top of page
Original.png

జ్ఞానోదయం

#SripathiLalitha, #శ్రీపతిలలిత, #జ్ఞానోదయం, #Jnanodayam, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


ree

Jnanodayam - New Telugu Story Written By Sripathi Lalitha

Published In manatelugukathalu.com On 01/01/2026

జ్ఞానోదయంతెలుగు కథ 

రచన: శ్రీపతి లలిత

“అరవిందా! నాకు ఆఫీస్‌లో ఆలస్యమవుతుంది. నువ్వు బ్యాంకులో డబ్బులు తీసుకుని కరెంటుబిల్లు, టెలిఫోనుబిల్లు కట్టకూడదా “ విజయ్ ఆఫీసుకి బయలుదేరుతూ అన్నాడు.


“అబ్బా! మీకెన్నిసార్లు చెప్పానండి! ఏదో ఇంట్లో వండిపడెయ్యమంటే చేస్తాను,ఈ పనులు నావల్ల కాదు బాబూ” అంది భర్తకి టిఫిన్‌బాక్స్ అందిస్తూ.


“డిగ్రీ చదివావు ఎందుకూ? సడన్‌గా నాకేదైనా అయితే, ఇబ్బంది పడతావు… నేర్చుకోమంటే నేర్చుకోవు” విసుక్కుంటూ అన్నాడు విజయ్.


“బయలుదేరేటప్పుడు ఇలాంటి అశుభం మాటలు వద్దని ఎన్నిసార్లు చెప్పాను మీకు?” కోపంగా అంది అరవింద.


విజయ్ ప్రభుత్వోద్యోగి. ఇంకా ఆరునెలలు సర్వీస్ ఉంది. హిమాయత్‌నగర్‌లోని ఇంటికి, ఆఫీస్ దగ్గరే అయ్యేసరికి, కార్ ఉన్నా స్కూటర్ మీదే వెళ్తాడు. ఆఫీస్ అయిన పావుగంటలో ఇంట్లో ఉంటాడు.


విజయ్,అరవిందలకు, ఇద్దరు పిల్లలు. అమ్మాయి ప్రీతి, పెళ్లయ్యి అమెరికాలో ఉంటుంది. అబ్బాయి విశాల్, కోడలు అనూహ్య, ఇద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు. కొండాపూర్‌లో ఫ్లాట్ కొనుక్కుని ఉంటున్నారు.


రిటైర్ అయ్యాక, కొంతకాలం ప్రీతి దగ్గరికి,ఆతరువాత, పుణ్యక్షేత్రాలు చూడాలని, ఊటి, కులుమనాలి లాంటి హిల్ స్టేషన్లకు వెళ్ళాలని, ఇలా రోజుకొక ప్లాన్ వేస్తూ రిటైర్మెంట్‌కి రోజులు లెక్కపెట్టుకుంటున్నాడు విజయ్.


అరవిందకి ఇంటి పట్టున ఉండి, రకరకాల వంటలు చెయ్యడం, ఇల్లు చక్కగా పెట్టుకోవడం, శని, ఆదివారాలు కొడుకు,కోడలు వస్తే, వాళ్ళకిష్టమైన వంటలు ప్యాక్ చేసి ఇవ్వడం మహా ఇష్టం. లోపలికి వచ్చిన అరవింద, వంటింట్లో అన్నీ సర్దుకుంటంటే బెల్ మోగింది. ‘అబ్బా! ఈయన ఒకరు, ఎప్పుడూ ఏదో మర్చిపోతారు’ అనుకుంటూ తలుపు తీసేసరికి, పక్కింటి జానకి కనిపించింది. ఆమె భర్త కూడా విజయ్ ఆఫీసులోనే చేస్తారు.


“ఇంత పొద్దున్నే దయగలిగిందా నా మీద, ఉండు కాఫీ తెస్తా!” అని వెళ్తుంటే,

“లేదు అరవిందా! చీర మార్చుకునిరా! మనం బయటికి వెళ్ళాలి” అంది సీరియస్‌గా జానకి.


