'Kamadahanam' - New Telugu Article Written By Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 31/10/2023
'కామదహనం' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
కామం... అది ఒక మహావ్యసనం. కొందరి విషయంలో... ప్రతిదినం నవ్యత శాసిస్తుంది. ఆ వాంఛ తాగి సరదాగా కోరినవారితో గడపటం కొందరికి ఎంతో ఆనందం. అది పురుషులకే కాదు. పరిమితంగా కొందరు స్త్రీలకూనూ!...
“రేయ్ బాషా!... కారు ఆపు..." యజమాని కామరాజు ఆదేశం విని భాషా కారును ఆపి యజమాని ముఖంలోకి చూచాడు.
“రేయ్!... ఆ పిల్ల ఎవర్రా !..."
రోడ్డు ప్రక్కన నడిచి వెళుతున్న ఓ అమ్మాయిని చూచాడు బాషా.
"అమృతం కూతురు సార్!... కాలేజీకి వెళుతూ వుంది....” చెప్పాడు బాషా.
“అమృతం యిపుడు ఎలా వుందిరా !...”
“హోటల్ పెట్టుకొని బ్రతుకుతూ వుంది కదా సార్!..."
కామరాజు కొన్నిక్షణాలు ఆలోచించాడు.
"అమృతం హోటల్ వద్దకు పోనీరా !..." అన్నాడు.
“సార్! మీరు అక్కడికి!..." తన ఆశ్చర్యాన్ని... సందేహాన్ని వ్యక్తం చేశాడు బాషా.
“పనుంది పదరా!...” గద్దించినట్లు చెప్పాడు కామరాజు.
ఈ రాజుగారు ఆ గ్రామ సర్పంచ్. మంచి భవనం... భూములు, తోటలు, వున్నవాడు. తల్చుకొన్నది సాధించేవరకూ నిద్రపోడు. మంచి రసికుడు.
పదిహేను నిముషాల్లో బాషా కారును అమృతం హోటల్ ముందు ఆపాడు.
"వెళ్ళి అమృతాన్ని పిలుచుకొనిరా!...”
బాషా యజమాని ముఖంలోకి క్షణంసేపు చూచి, మౌనంగా హోటాల్ వైపుకు నడిచాడు.
పది నిముషాల్లో... ముందు బాషా, వెనుక అమృతం కారును సమీపించారు.
అమృతం చేతులు జోడించి కామరాజుకు నమస్కరించింది.
“ఏం అమ్మూ!...ఎలా వున్నావ్? " వికటంగా నవ్వుతూ అడిగాడు కామరాజు.
“ఏదో మీదయ యిలా వుండా !...”
“బాషా ! నీవు కొంచం దూరంగా పో!...”
బాషా కొంచం దూరంలో వున్న వేపచెట్టు క్రిందికి నడిచాడు.
"అమ్మూ!... నాకు ఒకటి కావాలి!..." అమృతం కళ్ళల్లోకి చూస్తూ చెప్పాడు కామరాజు.
"ఏంటది ?" వయ్యారంగా అడిగింది అమృతం.
“నీ కూతురు...”
అమృతం ఆశ్చర్యపోయింది. చుట్టూ పిచ్చిదానిలా కలయ చూచింది. 'నా కూతురు వీడి దృష్టిలో పడిందా... ఇక ఏదేవుడూ దీన్ని కాపాడగలడు?... ఓ తిరుపతి వెంకన్నా....ఇపుడు ఈడికి నేను ఏమి చెప్పాలి?...' ఆందోళనతో మనస్సున అనుకొంది అమృతం.
"అమ్మూ !... నీవు ఊహించనంత ఇస్తాను.” అమృతం ముఖంలోకి సూటిగా చూస్తూ చెప్పాడు కామరాజు.
కొంతకాలం క్రిందట తనూ అతనికి దాసురాలు. తనపై మోజు తీరాక... పిలవడం మానేసాడు.
అతని దృష్టిలోపడి నచ్చిన ఆడది... వాడి నుండి తప్పించుకోలేదు. యిపుడు తనేం చేయాలి?... బదులేమి చెప్పాలి?...?... మనో వ్యాకులత కారణంగా కళ్ళల్లో నీళ్ళు నిండాయి.
