కార్తీకమాసం భక్తి ముక్తిదాయకం
- Rayala Sreeramachandrakumar
- 2 days ago
- 5 min read
#RCKumar #శ్రీరామచంద్రకుమార్, #కార్తీకమాసంభక్తిముక్తిదాయకం, #TeluguDevotionalArticle
Kartheeka Masam Bhakthi MukthiDayakam - New Telugu Article Written By R C Kumar
Published In manatelugukathalu.com On 21/10/2025
కార్తీకమాసం భక్తి ముక్తిదాయకం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
కార్తీక మాసము తెలుగు సంవత్సరంలో ఎనిమిదవ నెల. పౌర్ణమి రోజున కృత్తిక నక్షత్రము (అనగా చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసిన రోజు) కావున ఈ నెల కార్తీకము. ఈ నెలలో శివుడు, విష్ణువులిద్దరి పూజలు చేయడం పరమ పావనం.
కార్తీక మాసంలో పాటించే ఆచారాల ప్రకారం సూర్యోదయానికి ముందే నదులు, చెరువులు లేదా ఇంటి వద్దే పవిత్ర స్నానం చేయడం శుభప్రదం. ఆ తర్వాత తులసి పూజ, దీపారాధన చేసుకోవాలి. ఉండగలిగితే కార్తీక సోమవారాలు, ఏకాదశులు, పౌర్ణమి రోజున ఉపవాసాల వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. స్కంద పురాణంలో ఈ కింది శ్లోకం కనబడుతుంది.
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్,
న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్.
అర్ధం: కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి పవిత్ర నది వేరేది ఏదీ లేదు.
సూతమహర్షి నైమిశారణ్యంలో శౌనకాది మునుల కోరిక మేరకు సూతమహర్షి కార్తీక పురాణాన్ని వివరించారు. కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యతను వివరించే పవిత్ర గ్రంథమే కార్తీక పురాణం. ఇందులో కార్తీక వ్రత నియమాలు, సోమవారం వ్రత మహిమ, దీపారాధన, దీపదానాల ప్రాముఖ్యత, వివిధ వ్రతాల కథలు ఉంటాయి. ఈ పురాణం ప్రకారం, ఈ మాసంలో చేసే ప్రతి భక్తి కార్యం ఎన్నో రెట్లు పుణ్యఫలాలను ఇస్తుంది. కార్తీక మాసంలో చేయవలసిన వ్రతాలు, పూజలు, స్నానాలు, దానాలు, వాటి మహిమల గురించి కూడా ఈ పురాణం వివరిస్తుంది. కార్తీక పురాణంలోని ప్రధాన అంశాలలో కొన్నింటిని తెలుసుకుందాం.
శివ కేశవుల అభేద్యాన్ని సూచిస్తూ శివునికి, విష్ణువుకి ఈ మాసం ప్రీతికరమైనదిగా చెప్పబడింది. పురాణంలో మొదటి 15 అధ్యాయాలు శివుని మహిమను తెలియజేస్తే, తరువాతి 15 అధ్యాయాలు శ్రీమహావిష్ణువు విశిష్టతను వివరిస్తాయి. కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం చేయడం వల్ల కలిగే గొప్ప ఫలితాలను పురాణ కథల ద్వారా కళ్ళకు కట్టినట్టు వివరిస్తుంది.
ఈ మాసంలో నదిలో లేదా పవిత్ర జలాల్లో స్నానం చేయడం వలన పాపాలు తొలగి ముక్తి లభిస్తుందని కార్తీక పురాణం ద్వారా తెలుస్తుంది. పురాణం వివరిస్తుంది. కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండి, శివ పూజ చేయడం వల్ల విశేష ఫలాలు లభిస్తాయని ఈ పురాణంలో పేర్కొనబడింది. కార్తీక మాసంలో చేసే వనభోజనాల గురించి, వాటి ప్రాధాన్యత గురించి పురాణం సవివరంగా తెలియజేస్తుంది. కార్తీక పురాణాన్ని కార్తీక మాసంలో ప్రతి రోజూ పఠించడం లేదా వినడం వలన సకల పాపాలు తొలగి, మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.
కార్తీకమాసంలో ఉసిరిక దీపం వెలిగించడం వెనుక అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య సంబంధిత కారణాలు ఉన్నాయి. ఉసిరి చెట్టు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపమని, లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ మాసంలో ఉసిరిని పూజించడం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.
