top of page
Original.png

కర్రచప్పుడు పార్ట్ 2

#BhagavathulaBharathi, #భాగవతులభారతి, #KarraChappudu, #కర్రచప్పుడు, ##TeluguHeartTouchingStories


Karra Chappudu Part - 2/2 - New Telugu Story Written By Bhagavathula Bharathi Published In manatelugukathalu.com On 06/01/2026

కర్రచప్పుడు పార్ట్ 2/2 - పెద్ద కథ

రచన: భాగవతుల భారతి

ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత

జరిగిన కథ:

కాశీయాత్రకు వెళ్లిన కుముదిని, విలాస్ దంపతులకు సిద్ధాంత్ పరిచయమవుతాడు. అతని భార్య విహ్వల రాత్రుళ్ళు మేలుకోవడం, కర్ర చప్పుడు విన్నాక తిరిగి పడుకోవడం వెనక ఉన్న కథ చెప్పడం ప్రారంభిస్తాడు.

ఇక కర్రచప్పుడు: పెద్దకథ చివరి భాగం వినండి.  


నాకో చెల్లి, నేను ఒక్కడినే కొడుకు కావటంతో పెళ్ళి తర్వాత కూడా అమ్మను నా దగ్గరే ఉంచుకున్నాను. అదృష్టవశాత్తూ విహ్వల కూడా అత్తగారిని అమ్మలాగా ఆదరించింది. 

విహ్వల, అత్తగారి అన్యోన్యత, అందరికీ ఆదర్శంగా ఉండేది.


ఆరోజు అనుకోకుండా.. 

"డాక్టర్ అమ్మ కింద పడింది. లేవ లేక పోతోంది. తీసుకు రావటానికి వీలుగాలేదు. 

ఏంచేయాలంటారు. నాకు చాలా కంగారుగా ఉంది. " నేను డాక్టర్ కి ఫోన్ చేసాను. 


"మా కాంపౌడర్ ను పంపిస్తాను. పరిస్థితి అంచనా వేసి, నాకు ఇన్స్ఫర్మేషన్ ఇస్తే, నేను మందులు పంపుతాను. ఎందుకంటే ఆవిడ 85 ప్లస్ కదా!హాస్పిటల్ లో ఉంచి ఇబ్బంది పెట్టలేం. ఏదైనా ఫ్రాక్చర్ అయిందా? చిన్న ప్రాబ్లమేనా? మా కాంపౌండర్ అంచనా వేయగలడు. "


పరీక్షలన్నీఅయ్యాక, 

"సిద్ధాంత్ గారూ! దేవుడి దయవల్ల అమ్మగారికి కింద పడటం వల్ల దెబ్బమాత్రమే

తగిలింది. కాళ్ళూ చేతులూ బానే కదిలిస్తున్నారు. కాబట్టి మందులు, కొన్ని స్ప్రేలు సరిపోతాయ్. కానీ కోలుకోటానికి టైం పడుతుంది. అయితే! ఆవిడ మళ్ళీ పడటానికి ఛాన్స్ ఇవ్వకుండా, జాగ్రత్తగా ఉండాలి. ఈ వయసులో ఏదైనా విరిగితే, అతుక్కోటమూ కష్టమే. చేయలేక మీకూ ఇబ్బంది.. " 


డాక్టర్ మాటలు విన్న విహ్వల అంతకు ముందు కంటే అత్తగారిని కంటికి రెప్పలా చూస్తోంది. 


ఎంత జాగ్రత్తగా చూస్తోందంటే.. 

శీతాకాలం. అందులో కాలి నొప్పి. పైగా అత్తగారు బ్రోంకైటీస్ పేషెంట్, చలి కూడా కాబట్టి ప్రొద్దున్నే ముఖం కడుక్కోటానికి, వేడినీళ్ళు బ్రష్, పేష్ట్ రెడీ చేసి కుర్చీవేసి కూర్చోబెట్టి అందించేది. 


