top of page
Original_edited.jpg

జీవితం ఓ వైకుంఠపాళి

  • Writer: Nallabati Raghavendra Rao
    Nallabati Raghavendra Rao
  • Nov 7
  • 10 min read

#NallabatiRaghavendraRao, #నల్లబాటిరాఘవేంద్రరావు, #జీవితంఓవైకుంఠపాళి, #JeevithamOVaikuntapali, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Jeevitham O Vaikuntapali - New Telugu Story Written By - Nallabati Raghavendra Rao 

Published In manatelugukathalu.com On 07/11/2025

జీవితం ఓ వైకుంఠపాళి - తెలుగు కథ

రచన: నల్లబాటి రాఘవేంద్ర రావు

ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత

ధనుంజయ్, ప్రసన్న ఈ కాలం భార్యాభర్తలు. వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు మధుమోహన్ కి రెండున్నర సంవత్సరాల వయసు. వాళ్ళు ఉండేది జయచంద్ర బాద్ అనే సిటీలో. 


ధనుంజయ్ అన్న ప్రసన్నవదనరావు, వదిన పార్వతి లు అక్కడికి దగ్గరలోని సుకేతనగర్ అనే ఒక పల్లెటూర్లో ఉంటున్నారు. ఆ పల్లెటూరి వాతావరణం లాగే వాళ్ళిద్దరు కూడా అంతగా అభివృద్ధి చెందని జంట. వాళ్లకు ఒక అబ్బాయి రామచంద్ర. ఆ అబ్బాయిది కూడా మధుమోహన్ వయసే. 


తండ్రి వరాహముత్యాలరావు ఈ మధ్యనే చనిపోయినప్పుడు ప్రసన్నవదనరావు, ధనుంజయ్ అన్నదమ్ములు ఇద్దరికీ పెద్దగా చెప్పుకోదగిన ఆస్తిపాస్తులు ఏమి దక్క లేదు. 


తండ్రి అనంతరం తన పుట్టిన గ్రామమైన సుకేతనగర్ నుంచి తమ్ముడు ధనుంజయ్, అభివృద్ధి కోసం తన వాటాకు వచ్చిన ఇంటి భాగాన్ని వచ్చిన కాడికి అమ్ముకొని భార్యబిడ్డను తీసు కొని జయచంద్రబాద్ చేరిపోయాడు. 


ధనుంజయ్ తన తెలివితేటలతో మంచి ఉద్యోగమే సంపాదించుకొని రెండు చేతులతో డబ్బు సంపాదించడం మొదలుపెట్టాడు. అతనికి అతని భార్య ప్రసన్న కూడా కలిసి రావడంతో తన ఇంటి వాటా డబ్బును కలిపి ఒక సంవత్సరకాలంలోనే మంచి ఫ్లాట్ కూడా కొనుక్కోగలిగాడు.. ఆ సిటీలో. 


ఆ భార్యభర్తలు ఇద్దరూ తమ రెండున్నర సంవత్సరముల కొడుకును ఇప్పటినుండి భవిష్యత్తు వరకు అత్యున్నత స్థానంలో ఉంచాలని కలలు కంటూ ఆ కలలను సాకారం చేసుకునే దిశగా పావులు కదపడం మొదలు పెట్టారు. 


అలా వాళ్ళిద్దరూ కష్టపడుతూ డబ్బు సంపాదించు కోవడంలో ఏమాత్రం తప్పులేదు కానీ.. అందుకోసం చిన్నారి కొడుకు మధుమోహన్ తమ అభివృద్ధి కి, సంపాదనకు ఆటంకంగా ఉన్నాడని భావించి ఆ చిన్ని వయసులో ఆ చిన్నారిని బేబీ డే కేర్ సెంటర్స్ లో వదిలేసి తమ వృత్తి వ్యాపకాలు నిర్వహించు కోవడానికి పగలు సమయం అంతా వెళ్ళిపోతుండేవారు. 


ఇదిగో అలాంటి సమయంలోనే సుకేతనగర్ నుంచి విషయం తెలుసుకొని ధనుంజయ్ తాత పరమహంస రావడం జరిగింది ఒక రోజు. 


ఆరోజు ఆదివారం. పరమహంస తన మనవడు ధనుంజయ్ ఇంట్లో బ్రహ్మాండమైన భోజనం చేశాక సోఫాలో కూర్చుని తన ఎదురుగా మరో సోఫాలో కూర్చున్న ధనుంజయ్ అతని భార్య ప్రసన్నలతో మాటామంతిలో పడ్డాడు. 


''ఒరేయ్ ధనుంజయ్. తాతను కనుక చెప్పే హక్కు ఉన్నది కనుక చెప్తున్నాను. నీ తండ్రి చనిపోయాడు కనుక ఇక నుంచి నీకు మంచి విషయాలు చెప్పవలసిన అవసరం, బాధ్యత నీ తాతగా నాకుందిరా. నీ కొడుకుని శిఖరంలో నిలబెట్టడం కోసం మీ తల్లిదండ్రులు ఇద్దరూ బాగా సంపాదించి కూడపెట్టాలని నిర్ణయించుకుని పడుతున్న శ్రమ నేను చూస్తున్నానురా. నిన్ను నీ భార్యను శభాష్ అనక తప్పదు. 


