ఇల్లు అమ్మకం
- Vemparala Durga Prasad

- 2 hours ago
- 5 min read

Illu Ammakam - Telugu Family Story | Vemparala Durga Prasad
ఇల్లు అమ్మకం - తెలుగు కుటుంబ కథ | వెంపరాల దుర్గాప్రసాద్
Published In manatelugukathalu.com On 14/08/2026
ఇల్లు అమ్మడం అనేది కేవలం ఒక ఆస్తిని విక్రయించడం కాదు; కొన్నిసార్లు అది మనుషుల విలువను, బంధాల బలాన్ని కూడా బయటపెడుతుంది.సుదర్శన్ తన పాత ఇంటిని అమ్మి విశాఖపట్నానికి వెళ్లి కొడుకును చదివించాలని నిర్ణయించుకుంటాడు. అయితే, ఇంటికి ఆశించిన ధర రాకపోవడంతో అతను ఇబ్బందుల్లో పడతాడు. ఇదే సమయంలో తనతో మాటలు లేని సూర్యం మామయ్య గుర్తుకు వస్తాడు. గతంలో తన కుటుంబానికి ఎన్నో విధాలుగా సహాయం చేసిన ఆ బంధువును దూరం చేసుకున్నందుకు సుదర్శన్‌లో పశ్చాత్తాపం మొదలవుతుంది.
ఇల్లు అమ్మే ప్రయత్నంలో చివరకు ఒక కొనుగోలుదారు దొరికినా, అసలు ట్విస్ట్ రిజిస్ట్రేషన్ సమయంలో బయటపడుతుంది. తనకు తెలియకుండానే తక్కువ ధరకు ఇల్లు అమ్మేలా సూర్యం మామయ్య వేసిన వ్యూహాన్ని సుదర్శన్ అర్థం చేసుకుంటాడు. బంధాలను నిర్లక్ష్యం చేయడం, మనుషుల విలువను గుర్తించకపోవడం, లౌక్యంతో వ్యవహరించడం వల్ల ఎదురయ్యే పరిణామాలను “ఇల్లు అమ్మకం” కథ ఆలోచింపజేసేలా చెబుతుంది.
సుదర్శన్ పనిచేసేది నర్సీపట్నం మునిసిపల్ ఆఫీసులో. పెద్దగా చెయ్యి చాపి సంపాదించడం తెలీని మనిషి. పని చేస్తే, అవతల వాళ్ళు అభిమానంగా ఇచ్చింది తీసుకోవడం, లేకుంటే లేదు.
సుదర్శన్ కొడుకు ధీరజ్, నర్సీపట్నంలో 9వ తరగతి చదువుతున్నాడు. పిల్లవాడి 10వ తరగతి అయ్యేసరికి విశాఖపట్నం వెళ్ళి వాడిని చదివించుకోవాలని సుదర్శన్ అభిప్రాయం. సుదర్శన్ అన్నయ్య రాజశేఖర్ వాళ్ళు ఉండేది విశాఖపట్నంలో.
పండగకి సరదాగా గడపడానికి అన్నగారిని, వదినని, వాళ్ళ అబ్బాయి సుమన్ ని రమ్మనమని చెప్పాడు.
పండగకి వచ్చిన రాజశేఖర్ వెళ్తూ వెళ్తూ... "నీకు ఇదివరకు నుంచీ చాలా సార్లు చెప్తున్నా తమ్ముడూ! ఈ పాత ఇల్లు అమ్మేయ్. నీకు మా ఇంటి దగ్గర ఒక ఫ్లాట్ చూస్తాను. అలాగే, నువ్వు అప్లికేషన్ పెడితే, నీకు విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ కి బదిలీ చేయిస్తాను" అన్నాడు.
"చెప్పావులే అన్నయ్య! కానీ బదిలీకి ఖర్చులవుతాయి కదా. లక్షల్లో పెట్టాలి అని ఆలోచిస్తున్నాను" అని నసిగాడు.
