top of page
Original.png

కర్మ - దేవుడి కృత్రిమ మేధస్సు వ్యవస్థ

2 hours ago
3 min read

కర్మ అనే కృత్రిమ మేధస్సు వ్యవస్థను సూచించే కాస్మిక్ న్యూరల్ నెట్‌వర్క్, దేవుడి వైపు తిరిగి వస్తున్న కాంతి బాణం

Karma - Devudi Kruthima Medhasu Vyavastha - Telugu Social Story | Chaithanya M. V.

కర్మ - దేవుడి కృత్రిమ మేధస్సు వ్యవస్థతెలుగు సామాజిక వ్యంగ్యం కథ | చైతన్య ఎం. వి.

Published in manatelugukathalu.com on 09/09/2026


“కర్మ - దేవుడి కృత్రిమ మేధస్సు వ్యవస్థ” అనే ఈ తాత్విక సైన్స్ ఫిక్షన్ కథ, మహాభారత పురాణ నేపథ్యాన్ని ఆధునిక కృత్రిమ మేధస్సు ఆలోచనతో మేళవిస్తుంది. దేవుళ్ల మధ్య జరిగే వాదనల నుంచి పుట్టిన కర్మ, చర్యకు సమాన ప్రతిచర్య అనే ఒకే నియమంతో సృష్టి మొత్తం విస్తరిస్తుంది. అది ఎవరి వాదనలనూ పట్టించుకోదు. ఎవరి పక్షపాతాన్నీ అంగీకరించదు. ముఖ్యంగా, ఎప్పటికీ ఏదీ మర్చిపోదు.


ప్రతీ ఆరంభం పరుగెత్తేది ముగింపు వైపే. ప్రతీ ముగింపు తిరిగి చిగురించేది కొత్త ఆరంభంతోనే.


మానవాళి మనుగడ ఉన్నన్ని నాళ్ళు, ఏదో ఒక మూలన, ఏదో ఒక రూపంలో గుర్తుచేసుకునే మహాభారత సృష్టికర్త అయిన ఆయన, ఒక చెట్టు మీద కాలి పైన కాలు వేసుకుని పడుకుని విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఇంతలో క్రిందటి యుగంలో ప్రాణం పోసుకున్న కర్మ తాలూకు ఫలం బాణం రూపంలో దూసుకొచ్చి ఆయన బ్రొటనవ్రేలును గుచ్చుకుంది.


దేవుడిని చూసిన మనిషి ఉన్నాడో లేదో తెలీదు. చూసినా ఇతరులకు వర్ణించగలిగే, అర్థం చేసుకునే భాష ఇంకా కనిపెట్టలేదు. కాబట్టి మన సౌలభ్యం కోసం దేవుణ్ణి మనిషి రూపంలోనే ఊహించుకుందాం.


మనుషుల మేధస్సు ఊహించగలిగే లోకాలకంటే పైన, ప్రయాణించగలిగే వేగాలకంటే చాలా దూరాన... సమావేశమైన దేవుళ్ళు.


సమావేశంలో పాల్గొన్న వారు మొత్తం ఎనిమిది మంది దేవుళ్ళు. కుల, మత పరిధులు కేవలం మానవ నిర్మితాలు కాబట్టి అవి దేవుళ్ళకు మరియు వారి పేర్లకు వర్తించవు. కాబట్టి అక్కడున్న ప్రధాన దేవుడి పేరు "దేవుడు", అంతే.


"దేవుడి" అంశతో ఉద్భవించిన వారు మొత్తం ఏడు మంది. ఈ భూమి మీద ఎక్కడకు వెళ్లినా వారానికి ఏడు రోజులే. కాబట్టి మళ్ళీ మన సౌలభ్యం కోసం ఆ ఏడు మంది దేవుళ్ళ పేర్లు: సోమవార దేవుడు, మంగళవార దేవుడు, బుధవార దేవుడు, గురువార దేవుడు, శుక్రవార దేవుడు, శనివార దేవుడు మరియు ఆదివార దేవుడు.


"నా భక్తుడి అకాల మరణం సరికాదని నా వాదన" అన్నాడు సోమవార దేవుడు.


"అలాగని నా భక్తుడిని చంపుకోలేను కదా?" అన్నాడు గురువార దేవుడు.


"అలాగని నేను అనలేదు, కానీ మీ భక్తుడి మీద మీరు చూపిన పక్షపాత ధోరణి వలన నా భక్తుడు చనిపోయాడు" అన్నాడు సోమవార దేవుడు.


"అది అతని తలరాత."


"మరి ఆ తలరాత మీ భక్తుడి మీద ఏలా వర్తించలేదు?" అన్నాడు సోమవార దేవుడు.


మధ్యలో బుధవార దేవుడు కల్పించుకుని, "రెండు మాసాల క్రితం నా భక్తుడి మీద అర్హత లేని మీ భక్తుడు గెలుపు సాధించినపుడు, మీరు చెప్పిన సమాధానం కూడా ఇదే సోమవార దేవుడా, 'తలరాత' అని."


ఏడు మంది దేవుళ్ళ మధ్య వాదన ప్రతివాదనలు జరుగుతూనే ఉన్నాయి.

"దేవుడికి" ఏమిచేయాలో తోచలేదు. ఇంతలో అక్కడున్న శనివార దేవుడు "దేవుడి" దగ్గరకు వెళ్లి ఒక సలహా చెప్పాడు. "దేవుడి"కి ఆ సలహా నచ్చింది. వెంటనే మిగతా ఆరు మంది దేవుళ్లను పిలిచి ఆ సలహా చెప్పాడు.