కానీ తల్లిదండ్రులుగా ఇక్కడ కొన్ని జీవిత విలువలను దూరం చేసుకుంటున్నారురా మీరిద్దరూ. మూడు సంవత్సరములు నిండని నీ కొడుకుకు ప్రస్తుతం ఏం కావాలో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఆ చిన్ని హృదయం తల్లి తండ్రుల ప్రేమను కోరుతుందిరా.. 


అలా బాల్యంలో ఈ పునాదిలోనే తల్లి ప్రేమతో పెరిగినవాడు తప్పకుండా యోగ్యుడు అవుతాడు. అలా కాకుండా వాడిని ఇలా రోజంతా ఎక్కడో ఊరికి చివర దూరంగా ఉన్న సెంటర్లో ముక్కు ముఖం తెలియని మనుషుల దగ్గర ఉంచడం మీ మనసులకు బాగానే ఉందేమో కానీ నాకు చాలా భయంకరమైన విషయంగా తోస్తుందిరా. 


చెప్తున్నాను అనుకోకు.. అక్కడ నీ పుట్టిన ఊరు సుకేతనగర్లో మీ అన్న వదినలు ప్రసన్నవదనరావు పార్వతి.. వాళ్ల ఇద్దరి దగ్గర కొన్ని సాంప్రదాయ కట్టు బాట్లు మధ్య పెరుగుతున్న వాళ్ళ అబ్బాయి రామ చంద్రకు కూడా మీ అబ్బాయి వయసే కదా. వాళ్లు కూడా ఆ పిల్లోడు విషయములో ఒక ఆలోచన చేశారు. చాలామంది లాగా చదువు కోసం సిటీలో ఎక్కడన్నా హాస్టల్లో పెట్టేద్దామని. కానీ నేను వద్దు అని వారించాను. వాళ్ళు నా మాట విన్నారు. పిల్లవాడు భవిష్య త్తులో పెద్దయ్యాక విజ్ఞానంతో పాటు వినయం కూడా కలిగినవాడు అవ్వాలి అంటే ఇలా తల్లిదండ్రుల ప్రేమకు దూరం చేయకూడదురా.


 ఆ లేత మనసు మానసికంగా కృంగిపోతుందిరా. ఈ లేత వయసులో ప్రసన్నమైన బీజాలు పడవలసిన వాడి మెదడు బండరాళ్ల నిర్మాణం తో నిండిపోతుందిరా. అప్పటినుండి పెరుగుతూ వాడు చేసే ఆలోచనలన్నీ ప్రశాంతంగా మాత్రం ఉండవు. అలాంటివాళ్లు ప్రపంచ స్థాయిలో విజయాలు సాధించగలరేమో కానీ తమ కుటుంబం పట్ల మాత్రం ప్రేమాభిమానాలు పంచలేరు. వాళ్లు కూడా పొందలేరు. స్వానుభవంతో కొన్ని విషయాలు నాకు తెలుసు కనుక పెద్దవాడిగా చెప్తున్నాను. 


నేను ఇలా చెప్తే నేటి అమ్మానాన్నలు అందరూ రోడ్డు మీద దుమ్ము ఎత్తి నా నెత్తి మీద పోస్తారు అని నాకు తెలుసు. ఉమ్మడి కుటుంబాలను వదిలేసి సిటీలలో ఏకాకి బ్రతుకులు బ్రతుకుతూ నూటికి 70 మంది ఈ విధానమే అవలంబిస్తున్నారు కూడా. లేకుంటే ఈ రోజుల్లో కుదరదు. వాళ్లు జీవితంలో అనుకున్న గోల్ చేరలేరు. ఈ విషయములో ఎవరి ఇష్టం వాళ్ళది. నేను కాదు అనడం లేదు. 


అయినప్పటికీ నువ్వు నా మనవడివి కనుక చెప్పే హక్కు, అధికారం ఉన్నాయి కనుక చెప్తున్నాను. ఒరేయ్ మనవడా. మీ అభీష్టానికి వ్యతిరేకంగా మిమ్మల్ని ఆ పల్లెటూరులోనే మగ్గిపోమని చెప్పడం లేదురా. నువ్వు ఎంత పెద్దసిటీలో ఉన్నా కొన్ని మానవ ధర్మాలను, పరిధులను అతిక్రమించకుండా బ్రతకమంటున్నాను అంతే. 


