దొరకునా ఇటువంటి సేవా.. ?!
- Sathyanarayana Murthy M R V

- 2 days ago
- 5 min read
#దొరకునాఇటువంటిసేవా, #DorakunaItuvantiSeva, #MRVSathyanarayanaMurthy, #MRVసత్యనారాయణమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Dorakuna Ituvanti Seva - New Telugu Story Written By M R V Sathyanarayana Murthy Published In manatelugukathalu.com on 25/12/2025
దొరకునా ఇటువంటి సేవా - తెలుగు కథ
రచన: M R V సత్యనారాయణ మూర్తి
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
ఫంక్షన్ హాలు ముందు ఖరీదైన కారు ఆగింది. తెల్లటి మల్లెపూవు లాంటి బట్టలు ధరించిన వ్యక్తి, ఖరీదైన నగలు ధరించిన అతని భార్య, కారు దిగి లోపలకు వెళ్ళారు. తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వేదిక మీదకు వెళ్ళారు.
అతను కుర్చీలో కూర్చున్న పెద్దాయనకు సాష్టాంగ నమస్కారం చేసాడు. అతని భార్య పెద్దాయనకు, ఆయన భార్యకు నమస్కరించింది. అతను కూడా పెద్దావిడకు నమస్కరించి, తర్వాత పెద్దాయన కాళ్ళ దగ్గర కూర్చున్నాడు.
పరంధామయ్య అతని శిరసు ఆప్యాయంగా నిమిరారు.
“లే.. వెళ్లి కుర్చీలో కూర్చో” అన్నారు చిరునవ్వుతో ఆయన.
“ఉహూ.. నాకు ఇక్కడే బాగుంది మాస్టారూ. ఇక్కడే కూర్చుంటాను” అన్నాడు నెమ్మదిగా అతను.
“ఒరేయ్ పుల్లయ్యా, లే అక్కడి నుండి” అన్నారు మాస్టారి భార్య నెమ్మదిగా.
వెంటనే “అలాగే అమ్మగారూ” అని లేచి నిలబడ్డాడు పుల్లయ్య అనే జి. పి. రావు.
ఆరోజు పరంధామయ్య మాస్టారు, కామేశ్వరిల యాభయ్యవ పెళ్లి రోజు. బంధు మిత్రుల, మాస్టారి దగ్గర చదువుకున్న శిష్యుల రాకతో ఫంక్షన్ హాలు కిట కిట లాడుతోంది.
మాస్టారు, భార్య కేసి తిరిగి, “వాడికి నీమాట అంటేనే గురి. నేను చెబితే వినలేదు. నువ్వు చెప్పగానే, నాదస్వరానికి తలూపే నాగరాజులా నీ ఆజ్ఞ పాటించాడు” అన్నారు నవ్వుతూ.
“వాడు అమాయకుడండి పాపం” అంది అభిమానంగా కామేశ్వరి.
“నువ్వు ఒక్కదానివి అంటావు, వాడు అమాయకుడు అని. వాడు కోట్లలో వ్యాపారం చేస్తున్నాడు తెలుసా? హైదరాబాద్ లో ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారులలో వీడూ ఒకడు” అన్నారు మాస్టారు.
“అంతా మీ దయ, అమ్మగారి ఆశీస్సులు” అన్నాడు జి. పి. రావు వినయంగా. వేదిక కింద ఉన్న బంధువుల్ని పలకరించి, పైకి వచ్చిన మాస్టారు పెద్ద అబ్బాయి శ్రీహర్ష, “ఏరా పుల్లయ్య, బాగున్నావా?” అని ఆప్యాయంగా పలకరించాడు.
“ఆ బాగానే ఉన్నాను అబ్బాయి గారు. మీరు బెంగుళూరేనా?” నవ్వుతూ అడిగాడు జి. పి. రావు.
“అవును. ప్రస్తుతం బెంగళూరే. అవును మీరు ఇద్దరే వచ్చారు. మీ పిల్లలు రాలేదా? వాళ్ళు ఎక్కడ ఉంటున్నారు” అడిగారు శ్రీహర్ష.
“పెద్దాడు ఢిల్లీ, చిన్నాడు ముంబైలో ఉంటున్నారండి. గంట క్రితం రాజమండ్రిలో ఫ్లైట్ దిగారండి. కారులో వస్తున్నారండి” వినయంగా చెప్పాడు జి. పి. రావు.
