top of page
Original.png

ఎంపిక

11 hours ago
3 min read

తుఫాన్ సమయంలో ప్రజలను రక్షిస్తూ సేవ చేస్తున్న విజయుడు, నేపథ్యంగా ప్రజల సమస్యలను పట్టించుకోని జయుడు

Empika - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

ఎంపిక - తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 26/09/2026


“ఎంపిక” రాళ్లబండి సంగం నాయుడు రచించిన విలువైన నీతి కథ.

మహామంత్రి పదవికి పోటీ పడిన జయుడు, విజయులకు రాజు సురేష్ వర్మ పెట్టిన చివరి పరీక్ష వారి బాధ్యతాభావాన్ని బయటపెడుతుంది.ప్రజల కష్టాలను పట్టించుకోకుండా ఉండటం, సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం మధ్య ఉన్న తేడాను ఈ కథ చక్కగా వివరిస్తుంది.


పూర్వం మొయిద విజయరాంపురం రాజ్యాన్ని సురేష్ వర్మ పరిపాలించేవారు.


ప్రజారంజకుడు. ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. సురేష్ వర్మ దగ్గర పనిచేస్తున్న మహామంత్రి వయోభారం వలన మరణించాడు. తనకు పాలనలో ఎన్నో విలువైన సలహాలు ఇచ్చిన అనుభవశీలి మహామంత్రి మరణం పూడ్చలేని లోటుగా మిగిలింది.


యువకుడైన సురేష్ వర్మకు వారసత్వంపై నమ్మకం లేదు. మహామంత్రిగా మంచి, తెలివైన, చురుకైన వ్యక్తిని నియమించాలని సురేష్ వర్మ భావించాడు. అందుకుగాను ఒక ఎంపిక ప్రక్రియను అనుసరించారు సురేష్ వర్మ.


మహామంత్రి నియామకం కోసం అధికారిక ప్రకటన విడుదల చేశాడు. ఎటువంటి ప్రలోభాలు లేకుండా మహామంత్రి ఎంపిక చాలా పారదర్శకంగా జరుగుతుందని ప్రకటించాడు. తెలివైన, చురుకైన యువత మహామంత్రి పదవి కోసం పోటీపడవచ్చని చాటింపు వేయించాడు. మొయిద విజయరాంపురం రాజ్యంలో గల ఎంతోమంది యువకులు మహామంత్రి పదవి కోసం పోటీపడ్డారు.


మొదట కర్ర యుద్ధం, కత్తి యుద్ధం, ముష్టి యుద్ధం విభాగాలలో పోటీ జరిగింది. వేల సంఖ్యలోని అభ్యర్థులలో సురేష్ వర్మ చాకు, పిడిబాకు లాంటి కుర్రవాళ్లను ఇద్దరిని ఎంపిక చేశాడు. ఆ ఇద్దరికీ మేధోమథన పరీక్ష కూడా నిర్వహించి వారి మేధాసంపత్తి పరీక్షించాడు. ఇద్దరూ ఒకే విధమైన గుణములతో సమాన ప్రతిభ కనబరిచారు.


సురేష్ వర్మ ఆ ఇరువురి యువకులను పిలిపించి "మీ ఇరువురూ ఇప్పటివరకు జరిగిన అన్ని పరీక్షలలోనూ సమాన ప్రతిభ కనబరిచారు. ఇప్పుడు మీకు చివరి పరీక్ష. మీరిరువురూ రాజ్యంలో గల మారుమూల ప్రాంతానికి వెళ్లి ఒక సంవత్సరం ప్రజలతో గడిపి రండి. మీరు కేవలం అక్కడి పరిస్థితులు గమనించగలరు. అంతేకానీ ఎట్టి పరిస్థితులలోనూ అక్కడ స్థానిక విషయాల్లో చేతులు పెట్టొద్దు. మీరు రాజప్రతినిధులు అని తెలియనీయకండి.


అక్కడి పరిస్థితులు ఎవరు చివరి వరకు తట్టుకుని నిలబడతారో వారే మహామంత్రి పదవికి అర్హులు" అని చెప్పారు.


ఆ ఇద్దరు విజేతల పేర్లు జయుడు, విజయుడు.


ఆ ఇద్దరు విజేతలలో జయుడు రాజ్యానికి తూర్పు దిక్కునున్న మారుమూల గ్రామానికి, విజయుడు రాజ్యానికి పడమర దిక్కునున్న మారుమూల గ్రామానికి ఒక సంవత్సరం నివాసముండటానికి బయల్దేరి వెళ్లారు.