మీ సంపాదన, ఆలోచనలు కాస్త పక్కకు పెట్టి ఈ రెండున్నర సంవత్సరముల వయసులో ఉన్న మీ బిడ్డకు మీ తల్లిదండ్రుల ప్రేమ పంచుతూ.. పెంచితే బాగుంటుంది. కాస్త ఆలోచించుకోండి ఇక నేను వెళ్తాను. ''


అని చెప్పి వచ్చిన తాత పరమహంస తను కూడా తెచ్చుకున్న గుడ్డ సంచి భుజాన పెట్టుకొని చిన్నారి మధుమోహన్ ని ప్రేమపూర్వ కంగా ముద్దాడి ఆ భార్యాభర్తల దగ్గర సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. 


ఆ పెద్దాయన వెళ్లాక ధనుంజయ్ ప్రసన్న తల విది లించుకున్నారు. 


''ఈయనకే ఈయన ఎన్నైనా చెప్తాడు. నేటి దేశ కాల మాన పరిస్థితుల ప్రభావం బొత్తిగా అర్థం కాని ముసలి పీనుగ. ఈ అరవై ఏళ్ల వయసులో ఆ పల్లెటూరులో ఆ మట్టి అరుగు మీద చుట్టపీక కాల్చుకుంటూ రామా కృష్ణా అని కూర్చోకుండా ఎందుకు తిరుగులాట. ఇదిగో ప్రసన్న.. మా అన్నయ్య కొడుకు రామచంద్ర లాగా తెలుగు మీడియం చదువుకుంటూ.. అక్కడ దేవాలయాల్లోకి ప్రతిరోజు వెళ్లి ఆ పురాణాలు అది వింటూ ఎందుకు పనికిరాని ఏబిసిడి బ్రతుకు బ్రతకమంటాడు మా తాత. మా నాన్న పోయినా ఈయన గట్టిపిండంలా బాగానే ఉన్నాడు. 


చూసావుగా వచ్చినాయన కడుపునిండా మెక్కి వెళ్లొచ్చు కదా ఎందుకు ఈ సోది పురాణం అంతా మనకు చెప్పడం. ఈ ముసలి వాళ్లు ఇంతే.మన బుర్ర పాడు చేసేసాడు కదూ. అసలు మా అన్నయ్యతోనే కొంచెం టచింగ్ తగ్గించు కోవాలి. ఏమో మన బాబుని ఉన్నత స్థానంలోకి తీసుకు వెళ్ళబోతున్నాం అన్న విషయం తెలిసి.. మన ప్లాన్లు అభివృద్ధి చూసి కుళ్ళు కొని బాబు విషయంలో నా ప్రయత్నం విరమింప చేయాలని కావాలని ఈ తాతను ఇలా పంపించి ఉంటాడు. వాడు ఎదగడు మనల్ని ఎదగనివ్వడు. చి ఛి ఛి.. '' అన్నాడు భార్యతో. 


''అవునండి మీరు చెప్పినట్టు మీ అన్నయ్యతో మనం కొంచెం దూరంగా ఉందాం. లేకుంటే వాళ్ళ అబ్బాయి లాగే మన అబ్బాయిని కూడా తయారు చేస్తారు. మనకు ఉన్న ఒక్కగా నొక్క కొడుక్కి కూడా మనం న్యాయం చేయలేం. మా కొలీగ్ రమ్యలక్ష్మి వాళ్ళ పిన్ని కూడా భర్తను బంధువులందరికీ దూరంగా ఉంచి బాగా డెవలప్ అయ్యింది.. ప్రస్తుతం పిల్లలను ఫారిన్లో చదివించుకుంటున్నారు.. అని మా ఫ్రెండ్ రమ్యలక్ష్మీ నిన్న ఫోన్ చేసి చెప్పింది. '' అంటూ భర్తకు సమానంగా జవాబు కలిపింది. 


***


ఈ కాలచక్ర ఇంజన్ కు నట్టులు లూజ్ అయినా టైట్ అయినా తిరగటం మానదు కదా. 


దీని ఇంజన్ లో ఆయిల్, పెట్రోల్ పోసినా పొయ్యక పోయినా అలా తిరుగుతూనే ఉంటుంది. 


అలా ఇరవై సంవత్సరాలు గడిచిపోయింది. 


ఈ ఇరవై సంవత్సరాలలో పెద్దవాళ్లు బాగా పెద్ద వాళ్లు అయ్యారు. చిన్నవాళ్లు చిన్నవాళ్ళుగానే ఉండి పోయారు. 


ఎనభై సంవత్సరాలు ముసలి వయసుకు వచ్చిన పరమ హంస తన పుట్టిన ఊరు సుకేతనగర్ నుండి చేతికర్ర సహాయంతో ఆటోల మీద బస్సుల మీద తన బంధువుల ఇళ్లకు అలా సంవత్సరానికి ఒకసారీ తిరుగుతూనే ఉన్నాడు. వాళ్లు అడిగిన అడగక పోయినా తనకు తెలిసిన మంచిచెడ్డలు నీతులు, హితులు, సూక్తులు బోధన చేస్తూనే ఉన్నాడు. 


ఆరోజు ఆదివారం. 


ఆటోలో జయచంద్రబాద్ వచ్చి చేతికర్ర సహాయంతో నెమ్మదిగా దిగి ధనుంజయ, ప్రసన్నల ఇంటికి వచ్చాడు పరమహంస. 


