top of page

జీవిత పాఠం

Writer: Otra Prakash RaoOtra Prakash Rao

'Jeevitha Patam' New Telugu Story Written By Otra Prakash Rao

Published In manatelugukathalu.com On 08/10/2023

'జీవిత పాఠం' తెలుగు కథ

రచన : ఓట్ర ప్రకాష్ రావు

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

తండ్రితో ఇలాంటి సంఘటన ఎదురవుతుందని కలలో కూడా ప్రవీణ్ ఊహించలేదు. ప్రవీణ్ ఎన్ని విధాలుగా బ్రతిమలాడినా తండ్రి ససేమిరా అంగీకరించలేదు.


"నాన్నా, కరోనా దేశంలో ప్రవేశించి కనికరంలేకుండా బంధుత్వాన్ని దూరం చేసింది. మీరేమో ఇంకా కులం, కులం అంటూ పట్టుకొని వెళ్ళాడుతున్నారు. ఈ సమయంలో అమ్మ బతికి వుండే ఉంటే బాగుండేది. అమ్మ నన్ను కొట్టకుండా పెంచింది. నేను ఎలాగోలా బ్రతిమలాడి అంగీకరించేలా చేసేవాడిని" ప్రవీణ్ చెప్పాడు.


"మీ అమ్మ చనిపోవడానికి ముందు నీకు మన బంధువుల్లో మంచి పిల్లనిచ్చి పెళ్ళిచెయ్యమని చెప్పింది. అంతేకాదు, పొరపాటున ప్రేమ పెళ్లి అంటూ ప్రవీణ్ అడిగితే ఒప్పుకోవద్దని నాతో మరీ మరీ చెప్పింది. మీ అమ్మ దగ్గర నీ తిక్క ప్రేమ గురించి చెప్పివుంటే ఏం చేసేదో తెలుసా. " అన్నాడు చలపతి.


"మొదట వద్దంటూ బతిమాలాడుతుంది.. చివరకు నేను చెప్పిన విధంగా అంగీకరిస్తుంది నాన్నా. "


"పొరపాటుపడుతున్నావ్ ప్రవీణ్, మీ అమ్మని అంతేనా అర్థం చేసుకున్నావు. బతిమాలాడినా నీవు అంగీకరించడం లేదన్న మరుక్షణమే ఉరేసుకొని చచ్చేది. మీ అమ్మ పరువు ప్రతిష్టలకు ప్రాణమిస్తుంది. " అన్నాడు చలపతి.

"కరోనా ఎంతోమందికి జీవితపాఠాలనునేర్పింది. ఎంతోమంది ఆ పాఠాలను నేర్చుకొన్నారు. అనారోగ్యంగా ఆరునెలలు మంచంపై పడుకుని, దేశంలో కరోనా రావడానికి కొన్ని రోజుల ముందు చావడంతో, అమ్మ చావుకు బంధువులందరూ వచ్చారు. ఆ మైకంలో కులం, కులం అంటూ నీవు ఆడుతున్నావు. ఇప్పుడున్న ఈ కరోనా సమయంలోఅమ్మ చనిపోయివుంటే.. నీకు బుద్ది వచ్చివుంటుంది. అమ్మ దహన సంస్కారాలకు బంధువులెవరూ వచ్చివుండేవారు కాదు. ముందుగా చనిపోయి అమ్మ నాకు ద్రోహం చేసింది" కోపంతో గట్టిగా అన్నాడు.


"ఆవేశంలో ఆలోచనా రహితంగా అమ్మ చావుగురించి మాట్లాడుతున్నావు. నీ కోసం మీ అమ్మ కరోనా సమయంలో చనిపోయివుంటే బాగుండేదా.. ఏమిటా పిచ్చి మాటలు. " అన్నాడు చలపతి.


"నాన్నా, మీ పిచ్చి కన్నా నావి పిచ్చిమాటలు కావు. కరోనా కంటే కుల పిచ్చి వైరస్ వేగంగా వ్యాప్తిస్తుంది. కరోనా వైరస్ నిర్మూలించడానికి మందుకనుక్కొన్నారు కానీ, మీలాంటి వారిలోనున్న ఈ కులపిచ్చి నిర్మూలించడానికి మందు కనుక్కొనలేకపోతున్నారు. " అన్నాడు.


