top of page

కస్తూరి రంగ రంగా!! 10


'Kasthuri Ranga Ranga Episode 10' Telugu Web Series


Written By Ch. C. S. Sarma




(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

గోపాలయ్యగారి సోదరి దుర్గాదేవికి తన పెద్ద కొడుకు భూషణ్ కుమార్ కి కస్తూరితో వివాహం జరిపించాలని కోరిక.

అందుకు గోపాలయ్య అంగీకరించక పోవడంతో కక్ష పెంచుకుంటుంది.

రంగా, కస్తూరిలు కలిసి ఉన్న ఫోటోలు గోపాలయ్యకు పంపుతాడు భూషణ్.

గోపాలయ్య మాట మీద రంగా వూరు విడిచి వెళ్తాడు.


ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 10 చదవండి.


"భోజనానంతరం.. ఇరువురూ ఆ వూరి పోలీస్టేషన్ కు వెళ్లారు. కారును ఆపి ఇరువురూ దిగారు. స్టేషన్ ఇన్ఛార్జి ఇనస్పెక్టర్ కొత్తగా వచ్చిన దానయ్య పరుగున వచ్చి యస్. పి. , కస్తూరి రంగకు, డి. యన్. పి. వసంతదేశాయ్ కు సెల్యూట్ చేశాడు.


ముందు ఇనస్పెక్టర్ దానయ్య, వెనుక రంగా, వసంత్ లు ఆఫీసులో ప్రవేశించారు. డ్యూటీలో వున్న పోలీసు కానిస్టేబుల్స్ సవినయంగా సెల్యూట్స్ చేశారు.


కస్తూరి రంగ.. వసంత్ దేశాయ్ కూర్చున్నారు.. ఎదురుగా దానయ్య నిలబడి ఉన్నారు.

“మీ పేరు?.. ” అడిగాడు కస్తూరిరంగ.

“దానయ్య సార్!.. ” ఇన స్పెక్టర్ జవాబు.


"మీరు ఇక్కడికి కొత్తగా వచ్చారు కదూ!.. ".

"అవును సార్!.. రెండు వారాలయింది.. ”

"కూర్చోండి.. ఇక్కడ ఎంతమంది స్టాఫ్ వున్నారు?"

దానయ్య కూర్చున్నాడు.

"సార్.. కానిస్టేబుల్స్ ముగ్గురు.. జూనియర్సు ఏడుగురు..

మొత్తం పదిమంది సార్.. "


"మీలో ఈ వూర్లో అందిరిలో ఎవరికి సీనియారిటీ?.. "

"హెడ్ కానిస్టేబుల్ సీతారామ్ కి సార్!.. "

"అతన్ని పిలవండి.. "

ఇనస్పెక్టర్ దానయ్య సీతారామ్ ను పిలిచాడు.

సీతారామ్.. కస్తూరిరంగ ముందుకు వచ్చి నిలబడి సెల్యూట్ చేశాడు.


"మీ పేరు?.. "

"సి. సీతారాం సార్!... "

"సి.. అంటే?.. "

“చింతలూరి.. ”


"అది మీ ఇంటి పేరు కదూ!.. "

“అవును సార్!.. ”

"మీ సొంతవూరు ఏది?.. "

“ఇదే సార్!.. ”


"ఇక్కడ ఉద్యోగరీత్యా ఎంతకాలంగా ఉంటున్నారు?.. ".

“ఆరు సంవత్సరాలుగా.. ”.

“ఆరు సంవత్సరాలుగా ఇదే స్టేషనా!.. " ఆశ్చర్యంతో అడిగాడు వసంత్.


కస్తూరి రంగ నవ్వాడు.

"సార్!.. తప్పుగా అడిగానా!.. ”


“అతని జవాబుకు అడగలసిన ప్రశ్ననే అడిగావు వసంత్!.. "

వసంత్ కూడ నవ్వాడు.


"సో!.. సీతారాం సార్!.. మీకు ఈ స్టేషన్ కు.. ఈ వూరికి.. సంబంధించిన అన్ని విషయాలు బాగా తెలిసివుండాలి.. అవునా కాదా!.. ” అడిగాడు వసంత్...

సీతారామ్ బెదిరిపోయి తలదించుకున్నాడు.