అప్పటికే ధనుంజయ్ తన ఫ్లాట్ కు లిఫ్ట్ మీద వెళుతు న్నప్పుడు ఏదో ఇనప రాడ్డు తగిలి కాలి బొటనవేలు తొంభై  వంతులు విడిపోయింది. ఆ బాధతో బొటనవేలు గట్టిగా నొక్కి పట్టుకుని గబగబా ఇంట్లోకి వెళ్లిపోయి క్రిందకు వాలిపోయిన బొటనవేలు యథాస్థానానికి వంచి గుడ్డతో కట్టుకడుతూ.. భార్య సహాయం తో హాస్పిటల్ కి వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. రక్తం ఇంకా గడ్డ కట్టలేదు. ధారాపాతంగా కారిపోతూనే ఉంది. ఆ ప్రదేశం అంతా ఎర్రని ముగ్గులు పెట్టినట్టు అయిపోయింది. అప్పుడే వచ్చి ఇదంతా చూసిన పరమహంస చలించిపోయాడు. 


సంఘటన చూసి అధైర్య పడిపోయిన ప్రసన్న తనకు తెలిసిన ఇద్దరికి అర్జంటుగా రమ్మని విషయం చెప్పి ఫోన్లు చేసింది. వాళ్ళు అందుబాటులో లేరు. 


'' మీ అబ్బాయిని పిలవరా. అందరం కలిసి హాస్పిటల్ కి వెళదాం. '' చాలా గాబరాపడి అన్నాడు మనవడు ధనుంజయ్ తో.. పరమహంస. 


''నేను ఫోన్ చేశాను తాతయ్య గారు. ఆటలు పోటీలు టోర్నమెంట్స్ జరుగుతున్నాయట. కెప్టెన్ గా మా మధుమోహనే నెగ్గాడట. పెద్ద సన్మానసత్కారం చేసి వీడికి మెమొంటో ఇవ్వబోతున్నారట.. మన ప్రాంతం మంత్రిగారు. 


ఎంత పని ఉన్నా అర్జెంటుగా వచ్చేయరా అంటే.. ‘అమ్మ.. నాన్నకు తగిలింది పెద్ద దెబ్బ కాదేమో. జాగ్రత్తగా మీరిద్దరూ హాస్పటల్ కి వెళ్ళండి.. ఇప్పుడు నన్ను అసలు బాధ పెట్టవద్దు’ అన్నాడు. '' అంటూ చెప్పింది ధనుంజయ్ భార్య ప్రసన్న.. పరమ హంస వైపు చూస్తూ. 


'' అదేమిటి గాయం చాలా పెద్దది. చాలా కుట్లు కూడా పడతాయి. పెద్ద ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో కూడా. హాస్పటల్ కు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాము. నువ్వు తప్పకుండా వచ్చేయి అని చెప్పకపోయారా. నేను మీ కూడా వచ్చి మీకు సహాయం చేసే శక్తిలో లేను. ఈ కర్ర లేనిదే అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నాను. 


సరే ఇవేమీ జరిగేలా లేవు కానీ ఒక పని చేస్తాను.. 

ఇక్కడికి రెండు కిలోమీటర్లు కదా మన సుకేతనగర్. మీ అన్నయ్యకు నేను ఫోన్ చేస్తాను''' అంటూ ధనుంజయ్ కి చెప్పి ఫోన్ చేయబోయాడు పరమహంస. 


''తాత, వద్దు వద్దు.. ఇరవై సంవత్సరాల నుండి దూరంగా ఉంటున్నాం కదా. '' గాయంతో బాధపడుతూ కంగారుగా అన్నాడు ధనుంజయ్. 


''వాడు నీకు దూరంగా లేడురా. నువ్వే వాడిని దూరం గా పెట్టావు. వాడినే కాదు అందరు బంధువుల్ని దూరం పెట్టావు. నాలుగు ప్లాట్లు బాగానే సంపాదించావు. పొలాలు, పుట్టలు, ఫ్యాక్టరీలో షేర్లు.. నీ కొడుకుని డెవలప్ చేయడం విషయంలో భవిష్యత్తులో ఇంకా ముందు ముందుకు తీసుకెళ్లడం విషయంలో ప్రాపర్టీస్ బాగానే సంపాదించావు. ఇదంతా వాడి కోసమే కదా. అమ్మా నాన్నలుగా మీరిద్దరూ సక్సెస్ అయ్యారు కానీ.. ఇది కాదురా జీవన విధానం. ఉండు నేను ఫోన్ చేస్తాను కదా. '' అంటూ ధనుంజయ్ అన్న ప్రసన్నవదనరావు కి ఫోన్ చేశాడు.. పరమహంస. 


అవతల వాళ్లు ఫోనులో చెప్పిన విషయం తెలుసుకొని మళ్లీ ఇలా చెప్పడం మొదలు పెట్టాడు.. పరమహంస. 