"ప్రవీణ్ ఆఖరుగా చెబుతున్నాను. నీవెన్ని చెప్పినా కులాంతర వివాహానికి నేను అంగీకరించను" అన్నాడు. తండ్రి మాటలతో ప్రవీణ్ నందు కోపం, ఆవేశం ఎక్కువైంది, తండ్రి బాధపడుతాడన్న విచక్షణా జ్ఞానం కోల్పోయి అనకూడని మాటలు అన్నాడు.


"ప్రవీణ్! కోపంలో నిన్ను నీవే మరచిపోయి నన్ను బ్లాక్ మెయిల్ చేయడానికి సిద్దపడ్డావు. ఇక నేను నీతో మాట్లాడటం వలన ఏమీ ప్రయోజనం లేదు. ఈ ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో. వెళ్లడానికిముందు ఇంట్లో నీకు ఏమేమి కావాలో తీసుకెళ్ళు. అంతవరకు వరండాలో కూర్చొంటాను" బాధగా అంటూ గది బయట వరండాలో వున్న కుర్చీలో కూర్చొన్నాడు చలపతి.

ప్రవీణ్ తనకు కావలసిన దుస్తులు, సర్టిఫికెట్స్ ఎత్తుకున్నాడు. తాను సర్దుకున్న రెండు బాగ్ లు వరండా తలుపు ముందుంచి, ముఖానికి మాస్క్ వేసుకొని ఆటోకోసం ఎదురుచూస్తుండటం చూసి బరువైన హృదయంతో మెల్లగా నడుచుకొంటూ లోనికి వెళ్ళాడు చలపతి.


*** *** ***

బాధ, కోపం, అసంతృప్తి, ఒంటరితనం కలసి అర్ధరాత్రి పన్నెండు గంటలు దాటినా నిదుర రానీకుండా చేసింది. అటూ ఇటూ అసహనంగా పొల్లుతున్నాడు. ప్రవీణ్ అన్న మాటలు గుండెలో గునపంలా గుచ్చి బాధిస్తూనే వుంది.

ఏదో శబ్దం.. కనులు తెరిచాడు. నైట్ లాంప్ వెలుగులో భర్య ఫోటోనుండి కన్నీటి చుక్కలు..


"నేనప్పుడే చెప్పాను కదండి. మనిద్దరిలో ఎవరు ముందు పోతారో వారే అదృష్టవంతులని, కానీ మిమ్మల్ని ఇంతగా బాధ పెడతాడని కలలో కొద్ద ఊహించలేదండి. " భార్య మాటలు.


"నేను మునిగింది గంగ, తాను వలచిందే రంభ అన్న ఆలోచనలోపడి నన్ను మర్యాదలేకుండా.."


"జరిగిందంతా చూసాను.. నేనేమి చేయలేని ఆసక్తురాలిని. ఆలోచనా రహితంగా నన్ను కరోనా సమయంలో చనిపోయివుంటే బాగుండేది అన్నప్పుడు నేను అంతగా బాధపడలేదు. మిమ్మల్ని కోపంలో ఎంత మాట అన్నాడు. ఇంతగా బ్లాక్ మెయిల్ చేస్తాడనుకోలేదు. " బొంగురు గొంతుతో అంది.


"ప్రవీణ్ అనకూడని మాటలన్నాడు. ఏదో చెయ్యాలి.. ఏం చేయాలన్నదే ఆలోచిస్తున్నాను. మన ప్రవీణ్ మాత్రమే కాదు ఈ కాలం యువకులలో కొంతమంది ఇలా బ్లాక్ మెయిల్ చేయడం విన్నాను. చివరకు మన ప్రవీణ్ నాతో ఇలా.. " అసహనంగా అంటూ కళ్ళుమూసుకొని వేగంగా ఊపిరి పీల్చసాగాడు.

"మీరూ ఆవేశ పడిపోతున్నారు. ముందు లేచి వెళ్లి మంచినీళ్లు త్రాగి వచ్చి పడుకోండి.. రాత్రంతా నిదురపోలేదు. " అంది.