"అయ్యా!... అది చిన్న పిల్ల. చదువుకొంటూ వుంది. దానికీ మీ కూతురి వయస్సు. మీ నిర్ణయాన్ని మార్చుకో సామీ!..." ఎంతో దీనంగా కన్నీళ్ళతో చెప్పింది అమృతం.
“ఏయ్!... అమ్మూ... నా సంగతి నీకు బాగా తెలుసు. రేపు రాత్రికి మన గెస్ట్ హౌసుకు తీసుకురా...” తన నిర్ణయాన్ని శాసించాడు కామరాజు.
హారన్ కొట్టాడు. బాషా వెనుతిరిగి చూచాడు. వేగంగా కారును సమీపించాడు.
“కూర్చోరా, పోనీ...”
బాషా తన స్థానంలో కూర్చున్నాడు. కారును స్టార్ట్ చేసాడు.
“అమ్మూ !... రేపు రాత్రి పది గంటలకు... మరచిపోకు... “ సరసంగా నవ్వుతూ చెప్పాడు కామరాజు.
కారు కదిలి వెళి పోయింది.
అమృతం శరీరానికి చమట పట్టింది. కీళ్ళలో పటుత్వం సన్నగిల్లినట్లు అనిపించింది. కాళ్ళు తడబడ్డాయి. కళ్ళ నిండా కన్నీరు. మనస్సులో రగిలే ఆవేదన. మెల్లగా తన నిలయంలోకి ప్రవేశించింది. బోరున ఏడుస్తూ నులకమంచంలో వాలిపోయింది.
* * *
బజారునుంచి కూరగాయలను రిక్షాలో వేసికొని వచ్చాడు అమృతం తమ్ముడు ఆదిశేషు. సంచులను ఇంట్లో వుంచి అక్కకోసం నలువైపులా చూచాడు. నులక మంచంలో ముడుసుకొని ఏడుస్తూ పడివున్న అక్కను చూచి ఆశ్చర్యపోయాడు. ఆత్రంగా... ఆందోళనతో అమృతాన్ని సమీపించాడు.
"అక్కా!.. ఒంట్లో బాగాలేదా?...”
అమృతం ఆదిశేషు ముఖంలోకి చూసింది. హెచ్చు స్థాయిలో భోరున ఏడ్చింది.
“ఏమైంది అక్కా!...” ప్రక్కన కూర్చుని అనునయంగా అడిగాడు ఆదిశేషు.
పమిటతో కన్నీటిని తుడుచుకొని... ఆ క్రిందటి గంటలో జరిగిన విషయాన్ని ఎంతో బాధతో వివరించింది అమృతం.
విషయాని అర్ధం చేసుకొన్న ఆదిశేషు ఆశ్చర్యపోయాడు. కామరాజుమీద అతని మదిలో ఎంతో కోపం... ఆవేశం కలిగాయి. తమాయించుకొని అక్క కన్నీటిని తుడుస్తూ.....
“అక్కా! నీవు భయపడకు... నేను ఆ కామరాజును ఎదుర్కొంటాను. ఫలితం... వాడు నా చేతిలో నన్నా చావాలి... లేక నేను వాడి చేతులో నన్నా చావాలి. నేను చచ్చి పోతే నీవు చంద్రా ఈ వూరు విడిచి ఎక్కడికైనా వెళ్ళిపొండి. " ఎంతో ఆవేశంగా చెప్పాడు ఆదిశేషు.
“ఇది మనం ఆవేశ పడవలసిన సమయం కాదు ఆదీ !... వాణ్ని ఎదిరించి మనం బ్రతకలేము.” విచారంగా చెప్పింది అమృతం.
“ముల్లును ముళ్లుతోనే తీయాలి. నీవు దేనికీ భయపడకు... మన చంద్రాన్ని నేను బ్రతికివుండగా ఎవరు ఏమీ చేయలేరు...” సాలోచనగా చెప్పాడు ఆది.
తర్వాత... అక్కకు దగ్గిరగా జరిగి ఆమె చెవిలో ఏదో చెప్పాడు. అతని మాటలు విని... అమృతం ఆశ్చర్యపోయింది. ముఖంలో విషాద ఛాయలు ఎగిరిపోయి సంతోషం నిండిపోయింది. ఆనందంగా లేచి హోటలుకు భోజనానికి వచ్చేవారికోసం వంట పనులు ప్రారంభించింది. ఆదిశేషు ఆమెకు అన్నీ పనుల్లో మామూలుగా, సాయం చేయడం ప్రారంభించాడు.