“దానయ్య సార్.. మీరేమంటారు?.. "

"ఏ విషయంలో సార్!.. " దీనంగా అడిగాడు.


“సీతారాంగారి విషయంలో.. అంటే వారికి ఈ వూరిని గురించి మనుష్యుల గురించి బాగా తెలిసి వుంటుందని నా అభిప్రాయం.. మీరేమంటారు?.. ” అడిగాడు వసంత్..

"ఆ.. అవును సార్!.. ఆరేళ్లుగా వుంటున్నాడు కాబట్టి తప్పక తెలిపి

వుండాలి సార్!!... "


"అవును.. ఎస్. ఐ. సుల్తాన్ ఈవూరి నుండి జీప్ లో హైదరాబాద్ కు బయలుదేరాడు. హైవేన వారి జీప్‌లో.. బ్రహ్మయ్యగారి ఇంట్లో.. సయ్యద్ గారి ఇంట్లో.. బాంబు ప్రేలుడు సంభవించిన సమయం.. ఆల్మోస్ట్ ఒకే సమయం కదూ సీతారాం గారూ!.. " అడిగాడు రంగా.


"సార్!.. సార్.. హైవేలో ఎన్నిగంటలకు జరిగిందో నాకు సరిగా తెలియదు సార్!.. కానీ ఈ వూర్లో బ్రహ్మయ్య సార్.. సయ్యద్ సార్ ఇండ్లలో.. ఒకేసారి జరిగింది సార్!.. " భయంతో చెప్పాడు సీతారామ్..

“ఏ టైమ్ లో!?.. ”


"రాత్రి పన్నెండున్నర ప్రాంతం సార్!..

“అపుడు మీరు ఎక్కడ వున్నారు?...

"స్టేషన్ లో డ్యూటీలో వున్నాను సార్!.. "

"మేల్కొని వున్నారా?.. " అడిగాడు వసంత్.


"స్టేషన్ లో డ్యూటీలో వున్నాను సార్.. ఆ.. ఆ.. మేల్కొనే వున్నాను సార్!.. "

"బాంబు పేలుడు వినబడగానే మీరు ఏంచేశారు?.. ” అడిగాడు కస్తూరి రంగ..


"సార్!.. నిజాన్ని చెప్పమంటారా సార్.. " దీనంగా అడిగాడు సీతారామ్..

"మీకు పై అధికారులతో అబద్ధం చెప్పే అలవాటు వుందా!.. " వ్యంగ్యంగా అడిగాడు వసంత్.


కస్తూరి రంగా నవ్వాడు. వెంటనే సీతారామ్ ముఖంలోకి తీక్షణంగా చూచాడు.

సీతారామ్ భయంతో తలదించుకొన్నాడు.


"సీతారామ్!.. భయపడకుండా ఏం చేశారో యదార్థం చెప్పండి.. ” అనునయంగా అడిగాడు ఇనస్పెక్టర్ దానయ్య.

"సార్!.. "

"ఆ.. చెప్పండి!.. "


"ఆ శబ్దానికి నేను భయపడ్డాను సార్.. నాతో వున్న 102 కోటయ్య 'సార్' అని పెద్దగా అరిచాడు సార్!.. కొన్ని నిముషాలు మాకు ఏమీ తోచలేదు సార్. ఇంతలో.. సెల్లో వున్న పట్టుకొన్న స్మగ్లర్ యూరిన్ పాస్ చేయాలని అరిచాడు సార్. కోటయ్య గది తలుపు తెరిచి అతన్ని బయటికి తీసుకొచ్చాడు సార్.. " సీతారామ్ చెప్పడం ఆపి తలదించుకొన్నాడు.


"తర్వాత.. " అడిగాడు కస్తూరి రంగ. "యూరిన్ కి కూర్చున్న స్మగ్లర్ మాకు కనబడలేదు సార్.. " దీనంగా చెప్పాడు సీతారామ్..

“అంటే!.. ” అడిగాడు కస్తూరి రంగ

"పారిపోయాడా!... అడిగాడు వసంత్.

“ఆ అ.. వు.. ను.. సా.. ర్!.. " విచారంగా మెల్లగా చెప్పాడు సీతారామ్.

