జగమే అయోమయం బ్రతుకే అయ్యోపాపం
- Nallabati Raghavendra Rao

- 1 day ago
- 8 min read
#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #జగమేఅయోమయంబ్రతుకేఅయ్యోపాపం, #JagameAyomayamBrathukeAyyopapam, #TeluguComedyStories, #తెలుగుహాస్యకథలు

Jagame Ayomayam Brathuke Ayyopapam - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao Published in manatelugukathalu.com on 07/01/2026
జగమే అయోమయం బ్రతుకే అయ్యోపాపం - తెలుగు కథ
రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
అయోమయం హాస్పిటల్ బయట అటు ఇటు తిరుగుతున్నాడు. లోపల నుండి కెవ్వున కేక వినబడింది.
అయోమయం భార్య సకలకళావతి కి పుట్టిన ఆ పిల్లాడు పుట్టిన వెంటనే.. 'కేర్ కేర్''.. అనడం లేదు. పోనీ.. ' కావు కావు ' అని కూడా అనడం లేదు.
ఆవకాయ జాడీలో అప్పడం ముక్క అన్నట్టు
''అప్పన్న లేటప్ప టూర్. ''.. ''అప్పన్న లేటప్ప టూర్. '' అంటూ చిత్రంగా మాట్లాడేస్తున్నాడు.
డాక్టర్ ప్రకాశంగారు లోపల నుండి పరుగు పరుగున
వచ్చి అయోమయాన్ని లోపలకు తీసుకువెళ్లాడు.
''మీకు పుట్టిన బాబు బ్రహ్మాండంగా ఉన్నాడు. తల్లి ఇంకా బ్రహ్మాండంగా ఉంది. పుట్టినప్పటినుండి పిల్లాడు ''అప్పన్న లేటప్ప టూర్ ''''అప్పన్న లేటప్ప టూర్ '' అంటూ ఒకటే గోల చేస్తున్నాడు. అదేమిటో మాకు అర్థం కావడం లేదు. ఎన్ని రకాల మ్యాజిక్కులు చేసిన నా మాట వినడం లేదు.. ఆ మాటలు మానడం లేదు. '' అంటూ ఏకరువు పెట్టినట్టు చెప్పిన ఆ డాక్టర్ గారు నేల మీద పడి దొర్లయ్యాలి అనుకున్నారు కానీ బాగుండదని తమాయించుకున్నారు.
వెంటనే ఏవో నాలుగు డ్రాపులు ఆ పిల్లోడు నోట్లో పోశారు. ధైర్యం కోసం ఓ రెండు డ్రాప్లు తను కూడా నోట్లో వేసుకున్నాడు. అబ్బే అబ్బబ్బే.. ఆ పిల్లోడు డాక్టర్లకే అర్థం కాని అద్భుతం లా తయారయ్యాడు..
వెంటనే బాబుని, తల్లిని ఇంటికి తీసుకొచ్చేసిన అయోమయం తనకు వచ్చిన అయోమయ పరిస్థితి అర్థం కాక భార్య సకల కళావతి ఆలోచనతో భూత వైద్యుడిని పిలిపించాడు. అతని పేరు భూతభజరంగ్.
''ఓం క్లీం హం ఫట్. '' అంటూ వేప రొబ్బలతో గంట సేపు తతంగం నడిపి, నూట ఒక్క నిమ్మకాయలు కోసి, నూట ఒక్క కొబ్బరికాయలు కొట్టి, అక్షరాల వెయ్యి రూపాయలు గుంజుకుని వెళ్ళిపోయాడు.. ఆ వచ్చిన భూత వైద్యుడు భూతభజరంగ్.
అతను వెళుతూ వెళుతూ.. ''అప్పన్న లేటప్ప టూర్.. అప్పన్న లేటప్ప టూర్.. '' అనుకుంటూ వెళ్లిపోవడం
అయోమయానికి అర్థం కాకుండా పోయింది.
పుట్టిన బాబు కనీసం పాలు తాగకుండా నీరసం కూడా లేకుండా.. పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు రమారమి 12 గంటలు పాటు.. అదే మాటలు అనడంతో మరింత భయం పట్టుకుంది అయోమయానికి.
''బాబాయ్ బాబుని నాకు చూపించవా?'' పరిగెత్తుకుంటూ వచ్చి అడిగాడు 8 ఏళ్ల పక్కింటి సత్తిపండు. మరింత చిరాకు ఎత్తింది అయోమయానికి. ‘మధ్యలో నీ వెదవ గోల ఏంట్రా..’ అంటూ కసరి కొట్టాడు ఆ కుర్రోడిని.
