విరామం

Viramam - Telugu Social Family Story | Harish Babu Pondugula
విరామం - తెలుగు సామాజిక కుటుంబ కథ | హరీష్ బాబు పొందుగుల
Published in manatelugukathalu.com on 26/09/2026
‘విరామం’ హరీష్ బాబు పొందుగుల రచించిన హృద్యమైన తెలుగు కుటుంబ కథ.
ఉద్యోగ ఒత్తిడి, నిరంతర పని, మానసిక అలసట మనిషి జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో ఈ కథ చూపిస్తుంది. జీవితంలో విజయంతో పాటు విశ్రాంతి, కుటుంబం, మానసిక ప్రశాంతత కూడా అవసరమే అనే సందేశాన్ని ఈ కథ అందిస్తుంది.
మధ్యాహ్నం 1 PM అయింది... టీవీ సీరియల్ ముగించుకుని రుక్మిణి "ఇంకా భోజనం చేద్దాం" అని కిచెన్ వైపు వెళ్తోంది. ఇంతలో...
"ట్రింగ్ ట్రింగ్" మంటూ కాలింగ్ బెల్ మోగడంతో, "ఈ టైమ్‌లో ఎవరబ్బా?" అనుకుంటూ లేచింది.
చూస్తే శ్రీవారు... హృదయ్ గారు!
"ఏంటండీ... మధ్యాహ్నమే ఆఫీస్ నుంచి వచ్చేసారు? పని ఎక్కువ లేదా?" అడిగింది రుక్మిణి.
"ఏం లేదు లే కానీ, త్వరగా భోజనం పెట్టు... సినిమాకి వెళ్దాం," అన్నాడు హుషారుగా హృదయ్, లాప్‌టాప్ బ్యాగ్ చేతికి ఇస్తూ.
"ఏంటండీ విశేషం... ప్రమోషన్ ఏమైనా వచ్చిందా ఏంటి?"
"అబ్బా! ఎక్కువ ప్రశ్నలు వేయక, త్వరగా తేములు," అన్నాడు విసుగ్గా.
"ఏదైనా ఈయన గారి ఫేవరెట్ హీరో సినిమా కూడా ఏమీ లేదే..." అనుకుంటూ బయలుదేరింది రుక్మిణి.
పిల్లలు వస్తే కీస్ ఇవ్వమని చెప్పి, పక్క ఇంట్లో కీస్ ఇచ్చి బయలుదేరారు.
ఇద్దరూ సినిమా హాళ్లో కూర్చున్నారు...
ఎప్పుడూ లేంది... ఈలలు వేస్తూ చూస్తున్నారు ఆయన!
సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ని పెళ్లి చేసుకున్న రుక్మిణి, పదేళ్లుగా చూస్తోంది... ఎప్పుడూ లాప్‌టాప్ వైపు దిష్టిబొమ్మలాగా ఎక్స్‌ప్రెషన్ లేకుండా కూర్చోవడమే! కానీ ఉలుకూ పలుకూ, మాటా మంతీ తక్కువే హృదయ్‌కి.
ఇవాళ ఇంత ఆనందానికి కారణం ఏంటో అంతుపట్టట్లేదు మేడమ్‌కి.
"మావయ్య వాళ్లేమైనా ఊరినుంచి వస్తున్నారా... లేకపోతే చుట్టాలు ఎవరైనా పెళ్లికి పిలిచారా... లేకపోతే ఆ మాయదారి మేన మరదలు ఏమైనా మళ్లీ ఫోన్ చేసి కావ్వించిందా... లేక ఏ పాత గర్ల్‌ఫ్రెండ్ అయినా ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసిందా..." ఏంటో రకరకాల ఆలోచనలు రుక్మిణిని ఆవహించాయి.
"హ హ హ..." స్క్రీన్ వైపు చూస్తూ మళ్లీ గట్టిగా నవ్వాడు హృదయ్.
"ఏమిటి ఈయన వాలకం! నాకు మాత్రం ఒక క్వశ్చన్ పేపర్ వదిలేసి, ఆయన మాత్రం హాయిగా నవ్వుకుంటున్నాడు..." అనుకుంది.
రుక్మిణికి బొత్తిగా సినిమా బుర్రలోకి ఎక్కట్లేదు.
సినిమా అయిపోయింది...
సినిమా అయ్యాక, ట్యాంక్ బండ్ అంతా నడిచారు ఇద్దరూ. హృదయ్ ఏవేవో చెప్తున్నాడు కానీ రుక్మిణికి మాత్రం ఏమీ ఎక్కట్లేదు. "పోనీ అడుగుదామా?" అంటే కసురుకుంటాడని మానుకుంది. టైమ్ ఆరు అయింది.
"ఇంకా ఇంటికి వెళ్దామా?" అంటే, "లేదు, పారడైస్ బిర్యానీ తిని వెళ్దాం," అన్నాడు.