“బయటికా! విజయ్ చెప్పారా! నన్ను తీసుకెళ్లి బిల్లులు కట్టించమని” నవ్వుతూ అంది అరవింద.


“విజయ్‌కి చిన్న ఆక్సిడెంట్ అయిందిట, మావారు ఫోన్ చేసారు, మనం ఆసుపత్రికి వెళ్ళాలి” అన్న జానకి మాటలకి కూలబడింది అరవింద. అరవిందని తీసుకుని ఆసుపత్రికి వెళ్ళేసరికి, విశాల్,అనూహ్య ఏడుస్తూ చుట్టుకుపోయారు. అంతే! అరవిందకి స్పృహ తప్పిపోయింది. స్పృహ వచ్చాక మతిపోయినట్లయింది.

కార్యక్రమాలు అయ్యాక రావాల్సిన డబ్బులకోసం, కట్టవలసిన బిల్లులకోసం, విశాల్,

ఇన్సూరెన్సు, క్రెడిట్‌కార్డ్, అకౌంట్లు ఏ వివరాలు అడిగినా అరవింద సమాధానం ఒక్కటే “నాకేమీ తెలీదు”.


ప్రీతి కోప్పడితే, అనూహ్య విసుక్కుంది, “డిగ్రీ వరకు చదివి ఏం లాభం? ఇవాళ,రేపు అందరూ అన్నీ తెలుసుకోవాలి”


‘నిజమే! విజయ్ ఎన్నిసార్లు చెప్పినా మూర్ఖంగా “నాకవసరం లేదు” అని తీసిపారేసింది.


ఇక్కడే ఉంటే కోలుకోవడం కష్టమని ప్రీతి, తల్లిని ఆరునెలలపాటు అమెరికా తీసుకెళ్తానని ఏర్పాట్లు చేసి, తీసుకెళ్లింది.


వెళ్ళేటప్పుడు అన్నిటికీ అవసరమని, అరవింద దగ్గర్నుంచి, పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్నాడు విశాల్.


ఇల్లు తాళం వేసి, జానకికి తాళంచెవులు ఇచ్చి, మధ్యమధ్యలో, శుభ్రం చేయించమని చెప్పింది అరవింద.


ప్రీతికి, అప్పుడప్పుడు తల్లిచేత ఫోన్ చేయించమని చెప్పింది జానకి. అరవింద వెళ్లిన మొదట్లో, ఒకటి,రెండుసార్లు ఫోన్ చేసిందంతే.


నాలుగు నెలలు కాకుండానే వచ్చేస్తున్న, తల్లిని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్ వెళ్లాడు విశాల్. విమానం దిగిన అరవిందకి, కొడుకు విశాల్‌ని చూడగానే ప్రేమ ముంచుకు వచ్చింది.


“ఎలాఉన్నావు నాన్నా? అనూహ్య రాలేదా?ఎలాఉంది తను” అంటూ కొడుకు చుట్టూ చేతులు వేసింది.


“అందరం బావున్నాం అమ్మా! ప్రయాణం బాగా జరిగిందా?” అని లగేజ్ తీసుకుని కార్‌లో పెట్టి, తల్లి ఎక్కగానే కార్ స్టార్ట్ చేశాడు.


ఆరునెలల తర్వాత రావడంతో, ఊరిని కళ్ళనిండా చూసుకుంటున్న అరవింద,

కార్ ఆగేసరికి చుట్టూ చూసి, “ఇదేంటీ ఎక్కడికి వచ్చాము?” అంది.


ఆ ఏరియా హిమాయత్‌నగర్ కాదు, కొండాపూర్ కూడా కాదు.

“ఇది అత్తాపూర్ ఏరియా, మా ఫ్రెండ్ ఫ్లాట్ అమ్మా! మనఇంటికి రిపేర్ చేయించి రంగులు వేయిస్తున్నాను, అక్కడకి వెళ్ళడానికి టైం పడుతుంది” అన్నాడు ముక్తసరిగా.