వేడినీళ్లు తెచ్చి ఆమెకు స్నానం చేయించేది. టాయిలెట్ కు కూడా వేన్నీళ్ళు పెట్టడం చాలా విచిత్రంగా ఉండేది నాకు. అమ్మకి చీర కట్టేది. దెబ్బ తగిలిన చోట నొప్పి కి మందులు రాసేది. నాన్నగారు లేరు కాబట్టి బొట్టు స్టిక్కర్ పెట్టేది. అన్నం కలిపి తానే తినిపించేది. రాత్రిపూట అదే గదిలో మంచం మీద పక్కనే పడుకునేది. అర్ధరాత్రి

యూరిన్ కి వెళ్ళాలంటే అమ్మ కు ఇబ్బంది అని, తానే లేచి బెడ్ పాన్ పెట్టేది. ఎంతో ఏకాగ్రతగా సేవలు చేసింది. 


"అమ్మా! నెలరోజులయింది. ఇక లేచి అటూఇటూ తిరగొచ్చుట. ఇదిగో!నీకోసం ఈ నాలుగు దిమ్మెలున్న కర్ర తెచ్చాను. దీనిని మన సౌకర్యం కోసం ఇలా మడత పెట్టవచ్చుట. దీంతో నాలుగు అడుగులు వేయమ్మా!" అని నేను తెచ్చిన కర్రతో లేచి, నిలబడి కాస్త అటూఇటూ తిరుగుతూ ఉన్నా, మధ్యలో తూలి పడబోతూ ఊగుతూ ఉండేది. తనే చేయిపట్టి నడిపించేది విహ్వల. 


కర్ర మోపు చేసినప్పుడల్లా చప్పుడయ్యేది. 


"నన్ను పిలవకుండా లేవద్దు పడిపోతే కష్టం. మీ అబ్బాయి బిజీలోఉంటారు. నేను లేపలేను. మళ్ళీ దెబ్బ తగిలితే కష్టం. "అని నచ్చచెప్పింది. చాలా రకాల సేవలు చేసేది.


అమ్మ!తను లేవాలనుకున్నప్పుడల్లా కర్ర చప్పుడుచేసేది. అమ్మ కర్రచప్పుడుకు ఎక్కడున్నా పరుగెత్తుకువచ్చేది విహ్వల. 

ఎన్నో బలవర్ధకమైన ఆహారం పిల్లలచేత తెప్పించి పెట్టేది. 


"ఈ వయసులో ఇవన్నీ నాకు అరుగుతాయిటే !నేను ఇంకా బ్రతకాలటే!నీ పిచ్చిగానీ!?"అంటూ అమ్మ తోసిపుచ్చినా.. 

"మీరు బాగుండాలి. మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి. కొంచెం కొంచెం తినాలత్తయ్యా!" అంటూ నానేసి, ఉడకేసి, స్పూన్ తో తినిపించి, ఎలాగోలా కర్రసాయంతో కొద్దిగా నడిచేటట్లు చేయగలిగింది.


చప్పుడు చేసుకుంటూ, నాలుగడుగులు వేసే అమ్మగారి కర్ర శబ్దం ఎక్కడున్నా విహ్వల చెవులో మ్రోగేది. 

అర్ధరాత్రి నిశ్శబ్దం లో కర్రశబ్దం పక్క గదిలో ఉన్న నాకు వినబడకపోయినా, పక్కనే పడుకున్న విహ్వల ధిగ్గున లేచేది. అమ్మ అవసరం తీర్చి, కర్ర సాయంతో మళ్ళీ తీసుకువచ్చి పడుకోబెట్టేది. అలా ఎటూ, పెళ్లీ పేరంటాలకూ కూడా పోకుండా, అన్నీ త్యాగం చేసి, ప్రతీక్షణం కుడిచెయ్యి, ఎడమచెయ్యి అనుకోకుండా అన్నీ తనే చేసింది విహ్వల. 


"మంచి కోడలివి నువ్వు "అని ఎవరైనా ప్రసంశిస్తే, "భగవంతుడు నాకు అప్పజెప్పిన పని నేను చేస్తున్నాను. అదీగాక! ఎన్నో పురిటి నొప్పులు, పిల్లల పెంపకాలు, కుటుంబ భారాలూ, మోసీ జీవన ప్రయాణం సాగించి, మగవారికన్నా ఎక్కువ బాధ్యతలు నెరవేర్చీ అలసిపోయిన ఆడదాని అంతిమ యాత్ర, చివరి క్షణంలో ప్రశాంతంగా సాగాలన్నదే నా ప్రయత్నం. రేపు నాకూ ఇలాంటి ప్రశాంతతే అవసరం. నెను చెప్పే నీతులు పిల్లలు వింటారా?నేనేం చెప్పానో అది చేయరు. నేనేం చేసానో 

చూసి, నా పిల్లలూ అదే చేస్తారు. నేనే కాదు ఎవరికైనా ఉపదేశాలు కాదు ఆచరణే ముఖ్యం" అనేది. 