'' నేను వచ్చేసరికి ఇంటి దగ్గర మీ అన్నయ్య బాగానే ఉన్నాడు. తర్వాత ఆయాసం, కడు పులో నొప్పి ఒక్కసారే వచ్చేయట. మీ అన్నయ్య, వాడి కొడుకు రామచంద్ర ప్రస్తుతం మనకు దగ్గరలోనే హాస్పిటల్ లో డాక్టర్ గారి ట్రీట్మెంట్లో ఉన్నారట. ఇక్కడి విషయం నేను చెప్పిన వెంటనే మీ అన్నయ్య ప్రసన్న వదనరావు.. ఆరోగ్యం బాగో లేని స్థితిలో ఉన్నప్పటికీ నీ విషయం తెలియగానే చాలా హైరానా పడి పోయి మాట్లాడేడు. తనని నర్సులు డాక్టరు చూస్తుంటారు కనుక వెంటనే తన కొడుకు రామచంద్రని ఇక్కడకు అర్జెంటుగా వెళ్ళ మని నిన్ను అక్కడకు తీసుకొచ్చేయమని చెప్పేసాడట. 


తన తండ్రి అంత కష్టంలో ఉన్న రామచంద్ర కూడా ఏమాత్రం ఆలోచించకుండా నీ గురించి వాడు మోపెడ్ మీద వచ్చేస్తున్నాడు. వాడు రెండు నిమిషాల్లో వచ్చేస్తాడు. వచ్చిన వెంటనే అందరం కలిసి అదే హాస్పిటల్కి వెళ్ళిపోదాం. ''


అని పరమహంస అంటుండగానే రామచంద్ర తన మోపెడ్ మీద వచ్చి తన బాబాయిని చూసి అతని దగ్గర కూర్చుని బాబాయ్ కాలు పట్టుకొని బొటన వేలు కట్టును జాగ్రత్తగా సరి చేసి బాబాయ్ కి ధైర్యం చెప్పి.. తన పిన్నిని, పరమహంస తాతను టాక్సీ మీద హాస్పి టల్ కి తీసుకెళ్లడానికి తన బాబాయిని రెండు చేతుల మీద ఎత్తుకొని బయటకు వచ్చాడు. 


అలా వాళ్ళు మెట్లు దిగుతుండగా ఎదురు వచ్చాడు తన బజాజ్ పల్సర్ మీద మధు మోహన్. చేతిలో పెద్ద మెమొంటోతో సరదాగా దిగి.. 


''సాధించాను డాడ్ సాధించాను. నీ కొడుకు ఎంత గొప్పవాడో ఇప్పటికైనా అర్థమైందా. మన రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడే నేను నెంబర్ వన్ అయిపోయాను. కెప్టెన్ గా ఈ టోర్నమెంట్లో విజయ దుందుభి మోగించి నందుకు నెక్స్ట్ ఆస్ట్రేలియా జట్టుతో పోటీ చేసే అవకాశం మా జట్టుకే ఇచ్చారు. ఇది కెప్టెన్ గా నేను సాధించిన విజయం. మీరు ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు కానీ ప్రపంచ చరిత్రలో ఈ విషయం సువర్ణాక్షరాలతో లిఖిస్తారు. ఎందుకంటే నేను చాలా చిన్న వయసు వాడిని కనుక. భలే కిక్కుగా ఉంది డాడ్. 


మీరు హాస్పిటల్ కి వెళ్లే తొందరలో ఉన్నట్టున్నారు. వెళ్లండి. డాక్టర్ గారు కి చూపించుకొని వచ్చేయండి. 


ఈలోగా నేను చాలా ఫోటోలు, వీడియోలు మా ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయాలి. యూట్యూబ్ ఫేస్బుక్ వాట్సాప్ లలో అప్లోడ్ చేయాలి. యాహూ.. తెల్ల వారులు నాకు బిజీ. ఫుల్ వర్క్. 


రేపు ఫ్రెండ్స్ అందరూ పెద్ద పార్టీ అంటున్నారు. ఆ అరేంజ్మెంట్స్ కూడా చూసుకోవాలి. ఒక లక్ష అయినా ఖర్చు పెట్టాలి. సరే.. మీరు వెళ్ళండి డాడ్. '''


అంటూ మహదానందంగా అతి పెద్ద మెమొంటో మోసుకుంటూ.. రెండవ అంతస్తులోని తన ఫ్లాట్ రూమ్ కి వెళ్ళిపోయాడు.. మిగిలిన ఎవరినీ పలకరించే తీరుబడిలేని మధుమోహన్. 


తన రక్తం పంచుకొని పుట్టిన కొడుకు, తను నీళ్లు పోస్తే పెరిగి మహావృక్షంగా మారిన కొడుకు ప్రవర్తనతో శరీరానికే కాదు, మనసుకు కూడా గాయం అయినట్లు అయిపోయాడు ధనుం జయ్. అతనితో పాటు అతని భార్య ప్రసన్న కూడా. 


