top of page
Original.png

మనిషి

13 minutes ago
3 min read

గుడి వైపు బలికి తీసుకెళ్తున్న తనకు స్నేహితురాలైన గొర్రెను ముందుకు తోస్తున్న చిన్నారి

Manishi - Telugu Social Story | Bhaskara Rao B. R. K. V.

మనిషి - తెలుగు సామాజిక కథ | బి ఆర్ కె వి భాస్కర రావు

Published in manatelugukathalu.com on 26/09/2026


“మనిషి” బి. ఆర్. కే. వి. భాస్కర రావు రచించిన హృదయస్పర్శి సామాజిక కథ. కొడుకుతో పాటు పెరిగిన గొర్రెపిల్లతో నరసన్న కుటుంబానికి ఏర్పడిన అనుబంధం కథకు ప్రధాన ఆకర్షణ. ఒక మొక్కుబడి కారణంగా ఆ గొర్రెపిల్లను బలి ఇవ్వాలని నిర్ణయించుకోవడంతో కథలో భావోద్వేగ సంఘర్షణ మొదలవుతుంది.మానవత్వం, జంతువుల పట్ల ప్రేమ, ఆచారాల మధ్య ఉన్న వైరుధ్యాన్ని ఈ కథ ఆలోచింపజేసేలా చూపిస్తుంది.


నరసన్నకు రాత్రి నుంచి భార్యకు నొప్పులు ప్రారంభమవడంతో మొదలయ్యింది భయం.


భార్యకు మూడో గర్భం కాబట్టి "మావగారూ! మీ ఇంట్లోనే పురుడు పోసుకోవడం ఆనవాయితీ" అని చెప్పి, సాయంగా అత్తగారిని పంపించాడు.


ముందు ఇద్దరూ అమ్మాయిలే కావడంతో, ఈసారైనా వంశాన్ని నిలబెట్టడానికి అబ్బాయి పుట్టాలని కనపడిన ప్రతి దేవునికి మొక్కులు మొక్కాడు.


ఊళ్ళో ఉండే ప్రభుత్వ నర్సు ఇంటిదగ్గరే పురుడు వస్తుందని చెప్పడంతో, ఆమె మాటమీద భార్యను ఇంట్లోనే ఉంచేశాడు.


ఓ ప్రక్క అదేసమయంలో కొత్తగా కొన్న గొర్రె తొలిచూరి పిల్లను కనడానికి నొప్పులతో మూలుగుతూ, ఒక చోట నిలవకుండా అటుఇటు కట్టురాటి చుట్టూ తిరుగుతోంది.


నర్సు నరసన్నను తాము ఉన్న గదికి దూరంగా వెళ్లి పొమ్మని చెప్పడంతో, తన గొర్రెలు కట్టివేసే పాకలోకి వచ్చాడు. నొప్పితో బాధపడుతున్న గొర్రె పొట్టపై చేత్తో నిమురుతున్నాడు ఉపశాంతి కోసం.


గంటలు గడుస్తున్నాయి. నరసన్న కళ్ళు నీళ్లు నిండిన చెరువుల్లా ఉన్నాయి; ఏ క్షణంలోనైనా గట్టు తెగడానికి సిద్ధంగా ఉన్నాయి.


ఒక్కసారిగా గొర్రె పెద్దగా అరుస్తూ ఒక పిల్లను కన్నది. ఆత్రుతగా దగ్గరకెళ్లి చూడగా పుట్టింది ఆడదని తెలియడంతో నరసన్న కళ్ళు ఆనందంతో మెరిసాయి.


"నాన్నా! నాన్నా! తమ్ముడు పుట్టేసాడు!" అని పెద్దమ్మాయి పాక బయటే నిలబడి గట్టిగా అరుస్తూ, వెలిగిపోతున్న ముఖంతో చెప్పేసరికి... "నిజంగానా తల్లీ?!" అని జిగురుతో ఉన్న గొర్రె పిల్లను గట్టిగా ముద్దుపెట్టుకుని, "గొడ్డొచ్చిన వేళ, బిడ్డొచ్చిన వేళ అని పెద్దోళ్ళు ఊరికే అనలేదు" అని నోట్లోనే అనుకుని, దాన్ని అక్కడే పడుకోబెట్టి ఒక్క ఉడుతున ఇంట్లోకి వెళ్ళాడు నరసన్న.


మగబిడ్డను కన్న భార్య ముఖంలోని సంతోషాన్ని తాను పంచుకున్న నరసన్న, ఆడపిల్లలనిద్దరినీ పురిటి మంచం ప్రక్కనే కూర్చుని దగ్గరకు తీసుకుని గట్టిగా అదుముకున్నాడు.


