కామేశం - కథల సంపుటి - పార్ట్ 1
- Bhaskara Rao B. R. K. V.

- 17 hours ago
- 4 min read

Kamesham - Kathala Samputi - Part 1 - Telugu Comedy Story | Bhaskara Rao B. R. K. V.
కామేశం - కథల సంపుటి - పార్ట్ 1 - తెలుగు హాస్య కథ | బి ఆర్ కె వి భాస్కర రావు
Published in manatelugukathalu.com on 03/09/2026
కథలు రాయాలనే పట్టుదల ఒక యువకుడిని ఎంత దూరం తీసుకెళ్లగలదు? అతని కోరిక తీర్చడానికి తండ్రి ఎలాంటి తిప్పలు పడాల్సి వస్తుంది?
బి.ఆర్.కె.వి. భాస్కర రావు రచించిన “కామేశం – కథల సంపుటి” ఒక చక్కని హాస్య–వ్యంగ్య కుటుంబ కథ. రచయిత కావాలనే కామేశం మోజు నుంచి మొదలయ్యే ఈ కథలో తండ్రి రాజశేఖరం చేసే ప్రయత్నాలు నవ్విస్తూనే, సమాజంలోని కొన్ని వాస్తవాలను వ్యంగ్యంగా చూపిస్తాయి. చివర్లో పెళ్లి సంబంధానికి సంబంధించిన ఆసక్తికరమైన మలుపు కథను మరింత వినోదాత్మకంగా మారుస్తుంది.
తాతముత్తాతల నుంచి వచ్చిన తరగని ఆస్తిపరుడు కామేశానికి వేపకాయ అంత వెర్రి ఉంది. అది రానురాను పెరిగి "గుమ్మడికాయ అంతై ఎంకి పెళ్ళి సుబ్బి చావుకి వచ్చిందన్నట్టు" కామేశం పెళ్ళికి అడ్డం వస్తోందని భార్య దగ్గర చాలాసార్లు వాపోయాడు తండ్రి రాజశేఖరం.
వయసు ముప్పై దగ్గరకు పడటంతో తండ్రి పెళ్ళి సంబంధాలు ఎన్ని చూసినా తనకున్న పైత్యంతో వాటిని దూరం చేసుకోవడం చూసి ఓరోజు రాజశేఖరం కామేశాన్ని పిలిచి, "నువ్వు పెళ్ళి చేసుకోవాలంటే నేనేమి చేయాలి?" అని అడిగాడు.
"నాకు ఎన్నాళ్లనుంచో ఓ కోరిక ఉంది. అదేమిటంటే నేను పది వరకు కథలు వ్రాసి వాటిని సంపుటిగా అచ్చు వేయించిన తర్వాతే పెళ్ళి చేసుకుంటాను. అంతేకాదు, ఆ సంపుటితో బంధువులు వివాహానికి రావాలనేది నా ఆకాంక్ష."
"నీకు కథలు వ్రాయాలనే దిక్కుమాలిన సలహా ఇచ్చిన దరిద్రుడు ఎవరు నాయనా?" నడినెత్తికెక్కిన కోపాన్ని అణుచుకుంటూ అడిగాడు.
"నాకు డిగ్రీ చెప్పేటప్పుడు మా తెలుగు సార్, రచనలు చేస్తే మనం చనిపోయినా మన రచనల ద్వారా ప్రజల గుండెల్లో బ్రతికి ఉంటామని చెప్పాడు నాన్నా" అన్నాడు మెరిసే కళ్ళతో కామేశం.
నుదురు నొక్కుకుంటూ 'ఖర్మరా బాబు' అని మనసులోనే అనుకుని పైకి, "అయితే కథలు వ్రాయడం ఎప్పుడు మొదలుపెడతావు? ఎక్కడ కూర్చుంటావు?" అని అడిగాడు.
