top of page

ఫలించిన నిరీక్షణ


'Falinchina Nireekshana' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

'ఫలించిన నిరీక్షణ' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

ఫోను రింగవుతూంటే పరుగున వచ్చి లిఫ్ట్ చేసింది రమ్య.


"రమ్యా! ఎలా ఉన్నావు?" అడిగాడు బావ మాధవ్. ఆ పలకరింపుకు మొహమంతా సంతోషంతో వెలిగిపోయి "బావున్నాను బావా! నీవెలా ఉన్నావు?" అని రమ్య అడగడం, ఆ తర్వాత వాళ్ల కబుర్లు అయి ఫోన్ పెట్టేసింది రమ్య. ఇది వాళ్లిద్దరి మధ్యన పరిపాటిగా జరిగేదే.


స్కూలు మాస్టర్ గా పనిచేసి రిటైర్డ్ అయిన విశ్వనాథం తన భార్య జానకి, కూతురు రమ్యతో కలిసి స్వగ్రామమైన రామాపురంలో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. బాగా కుగ్రామమైన రామాపురంకు వెళ్లాలంటే చిన్న నది ద్వారా పడవ ప్రయాణం కొనసాగించాల్సిందే. తను పుట్టిపెరిగిన ఆ ఊరంటే విశ్వనాథంకు ప్రాణం. రమ్య బాల్యం, చదువు అన్నీ తండ్రి ఉద్యోగం చేస్తున్న పట్నంలోనే జరిగాయి. డిగ్రీ వరకు చదివిన రమ్య తనతల్లితండ్రులతో రామాపురంలోనే ఉంటోంది.


రమ్య పుట్టిన మొదలు ఆమెను విశ్వనాథం చెల్లెలు సరోజ కొడుకు మాధవ్ కు భార్య అని ఇరుకుటుంబాలు అనుకున్నాయి. ప్రక్క ప్రక్క ఊర్లల్లోనే అన్నాచెల్లెళ్లు ఉంటున్నందున ఇరు కుటుంబాల మధ్యన సఖ్యత, అనుబంధం పెరిగి రాకపోకలు పరిపాటే. రమ్య, మాధవ్ లు కలిసిమెలిసి పెరగడం వలన వయసు తో పాటే వాళ్ల మధ్యన అనుబంధం మరింతగా పెరిగింది. ఇద్దరూ మనసులు ఇచ్చి పుచ్చుకోవడం కూడా జరిగింది. మాధవ్ ఇంజనీరింగ్ చదివి మంచి కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఆ కంపెనీ ద్వారా అమెరికాకు వెళ్లి ఆరునెలలయింది. అక్కడికి వెళ్లేముందు రమ్యామాధవ్ లకు ఇరుకుటుంబాలు నిశ్చితార్థం జరిపాయి. ఆరునెలల వ్యవధిలో వాళ్ల వివాహం జరగబోతోంది.


మాధవ్ అమెరికా వెళ్లడం, అతనికి దూరంగా ఉండగలగడం రమ్యకు బాధగా ఉన్నా, నిరంతరం ఫోన్ కమ్యూనికేషన్ వాళ్ల మధ్యన ఎడబాటుని కాస్త తగ్గిస్తోంది. అమెరికా వెళ్లేముందు మాధవ్ కు వీడ్కోలు పలకడానికి ఆఊరిలో నది గట్టుదాకా వచ్చింది రమ్య. అతను ఆ నదిలో పడవ ద్వారా పట్నానికి వెళ్లి అక్కడి నుంచి విమానంలో అమెరికాకు వెళ్లాలి. అతను ఆ పడవలో వెళుతూఉంటే అతను కనుమరుగయ్యేదాకా చూస్తూ ఇంటికి వెనుతిరిగింది రమ్య. మనసంతా చాలా దిగులుగా అనిపించినా 'ఆరునెలల్లో తన బావ తిరిగి వస్తాడు' అన్న సంతోషంతో ఉంది రమ్య.


అమెరికా వెళ్లిన మాధవ్ తరచూ ఫోన్లు చేసి ఇరువురి తల్లితండ్రులతో, రమ్యతో మాట్లాడుతూ ఉన్నాడు. కాలం గడుస్తోంది.