“అలా అయితే కొండాపూర్ వెళ్ళేవాళ్లంగా?”


“నువ్వు, ఇంకా రెండు నెలల తర్వాత వస్తావని అనుకున్నాం. ఏదో ముఖ్యమైన పనిమీద మా బావమరిది, భార్య, మాఇంట్లో ఉన్నారు. సడన్‌గా వాళ్ళని వెళ్ళమంటే బావుండదు కదా! వాళ్ళు ఉంటే నీకు ఫ్రీగా ఉండదు. అందుకే హిమాయత్‌నగర్‌నుంచి సామాన్లు, ఇక్కడకి తెచ్చాం. నీకు వంట సామాను, కూరలు అన్నీ ఉన్నాయి. నేను ఆఫీస్‌కి వెళ్తున్నాను, నీకు ఏమైనా కావాలంటే ఫోన్ చెయ్యి తెస్తాను. నీ ఫోన్ ఇదిగో, ఈ డబ్బులు ఉంచు” అని ఒక అయిదు వేలు చేతిలో పెట్టి, మారుమాట లేకుండా వెళ్ళిపోయాడు విశాల్.


హతాసురాలైంది అరవింద. ‘అటు తమ ఇంటికీ కాక, కొడుకు ఇంటికీ కాక, ఎప్పుడూ చూడని, ఏరియాలో తనని పెట్టాడు. ఇప్పుడే కదా విమానం దిగింది, కనీసం ఇంటికి తీసుకెళ్లి, రెండు రోజుల తర్వాత తేవడం కూడా కాదు.


అసలు ఏమయింది, ఏం జరుగుతోంది? ప్రీతి, తండ్రి ఆఫీస్‌నుంచి రావాల్సిన డబ్బుల గురించి అడిగితే రాలేదన్నాడు, పెన్షన్ కూడా ఇంకా సెటిల్ అవలేదన్నాడు.

ఆలోచనల్లో లోపలికి వెళ్లి తను తెచ్చుకున్న బట్టల్లోనుంచి, వేరేవి తీసి, బాత్రూంలోకి వెళ్లి స్నానం చేసింది. ఫ్రిడ్జ్ తెరిచి చూస్తే, పాలప్యాకెట్‌లు, పెరుగు ప్యాకెట్, కూరలు కనిపించాయి.


కొన్ని సరుకుల ప్యాకెట్లు ఉన్నాయి.


‘ఏమిటీ జీవితం ఏమవుతోంది? విజయ్ ఉన్నన్ని రోజులూ… తండ్రితో గట్టిగా మాట్లాడడానికి భయపడే విశాల్, ఇలా చేశాడేమిటీ?’


ఆరునెలలు అమెరికాలో ఉందామనుకున్న తను, జానకి ఫోనుతో ముందే వచ్చేసింది.

ఇంతలో హ్యాండ్‌బ్యాగ్‌లోని అమెరికా ఫోన్ మోగింది.


ప్రీతి, ”అమ్మా!నీ ఫోన్ రాలేదు ఎంత ఖంగారు పడుతున్నామో తెలుసా? విశాల్‌కి

చేస్తే, చేరింది అన్నాడు” అంది.


జరిగినదంతా చెప్పింది అరవింద. “సరే! ఫోన్ పెట్టెయ్యి, నేను, జానకిఆంటీతో మాట్లాడి, మళ్లీ చేస్తాను” అని ఒక అరగంటకి ఫోన్‌చేసి, తల్లికి ఏం చెయ్యాలో చెప్పింది.


ప్రీతితో మాట్లాడాక అరవిందకి కొంత ధైర్యం వచ్చింది.

కొద్దిగా పెరుగన్నం తిని పడుకుంది. లేచేసరికి తెల్లారి నాలుగు. కాసేపు ఎక్కడ ఉన్నదీ అర్థమవలేదు.

ఒకసారి జరిగినది మొత్తం గుర్తు తెచ్చుకుంది.

