మాటల మజాకా

Maatala Majaka - Telugu Moral Story | Naga Suneetha Pokala
మాటల మజాకా - తెలుగు నీతి కథ | నాగ సునీత పోకల
Published in manatelugukathalu.com on 17/09/2026
మాటలు మనిషి వ్యక్తిత్వాన్ని, ఇతరులతో ఉన్న సంబంధాలను ప్రభావితం చేసే శక్తివంతమైన సాధనం. పి. నాగ సునీత రాసిన “మాటల మజాకా” తెలుగు నీతి కథలో మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం, వాక్చాతుర్యం గురించి చక్కని ఉదాహరణలతో వివరించారు. డబుల్ మీనింగ్ మాటలు, ఆచితూచి మాట్లాడటం, ఇతరుల మనసును బాధపెట్టకుండా సంభాషించడం వంటి విషయాలను ఈ కథ తెలియజేస్తుంది. మన మాటలు మంచిగా, తెలివిగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవడానికి ఈ కథను చదవండి.
“మాటల మజాకా” పేరు బాగుంది కదా!
పేరు బాగుంది కానీ, అసలు మాటలంటే ఏమిటని ఎవరైనా మనల్ని అడిగితే—మాటలంటే మనం ఇతరులతో సంభాషించడానికి లేదా మన భావాలను ఇతరులకు తెలియజేయడానికి ఉపయోగించే పదాల సముదాయం అని చెబుతాం.
నిర్వచనం బాగుంది కానీ, మనం ఇతరులతో సంభాషించడానికి లేదా మాట్లాడడానికి రెండు పద్ధతులను ఎంచుకుంటాం.
ఒకటి మంచిగా మాట్లాడే పద్ధతి. రెండవది మనకెంతో ఇష్టమైన పద్ధతి, నోటికి ఎలా వస్తే అలా చిన్న, పెద్ద తేడా లేకుండా మాట్లాడే పద్ధతి.
మొదటి పద్ధతిని ఎంచుకున్నవారు, తమ నాలుకలను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, ఎక్కడ ఎలా మాట్లాడాలి? ఏ సందర్భంలో మాట్లాడాలి? ఎవరితో ఎలా మాట్లాడాలి? అని తెలుసుకొని, తమ మాటల వజ్రాలను చక్కగా ఉపయోగించుకుంటారు.
రెండవ పద్ధతిని ఎంచుకున్న వారిని నాలుకే తన ఆధీనంలోకి తెచ్చుకొని, ఎలా పడితే అలా మాట్లాడిించేస్తుంది. దీనికి చిన్నా పెద్దా తేడా ఉండదు, సమయం కోసం ఎదురుచూడదు.
గొంతు నొప్పి వచ్చినా కూడా ఆగకుండా మనిషి చేత మాట్లాడిస్తుంది. వీళ్లు నాలుకకు బానిసలై, కీలుబొమ్మలుగా మారతారు.
ఇదంతా పక్కన పెడితే, మనం మాట్లాడే మాటలకు కొన్నిసార్లు రెండర్థాలు వస్తాయి. దీనినే మనం డబుల్ మీనింగ్ అంటాం.
ఉదాహరణకు, ఓ పెద్దాయన్ని ఓ వ్యక్తి, “నీకెన్ని సంవత్సరాలయ్యా?” అని అడిగితే, ఆయన, “నాకు ఏడేళ్లు” అని చెబుతాడు. అక్కడున్న వాళ్లందరూ అది విని పగలబడి నవ్వుతారు. కానీ వారికి తెలియని విషయం ఏమిటంటే, ఆయన తనకు 7 ఏళ్లు అని చెప్పలేదు. 49 ఏళ్లు అని చెబుతాడు. అదెలా అంటే 7 × 7 = 49. అక్కడ ఆయన చెప్పింది ఒకటి, విన్నవారు అర్థం చేసుకున్నది ఒకటి. ఇలాంటి సందర్భాలు మనకు నిజ జీవితంలో ఎన్నోసార్లు ఎదురయ్యే ఉంటాయి.