వినేవాళ్ళకి నిజమేగా అనిపించేది. 

రెండున్నరేళ్ళు గడిచాయ్. ఆరోజు ఆఖరి శ్వాస విడిచింది అమ్మ. కానీ! అప్పటి నుండీ విహ్వల చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తోంది. 

నిజంగానే ఇదంతా అమ్మ పోయిన మెంటల్ డిప్రెషనేనా? 


"అదిగో! చప్పుడు! వస్తున్నా!" అంటూ పరుగెత్తింది విహ్వల. నిట్టూర్చాను నేను. 

ప్రతిక్షణం ఆవిడ సేవలో నిమగ్నమైన ఆమెకు కర్రచప్పుడు మైండ్ లో అలా 

ఆలాపనగా మిగిలిపోయింది. 


ఎంత వేగంగా వెళ్ళిందో, అంత వేగంగానూ, తిరిగివచ్చి, కుర్చీలో కూలబడింది. ఏడుపైతే లేదు. ఏడవాల్సిన అవసరమూ లేదు. 

వయసుడిగిన ఈ వయసులో చెట్టు పండు, రాలటం ఎంత సహజమో, పండు ముసలి రాలటమూ అంతే! ఈవిషయాన్ని నా చెల్లీ, నేనూ పిల్లలూ తట్టుకుని నిలబడ గలిగాం. తట్టుకోటం అనేదికూడా పెద్ద మాటే. సహజమైన ఈ జనన మరణాల ప్రక్రియను మౌనంగా అమ్మ మరణాన్ని 'ఆహ్వానించటం' లాంటిది. మరి విహ్వల, 

మైండ్ లో ఏం తిరుగుతోంది? "అదిగో!చప్పుడు వస్తున్నా " అంటూ పరుగెత్తింది. 

గదిలోంచి మళ్ళీ వచ్చి కూర్చుంది. 


"అమ్మా! ఏంటమ్మా ఇదంతా!అక్కడ బామ్మలేదమ్మా! " కొడుకు నచ్చచెప్పటానికి ప్రయత్నించాడు. 


"అవునురా! కానీ ఆ కర్రచప్పుడు నా చెవుల్లో ప్రతిధ్వనిస్తోంది. అదిగో చప్పుడు.. 

మీ నానమ్మ కర్రచప్పుడు. " అంటూ ఎన్నిసార్లు అలా గదిలోకి పరుగెత్తుతోందో చూసే వాళ్ళకి వింతగానూ, బాధగానూ ఉంది. చాలామంది ఇళ్ళల్లో పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళకి సేవలు జరుగుతాయి. వాళ్ళు గతించటమూ జరుగుతుంది. మరీ ఇలా?!

నేను బాధ పడుతూ ఆలోచనలో పడ్డాను నిరంతరమూ విహ్వలను అమ్మపనిలో అంకితం చేసానా?


ఆ బాధ్యతను, నేనూ, పిల్లలూ కూడా కాస్త కాస్త పంచుకున్నా, పోనీ! ఓ పని మనిషిని సేవకు నియమించినా ఈ పరిస్థితి వచ్చేదికాదేమో?!


చాలామంది లాగా, ఇలాంటి బాధ్యతలు కేవలం ఇల్లాలివే అనే మూఢత్వంలో నేనే దీనికంతటికీ కారణం అయ్యానా? ఇప్పుడేం చేయాలి? తన పరిస్థితి నిదానంగా మారుతుందిలే అని ఊరుకోవాలా? ఆమె చెప్పినట్లు, ఎన్నో బాధ్యతలు మోస్తూ, మౌనంగా జీవన ప్రయాణం సాగించే స్త్రీకి అంతిమ ప్రయాణం కాకపోయినా.. కనీసం కొంత సాంత్వన అవసరమేగా?! అందుకే పది రోజుల కార్యక్రమాలు అయిపోగానే ఆమెను తీసుకుని, సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకొని వెళ్ళాను. 