జయుడు నేరుగా ఆ మారుమూల గ్రామం చేరుకోగా.... విజయుడు మార్గంలో కనబడే ప్రతీ గ్రామం గురించి తెలుసుకుంటూ అనుభవం పొందుతూ తను చేరుకోవాల్సిన గ్రామం చేరుకున్నాడు.


జయుడు, విజయుడు ఉన్న రెండు గ్రామాలలో పరిస్థితులు ఒకటే. అంతెందుకు మొయిద విజయరాంపురం రాజ్యమంతా వాతావరణ పరిస్థితులు ఒకటే. అది వర్షాకాలం.


మొయిద విజయరాంపురం రాజ్యానికి ఆ సంవత్సరం తుఫాన్ వచ్చింది. జయుడు రాజుగారు స్థానిక పరిస్థితులలో తలదూర్చరాదన్నారని ఎంతోమంది తుఫాన్ బారిన పడి మరణించినా పట్టించుకోలేదు. ఎంతోమంది నిరాశ్రయులైనా పట్టించుకోలేదు. రాజుగారి మాటలు విజయుడు స్థానిక రాజకీయ విషయాలలో తలదూర్చొద్దని చెప్పారని భావించాడు.


తుఫాన్ కారణంగా ఎవరూ చనిపోకుండా, ఎవరూ నిరాశ్రయులు కాకుండా చూశాడు.


ప్రాణనష్టం, ఆస్తి నష్టం రాకుండా చూశాడు. ఆ ఊరికి గ్రామస్థుల సహకారంతో రహదారి ఏర్పాటు చేశాడు. ప్రజలను దేవుళ్లుగా భావించాడు. తరువాత రెండు గ్రామాలకు కలరా వచ్చింది. విజయుడు కలరా పోగొట్టే చర్యలు తీసుకున్నాడు.


తరువాత ఆ రెండు గ్రామాలకు చలిజ్వరాలు వచ్చాయి.


విజయుడు స్థానికుల సహకారంతో చలిజ్వరాలు పోగొట్టే ప్రయత్నం చేసి సఫలీకృతుడయ్యాడు. జయుడు కలరా కానీ, చలిజ్వరాలు కానీ రూపుమాపటానికి ప్రయత్నం చేయలేదు. పైపెచ్చు స్థానికులతో కలిసి నిత్యం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా విందులు, వినోదాల్లో మునిగి తేలేవాడు.


సంవత్సరం తరువాత జయుడు, విజయుడు రాజు సురేష్ వర్మ దగ్గరకు చేరారు. సురేష్ వర్మ మహామంత్రి పదవికి విజయుడు యోగ్యుడని, జయుడు యోగ్యుడు కాడని ప్రకటించాడు. విజయుడు ఎంపికైనట్లు చాటింపు వేయించాడు.


సురేష్ వర్మ విజయుడు ఎంపికైన విధానం వివరించారు.


సురేష్ వర్మ "మీ ఇరువురినీ అనుభవం కోసం ఆ గ్రామాలకు పంపాను. అక్కడి పరిస్థితులను చూసి విజయుడు సరైన పద్ధతిలో స్పందించాడు. మహామంత్రి కానీ, మరే ఇతర ప్రభుత్వ అధికారి కానీ స్థానిక పరిస్థితిని చూసి చక్కగా స్పందించాలి. స్పందన లేనివాడు ప్రభుత్వ ఉద్యోగి కాదు. విజయుడు ప్రజల సమస్యలు తీర్చాడు. ప్రజలను తుఫాన్, కలరా, చలిజ్వరాల నుండి రక్షించాడు. ప్రజలను కాపాడేవాడే నిజమైన మహామంత్రి. ప్రజల సమస్యలు గాలికి వదిలి విందులు, వినోదాల్లో మునిగేవాడు మహామంత్రి కాడు, కాలేడు, కాజాలడు. అందుకే ప్రజాభక్తి సంపన్నుడైన విజయుణ్ణే మహామంత్రిగా ప్రకటిస్తున్నాను" అని అన్నాడు.


చివరి పరీక్షలో నెగ్గిన విజయుడు మహామంత్రిగా పదవి పొందాడు. చివరి పరీక్షలో బొక్కబోర్లా పడ్డ జయుడు సురేష్ వర్మ ఎంపికలో అపజయం పాలై ఇంటి ముఖం పట్టాడు.


ప్రజా సమస్యలకు పరిష్కారం చూపిన వారికే రాజు సురేష్ వర్మ పట్టం కట్టారు. అక్కడి నుండి రాజు ప్రజల వద్దకు పాలనను చేర్చాడు. మహామంత్రి తెలివితో రాజు సురేష్ వర్మ పాలనను మరింత ప్రజారంజకం చేశాడు.


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.


మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page