top of page
Original.png

దేవుని సాక్ష్యం

#GadirajuMadhusudanaRaju, #గాదిరాజుమధుసూదనరాజు, #దేవుని సాక్ష్యం, #TeluguStories, #తెలుగుకథలు


Devuni Sakshyam - New Telugu Story Written By Dr. Gadiraju Madhusudana Raju Published in manatelugukathalu.com on 01/02/2026

దేవుని సాక్ష్యం - తెలుగు కథ

రచన: డా. గాదిరాజు మధుసూదనరాజు


త్రయంబకేశ్వరం నుండి శ్రీశైల క్షేత్రం వరకు ఇక్ష్వాకుల సార్వభౌమత్వం వర్థిల్లుతున్న సమయంలో, జ్ఞానేంద్రప్రస్థాన్ని ప్రజ్ఞార్జున చక్రవర్తి శాసించేవాడు.


అతని పుత్రుడైన బృహద్రథుడు, చిత్రకూట పర్వత పీఠపద శ్రేణీ పుర త్రయంపై భండాసుర దురాక్రమణల నియంత్రణకై జరిగిన యుద్ధంలో విజయం సాధించి, విజయానంతరం సాగర తీర దురాక్రమణల నుండి ఉత్తరాపథాన్ని రక్షించే నిమిత్తం హేలావర్తాన్ని స్థాపించాడు.


తారకాసురుని వధాక్రమంలో ప్రతిష్ఠితమైన శైవ పంచారామ క్షేత్రాలతో విరాజిల్లుతున్న భూవలయాన్ని, పావన గోదావరీ తీరాన్ని అన్నపూర్ణగా మార్చాడు.


వశిష్ఠ గోత్రీకుడైన కృష్ణమ రాజేంద్రునికి ఆత్రేయ మండలం, అంతర్వేదీశ్వర ధాత్రీ మండలం అప్పగించాడు. కాశ్యప గోత్రీకుడైన నృసింహ రాజేంద్రుడిని సఖినేంద్రపురం, రాజరాజేశ్వర సోమేశ్వరాయవర భూమండలాలకు రక్షకునిగా


నియమించాడు.


తపస్సంపనులైన ఋషులు, సిద్ధుల కోసం సిద్ధాపురాన్ని పరిరక్షించడం కోసం, అన్నపూర్ణా వర ప్రసిద్ధమైన జ్ఞానపూర్ణికా వనంలో దుర్గాన్ని నిర్మించి, పురాణ ప్రసిద్ధమైన సోమేశ్వరాలయ రక్షణా భారాన్ని కౌండిన్య గోత్రీకులైన భీమేశ్వర వర్మకు అప్పగించాడు.


భీమేశ్వరుడు అమలాపురాన్ని ఆక్రమించి స్వతంత్రించడంతో...


హేలావర్తాన్ని పాలిస్తున్న బృహద్రథ పౌత్రుడు అయిన సూర్యధ్వజ మహారాజు జ్ఞాన పూర్ణికా మండలాన్ని సైన్యాధ్యక్షుడైన చంద్రకేతునికి నమ్మకంతో అప్పగించాడు.


చంద్రకేతుడు వేశ్యాలోలుడై, దైవభక్తి మరచి శివారాధనను, ఋషులను, సిద్ధులను నిర్లక్ష్యం చేశాడు.


తత్ఫలితంగా మునుల ఆశీస్సులకు దూరం అయ్యాడు.


అట్టి దుర్భర పరిస్థితిలో...


జ్ఞాన పూర్ణికా వనంలో సోమయాగాన్ని జరిపించాలని బృగు శీర్షముని సంకల్పించి వచ్చి, ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న చంద్రకేతు మహారాజుకి కబురుపంపాడు. ఆ మహారాజు మహేంద్రపురంలో రాజ్య పరిపాలనా భారంతో, రాజభోగాలతో సతమతమై పోయి నిర్లక్ష్యం చేశాడు. మునీంద్రుని ఆగ్రహానికి గురయ్యాడు.


పదవీచ్యుతునివై పోదువుగాక అని శపించి, ఆయన జ్ఞాన ప్రసూనాంబికా వనానికి పోయి


అక్కడ ఆ యాగాన్ని జరిపించాడు.


ఈ సోమావర్తంలో భాగమై ఉన్న నిష్ఠమునీశ్వరము అనే ఋష్యాశ్రమంలో, వృద్ధముని ఉద్ధవుడు స్వయంగా వెళ్ళి చక్రవర్తి బృహద్రథ సార్వభౌముడిని కలిసి, రాజధాని జ్ఞానేంద్రప్రస్థంలో ఈ దుస్థితిని వివరించాడు.