ధనుంజయ్ ఈసారి తన తల పైకెత్తి తన తాత పర మహంస కళ్ళలోకి చూడ లేక బిక్క చచ్చిపోయాడు. రామచంద్ర నెమ్మదిగా తన బాబాయిని మోసుకు వెళ్లి టాక్సీ లో పరుండ పెట్టాడు. మిగిలిన అందరూ కూడా టాక్సీ ఎక్కారు. 


ఇప్పుడు ధనుంజయ్ అతని భార్య ప్రసన్న తమ కొడుకును.. మూడు సంవత్సరాల బాల్యం నుండి ఇప్పటి వరకు ఏ విధమైన అతి విధానాల్లో పెంచాము.. అన్నవిషయంలో మొట్టమొదటగా ఆలోచించడం మొదలుపెట్టారు.. హాస్పటల్ వైపు వేగంగా వెళుతున్న టాక్సీలో కూర్చుని. 


కానీ ఏముంది.. నేటితరం అమ్మానాన్నలుగా వాళ్ళిద్దరూ ఫెయిల్ అయిపోయినట్టు గ్రహించుకోగలిగారు.. ఇప్పుడు చెంపలు వాయించుకున్నా ప్రయోజనం

.. శూన్యం.. 


కాలం కొవ్వొత్తిలా కరిగిపోయింది కదా!!!


**

నల్లబాటి రాఘవేంద్ర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ree



ree


ree

రచయిత పరిచయం: నల్లబాటి రాఘవేంద్ర రావు


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


ముందుగా  " మన తెలుగు కథలు"  నిర్వాహకులకు నమస్సులు..

"రచయిత పరిచయం"..... ఇది చాలా ముఖ్యం.

రచయిత తన  గొప్పలు చెప్పుకోవడం కాదు గాని తన గతచరిత్ర వివరాలు అందరికీ తెలియ చేయటం అవసరమే. ఈ చర్య ఆ రచయితకు మానసికంగా ఎంతగానో ఉపయోగపడి అతను మరిన్ని మంచి మంచి రచనలు చేసి సమాజానికి అందించే అవకాశం ఉంది.. ఎంతో పెద్ద ఆలోచనతో అలాంటి 'మహా ప్రయత్నం'.. చేస్తున్న 'మన తెలుగు కథలు' కు మరొక్కసారి అభినందనలు.

పునాది....

-----------

ఏడు సంవత్సరాలు వయసు నాది. మా తండ్రి సుబ్బారావు గారు  ప్రోత్సాహంతో శ్రీ కృష్ణార్జున యుద్ధం అనే 10 నిమిషాల నాటకాన్ని నేనే రాసి కృష్ణుడి వేషం  నేనే వేసి దర్శకత్వం నేనే చేసి పెద్ద స్టేజి మీద  దసరా నవరాత్రులకు ప్రదర్శించాము.


ఆ తర్వాత భక్త ప్రహ్లాద లో ప్రహ్లాదుడు గా.. మరో నాటకంలో శ్రీరాముడుగా..   రచన దర్శకత్వం నాదే.. ఏడు సంవత్సరాల వయస్సు.


తర్వాత పదిహేను సంవత్సరాల వయసులో

టెన్త్ క్లాస్ యానివర్సరీ కి  15 మంది నటులతో నా దర్శకత్వం లో పెద్ద స్టేజి మీద నాటకం వేసాము.

అప్పుడే నేను రచయితను కావాలన్న

ఆశయం   మొగ్గ తొడిగింది.

నా గురించి..

---------------

50 సంవత్సరాల సుదీర్ఘ సాహితీ ప్రయాణం.

450  ప్రచురిత కథల రచన అనుభవం.

200 గేయాలు  నా కలం నుండి జాలువారాయి

200 కవితలు నా మేధస్సు నుండి ఉద్భవించాయి

20 రేడియో నాటికలు ప్రసారం.

10 టెలీఫిల్మ్ ల నిర్మాణం.

200 కామెడీ షార్ట్ స్కిట్స్

3  నవలలు దినపత్రికలలో


" దీపావళి జ్యోతి "అవార్డు,

"రైజింగ్స్టార్" అవార్డు

" తిలక్ స్మారక" అవార్డు... మరికొన్ని అవార్డులు.


ప్రస్తుత ట్రెండ్ అయిన  ఫేస్బుక్ లో  ముఖ్యమైన 15 గ్రూపుల్లో... ఇంకా అనేక వెబ్ సైట్లు, బ్లాగులు,ఆన్లైన్ పత్రికలలో యాక్టివ్ గా తరచు  నాకథలు,  కవితలు,గేయాలు, ముఖ్యంగా కామెడీ షార్ట్ స్కిట్స్ ప్రతి రోజూ దర్శనమిస్తూ ఉంటాయి..

రమారమి 75 అవార్డులు, రివార్డులు అందు కున్నాను... అని గర్వంగా చెప్పుకునే అవకాశం  కలగటం... ఆ చదువులతల్లి అనుగ్రహమే!