పాపం ఆ అరుపులకు ఆ కుర్రాడు భయపడి దూరంగా పారిపోయాడు.
అమ్మ అమ్మ.. అంటూ ఏడవలసిన పిల్లాడు అన్ని మాటలు ఎలా పలికేస్తున్నాడు చెప్మా.. అంటూ చుట్టుపక్కల అందరూ చెవులు కొరుక్కున్నారు.. కోసుకున్నారు
**
బాబు పుట్టి 24 గంటలు గడిచింది. పరిస్థితుల్లో మార్పు లేదు. బాబు నోటి నుండి ''అప్పన్న లేటప్ప టూర్'''.. ''అప్పన్న లేటప్ప టూర్''.. అదే అదే రిపీట్.
ప్రపంచంలో ఏ దేశానికి సంబంధించిన భాష ఇది. అక్కడ పుట్టించవలసిన వాడిని తప్పుజారి బ్రహ్మ దేవుడు ఇక్కడ పుట్టించాడా?.. ఒళ్ళు పీక్కుంటు న్నాడు బుర్ర గోక్కుంటున్నాడు అయోమయం. అతని భార్య సకల కళావతి గుడ్లు ఆర్పడం మరిచిపోయి చాలాసేపు అయింది.
ఆ మర్నాడు ఎరుకలసాని ఎరకాలమ్మ రానే వచ్చింది.
చేటలో సేరు బియ్యం పెట్టించుకుంది. పూనకం వచ్చేసింది.
''సోది చెబుతానమ్మ సోది చెబుతా.. ఇది దేవత కాదు దెయ్యం కాదు సరదా సరదా చింతపిక్కలు సరదా సరదా.. చింతపిక్కలు''.. అంటూ.. చింతజూకతో బాబును తట్టింది. ఎరకాలమ్మ చెప్పింది ఎవరికీ అర్థం కాలేదు.
ఆ మాట విన్న ఎవరో లోపలి నుండి ఒక గుప్పెడు చింత పిక్కలు తెచ్చి ఎరకాలమ్మ చేటలో బియ్యం మధ్యలో పోశారు..
వెంటనే ఎరకాలమ్మ మూడు చింత పిక్కలు తీసుకొని గుప్పెట పట్టుకుని తన తన చుట్టూ తిప్పి ఆ పిల్లాడు తల చుట్టూ తిప్పింది. “నేను చెప్పింది నిజం.. ఒట్టు.. చింతపిక్కలు అంటే ఆడుకునే చింతపిక్కలు అను కున్నారు తప్పు తప్పు. వీటిల్లో పెద్ద మర్మం దాగి ఉంది. మీ పని గుండు కొట్టించుకున్నట్టు అయిపో తుంది.
చిన్న పిల్లోడు మీ భరతం పడతాడు.. ఎరకాలమ్మ చెప్పింది అబద్ధం కాదు. మీరే అర్థం చేసుకోండి'' అంటూ రెండువందల రూపాయలు దానితో పాటు పాత చీర. ఉప్పులు.. పప్పులు పుచ్చుకుంది ఎరకాలమ్మ.
పని జరగలేదు..
''అప్పన్న లేటప్ప టూర్ ''
''అప్పన్న లేటప్ప టూర్'''
అదే మాటలు బాబు నోటి నుండి అదే పరిస్థితి.
తాయత్తులు, ఏరుముక్కలు, దిష్టితీయడాలు, మాన సిక వైద్యుడికి చూపించడం అన్ని అయిపోయాయి..
అన్ని పత్రికలలో ఈ వింత పెద్ద పెద్ద అక్షరాలతో వచ్చేసింది. మీడియా వాళ్ళు రానే వచ్చారు తమ పవర్ ఫుల్ మైకులతో. టీవీ చానల్స్ లో పదునైన మాటలు తో చూపించిందే చూపించి హోరెత్తించేస్తున్నారు.
వైరల్ వైరల్ వైరల్..
***
పక్కనే నిలబడ్డ సత్తిపండు ముందుకు వచ్చాడు మళ్లీ.. ''బాబాయ.. బాబునీ నాకు చూపించవా? '' మళ్లీ బతిమాలాడాడు.
''ఓసారి పిల్లోడిని అడిగి చూపిస్తే పోయిందేముంది రా'' వెనకనుంచి ఎవరో ముసలాయన గొనిగాడు.
చివరికి అయోమయం కమిటీ అవ్వక తప్పలేదు.
అంతే సత్తిపండు ముందుకు వచ్చి ఆ పిల్లోడిని చూసి గట్టిగా కేక పెట్టాడు. తనకంత అర్థమయిపోయినట్లు నాట్యం కట్టేసాడు.