దినదిన ప్రవర్ధమానంగా నరసన్న కొడుకుతో పాటుగా గొర్రెపిల్ల కూడా ఎదిగింది. క్రమక్రమంగా అది ఆ ఇంట్లో ఒక సభ్యురాలిగా మారిపోయింది. తల్లి దగ్గర పాలు తాగి వచ్చి ఇంట్లోనే ఉండిపోయేది.


దాన్ని చూస్తేకాని పాలు తాగడం గానీ, తిండి తినడం గానీ చేసేవాడు కాదు నరసన్న కొడుకు. వయసు పెరిగేకొలదీ దాని వంటిపై ఉన్న ఊలు పట్టుకుని లేచి నిలబడేవాడు. చర్మం బాధించినా అది కదిలేది కాదు.


ఉన్నట్టుండి ఓరోజు ఉదయం మంచం మీదనుంచి క్రిందకు పడిపోయాడు నరసన్న కొడుకు. అప్పటికే నిద్రలేచి ఎవరి పనుల్లో వాళ్లున్నారు. క్రిందకు పడిన వెంటనే కుర్రాడు కెవ్వుమని అరచి మాటలేకుండా ఉండిపోయాడు.


పరుగెత్తుకుని అందరూ వచ్చి బాబుని చూసి ఏడ్చేశారు. నరసన్న భార్య అయితే "నాన్నా! నాన్నా!" అంటూ ఎంత కుదిపినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో మరింత రోదించింది. ప్రక్కనే ఉన్న నరసన్న కళ్ళంట నీళ్లు వర్షిస్తున్నా భార్యకు ధైర్యం చెబుతూ బయటకు వచ్చి ఆటోకు కబురు పంపి, అది వచ్చిన వెంటనే కొడుకును దాంట్లో హాస్పిటల్‌కు తీసుకువెళ్లిపోయాడు భార్యతో.


డాక్టర్లు బాబును పరీక్షించి, "తలకు గట్టి దెబ్బ తగలడం వల్ల కుర్రాడు మత్తులో ఉండిపోయాడని, ఇరవై నాలుగు గంటలు దాటితేగానీ చెప్పలేమని" చెప్పడంతో నరసన్న భార్య అక్కడే కుప్పకూలిపోయింది.


కొద్దిసేపటికి తేరుకున్న తర్వాత భార్యాభర్తలిద్దరూ కలసి తమ ఊరి పొలిమేరలో ఉన్న దేవతకు "మా బిడ్డను మాకు దక్కిస్తే నీకు వేటపోతును బలి ఇస్తాం" అని మొక్కుకున్నారు.


మరునాటి ఉదయానికి డాక్టర్లు చెప్పినట్టు బాబు మామూలు అవడంతో నరసన్న దంపతుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నాలుగు రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి బాబును ఇంటికి తీసుకువచ్చారు.


రెండు నెలల తర్వాత తాము మొక్కుకున్న దేవత జాతర రావడంతో, బలి ఇవ్వడానికి తమ దగ్గర ఉన్న గొర్రెలన్నీ చూలుతో ఉండటంతో బలి ఇవ్వడానికి కుదరదు కనుక, కొడుకుతో పాటు పెరిగిన గొర్రెను బలి ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు నరసన్న దంపతులు.


మరునాటి ఉదయం దానికి స్నానం చేయించి, పసుపు కుంకుమ బొట్లు పెట్టి, మెళ్ళో వేపమండలు కట్టారు.


దాన్ని ఇంటినుండి తీసుకువెళ్తుంటే అది వెళ్లకుండా తన గిట్టలతో నేలను గట్టిగా అదిమిపెట్టడానికి ప్రయత్నిస్తుంటే, ముందు వాళ్లు కొమ్ములు పట్టుకుని లాగుతూ ఉంటే... అప్పటివరకు తల్లి చంకలో ఉన్న నరసన్న కొడుకు దిగి, తన చిన్న చేతులతో వెనుక నుండి నవ్వుతూ మిగిలిన వారితో కలసి ముందుకు తోయసాగాడు.


చిత్రంగా అప్పటివరకు మొరాయించిన ఆ గొర్రె తన పట్టు సడలించి, తల్లి దగ్గరకు వెళ్లే బిడ్డలా నడుచుకుంటూ వారిని అనుసరిస్తూ గుడి దగ్గరకు వెళ్ళింది... పాపం!


*** 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.

బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


బి ఆర్ కె వి భాస్కర రావు

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు


ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.

భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.

రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.

ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.

పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు

నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు

ఊరు పాలి

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page