కల నిజమయ్యేనా!
- B.N.Satyanarayana

- 17 hours ago
- 4 min read

Ka Nijamayena! - Telugu Social Story | B. N. Satyanarayana
కల నిజమయ్యేనా! - తెలుగు సామాజిక కథ | B. N. సత్యనారాయణ
Published in manatelugukathalu.com on 05/09/2026
“కల నిజమయ్యేనా!” కథలోని స్వప్నం కేవలం కల్పిత సంఘటన మాత్రమే కాదు; సమాజంలో సమానత్వం, న్యాయం, అవకాశాల కోసం వినిపించే ఒక ఆలోచనాత్మక స్వరం. ఈ సామాజిక చైతన్య కథను చదివి, మీ అభిప్రాయాలను పంచుకోండి.
గమనిక / Disclaimer: ఈ కథ పూర్తిగా రచయిత సృజనాత్మక ఆలోచనల ఆధారంగా రూపొందించబడిన సామాజిక కథ. ఇందులోని పాత్రలు, సంఘటనలు, సంభాషణలు కల్పితం. రిజర్వేషన్లు, OBC, EWS, ఆదాయ పరిమితులు, శాతాలు మరియు ప్రభుత్వ విధానాలకు సంబంధించిన ప్రస్తావనలు కథా సందర్భంలో రచయిత వ్యక్తీకరించిన అభిప్రాయాలు, వాదనలుగా మాత్రమే పరిగణించాలి. ఇవి ప్రస్తుత చట్టాలు లేదా ప్రభుత్వ విధానాలపై అధికారిక సమాచారంగా భావించరాదు. ఏ వర్గాన్ని, వ్యక్తిని, రాజకీయ పార్టీని లేదా ప్రభుత్వాన్ని కించపరచడం, ద్వేషాన్ని ప్రోత్సహించడం ఈ కథ ఉద్దేశం కాదు. సామాజిక సమానత్వం, అవకాశాలు మరియు సమన్యాయం గురించి పాఠకుల్లో ఆలోచన రేకెత్తించడం మాత్రమే కథ ఉద్దేశం.
రవి ఒక చిరుద్యోగి.
అన్యాయాలను, అక్రమాలను తరచు నిరసిస్తూనే ఉంటాడు.
పరిస్థితుల కారణంగా వాటిని బహిరంగంగా వ్యతిరేకించలేక పోతున్న అసహాయుడు.
అది ఒక రాత్రి సమయం.
రవి గాఢంగా నిద్రపోతున్నాడు.
ఆ నిద్రలో….
ఒక కల….
ఆ కలలో...
తమ ఊరిలో ఒక మంత్రిగారు ఒక వంతెనకు ప్రారంభోత్సవం చేసిన సందర్భంలో..
వారిని సత్కరించుకునేందుకు ఒక సన్మాన సభ ఏర్పాటు చేయబడింది.
ఆ సభలో మంత్రిగారు ఇలా తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు.
“మీ ఊరి అభివృద్ధికి ప్రభుత్వం ఎంతగానో కట్టుబడి ఉంది. అందుకే రోడ్లకు, కాలువలకు, వంతెనలకు… ఇలా పలు సేవలకు ఆపకుండా, ఆగకుండా నిధులు మంజూరు చేస్తోంది. ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ క్రమంలోనే మనం ఇప్పుడు ఈ వంతెన నిర్మించుకోగలిగాం.
అలా మీ అభివృద్ధికి తోడ్పాటునందిస్తున్న ప్రభుత్వానికి ఎల్లప్పుడూ మీరు తోడుగా ఉండాలి.
ఈ సందర్భంలో మీకొక విషయాన్ని గుర్తు చేస్తున్నాను.
మీ అందరికీ తెలిసినదే.
త్వరలో మనకు ఎన్నికలు రానై ఉన్నాయి.
మీ అమూల్యమైన ఓట్లను మళ్ళీ మా పార్టీకే వేసి, ఈ మీ ప్రభుత్వాన్నే మరల గెలిపించాలని కోరి ప్రార్థిస్తున్నాను” అంటూ...
మంత్రిగారు తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ...
కొంతసేపట్లో ముగించారు.
అప్పుడు సభలో నుండి ఒక యువకుడు లేచి...
“అయ్యా!
ఈ సందర్భంలో మా సమస్యల్ని కొన్నింటిని తమకు విన్నవించుకోవాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆ అవకాశం ఇప్పించవలసిందిగా వేడుకుంటున్నాను” అన్నాడు.
దానికి మంత్రిగారు చిన్నగా నవ్వుతూ తన సమ్మతిని తెలుపుతూ ఆ యువకుడిని వేదిక పైకి రావలసిందిగా పిలిచారు.
వెళ్తున్న ఆ యువకుడిని చూసి రవి ఆశ్చర్యపోయాడు.
అతడెవరో కాదు… తన మిత్రుడు ఆనంద్.
