వృక్షో రక్షతి రక్షితః

Vruksho Rakshati Rakshitah - Telugu Moral Story | Rallabandi Sangam Naidu
వృక్షో రక్షతి రక్షితః - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు
Published in manatelugukathalu.com on 01/11/2026
వృక్షో రక్షతి రక్షితః రాళ్లబండి సంగం నాయుడు రచించిన పర్యావరణ సందేశాత్మక తెలుగు నీతి కథ. చెట్లను కాపాడుకోవడం, ప్రకృతిని ప్రేమించడం, పర్యావరణ సమతుల్యతను పరిరక్షించడం మనందరి బాధ్యత అని ఈ కథ తెలియజేస్తుంది.
అది కలియుగం ప్రారంభమైన రోజులు. జంతుజాలం, వృక్షజాలం, మానవులు కలిసిమెలిసి ఉండేవారు. రానురాను కాలం మారింది. కాలంలో చాలా మార్పులు వచ్చాయి.
మొదట్లో సృష్టికర్త చెప్పిన ప్రకారం మానవులు, జంతువులు ప్రవర్తించేవి. కాలం మారుతున్న కొద్దీ మానవుల, జంతువుల ఆలోచనలు మారాయి.
అవసరం ఉన్నా, లేకున్నా మొక్కలు, చెట్ల ఆకులు, కొమ్మలు మానవులు తుంచేవారు.
కోటి పత్రాల పూజ అని, కోటి పువ్వుల పూజ అని, కోటి పండ్ల పూజ అని చెట్ల ఆకులు, పండ్లు, పువ్వులు అనవసరంగా తుంచేవారు. అవసరానికి మించి పండ్లు, పూలు, పత్రాలు కోసేవారు.
అంతేకాకుండా ఇష్టం వచ్చినట్లు చెట్ల, మొక్కల కొమ్మలు విరిచేవారు.
చెట్లకు కూడా అనుభూతులు ఉంటాయని, అవి కూడా మనుషులు, జంతువుల వలె బాధపడతాయని, వాటికీ కూడా మనసుంటుందని మరిచి మరీ వృక్షజాలం పట్ల మానవులు కర్కశంగా ప్రవర్తించారు.
జంతువులు కూడా చెట్ల పట్ల కర్కశంగా ప్రవర్తించాయి. జంతువులు తమ తిండికి అవసరమైన ఆకుల కంటే ఎక్కువ ఆకులు చెట్ల నుండి విరిచేవి.
నిత్యం వృక్షాలు కన్నీరు కార్చేవి. తమ బాధను మొరపెట్టుకోవడానికి వినేనాథుడే లేడు. రోజురోజుకీ మానవుల ఆకృత్యాలు చెట్లు, మొక్కల పట్ల ఎక్కువైపోయాయి.
భక్తి పేరుతో పువ్వులు, పండ్లు, ఆకులు కోసే సందర్భంలో చెట్లపై గూళ్లు పెట్టుకున్న పక్షులను కూడా మానవులు విడిచిపెట్టక ఆ పక్షి గూళ్లను నాశనం చేసేవారు.
చెట్ల కింద మానవులు పంచాయతీ పెట్టుకున్న సందర్భంలో ఆ చెట్టుపై ఉన్న పక్షులు రెట్ట వేస్తే, ఆ పక్షుల అంతు చూసేవారు; ఆ పక్షి గూళ్లను లేపేసేవారు.
చివరికి చేసేది లేక చెట్లు, మొక్కలు మనుషులలోని పెద్దమనుషులతో తమ గోడు వెళ్లబోసుకున్నాయి.
"ఓ మానవులారా! చెట్లమైన మేము కూడా ప్రాణులమే. మాకు కూడా మనసు, అనుభూతులు ఉంటాయి. మాకు మానవ, జంతువుల మల్లే అనుభూతులు ఉంటాయని మీ శాస్త్రవేత్తలు కనుగొని నోబెల్ ప్రైజ్ పొందారు.
మా త్యాగం సృష్టిలో ఎవరూ చేయరు. మేము పరోపకారులం. 'పరోపకారార్థం ఇదం శరీరం' అన్నారు పెద్దలు. మేము మీకు పూజకు పత్రాలు, పండ్లు, పువ్వులు ఇస్తున్నాం. మీరు తినడానికి పండ్లు ఇస్తున్నాం.
మీకు శ్వాస కోసం ఆక్సిజన్ ఇస్తున్నాం, మీకు ప్రాణం పోస్తున్నాం. మీ దగ్గర నుండి వస్తున్న బొగ్గుపులుసు వాయువును మేము గ్రహించి మీకు వేడి లేకుండా చేస్తున్నాం.
మీకు నీడను ఇస్తున్నాం. కానీ మీరు నీడ కోసం మా వద్దకు వచ్చి, మాపై ఉన్న పక్షి గూళ్లను నాశనం చేస్తున్నారు!
