేదు అనుభవం కళ్లముందు కదలాడుతుంది. ప్రపంచం గిర్రున తిరిగిపోవడం అంటే ఏంటో ఆ రోజు తెలిసింది.


ఆ నాటి ఆ సంఘటన తల్చుకున్నప్పుడల్లా, తెలీకుండానే కొంచెం భయం వేస్తున్నప్పటికీ, అంతే తెలీకుండా చిరునవ్వు నా ముఖాన తొణికిసలాడుతుంది.

(నా బాల్య స్మృతుల నుండి..)


***

P. గోపాలకృష్ణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ P. గోపాలకృష్ణ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం

  ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కి text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.


దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: P. గోపాలకృష్ణ

ప్రొఫైల్ లింక్: https://www.manatelugukathalu.com/profile/gopalakrishna 

యూట్యూబ్ ప్లే లిస్ట్ లింక్:

నా పేరు గోపాలకృష్ణ. పుట్టింది, పెరిగింది శ్రీకాకుళం జిల్లా లో. చిన్నప్పటినుండి కథలూ,కవితలూ, రాయడం చదవడం ఇష్టం. వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిని. నా తల్లిదండ్రులు చిన్నప్పటినుండి ఇచ్చిన ప్రోత్సాహమే రచనావ్యాసంగాన్ని అంటిపెట్టుకొనేలా చేసింది. 'ఆ అమ్మాయి..' కథ ఈ సైట్ లో నేను రాస్తున్న ఆరవ కథ. నా కథలను తప్పక ఆదరిస్తారని ఆశిస్తున్నాను.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page