ఆనంద్ ఒక నిరుద్యోగి.
ఉద్యోగం వేటలో విసిగి వేసారిపోయి ఉన్నాడు.
ఆనంద్ వేదిక పైకి వెళ్లాడు.
మైక్ ముందు నిలబడి ముందుగా మంత్రి గారికి వినయంగా నమస్కారాలు తెలియజేశాడు. తర్వాత సభకు విచ్చేసిన పెద్దలకు, సభలో ఉన్న వారందరికీ వందనాలు తెలియజేసి మాట్లాడడం మొదలుపెట్టాడు.
“మంత్రివర్యులకు నేనిప్పుడొక ముఖ్యమైన విషయం విన్నవించుకోవాలనుకుంటున్నాను.
ప్రభుత్వం బలహీన వర్గాలను ‘ఓ.బి.సి’లుగా గుర్తించి వారికి విద్య, ఉద్యోగాలలో కొన్ని రిజర్వేషన్లు కల్పించింది. వారిలో సంవత్సరానికి రెండు లక్షల రూపాయల లోపు ఆదాయం గల వారిని ‘పేదలు’గా గుర్తించి వారికి పలు ‘సంక్షేమ పథకాలు’ అందిస్తోంది.
ఇది సంతోషకరమైన విషయమే.”
ఆ మాటలు వింటున్న మంత్రిగారి ముఖంలో చిరునవ్వు, కొద్దిపాటి గర్వం కనిపించాయి.
“ఈ మధ్య ప్రభుత్వం కొత్తగా ‘ఉన్నత వర్గాలలో పేదల’ కొరకు ‘ఇ.డబ్ల్యు.ఎస్’ అనే పేరుతో కొత్త రిజర్వేషన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం కింద జనాభాలో 5% లోపు జనాభా గల ఉన్నత వర్గాల వారిలో సంవత్సరానికి ‘ఎనిమిది లక్షల రూపాయల’ లోపు ఆదాయం, ‘ఐదు ఎకరాల లోపు భూమి’ గల వారిని ‘పేదలు’గా గుర్తించి (అంటే ఓ.బి.సిల కంటే నాలుగు రెట్లు అధిక ఆదాయం గల వారికి) వారికి విద్యాలయాల్లోను, ఉద్యోగాల్లోను 10% అంటే వారి జనాభా శాతం కంటే రెట్టింపు రిజర్వేషన్లు కల్పించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
అదే జనాభాలో 50%కి పైబడి ఉన్న ‘ఓ.బి.సి’లకు కేవలం 26% అంటే నాలుగవ వంతు మాత్రమే రిజర్వేషన్లు అమలుపరుస్తూ ప్రభుత్వం పక్షపాత ధోరణి అవలంబిస్తోంది. రిజర్వేషన్ల శాతాన్ని పెంచవలసిందిగా ఓ.బి.సి వర్గాలు ప్రభుత్వానికి ఎన్ని విజ్ఞప్తులు చేసుకున్నా, మొరలు పెట్టుకున్నా అది వినిపించుకోవడమే లేదు. ఇది చాలా అన్యాయం అనే చెప్పవచ్చు.
‘ఓ.బి.సి’లకు ‘ఇ.డబ్ల్యు.ఎస్’ వారికి మధ్య ఇంత వ్యత్యాసాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం ఆలోచన ఏమిటో? ఆంతర్యం ఏమిటో? ఈ వ్యత్యాసం కారణంగా ‘ఓ.బి.సి’లు ఎంతగా నష్టపోతున్నారో ఫలితాలన్నీ తెలియజేస్తూనే ఉన్నాయి.
‘రిజర్వేషన్ల’ విధానంలో ప్రభుత్వం ఇలా ద్వంద్వ నీతిని అనుసరించడం ఆందోళన కలిగిస్తోంది. దీంతో సమాజంలో అసమానతలు మరింతగా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ‘ఓ.బి.సి’లు అటు చదువులకు, ఇటు ప్రభుత్వ ఉద్యోగాలకు మరింత దూరమైపోతున్నారు అన్నది ఎంతో నిజం. ఇందుకు ఉదాహరణగా ఈ విషయంలో నాకు జరిగిన నష్టాన్నే మీకు తెలియజేయాలనుకుంటున్నాను.
గత నెలలో నేనొక ప్రభుత్వ ఉద్యోగానికై ఇంటర్వ్యూకి హాజరయ్యాను. అన్ని పరీక్షల్లోను అధిక మార్కులు సాధించి అందరి మన్ననలు పొందగలిగాను. నేనూ ‘ఓ.బి.సి’కి చెందిన వాడినే కావడంతో తప్పకుండా ఆ ఉద్యోగం నాకే లభిస్తుందన్న పూర్తి విశ్వాసంతో ఉన్న నాకు… ఆ ఉద్యోగం నాకు కాకుండా వేరొకరికి కేటాయించారనే పిడుగులాంటి వార్త ఒకటి తెలియవచ్చింది.