కస్తూరి రంగ వసంత ముఖంలోకి చూచాడు.

"ఆ.. తర్వాత ఏంశారు?.. " అడిగాడు వసంత్.

"స్మగ్లర్ కోసం వెతికాం సార్.. " దీనంగా చెప్పాడు సీతారాం.

"ఎక్కడ?.. " కస్తూరి రంగ ప్రశ్న..


"చుట్టుపక్కల సార్.. " సీతారామ్ జవాబు.

"ఎంతసేపు వెతికారు?.. " వసంత్ ప్రశ్న.

"ఓ అరగంట సార్!.. "

"ఫలితం?.. " అడిగాడు వసంత్.


"దొరకలేదు సార్.. " విచారంగా చెప్పాడు సీతారామ్..

"మరి.. బాంబు ప్రేలిన చోటికి ఎపుడు వెళ్లారు?.. కస్తూరి రంగ ప్రశ్న.

"అరగంట తర్వాత సార్...

"మీరు అక్కడికి వెళ్లే సరికి ఎంతమంది అక్కడికి చేరారు?.. " వసంత్ ప్రశ్న..


"అసలు ముందు ఎక్కడికి వెళ్లారు?.. " రంగా ప్రశ్న..

"బ్రహ్మయ్యగారి ఇంటికి సర్. స్టేషన్ కు వారి ఇల్లు దగ్గర.. ".

“మరి సయ్యద్ ఇంటికి ఎప్పుడు వెళ్లారు?.. " కస్తూరి రంగ ప్రశ్న.


"ఓ గంట తర్వాత సార్!.. "

"ఈ రెండుచోట్ల మీరు ఏం చేశారు?.. " అడిగాడు వసంత్..

జవాబు చెప్పలేక సీతారామ్ తలదించుకొన్నాడు.


"సార్!.. రిమాండ్లో వున్న స్మగ్లర్ పారిపోయేటప్పటికి సీతారామ్ గారికి భయంతో అటూఇటూ తిరిగాడే కానీ ఏమీ చేయలేదు.


హైదరాబాదు నుండి బ్రహ్మయ్యగారి అక్క దుర్గాదేవి పెద్దకొడుకు చనిపోయిన బ్రహ్మయ్యగారి అన్నగారైన గోపాలయ్యగారి ఆస్థి వివరాలను గురించి మట్లాడాలని వచ్చిన భూషణ కుమార్ కొనవూపిరితో వున్న బ్రహ్మయ్యగారి చికిత్స కోసం విజయవాడకు తీసుకొని వెళ్లేదానికి ప్రయత్నించారు. కాని వూరుదాటక ముందే బ్రహ్మయ్యగారు మరణించారు. అతని మనుమడు శాలివాహన.. సయ్యద్ సార్ర్ భార్య, కుమార్తె మరణించారు. పాపం.. సీతారామ్ భయంతో ఈ విషయాలను మీకు చెప్పలేకపోయాడు. ఆయన చెప్పగా నాకు తెలిసిని విషయాలు ఇవి సార్.. " వివరంగా చెప్పాడు ఇనస్పెక్టర్ దానయ్య.


కస్తూరి రంగ కొన్ని క్షణాలు కళ్లు మూసుకొన్నాడు. తర్వాత మెల్లగా తెరచి.. దానయ్యను చూస్తూ..

“దానయ్యా!.. ”

"సార్!.. "

"భూషణ్ కుమార్ ఆ రాత్రి సమయంలోనే ఎందుకు వచ్చినట్టు?.. "


"అదే చెప్పానుకదా సార్!.. బ్రహ్మయ్యగారితో వారి అన్నగారైన గోపాలయ్యగారి ఆస్తి వివరాలను గురించి మాట్లాడేదానికి.. "

"వచ్చాడు అని చెప్పావు దానయ్యా!.. ఆ రావటం అర్ధరాత్రి సమయంలోనా రావడం?.. " అడిగాడు కస్తూరి రంగ

"నేనూ ఈ ప్రశ్నను సీతారామ్‌ను అడిగాను సార్!.. ".

"దానికి జవాబు!.. " అడిగాడు వసంత్.


"దానయ్యా.. సీతారామ్ గారిని చెప్పమనండి.. " అన్నాడు కస్తూరి రంగ.