"మన బిల్డింగ్ పైఫ్లోర్లో చిన్న పెంట్ హౌస్ వేయించండి, తర్వాత్ ఏం కావాలో నాకు తెలుసు" అని సమాధానం చెప్పాడు.
రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు నాలుగు రోజులు తిరిగేసరికి బ్రహ్మాండమైన పెంట్ హౌస్ కామేశం కోసం సిద్ధమైంది.
కథ వ్రాయడానికి ఐడియా రావాలంటే సిగరెట్లు కాలుస్తూ కాఫీలు తాగాలని ఎవరో చెప్పగా విని, ఓ పనిమనిషిని కాఫీ తయారు చేసి కప్పులో పోసి ఇవ్వడానికి, సిగరెట్లు అందివ్వడానికి పెట్టుకున్నాడు. ఒక రీము తెల్ల కాగితాలు, పాతిక బాల్ పెన్నులు రెడీగా ఉంచుకున్నాడు.
రోజులు గడుస్తున్నాయి కాని ఒక్క అక్షరం కూడా పేపర్ మీద పెట్టలేదు. కాఫీలు తాగి తాగి అన్నం తినడం మానేసరికి పొట్ట గ్యాస్ తో నిండి ఉబ్బిపోయింది.
ఓ రోజు ఉదయమే ఫైర్ ఇంజన్ తన ఇంటి ముందు ఆగేసరికి నిద్ర కళ్ళు నలుపుకుంటూ కంగారుగా బయటకు వచ్చాడు రాజశేఖరం.
వాళ్ళు నీళ్లను ఎక్కువ ఫోర్సుతో తన ఇంటి పైకి కొట్టడం చూసి వాళ్లతోపాటుగా తాను చూసి ఆశ్చర్యపోయాడు. కామేశం ఉన్న పెంట్ హౌస్ నుంచి కారు మేఘాల్లా పొగలు రావడంతో లుంగీ పంచె పైకట్టుకుని రెండు నిమిషాల్లో అక్కడకు చేరుకున్నాడు.
తీరా కామేశం తనకేమి పట్టనట్టుగా సిగరెట్లు ఉదేస్తున్నాడు. ఆ పొగ బయట వాళ్ళకు లోపల ఏదో కాలిపోతున్నట్లు అనిపించింది. రెండు అంగల్లో కామేశం దగ్గరకు వెళ్లి నోట్లోని సిగరెట్టు తీసి అవతల పడేసి రెండు చెంపలు వాచేట్టు కొట్టి కిందకు ఈడ్చుకొచ్చాడు. తరువాత తెలిసింది చుట్టుప్రక్కల వాళ్ళే ఫైర్ ఇంజన్ కు ఫోన్ చేసినట్టు.
వారం రోజులపాటు తండ్రి మీద కోపంతో మాట్లాడలేదు. ఓ టైంలో కంచికి కూడా ప్రయాణమయ్యాడు, అక్కడ చిన్నప్పుడు చెప్పిన సామెత 'కథ కంచికి' అని గుర్తుకొచ్చి ఏమైనా కథలు దొరుకుతాయేమోనని.
నాలుగు రోజులు పోయాక ఏమి తోచక పొలం వెళ్తే అక్కడున్న కూలివాళ్ళ దగ్గర కథలు ఉన్నాయేమోనని కదిపి చూశాడు. వాళ్ళల్లో కొంచెం లోకాజ్ఞానం ఉన్నవాడు, 'కథలు ఏసీ గదుల్లో కూర్చుని ఆలోచిస్తే రావని, తమలాంటి పేదల ఆకలిలోంచి పుడతాయని' చెప్పేసరికి రాజశేఖరం నెత్తినోరు బాదుకుని, చెప్పినా వినకుండా తమ పనిమనిషి గోవిందయ్య గుడిసె ప్రక్కనే తానో పురిగుడిసె వేయించుకున్నాడు. మంచినీళ్లు తప్ప ఇంకేమి తిననని భీష్మించుకుని క్రిందే పడుకుంటానని శపథం చేసిన కామేశం నాలుగు రోజులు అయ్యేసరికి నలుగురు మనుషులు తోడుపట్టుకుని వచ్చి హాస్పిటల్ లో పడేశారు, నోటినుంచి గాలే తప్ప మాట రావట్లేదు. దోమలు కుట్టేసరికి ఒళ్ళంతా దద్దుర్లతో ఉబ్బిపోయింది.