దానితో నాలో ఆందోళన పెరిగిపోయింది.
ఫలితాలపై వివరాలు సేకరించాను.
నాకంటే తక్కువ మార్కులు వచ్చిన ‘ఇ.డబ్ల్యు.ఎస్’ కేటగిరీకి చెందిన వేరొక అభ్యర్థి… వారికి కల్పించబడ్డ ‘అధిక శాతం’ రిజర్వేషన్ల ఆధారంగా ఆ ఉద్యోగానికి ఎంపిక కాబడ్డాడని తెలిసి… దిగ్భ్రాంతికి గురయ్యాను.
గతంలో ‘ఓ.బి.సి’లకు కల్పించబడ్డ రిజర్వేషన్ల వల్ల జీవితాల్లో తామెంతగా నష్టపోతున్నామో అంటూ గగ్గోలు పెడుతూ గోల చేసిన వారు ఇప్పుడు… నాకు జరిగిన ఈ అన్యాయానికి ఏం సమాధానం చెబుతారు? నాకు జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు?
ఇలా నాలా విద్య, ఉద్యోగాల్లో నష్టపోతున్న వారెంతమందో?!
ఈ సందర్భంలో ప్రభుత్వానికి నాదొక చిన్న విన్నపం.
సమాజంలో పెరిగిపోతున్న అంతరాలను, అసమానతలను సరిదిద్దవలసిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. కాబట్టి ఈ క్రమంలో ‘ఓ.బి.సి’లను, ‘ఇ.డబ్ల్యు.ఎస్’లను ఒకే కేటగిరీ కిందకు తీసుకువచ్చి, వారి వారి జనాభా దామాషా ప్రకారం అందరికీ ఒకే విధమైన రిజర్వేషన్ల విధానాన్ని రూపొందించి, సంవత్సరానికి ‘ఎనిమిది లక్షల రూపాయల లోపు’ ఆదాయం గల వారందరినీ ‘పేదలు’గా గుర్తించి అన్ని వర్గాల వారికి రిజర్వేషన్లు అందేలా చట్టాన్ని సవరించి అమలుపరిచిన నాడు అందరికీ సమన్యాయం లభిస్తుంది. సమాజంలో అసమానతలు తొలగిపోతాయి. సమానత్వం పాదుకుంటుంది.
ఈ సందర్భంగా మంత్రివర్యులకు ఇదే నా విజ్ఞప్తి.
గౌరవనీయులైన మంత్రిగారు నా ఈ విజ్ఞప్తిని మన్నించి ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని, న్యాయం జరిపించాలని మనవి చేసుకుంటున్నాను”
అని తన మాటలు ముగించి, అందరికీ మరొకమారు వందనాలు అని చెప్పి వేదిక దిగిపోయాడు.
అది విన్న మంత్రిగారు ఒక్కసారిగా అవాక్కయిపోయారు.
రుమాలుతో ముఖం తుడుచుకుంటూ సభకు ఏం సమాధానం చెప్పాలో తెలియక నిశ్శబ్దంగా ఉండిపోయారు.
ఆనంద్ ప్రసంగానికి సభ అంతా చప్పట్లతో మారుమోగిపోయింది.
ఆ చప్పట్ల ధ్వని రవి చెవికి సోకినట్లు అనిపించడంతో రవి త్రుళ్లిపడి ఒక్కసారిగా లేచి కూర్చున్నాడు. గది అంతా బెడ్ ల్యాంప్ వెలుగు పరచినట్లుగా ఉంది. కిటికీ గుండా చూశాడు. అంతా చీకటి. అప్పుడు అర్థమయింది అతడికి “అది కలని”. తాను కలకన్నానని! అప్పుడు కొద్దిగా స్థిమితపడ్డాడు. దాహం కావడంతో ప్రక్కనే బాటిల్ ఉన్న నీళ్ళు తాగి, ఆ కలనే మననం చేసుకుంటూ మంచంపై వాలి నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
B. N. సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: నా పేరు B. N. సత్యనారాయణ. B.A.
( బొడ్డేడ నూక సత్యనారాయణ )
బి. ఎ.
వయసు: 75 సం॥లు
స్వస్థలం. : అనకాపల్లి. (ఆం॥ ప్ర.)
ప్రస్తుతం
హైదరాబాద్ లో
స్థిరపడ్డాను
వృత్తి. : ప్రైవేటు సంస్థల్లో
అక్కౌంటెంట్‌గా చేసి
రిటైర్ అయ్యాను
ప్రస్తుతం వ్యాపార
రంగంలో ఉన్నాను
ప్రవృత్తి. : సామాజిక రుగ్మతలపై
పత్రికలకు లేఖలు
రాయడం
రెండు సంపుటాలు కూడా
ప్రచురించడం జరిగింది
ఛిన్న కథలు వ్రాయడం
మొదలుపెట్టాను






Comments