"ఆ.. సీతారామ్ చెప్పండి.. సార్ ప్రశ్నకు జవాబు చెప్పండి!.. " అన్నాడు దానయ్య.

"సార్... " మెల్లగా పిలిచాడు సీతారామ్..

"సీతారామ్!.. నా ప్రశ్నను విను.. అర్ధరాత్రి సమయంలో భూషణ్ కుమార్ బ్రహ్మయ్యగారిని ఎందుకు కలసికొనేదానికి వచ్చినట్టు?.. జవాబు భయపడకుండా చెప్పు.. " అనునయంగా అడిగాడు కస్తూరిరంగ.


"సార్!.. వారు హైదరాబాద్ నుండి విజయవాడకు వచ్చి.. అక్కడ ఏదోపని వుంటే చూచుకొని... బ్రహ్మయ్యగారితో కలసి మాట్లాడాలని రేపల్లెకు వచ్చారట. వారు వచ్చేదానికి ముందు అరగంట క్రితం బాంబు ప్రేలి.. బ్రహ్మయ్యగారు చావుబ్రతుకుల మధ్యన వున్నారు. భూషణ్ కుమార్ గారు వారిని వైద్యంకోసం తన కార్లో విజయవాడకు తీసుకొని వెళుతుండగా గ్రామం దాటక మునుపే బ్రహ్మయ్యగారు మరణించారు సార్.. " అతి కష్టంమ్మీద సీతారామ్ చెప్పాడు..

"ఓహో.. అదా విషయం.. " అన్నాడు రంగా సాలోచనగా..

"అవును సార్!.. ఇదే అందరూ అనుకొన్న విషయం సార్!.. " చెప్పాడు దానయ్య.


సీతారామ్ తల ఆడించాడు.

"వసంత్!.. "

"సీతారామ్ చెప్పింది విన్నావుగా!.. ".

"ఆ.. విన్నాను సార్!.. "


"సరే!.. దానయ్యా.. సీతారామ్ సార్.. థ్యాంక్యూ.. ఆ.. సయ్యద్ సార్ ఎక్కడ వుంటారు?.. "

"వారి ఇంటి ఆవరణలో ఓ పూరింట్లో వుంటారు సార్.. " దానయ్య జవాబు.


"ఓకే.. రేపు కలుద్దాం.. ఇక మేము బయలుదేరుతాం.. విజయవాడ నైట్ హాల్ట్.. బై.. " కస్తూరి రంగ.. వసంత్ కార్లో కూర్చున్నారు..

దానయ్య.. సీతారామ్ లు స్టయిల్‌గా సెల్యూట్ చేశారు.


***

కస్తూరి రంగ.. వసంత్ లు విజయవాడ చేరారు. హెూటల్లో బస.. యధాప్రకారం నాలుగున్నరకు లేచాడు రంగ..


"కౌసల్యా సుప్రజారామా.. పూర్వా సంధ్యా ప్రవర్ధతే.. ఉత్తిష్ఠ నరశార్దూలౌ.. కర్తవ్యం దైవమాహ్నికం... ”

గొంతు విప్పి పాడాడు కస్తూరిరంగ....


అతని గొంతు విని వసంత్ మేల్కొన్నాడు.

కస్తూరిరంగ ముఖంలోకి చూచాడు.

అరచేతులను తొలుత చూచి కళ్లకు అద్దుకొని మంచం దిగాడు కస్తూరిరంగ.


"బాస్!.. గుడ్మార్నింగ్.. "

ఒళ్లు విరుస్తూ చెప్పాడు వసంత్..

"యస్.. యస్.. గుడ్మార్నింగ్ వసంత్.. "

"బాస్.. టైమెంత?... "

"నాలుగూ నలభై అయిదు.. టెన్ మినిట్స్ లో జాగింగ్ కు బయలుదేరాలి.. వస్తావా!.. లేక.. నేను తిరిగివచ్చేవరకు పడుకొంటావా?.. "


"బాస్!.. మీరు నన్ను వదిలేసి వెళతరా!.. "

"నాతో ఎవరు వచ్చినా రాకపోయినా నాకు భయంలేదు వసంత్.. నా దినచర్య నా యిష్ట ప్రకారమే జరుగుతుంది. "

"బాస్!.. నౌ వి ఆర్ ఏ టీమ్ కదా!.. "


"కాదని నేను అనలేదే!.. " చిరునవ్వుతో చెప్పాడు కస్తూరిరంగ.

