ఘమండ్
- Peddada Sathyanarayana

- Oct 7
- 3 min read
Updated: Oct 8
#PeddadaSathyanarayana, #పెద్దాడసత్యనారాయణ, #Ghamand, #ఘమండ్, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Ghamand - New Telugu Story Written By - Peddada Sathyanarayana
Published In manatelugukathalu.com On 07/10/2025
ఘమండ్ - తెలుగు కథ
రచన: పెద్దాడ సత్యనారాయణ
కారులో రిలాక్స్‌గా కూర్చుని సెల్‌లో మెసేజ్లు చూసుకుంటోంది యాదమ్మ, ఉరఫ్ సిన్నీ. కారు ఒక్కసారిగా కుదుపుతో ఆగింది.
“మావా! ఏమైనిది?” అని చిరాగ్గా అడిగింది యాదమ్మ.
“సిన్నీ, సిగ్నల్ పడ్డది. రెండో రౌండ్‌లో పోతాము,” అన్నాడు వీరయ్య.
“మావా, ఈ సిగ్నల్స్‌తో సానా పరేషానుగా ఉంది. ఇంకా ఎంతసేపు ఉండాలి?”
“కనీసం పది నిమిషాలు అవుతుంది. సెకండ్ రౌండ్‌లో పోగలం,” అన్నాడు వీరయ్య.
సిన్నీ నవ్వుతూ, “మన లగ్గమయిన కొత్తలో ఇదే రూట్‌లో నడుచుకుంటూ పోయేటోల్లమూ!” అంది. పాత రోజులు గుర్తుకు తెచ్చుకుంటూ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు.
“మావా, రోజూ నీవు బస్సులో కంపెనీకి పోతే సానా టైం అవుతోంది కదా? సైకిల్ కొనుక్కోరాదా?” అంది యాదమ్మ.
“ఈ సారి బోనస్ పైసలతో కొందాం,” అన్నాడు వీరయ్య.
“ఓకే మావా,” అంది యాదమ్మ.
సైకిల్ మీద అయిదేళ్లు కంపెనీకి వెళ్లి వస్తూ ఉండేవాడు వీరయ్య. పిల్లలు కిండర్ గార్డెన్‌లో చేర్పించాడు.
“మావా, పోరగాళ్లను రోజు సైకిల్ మీద తీసుకెళ్లడం కష్టముగా ఉంది. స్కూటర్ కొంటే మంచిగా ఉండదు?” అంది యాదమ్మ.
“నాకు కూడా కొనాలనే ఉంది. వచ్చే ఏడాదిలో లోన్ దొరుకుతుంది,” అన్నాడు వీరయ్య.
ఇంకో పది సంవత్సరాలు గడిచిపోయాయి. నలుగురూ స్కూటర్ మీద వెళ్లడం కష్టంగా మారింది.
వీరయ్యకి కంపెనీలో ప్రమోషన్ వచ్చింది.
“మావా, మన నలుగురం స్కూటర్ మీద ఎక్కడికైనా పోవడం కష్టముగా ఉంది. చిన్న కారు కొనుక్కుంటే మంచిది,” అంది యాదమ్మ.
“కారు కొనొచ్చు, కానీ సానా పెట్రోల్ ఖర్చు అవుతుంది,” అన్నాడు వీరయ్య.
“మావా, నీవు రోజూ స్కూటర్ మీద కంపెనీకి వెళ్లు. కారులో దావతులకి, సినిమాలకి పోదాం,” అంది యాదమ్మ.
కొద్ది రోజుల తర్వాత మారుతి కారు కొన్నారు.పెద్ద కొడుకు ఇంజినీరింగ్ చదివి సాఫ్ట్‌వేర్ జాబ్‌లో చేరాడు. రెండు సంవత్సరాల తర్వాత లగ్జరీ కారు కొన్నాడు.
అదే కారులో ఇద్దరూ ఒక మ్యారేజ్ ఫంక్షన్‌కి వెళ్తున్నారు.
“మావా, మనం గిఫ్ట్ కొనాలి. మంచి షాప్ దగ్గర ఆపు,” అంది యాదమ్మ.