ఇదంతా ఒక్కసారిగా  మననం చేసుకుంటే...  'పడని సముద్ర కెరటం' లా... నూతనశక్తి మళ్లీ పుంజుకుంది.

ఇక నా విజయ ప్రయాణగాధ....

------+------------------------------

పేపర్లెస్ రచయితగా... ఒక కుగ్రామం లో పేరు ప్రఖ్యాతులు పొందిన  నా తండ్రి సుబ్బారావు గారు నా ఆలోచనలకు, రచనలకు ప్రాణప్రతిష్ట చేసిన ప్రథమగురువు. తల్లి వీరభద్రమ్మ  నాకే కాదు నా కథలకూ ప్రాణదాతే!!


తదుపరి రమారమి 50 సంవత్సరాల క్రితమే.. మా ఊరివాడైన నా జూనియర్ క్లాస్మేట్... నా స్నేహితుడు ఇప్పటి సినీ దర్శకుడు " వంశీ "... కథలు రాస్తూ...   నన్ను కూడా కథలు రాయ మని... చెప్తుండేవాడు. అప్పటి నుండి  ఎక్కువగా రాయడం మొదలు పెట్టాను.ఆ తర్వాత మా ఊరి  వారైన  సినీ గేయరచయిత

" అదృష్టదీపక్".. నా కథలు.. చదివి.. మెచ్చు కునే వారు.. దాంతో ఇంకా విరవిగా కథలు రాయడం మొదలు పెట్టాను.


1. మొదటి రచన 1975 నాటి ప్రఖ్యాత పత్రిక "ఆంధ్రసచిత్రవారపత్రిక" లో బుద్ధిలేనిమనిషి  కథ.


2. రేడియో నాటికలు  గొల్లపూడి మారుతీ రావు    గారి సమకాలంలో విరవిగా వచ్చాయి.


3. సినిమాకథలపోటీ లో అలనాటి "విజయచిత్ర"  ద్వితీయబహుమతి కథ..  "డిసెంబర్ 31 రాత్రి"


4. ఉగాది కథలపోటీ "ఆంధ్రభూమి" బహుమతి కథ


5. ఉగాది కథల పోటీలో "ఆంద్రజ్యోతి" బహు మతి కథ


6.  దీపావళి కథలు పోటీలో  "ఆంధ్రజ్యోతి" బహుమతి కథ.


7. అప్పాజోస్యుల( అమెరికా) నిర్వహించిన కథల పోటీలో "నలుగురితో నారాయణ".. ఆంధ్రప్రభ విశిష్ట కథ ప్రచురణ


8. అల్లూరి స్మారక జయంతి "కళావేదిక " కరప తిలక్ స్మారక అవార్డు కథ " బ్రతుకు జీవుడా"


9. "స్వాతి "   తానా అమెరికా కథల పోటీలో ప్రచురణ కు ఎన్నికైన కథ..." వైష్ణవమాయ."


10. రాష్ట్రస్థాయి కథలపోటీ హైదరాబాద్  "నిమ్స్"ద్వితీయ బహుమతి కథ..న్యాయనిర్ణేత శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి." బంగారు పేకమేడ"


11. "అనిల్ అవార్డ్" స్వాతి కన్సోలేషన్ బహు మతి..." అమృతం  కురిసింది"


12. సస్పెన్స్ కథల పోటీ "స్వాతి" లో ఎన్నికైన కథ


13. "పులికంటి సాహితీ సంస్థ" రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైన కథ..


14. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆరాధన" హైదరా బాద్ ద్వితీయ బహుమతి కథ.." అదిగో స్వర్ణ యుగం"  న్యాయనిర్ణేత   జ్ఞానపీఠ అవార్డు గ్రహీత.. శ్రీ రావూరి భరద్వాజ గారు.


15. "అభ్యుదయ ఫౌండేషన్" కాకినాడ రాష్ట్ర స్థాయి అత్యుత్తమ కథ.. " ఐదేళ్ల క్రితం " .


16. సి.పి.బ్రౌన్ "సాహితీ స్రవంతి".. ప్రత్యేక కథ

" ఇంద్రలోకం".


17.  కొమ్మూరి సాంబశివరావు స్మారక  సస్పెన్సు కథల పోటీలో  "నవ్య' ప్రచురణకు ఎన్నికైన కథ.


18. "వేలూరు పాణిగ్రహి" విజయవాడ "  గాంధీ తాత"  రాష్ట్రస్థాయి ద్వితీయ బహుమతి కథ.


19. 'కదలిక'... సర్వశిక్షఅభియాన్  రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో నిర్మింపబడిన అత్యున్నత టెలీ ఫిల్మ్... చిన్న సినిమా.


20. "అల కమ్యూనికేషన్" హైదరాబాద్ కథల పోటీలో ఎంపికైన కథ...." హృదయానికి శిక్ష".


21. రాష్ట్రస్థాయి కథలపోటీ "మైత్రేయ కళాసమితి" మెదక్.. పుస్తక సంకలనానికి ఎన్నికైన కథ. "బిందెడు నీళ్లు".