"టెన్ మినిట్స్ బాస్.. రెస్టు రూమ్ కు వెళ్లి బయలుదేరుదాము. ఇకపై.. మన ఇన్విస్టిగేషన్లో మన ఇరువురం కలసివున్న సమయంలో నేను మిమ్మల్ని ఫాలో కావడం నా విధి.. "


"ఏంటీ?... " ఆశ్చర్యంతో అడిగాడు రంగ.

"విధి.. " వసంత్ జవాబు.

"విధా!.. "

"అవును బాస్!.. అదే డ్యూటీ!.. " నవ్వాడు వసంత్.

"వసంత్!.. " అనునయంగా మెల్లగా పిలిచాడు రంగ.

"బాస్!.. " రంగా ముఖంలోకి చూచాడు వసంత్.

"వసంత్!.. " వసంత్ ముఖంలోకి చూస్తూ పలికాడు రంగ. రంగా ముఖంలోని సీరియస్‌నెస్‌ను చూచి వసంత్ మెల్లగా..

"బాస్!.. " అన్నాడు..


"ఈ సమయంలో నీవు అనవలసిన మాట విధి కాదు.. ధర్మం.. నీవు తెలుగుభాషను ఇంకా జాగ్రత్తగా నేర్చుకోవాలి. మన పెద్దలముందు నీవు తప్పుగా మాట్లాడితే అవమాన పడవలసి వస్తుంది. విధి.. అయిష్టంగా చేసే పని.. ధర్మం.. ఆనందంగా చేయవలసినది. విధి అనుకొంటూ ఆ పనిలో పూర్తిగా ఇన్వాల్వ్.. లగ్నం.. కాలేము. ధర్మం అనే భావన మనస్సున ఉంటే.. ఎంతటి కష్టానైనా లెక్కచేయము. మన దృష్టి ఫలితసాధనమీదనే వుంటుంది. మనం ఇరువురం కలసి వున్నపుడు నీవు నాతో తెలుగులోనే మాట్లాడు. త్వరలో స్వచ్ఛమైన తెలుగును నేర్చుకోగలవు.... అనునయంగా చెప్పాడు కస్తూరిరంగ.


కళ్లు పెద్దవిచేసి రంగాముఖంలోకి చూస్తూ.. “అలాగే బాస్!.. ధ్యాంక్యూ!.. సర్ " బాత్రూమ్ వైపు చూపుడువ్రేలిని చూపుతూ పరుగున రెస్టు రూమ్ లో దూరాడు.


వసంత్ బయటకు వచ్చాక ఇరువురూ గదికి తాళం బిగించి రిసెప్షన్ లో తాళం ఇచ్చి రోడ్డు సైడ్ గా బయలుదేరారు.

"వసంత్!.. "

"సార్!.. '


"జాగింగ్ ముగిసే వరకు నో టాకింగ్!.. " చిరునవ్వుతో చెప్పాడు రంగా..

"అలాగే సార్!.. " తల ఆడించాడు వసంత్..


ఇరువురు పది నిముషాల్లో కృష్ణానది ఒడ్డుకు చేరారు. విద్యుద్దీపకాంతిలో కృష్ణమ్మ నీరు మెరుస్తూ వింత అందాలను వెదజల్లుతోంది. ప్రశాంతమైన సమయం.. ఆకాశం ఓ దినకరునకు స్వాగతం పలుకుతూ ఎగిరే పక్షులు.. వాటి కుహు.. కుహు.. రవాలు వీనులకు విందు చేస్తున్నాయి. ఇరువురూ ఆకాశం వైపు చూచి.. నది ఒడ్డున కొంతదూరం సాగి వెనుతిరిగారు. మౌనంగానే గదికి చేరారు. సమయం ఆరున్నర.. స్నానాలు ముగించారు. రంగా టీ ఆర్డర్ చేశాడు. సోఫాలో కూర్చున్నాడు. ఎదుటే సోఫాలో వసంత్ కూర్చున్నాడు. గదికి తిరిగి వచ్చిన దగ్గరనుంచి అంతవరకూ రంగా చెప్పిన మాట ప్రకారం వసంత్ నోరు తెరవలేదు.

