దత్త జయంతి వైశిష్ట్యం
- Rayala Sreeramachandra Kumar

- 3 days ago
- 4 min read
Dattha Jayanthi Vaisishtyam - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 04/12/2025
దత్త జయంతి వైశిష్ట్యం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
మార్గశిర మాసంలో పౌర్ణమి తిథి నాడు దత్త జయంతిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం డిసెంబర్ 4, గురువారం రోజున ఈ వేడుక జరుపుకుంటారు. దత్తాత్రేయుడు అవతరించిన రోజు అది. దత్తాత్రేయుడు (గురుదేవ్ దత్త ) మరియు శ్రీపాద వల్లభ మధ్య వ్యత్యాసం ఏమిటంటే, దత్తాత్రేయుడు త్రిమూర్తుల (బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు) అంశతో జన్మించిన ఒక పురాతన ఋషి మరియు దైవం, అయితే శ్రీపాద వల్లభుడు కలియుగంలో దత్తాత్రేయ స్వామి యొక్క మొదటి పూర్ణావతారం. దత్త అనే పదానికి "సమర్పించిన" అనే అర్థముంది. అత్రి మహర్షి, అనసూయ దంపతులకు త్రిమూర్తులు పుత్రుడి రూపంలో తమను తాము "సమర్పించుకున్నారు" కనుక అతడికి దత్తా అని పేరు వచ్చింది. ఇతడు అత్రి కుమారుడు కాబట్టి తన పేరు "ఆత్రేయ" అయ్యింది.
దత్తగురువుగా, యోగానికి అధిపతిగా భావిస్తారు. ఆయన మూడు తలలు, ఆరు చేతులు కలిగి ఉంటారు, ఆయనతో పాటు నాలుగు శునకాలు మరియు సకల శుభదాతగా ఒక గోమాత కూడా ఉంటారు. దత్తుని చుట్టూ ఉన్న నాలుగు కుక్కలను (భైరవాలు) కలిగిఉంటాడు. ఇది నాలుగు వేదాలకు ప్రతీకగా చిత్రించబడిన గుర్తు. దత్తాత్రేయుడు 'అవధూత గీత' మరియు 'త్రిపుర రహస్యం' వంటి గ్రంథాలను రచించారు. దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల దగ్గర విద్యను ఆర్జించి (అందులో ఒక వేశ్య కూడా ఉంది) విశిష్టమైన ఆచార్య స్థానాన్ని పొందగలిగారు. దత్త సంప్రదాయం ప్రకారం కలియుగంలో తొలి అవతారం శ్రీపాద శ్రీ వల్లభ, రెండో అవతారం నరసింహ సరస్వతి. మూడవ అవతారం మాణిక్ ప్రభు, నాలుగవ అవతారం అక్కల్ కోట్ స్వామి సమర్ధ, ఐదవ అవతారం శ్రీ షిరిడీ సాయి బాబాగా చెప్పుకుంటారు. ఇలా మొత్తం 16 అవతారాలు ఉంటాయి. త్రిమూర్తుల స్వరూపంగా దత్తుడు అవధూతగా ఆవిర్భవించడానికి దారి తీసిన నేపథ్యం ఏమిటి అనే ఆసక్తికర విషయాలను తెలుసుకోవలసిన అవసరం ఉంది.
దేవహూతి మరియు కర్ధమ ప్రజాపతి కుమార్తె అనసూయ. అత్రి మహర్షి భార్య అయిన అనసూయాదేవి మహా పతివ్రతగా ప్రసిద్దికెక్కింది. లోక కళ్యాణం కోసం నారద మహర్షి కొన్ని కలహ ప్రియమైన పనులు చేస్తుంటారు. అందులో భాగంగా అనసూయ పాతివ్రత్యం గురించి గొప్పగా చెబుతూ నారద మహర్షి త్రిమూర్తుల ధర్మపత్నులైన లక్ష్మీ, పార్వతి, సరస్వతుల ముందు విశేషంగా పొగడడం మొదలెట్టాడు. అది విని విని ఆ ముగ్గురికి అనసూయ మీద అసూయ ఏర్పడింది. ఆమె పాతివ్రత్యాన్ని భంగం చేయవలసిందిగా వారు తమ భర్తలను వేడుకున్నారు. అది మంచిది కాదని త్రిమూర్తులు ఎంత చెప్పినా వినకపోవడంతో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు సాధువుల రూపంలో రాత్రి మహర్షి ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ దివ్య తపస్సంపన్నుడైన అత్రి మహర్షిని, మహా సాధ్వి అయిన అనసూయను చూసి ముగ్ధులయ్యారు. ఆ పుణ్య దంపతులు సన్యాసి రూపాల్లో ఉన్న త్రిమూర్తులను లోనికి ఆహ్వానించి, స్వాగత సత్కారాలు చేసి "మీరు ముగ్గురు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వలె వచ్చి మా ఆశ్రమాన్ని పావనం చేశారు. మీ రాక మాకెంతో ఆనందాన్ని కలిగించింది. ఈపూట మా ఆశ్రమంలో భోంచేసి వెళ్ళండి" అని అడిగారు. అందుకు సమ్మతించిన త్రిమూర్తులు భోజనానికి కూర్చున్నారు.