డిజిటల్ గడియారం నాలుగు గంటలు కొట్టడంతో కళ్లుతెరచి మేలుకొన్నాడు. జరిగిందంతా కల. నైట్ లాంప్ వెలుగులో చిరునవ్వు ముఖంతో నున్న భార్య ఫోటో చూసాడు. కలలో భార్య మాటలు గుర్తుకు వచ్చింద. మంచి నీరు త్రాగివచ్చి పడుకొన్నాడు.


*** *** ***

కాల చక్రం కొన్ని సంవత్సరాలను దాటుకొంటూ వెళ్ళింది. కరోనా చూపించిన విషాదాన్ని అందరూ మర్చిపోయారు.


"మా నాన్న ఎవరో నలుగురు నలుగురు అబ్బాయిలను దత్తత తీసుకొని పోషిస్తున్నారట. ఈ రోజే తెలిసింది. " భార్యతో చెప్పాడు ప్రవీణ్.

"మీతో తెగతెంపులు తెంచుకొన్నారు సరే, కావాలంటే ఒకరిని దత్తత తీసుకొనివుండొచ్చుగా, నాలుగురెందుకు ప్రవీణ్ " అడిగింది భార్య.

"మన పెళ్ళికి అంగీకరించలేదన్న కోపంలో, కరోనా అల ఎప్పటికీ ఉంటుందన్న భావనతో నీవు చనిపోతే మోయడానికి నలుగురూ వుండరు, కొరివిపెట్టడానికి నేనూ రాను అని గట్టిగా అన్నాను. మోయడానికి నాలుగురైనా ఉండాలన్న ఉద్దేశ్యంతో నలుగురిని దత్తత తీసికొనివుంటారు. " ఎగతాళిగా అన్నాడు.


"ఆయన ఏదో ఉద్దేశ్యంతో నలుగురిని తీసుకొనివుంటారన్న భావన కల్గుతుంది, కానీ ఇది అన్న ఆలోచన కలగడం లేదు" భర్తతో అంది.


*** *** ***

ఒకరోజు "మా నాన్న చనిపోయారంట. ఎల్లుండి కర్మ కాండ జరుగుతుంది తప్పకుండా మీరే ముందు వుండి పూర్తిచెయ్యాలి అంటూ ఫోన్ చేశారు. "


"అయ్యో మామయ్యా చనిపోయారా, ఎవరు ఫోన్ చేశారు. "


"ఆనలుగురిలో ఒకడు. ”


"ఈసంగతి చెప్పేవాడు. మామయ్య చనిపోయినప్పుడు తెలియపరచాలన్న బుద్దీ జ్ఞానం లేదా. "


"ఫోనులో చెబుతున్నప్పుడు కోపం కలిగినా నిగ్రహించుకున్నాను. కానీ నేరుగా వెళ్లి అందరిముందూ ఆ నలుగురినీ అడగాలనుకొన్నాను. " అన్నాడు ప్రవీణ్.

*** *** ***

స్టేషన్ నందు దిగి బయటకు రాగానే తమ ఊరు చాలా మారినట్లు గుర్తించాడు. ఈ ఊరినుండి తండ్రితో తెగతెంపులు చేసుకొని స్టేషనుకు వస్తున్నపుడు ప్రతి ఒక్కరు ముఖానికి మాస్కులు ధరించి వున్నారు, ఇప్పుడు కరోనాను మరచిపోయారు. అందరూ స్వేచ్ఛగా వుండటం గమనించాడు. ఆటో ఎక్కి ఇంటికి చేరుకొన్నాడు. ప్రవీణ్ హాలులో ప్రవేశించాడు. టేబుల్ మీద నాన్నఫోటో వుంది. మాల వేసివుంది ప్రక్కనే దీపాలు వెలుగుతోంది. ఒక్క క్షణం కనులు చెమ్మగిల్లింది. చేతులు జోడించి కనులు మూసుకున్నాడు. గట్టిగా ఊపిరి పీల్చి కళ్లుతెరచి గోడమీద అమ్మ ఫోటో చూసాడు. ప్రవీణ్ కుర్చీలో కూర్చొనగానే తనముందు నేలమీద కింద కూర్చొన్న ఆ నలుగురినీ చూడగానే తన తండ్రి దత్తత తీసుకున్నది ఆ నలుగురు అని గుర్తించాడు.