ఒకసారి అమెరికా ఫోన్ చూసింది. ప్రీతి చాలా మెసేజ్‌లు పెట్టింది. కొన్ని ఫోన్ నంబర్లు, కొన్ని పేర్లు,అడ్రస్‌లు పెట్టింది. విశాల్ తనకు ఇచ్చిన ఫోన్‌కి, మిస్డ్‌కాల్ కానీ మెసేజ్ కానీ లేదు.


తను త్వరపడకపోతే లాభంలేదు అనుకుని, స్నానం,టిఫిన్ చేసి టైం చూస్తే ఎనిమిది అయింది.


పర్స్‌లో డబ్బులు, రెండు ఫోన్లు పెట్టుకుని, తలుపు తాళం వేసి బయటికి వచ్చింది.

ఎదురు ఫ్లాట్‌లో ఒక మధ్యవయస్కురాలు బయటికి వచ్చింది.


పలకరింపుగా నవ్వి “ఈ ఫ్లాట్ కూడా మాదే, మీ అబ్బాయి చెప్పాడు… అక్కడ ఫ్లాట్స్ అవడానికి రెండేళ్ళు పడుతుందని, అప్పటి వరకు మీరు ఇక్కడే ఉంటారని” అంది.

తెలిసిన సంగతే అయినా, అరవిందకి షాక్ తగిలింది. ‘అమాయకంగా ఉన్న తనని, విశాల్ ఎంత మోసం చేస్తున్నాడు’


“అవునండి! ఈ ఏరియాకి రావాలంటే ఆటోవాళ్ళకి అడ్రస్ ఏంచెప్పాలి?” అడిగింది.


కిందకి వెళ్లి ఆటో ఎక్కి అడ్రస్ చెప్పింది. సరిగ్గా జానకి ఇంటిముందు దిగింది.

“ఎప్పుడు వచ్చావు?” అంటూ జానకి నవ్వుతూ స్వాగతం చెప్పింది.


“నిన్ననే! రామ్మోహన్‌గారు ఉన్నారా ఇంట్లో?” అంటుండగానే జానకి భర్త బయటికి వచ్చారు, “ఎలా ఉన్నారమ్మా?” అంటూ.


అరవింద “ ఇల్లు పడగొట్టి, ఫ్లాట్స్ కట్టడానికి పర్మిషన్ కోసం, బిల్డర్ అప్లై చేశారని చెప్పి, మీరిద్దరూ నాకు చాలా సాయం చేశారు, లేదంటే నా బతుకు బజారున పడేది” చేతులు జోడించి, అయోమయంగా చూస్తున ఆ ఇద్దరికీ అసలు విషయం చెప్పింది.

“నేను ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా, విశాల్ ఆ ఇల్లు డెవలప్మెంట్‌కి తన బావమరిదికి ఇచ్చాడు, ఇద్దరూ, చెరో అయిదు ఫ్లాట్స్ తీసుకుని అమ్ముకుందామనుకున్నారు, ఆ వార్త ప్రీతికి తెలిసి నన్ను వెంటనే పంపింది.


అన్నీ మీతో ఇప్పుడు మాట్లాడుతుంది, లాయర్‌ని కూడా తనే కాంటాక్ట్ చేసింది. మీరు నాకు తోడు రండి, ఇంకా ఆఫీస్ డబ్బులు కూడా నాకే వచ్చేట్లు చెయ్యండి”


“ఎంత మోసం! కొన్ని కాగితాల మీద మీ సంతకాలు కావలసి వచ్చి విజయ్‌కి రావాల్సిన డబ్బులు ఇంకా బ్యాంకులో వేయలేదు. పెన్షన్ మాత్రం సెటిల్ చేసి అకౌంట్‌లో వేస్తున్నాం. ఇంటి విషయం కూడా మీకు చెప్పి చేస్తున్నాను అన్నాడు విశాల్, తల్లిని ఇలా మోసం చెయ్యడం ఏంటి? అంత డబ్బు మనిషి అయ్యాడా?” రామమోహన్ బాధగా అన్నాడు.