"ఆ విషయం నాకు వదిలేయ్. ముందు నేను పెట్టుబడి పెడతాను. ఈ ఇల్లు అమ్మితే కూడా నీకు 40 లక్షల కంటే రాదుగా. విశాఖపట్నంలో ఫ్లాట్ కి కూడా మరో 5 లక్షలు లేకుండా అవదు. నేను అన్నీ చూసుకుంటానుగా. ముందు నువ్వు ఇల్లు అమ్మడం, బదిలీకి అప్లికేషన్ పెట్టడం చెయ్యి" అన్నాడు రాజశేఖర్.
"ముందు ఇల్లు అమ్మనీ అన్నయ్య, అప్పుడు బదిలీ అప్లికేషన్ పెడతాను. ఈలోగా మా వాడి 9వ తరగతి కూడా పూర్తి అయిపోతుంది. ఏకంగా వాడిని 10వ తరగతి నుంచీ అక్కడ చదివించుకోవచ్చు" అన్నాడు సుదర్శన్.
"సరే... నీ ఇష్టం. నీ రాక కోసం ఎదురు చూస్తాను" అన్నాడు రాజశేఖర్.
ఆ మరునాడే ఇల్లు అమ్మకానికి బోర్డు పెట్టాడు సుదర్శన్.
ఓ పది రోజులు గడిచాయి. జనం వస్తున్నారు, చూస్తున్నారు. ఎవరూ 30 లక్షలు మించి అడగడం లేదు.
అప్పుడు గుర్తుకు వచ్చాడు సుదర్శన్ కి వాళ్ళ సూర్యం మామయ్య. అతని పేరు గుర్తుకొచ్చేసరికి, సుదర్శన్ కి భార్య సునంద మీద కోపం తన్నుకొచ్చింది.
ఆ కోపానికి కారణం ఉంది. సునంద తమ్ముడు ఆనంద్ పెళ్లి సంబంధం విషయంలో సూర్యం మామయ్యతో గొడవ జరిగింది.
నిజానికి ఒక అనవసర విషయంలో దూరి సునంద, సూర్యం మామయ్య గారి భార్యని అవమానకరంగా మాట్లాడి గొడవ పడింది. ఆ గొడవ పెద్దదై, ఇద్దరి కుటుంబాల మధ్య మాటలు, రాకపోకలు తెగిపోయాయి.
తప్పు సునందదే అయినా ఒప్పుకోదు. సూర్యం మామయ్యకి పొగరెక్కువ, ఆ పొగరు వల్లనే భార్యని వెనుకేసుకొచ్చి తన మీదకి ఉసిగొల్పి అనవసరపు గొడవ చేయించాడని ఆమె వాదన. నిజానికి సూర్యానికి గాని, అతని భార్యకి గాని సుదర్శన్ కుటుంబం మీద అభిమానం ఉండేది. ఇదివరకు సుదర్శన్ కి చాలా సార్లు సహాయం చేసింది ఆ కుటుంబం.
సుదర్శన్ ఇల్లు, 2 పోర్షన్ల డాబా ఇల్లు. ఒక పోర్షన్ లో సుదర్శన్ కుటుంబం ఉంటే, రెండవ పోర్షన్ అద్దెకి ఇస్తూ ఉంటాడు. ఉండేది అబీద్ సెంటర్ లో అవడంతో అద్దెలు బాగా వస్తాయి. నిజానికి అద్దెలు బాగా రావడానికి సూర్యం మామయ్య వేసే పాచికలు కూడా కొంత సహాయపడేవి.
ఒకసారి అద్దెకి బోర్డు పెట్టిన సంఘటన గుర్తుచేసుకున్నాడు సుదర్శన్.
ఒకతను వచ్చి, "ఇల్లు అద్దెకి ఇస్తారా అండీ?" అని అడిగాడు.
"ఇస్తాము, చూసుకోండి" అన్నాడు సుదర్శన్.