"అన్నా మేము నలుగురం అనాథలం. ఇంటర్ చదువుతున్నప్పుడు (మీ ) నాన్నగారు మా నలుగురినీ న్యాయపరంగా దత్తత తీసుకొన్నారు. " అన్నాడు.

"నాన్నగారు మా వైపు చూసి ' తల్లి తండ్రులు లేని నలుగురు అనాధలని చేరదీసి తండ్రిగా ఆదరించాలనుకొన్నాను. మీ చదువుకు మీకు ఇబ్బంది పెట్టకున్నా కొన్ని మంచి సేవా కార్యక్రమాలలో మీరందరూ పాల్గొనాలి. మీరు నాకు కన్న కొడుకులతో సమానం. నాకీరోజునుండి మొత్తం ఐదుగురు కోడుకులు’ అన్నారు అన్నా. "


"అన్నా, ఆ రోజునుండి మా నలుగురినీ సొంత కొడుకుల్లాగా చూసుకొన్నారు. ఆయన దయతో డిగ్రీ పూర్తి చేసుకొని మంచి ఉద్యోగాలలో స్థిరపడ్డా సేవా కార్యక్రమాలు చేస్తూనే వున్నాము"


' స్మశాననానికి తీసుకెళ్లడానికి నలుగురినీ దత్తత తీసుకొన్నాడు. అందుకే చనిపోయినప్పుడు నన్ను పిలిపించకుండా పదిహెనవరోజు జరిగే కర్మ కాండకు పిలిపించాడు' మనసులో అనుకొన్నాడు ప్రవీణ్.


"అన్నా, నాన్న గారు దేవుడు లాంటి మనిషి. ఆ సమయంలో ఈ పట్టణంలోని కరోనా శవాలను స్మశానానికి తీసుకెళ్లడానికి నాన్నగారితో పాటు మేము నలుగురం వెళ్ళేవాళ్ళం. మేమంతా తగు జాగ్రత్తతో ప్రొటెక్టీవ్ కిట్ వేసుకొని వెళ్లేవారం. మేము ఖననం చేసిన అనాధ శవాలలో ఒక కోటీశ్వరుడి శవం ఉందని ఆ తరువాత తెలిసింది. ఆ కుటుంబం వారు మాకు కొన్ని లక్షలు విరాళంగా ఇచ్చారు. "


"ఆ డబ్బుతో సేవాగృహం కట్టాము. మొదట్లో కరోనా క్వారంటైన్ హోమ్ లాగా బీదవారికి ఉచితంగా ఏర్పాటు చేసాము. ఆ తరువాత కరోనా పూర్తిగాతగ్గి పోయాక నాన్నగారిపేరు మీద అంటే చలపతిగారి వృద్ధాశ్రమం అని పేరుపెట్టి నడుపుతున్నాము అన్నా. "


"అన్నా, ఆశ్రమమునందు చేరే వృద్ధుల సంఖ్య పెరుగుతున్నా.. విరాళాలు ఇచ్చే దాతలు పెరుగుతున్నారు"


"అన్నా, మీ ప్రేమ వివాహం కోసం చిన్న ఘర్షణ కలిగి చిరుకోపంతో వెళ్లిపోయారని చెప్పారు. కానీ ఒక్క విషయం నాన్నగారు మాతో అప్పుడప్పుడూ ఏమని చెప్పేవారంటే నాకు ఐదుమంది కొడుకులలో ధర్మరాజు లాంటివాడు మా ప్రవీణ్. నా తరువాత మీ అందరికీ వాడే పెద్ద అనే వారు. "


‘ నాన్న చేసిందన్నీ మంచిపనులు, కానీ తాను చనిపోయిన సమయాన నన్ను పిలిపించకుండా కర్మకాండకి మాత్రం ఎందుకు పిలిపించారో అర్థం కాలేదు. ఇంటికి పెద్ద నేను అని చెప్పిన నాన్న మాటలకు వీరెందుకు గౌరవం ఇవ్వలేదు. తొందరపడి అడగకూడదు అన్నీ వారు చెబుతున్నారు. కాస్సేపు ఓపిక పట్టితే తెలుస్తుంది ‘అని మనసులో అనుకొన్నాడు ప్రవీణ్.