కార్తీకమాసంలో ఉసిరిచెట్టు కింద దీపం వెలిగిస్తే శివకేశవుల అనుగ్రహం లభిస్తుందని విశ్వసిస్తారు. ఉసిరి చెట్టులో శివుడు, విష్ణువు, బ్రహ్మతో సహా సకల దేవతలు కొలువై ఉంటారు. ఉసిరిక దీపం పెట్టే విధానం గురించి తెలుసుకుందాం. ఒక ఉసిరికాయను తీసుకుని, దానిపై చిన్న గాటు పెట్టి గింజను తీసివేయాలి. ఆ స్థానంలో నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి, దూదితో చేసిన వత్తిని వేసి దీపం వెలిగించాలి.
దీన్ని ఉసిరి చెట్టు దగ్గర, తులసి కోట వద్ద, శివాలయం లేదా విష్ణు ఆలయంలో పెట్టవచ్చు. కార్తీక పౌర్ణమి, సోమవారాలు, ఏకాదశి, ద్వాదశి వంటి రోజుల్లో ఈ దీపం పెట్టడం మరింతగా ఫలితాన్ని ఇస్తుంది.
కార్తీక మాసం అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది వనభోజనాలు. వనం అంటే వృక్షాల సముదాయం. కార్తీక వనభోజనం అంటే, కార్తీక మాసంలో బంధుమిత్రులతో కలిసి చెట్ల నీడలో, ముఖ్యంగా ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం చాలా మంచిది. చెట్లను దైవస్వరూపాలుగా భావించి పూజించే సంప్రదాయంలో భాగంగా ప్రకృతితో మనకున్న బంధాన్ని గుర్తుచేసుకునే ఒక వేడుక ఈ వనభోజనం. ఈ ఆచారం ఆధ్యాత్మికత, సామాజిక సమైక్యత, మరియు ఆరోగ్యానికి తోడ్పడటమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుంది.
ఉసిరి చెట్టు కింద పూజ చేసి నలుగురితో కలిసి సామాజికంగా భోంచేసిన తరవాత కార్తీక పురాణం వినాలి. లౌకికత్వానికి సంబంధించిన విషయాలు ఉండకూడదు. కార్తీక పౌర్ణమి రోజు నైమిశారణ్యంలో మునులంతా కలసి సూతమహర్షి ఆధ్వర్యంలో వనభోజనాలు చేసినట్టు కార్తీకపురాణంలో ఉంది.
ఈ నెలలో ఉసిరి చెట్టు కింద శ్రీ మహావిష్ణువుని పూజిస్తే అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని చెబుతారు. పైగా ఉసిరిచెట్టును క్షమాగుణానికి ప్రతీకగా సూచిస్తారు. లక్ష్మీనారాయణుల స్వరూపం. అందుకే ఉసిరి చెట్టుకింద వన భోజనం చేస్తారు.
కార్తీక మాసంలో దీపారాధనకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. దీపం మన శరీరం అయితే, వెలిగే కాంతి మన ఆత్మ. అంటే మనలోని ఆత్మను వెలిగించటానికి ఇది ప్రతీక. మనిషి తన అజ్ఞానంతో కోపం, ద్వేషం, దురాశ, అసూయ, పగ వంటి అనేక రకాల ప్రతికూలతలను తన దేహంలో నింపుకుంటాడు. వాటన్నింటినీ త్యజించి ఆ చీకటి నుంచి వెలుగులోకి రావాలని చెప్పటమే ఈ కార్తీక దీపాల ప్రధాన ఉద్దేశ్యం.
ఈ దీపారాధన మన ఆత్మలను చెడు కర్మల నుండి శుద్ధి చేసి పరమాత్మతో ఐక్యం చేయటానికి ఉపయోగపడుతుంది. స్వచ్ఛమైన ఆత్మ, స్వచ్ఛమైన మనస్సే నిజమైన ఆనందానికి మూలం అని ఈ కార్తీకదీపం మనకు బోధిస్తుంది. కార్తీక మాసంలో అత్యంత పవిత్రమైన రోజు పౌర్ణమి. ఆ రోజున శివాలయాల్లో ప్రత్యేక పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు. అ రోజునే ఆకాశ దీపాలు కూడా వెలిగిస్తారు.
గోరంత దీపం కొండంత వెలుగు అన్నట్టుగా పూర్వకాలంలో విద్యుత్ స్తంభాలు లేనప్పుడు బాటసారులకు వెలుగు ఇచ్చేది. దీపం జ్ఞానానికి ఔన్నత్యానికి సూచిక. ఉన్నతుడు ఎప్పుడు ఉన్నత స్థాయిలో ఉంటాడు దానికి ప్రతీకగా దీపం కూడా ఎత్తయిన కొండ ప్రాంతంలో ఉంటుంది.