ఆ పిల్లాడిని తను మామూలు స్థితికి తీసుకు వస్తాను అంటూ అందరికీ నచ్చజెప్పి తన వైద్యం మొదలు పెట్టాడు.
''అప్పన్న లేటప్ప టూర్''.. ''అప్పన్న లేటప్ప టూర్ ''అప్పన్న లేటప్ప టూర్''.. ''అప్పన్న లేటప్ప టూర్ ''
మొత్తం మీద బాబు అలిగాడు. ఏమి కావాలని అలి గాడు. ఏదో ఐడియా వచ్చినట్టు నెత్తి మీద మూడు సార్లు కొట్టుకున్నాడు.. సత్తిపండు.
.''అప్పన్న లేటప్ప టూర్ ''.. ''అప్పన్న లేటప్ప టూర్ ''
బాబాయ్ క్లూ దొరికేసింది. నీ దగ్గర ఐఫోన్ ఉంది కదా అది బాబు చేతిలో పెట్టు. '' అరిచాడు సరదాగా సత్తి పండు.
అప్పటికే వచ్చిన ఇరుగుపొరుగు బాబు మంచం చుట్టూ మూగారు.
అయోమయం బాబు చేతిలో ఐఫోన్ పెట్టాడు. వెంటనే బాబు 'అప్పన్న'.. అన్న మొదటి పదం అనడం మానేశాడు.
''బాబాయ్ సక్సెస్ సక్సెస్.. '' సత్తిపండు చాలా చాలా చలాకిగా బుర్ర ఊపుతు అన్నాడు.
''పిల్లల భాషను డి కోడ్ చేయాలి బాబాయ్. నువ్వు మహాఘోరంగా.. అఘోరంగా.. అయోమయంగా ఆలోచించేసావు బోలెడు డబ్బు ఖర్చు పెట్టావు. అప్పన్న అప్పన్న అంటే అప్పన్న కాదు వెంకన్న కాదు.. సింపుల్గా ఆలోచించు.
అప్పన్న దాన్ని డీకోడ్ చేయాలి.. అప్పన్న అప్పన్న.. అపన్ అపన్ అపన్.. అఫోన్.. అఫోన్.. అలాగే ఇంకో నాలుగు సార్లు స్పీడుగా అను.. చివరికి అది కాస్త.. అఫోన్.. అఫోన్.. చివరికి 'ఐఫోన్ ' అని మారిపోతుంది. అంటే వాడికి ఐఫోన్ కావాలట. కొనిస్తానని ఒక్క మాట చెవిలో చెప్పు. '' వివరించాడు సత్తిపండు.
''సరే, లేటప్ప.. టూర్.. ఆ రెండు ఏంట్రా. ''
చిరాకు ఎత్తి చిర్రెత్తి అడిగాడు సత్తిపండుని అయోమయం.
''లేటప్పలేటప్పలేటప్పలేటప్ప.. అదే పదం పదిసార్లు గుక్క తిప్పుకోకుండా అను.. చివరికి.. ' లాప్టాప్'.. అని వస్తుంది.
ఇక మూడవది టూర్ టూర్ టూర్ టూర్ టూర్..
ఇంకో పదిసార్లు ఊపిరి తీసుకోకుండా అను..
టూర్ టూర్ కాస్తా.. ''టూవీలర్''.. అయిపోతుంది.
ఆదన్నమాట అసలు విషయం. అందుకని..
ఆ మూడు కొనిపెడతానని వాడు చెవిలో చెప్పు''.
శాసించినట్టు చెప్పాడు సత్తిపండు.
''గాడిద గుడ్డు'' అంటూ అయిష్టంగానే బాబు చెవిలో ఆ మూడు కొనిపెడతానని అన్నాడు అయోమయం.
''అలా కాదు బాబాయ్ ఆ మూడు కాదు. కొంచెం వివరంగా చెప్ప.'' ఈసారి అరిచినట్టు చెప్పాడు సత్తిపండు.
''ఒరేయ్ బుజ్జిబాబు నీకు ''అప్పన్న లేటప్ప టూర్ ''
కొనిపెడతానురా. నిజం. నా మాట నమ్ము''
అంటూ వివరంగా చెప్పాడు అయోమయం.
.
''అబ్బా డీకోడ్ డీకోడ్.. డీకోడ్ చేసి చెప్పు బాబాయ్. ''
చిరాకు వచ్చి తన డిప్ప మీద ఒకటి వేసుకొని అర్థం అయ్యేటట్టు చెప్పాడు సత్తిపండు తన బాబాయ్ కు.