"అన్నా, మేము నలుగురం నాన్నగారితో కలసి ఆ కరోనా సమయంలోఎన్నో శవాలను మోసి స్మశానం వరకు మోసుకెళ్లి దహనం చేసాము, కానీ నాన్నగారి శవం మోయడానికి మాకు అవకాశం ఇవ్వలేదు. " అన్న అతనితోపాటు మిగిలిన ముగ్గురూ కొంతసమయం ఏడుస్తూ బాధపడ్డారు.


ఆ నలుగురిలో ఒక వ్యక్తి లేచి బీరువాలో వున్న కవర్ తీసుకొనివచ్చి ప్రవీణ్ఇ చేతికిస్తూ "అన్నా, ఈ ఉత్తరం మమ్మల్ని దత్తత తీసుకొనడానికి ముందు వ్రాశారట. మీరొస్తే ఇవ్వమని నాన్నగారు చనిపోవడానికి ముందుచెప్పారు. "

అన్నాడు.


ప్రవీణ్ కవరు తెరచి చూసాడు. తండ్రి వ్రాసిన ఉత్తరం పైన తేదీవుంది. 'నేను ఈ ఇంటినుండి వెళ్లిన నెలలో వ్రాసిన ఉత్తరం' అనుకొన్నాడు. ప్రవీణ్ ఉత్తరం చదవసాగాడు.


“ప్రియమైన ప్రవీణ్,

నీవు ఇంటినుండి వెళ్లిన తరువాత మూడు రోజులు అలోచించి.. అలోచించి తీసుకొన్న నిర్ణయం ఇది.

ఆ రోజు నీవన్నట్లు మనిషి ఎన్నివిధాలుగా జీవించినా, చనిపోయినప్పుడు తీసుకెళ్లడానికి తనవారు అంటూ నలుగురు ఉండాలంటారు, ఆ నలురూ లేకుంటే ఏం పాపం చేసాడో అని జాలిగా తలచుకొనేవారు. కరోనా అలతో నలుగురు అన్న వార్త పోయి కన్నబిడ్డలు కడచూపు చూస్తే చాలు అన్న అభిప్రాయానికి వచ్చారు.


“మీ మొండితనంతో కన్న కొడుకును దూరం చేసుకోవద్దు. మీరు మా ప్రేమ వివాహానికి అంగీకరించి పెళ్ళి జరిపించారంటే, చివరి వరకు నేను తోడుగా వుంటాను. లేదంటే నేనిక మీ కడచూపుకు కూడా రాను. మోయడానికి ఆ నలుగురు లేకపోయినా ఆఖరి చూపు నోచుకోనందుకు, కొరివిపెట్టనందుకు అందరూ ఏమనుకొంటారో తెలుసా..


కొడుకుతో కొరివి పెట్టించుకోలేకపోని పాపాత్ముడు అంటూ అని భావిస్తారు. కరోనా నేర్పిన జీవిత పాఠాలను ముందుంచుకొని తెలివితో జీవించాలి"అంటూ చెప్పావు కాదు.. కాదు బ్లాక్ మెయిల్ చేసావు.


కరోనా కాలంలో నీవు తెలుసుకొన్న జీవిత పాఠంతో నన్ను బ్లాక్ మెయిల్ చేసావు. నా కడచూపుకు నీవు రాకపోయినా, నన్నూ నిన్నూ మెచ్చుకునేలా.. ఒక నిర్ణయం తీసుకొన్నాను.

కరోనా సమయంలో నేను తెలుసుకొన్న మరో జీవితపాఠం ఏమిటంటే స్మశానం వరకు మోయడానికి ఆ నలుగురు లేరని ఎవరూ బాధపడకుండా ఉండాలన్నా, కొరివి పెట్టడానికి కొడుకురాడని ఆవేదన పడకుండా ఉండాలంటే అవయవదానం శ్రేష్టమైన మార్గంమని నిర్ణయించుకున్నాను.


అవయవదానం. ప్రాణం పోయిన తర్వాత కూడా జీవించడానికి అనడంకన్నా ఇతరుల జీవితాలలో వెలుగునింపడానికి లభించే గొప్పఅవకాశం అని ఆందరికీ తెలుసు. నీవు నా కడచూపుకు రాక పోయినా, కొరివి పెట్టకపోయినా అవయవ దానం చేసిన వ్యక్తి కొడుకుగా నిన్నూ మెచ్చు కొంటారు. రేపు ఉదయం మెడికల్ కాలేజీకి వెళ్లి నా అవయవ దానం చేయడానికి అంగీకరిస్తున్నట్లు దరఖాస్తుఫారం ఇవ్వదలచుకొన్నాను. అలాగే ఒంటరితనం పోగొట్టుకొని, సమాజసేవ చేయడానికి నలుగురిని దత్తత తీసుకోవాలని నిర్ణయించాను.