* * *
బి.యే. ఫస్టుక్లాస్ లో పాసైన ఆదిశేషు... అమృతం నడిపే హోటల్లో అన్నీ పనుల్లో అక్కకు సాయంగా వర్తిస్తుంటాడు. వాడికి తన మరదలు చంద్ర అంటే ఎంతో అభిమానం, గౌరవం.
వారిరువురికి వివాహమ్ జరిపించాలని అమృతం కోరిక. ఆమె మంచి అందగత్తె. భర్త జోగయ్య ఆమెకు తగినవాడు కాదు. భార్యమీద అనుమానంతో పదిహేను సంవత్సరాల క్రిందట ఇల్లు విడిచి ఎటో పోయాడు.
ఎనిమిదేళ్ళ క్రిందట... మూడు సంవత్సరాలు కామరాజు అమృతం పై వల వేసి పట్టుకొని ఆరాధించాడు. ధన సహాయం బాగా చేశాడు. అమృతంకు ఇల్లూ వాకిలీ అతని మూలంగానే ఏర్పడ్డాయి.
భర్త ఇంటి నుండి పారిపోయేనాటికి ఆదిశేషు వయస్సు తొమ్మిది... కూతురు చంద్ర వయస్సు నాలుగు సంవత్సరాలు.
కామరాజు భార్య కాత్యాయని, కూతురు శ్యామల. కాత్యాయని అందగత్తె ఐనా... కామరాజుకు... ఇంటి తియ్యగూరకన్న... పొరుగింటి పులసుకూర బాగా నచ్చుతుందన్నా రీతినే వర్తించడం అతనికి అలవాటు. వారించే దానికి తల్లి తండ్రీ లేరు. కాత్యాయని మాటలను అతను లెక్క చేయడు.
ఆదిశేషు... చంద్ర, కామరాజు కూతురు శ్యామల ఒకే స్కూల్లో చదివినవారు. పరస్పరం పరిచయం వున్నవారు.
ఆదిశేషు... చదువులో ఆటల్లో మంచి పేరుతో అందరి కన్న... ముందు వుండేవాడు. టీచర్లు అతన్ని ఎంతగానో అభిమానించేవారు. ఈ కారణంగా శ్యామలకు ఆదిశేషు పట్ల ఎంతో అభిమానం.. గౌరవం.
ఆది బి.ఏ ఫైనల్ ఇయర్ లో వుండగా... శ్యామల అదే కాలేజీలో బి.యే.లో చేరింది. తరచూ అతన్ని కలసిమాట్లాడేది. సబ్జక్టును గురించిన సందేహాలను అడిగి తెలుసుకొనేది.
పోయిన సంవత్సరంలో ఆది బి.ఏ. పూర్తి అయింది. శ్యామల సెకండ్ ఇయర్లో ప్రవేశించింది. చంద్ర ఫస్టు ఇయర్లో అదే కాలేజీలో బి.ఏ. లో చేరింది. టీచర్ కావాలనేది చంద్ర ఆకాంక్ష.
మూడు నెలల క్రిందట శివాలయంలో ఆదిశేషును కలసిన శ్యామల 'నేను నిన్ను ప్రేమిస్తున్నాను' నిర్భయంగా తన నిర్ణయాన్ని అతనికి తెలియజేసింది. 'గాలిమేడలు కట్టకూడదు' ఇది... ఆదిశేషు శ్యామలకు యిచ్చిన జవాబు.
ఈరోజు అక్క చెప్పిన విషయాన్ని విన్న తర్వాత... అది... శ్యామలకు ఫోన్ చేశాడు ‘రేపు రాత్రి మనం కలుద్దాం' అని. అతనిమీద ఎంతో ప్రేమను పెంచుకొన్న శ్యామల అతని మాటలకు ఎంతో మురిసిపోయింది. ఆదిశేషు తనవాడే నని ఆనందించింది. పడకపై వాలి ఆనందమైన వూహాల్లో తేలిపోయింది.
రాత్రి తొమ్మిది గంటల సమయంలో బాషా అమృతం ఇంటికి వచ్చాడు.