చక్రవర్తి తన ప్రియ మిత్రులు, ధర్మనిష్టుడు, మంత్రి అయిన చంద్రప్రభావర్ధనుడికి పరిస్థితిని చక్కదిద్దే బాధ్యత అప్పగించాడు.


శ్రీకృష్ణ భక్తుడైన చంద్రప్రభావర్ధనుడు మహావీరుడు. యజ్ఞహోమాదులతో మహేంద్రుణ్ణి మెప్పించి, హోమేంద్రీ నగరాన్ని శత్రు దుర్భేద్యం చేసుకున్నాడు. అతడు ఉత్తముడు, అత్యంత బలసంపన్నుడు కూడా.


.


చక్రవర్తి ఆజ్ఞానుసారం హేళావర్తంలో ధర్మ సభ ఏర్పాటు చేసి, విచారణకు చంద్రకేతు మహారాజును పిలిపించాడు.


సూర్యధ్వజుడు తనచేత నియమితుడైన చంద్రకేతు అలా ధర్మ భ్రష్టుడు అయ్యాడన్న విషయాన్ని జీర్ణించుకోలేక, తన సేనానికే వత్తాసు పలికాడు.


చంద్రప్రభా వర్ధన వర్మ... దేవాలయ, ఋష్యాశ్రమ ధర్మ నిర్వహణలో తాను అప్రమత్తంగా ఉన్నానని సాక్షులచే చెప్పించాడు.


ధర్మ నిర్ణయ అధికారి అయిన చంద్రప్రభావర్ధన వర్మ మాత్రం... సభకు నమస్కరించి... ఆ జ్ఞానపూర్ణక సోమేశ్వరుడే ఈ వివాదంలో ధర్మ నిర్ణయ న్యాయమూర్తియై తీర్పు చెబుతాడు అని ప్రకటించాడు.


అందరూ ఆశ్చర్యపోయారు.


ఈ రోజు అంగీరస నామ బహుళ త్రయోదశి. కావున మరల తదియ రోజున సుప్రభాతాన సభ ఉంటుంది అని సభ ముగింపు చేశాడు.


**


శుద్ధ తదియ రోజున సభలో


ఉద్ధవ మునీంద్రుడు లేచి... చంద్రకేతు మహారాజులవారు అన్నీ కూట సాక్ష్యాలు చెప్పిస్తున్నాడని... అతను కొన్ని క్షేత్రాలు అస్సలు ఒక్కమారు కూడా దర్శించలేదని, ఆ విధంగా జ్ఞానపూర్ణికా వనంలో ముని శాపానికి కూడా గురి అయ్యాడని, అతడు దర్శించని ఆలయాలలో ఆ సోమేశ్వరాలయం కూడా ఉన్నదని అన్నాడు.


కానీ ఈ మూడు రోజుల వ్యవధిలో ఆలయాలు, ఆశ్రమాలు అన్నీ తెలివిగా దర్శించి వచ్చాడు చంద్రకేతు మహారాజు ముందు జాగ్రత్తతో.


ధర్మమూర్తి స్థానంలో ఉన్న చంద్రప్రభావర్ధనుడు... కూట సాక్ష్యాలు ఎవ్వరికైనా అన్యాయం కలిగించవచ్చును అని ఆలోచించి, అనుమానించి అవమానించదగిన వారు మునులలోనూ, రాజులలోనూ లేరు అంటూ...


రాజ్య భారంతో తలమునకలు అవుతున్నవారు ఎప్పుడో ఒకప్పుడు కొన్ని బాధ్యతలు విస్మరించడం కూడా జరుగవచ్చును.


అంటూ... చంద్రకేతు మహారాజును తన పరిధిలోని ఆలయాలలోని దేవీదేవతల రూపాలు, రంగులు మాత్రం వర్ణిస్తూ పత్రం వ్రాయండి చాలును అన్నాడు.


అనంతరం తాను స్వయంగా అన్నింటినీ దర్శించి పత్రంతో సరిపోలని క్షేత్రాలను నిర్లక్ష్యం చేసినట్లు పరిగణించి, ఆ రాజ్యం నుండి అతన్ని బహిష్కరిస్తామని, పత్రం సత్యమైనదిగా నిర్ధారింపబడితే చంద్రకేతునికే అదనంగా మరింత రాజ్యాన్ని అప్పగిస్తామని చెప్పారు.


రాజులు రాజులనే సమర్థిస్తారనీ, పరీక్షా విధి


అతి సులభంగా ఉండటమే అందుకు నిదర్శనమని భక్తజనం వాపోయారు.


కానీ... అద్భుతం జరిగింది.


ధర్మమూర్తి చంద్రప్రభావర్ధనుని తీర్పుతో...