ఇంకొక సందర్భం తీసుకుంటే, ఒక ఊరిలో ఒక రచయిత ఉంటాడు. అతనికి ఓ యువకుడు, “మన ఊరి గురించి ఓ మంచి కవిత రాయండి సార్” అని అంటాడు.
అప్పుడు ఆ రచయిత, “రాస్తాలే రా” అని అంటాడు.
అది విన్న యువకుడి మనసు చివుక్కుమంది. “ఎంత గొప్ప రచయిత అయితే మాత్రం, కొంచెం కూడా గౌరవం లేకుండా ‘రా’ అంటాడా?” అని మనసులో అనుకుంటున్నాడు.
ఓ యువకుడి అంతర్యాన్ని గుర్తించిన రచయిత, “అయ్యో! నేను నిన్ను ‘రా’ అని పిలవలేదు బాబూ. ‘రాస్తాలే, నా దగ్గరికి రా’ అని చెప్పడానికి ‘రాస్తాలే రా’ అని అన్నాను” అని చెబుతాడు.
పై ఉదాహరణను బట్టి మనకేమి అర్థమవుతుంది?
మనం మంచిగా మాట్లాడినా, అది ఇతరులకు చెడుగా అర్థమయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం మన మాటలను ఎంత జాగ్రత్తగా వాడితే మనకంత మంచిది. నోటి నుండి వెలువడే ప్రతి అక్షరం మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి మన భవిష్యత్తు మంచిగా ఉండాలంటే మన మాటలు మంచిగా, తెలివిగా ఉండాలి. మన మాటలు మంచిగా, తెలివిగా ఉండడమే కాదు, ఎదుటివారికి బాధ కలిగించకుండా ఉండాలి.
మన సూటిపోటి మాటలు ఇతరులకు ఎంత బాధను కలిగిస్తాయో ఒక శతకకర్త ఈ క్రింది పద్యం ద్వారా ఎంతో చక్కగా వివరించారు.
తనువున విరిగిన యలుంగుల
ననువునన్ బుచ్చంగా వచ్చు “నతి”నిష్ఠురతన్
మనమున నాటిన మాటలు
వినుమెన్ని యుపాయములను వెడలునె యధిపా!
పై పద్యం యొక్క భావం ఏమంటే—
మన శరీరంలో బాణాలు గుచ్చుకుంటే అతి కష్టం మీద వాటిని తీసి ఆ గాయాలను మాన్పవచ్చు. కానీ మనస్సుకు గుచ్చుకునేలా మాట్లాడిన మాటల చేత అయిన చిన్న గాయాన్ని మాన్పడం సాధ్యం కాదు.
పై పద్యాన్ని బట్టి మనం ఏమి తెలుసుకున్నాం? మాటలు బాణాలకంటే పదునైనవి. మన శరీరానికి బాణం గుచ్చుకుంటే ఎంత నొప్పి కలుగుతుందో, అంతకు రెట్టించిన నొప్పిని మన మాటలు ఇతరుల మనసులకు కలిగిస్తాయి. కాబట్టి మనం మన నోటి నుండి వెలువడే ప్రతి మాటను ఎంతో జాగ్రత్తగా, ఆచితూచి, మనం బాధపడకుండా, ఇతరులను బాధపెట్టకుండా మాట్లాడాలి. దీనినే వాక్చాతుర్యం అని అంటారు.
ఈ లక్షణం కలిగిన వ్యక్తి తాను మాట్లాడేటప్పుడు తనను తక్కువ చేసుకోడు, ఇతరులను తక్కువ చేయడు.
ఈ లక్షణాన్ని అలవర్చుకున్న వారికి జీవితంలో ఎదగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి అవకాశాలు మనకు కూడా కావాలి కదా! అందుకే మన మాటల వజ్రాలను చక్కగా ఉపయోగించుకుంటూ జీవితంలో అనుకున్న స్థాయికి ఎదుగుదాం.
***
నాగ సునీత పోకల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
పరిచయం: నాగ సునీత పోకల







Comments