ఆ వ్యక్తి, "అద్దె ఎంత?" అన్నాడు.
"9000 రూపాయలు" అన్నాడు సుదర్శన్. అంతకు ముందు ఉండేవాళ్ళు 8000 ఇచ్చేవారు ఆ పోర్షన్ కి.
వచ్చిన అతనికి ఆ ఇల్లు నచ్చినట్లే ఉంది. కానీ, "అద్దె మరీ 9000 అంటే కష్టం అండీ" అంటున్నాడు.
"మీ ఇష్టం. ఒకళ్ళు వచ్చి ఇందాక చూసుకున్నారు. వాళ్ళు ఒక గంటలో చెప్తామని అన్నారు" అన్నాడు సుదర్శన్.
ఆ వ్యక్తి మరొకసారి ఇల్లు చూడడానికి పెరట్లోకి వెళ్ళాడు. అలా మీమాంసపడే పార్టీలని ఎలా హ్యాండిల్ చేయాలో సూర్యం మామయ్య నేర్పించాడు సుదర్శన్ కి.
వెంటనే ఫోన్ తీసుకున్నాడు... "హలో సాగర్ గారా? మీరు ఏమి నిర్ణయించుకున్నారు?" అన్నాడు ఆ మాటలు వచ్చిన వ్యక్తి వినేలా గట్టిగా. అంతా వట్టిదే... అతను ఫోన్ చేసింది సూర్యం మామయ్యకి. సూర్యం దగ్గర చాలా మంది కుర్రాళ్ళు ఉంటారు. అతను పనిచేసేది రియల్ ఎస్టేట్ లో.
మరో 5 నిమిషాల్లో ఒక వ్యక్తి వీళ్ళ గుమ్మంలో ప్రవేశించాడు.
ఈలోగా ఇల్లంతా తిరిగి చూసిన వ్యక్తి మళ్ళీ ముందుకి వచ్చి బేరం ఆడుతున్నాడు.
"8500 చేసుకోండి. మాకు ఇల్లు నచ్చింది. 2 నెలల అడ్వాన్స్ ఇప్పుడే ఇస్తాను" అంటున్నాడు.
అప్పుడే వచ్చిన వ్యక్తి, "సార్! సుదర్శన్ గారంటే మీరేనా? సాగర్ గారు పంపించారు. మీ ఇల్లు అద్దెకి తీసుకోవడానికి మేము రెడీ. 9000 రెంట్ ఇవ్వడానికి మాకు సమ్మతమే... అయితే, ఒక నాలుగు రోజులు టైమ్ కావాలి" అన్నాడు సుదర్శన్ ని ఉద్దేశించి.
సుదర్శన్ అతని వైపు, ఇల్లు చూడడానికి వచ్చిన వ్యక్తి వైపు మార్చి మార్చి చూశాడు.
ఇంతలో ఆ వచ్చిన వ్యక్తికి గాభరా వేసింది. 500 కోసం చూసుకుంటే మంచి సౌకర్యంగా ఉండే ఇల్లు తప్పిపోతోంది అనిపించింది.
"నేనే ఇస్తాను లెండి 9000 రూపాయలు. నాకే ఖాయం చేయండి. ఇప్పుడు ఒక నెల అడ్వాన్స్ ఇచ్చేస్తాను. రేపే దిగిపోతాము, అప్పుడు మరో నెల అడ్వాన్స్ ఇచ్చేస్తాను" అన్నాడు.
సుదర్శన్, "సరే అలాగే కానివ్వండి" అని ఆ వ్యక్తితో అంటూ, వచ్చిన కుర్రాడితో "మీ సాగర్ గారికి చెప్పు నాయనా, ఇల్లు అద్దెకి ఇచ్చేశాము" అన్నాడు.
ఆ కుర్రాడు బిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు వెనక్కి తిరిగి.
అద్దెకి వచ్చిన వ్యక్తి సంబరంగా 9000 అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు.
