top of page

గొప్పింటి వారసులు



'Goppinti Varasulu' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 13/12/2023

'గొప్పింటి వారసులు' తెలుగు కథ

రచన: పిట్ట గోపి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పూర్వకాలంలో ఒక్కో కుటుంబంలో పదిమంది సంతానం ఉండేది. అయినా ఆ కుటుంబంలో ఎలాంటి కలహాలు కానీ, భేదాభిప్రాయాలు కానీ ఉండేవి కావు. 


అంతేనా.. కుటుంబం అంతా ఒకే ఇంట్లో ఉంటు ఐకమత్యంగా ఆనందంగా జీవించేవాళ్ళు. 

తమ ఇంట్లో పెద్దలు చనిపోతే వారి జ్ణాపకార్ధంగా ఏవేవో కట్టడాలు, సమాధులు నిర్మించి బతికుండగా ఎంత ప్రేమ చూపేవారో చనిపోయాక కూడా అంతే ప్రేమ చూపేవాళ్ళు. 


నేటి కాలం అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. ఒకరిద్దరు సంతానంతో సరిపెట్టుకుంటున్నా.. ఎప్పుడూ ఆ వారసుల మధ్య కలహలే. తల్లిదండ్రులు ఎంత సంస్కారంతో పెంచినా.. వారసులు మాత్రం తమ వక్రబుద్దిని బయటపెడుతూ ఉంటారు. 


ఈ మధ్య కాలంలో ఒకరిద్దరు సంతానమే కాక ఎక్కడో ఒక చోట కుటుంబ పరిస్థితులతో సంబంధం లేకుండా అంతకుమించి సంతానం కల్గే వాళ్ళు కూడా ఉన్నారు. 


అలాంటి వారిలో పరమేశ్వరరావు ఒకరు. బార్య సుశీల. ఇంటిపనులు చేస్తుంది. బయట పనులు చేతకాదు. పరమేశ్వరరావు నేపధ్యం మద్యతరగతి కుటుంబం అయినా.. ఎదిగినా తీరు అద్భుతం. కష్టపడిన తీరు మహాద్భుతం. 


పరమేషుకి ఐదుగురు సంతానం. ముగ్గురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. 


కష్టానికి నమ్ముకున్నోడు ఎప్పటికైనా మంచి బతుకు బతుకుతాడు కదా.. 


అలాగే శక్తి ఉన్నంత వరకు కష్టపడి పిల్లల్ని పెంచితే తర్వాత వాళ్ళే భాద్యతగా చూసుకుంటారు కదా అనుకునేవాళ్ళు అనేకమంది ఉంటారు. 


అచ్చం పరమేషు కూడా అలాంటివాడే. 

పిల్లలకు ఏదీ కావాలంటే అది కొనివ్వటానికి తన శక్తిని దారపోశాడు. ఎందుకంటే తల్లిదండ్రుల సర్వస్వం పిల్లలే కదా మరీ.. !


తమలా కష్టపడకూడదని, కష్టానికి కన్నీరు కార్చకూడదని ఎన్నెన్నో చదువులు చెప్పించారు. 

 ఇక పెద్దవాళ్ళు అయ్యాక పరమేషు ఒక్కడి కష్టంపై అంతమంది ఆధారపడుతున్నా ఏ రోజు కూడా తన కష్టాన్ని ఎవరికి చెప్పుకోలేదు. కారణం.. ?


 ఇప్పుడు తమ పిల్లలు ఉన్న పొజిషన్ బట్టి భవిష్యత్ లో వాళ్ళు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారని, తన కష్టం తీరుతుందని గట్టిగా నమ్మటం. 


ఎంత గట్టిగా నమ్మితే అంత గట్టిగా ఎదురుదెబ్బ తగులుతుందని బహుశా జీవిత పాఠాలు నేర్చుకున్న అనుభవజ్ఞుడైన పరమేషుకి తెలియకుండా ఉండదు. కానీ.. 

ఎదురుదెబ్బ కొట్టడానికి ఇక్కడ ఉన్నవాళ్లు పరాయివాళ్ళు కాదు, తన బిడ్డలేగా.. అని ఆ కష్టజీవి నమ్మకం. 


 కనీసం ఇంట్లో పనులు కూడా తమ పిల్లలకు చెప్పకుండా అన్ని పరమేషు, సుశీలలే చూసుకున్నారు. చదువుకున్న ఆ పిల్లలు కష్టం, కన్నీరు అనే పేర్లు మాత్రమే విని చదివి ఉంటారు కానీ వాటి అర్దాలు కూడా తెలియకుండా పెరిగారు. ఒకరకంగా ఆ ఇల్లు మధ్యతరగతి కుటుంబమే అయినా.. అందరిలాంటి ఇళ్ళే అయినా.. గొప్పింటి వారసుల్లా పెరిగారు పిల్లలు. 


 అందరి కుటుంబల వలె ముగ్గురు కూతుళ్లుకి పెళ్ళిళ్ళు చేశాడు. తాను చిన్నప్పటి నుండి ఈ ఆడపిల్లలకు కష్టం, కన్నీరు రాకుండా చూసుకున్నాడు. కాబట్టి అలాగే పెళ్ళి అయ్యాక కూడా తమ కూతుళ్లుకు ఏ కష్టం, కన్నీరు పెట్టించని అమెరికాలో స్థిరపడిన వాళ్ళకి ఇచ్చి పంపాడు. 