చంద్రకేతును దోషిగా పరిగణించి,


పదవీచ్యుతుడిని చేసి, అతని నుండి జ్ఞానపూర్ణికా మండలాన్ని, దుర్గాన్ని సూర్యధ్వజ మహారాజు స్వాధీనం చేసుకున్నాడు.


అందుకు సోమలింగేశ్వరుడే సాక్ష్యంగా ప్రకటించి, ధర్మమూర్తి చంద్రప్రభా వర్ధన వర్మ సభాస్థలిలో ప్రకటించాడు.


**


ధర్మమూర్తి చంద్రప్రభా వర్ధనుల వారు కార్తీక పూర్ణిమ రోజున వచ్చి, అత్యంత భక్తితో జ్ఞానపూర్ణికా మండలం లోని సోమేశ్వర ఆలయాన్ని దర్శించి, అభిషేకం చేసి పూజించాడు.


ఆ సమయంలో సోమేశ్వర స్వామి లింగం తెల్లని వర్ణంలో ప్రకాశించటం చూశాడు.


కానీ చంద్రకేతు తన అధికార పత్రంలో జ్ఞానపూర్ణికా సోమేశ్వరుని లింగం నల్లని వర్ణంతో భాసిల్లుతోందని వర్ణించి వివరించాడు.


తాను సత్యం చెప్పినా, భృగు శీర్ష ముని శాపం వలన, సోమేశ్వరుడు అలా దర్శనం ఇచ్చాడని చంద్రకేతుడు భావించి పశ్చాత్తాపం పొందాడు.


కానీ వృద్ధముని ఉద్ధవుడు మాత్రం... శ్రీకృష్ణ భక్తుడైన చంద్రప్రభావర్ధనుని సునిశిత శోధనతో కూడిన నిష్పక్షపాతమైన బుద్ధి కుశలత వల్లనే న్యాయం జరిగిందని, తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశాడు. సంతృప్తి చెందాడు.


చంద్రకేతు మహారాజు గారు తనకు లభించిన వ్యవధిలో సోమేశ్వర లింగార్చన కూడా చేశాడు. అప్పుడు ఆ లింగం వర్ణం నలుపే! అందుకు కారణం... చంద్రునిచే ప్రతిష్ఠితమైన జ్ఞానపూర్ణికా సోమనాథ లింగం అమావాస్య వరకు నలుపు రంగులో వర్ధిల్లుతుంది.


కావున చంద్రకేతుడు తాను చూసిన సత్యాన్నే వ్రాశాడు.


శుక్ల పక్షంలో క్రమంగా శ్వేత వర్ణాన్ని సంతరించుకుంటూ పౌర్ణమి నాటికి తెల్లగా వెలుగులు ప్రసరిస్తుంది.


ఇది దైవ రహస్యం.


ఈ రహస్యం ధర్మమూర్తికి తెలుసు. అయినా దశాబ్దాల పాటు పాలన సాగించిన చంద్రకేతుడు ఈ విషయాన్ని తెలుసుకోలేకపోవడంతో అతను ఆలయాన్ని నిర్లక్ష్యం చేసినట్లు ఋజువు దొరికింది.


ఆలయ సందర్శన కోసం భక్తిభావంతో వచ్చిన రాజ్యాధిపతులకు ఈ శివలింగం ప్రత్యేకతను పూజారులు వివరించటం ఆచారంగా ఉంటుంది.


అధికార దర్పంతో ఆ మాత్రం వెసులుబాటును, చనువును కూడా పూజారులకు కల్పించకపోవడం రాజులకు, ధర్మకర్తలకు తగదు.


దేవతలను, ఋషులను, బ్రాహ్మణులను నిర్లక్ష్యం చేయటం రాజధర్మం కాదు. అందుకే అతను శిక్షార్హుడైనాడు, పదవీచ్యుతుడిని చేయడం జరిగింది.


సోమేశ్వరుడి ప్రాశస్త్యాన్నే సాక్ష్యంగా ప్రకటించి, ధర్మమూర్తి ఇచ్చిన తీర్పుని చరిత్రలో ఆధ్యాత్మిక విజయంగా లిఖించాడు ఉద్ధవుడు.


(సమాప్తం)

డా. గాదిరాజు మధుసూదనరాజు  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: గాదిరాజు మధుసూదన రాజు

 కృతజ్ఞతలు నమస్సులు

నేను  సూర్య వంశ క్షత్రియ వంశస్థుడను. ప్రభుత్వ నేత్ర వైద్య అధికారిగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో పనిచేసి రిటైర్ అయ్యాను.

నా కథలు దశాబ్దాల క్రితమే " కధా నిలయం" లో కూడా చోటు చేసుకున్నాయి. సాహిత్యం నా ఊపిరి.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page