ఇదంతా సూర్యం మామయ్య ఆడిన నాటకమే. ఎప్పుడు ఇల్లు ఖాళీ అయినా ఇలాగే ఏదో ఒక నాటకం ఆడించి మేనల్లుడి ఇంటికి అద్దె పెరిగేలా చూస్తాడు సూర్యం మామయ్య.
కానీ ఏం చేస్తాం, ఇప్పుడు మామయ్యతో మాటలు లేవు. మాట్లాడితే భార్య సునంద దగ్గర చీవాట్లు ఫ్రీ!
సూర్యం మామయ్యని తలుచుకుని బాధపడ్డాడు సుదర్శన్. ఇప్పుడు ఈ ఇల్లు ఎలా అమ్మాలి? రేటు ఎవరూ మంచిగా చెప్పడం లేదు.
ఆఖరికి వచ్చిన వాళ్ళ దగ్గర తన మిత్రులతో తన పాత నాటకం ఆడదామని చూసినా పనిచేయడం లేదు. "40 లక్షలు ఇచ్చిన వాళ్ళకి అమ్ముకోండి, మేమైతే ఆ రేట్ కి కొనలేము" అని ఖరాఖండీగా చెప్పి వెళ్ళిపోతున్నారు.
ఇంక ఎటూ పాలుపోవడం లేదు. నిన్న వచ్చిన పార్టీ నయం అనిపించింది. అతని పేరు భాస్కర్ ట. 35 లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చాడు. ఇంక అతనికే అమ్మేద్దామని నిర్ణయించుకున్నాడు సుదర్శన్.
భాస్కర్ కి కబురు పెట్టి, అగ్రిమెంట్ చేసుకున్నాడు 35 లక్షలకి. అడ్వాన్స్ గా 10 లక్షలు ఇచ్చాడు భాస్కర్.
40 రోజుల్లో రిజిస్ట్రేషన్ కి ఒప్పందం జరిగింది.
35 రోజులు గడిచిపోయాయి. కంగారు పడుతున్నాడు సుదర్శన్.
ఆరోజు వచ్చాడు భాస్కర్. "సుదర్శన్ గారూ! నేను మీకు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాను. తీరా నాకు మిగిలిన సొమ్ము సర్దుబాటు కాలేదు. అందుకని ఆలస్యం అయింది. మా మామయ్య దగ్గర అప్పు చేశాను. రేపు 08వ తేదీకి నాకు మిగిలిన సొమ్ములు అందితే సరే... లేకుంటే మా మామయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తాను. ఈలోగా మీ సొమ్ము మీకు పువ్వుల్లో పెట్టి ఇస్తాను" అన్నాడు.
సుదర్శన్ కి కొంత రిలీఫ్ వచ్చింది. ఎవరు కొనుక్కుంటే తనకేమి? పైగా అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది—"భాస్కర్ కి గాని, అతను సూచించిన వ్యక్తులకు గాని అగ్రిమెంట్ గడువు లోపల ఇల్లు అమ్మి రిజిస్ట్రేషన్ చేయించాలి" అని. తన చేతికి డబ్బు వచ్చేస్తే అదే చాలు అనుకున్నాడు.
"సరేనండీ. నేను డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టేటప్పుడు మీరు ఎవరి పేరు మీద వ్రాయమంటే అలాగే వ్రాస్తాను. కానీ, ఆ సంతకానికి ముందు బ్యాలెన్స్ సొమ్ము 25 లక్షలు ఇచ్చి తీరాలి" అన్నాడు.
"మేము ఆ డాక్యుమెంట్స్ తయారు చేసుకుని మరో 4 రోజుల్లో కబురు పెడతాము" అన్నాడు భాస్కర్.
ఆ రోజు బుధవారం. దశమి తిథి. రిజిస్ట్రేషన్ కి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ రెడీ చేసుకుని భాస్కర్ వచ్చేశాడు. వచ్చి 25 లక్షలు కూడా ఇచ్చేసి, అగ్రిమెంట్ పేపర్ మీద డబ్బు ముట్టినట్లు వ్రాయించి సంతకం పెట్టించుకున్నాడు సుదర్శన్ చేత.