వారం రోజులకు ఇంటికి వచ్చిన కామేశం తన పట్టు వీడేలా లేడని ఆలోచించిన రాజశేఖరం ఒక ఎకరం భూమి అమ్మేసినా సరే అతగాడి ముచ్చట తీర్చి పెళ్ళి చేయాలని నిర్ణయించుకున్నాడు.
నాలుగు రోజులకు ఓ పేపర్ ప్రకటన కామేశం ముందుంచాడు రాజశేఖరం.
"రామేశం పబ్లిషర్స్, రామేశ్వరం. ఔత్సాహిక రచయితలకు స్వాగతం. మీరు రచించే కథల్ని పైసా ఖర్చు లేకుండా సంపుటిగా వంద పుస్తకాలను పబ్లిష్ చేస్తాం. వెంటనే కథల్ని ఈ క్రింది అడ్రస్ కు పంపండి" అని చదివిన కామేశం,
"సూపర్ నాన్న! ఈ ప్రకటన ఎక్కడిది?" అని అడిగాడు హుషారుగా.
"మా ఫ్రెండ్ తమిళ్ నాడు నుంచి పంపించాడులే. వెబ్ మాగజైన్లు రాజ్యమేలుతున్న ఈ రోజుల్లో బుక్స్ పబ్లిష్ చేసేది చుట్టుపక్కల ప్రదేశాల్లో ఇదొక్కటేనట, నువ్వు వెంటనే కథలు వ్రాయడం మొదలుపెಟ್ಟು, పంపిద్దాం."
"నాన్నా! ఎవరి మీద కథలు వ్రాయను?"
"ముష్టి వాడు ఎలా అడుక్కుంటాడు, కుక్క మొరుగులోని లయ, డ్రైనేజీ నీటి వాసన, పనిమనిషి పాపమ్మ అంట్లు తోమడంలోని నైపుణ్యం వంటి వాటి మీద కథలు వ్రాస్తే నువ్వన్నట్టు అవి జీవించే ఉంటాయి." అన్నాడు పళ్ళు పటపట కొరుకుతూ.
వారం తిరిగేసరికి కామేశం కథలు వ్రాయడం, వాటిని పబ్లిష్ చేయడం జరిగింది. ఆ సంపుటిని చూసుకున్న కామేశం పెళ్ళికి ఒప్పుకున్నాడు.
పిల్ల వేటలో పడ్డాడు రాజశేఖరం. ముదురుపోయిన కామేశానికి ఎట్టకేలకు ఆరునెలల్లో ఇంకో వయసు ఎక్కువ ఉన్న అమ్మాయే దొరికింది. ఆమె కూడా చాలా ఆస్తిపరురాలే. పైగా ఒక్కతే కూతురు. పెళ్ళి ముహూర్తలు కూడా పెట్టుకున్నాక అసలైన పరీక్ష మొదలైంది రాజశేఖరానికి.
ఆ పుస్తకాలు ఎలా పంచాలని? చివరికి ఆలోచించి ఒక్కో పుస్తకానికి ఒక్కో వెండి గ్లాసు ఇస్తాననేసరికి అప్పటివరకు వద్దన్న చుట్టాలందరూ నాక్కావాలంటూ ఎగబడ్డారు. పెళ్ళికి వాటిని తీసుకురావాలనే కండిషన్ పెట్టి మరీ ఇచ్చాడు. పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది.
