top of page
Original.png

ఎవరు గొప్ప


పంచభూతాల మధ్య ఐక్యతను బోధిస్తున్న బ్రహ్మదేవుడి దృశ్యం

Yevaru Goppa - Telugu Moral Story | Rallabandi Sangam Naidu

ఎవరు గొప్ప తెలుగు నీతి కథ | రాళ్లబండి సంగం నాయుడు

Published in manatelugukathalu.com on 19/08/2026


మనిషి జీవితంలోనైనా, ప్రకృతిలోనైనా ఐక్యత మరియు పరస్పర సహకారం ఎంతో ముఖ్యమైనవి. ఒక్కొక్కరి గొప్పతనాన్ని నిరూపించుకోవాలనే అహంకారం చివరకు అందరికీ నష్టాన్ని కలిగిస్తుంది. ఈ సత్యాన్ని పంచభూతాల కథ ద్వారా చక్కగా వివరించే నీతి కథ “ఎవరు గొప్ప”.


బ్రహ్మ సృష్టికి సహాయపడే ఆకాశం, వాయువు, అగ్ని, నీరు, భూమి తమలో తామే ఎవరు గొప్ప అనే పోటీకి దిగుతాయి. తమ శక్తిని నిరూపించుకోవడానికి అవి సృష్టి సహజ క్రమానికి విరుద్ధంగా పనిచేయడంతో భూమిపై ఉన్న సమస్త జీవులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. చివరకు బ్రహ్మదేవుడు వాటికి ఐదు వేళ్ల ఉదాహరణతో ఐక్యత యొక్క విలువను తెలియజేస్తాడు.


“ఐదు వేళ్లు కలిస్తేనే పిడికిలి; పంచభూతాలు కలిసి ఉంటేనే సృష్టి” అనే సందేశాన్ని అందించే ఈ కథ పిల్లలతో పాటు పెద్దలకు కూడా మంచి జీవిత పాఠాన్ని అందిస్తుంది.


దేవదేవుడి ఆజ్ఞ మేరకు బ్రహ్మ సృష్టి చేసేవాడు. బ్రహ్మ సృష్టికి పంచభూతాలైన ఆకాశం, వాయువు, నిప్పు, నీరు, భూమి సాయం చేసేవి. అలా ఈ ప్రపంచం సాఫీగా నడిచేది. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గడిచాక పంచభూతాల మనస్సులు మారాయి. గర్వం పెరిగింది. అసూయ, ద్వేషం వాటి మనసుల్లోకి ప్రవేశించాయి. పరస్పరం ఒకదాని మీద ఒకటి కత్తులు దూసుకున్నాయి. నేను గొప్పంటే నేనే గొప్ప అనుకున్నాయి.


ఈ భూమండలానికి పైకప్పులా నేనే కాపాడుతున్నానని ఆకాశం అన్నది. జీవులకు ప్రాణవాయువునిచ్చి బ్రతికిస్తున్నది తానేనని గాలి చెప్పింది. జీవుల ఆహారం జీర్ణమయ్యేలా చేసేది తానేనని నిప్పు గారాలు పోయింది. జీవుల ఆహారానికి అవసరమయ్యే పంటలు పండటానికి కారణం నేనేనని నీరు పేర్కొంది. అసలు ప్రాణులు నిలబడిందే నా మీద అన్నది భూమి. ఇలా పంచభూతాలు ఎవరికి వారే గొప్పని పని చేయటం మానేశాయి. అంతేకాదు, తమ గొప్పతనం ఏమిటో ప్రపంచానికి తెలియాలి అంటూ సృష్టికి వ్యతిరేకంగా పని చేయడం ప్రారంభించాయి.


ఆకాశం తనలో పక్షులను ఎగరనివ్వలేదు. మేఘాలను తనలో సంచరించనివ్వలేదు. గాలి వీచడం ఆపేసింది. నీరు తుఫానులతో విరుచుకుపడింది. నదులను పారనీయలేదు. నదుల్లో, సముద్రాల్లో నీటిని ఆవిరి కానియ్యలేదు. అగ్ని కార్చిచ్చు అయి భూమండలాన్నంతటినీ దహించింది. జీవులు తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేసింది. పంటలు పండడానికి, తాగటానికి నీరు లేకుండా చేసింది నీరు. భయంకరమైన భూకంపాలు పుట్టించింది భూమి.


పంచభూతాల ఈర్ష్య, ద్వేషం వలన భూమ్మీద అన్ని ప్రాణులకు పెద్ద కష్టం వచ్చింది. ప్రపంచం పీల్చడానికి గాలిలేక, తాగటానికి నీరు లేక, తినడానికి తిండి లేక, ఉండడానికి నిలువు నీడ లేక అల్లాడిపోయింది. విలవిలాడింది. అన్ని ప్రాణులు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లి తమకొచ్చిన పెద్ద కష్టాన్ని తొలగించమని వేడుకున్నాయి. జీవుల కష్టం కళ్లారా చూసిన బ్రహ్మదేవుడు పంచభూతాలను రమ్మని కబురంపాడు.

తన వద్దకు వచ్చిన పంచభూతాలతో బ్రహ్మ ఇలా పలికాడు:


"ఈ ప్రపంచంలో చిన్న, పెద్ద పనులుండవు. మంచి పని, చెడ్డ పని ఉంటాయి. చేతికున్న ఐదు వేళ్ళల్లో ఏదీ గొప్పది? ఐదూ గొప్పవే. ఐదు వేళ్ళు కలిస్తేనే పిడికిలి. పంచభూతాలు ఐదు కలిసి ఉంటేనే సృష్టి. మీ ఐదుగురు లేనినాడు సృష్టి లేదు, నేను లేను. ఇక నుంచి మీ ఐదుగురు గర్వం, అసూయలు వదిలి పరస్పరం సహకరించుకుంటూ సృష్టిని ముందుకు నడిపించాలి" అని హితబోధ చేశాడు.


తమ తెలివితక్కువ తనానికి పంచభూతాలు సిగ్గుపడి, ఆ తరువాత నుండి పూర్వంలా కలసిమెలసి సృష్టిని ముందుకు నడిపించడంలో బ్రహ్మదేవునికి సాయం చేశాయి.


*** 

రాళ్లబండి సంగం నాయుడు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రాళ్లబండి సంగం నాయుడు

రచయిత పరిచయం: రాళ్లబండి సంగం నాయుడు

వృత్తి :స్కూల్ అసిస్టెంట్ తెలుగు

హాబీస్ :కథలు గేయాలు, వ్యాసాలు, లేఖలు రాయడం

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page