ఈలోగా ప్రీతి ఫోన్ చేసి రామ్మోహన్‌తో చెయ్యాల్సిన పనులు చెప్పింది.

“తప్పకుండా ప్రీతీ! నా చేతనైన సాయం చేస్తాను” అని రామ్మోహన్,

“మనం ముందు లాయర్ దగ్గరికి వెళ్దాం” అంటూ డ్రెస్ మార్చుకోడానికి లోపలికి వెళ్ళాడు.


“ఇక్కడికి వచ్చేయి అరవిందా! ఒక్కదానివి ఏం ఉంటావు? తెలియని స్థలంలో” ఆదరంగా అంది జానకి.


“లేదు! విశాల్, నేను వాడిని నమ్మాను అనుకోవాలి, మీ ఇంటికి కాదు… నెలలో నా ఇంటికి వస్తాను”స్ధిరంగా అంది.


“విజయ్ ఎన్నోసార్లు చెప్పారు, నన్ను ఫైనాన్స్ విషయాలు తెలుసుకోమని, నేనే పట్టించుకోలేదు. ఒకరకంగా అమెరికా వెళ్లడం మంచిది అయింది, ప్రీతి,అల్లుడు, ఇంకా అక్కడ ఫ్రెండ్స్ నాకు ఎన్నో రకాలుగా ప్రపంచం గురించి, ఎలా మనం స్వంతవాళ్ళ చేతుల్లోనే మోసపోతామో అన్నీ చెప్పారు. బ్యాంకు, ఏటీఎం, క్రెడిట్‌కార్డ్ వాడటం, ఫోన్‌తో డబ్బులు ఎలా తీసుకోవాలి అన్నవి ప్రీతి నేర్పించింది. ఆ జ్ఞానంతో నా ఇంటిని నేను దక్కించుకుంటాను” ధైర్యంగా అంది అరవింద.


రామ్మోహన్‌తో కలిసి ముందుగా లాయర్ దగ్గరికి, తర్వాత విజయ్ ఆఫీస్‌కి, బ్యాంకుకి వెళ్ళి, అంతకుముందు ఇచ్చిన పవర్ ఆఫ్ అటార్నీ చెల్లదని, రావాల్సిన పైకం తన ఖాతాలో వెయ్యాలని, ఎక్కడికక్కడ అవసరమైన అర్జీలు ఇచ్చి వచ్చింది.


బ్యాంకులో ఉన్న డబ్బులు తీసుకుని, ముందటి ఏటీఎంకార్డ్ క్యాన్సిల్ చేసి, కొత్తది తీసుకుంది.


అమెరికా నుంచి తెచ్చిన ఫోన్‌కి కొత్త నంబర్ తీసుకుంది.

మధ్యలో జానకి వాళ్ల ఇంట్లో భోజనం చేసినా, మళ్లీ లాయర్ దగ్గరికి వెళ్లి, ఇల్లు స్వాధీనానికి కావాల్సిన ఏర్పాటు చేశారు.

అదృష్టవశాత్తు, మంచి రోజులు లేవని ఇల్లు ఇంకా పడగొట్టలేదు. చుట్టూ ప్లాస్టిక్ షీట్స్ వేసి ఉంచారు.


సాయంత్రం మళ్లీ ఫ్లాట్‌కి వెళ్లింది అరవింద.

తల్లి తెగ ఫోన్లు చేసి విసిగిస్తుంది అనుకున్న విశాల్, ఒక్క ఫోన్ కూడా చెయ్యకపోవడంతో తల్లి ఇంటికి వచ్చాడు.


“ఏమీ ఎరగనట్లు మామూలుగా పలకరించింది, “టీ తాగుతావా విశాల్! మన ఇంటికి ఏ రిపేర్లు చేయిస్తున్నావూ, ఏ రంగులు వేయిస్తున్నారు. రేపు ఒకసారి వెళదామా!” తత్తరపడ్డాడు.