అతను ఏమీ అడగకముందే అమృతం...."అయ్యగారు కోరినట్లే... అంతా సిద్ధం. పోయి చెప్పు...” అంది.
వీరున్న గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో జిల్లా పట్టణం. ఆదిశేషు చెప్పిన ప్రకారం... శ్యామల అతన్ని కలిసికొంది. ఇరువురు పట్నం వెళ్ళి ఫస్థుషో సినిమా చూచారు. ఆట ముగిసింది.
హోటలుకు వెళ్ళి టిఫిన్ చేసి రిక్షాలో బయలు దేరారు. ఇంటినుండి అయిదున్నరకు బయలుదేరేటప్పుడు శ్యామల తల్లి కాత్యాయనితో, స్నేహితురాళ్ళతో కలసి పట్నానికి సినిమా చూచేందుకు వెళుతున్నానని చెప్పి బయలుదేరింది.
రాత్రి సమయం... పది గంటల ప్రాంతం... గెస్టు హౌస్ ముందు కారు పోర్చిలో కారును ఆపి కామరాజు దిగాడు. తోటమాలిని అతని కొడుకూనూ రెండవ ఆట సినిమాకు వెళ్ళమని ముందురోజే చెప్పాడు. గేటు తాళాలు తీసుకొన్నాడు. తొమ్మిదిగంటలకు వచ్చి బాషా గేటు తాళం తీసి తలుపులు మూసి వెళ్లిపోయాడు.
ప్రశాంతమైన నిశీధి. వాచ్ కేసి చూశాడు కామరాజు. గంట పదిన్నర. గెస్టు హౌస్ లో... దాదాపు ఆ సమయం నుండి వేకువన నాలుగున్నర వరకు తను కోరిన సుందరాంగులతో రాస క్రీడలను సలిపిన మధురాతి మధురమైన రాత్రులు కామరాజుకు గతంలో ఎన్నో.. లెక్క లేదు.
గతాన్ని తలచుకొంటూ... సగర్వంగా నవ్వుతూ వరండా దాటి హాల్లో ప్రవేశించాడు కామరాజు. బెడ్ రూమ్ తలుపువద్దకు వెళ్ళి ద్వారం ముందు నిలబడి పరదాను తొలగించి లోనికి చూచాడు.
తను... ఆ రోజున కోరుకొన్న రీతిగానే... సుందరాంగి... కిటికీదగ్గర గా కుర్చీలో కూర్చొని శూన్యంలోకి చూస్తూవుంది. కామరాజు శరీరం పులకరించింది. ఎదకు మన్మధ భాణాలు తాకాయి. మనస్సు వీణగా మారి మధుర గీతాలాపన చేయసాగింది.
చేతిలోవున్న విస్కీ బాటిల్ మూత తీసి 'రా' గానే నాలుగు గుక్కలు మ్రింగాడు. శరీరంలో రక్తపు ఉష్ణం పెరిగింది. వెనక్కు తిరిగి... ముఖద్వారాన్ని సమీపించి రెండు రెక్కలను దగ్గరకు నెట్టాడు.
ఆనందంగా గాలిలో తేలుతూ పడక గదిలో ప్రవేశించాడు. మెల్లగా నడిచి... కుర్చీలో కూర్చొని వున్న సుందరి వెనకకు చేరాడు. జేబునుంచి పెర్ఫ్యూమ్ బాటిల్ తీసి ఆ కన్య వీపుమీద స్ప్రే చేశాడు. ఆ సుందరాంగి భుజాలపై తన రెండు చేతులను వేసి గట్టిగా నొక్కాడు.
వులిక్కిపడి... ఆ సుందరి కుర్చీ నుంచి లేచింది. వెనక్కు తిరిగి చూచింది. ఆశ్చర్యపోయింది. తను వూహించని ముఖాన్ని చూచిన కారణంగా భయంతో... 'అమ్మా!...' అని బిగ్గరగా అరచి క్రింద పడిపోయింది. స్పృహ కోల్పోయింది.
ఆమె ముఖాన్ని చూడగానే... కామరాజు తలపై పిడుగు పడినట్లు అయింది. మందు తాగిన మైకంతో తూలి మంచంపై పడిపోయాడు. తన కళ్లను తానే... నమ్మలేక పోయాడు. హృదయం పగిలి వెయ్యి ముక్కలయింది. కళ్ళు మూసుకొని... భోరున ఏడవసాగాడు.