నాలుగు రోజుల తర్వాత ఓ ఉదయం వియ్యంకుళ్లిద్దరూ కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటూ, "బావగారూ! ఏమనుకోవద్దు, మీరు మా అల్లుడికి పెళ్ళి ఎందుకు లేటైయ్యిందో తెలుసుకోవచ్చా?" అని రాజశేఖరాన్ని ప్రశ్నించేసరికి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు ఉబికి వచ్చి, జరిగిందంతా చెప్పి, తానే తప్పుడు ప్రకటన పేపర్లో ఇచ్చి, తానే కథల సంపుటాన్ని ముద్రించడంతో పాటుగా ఒక్కో పుస్తకానికి ఒక్కో వెండి గ్లాసు ఇస్తేగానీ పెళ్ళి కాలేదని కన్నీళ్లు తుడుచుకుంటూ చెప్పాడు.
"మరి మీరు అమ్మాయికి పెళ్ళి ఎందుకు త్వరగా కాలేదు?" అని రాజశేఖరం ప్రశ్నించేసరికి వియ్యంకుడు పెద్దగా నవ్వుతూ, "బావగారూ! మా అల్లుడు వెండితో సరిపెట్టాడు, మీ కోడలు అయితే బంగారానికే ఎసురు పెట్టింది." అన్నాడు.
"అదెలా?"
"చెప్తాను వినండి!" అంటూ కళ్ళజోడు తీసి భుజం మీద ఉత్తరీయంతో అద్దాలను తుడిచి, "చెప్తాను వినండి మీ కోడలి నిర్వాకం" అంటూ చెప్పడం మొదలు పెట్టాడు.
కామేశం - కథల సంపుటి - పార్ట్ 2 త్వరలో మీ ముందుకు రానుంది.
***
పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.
మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.
బి ఆర్ కె వి భాస్కర రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: బి ఆర్ కె వి భాస్కర రావు
ప్రతి ఒక్కరు చెప్పే సాధారణ సాకే అనుకోకపోతే నాక్కూడా తక్కువ ఖాళీ వల్ల ఎక్కువ కథలు రాయలేకపోయాను. బీఎస్సీ చదివి తాత తండ్రుల వారసత్వంగా వచ్చే వైద్యం చేపట్టి పల్లెటూరులో ఆర్ఎంపీ గా స్థిరపడి అడపా దడపా కథలు రాస్తూ గడుపుతూ ఉంటాను.ఆంధ్రప్రభ,ఆంధ్రభూమి,అంజలి,గీతాంజలి వంటి వీక్లీ లలో కథలు,వ్యాసాలు,కవితలు నావి అచ్చయ్యాయి.
భారతం ,భాగవతం లాంటి పురాణాలు అంటే చెవి కోసుకుంటాను.
రచయితలలో కొడవటిగంటి కుటుంబం రావు,చాసో,బుచ్చిబాబు నాకు ఇష్టమైన వారు.
ఒకప్పుడు పుస్తకం హస్తభూషణం అనేవారు.మరి ఇప్పుడో సెల్ ఫోన్ హస్త భూషణం అనే రోజులొచ్చాయి.
పుస్తకాలు తీరిగ్గా చదివే ఓపిక సమయం లేనిఈ రోజుల్లో పాఠకుల మనసును గ్రహించి వాళ్ళను రంజింప చేసే ప్రయత్నం లో మన తెలుగు కథలు యాజమాన్యం వారు రచయితలకు గొప్ప ప్లాట్ఫారం ఏర్పాటు చేయడం అభిందనీయం. వీక్లీలు పుస్తక రూపంలో ఇంచుమించు కనుమరుగయ్యే నేటి రోజుల్లో రచయితలకు దిశ ,దశ చూపించినందుకు కృతజ్ఞతలు
నాపేరు బి ఆర్ కె వి భాస్కర రావు
ఊరు పాలి






Comments