"ఇలాంటి కోడలు, ఇలాంటి భార్య, ఉన్న మీ అమ్మగారు మీరు చాలా అదృష్టవంతులు. ముందుగా మీకు అభినందనలు. ఇక ఒకే విషయమై పదేపదే ఏకాగ్రత గా చదవటం, వింటూ ఉండటం వల్ల ఇలా జరుగుతుంది. అంటే ఆ పనిలో లీనమై పోవటం. కొన్ని సినిమాలలో చూడండి. ఎక్కడ చూసినా తమ లవ్వరే కనిపిస్తున్నట్లు చూపిస్తారు. భావన బలం అయినప్పుడు ఇలాంటి ఊహలు సహజమే. చాలామంది పగలూ రాత్రీ చదివే విద్యార్థులకు ఎక్కడ చూసినా పుస్తకాలే, క్వశ్చన్ పేపర్ లే కనిపిస్తాయ్. 


వాళ్ళూఇలాంటి డిజార్డర్ తోనే బాధపడుతుంటారు. అలాంటిదే ఇదీనూ. 

కానీ! కాలంతో పాటు అన్నీ మాసిపోతాయ్. ఇదిగో ఈ మందులు వాడుతూ, స్థలం మార్పు, వాతావరణం మార్పుకు ప్రయత్నించండి. తప్పకుండా తగ్గుతుంది. చిన్న సమస్యే. కుటుంబ బాధ్యతను అందరూ సమానంగా పంచుకుంటే ఇలాంటి సమస్యలు రావు. 


వైద్య పరంగా!.. లేని కర్ర చప్పుడు ఆవిడ ఎలా అయితే ఊహిస్తూ, పరుగెడుతోందో! దాన్ని ఆపాలంటే ఒకటి, రెండుసార్లు మీరే చప్పుడు చేయండి. కేవలం మీరు చప్పుడు చేసినప్పుడు మాత్రమే ఆవిడ కదిలేటట్లు చూడండి. దానిద్వారా ఆవిడ ఆలా సైకిక్ లా అంత అలజడితో పరుగెత్తడం కొంత నియంత్రించవచ్చు. దైనందిన జీవితంలో మిగతా విషయాల్లో బాగానే ఉంటున్నారు కాబట్టి, నో ప్రాబ్లం. " అని డాక్టర్ చెప్పాక, మందులువాడుతూ, దేవాలయాలన్నీ తిరుగుతూ ఇదిగో కాశీలో అస్థికలు కూడా కలిపి, తొమ్మిది రోజులు నిద్రించేందుకు పిల్లలు అన్ని జాగ్రత్తలు తీసుకుని ఇక్కడికి పంపారు. 

 -------------

కథ విలాస్ కళ్ళముందు కదలాడుతూ వింటుండగా పూర్తి చేసాడు సిద్ధాంత్. 

అంతా విని" నిజంగా ఇలాంటి కోడళ్లున్నారా? అనిపిస్తోంది సూపరండీ.. మీరు, మీ డాక్టర్ చెప్పిన కర్ర వైద్యం నమ్మలేక పోతున్నాను. కానీ!ఎన్నో వింతలు, విశేషాల సమాహారమే కదా! ప్రపంచం!. కళ్ళ ముందుజరిగేది నమ్మాలిగా!?మరి!ఇప్పుడు ఎలాఉంది?"


"ఇదివరకటికంటే చాలానయం.. పగలు బాగానే ఉంటోంది. రాత్రిపూట లేచి అత్తగారికి తన అవసరం ఉందేమో నన్నట్లు చూస్తోంది. నేను చేసే చప్పుడు వినగానే, అత్తగారి అవసరం తీరిపోయినట్లుగా భావించి పడుకుంటోంది. నేను చెప్పేది అత్తమామలకు సేవ చేస్తే ఇలా అవ్వాలి, అవుతారనీ కాదు. పెద్దవారికి ఏకాగ్రత తో కూడిన సేవ ఇంట్లో అందరి బాధ్యత అని. ఆ సర్వేశ్వరుని కృప వలన తను మామూలు మనిషి అవుతుందనే నమ్మకం నాకు ఉంది. "


సిద్దాంత్ చెప్పేది వింటూనే.. 

విలాస్ అన్యమనస్కంగా కాటేజ్ వైపు దారితీసాడు. అతనికి ఆసమయంలో తన తల్లి గుర్తుకు వచ్చింది. 