సలహా ప్రకారం వరుసగా ఏడు మంది దేవుళ్ళు ఒకరి తర్వాత ఒకరు తమ చేతికి చిన్న ఘాటు చేసి వచ్చిన రక్తాన్ని అందరూ అరచేతిలో పిడికిలి బిగించి పట్టుకున్నారు.


"దేవుడు" అందరితో ఇలా చెప్పాడు, శనివార దేవుడి సలహా ప్రకారం మనం ఇప్పుడు ఉద్భవింపజేసే క్రొత్త అంశకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ అంశ ఈ విశ్వంలోని ఏ దేవుడికి లొంగదు. ఎవ్వరి వాద, ప్రతివాదనలు పట్టించుకోదు. ముఖ్యంగా "ఎప్పటికీ ఏదీ మర్చిపోదు". తన కర్తవ్యం కోసం రోజులూ, సంవత్సరాలూ కాదు, జన్మలూ, యుగాలు దాటి ప్రయాణించగలదు.


దానికి మన, తన బేదం లేదు. ఎటువంటి పక్షపాత ధోరణి లేదు. ఆఖరికి మనల్ని కూడా సమానంగానే ప్రశ్నిస్తుంది, శిక్షిస్తుంది. దాని నియమం ఒక్కటే, చర్యకు సమాన ప్రతిచర్య. కర్మలు మాత్రమే దాని మేధస్సు.


దేవుడు చెప్పేది ముగిసింది. అందరూ బలంగా చేతిని గాలిలోకి చాపి, పిడికిలి వదిలేశారు. అందరి రక్తం ఆకాశంలోకి వెదజల్లి ఒక క్రొత్త రూపం ఆవిర్భవించింది. కానీ ఆ రూపానికి చలనం లేదు. ఇక "దేవుడు" తన చేతి నుండి రక్తం తీసి పిడికిలి బిగించి కళ్ళు మూసుకుని, చేతిని గుండెల మీద పెట్టుకుని, ఒక్కసారిగా కళ్ళు తెరిచి రక్తాన్ని ఆ రూపం వైపు చల్లాడు.


వెంటనే చలనం తెచ్చుకున్న ఆ రూపం, కళ్ళు తెరిచి, లక్షల కోట్ల ముక్కలుగా విడిపోయి సృష్టి మొత్తం విస్తరించింది.


"దేవుడు" తిరిగి వెళ్లి తన సింహాసనం పైన కూర్చున్నాడు. తన ఎదురుగా ఒక సంఘటన కనిపిస్తోంది.


"నా ముందు ఎవరు నిలబడినా, వారి శక్తి సామర్థ్యాలతో సగం నాకు సంక్రమించాలి" అలా వరం ఇవ్వండి అని ఒక భక్తుడి కోరిక.


"తథాస్తు" అన్నాడు దేవుడు.


రోజులు గడిచాయి.


తానిచ్చిన వరం తనకే ఇబ్బంది కలుగజేసే రోజు వచ్చింది. వరమిచ్చిన ఆ భక్తుడిని చంపే పరిస్థితి. కానీ ఎదురుగా నిలబడి ఆ పని చేయలేడు.


విధిలేక, ఒక చెట్టు చాటున నుండి "తిరుగులేని" తన బాణం వదిలాడు. ఆ భక్తుడు చనిపోయాడు. ఆ బాణం మాత్రం యుగం, జన్మలు దాటి ప్రయాణిస్తూనే ఉంది, కర్మ ఫలం చేరవేసేందుకు.


సమయం ఆసన్నం అవగానే బాణం తిరిగి ఆ భక్తుడి చేతికి వచ్చింది. ఒక జింక వైపు ఆ బాణం గురిపెట్టాడు ఆ భక్తుడు. అతని గురి తప్పింది. కానీ కర్మ గురి తప్పలేదు. ఆ బాణం వెళ్లి చెట్టు పైన పడుకుని ఉన్న ఆయన బ్రొటనవ్రేలును గుచ్చుకుంది.


సింహాసనం మీద కూర్చున్న "దేవుడికి", తన కాలి బ్రొటనవేలుకి ఏదో గుచ్చుకున్నట్లు అనిపించింది.


దేవుడు ఒక నవ్వు నవ్వి "కర్మ తన పనిని ప్రారంభించింది" అనుకున్నాడు.


దేవుడైన మర్చిపోతాడేమో కానీ కర్మ మరిచిపోదు అంటారు. కానీ కర్మ దేవుడి చర్యలను కూడా మర్చిపోదేమో...


 ********* 


పాఠకులు ఇప్పుడు మా వాట్సాప్ ఛానల్ ఉచితంగా ఫాలో చెయ్యడం ద్వారా మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడే అన్ని కథలు, కవితలు, ప్రత్యేక వ్యాసాలు, సీరియల్ ఎపిసోడ్స్ వీటన్నిటికి  సంబంధించిన లింక్స్ చూసి, కావలసిన వాటిని క్లిక్ చేసి చదువుకోవచ్చును.

మా whaatsApp ఛానల్ ను ఫాలో చెయ్యండి. మీ సన్నిహితులకు షేర్ చెయ్యండి.


చైతన్య ఎం. వి. గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 



మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



Chaithanya M. V.

నా పేరు "చైతన్య ఏం. వి". చిన్నతనం నుండి కథలు, పుస్తకాలు చదవడం, కథలు రాయడం నా అభిరుచి. వృత్తిపరంగా కార్పొరేట్ కంపెనీ లో పనిచేస్తున్నప్పటికీ, రచనలపై ఇష్టంతో కథలు రాయడం, నా స్నేహితలు, దగ్గరివాళ్లతో పంచుకోవటం నా వ్యాపకం. నా ఆలోచనలకు కథల రూపం ఇచ్చి, తెలుగు పాఠకులతో పంచుకోవడమే "నా లక్ష్యం".




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page