ఇక తులసి మొక్క దగ్గర దీపం ఎందుకు వెలిగించాలంటే తులసి లక్ష్మీ స్వరూపం దీపం కూడా లక్ష్మీ స్వరూపమే. పూర్వం దుర్వాస మహర్షి ఒకసారి దేవేంద్రుడు ఇచ్చిన ఆతిథ్యానికి సంతసించి, ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు. ఇంద్రుడు దానిని తిరస్కార భావముతో తన వద్దనున్న ఐరావతము అనే ఏనుగు మెడలో వేయగా అది ఆ హారాన్ని కాలితో తొక్కివేస్తుంది.
అది చూచిన దుర్వాసనుడు ఆగ్రహము చెంది దేవేంద్రుని శపిస్తాడు. తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యాన్ని కోల్పోయి, సర్వసంపదలు పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు. ఈ పరిస్థితిని గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని తులసి చెట్టు దగ్గర ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మీ స్వరూపంగా భావించి పూజించమని సూచిస్తాడు.
ఆ విధంగా చేయగా తృప్తిచెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలను పొందాడని పురాణాలు చెబుతున్నాయి. ఇది దీపం యొక్క ప్రాముఖ్యత.
ఇక దానాల విషయానికి వస్తే కర్మక్షయం కోసం సంపద కలిగిన వారు దానధర్మాలు చేయాలి. లేనివాళ్లు కార్తీక మాసంలో బ్రాహ్మణుడికి కొద్దిపాటి దక్షిణతో దీపదానం చేసినా ఫలితం దక్కుతుంది. కార్తీక మాసంలో దీపాలను దానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి, కోరికలు నెరవేరుతాయని నమ్మకం.
ఈ మాసంలో సాలగ్రామాన్ని దానం చేస్తే విశేష ఫలితాలు లభిస్తాయి. నారాయణుడు కలికాలంలో భక్తుల సౌలభ్యం కోసం సాలగ్రామ రూపం ధరించాడని కార్తీక పురాణం చెబుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు అన్నదానం చేయడం మంచిది. ఈ రోజు విష్ణువు నిద్ర నుంచి మేల్కొనే సమయం. వస్త్ర దానం దానం చేయడం కూడా పుణ్యప్రదం. ఇది దుఃఖాన్ని దూరం చేస్తుందని నమ్ముతారు.
అవసరం ఉన్నవారికి బియ్యం, డబ్బు లేదా ఇతర అవసరమైన వస్తువులు దానం చేయవచ్చు. సాలగ్రామ దానానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఉంది. ఏదైనా దానం అనేది శక్తి కొలది, మనస్ఫూర్తిగా, శ్రద్ధగా చేయాలి. చిన్న సహాయమైనా శ్రద్ధతో చేస్తే అధిక ఫలితం లభిస్తుంది.
ఈ మాసంలో చేయవలసిన మరొక రెండు కార్యాలు దామోదర లేదా హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం మరియు భగవద్గీత పారాయణం లేదా శ్రవణం. ఈ పవిత్ర మాసంలో దైవనామాల శక్తి మరింత ప్రభావితంగా ఉంటుంది. దామోదర మహామంత్రాన్ని లేదా హరే కృష్ణ మహామంత్రాన్ని ప్రతిరోజూ జపించడం వల్ల మనస్సు శుద్ధి అవుతుంది మరియు దైవంతో ఆత్మకు ఉన్న సంబంధాన్ని మేల్కొల్పుతుంది.
ఇతర సమయాల్లో వేలాది సార్లు జపించిన పుణ్యం కార్తీక మాసంలో ఒకసారి జపించినా లభిస్తుందని భక్తులు నమ్ముతారు. ఈ పవిత్ర తరంగాలు మనస్సును ప్రశాంతపరచడానికి, అంతర్గత శక్తిని మేల్కొల్పడానికి సహాయ పడతాయి. కర్తవ్యం మరియు ఆధ్యాత్మిక జ్ఞానంపై కాలాతీత బోధన అయిన భగవద్గీతకు కార్తీక మాసంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
ఈ నెలలో ఒక్క శ్లోకం చదవడం కూడా మొత్తం వేదాధ్యయనం సమానమైన ప్రయోజనాన్ని కలిగి ఉంటుందని నమ్ముతారు. పఠనం వెనుక ఉన్న ఉద్దేశ్యం పరిమాణం కంటే ముఖ్యమైనది. గీతా బోధనల నుండి కేవలం ఒక సత్యాన్ని అర్థం చేసుకుని ఆచరించినా జీవితం ధన్యమవుతుంది
కార్తీక మాసం అనేది ఆధ్యాత్మిక ప్రవృత్తిని పెంచుకోవడానికి, భక్తి భావాన్ని, పవిత్రతను నింపుకునేందుకు ఒక మంచి అవకాశం.
స్వస్తి..
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
Comments