కిటికీ ప్రక్క... చెట్ల చాటున వుండి లోన జరిగిందంతా చూచిన ఆదిశేషు... వేగంగా ఆ పడకగదిలో ప్రవేశించాడు. స్పృహ కోల్పోయి నేలమీద పడివున్న శ్యామలను భుజాన వేసుకొని... కార్లో వెనుక సీట్లో పడుకోబెట్టి, కారును స్టార్ట్ చేసి గెస్ట్ హౌస్ బయటికి వెళ్లిపోయాడు.
శ్యామలను తన అక్క ఇంటికి తీసుకొనివచ్చి లోన చేర్చి, జాగ్రత్తగా చూచుకోమని అక్కకు చెప్పి... కార్లో గెస్ట్ హౌస్ కు వచ్చి... కారును యధాస్థానంలో పోర్టికోలో నిలిపి... వేగంగా ఇంటికి వెళ్లిపోయాడు.
సినిమాకు వెళ్ళిన కూతురు పదిన్నరకల్లా ఇంటికి రాని కారణంగా... కాత్యాయని ఆవేదనతో... వరండాలో పనిమనిషి మంగమ్మతో కూర్చొని కన్నీరు కార్చుతూవుంది.
రాత్రి పన్నెండున్నర ప్రాంతంలో ఆదిశేషు రిక్షాలో శ్యామలను వారి ఇంటికి చేర్చాడు. దార్లో... జరిగిన విషయాన్ని తల్లికి చెప్పవద్దని...స్నేహితుల ఇంట్లో భోజనం చేసి రావడంలో ఆలస్యం అయిందని చెప్పవలసిందిగా... ఆదిశేషు శ్యామలకు చెప్పాడు. రిక్షా దిగి తల్లి ఆడగక ముందే... ఆ మాటలు చెప్పి తన గదికి వెళ్ళిపోయింది శ్యామల.
ఆదిశేషు... తన బిడ్డకు తోడుగా వచ్చినందుకు కాత్యాయని ఆదికి కృతజ్నతలు తెలియచేసింది. ఆదిశేషు... తన అక్కగారి ఇంటికి వెళ్లిపోయాడు.
భళ్లున తెల్లవారింది. తోటమాలి గెస్ట్ హౌస్.... గదులను శుభ్రం చేయడానికిలోనికి వచ్చాడు.
అచేతనంగా పడకపై కామరాజును అతని తలకు తగిలిన గాయాన్ని రక్తాన్ని... చేతిక్రింద నేలమీద వున్న తుపాకిని... చూచి హడలిపోయాడు.
పరుగునా బయటికి వచ్చి తన ఇరవై యేళ్ళ కొడుకును పిలిచాడు. ఇరువురూ గదిలోనికి నడిచి భయంతో కనకరాజు ముఖంలోకి చూచారు. తన యజమాని... చచ్చిపోయాడనే నిర్ణయంతో కొడుకు పోలీసు స్టేషన్కు... తోటమాలి కామరాజుఇంటికి పరుగెత్తి విషయాన్ని చెప్పారు.
గెస్ట్ హౌస్ కు పోలీసులు వచ్చారు. అంతా పరీక్షగా చూచారు. సిగరెట్ ప్యాకెట్ అట్ట మీద... 'నేను పాపం చేశాను. తగిన శిక్షను నేనే విధించుకొన్నాను. ' అని కామరాజు వ్రాసిన ఈ అట్టముక్క వారికి దొరికింది. శవం పోస్ట్ మార్టం కు పంపబడింది.
కామరాజు మరణానికి... కాత్యాయని, శ్యామల విచారంలో మునిగిపోయారు.
ఆ మరుదినం సాయంత్రం... కామరాజు శవం శ్మశానానికి తరలిపోయింది బంధుమిత్రుల సమక్షంలో, అతనిలోని కామదాహం.... 'కామదహనం' గా మారి బూడిదగా నిలిచింది.
తన్ను ఎంతగానో ప్రేమించిన శ్యామలను ఆమె తల్లి సమ్మతంతో వివాహం చేసుకొన్నాడు ఆదిశేషు.
***సమాప్తి***
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
댓글