మాధవ్ ఇంకో రెండు నెలల్లో ఇండియాకు రావలసి ఉండగా అనుకోకుండా కోవిద్ మహమ్మారి ప్రపంచమంతా చుట్టుముట్టింది. దాని ప్రభావం అమెరికాలో మరీ ఎక్కువ ఉండి వేలాది మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. అటువంటి క్లిష్టమైన పరిస్థితులలో ప్రభుత్వం విమాన ప్రయాణాలను కూడా రద్దుచేసింది. మాధవ్ ద్వారా విషయం తెలుసుకున్న ఇరువురి తల్లితండ్రులు, రమ్య చాలా ఆందోళన చెందారు. వాళ్లకు మాధవ్ ధైర్యం చెప్పాడు. వాళ్లు తమ మనసుని నిబ్బరించుకుని మాధవ్ కు తగు జాగ్రత్తలు చెప్పి అతని క్షేమసమాచారాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నా రమ్యకు మాత్రం "ఈ కరోనా మహమ్మారి ఎప్పుడు కనుమరుగవుతుందో ? ఇప్పుడు అక్కడ తన బావ ఎలా ఉన్నాడో? తమందరికీ దూరంగా ఉంటూ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ఎంత ఇబ్బందులు పడుతూ బాధపడుతున్నాడో?" అని అనుక్షణం ఆందోళన పడుతోంది. తరచూ మాధవ్ ఫోన్ చేస్తూ రమ్యకు తగుధైర్యం చెబుతూ అనునయిస్తున్నాడు.


కాలం గడుస్తోంది. ప్రతిరోజూ సాయంత్రం వేళ రమ్య తమ ఊరి నది ఒడ్డుకు వచ్చి బావతో తమ చిన్నప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉంటోంది. తామిద్దరూ పోటీగా నీళ్లలోంచి గవ్వలను ఏరుకోవడం, వాటితో తాము ఆడుకున్న గవ్వలాటలు, ఇసుకతో ఇళ్లు కట్టుకుని మురిసిపోవడం, నది అలల తాకిడికి ఆ ఇళ్లు నీళ్లల్లో కలిసిపోయి తానేడుస్తుంటే, బావ తనను బుజ్జగించి ఓదార్చడం, ఇంటి నుంచి తెచ్చిన జామకాయను కాకి ఎంగిలి చేసి కొరికి తనకివ్వడం అవన్నీ గుర్తుకు తెచ్చుకుని మురిసిపోతోంది. తాము పెద్దవుతున్నకొద్దీ ఒకళ్లమీద ఒకళ్లనొకళ్లు సరదాగా చేతితో నీళ్లను చిలకరించుకోవడం, అలల కెరటాలను చూస్తూ హాయిగా కబుర్లు చెప్పుకోవడం, ప్రేమగా తామిద్దరం తిరిగిన చెట్టుపుట్టలను, ఆ ప్రదేశాలను చూస్తూ బావతో గడిపిన ఆనాటి మధురక్షణాలను తలుచుకుంటూ బావ రాక కోసం వేయికళ్లతో ఎదురు చూస్తోంది రమ్య.


చూస్తూ ఉండగానే రెండు సం.. గడిచాయి. కరోనా క్రమేణా కాస్త తగ్గుముఖం పట్టి ఆ సంక్షోభం నుంచి ప్రజలు కాస్త కోలుకున్నాక విమాన సర్వీసుల రాకపోకలు కొనసాగాయి. ఒకరోజున మాధవ్ ఫోన్ చేసి తాను రెండు నెలలు శెలవు పెట్టి ఇండియాకు వస్తున్న శుభవార్తను, తాను వచ్చే తేదీని కూడా చెప్పాడు. విషయం విన్న ఇరువురి తల్లితండ్రులు సంతోషించారు. రమ్య ఆనందానికి పట్టపగ్గాలు లేవు. మనసంతా ఆనందడోలికలలో ఊగసాగింది. మాధవ్ రాగానే వాళ్లిద్దరి వివాహం జరపాలని ఇరుకుటుంబాలు అనుకుని, తేదీని నిర్ణయించి రమ్యా, మాధవ్ లకు తెలిపారు. విషయం విని ఇద్దరూ చాలా సంతోషించారు. తన బావ వచ్చే ఆరోజు కోసం ఎదురుచూస్తోంది రమ్య.


మాధవ్ ఇండియాకు వచ్చే రోజు రానే వచ్చింది. పట్నంలో విమానం దిగి తమ ఊరికి పడవ ద్వారా నదిలో ప్రయాణిస్తున్న మాధవ్ కు మనసంతా "ఎప్పడెప్పుడు తన తల్లితండ్రులను, తన రమ్యను చూస్తానా?" అన్న ఆతృతతో ఉండి పడవ ఒడ్డుకు చేరే సమయంకోసం వేచిచూస్తున్నాడు. రమ్యకు ఉదయం లేచిన మొదలు మనసంతా చాలా సంతోషంగా ఉంది. చక్కగా తయారై ఇంటి నుంచి బయలుదేరిన రమ్య తన బావ రాకకోసం నది ఒడ్డున వేయికళ్లతో ఎదురుచూస్తూ క్షణమొక యుగంలా గడుపుతోంది. కొంచంసేపయినాక పడవలో వస్తున్న బావను చూసి సంతోషంతో చేయి ఊపింది. మాధవ్ కూడా చేయి ఊపి పడవ ఒడ్డుకు చేరగానే రమ్యను సమీపించి ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు. అప్పుడే అక్కడకు వచ్చి ఇదంతా చూస్తున్న ఇరువురి తల్లితండ్రులు పెద్దగా హర్షధ్వానాలు చేయగా సిగ్గుతో తన బావ కౌగిలిలో గువ్వలా మరింత ఒదిగిపోయింది రమ్య. కుశలప్రశ్నలయ్యాక అందరూ సంతోషంగా ఇంటికి చేరారు. రుచికరమైన పిండి వంటలతో, కబుర్లతో విందుభోజనాలు ముగించి హాయిగా అందరూ నిద్ర పోయారు.