“నిన్నేగా వచ్చావు రెస్ట్ తీసుకో!”


“మీ బావమరిది వెళ్ళాక నాలుగు రోజులు కొండాపూర్ లో ఉంటాను. నాకు ఇక్కడ కొత్త కదా, భయంగా ఉంది” తల్లి అమాయకపు మొహం చూసి జాలేసింది విశాల్‌కి, కానీ ఫ్లాట్స్ అమ్మితే వచ్చే డబ్బు గుర్తొచ్చి,

“వాళ్ళు ఏదో పెద్ద పనిమీద వచ్చారు, ఇంకో ఇల్లు తీసుకుని వెళ్తారు, అప్పుడు వద్దుగాని, నేను వెళ్తాను” హడావిడిగా లేచాడు.


మర్నాడు లాయర్, అరవిందతో కలిసి అధికారి దగ్గరికి వెళ్లి, అరవిందకి తెలియకుండా ఆమె ఇంటిని పడగొట్టే ప్లాన్ చేస్తున్నారని, 2007 సీనియర్ సిటిజెన్ ఆక్ట్ కింద, అది ఆపించి, ఆమె ఇల్లు ఆమెకి అప్పగించాలని వినతి సమర్పించారు.


ఇంటి తాళాలు తన దగ్గరే ఉన్నాయని, డూప్లికేట్ జానకికి ఇస్తే, తల్లి చెప్పిందని అబద్ధం చెప్పి విశాల్ అవి తీసుకున్నాడని అరవింద అసలు తాళాలు చూపించింది.

అన్నీ వివరంగా చూసి ఏ చర్య తీసుకునేది చెప్తామని, ఒక వారం తర్వాత రమ్మని ఆఫీసర్ చెప్పారు.


“ఈ వారంలో అక్కడ పని మొదలు పెట్టకుండా చర్య తీసుకోండి” అరవింద బతిమిలాడింది.


“వాళ్ళు ఒకసారి పగలగొడితే నేను మళ్లీ కట్టుకోలేను” కంటనీరు పెట్టింది.


ఆమె బాధ చూడలేని ఆఫీసర్, ముందు ఆ ఇంటికి ప్రభుత్వం వారి ద్వారా సీలు వేసి, తర్వాత చర్య తీసుకుంటామని వచ్చి ఆ ఇంటికి సీలు వేశారు. ఇలా వేశాక ఆ ఇల్లు ముట్టుకునే అధికారం, ఎవరికీ లేదని చెప్పడంతో అరవింద ధైర్యంగా ఇంటికి వెళ్లింది.

మధ్యలో ఒక రోజు విశాల్ “ఏమైనా కావాలా?” అని ఫోన్ చేశాడు.


“ఏమీ వద్దు, ఇంటి పనులు ఎంతవరకు అయ్యాయి? ఒకసారి నన్ను అక్కడికి తీసుకు వెళ్ళు?” అన్న తల్లి దగ్గరికి రాకుండా ‘బిజీ’ అని చెప్పి తప్పించుకున్నాడు.


ఒక వారం తర్వాత, ఆఫీసర్ ఇంటి దగ్గరకి రమ్మన్నారని, రామ్మోహన్ చెప్పాడు.

ఇంటికి వెళ్లేసరికి, అక్కడ ఆఫీసర్‌తో పాటు, ఒకరిద్దరు ఉద్యోగులు, ఒక పోలీస్ అధికారి, ఒక పత్రిక వారు ఉన్నారు.


వాళ్ళందరి సమక్షంలో, ఆ ఇల్లు అరవిందకి చెందిందని, దానిని పడగొట్టడానికి ఆమె అనుమతి లేదని చెప్పి, ఇల్లు అరవిందకి అప్పచెప్పారు. అక్కడ ఫ్లాట్ కడదామనుకున్న బిల్డర్‌కి నోటీస్ పంపామని చెప్పారు.

అరవింద సంతోషానికి హద్దులు లేవు. జానకిని పిలిచి దేవుడి బొమ్మ పెట్టి, దీపం పెట్టి, కొబ్బరికాయ కొట్టింది.