సృష్టి మొదట్లో సృష్టికర్త ఒక పత్రం, ఒక పండు, ఒక పువ్వుతో దేవునికి పూజ చేయమని చెప్పాడు. ఆ విషయం మీకు తెలుసు. కొండంత దేవుణ్ణి కొండంత పత్రి, కొండంత పువ్వులు, కొండంత పండ్లతో పూజ చేయలేము.
పూజకి అవసరం మేరకు మా వనరులను వాడుకోవాలి. మేము ప్రధానంగా మొక్కలం... కిరణజన్య సంయోగక్రియ చేయడం వలన మీకు తిండిగింజలు దొరుకుతున్నాయి.
మా వలన, ముఖ్యంగా చెట్ల వలన వర్షాలు పడుతున్నాయి. అంతటి త్యాగం మాది! 'త్యాగానికి తరువులే గురువులు' అంటారు పెద్దలు. అంత గొప్ప త్యాగం చేస్తున్న మాకు మీరు ఇస్తున్నది ఏమిటి... మమ్మల్ని హింసించడం తప్ప?" అని తమ గోడును పెద్దమనుషుల దగ్గర వెళ్లబోసుకున్నాయి చెట్లు, మొక్కలు.
చెట్లు, మొక్కలు మనుషుల ప్రవర్తనను కొంతకాలం గమనించాయి. మానవుల ప్రవర్తనలో ఇసుమంతైనా మార్పు లేదు. పైపెచ్చు మొక్కలు, చెట్ల పట్ల వారి ప్రవర్తన మరింత కటువుగా తయారైంది. చెట్లు, మొక్కలు ఇది 'కలియుగ మహిమ' అనుకున్నాయి.
చెట్లు, మొక్కలు మనుషులు తమ పట్ల కటువుగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా... చెట్లపై నివాసముంటున్న పక్షులను కొత్తచోట్లను నివాస స్థలాలుగా ఎంచుకోమన్నాయి.
ఎందుకంటే మొక్కలు, చెట్లు తమకున్న ఆకులు, పువ్వులు, పండ్లను నేలపైకి రాల్చేసి బోడిగా తయారయ్యాయి. ప్రకృతిలో పచ్చదనం పోయింది. పక్షులు దిక్కుతోచక తమ గూళ్లను మనుషుల ఇళ్లల్లో పెట్టుకున్నాయి.
పర్యావరణంలో గాలి లేదు, మానవులు పీల్చడానికి ఆక్సిజన్ లేదు. వారు విడిచిన కార్బన్ డైయాక్సైడ్ ఎక్కువైంది. పర్యావరణం వేడిగా తయారైంది.
ప్రకృతిలో పచ్చదనం లేకపోవడంతో కిరణజన్య సంయోగక్రియ జరగలేదు, మనుషులకు, జంతువులకు తినడానికి తిండి లేదు.
ప్రకృతిలో పచ్చదనం లేకపోవడంతో వర్షాలు పడలేదు. మనుషులు, జంతువులు తాగడానికి నీరు లేదు, పీల్చడానికి గాలి లేదు... పర్యావరణం మొత్తం అతలాకుతలం అయింది!
ఇలా ఒక సంవత్సరం గడిచింది.
మానవులకు చెట్లు, మొక్కలు తమకు గుణపాఠం నేర్పడానికే ఇలా చేశాయని అర్థమైంది. చేసేది లేక మొక్కలు, చెట్లతో సంధి చేసుకున్నారు.
మొక్కలు, చెట్లతో మానవులు చేసుకున్న ఒప్పందం ప్రకారం... అవసరం మేరకే ఆకులు, పువ్వులు తెంచుతారు.
చెట్లను నగరీకరణ పేరిట విచక్షణరహితంగా నరకరు. అవసరం లేకుండా చెట్ల, మొక్కల కొమ్మలను నరకరు, తుంచరు.
కొండంత దేవునికి కొండంత పత్రం, కొండంత పువ్వులు, కొండంత పండ్లు కాకుండా... 'చంద్రునికో నూలుపోగు' అన్నట్లు దేవుణ్ణి పూజిస్తామని మనుషులు చెట్లు, మొక్కలకు మాట ఇవ్వడంతో చెట్లు, మొక్కలు తమ బంద్‌ను... అదే తమ స్తంభనను విరమించుకున్నాయి.
మరలా ప్రకృతి అంతా యథావిధిగా పచ్చదనం సంతరించుకుంది. ప్రకృతి పచ్చని చీరను తన ఒంటిపై సింగారించుకుంది.
"వృక్షో రక్షతి రక్షితః" అన్నట్లు మనుషులు, జంతువులు మొక్కలను, చెట్లను తమ ప్రాణాస్పదంగా, తమ కన్నబిడ్డల్లా, కంటిలో పాపల్లా చూసుకున్నారు.
ప్రతి మానవుని పుట్టినరోజు నాడు ఒక మొక్కను నాటేవారు. ఆనాటి నుండి మొక్కల పెంపకాన్ని ఒక పండుగలా చేసుకున్నారు మానవులు.
- రాళ్లబండి సంగం నాయుడు
~ సమాప్తం ~
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు
వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు
హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం










Comments