అబ్బాయిలుకు మాత్రం పెద్ద చదువులు చదివించాడు. అదృష్టం వరించి వాళ్ళు కూడా అమెరికా ఉద్యోగాలకు అర్హత పొందారు. 


అక్కడి వరకు బాగానే ఉంది కానీ.. 

ఆ తర్వాత అసలు చిక్కు ఎదురైంది పరమేషుకి, సుశీలకు. 


తమకు శక్తి ఉన్నంత వరకు తమ ఇంట్లో తమ కళ్ళముందే తచ్చాడుతు కనపడిన ఆ వారసులు, శక్తి క్షిణించే చివరి దశలో దూరం కావటం. 


కనీసం ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు కదా, ఇద్దరు కోడళ్లు వస్తారనుకుంటే వాళ్ళు కూడా తమ భర్తలతో అమెరికాలోనే ఉంటారు కానీ తమ ఇంటి వద్ద ఉండరు కదా అని ఆ వృద్ధ దంపతుల మనసులో వేదన ఇది. 


ఈ విషయాలపై పరిపరి విధాలుగా ఆలోచించి సున్నిత మనస్కురాలైన సుశీల ఆరోగ్యం చెడి, లోకం విడిచిపోయింది. 


పుట్టెడు దుఃఖంతో పిల్లలకు ఫోన్ చేశాడు పరమేషు. 


"ఇంకా ఉద్యోగంలో సెటిలే కాలే"దని చిన్నవాడు


"ఉద్యోగం లో చేరి కొన్ని నెలలే అయ్యాయని ఇప్పటికిప్పుడు రావటం అంటే కుదర”దని పెద్దోడు కరాఖండిగా చెప్పేశారు. 


ఇక కూతుళ్ళకి ఫోన్ చేయగా.. 

"అల్లుడు గారి మేనేజర్ ఉద్యోగులందరిని టూర్ కి తీసుకెళ్ళారని, మద్యలో వచ్చేస్తే వాళ్ళ మూడ్ పాడవుతుంద"ని పెద్ద కూతురు. 


" ఇప్పటికిప్పుడు ఫ్లైట్ లు దొరకవని కొన్ని రోజుల తర్వాత వస్తా"మని రెండో కూతురు.. 


"ఆయనకు అంత అర్జెంట్ గా అంటే సెలవు ఇవ్వరని, ఆయన లేకుండా తాను రాలే"నని చిన్నకూతురు 


ఆ మాటలకు చనిపోయి భార్య దూరమైందనే బాధ కంటే బతికుండి కూడా రాలేమని ఇంత కర్కోఠకంగా చెప్పగలిగిన ఆ పిల్లల మనస్థత్వంను తలుచుకుని కుమిలిపోయాడు పరమేషు. 


అంతో ఇంతో తల్లి పై ప్రేమ ఉన్న చిన్న కూతురు వీడియో కాల్ లో తల్లిని చూసింది కానీ.. కాసింత కన్నీరు కూడా పెట్టలేదు. 


ఇక పిల్లలు జాతకాలు తెలిసిన పరమేషు ఇంట్లో తన పనులు తాను చేసుకుంటు వృద్ధాప్య ఫించనుతో కాలం గడిపటం మొదలెట్టాడు. పిల్లల పై నమ్మకంతో వారి కోసం ఖర్చు పెట్టాడే కానీ ఏ ఆస్తులు పొగేసుకోలేదు. 


అలా గత జ్ణాపకాలతో పరమేషు రెండేళ్ల తర్వాత రేపో మాపో కన్నుమూస్తాడనగా అందరూ ఒకేసారి ఒకే ఫ్లైట్ లో ఏదో పండగకు వచ్చినట్లు పట్టుచీరలు నగలు, ఆభరణాలు ధరించి వచ్చారు. 


ఇంత కష్టపడి పెంచినా.. తమను పట్టించుకోకపోయినా.. పిల్లలు అంటే తల్లిదండ్రులుకు ఎప్పుడు అభిమానమే. వాళ్ళని చివరిగా చూసి ఆనందంతో కన్నుమూశాడు పరమేషు. 


తండ్రి చనిపోతే తమకు ఏడవటం కూడా చేతకాదని ముందే కొందరు మనుషులుకు డబ్బులు ఇచ్చి మరీ ఏడ్చేవాళ్ళను సిద్దం చేసుకున్నారు ఆ పాపిష్టి కూతుళ్ళు. 


ఇక అంత్యక్రియలు, కర్మకండాలును మాత్రం బాగా ఖర్చు పెట్టి చేశారు. 


ఏం చేస్తాం.. ! 

ఇది పరమేషు సుశీలలు చేసుకున్న పాపం కాకపోతే.. 


కన్నీరే రానీయకుండా జీవితాన్నిచ్చిన ఆ తల్లిదండ్రులకు 

కన్నీటి వీడ్కోలు పలకలేనీ ఈ గొప్పింటి వారసులు పదిమంది దుష్టిలో పుట్టినా ఒక్కటే చచ్చినా ఒక్కటే. 


పరమేషు ఆత్మకు శాంతి చేకూరాలని అతని నేపధ్యం తెలిసిన వారందరు మనస్ఫూర్తిగా కోరుకున్నారు. 

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





33 views0 comments
bottom of page