ఇంతలో మాస్టారి చిన్నబ్బాయి శ్రీకర్ వేదిక మీదకు వచ్చాడు. ”నువ్వు గ్రేట్ రా పుల్లయ్యా. మన ఊరి వాళ్ళు పదిమందికి నీ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చావట. జన్మభూమి మీద నీ ప్రేమ చాటుకున్నావు” అని అభినందించాడు.
“నన్ను పెంచి, పెద్ద చేసిన మనూరిని మర్చిపోవడమంటే, జన్మనిచ్చిన తల్లికి ద్రోహం చేసినంత తప్పని నా అభిప్రాయం అబ్బాయి గారు” అన్నాడు జి. పి. రావు. శ్రీహర్ష కూడా అతన్ని అభినందించాడు.
కొద్దిసేపటికి జి. పి. రావు కొడుకులు మధుసూదన్, మోహన్ వచ్చి మాస్టారి దంపతులకు నమస్కరించి ఖరీదైన గిఫ్టులు ఇచ్చి తండ్రి పక్కనే నిలబడ్డారు.
వేదిక ముందు కూర్చున్న సుబ్రహ్మణ్యం, తన పక్కనే ఉన్న శేషగిరితో “మన పుల్లయ్య ఇంతలా ఎదుగుతాడని ఎవరం ఊహించలేదు కదా ! చిన్నప్పుడు నత్తిగా మాట్లాడుతూ, తింగరిగా ఉండేవాడు మాస్టారి ఇంటి దగ్గర ట్యూషన్ అయ్యాక ఊరి చివర ఉన్న వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి భయపడి, రాత్రిళ్ళు మాస్టారి ఇంటిలోనే పడుకుని, మర్నాడు ఉదయం లేచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. అంత పిరికివాడు. చదువయ్యక హైదరాబాద్ వెళ్లి చవగ్గా స్థలాలు కొని, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్లు గడించాడు” అని అన్నాడు.
“అవును. పుల్లయ్య తిరిగే కారు ఖరేదే ఎనభై లక్షలు అంట. ఎంత అదృష్టవంతుడు” అన్నాడు శేషగిరి.
ఒక అరగంట గడిచాక కుటుంబంతో కలిసి వేదిక దిగాడు జి. పి. రావు. తన మిత్రులు అందరి దగ్గరకూ వెళ్లి ఆప్యాయంగా పలకరించి, వారి కుటుంబాల గురించి కుశల ప్రశ్నలు అడిగాడు. హైదరాబాద్ వైద్యం కోసం గానీ మరి ఏపని మీద వచ్చినా తనని కలవమని, తన వలన జరిగే సహాయం ఉంటె వారికి తప్పక చేస్తానని అన్నాడు. అతని కలుపుగోలుతనానికి మిత్రులు ఆనందించారు.
భోజనాల సమయంలో అందరికీ అన్నీ అందుతున్నాయో లేదో, అని స్వయంగా పర్యవేక్షణ చేసాడు. కొన్నిసార్లు తనే వడ్డించాడు. సాయంత్రం నాలుగు గంటలకు పరంధామయ్య మాస్టారి అభినందన సభ ప్రారంభం అయ్యింది. మాస్టారి శిష్యుడు, రావులపాలెం మండల పరిషత్తు అధ్యక్షుడు వెంకట్రావు సభకు అధ్యక్షత వహించాడు. ముందుగా వెంకట్రావు మాట్లాడాడు.
“అందరికీ నమస్కారం. నాది పక్కనే ఉన్న కేదరాసి పల్లె. విష్ణుపురంలో మా మావయ్యగారి ఇంట్లో ఉండి మాస్టారి దగ్గర చదువుకున్నాను. పిల్లలకు చదువు చెప్పడమేకాకుండా వారు ఎదిగి సమాజంలో ఎలా ప్రవర్తించాలో కూడా మాస్టారు చెప్పేవారు. వారి క్రమశిక్షణ, సమయపాలన చూసి, స్ఫూర్తి చెంది నేను వాటిని అనుసరించి రాజకీయంగా ఎదిగాను. మాస్టారి పెళ్లి చూడలేకపోయినా, వారి యాభయ్యవ ‘పెళ్లి పండుగ’ ను చూసే అదృష్టం కలిగింది. మాస్టారు దంపతులకు భగవంతుడు పరిపూర్ణ ఆయురారోగ్యములు ఇవ్వాలని ప్రార్ధిస్తున్నాను” అని చెప్పి నమస్కరించాడు వెంకట్రావు.
