చదువు లేని "చదువుల తల్లి"

Chaduvu Leni "Chaduvula Thalli" - Telugu Social Story | Mayukha
చదువు లేని "చదువుల తల్లి" - తెలుగు సామాజిక కథ | మయూఖ
Published in manatelugukathalu.com on 01/11/2026
చదువు లేకపోయినా తన తెలివితేటలు, ధైర్యం, సామాజిక చైతన్యంతో ఒక బస్తీ జీవితాలను మార్చిన యాదమ్మ స్ఫూర్తిదాయక కథే “చదువు లేని చదువుల తల్లి”. మహిళా సాధికారత, ఆర్థిక స్వావలంబన, మహిళల ఐక్యత గొప్పతనాన్ని చాటిచెప్పే ఈ తెలుగు కథ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తుంది.
వంశీ ప్రముఖ జర్నలిస్ట్. నిజాలు నిగ్గు తేల్చే వార్తలు రాయడంలో దిట్ట. ఎవరికీ భయపడడు. పేదల పక్షాన ఉంటాడు. పేదవారికి అన్యాయం జరిగితే వారి పక్షాన చేరి, వార్తలు రాస్తూ, ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తాడు.
వంశీ ఉంటున్న ఇంటికి దగ్గర్లోనే పేదల బస్తీ ఉంది.
"రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు".
తరచుగా బస్తీకి వెళ్లి అక్కడ వారి యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉంటాడు. ప్రభుత్వం నుంచి ఏదైనా పథకాలు వస్తే, వాటి వివరాలు అక్కడ జనాలకి చెప్పి వాళ్ళ చేత అప్లికేషన్స్ పెట్టిస్తాడు.
ఒకసారి ప్రభుత్వం మహిళా సాధికారత అవార్డులు ప్రకటించింది.
దానికి ఎవరైతే అర్హులో వాళ్ళు దరఖాస్తులు పెట్టుకోమని, అర్హులైన మహిళలకు "మహిళా దినోత్సవం" రోజున సన్మానం చేసి అవార్డులు ఇస్తామని దాని సారాంశం. ఈ ప్రకటన చూసిన వెంటనే వంశీకి యాదమ్మ గుర్తుకొచ్చింది.
గబగబా బస్తీలో ఉన్న యాదమ్మ దగ్గరికి వెళ్లి, "యాదమ్మా, మహిళా దినోత్సవం రోజు దానికి అర్హులైన మహిళలకు అవార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దానికి నీ పేరు సిఫార్సు చేస్తున్నాను. ఈసారి నీకు అవార్డు రావాలి" అన్నాడు.
"అవార్డా! నేనేం చేశానని నాకు రావడానికి?! పెద్ద చదువులు చదువుకున్నానా? ఎవరికైనా దానం చేశానా? ధర్మం చేశానా?" అంది యాదమ్మ.
"యాదమ్మా! నువ్వు ఈ బస్తీ వాళ్ళ నుదుటి రాతలు తిరిగి రాశావు. అప్పుడు ఎలా ఉండేవారు? ఇప్పుడు ఎలా ఉన్నారు? ఈ బస్తీ కోసం చేసిన పోరాటాలు, పోలీసుల చేత తిన్న లాఠీ దెబ్బలు ఇవన్నీ నువ్వు మర్చిపోయినా నేను మర్చిపోను.
పేపర్ క్లిప్పింగ్స్ రూపంలో నా దగ్గర ఉన్నాయి. నేను నీ పేరు సిఫార్సు చేస్తాను. నీకు సపోర్టుగా ఎమ్మార్వో గారు కూడా రాస్తారు. ముందు నీ ఫోటో ఒకటి ఇయ్యి అప్లికేషన్లో అతికించడానికి" అని యాదమ్మ ఫోటో తీసుకుని వెళ్ళిపోయాడు వంశీ.
యాదమ్మ ఆ బస్తీకి అంతటికి పెద్దదిక్కుగా ఉంటుంది. అంత క్రితం వరకు ఒక ఎత్తు.