"మరి పిల్లలు?" అంటే, "సరే, పార్సెల్ తీసుకెళ్దాం," అని పెద్ద ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాడు.
ఇంటికి వెళ్లేసరికి పిల్లలిద్దరూ టీవీ చూస్తున్నారు. బిర్యానీ వాసన రాగానే పిల్లలు వెంటనే ప్లేట్స్ తెచ్చుకుని వడ్డించుకున్నారు.
భోజనం అయ్యాక, బెడ్‌రూమ్‌లో ఫోన్‌లో ఏవో వీడియోలు చూసుకుంటున్నాడు హృదయ్.
"ఇప్పటికైనా చెప్తారా మీ ఆనందానికి కారణం?"
"ఇప్పుడు వద్దులే, రేపు పిల్లలు స్కూల్‌కి వెళ్లాక చెప్తా," అని పడుకున్నాడు.
తెల్లారి పదింటికి లేచి కాఫీ తెచ్చుకుని సోఫాలో పేపర్ చదువుతున్నాడు హృదయ్.
"ఏంటి ఇంత లేట్‌గా లేచారు... ఆఫీస్‌కి సెలవు పెట్టారా?" అడిగింది రుక్మిణి.
"ఆ, ఇక ఒకటే సెలవు!"
"అర్థం కాలేదు?"
"ఆఫీస్‌లో ప్రాజెక్ట్స్ లేవట, రిజైన్ చేయమన్నారు... చేశాను."
"ఏంటి, రిజైన్ చేశారా?!" అని అరిచినట్టుగా అడిగింది రుక్మిణి.
మళ్లీ తానే అంది, "మరి అంత తాపీగా ఎలా ఉన్నారండీ రాత్రి నుంచి?"
"మరి ఏం చేయమంటావ్? ఇన్ ఫ్యాక్ట్, నేనే ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నా.
పదేళ్ల నుంచి ఒకటే ఆఫీస్, ఒకటే పని, ఒకే బాస్... చూసి చూసి బోర్ కొట్టేసింది.
కాసేపు ఎక్కువ పడుకోవాలన్నా బాస్ పర్మిషన్, కాస్త లేట్‌గా రావాలన్నా పర్మిషన్, లీవ్ పెట్టాలన్నా పర్మిషన్! పోనీ ఏమైనా జీతం పెంచుతాడా అంటే అదీ లేదు.
ఎవరో పీక నొక్కుతున్నట్టుగా కలలు వచ్చేవి. ఇప్పుడు టోటల్ రిలాక్స్ అవుతాను. అలా వన్ మంత్ నాకు కావాల్సినంత నిద్రపోతాను ఫస్ట్... తర్వాత సంగతి తర్వాత!"
"మరి జాబ్ లేకపోతే?"
"మరి మనిషే పోతే పర్లేదా?"
"..."
"విరామం లేకుండా బండి నడిపితే యాక్సిడెంట్ ఎలా అవుతుందో... అలాగే విశ్రాంతి లేకుండా జాబ్ చేసినా ఉత్సాహం ఉండదు. నాకున్న అనుభవానికి ఖచ్చితంగా ఇంకో జాబ్ వస్తుందిలే కానీ... నన్ను మళ్లీ లంచ్‌కి లేపు!" అనేసి మళ్లీ వెళ్లి రూమ్ డోర్ వేసుకుని పడుకున్నాడు హృదయ్.
— సమాప్తం —
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
హరీష్ బాబు పొందుగుల గారి కొన్ని ఇతర రచనలు:
హరీష్ బాబు పొందుగుల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: హరీష్ బాబు పొందుగుల
ఆయన పుట్టింది పెరిగింది హైదరాబాదు. కంప్యూటర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన హరీష్ గారు వృత్తిరీత్యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే ఆయన తన వృత్తే కాకుండా చిత్రలేఖనంలోనూ మరియు కథలు, నవలా సాహిత్యం మీద ఎంతో ఆసక్తి కనబరుస్తూ వచ్చారు. యండమూరి గారు, మరియు మాలతీ చందూర్ గారి రచనలని ఇష్టపడతారు. ఆ ఆసక్తితోనే రెండు కథల సంపుటాల్ని అమెజాన్లో "షార్ట్ స్టోరీస్ ఆన్ పాజిటివ్ థింకింగ్" మరియు "నువ్వు అనుకుంటే ఏదయినా సాధ్యమే" పేరిట పబ్లిష్ చేసి ఉన్నారు. కథారచనే కాకుండా మోటివేషనల్ స్పీకర్ గా కూడా ఈయన నెటిజన్లకి సుపరిచితులు. వ్రాసినవి కొన్ని కథలే అయినప్పటికీ కథా రచన మీద ఆసక్తితో ఇంకా మరెన్నో కథలు వ్రాసి మెప్పించాలని అభిలాష .










Comments