వడ్డన మొదలుపెట్టే సమయంలో అనసూయకు సాధువుల రూపంలో ఉన్న త్రిమూర్తులు ఒక షరతు పెట్టారు. ఆమె దుస్తులు ధరించకుండా నగ్నరూపంలో వడ్డిస్తేనే తాము భుజిస్తామని తేల్చి చెప్పారు. అనసూయకు దిక్కుతోచక ఆలోచనలో పడింది. పరపురుషుల ముందుకు నగ్నంగా వస్తే ఆమె పాతివ్రత్యం కోల్పోతుంది. అందుకు వ్యతిరేకిస్తే ఆమె అతిధులను అగౌరవం చేసినట్లు అవుతుంది. ఈ వింత కోరిక కోరిన వారు సామాన్యులు కారు అని ఆమె గ్రహించింది. తన పాతివ్రత్య మహిమతో వచ్చినవారు ముల్లోకాలను ఏలే త్రిమూర్తులే అని తెలుసుకుంది. ఆహా! ఏమి నా భాగ్యం, త్రిమూర్తులకు ఆతిథ్యం ఇచ్చే అదృష్టం కలుగుతోంది కదా అనుకుంది. తాను కామగుణానికి లోను కాను కాబట్టి దుస్తులు లేకుండా వారికి వడ్డించడానికి భయపడనని అనసూయ వారితో చెప్పింది.
భర్తను మనసులోనే ధ్యానించుకుని, కమండలంలోని ఉదకాన్ని త్రిమూర్తుల శిరస్సుపై జల్లి, వచ్చిన అతిథులను తన పిల్లలుగా భావించి వారు కోరిన విధంగా భోజనం వడ్డించింది. వెంటనే ఆ ముగ్గురు పసిబాలురుగా మారిపోయారు. మాతృత్వం పొంగి ఆమె వక్షోజాల నుంచి పాలు ధారగా వచ్చాయి. తర్వాత కొంగు చాటున ఆమె వారికి పాలు తాగిపించి ఊయలలో పడుకోబెట్టి నిద్రపుచ్చింది. తర్వాత అత్రి మహర్షి ఆశ్రమానికి తిరిగివచ్చి తన దివ్య దృష్టితో జరిగినదంతా తెలుసుకుని ఊయలలో నిద్రిస్తున్న త్రిమూర్తులను స్తుతించాడు. స్వర్గంలో లక్ష్మీ సరస్వతి పార్వతి మాతలకు భర్తల ఆచూకీ తెలియక గుబులు పుట్టింది. నారదుని ద్వారా అత్రి మహర్షి ఆశ్రమంలో జరిగిన విశేషాలను తెలుసుకున్నారు. దానితో అనసూయపై ఏర్పడిన ఈర్ష్య, అసూయ, ద్వేషాలు పటాపంచలు అయ్యాయి. వెంటనే వారి నిజ స్వరూపాలతోనే ముగ్గురమ్మలు భూలోకానికి బయలుదేరి అనసూయ అత్రిముని ఆశ్రమానికి చేరుకున్నారు. అత్రి అనసూయ దంపతులు ముగ్గురమ్మలను చూసి సాదరంగా ఆహ్వానించి స్వాగత సత్కారాలతో ప్రసన్నం చేశారు.
పసిబాలుర రూపాల్లో ఉన్న వారి వారి భర్తలను చూసుకుని కంగారుపడి వారికి పతి భిక్ష పెట్టమని అత్రి అనసూయలను అర్థించారు. అయితే మీ మీ భర్తలను మీరే గుర్తించి తీసుకుని వెళ్లండి అని అనసూయ హుందాగా చెబుతుంది. ఒకే వయస్సుతో ఒకే రూపుతో అమాయకంగా నోట్లో వేలు వేసుకుని నిద్రిస్తున్న ఆ జగన్నాటక సూత్ర ధారులను విడివిడిగా గుర్తు పట్టలేకపోయారు. కనువిప్పు కలిగిన లక్ష్మి సరస్వతి పార్వతి మాతలు అనసూయతో "తల్లీ! నీ పాతివ్రత్య దీక్షను భగ్నం చెయ్యాలని ఈర్ష్య, అసూయ, ద్వేషాలతో మేము చేసిన తప్పిదాన్ని మన్నించి మా భర్తలకు దయతో స్వస్వరూపాలు ప్రసాదించమని" వేడుకుంటారు. అనసూయ మాత తిరిగి పతిని తలచుకుని కమండలం తీయగానే, త్రిమూర్తులు సాక్షాత్కరించి, ఈ ఆశ్రమంలో మీరు కన్న తల్లిదండ్రుల కంటే ఎక్కువగా పుత్ర వాత్సల్యాన్ని మాకు పంచిపెట్టారు. మీకు ఏమి వరం కావాలో కోరుకోమన్నారు.
త్రిమూర్తులను చూసి అత్రి అనసూయ దంపతులు "నాయనలారా! ఈ పుత్ర వాత్సల్యాన్ని పొందే భాగ్యం మీరే కల్పించారు కాబట్టి దాన్ని మాకు శాశ్వతంగా ఉండేలా అనుగ్రహించండి అని కోరుకున్నారు. పుణ్య దంపతుల్లారా! మీ పుత్ర వాత్సల్యానికి మీకు మేము ముగ్గురం దత్తమవుతున్నాము. మీ కీర్తి ఆచంద్రతారార్కం అవుతుంది అని వరమిచ్చి అంతర్దానం అయ్యారు. ఊయలలోని ఆ బాలురు అత్రి అనసూయల బిడ్డలుగా కొంతకాలం పెరిగిన తరువాత త్రిమూర్తులు వారి వారి అంశలను దత్తాత్రేయునికి ఇస్తారు. అప్పటి నుండి ఆ స్వామి వారు శ్రీ దత్తాత్రేయ స్వామిగా అవతార లీలలు ఆరంభించారు. పుణ్యప్రదమైన శ్రీ దత్త జయంతి సందర్భంగా దత్తావతారం కథను చదివినా, విన్నా సకల శుభాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం.
జై గురుదత్త
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త





Comments