యాదమ్మ కలగజేసుకుని బస్తీ వాళ్ళ బాగోగులు చూసిన తర్వాత మరొక ఎత్తులా మారిపోయింది ఆ బస్తీ.
యాదమ్మకి ఇద్దరు ఆడపిల్లలు. పెద్ద కూతురు టైలరింగ్ చేస్తూ అందరికీ నేర్పిస్తోంది. రెండవ కూతురు ఇంటర్ పాస్ అయి టీచర్ ట్రైనింగ్ అయ్యి ఆ బస్తీ స్కూల్లోనే టీచరుగా పనిచేస్తోంది. యాదమ్మ భర్త రామయ్య తాగి తాగి చనిపోయాడు.
యాదమ్మకి ఆలోచనలు ఈగల్లా ముసురుకున్నాయి. గతంలోకి వెళ్లింది.
ఇద్దరు ఆడపిల్లలతో భర్త రామయ్య చెయ్యి పట్టుకుని ఈ బస్తీలోకి అడుగుపెట్టింది.
రామయ్య హమాలీ పని చేస్తూ ఉండేవాడు. యాదమ్మ చుట్టుపక్కల కాలనీల్లోకి వెళ్లి ఇంటి పనులు చేసేది. యాదమ్మ ఐదవ క్లాస్ వరకే చదువుకుంది.
కానీ సంస్కారం ఉన్న మనిషి. పిల్లలిద్దరినీ పెద్ద చదువులు చదివించాలని, వాళ్లని ఈ కష్టానికి దూరంగా ఉంచాలని అనుకునేది.
యాదమ్మ పనిచేసే ఇంటి వాళ్ళు చాలా మంచి వాళ్ళు. ఆమెకి ఎప్పుడు డబ్బు అవసరం అయినా వెంటనే ఇచ్చేవాళ్ళు! సంసారం ఒడిదుడుకులు లేకుండా సామాన్యంగా సాగిపోతుంటే "అశనిపాతంలా" ఆ బస్తీలోకి "బెల్ట్ షాపు" వచ్చింది.
దాంతో బస్తీలో ఉన్న ప్రతి మగవాడు రాత్రి అయ్యేటప్పటికీ అక్కడ వాలిపోయేవాడు.
ఫుల్లుగా తాగి ఎప్పటికో ఇంటికి చేరడం, ఇంటికి ఖర్చులకి డబ్బులు ఇవ్వకుండా పెళ్ళాల్ని కొట్టడం, ఇది ఒక దినచర్యగా మారిపోయింది.
రామయ్య కూడా మందుకి బానిస అయిపోయాడు. కాలం గడుస్తోంది. ఒక్క ఆడవాళ్ళ సంపాదన మీద ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంటోంది.
మగవాళ్ళని డబ్బులు అడిగితే తిట్లు, తన్నులు ఇది నిత్యకృత్యం అయిపోయింది.
దురదృష్టవశాత్తూ రామయ్య తాగి తాగి రోడ్డుమీద పడిపోతే, అదే వైపు నుంచి స్పీడుగా వస్తున్న లారీ అతని మీద ఎక్కి వెళ్ళిపోయింది. రామయ్య అక్కడికక్కడే చనిపోయాడు.
యాదమ్మది మగదిక్కు లేని సంసారం అయిపోయింది. రామయ్య మరణం, ఆ కుటుంబ పరిస్థితిని చూసి కూడా తాగుబోతుల మనసును మార్చలేకపోయింది.
అప్పుడు యాదమ్మ ఒక నిర్ణయం తీసుకుంది.
బస్తీలో ఉన్న మహిళలందరినీ తీసుకుని బెల్ట్ షాపు దగ్గరకు వెళ్లి ధర్నాలు చేయడం మొదలుపెట్టింది. ముందు కొన్ని రోజులు వాళ్లు పట్టించుకోలేదు. తర్వాత ఈ ధర్నాలు ఉధృతం చేయడం మొదలుపెట్టారు. "బెల్ట్ షాపు ఇక్కడి నుంచి తీసే వరకు మా ఉద్యమం ఆగదు" అని బ్యానర్లు పట్టుకొని నిరాహారదీక్షకి కూర్చున్నారు మహిళలు.
అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి మహిళలని కూడా చూడకుండా లాఠీఛార్జ్ చేశారు.
అందరికంటే ముందు యాదమ్మ ఒంటి మీద లాఠీ దెబ్బ పడింది. యాదమ్మ బెబ్బులిలా గాండ్రించింది.
"మనుషుల జీవితాలు నాశనమై పోతుంటే మీకు పట్టదా! మా డబ్బులే మీకు కావాలా! మా రక్తపు కూడు తింటే మీకు అరుగుతుందా! మీరు మమ్మల్ని కొట్టి చంపినా మేము ఇక్కడ నుంచి కదలం. ఇక్కడి నుంచి బెల్ట్ షాపు తీసే వరకు మా ఉద్యమం ఆగదు" అంటూ గట్టిగా అరిచింది.
దాంతో పోలీసులు వెనక్కి తగ్గారు. ఈ ఆందోళన తగ్గేవరకు షాపు మూయించి వెళ్ళిపోయారు.
వంశీ, బస్తీ మహిళల పక్షాన నిలబడి, ఈ వార్తలన్నిటినీ ప్రముఖంగా కనిపించేటట్టు పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లలో వేయించాడు.
ఈ విషయం బస్తీ నుంచి బయట ప్రపంచం వరకు వెళ్ళింది. కానీ ఇది బస్తీకి సంబంధించిన వార్త అవడంతో ప్రభుత్వ యంత్రాంగంలో కదలిక లేదు.
దీనికి శాశ్వత పరిష్కారం చూడాలని వంశీ ఆలోచించి, యాదమ్మని, కొంతమంది మహిళలను తీసుకుని, ఎమ్మార్వో దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆమె ఒక మహిళ.
ఆమె అంత హోదాలో ఉన్నా, సాటి స్త్రీ అవడంతో వీళ్ళ కష్టాలను విని చలించి, వాళ్లతో మాట్లాడి, ఈ విషయాలన్నీ జిల్లా కలెక్టర్ కి చెప్పింది. ఆయన ఆదేశం మేరకు ఎమ్మార్వో బస్తీకి వచ్చి, బెల్ట్ షాపు వాళ్లతో మాట్లాడి, బెల్ట్ షాపును అక్కడ నుంచి తీయించి వేసింది.
అందరూ యాదమ్మకి జేజేలు పలికారు.
అప్పుడే యాదమ్మ నిర్ణయించుకుంది - "తన పిల్లలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు నిలబడేటట్టు చెయ్యాలి, ఆడవాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఉండాలి, జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తట్టుకుని నిలబడేటట్టుగా ఉండాలి" అని అనుకుని, పెద్ద కూతుర్ని టెన్త్ వరకు చదివించి, తను పనిచేసే కాలనీలో ఉన్న మహిళా మండలి వారితో మాట్లాడి, తన కూతురికి ఉచితంగా టైలరింగ్ నేర్పించింది.
ఒక సంవత్సరంలోనే డ్రస్సులు, జాకెట్లు అన్నీ కుట్టడం నేర్చుకుంది. ఎమ్మార్వోతో మాట్లాడి స్కూలు పిల్లలకి యూనిఫారం కుట్టే కాంట్రాక్టు తీసుకొంది.
బస్తీలో ఉన్న పిల్లలకి కూడా తన కూతురి దగ్గరే టైలరింగ్ నేర్పించి, వాళ్ల సహాయంతో అనుకున్న టైమ్ కంటే ముందుగానే, స్కూళ్లు తెరవకుండానే యూనిఫారాలు అందజేసింది. యాదమ్మ తన చిన్న కూతుర్ని ఇంటర్ చదివించి, టీచర్ ట్రైనింగ్ కి పంపించి టీచర్ ని చేసింది.
బస్తీలో ఉన్న మహిళల చేత పచ్చళ్ళు పెట్టించి వాటిని మహిళా మండలి వారి చేత అన్ని షాపులకి పంపిణీ చేయించి వారు ఆర్థికంగా నిలదొక్కుకునేటట్టు చేసింది యాదమ్మ.