ఈ ఉత్తరం నా మరణం తరువాత నీకు అందేలా చేయాలనుకున్నాను

మీ నాన్న

చలపతి"


ఉత్తరం చదివిముగించిన ప్రవీణ్ హృదయమునందు విషాదగ్ని పర్వతములు ఒక్కసారిగా పెల్లుబికింది.


"నాన్నా.. నన్నుక్షమించు నాన్నా.. " బిగ్గరగా అంటూ వేగంగావెళ్లి టేబుల్ మీదున్న చలపతి ఫోటో ఎత్తుకొని భోరుమని విలపించసాగాడు.


(అయిపొయింది )

ఓట్ర ప్రకాష్ రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

1. పేరు: ఓట్ర ప్రకాష్ రావు

https://www.manatelugukathalu.com/profile/oprao/profile 2. నా గురించి : 2017న జనవరి నెలలో రాణిపేట బి.హెచ్.ఈ.ఎల్. నందు పదవీ విరమణ పొందిన తరువాత తమిళ నాడు లోని తిరుత్తణి లో స్థిరపడ్డా ను. ”Free Yoga” పేరు మీద తిరుత్తణి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు ఉచితముగా యోగాసనములు నేర్పుతున్నాను. తీరిక సమయంలో కథలు వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను 2020 సంవత్సరం మార్చ్ మాసం నుండి లాక్ డౌన్ కారణంగా బడులు తెరవకపోవడంతో పిల్లలకు ఉచిత యోగ తరగతులకు వెళ్ళలేక పోయాను 3. విద్య : ఐ టీ ఐ 4. సాహిత్య ప్రపంచంలోని తీపి జ్ఞాపకాలు : 1988 న ఆంధ్రప్రభ వారు నిర్వహించిన తెలుగు మినీ కథల పోటీలో మొదటి బహుమతి, 2015 నందు రాయగడ రచయితల సంఘం నిర్వహించిన కథల పోటీలో కన్సోలేషన్ బహుమతి, 2017 ,2018,2019,2020 నందు కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కథల పోటీలో బహుమతి పొందా ను. 2018 న కెనడా తెలుగు తల్లి వారు నిర్వహించిన కవితల పోటీలో బహుమతి పొందాను 2018 అక్టోబర్ నెలలో Mytales.in నిర్వహించిన చిట్టినీతి కథల పోటీలో నా కథను ఉత్తమ కథగా ఎన్నిక 2020 ప్రతిలిపి వారు నిర్వహించిన మాండలిక కథల పోటీలో మొదటి బహుమతి లభించింది 2021 శ్రీ శ్రీ కళావేదిక వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో మొదటి బహుమతి 2021 మనతెలుగుకథలు.కామ్ వారు నిర్వహించిన సంక్రాంతి కథల పోటీలో ప్రత్యేక బహుమతి 6. ఇంతవరకు ప్రచురించినవి ఆంధ్రప్రభ ,ఆంధ్రపత్రిక, ఆంధ్రభూమి, గోతెలుగు ,హాస్యానందం, జాగృతి, కెనడా తెలుగుతల్లి, ప్రజాశక్తి ,ప్రతిలిపి ,ప్రియదత్త, రచన, వార్త, విపుల ,శ్రీ శ్రీ కళావేదిక, మనతెలుగుకథలు.కామ్ - పత్రికలలోమొత్తం మీద ఇంతవరకు 70 కథలు ప్రచురించబడింది ఆంధ్ర ప్రభ , బాల భారతo ,ఈనాడు హాయ్ బుజ్జి , మనతెలంగాణ , నవతెలంగాణ , ప్రభాత వెలుగు దర్వాజా , ప్రజాశక్తి , సాక్షి, వార్త , విశాలాంధ్ర - పత్రికలలో 130 బాలసాహిత్యపు కథలు


 
 
 

Comments


bottom of page