భోజనాల సమయంలో విలాస్ కుముదిని తో ఈ కథ చెప్పాడు. ఆమె మనసూ వికలమయింది. ఆరాత్రికి కర్రచప్పుడుకు కాస్త అలవాటు పడ్డారు. మర్నాడు ఉదయం 

"విలాస్ గారూ! మేం వచ్చి రాత్రితో తొమ్మిది రోజులయింది. మా అబ్బాయి ఢిల్లీలో ఎయిర్ ఇండియా లో పనిచేస్తాడు. అక్కడికి వెడితే తను వాళ్ళు అమ్మని డాక్టర్ కి చూపిస్తానన్నాడు. ఇప్పుడు కాస్త కుదుటపడింది కాబట్టి, వైద్య పరంగా పెద్ద సమస్యేం ఉండకపోవచ్చు.


మా చిన్నవాడూ అక్కడే ఢిల్లీ హైకోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్. కొన్నాళ్ళు వాళ్ళ దగ్గర సేదతీరుతాం. మాపిల్లలు మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటారు. కాటేజ్ బిల్లు మొత్తం మేం కట్టేసాం. ఇదిగో రసీదు. మీరు ఉన్నన్ని రోజులూఉండి వెళ్ళేటప్పుడు ఈ రసీదు చూపించండి చాలు. మనం ఆత్మీయుల్లా కలిసిపోయాం. మన ఫోన్ నెంబర్లు ఇచ్చి పుచ్చుకున్నాం కదా!తరచూ కాంటాక్ట్ లో ఉందాం. ఫ్లైట్ కి టైం అయ్యింది. సెలవ్. "అన్నాడు సిద్ధాంత్. అప్రయత్నంగా సిద్ధాంత్ ని విలాస్, విహ్వలను కుముదిని, కౌగలించుకొని కన్నీళ్లు పెట్టుకున్నారు. 


"మీరు మంచి కొడుకూ కోడలుగా ఉండి, పెద్దలకు సేవచేసారు కాబట్టే, వారి ఆశీస్సులతో, మీ పిల్లలు అంత ప్రయోజకులయి, వాళ్ళూ మీ బాటలోనే ప్రయాణిస్తున్నారు. సమాజానికి ఆదర్శవంతమైన కుటుంబాన్ని అందించారు. 

ఈ కాటేజ్ ను చూపించి మాకు కనువిప్పు కలిగించినది ఎవరో కాదు!సాక్షాత్తూ కాశీ విశ్వనాథుడు, విశాలాక్షి.. మీరూపంలో వచ్చారు. కాశీకి వచ్చినవాళ్ళు, జ్ఞానాన్నైనా పొందాలి. మోక్షాన్నైనా పొందాలి. 


మేం మీ వల్ల జ్ఞానం పొందాం. మేం ఇంటికి పోయి మా అమ్మ సేవలో మోక్షం పొందుతాం. మా పిల్లలు మేం ఎంత కష్టపడ్డా ఎందుకూ కొరగాని అప్రయోజకులయ్యారో!?మాకు మీ ప్రవర్తన ద్వారా జ్ఞానోదయం అయింది. మా తప్పులు మేంసరిచేసుకోవాలి. క్షేమంగావెళ్ళిరండి " అని సాగనంపారు విలాస్ కుముదిని. 


"విలాస్ గారూ! వచ్చిన రోజునే గ్రహించాను.. మీ కుటుంబంలో ఏవో కలతలున్నాయని శివానుగ్రహంతో అవన్నీ సరికావాలి అని కోరుకుంటున్నాను " సెలవు తీసుకుంటూ అన్నాడు సిద్ధాంత్. 


తొమ్మిది రోజులూ కాశీ యాత్ర పూర్తయింది. 

ఇంటికి ప్రయాణమయిన విలాస్ తన కొడుకుల సాయంతో తల్లిని తీసుకురావటానికి 'సత్యసాయి వృద్ధాశ్రమం' లో అడుగుపెడితే, కుముదిని, 

ఆశ్రమం నుండి వచ్చే అత్తగారి కోసం శ్రధ్ధగా అన్ని ఏర్పాట్లు చేయటంలో నిమగ్నమైంది. 


సమాప్తం


భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.







Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page