“అరే, నే యాదిమరిచానే గ చౌరస్తా దాటినాక ఆపుతా,” అన్నాడు వీరయ్య.
షాపులోకి వెళ్లి గిఫ్ట్ ఐటమ్స్ చూస్తున్నారు. “మావా, సానా పెద్దగా ఉంది షాప్,” అంది యాదమ్మ.
“సిన్నీ, ఇంకా పైన కూడా ఉన్నాయి,” అన్నాడు వీరయ్య.
ఇంతలో కారులోంచి కుర్తా పైజామాలో హుందాగా ఉన్న వ్యక్తి లోపలికి వచ్చి ఓనర్ స్థానంలో కూర్చున్నాడు. అక్కడ పనిచేసే వాళ్లు వినయంగా నమస్కారమన్నారు.
ఓనర్ లేచి, వీరయ్య–యాదమ్మలకి వంగి, “నమస్కారం!” అన్నాడు. వీరయ్యకి ఏమనాలో అర్థం కాలేదు.
“అమ్మా, మీరు నా క్యాబిన్‌లోకి రండి. అక్కడ మాట్లాడుకుందాం,” అన్నాడు.
లోపలకి వెళ్లి కూర్చున్నారు.“సార్, ముప్పై ఏళ్ల క్రితం మీరు రోజూ నడిచి వెళ్లేవారు. నాకు తినడానికి ఏమీలేక మీరు పది రూపాయలు ఇచ్చేవారు.రెండు రోజుల తర్వాత అమ్మగారు ‘ఎక్కడైనా పనిచేసుకోవచ్చుగా’ అన్నారు.
‘నాకెవరు పని ఇస్తారు?’ అన్నపుడు, మీరు ఇదే షాప్‌లో జాడూ పవుంచే పని ఇప్పించారు. అప్పుడు ఈ షాప్ సానా చిన్నగా ఉండేది. నా పని తీరు, నిజాయితీ చూసి సేఠ్ నన్ను మేనేజర్ చేశాడు. అంతా మీ చలవే సార్,” అని చెప్పాడు.
“బాబు, మేము దావత్కి వెళ్తాం. ఇంకోసారి వచ్చి మాట్లాడుదాం,” అని వీరయ్య బయటకు వచ్చాడు.
కారులో కూర్చుంటూ “సిన్నీ, ఆ కుర్రాడికి ఘమండ్(అహంకారం) లేదు. వాడిని చూసి నేర్చుకోవాలి,” అన్నాడు వీరయ్య.
“నిజమే మావా, నీ మాటలో సానా మతలబు ఉంది,” అని తనలో తను అనుకుంది యాదమ్మ.
***
పెద్దాడ సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
మన తెలుగు కథలు పాత్రికేయులకి, పాఠకులకు నా నమస్కారములు.
పేరు: పెద్దాడ సత్యనారాయణ B .A విశ్రాంత సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్
డిఫెన్స్ అకౌంట్స్ డిపార్టుమెంట్
విద్యాభ్యాసము సికింద్రాబాద్
సాహిత్య పరిచయము: 6 వ్యాసాలు, ఆంధ్రభూమి 4 కధలు 1 నాటిక
వ్యాసాలకి పారితోషికం మరియు కమలాకర్ ట్రస్ట్ వారితో సన్మానము జరిగినది.
సంఘసేవ: గత మూడు సంవత్సరాలు నుంచి పది వృద్ధాశ్రమాలకి బాలబాలికల వసతి గృహాలకి మరియు ఒక పాఠశాల ,జూనియర్ కళాశాలకు అనేక వస్తవులు అందచేయడము జరిగింది. దాదాపు రెండు లక్షల రూపాయల విలువైన సామాన్లు మరియు తొంభై విలువైన ఉపయోగకరమయిన వాడేసిన వస్తువులు అనగా మంచాలు ,ఫ్రిడ్జిలు , టి.వీ.లు. కుర్చీలు .మొదలగున్నవి పరిచయస్తుల దగ్గరనుంచి సేకరించి ఆశ్రమాలకు అందచేసాను.




Comments