''అలాగే రా బాబు, ఒరేయ్ బుజ్జిబాబు నీకు నేను నిజంగా ఐఫోన్, లాప్టాప్, అలాగే టూవీలర్.. ఈ మూడు కలిపి నీవు ఇప్పుడు అంటున్నావే.. అప్పన్నలేటప్పటూర్.. అప్పన్నలేటప్పటూర్.. అది కొనిపెడతాను రా బాబు కొనిపెడతానురా నిజం.. నా మాట నమ్ము. '' ఓ రకంగా ఏడుస్తూ అరిచినట్లే చెప్పాడు అయోమయం.
''బొమ్మలు కాదు నిజానివే కొని పెడతానని గట్టిగా చెప్పు. '' అన్నారు చుట్టూ చేరినవాళ్లు.
''గాడిదగుడ్డు'' అనుకుంటూ అయోమయం అలాగే చెప్పాడు.. నిజానివే కొనిపెడతాను రా బాబు.. అంటూ ఆ పుట్టిన పిల్లాడి కాళ్లు పట్టుకున్నాడు.
అంతే. చిత్రంగా బాబు.. ఆ క్షణం నుండి..
''అప్పన్న లేటప్ప టూర్''..''అప్పన్న లేటప్ప టూర్ ''
అనడం మొత్తానికి మానేశాడు. చక్కగా నవ్వుతూ పాలు తాగడం మొదలుపెట్టాడు.
**
నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.



రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
ముందుగా " మన తెలుగు కథలు" నిర్వాహకులకు నమస్సులు..
"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.
రచయిత తన గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.
పునాది....
-----------
ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.
ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా.. రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.
తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో
టెన్త్ క్లాస్ యానివర్సరీ కి 15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.
అప్పుడే నేను రచయితను కావాలన్న
ఆశయం మొగ్గ తొడిగింది.
నా గురించి..
---------------
50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.
450 ప్రచురిత కథల రచన అనుభవం.
200 గేయాలు నా కలం నుండి జాలువారాయి
200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి
20 రేడియో నాటికలు ప్రసారం.
10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.
200 కామెడీ షార్ట్ స్కిట్స్
3 నవలలు దినపత్రికలలో
" దీపావళి జ్యోతి "అవార్డు,
"రైజింగ్స్టార్" అవార్డు
" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.
ప్రస్తుత ట్రెండ్ అయిన ఫేస్బుక్ లో ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు నాకథలు, కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..
రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!
ఇదంతా ఒక్కసారిగా మననం చేసుకుంటే... 'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.
ఇక నా విజయ ప్రయాణగాధ....
------+------------------------------
పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!
తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ... నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి వారైన సినీ గేయరచయిత
" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.
1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి కథ.
2. రేడియో నాటికలు గొల్లపూడి మారుతీ రావు గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.
3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర" ద్వితీయబహుమతి కథ.. "డిసెంబర్ 31 రాత్రి"
4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ
5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ
6. దీపావళి కథలు పోటీలో "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.
7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ
8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"
9. "స్వాతి " తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."
10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్ "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"
11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం కురిసింది"
12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ
13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..
14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం" న్యాయనిర్ణేత జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.
15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .
16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ
" ఇంద్రలోకం".
17. కొమ్మూరి సాంబశివరావు స్మారక సస్పెన్సు కథల పోటీలో "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.
18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ " గాంధీ తాత" రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.
19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.
20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".
21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".
22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి కథ "ఆలస్యం అమృతం విషం"
23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.
24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.
25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.
26. రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ పోటీ లో ఎన్నికైన కథ.
27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".
28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.
29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.
30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం" వారం వారం 30 కథలు.
31. "కళా దర్బార్" రాజమండ్రి.. రాష్ట్రస్థాయి కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.
32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి" కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.
33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో ప్రథమ బహుమతి పాటకు వారి నుండి పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక రంగస్థల ప్రదర్శనలు పొందడం.
34. విశేష కథలుగా పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు
నలుగురితోనారాయణ
కొరడా దెబ్బలు
అమృతం కురిసింది.
వైష్ణవమాయ
ఐదేళ్ల క్రితం
ఇంద్రలోకం
బిందెడు నీళ్లు
చంద్రమండలంలో స్థలములు అమ్మబడును
డిసెంబర్ 31 రాత్రి
మహాపాపాత్ముడు
35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.
ప్రస్తుతం...
1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం
2. పరిషత్ నాటికలు జడ్జిగా..
3. కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..
సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.
4. .. 4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.
5. ఒక ప్రింటెడ్ పత్రిక ప్రారంభించే ఉద్దేశ్యం.
భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.
కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.
కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.
కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.
మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.
నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.
నల్లబాటి రాఘవేంద్ర రావు




Comments