తర్వాత, పెద్ద పెద్ద ఉద్యోగాలలో స్థిరపడిన మాస్టారి శిష్యులు హరి ప్రవీణ్, విద్యాసాగర్, అభిమన్యు, కార్తికేయ మాట్లాడి, తమని ఉన్నతంగా తీర్చిదిద్దినందుకు మాస్టారికి కృతజ్ఞతలు తెలిపారు. జి. పి. రావు మాట్లాడటానికి మైకు మైకు దగ్గరకు రాగానే అందరూ గట్టిగా చప్పట్లు కొట్టారు. ముందుగా మాస్టారు దంపతులకు నమస్కరించి తర్వాత సభలోని వారు అందరికీ నమస్కరించాడు.
“ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లితండ్రులు వెంకయ్య, సూరమ్మలకు నా నమస్కారం. నన్ను మనిషిగా మలిచిన మాస్టారు గారికి, మా అమ్మగారికి దండాలు. మీ అందరికీ నేను ‘నత్తి పుల్లయ్య’ గా తెలుసు. మాట్లాడటంలో నేను పడుతున్న ఇబ్బంది గమనించి, మాస్టారు మార్టేరు హోమియో స్టోర్స్ కి వెళ్లి అక్కడే ఉండి, వైద్యం చేసే సుందరరామయ్య గారు చెప్పిన మందులు తీసుకువచ్చి నా చేత వాడించారు. నా మాట సాఫీగా రావడానికి ఎన్నో చిట్కాలు చెప్పారు మాస్టారు.
నాకు దేముడు ఇచ్చిన మరో అమ్మ కామేశ్వరమ్మ గారు. మాస్టారు గారి ఇంటి దగ్గర ట్యూషన్ అయ్యాక చీకట్లో మా ఇంటికి వెళ్ళాలంటే భయం వేసేది. రాత్రి మాస్టారి ఇంట్లోనే పడుకుని పొద్దున్నే లేచి మా ఇంటికి వెళ్ళేవాడిని. నేను తొమ్మిదో తరగతిలో ఉండగా, దీపావళి పండుగ ముందు మా అమ్మకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది. దీపావళి రోజు ఉదయం మాస్టారి చిన్న అబ్బాయి మా ఇంటికి వచ్చి, ‘మా అమ్మ రమ్మంటోంది’ అని నన్ను వారి ఇంటికి తీసుకువెళ్ళారు. వాళ్ళ పిల్లలతో పాటు నాకు కూడా ‘తలంటి స్నానం’ చేయించారు కామేశ్వరమ్మ గారు. నాకు కొత్త బట్టలు కూడా కుట్టించి ఇచ్చారు.
చిన్నబ్బాయి గారు నేనూ ఒకే ఈడువాళ్ళం. మా అమ్మకు జ్వరం రావడం వలన మా ఇంట్లో పండుగ చేసుకోమని తెలిసిన అమ్మగారు నన్ను వాళ్ళ ఇంటికి పిలిపించి వాళ్ళ బిడ్డలతో సమానంగా భోజనం పెట్టి ఎంతో ఆదరంగా చూసారు. ఆ తల్లి ఋణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను” అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. అతని కళ్ళల్లో నీళ్ళు గిర్రున తిరిగాయి. ఫాంట్ జేబులోంచి కర్చీఫ్ తీసుకుని కళ్ళు తుడుచుకున్నాడు.
“మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. నా పేరు ‘పుల్లయ్య’ నుండి, పుల్లారావు గా మారడానికి ముఖ్యకారణం కామేశ్వరమ్మ గారే. మాస్టారు గారితో చెప్పి, పదోతరగతిలో నా పేరు మార్పు చేయించారు. తర్వాత నేను అమలాపురంలో మా అమ్మమ్మగారి ఇంట్లో ఉండి డిగ్రీ చదువుకున్నాను. తర్వాత హైదరాబాద్ వెళ్లి వ్యాపారం చేసుకుని మీ అందరి ఆశీస్సులతో స్థిరపడ్డాను. నలుగురికి సాయం చేసే స్థితికి వచ్చాను. మాస్టారి గారి షష్టిపూర్తికి రాలేకపోయాను. అప్పుడు నేను దుబాయ్ లో ఉన్నాను. ఈ పెళ్లి పండుగ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలవడం నా అదృష్టం” అన్నాడు జి. పి. రావు. సభా ప్రాంగణం మరోసారి చప్పట్లతో మారుమోగింది.