బేరర్ టీ ప్లాస్క్.. గ్లాసులతో వచ్చి రెండు గ్లాసులలో దీని నింపి ఇరువురికి అందించాడు.


వసంత్ టీని సిప్ చేశాడు.

"ఎలా వుంది వసంత్?.. " అడిగాడు కస్తూరి రంగ.

"అమ్మయ్యా!.. " నవ్వాడు వసంత్...

"ఏమిటి?.. " రంగా ప్రశ్న...

"మీరు నోరు విప్పారుగా!.. అంటే ఇక నేను మాట్లాడవచ్చునన్న మాట!.. "


సంతోషంగా నవ్వాడు వసంత్.

కస్తూరి రంగ కూడా వసంత్ నవ్వులో పాలు పంచుకొన్నాడు.

వారి నవ్వులను చూచి బేరర్ కూడ నవ్వుతూ వారి ముఖాల్లోకి చూచాడు.

"సార్ ఓమాట చెప్పనా?.. " మెల్లగా అన్నాడు బేరర్.

"చెప్పండి.. " రంగా జవాబు.

"మిమ్మల్ని చూస్తుంటే మనస్సుకు ఎంతో ప్రశాంతంగావుంది సార్.. " నవ్వుతూ చెప్పాడు.

"అలాగా!.. "

"అవును సార్!.. "


"ఆటుచూడు... " అన్నాడు కస్తూరి రంగా.

స్టాండ్ కు తగిలించిన ఖాకీ డ్రస్.. గోడ మూల టీపాయ్ పైని టోపీలను చూపుడు వ్రేలితో చూపించాడు కస్తూరిరంగ.

ఆ వస్తువులను చూచిన బేరర్ ముఖంలోని నవ్వు మాయమయింది.

"నీ పేరేమిటి?.. ” అడిగాడు రంగ

"దుర్గ సార్!.. "


"అది ఆడ పేరు కదా?.. " వసంత్ ప్రశ్న...

"కొండపైన వున్న తల్లి పేరు.. బెజవాడ కనకదుర్గమ్మ!.. జగజ్జననీ.. కొందరు తల్లిదండ్రులు ఆ తల్లికి మొక్కుకొని శిశువు పుట్టగా.. వారు ఆ తల్లి పేరును... కూతురైతే దుర్గమ్మ.. కొడుకైతే దుర్గయ్యగా.. పెట్టుకొంటారు.. " చెప్పాడు కస్తూరి రంగ.


"బాస్.. అనేకసార్లు పనిమీద వచ్చి.. పూర్తిచేసుకొని హైదరాబాద్ తిరిగి వెళ్లాను. కానీ కొండ ఎక్కి ఆ తల్లిని దర్శించుకోలేదు.. " విచారంగా చెప్పాడు వసంత్.


"రేపు శుక్రవారం సార్!.. వెళ్లిరండి.. " నవ్వుతూ చెప్పాడు దుర్గ. కప్పులను తీసుకొని సెల్యూట్ కొట్టి వెళ్లిపోయాడు.

"మంచి ఉషారైన కుర్రాడు!.. "

"అవును.. బాస్!.. ”

"వసంత్.. "

"సార్!.. "

"మనం ఏదో పనిలో లగ్నమై మౌనంగా వున్నపుడు.. ఫర్ ఎగ్జాంపుల్.. ఇందాక మనం జాగింగ్ కు వెళ్లినప్పుడు.. నేను తిరిగివచ్చేవరకూ నోటాకింగ్ అన్నాను కదా!.. "


"యస్ బాస్!.. "

"నీవు నా మాటను పాటించావ్.. "

తనకు తెలియని ఏదో విషయాన్ని కస్తూరి రంగ తనతో చెప్పబోతున్నాడని వసంత్ గ్రహించి.. మౌనంగా తల ఆడించాడు.

"వసంత్!.. "

"సార్!.. "


అలాంటి సమయాన్ని మన దినచర్యతో మనంగా కల్పించుకోవాలి.