సుదర్శన్ కి ఇప్పుడు పూర్తిగా తన సమస్య తీరింది అనిపించింది. అతను అప్పటికే ఎదురు వీధిలో ఇల్లు కూడా అద్దెకి తీసుకున్నాడు. రిజిస్ట్రేషన్ అయ్యాక ఇల్లు ఖాళీ చేసి ఆ ఇంట్లోకి వెళ్ళిపోవడానికి నిర్ణయించుకున్నాడు.
రిజిస్ట్రార్ గారు వచ్చేసరికి, భాస్కర్ రిజిస్ట్రేషన్ తాలూకు దస్తావేజు తయారు చేసి తీసుకుని వచ్చాడు.
కొనుగోలు చేసే వ్యక్తి పేరు "సూర్య భాస్కర రావు, S/o చిన్నారావు" అని ఉంది.
"మీ పూర్తి పేరు ఇదా?" అని భాస్కర్ ని అడిగాడు సుదర్శన్.
"లేదు, మా మామయ్య పేరు. అదిగో... వచ్చాడు" అని చూపించాడు.
చెట్టు కింద చుట్ట తాగుతూ కనిపించాడు సూర్యం మామయ్య. అప్పుడు అర్థం అయింది సుదర్శన్ కి, సూర్యం మామయ్య కొట్టిన దెబ్బ!
నిజానికి ఆ ఇంటికి 45 లక్షల దాకా వస్తుంది మార్కెట్ లో. సూర్యం తలుచుకుంటే వచ్చిన పార్టీలు తక్కువ రేటుకి అడుగుతారు. ఇప్పుడు తానే ఎక్కువ రేటు ఇచ్చినట్లు తన పేరు మీద ఫైనలైజ్ చేసుకున్నాడు. అదీ అతని వ్యూహం!
సూర్యం మామయ్య లౌక్యం తెలిసినవాడు కనుక, తన తెలివితేటలతో కథ నేర్పుగా నడిపి, తన ఇల్లు తనకి తెలియకుండా తన చేతే తక్కువకి అమ్మించుకున్నాడని అర్థం అయింది సుదర్శన్ కి.
"బలవంతుడైన బంధువుని దూరం చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది" అనిపించింది అతనికి. రిజిస్ట్రేషన్ ప్రక్రియకి ముందుకు కదిలాడు చేసేది లేక. సుదర్శన్ కి ఇప్పుడు రిజిస్ట్రేషన్ లో సంతకం పెట్టడం తప్ప వేరే దారి లేదు.
సమాప్తం
వెంపరాల దుర్గాప్రసాద్ గారి కొన్ని ఇతర రచనలు( కథ పేరు పైన క్లిక్ చేయండి.):
వెంపరాల దుర్గాప్రసాద్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు: వెంపరాల దుర్గాప్రసాద్
నేను AP ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో
అనగా APEPDCL లో personnel Officer గా పని చేసి november 2022 లో రిటైర్ అయ్యేను.
రచనలు చెయ్యడం, బొమ్మలు వేయడం, పద్యాలు రాయడం నా హబీ లు.
క్రికెట్, ఫుట్ బాల్, టెన్నిస్ ఆటలు టీవీ లో చూడడం ఇష్టం.
ధోనీ, రోహిత్ శర్మ అంటే క్రికెట్ లో చాలా ఇష్టం.
సంప్రాస్, జకోవిక్ ల టెన్నిస్ ఆట ఇష్టం.
ఫుట్ బాల్ లో రోనాల్డో కి ఫాన్.
వుండేది విశాఖపట్నం.
ఇప్పటి దాకా వివిధ పత్రికల్లో 40 కధలు రాసేను.











Comments