ఇప్పుడు ఆ బస్తీలో ఉన్న మహిళలు, ఆడపిల్లలు ఆర్థికంగా నాలుగు రాళ్లు వెనకేసుకోవడానికి యాదమ్మే కారణమైంది.
మగవారు కూడా చెడు అలవాట్ల జోలికి పోకుండా, తమ సంపాదనంతా కుటుంబ పోషణకే ఖర్చు పెడుతున్నారు.
యాదమ్మ ఆలోచనల నుంచి బయటపడింది.
అందరూ అనుకున్నట్టుగానే యాదమ్మకి అవార్డు వచ్చింది.
యాదమ్మకి అవార్డు ఇచ్చి కలెక్టర్ మాట్లాడుతూ, "యాదమ్మ గురించి మాట్లాడాలంటే చాలా ఉంది.
తను చదువుకోకపోయినా సమాజాన్ని, తన తోటి మహిళలని మేల్కొలిపింది. తను ముందుండి అందరికీ ఆర్థిక స్వావలంబన కల్పించింది. బస్తీలో ఉన్న బెల్టు షాపు తీయించి, మగవారిని 'ఒక గాడికి' తెచ్చింది.
మహా మహా చదువుకున్నవాళ్లే చేయలేని పనిని యాదమ్మ చేసి చూపించింది. మహిళా సాధికారత అవార్డుకి సంపూర్ణ అర్హురాలు యాదమ్మ" అన్నారు కలెక్టర్ ప్రేక్షకుల చప్పట్ల మధ్య.
ఇప్పుడు యాదమ్మని మాట్లాడమన్నారు.
"అందరికీ నమస్కారం! నేను చదువుకోలేదు. మీరు ఇంత పెద్ద అవార్డు నాకు ఇచ్చారంటే నాలో ఏదో మీరు గుర్తించారు. ఇది నా ఒక్కదానికే చెందదు.
నాతోటి స్త్రీలందరికీ చెందుతుంది. ఆలోచన నాది, ఆచరణ వారిది. మనం కష్టపడి సంపాదించిన డబ్బు తాగుడు పేరు మీద ఖర్చు అయిపోతుంటే, ఒళ్ళు, ఇల్లు గుల్ల అయిపోతుంటే, తండ్రి తప్పతాగి తల్లిని కొడుతుంటే ఆ చిన్న పిల్లల మానసిక వేదనని అర్థం చేసుకున్నాను.
వాళ్లు కొంచెం పెద్దవాళ్లు అయిన తర్వాత వాళ్లు కూడా నేర్చుకోవడానికి ఆస్కారం ఇచ్చినట్టు అవుతుంది. అందుకే ఇదంతా చేశాను. నా వెనక ఉండి నడిపించిన వంశీకి నా కృతజ్ఞతలు.
ఈ అవార్డు నాదే కాదు, మా అందరిదీ" అంటూ కళ్ళు ఒత్తుకుంది చదువు లేని "చదువుల తల్లి" యాదమ్మ.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మయూఖ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
మయూఖ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ :
63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
పరిచయ వాక్యాలు:
నా పేరు శారద
విద్యార్హతలు: ఎమ్.ఎ
నాకు చిన్నతనం నుంచి కథలు నవల అంటే ఇష్టంగా ఉండేది.
నేను ఇదివరలో ఆంధ్రభూమికి వివిధ పత్రికలకి చిన్న చిన్న కథలు రాసి పంపేదాన్ని.
తర్వాత కాలంలో మానేసాను. ఈమధ్య మళ్ళీ నా రచన వ్యాసం గాని మొదలుపెట్టాను.
నా కథలు వివిధ పత్రికలకి ఎంపిక చేయబడ్డాయి.
ఉగాది, సంక్రాంతి కథల పోటీలకి ఎంపిక చేయబడ్డాయి
మా అబ్బాయి ప్రోత్సాహం తో వివిధ పత్రికలకి పంపడం జరుగుతోంది.













Comments