రామ్మోహన్, లారీ వాళ్ళని పిలిచి, అరవింద సామాను తెమ్మన్నాడు. ఎలాగో అరవింద పాకింగ్ విప్పలేదు కనక తేలికైంది.

ఎదురింటి ఆవిడకి ఫ్లాట్ తాళాలు ఇచ్చి, ఇల్లు ఖాళీ చేశామని చెప్పారు.

మర్నాటికల్లా, అరవింద ఇల్లంతా సర్దుకుని హాయిగా పడుకుంది.


కాసేపటికి విశాల్ వస్తూనే కోపంగా, “ఏంటి ఆ ఇల్లు ఎందుకు ఖాళీ చేశావు? ఇది పడగొట్టి ఫ్లాట్స్ కడదామని నేను, మా బావమరిది ప్లాన్లు వేస్తే అంతా చెడగొట్టావు!” అన్నాడు.


“నువ్వెవడివిరా ప్లాన్లు వెయ్యడానికి? ఇది నా ఇల్లు. మీ నాన్న నా పేరుమీద వీలు వ్రాసారు. ఇప్పుడు నా ఇష్టం, ఇది ఉంచుకున్నా, అమ్ముకున్నా నా ఇష్టప్రకారం చేయచ్చు.


నాకు నీ సాయం వద్దు, నీ డబ్బులు వద్దు. నేను అన్నీ సెటిల్ చేసుకున్నాను. నా అకౌంట్ ఆపరేట్ చెయ్యడానికి నీకు అధికారం లేదు. నీ దగ్గర ఉన్న ఏ కార్డ్ పనిచెయ్యదు, నాకు రావాల్సిన డబ్బులన్నీ నా అకౌంట్‌లో పడతాయి” కాళికాదేవిలా అరుస్తున్న తల్లిని చూసి నివ్వెరపోయాడు.


“అబ్బో! చాలా తెలివి తెచ్చుకున్నావు, ప్రీతి నేర్పించిందా ఇవన్నీ? ఇల్లు కాజేయడానికి ప్లాన్ వేస్తోంది” ఉక్రోషంగా అన్నాడు.


“మీ నాన్న ఎన్నిసార్లు చెప్పినా తెలుసుకోనందుకు, ఇంత అనుభవించాను. అవును తెలివి తెచ్చుకున్నాను, నాకు జ్ఞానోదయం అయింది. నాకు ఇప్పుడు అన్నీ తెలుసు. ఎవరు ఏ ప్లాన్లు వేసినా సాగవు. నువ్వు మళ్లీ గొడవ చేస్తే, 2007 సీనియర్ సిటిజెన్ ఆక్ట్ ప్రకారం, నీ మీద కేసు వేస్తాను! అప్పుడు, ఉద్యోగం పోయి ఊచలు లెక్కపెట్టాలి. ఇప్పుడు, నీ పెళ్ళాం, బావమరిది, ఏం చేస్తారో ప్లాన్ చెయ్యమను. ఇంకోసారి వచ్చి బెదిరిస్తే, పోలీసులను పిలిపిస్తాను. ఇంక నాకు నీ ముఖం చూపకు” అంటూ తలుపులు వేసింది.


విశాల్ వెళ్ళగానే, ఏడుస్తూ కూలబడిపోయింది అరవింద.

‘భర్త ఉన్నప్పుడు అన్నిసార్లు చెప్పినా అవని జ్ఞానోదయం, ఆయన పోయాక జరిగింది. దేవుడి దయవల్ల కూతురు,జానకి వాళ్ళు, తన పక్షాన ఉన్నారు, లేదంటే తన గతి అధోగతే’


ఆలస్యంగానైనా కళ్ళు తెరిచినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకుంది.


                                    సమాప్తం

 


శ్రీపతి లలిత  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత్రి పరిచయం:

నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.

నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.

నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.

నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.

అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.

నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.

ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.

నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.

పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.

bottom of page