మాస్టారి బంధువులు, మిత్రులు మరికొంతమంది మాట్లాడారు. పుల్లారావు మిత్రుడు నారాయణ వచ్చి, రావు చెవిలో గుస గుస లాడాడు. ఆ మాట వినగానే రావు మొహం వెయ్యి కేండిల్ బల్బులా వెలిగిపోయింది. ‘సారో నువ్వు అక్కడే ఉండు’ అని రావు చెప్పగానే, నారాయణ బయటకు వెళ్ళాడు. చివరగా మరోసారి వేదిక మీద వచ్చాడు జి. పి. రావు.
“అందరికీ మరోసారి నమస్కారం. సభ ముగిసింది. అందరూ బయటకు వస్తే, మీకు ఓ విశేషం చూపిస్తాను” అని అన్నాడు జి. పి. రావు. మాస్టారు దంపతులు, ఆహూతులు అందరూ బయటకు వచ్చి ఆదృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. ఎంతో అందంగా అలంకరింపబడిన ‘ముత్య్యాల పల్లకి’ ఉంది అక్కడ.
“ఏమిటిరా ఇదంతా.. ?” అన్నారు మాస్టరు జి. పి. రావు తో.
“మీరు మా ముచ్చట కాదనకండి” అని మరోసారి ఆయన పాదాలకు నమస్కరించాడు రావు.
మాస్టారి కొడుకులు ఇద్దరూ నవ్వుతూ”నాన్నగారూ! మీ పెళ్లి ముచ్చట మేము చూడలేదు. పుల్లయ్య ఎంతో ఉత్సాహంతో ఈ ఏర్పాటు చేసాడు. మాకు ఆ ఆలోచన రాలేదు. మీరు కాదనకండి” అని అన్నారు.
పరంధామయ్య, కామేశ్వరి మెళ్ళో పూలహారాలతో, పెళ్లి అలంకారాలతో సిగ్గుగా ముత్యాలపల్లకి ఎక్కారు. జి. పి. రావు, బోయీలను పక్కకు ఉండమని చెప్పాడు. పల్లకి ముందు, రావు, ఇద్దరు కొడుకులు భుజాలకెత్తుకున్నారు. వెనక వైపు, సుబ్రహ్మణ్యం, శేషగిరి, వెంకట్రావు భుజాలకేత్తుకున్నారు. బోయీలు వారి పక్కనే నడుస్తుండగా, పల్లకి ఊరేగింపు విష్ణుపురం వీధులగుండా సాగింది.
పల్లకిముందు మంగళవాయిద్యాలతో కలిసి మాస్టారి మిత్రులు, బంధువులు నడిచారు. మిగతా శిష్యులు పల్లకి వెనుక నడిచారు. మధ్య మధ్యలో పల్లకీ మోసే శిష్యులు మారుతున్నారు. కానీ జి. పి. రావు మాత్రం, చివరి వరకూ పల్లకీ మోస్తూనే ఉన్నాడు. ఊరేగింపు మాస్టారి ఇంటిముందు ఆగింది.
జి. పి. రావు బట్టలు చెమటతో పూర్తిగా తడిసిపోయాయి. అతని మొహం అంతా చెమట పట్టింది. పల్లకి దిగిన మాస్టారు, తన భుజం మీద కండువాతో జి. పి. రావు మొహం అంతా తుడిచి, అతన్ని ప్రేమగా ఆలింగనం చేసుకున్నారు. మాస్టారికి చక్కని ‘గురుదక్షిణ’ ఇచ్చాడు పుల్లయ్య అని అతని మిత్రులు అందరూ సంతోషించారు.
సమాప్తం.
*******
M R V సత్యనారాయణ మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : సత్యనారాయణ మూర్తి M R V
ఎమ్. ఆర్. వి. సత్యనారాయణ మూర్తి. పెనుగొండ. పశ్చిమ గోదావరి జిల్లా. కవి, రచయిత, వ్యాఖ్యాత, రేడియో ఆర్టిస్టు. కొన్ని కథల పుస్తకాలు, కవితల పుస్తకాలు ప్రచురితం అయ్యాయి. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. రేడియోలో 25 కథలు ప్రసారమయ్యాయి. 20 రేడియో నాటికలకు గాత్ర ధారణ చేసారు. కవితలు, కథలు కన్నడ భాషలోకి అనువాదం అయ్యాయి.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.






@allvideoscom1242
• 1 day ago
Kadha chala bagundi V.sarada