రోజులు హాయిగా గడుస్తున్నాయి. ఇరుకుటుంబాల పెద్దలు ఒక శుభముహూర్తమున రమ్య, మాధవ్ లకు వైభవంగా వివాహం జరిపించారు. వాళ్లు సంతోషంగా కాలం గడుపుతున్నారు. మాధవ్ రమ్యకు అమెరికాకు పాస్పోర్ట్ ఏర్పాట్లు చూశాడు. అవి రాగానే తమతల్లితండ్రుల ఆశీస్సులనందుకుని తనతోపాటు రమ్యను కూడా అమెరికాకు తీసికెళ్లాడు మాధవ్. రమ్యామాధవ్ లు అన్యోన్యంగా కాపురం చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు.


.. సమాప్తం.

నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం

Podcast:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు"మన తెలుగు కధలు " వేదిక మిత్రులందరికీ నమస్కారం. నా పేరు నీరజ ప్రభల. నాది చాలా చిన్న కుగ్రామంలో చాలా సాంప్రదాయ కుటుంబంలో జననం. అగ్రహారం. నాన్న గారు బాలకృష్ణ మూర్తి గారు బ్రాంచి పోస్ట్ మాస్టర్, వ్యవసాయ దారుడు, పంచాయతీ ప్రెసిడెంట్. అమ్మ కమల గృహిణి . మేము ఆరుగురం సంతానం. నాకు ముగ్గురు అక్కయ్యలు, ఇద్దరు అన్నయ్యలు. అందరిలోకీ నేనే ఆఖరిదాన్ని. చిన్న దాన్ని. నాకు చిన్న వయసులోనే వివాహం. మేము విజయవాడలో ఉంటాము. నేను గృహిణిని. మా వారు వాసుదేవశర్మ. రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మా కూతుళ్ళు, అల్లుళ్ళు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా డెన్మార్క్ , అమెరికాలలో సెటిలయ్యారు. మా ముగ్గురు అమ్మాయిలు చిన్నప్పటి నుంచీ కర్ణాటక సంగీతం నేర్చుకుని అనేక పోటీలలో గెలుపొంది , ప్రతి సం.. త్యాగరాజ ఉత్సవాలలో కచేరీలు చేసి ప్రముఖ విద్వాంసుల ప్రశంసలు పొందటం నా అదృష్టంగా ఎల్లప్పుడూ భావిస్తాను. అంతేకాకుండా పాడుతా తీయగా, పాడాలనుంది, రాగం- సంగీతం మొ.. ప్రోగ్రాములలో పాల్గొని పెళ్ళైనాక కూడా విదేశాల్లో కచేరీలు చేస్తూ అందరిచే ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం మాకు ఇద్దరు మనవరాళ్ళు, ఒక మనవడు. నాకు చదువంటే చాలా చాలా ఇష్టం. పిల్లలు సెటిలయ్యాక B.Com, MA సంస్కృతం, MAఇంగ్లీష్, MA తెలుగు చేశాను. సంగీతం - సాహిత్యం నాకు ప్రాణం. సంగీతం నేర్చుకున్నాను. ఇప్పుడు వీణ కూడా నేర్చుకుంటున్నాను. టైపు, షార్ట్ హాండ్ ప్రధమ శ్రేణి లో ఉత్తీర్ణత. కధలు-కవితలు వ్రాస్తాను. మీ అందరి ప్రోత్సాహంతో కధలు, కవితలు వ్రాస్తున్నాను . నాకధలు లోగడ పత్రికలలో కూడా ప్రచురితమైనవి. గార్డెనింగ్, స్టిచింగ్, అల్లికలు, సాఫ్ట్ టాయ్స్ బొమ్మలు, డ్రాయింగ్ , ఫాబ్రిక్ పెయింటింగ్, రంగవల్లులు, క్రియేటివ్ ఆర్టికిల్స్ తయారీ మొ.. నా హాబీ. అమ్మ , నాన్న గారు స్వర్గస్ధులయ్యి 10 సం.. అయినది. నాకు నా మాతృభాష తెలుగు అంటే చాలా చాలా ఇష్టం, అభిమానం‌, గౌరవం. ఈ వేదిక మీద మిమ్మల్నందరినీ పరిచయం చేసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నా కధలను ఆదరించి ప్రోత్సాహిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.🙏🙏
63 views0 comments

留言


bottom of page