ఆ సమయంలో మౌనంగా.. మనకు ఈ జన్మను.. స్థితిగతులను ప్రసాదించిన ఆ సర్వేశ్వరుని.. మనకు నచ్చిన మనము మెచ్చిన నామంతో జపిస్తూ ఆ కార్యాచరణ చేయాలి.. ముగిశాక.. చూడు నీ మనస్సు.. మస్తిష్కం ఎంత ప్రశాంతంగా వుంటుందో!.. మిత్రమా!.. జాగింగ్ విషయంలో నేను ఆచరించింది అదే!.. నీకు నచ్చి నీవు మెచ్చితే ఇకపై పాటించు. ఫలితాన్ని చవిచూడు మిత్రమా!.. " చిరునవ్వుతో చెప్పాడు కస్తూరిరంగ.


కొన్ని క్షణాలు మౌనంగావుండిపోయి రంగాను తదేకంగా ఆశ్చర్యంతో చూచాడు వసంత్.

"వసంత్ ఏం అలా చూస్తున్నావ్?.. " అడిగాడు రంగ.


“మరేంలేదు సార్!.. మీరు చెప్పిన మాటలను గురించి ఆలోచిస్తున్నాను. ఇకపై నేనూ తప్పక పాటిస్తాను సార్!.. " చిరునవ్వుతో చెప్పాడు వసంత్.

"డియర్.. వెరీగుడ్!.. నవ్వాడు కస్తూరి రంగ.

ఇరువురూ డ్రస్ చేసుకొని క్రింది డైనింగ్ హాలు వైపునకు బయలుదేరారు.

వసంత్ సెల్ మ్రోగింది.

నెంబర్ చూచి కట్ చేశాడు.

"ఎవరు?.. "

"వుడ్బీ బాస్!.. " విసుగ్గా చెప్పాడు వసంత్..

"వసంత్!.. "

"సార్!.. "

"ఎందుకంత విసుగు?.. తప్పు!.. తన అవసరం ఏమిటో.. కాల్ చేసి మాట్లాడు.. "


వసంత్ నిర్లిప్తతగా నవ్వాడు.

"ప్లీజ్ కాల్ ప్రీతి.. " కళ్లు ఎగరేశాడు రంగ.

వసంత్ సెల్ ఆన్ చేశాడు.

"ఇందాక సెల్ ఎందుకు కట్ చేశావ్?.. "

"ఆ.. సిగ్నల్ కట్!.. " తొట్రుపాటుతో చెప్పాడు వసంత్.


"వసంత్.. చెప్పే అబద్ధం అతికినట్టుగా వుండాలి. విజయవాడలో సిగ్నల్ వీక్ అంటే నమ్మేటంత అమాయకురాలా నీ ప్రీతి!.. " అందంగా నవ్వాడు కస్తూరిరంగ.

"ఇంతకీ విషయం ఏమిటి?.. " అడిగాడు వసంత్.

"హైదరాబాద్ రాక ఎపుడు?.. ".


"ఆఫ్టర్ టూ డేస్!.. " కస్తూరిరంగ ముఖంలోకి చూచాడు.

అవునన్నట్టు రంగ తలాడించాడు.

"తప్పకుండా వస్తారుగా!.. "

"ఆ వస్తాను.. " వసంత్ జవాబు.


"సరే జాగ్రత్త.. నేను రేపు సాయంత్రం హైదరాబాదుకు వస్తున్నా.. నిన్ను చూడాలని.. మీ బాస్ కు నా నమస్కారాలు తెలియజేయండి. బై!.. " ప్రీతి సెల్ కట్ చేసింది.


వసంత్ రంగా ముఖంలోకి చూచాడు.

"గుడ్!.. గుడ్ సేయింగ్.. టిఫిన్ తిని రేపల్లెకు బయలుదేరుదాం. నౌ షి విల్ బి హ్యాపీ!.. " నవ్వుతూ చెప్పాడు కస్తూరిరంగ.

వసంత్ చిరునవ్వుతో తల ఆడించాడు.

---------------------------------------------------------------------------------

ఇంకా వుంది...

----------------------------------------------------------------------------------

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link



Podcast Link



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.






34 views0 comments

Comments


bottom of page