22. రాష్ట్ర స్థాయి కథల పోటీలు "జాగృతి" కన్సోలేషన్ బహుమతి  కథ "ఆలస్యం అమృతం విషం"


23. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ  "ఆంధ్ర ప్రదేశ్" పత్రిక ప్రత్యేక బహుమతి హాస్య కథ.


24. రాష్ట్రస్థాయి దీపావళి కథల పోటీ "ఆంధ్రప్రభ" ప్రచురణకు ఎంపికైన కథ.


25. దీపావళి కథల పోటీ "ఆంధ్రభూమి" ప్రచురణ కు ఎన్నికైన కథ.


26.  రాష్ట్రస్థాయికథల పోటీ "ఆప్కో ఫ్యాబ్రిక్స్" హైదరాబాద్ నిర్వహణ  పోటీ లో ఎన్నికైన కథ.


27. రాష్ట్రస్థాయి కథలపోటీ "ఆంధ్రప్రదేశ్పత్రిక" కు ఎన్నికైన హాస్యకథలు." చంద్రమండలంలో స్థలమును అమ్మబడును".


28.దీపావళి కథల పోటీ "జాగృతి" పత్రిక కు ఎన్నికైన కథ.


29. "హాస్యానందం" విశేష స్కిట్స్ కొరకు.. "రైజింగ్ స్టార్".. అవార్డు.


30 ఆంధ్రజ్యోతి "భావ తరంగం"  వారం వారం 30 కథలు.


31. "కళా దర్బార్"  రాజమండ్రి.. రాష్ట్రస్థాయి  కవితలపోటీలలు... 4 సంవత్సరాలు ఉత్తమ  కవిత్వానికి ప్రథమ బహుమతి...మూడుసార్లు.. ఉత్తమ కవిత్వానికి ద్వితీయ బహుమతి.


32.."హాసం" మాస పత్రిక లో ప్రచురింపబడిన  "చిరాకు దంపతులు చింతకాయ పచ్చడి"    కథ చదివిన చాలా మంది సినీ ప్రముఖులు  ఫోన్ కాల్స్ చేసి అభినందించడం.


33. ప్రఖ్యాత సిరివెన్నెల పత్రికలో  సిరివెన్నెల సీతా రామశాస్త్రి గారి నిర్వహణలో జానపద పాటల పోటీలో  ప్రథమ బహుమతి  పాటకు వారి నుండి  పత్రికాముఖంగా ప్రత్యేక ప్రశం సలు.. తదుపరి ఆ పాట అనేక   రంగస్థల ప్రదర్శనలు పొందడం.


34. విశేష కథలుగా  పేరు ప్రఖ్యాతులు తెచ్చిన కథలు

  నలుగురితోనారాయణ

  కొరడా దెబ్బలు

  అమృతం  కురిసింది.

  వైష్ణవమాయ

  ఐదేళ్ల క్రితం

  ఇంద్రలోకం

  బిందెడు నీళ్లు

  చంద్రమండలంలో స్థలములు అమ్మబడును

  డిసెంబర్ 31 రాత్రి

  మహాపాపాత్ముడు

 

35. రాజమండ్రి ,కాకినాడ ,విజయవాడ, విశాఖ పట్నం ,రామచంద్రపురంలో.. విశేష సన్మానాలు.


ప్రస్తుతం...


1. ఒక పరిశోధన నవల.. ఒక చారిత్రక నవల రాసే ప్రయత్నం


2. పరిషత్ నాటికలు జడ్జిగా..


3.  కొందరు సినీప్రముఖుల ప్రోత్సాహంతో..

సినిమాలకు కథ మాటలు స్క్రీన్ప్లే అందించే ప్రయత్నం.


4. ..  4 కథల సంపుటిలు... రెండు కవితా సంపుటిలు.. 1గేయ సంపుటి.. 2 కామెడీ షార్ట్ స్కిట్స్.. రెండు నాటికల సంపుటిలు..ఒక నవల ప్రచురణ తీసుకొచ్చే ప్రయత్నం.


5. ఒక ప్రింటెడ్ పత్రిక  ప్రారంభించే ఉద్దేశ్యం.


భార్య.. గోవిందీశ్వరి... హౌస్ వైఫ్.

కుమారుడు... వెంకట రామకృష్ణ .. బి.టెక్ సాఫ్ట్వేర్ ఇంజనీర్... మైక్రోసాఫ్ట్.. హైదరాబాద్.

కోడలు... మాధురీ లత..... ఎం ఫార్మసీ.

కుమార్తె.. సౌభాగ్య.. స్టూడెంట్.

మనుమరాలు.. ఆద్య... యాక్టివ్ బేబీ.

నా కథలను ఆదరించి తమ అమూల్య అభి ప్రాయాలు తెలియజేస్తున్న... రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ... వినమ్ర నమస్సులు.

నల్లబాటి రాఘవేంద్ర రావు 


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page