top of page

కస్తూరి రంగ రంగా!! 9


'Kasthuri Ranga Ranga Episode 9' Telugu Web Series


Written By Ch. C. S. Sarma(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో

వసంత్ తో కలిసి రేపల్లె బయలుదేరుతాడు రంగ.

దారిలో అతనికి గతం గుర్తుకు వస్తుంది.

రంగా తండ్రి మాధవయ్య పడవ నడిపే వాడు.

తండ్రి మరణించాక రంగా పడవ నడిపే వాడు.

అతని యజమాని గోపాలయ్య కూతురు కస్తూరి అంటే రంగుకు చాలా ఇష్టం.

ప్లస్ టు లో స్టేట్ ఫస్ట్ వచ్చిన కస్తూరి ఫోటో పేపర్లో పడుతుంది.


ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 9 చదవండి


గోపాలయ్యగారి సోదరి దుర్గాదేవి... కోడలి ఫొటోను పేపర్లో చూచింది. అందచందాలలో కస్తూరికి సాటి కస్తూరే...


కస్తూరి యుక్త వయస్సుకు వచ్చిన తరుణంలో మేనత్తగా తాను చేయవలసిన సాంప్రదాయ ధర్మాల నన్నింటిని దుర్గాదేవి పద్ధతిగా కస్తూరికి జరిపింది.

హైదరాబాదుకు తిరిగి వెళ్లిపోబోయేముందు అన్న గోపయ్యను... తన పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు కస్తూరికి వివాహం జరిపించాలనేది తన ఆశయం అని చెప్పింది... ఈమె నిర్ణయం ఇష్టంలేని గోపాలయ్య లౌక్యంగా... అమ్మాయి పై చదువులు చదవాలంటోందని... వివాహ ప్రసక్తి మూడు నాలుగు సంవత్సరాల తర్వాతేనని ఖచ్చితంగా చెప్పాడు గోపాలయ్య.


ఆ సమాధానం రుచించని దుర్గాదేవి... అన్నగారి మీద ఆగ్రహంతోనే హైదరాబాదు చేరింది.

కస్తూరి ఇంటర్లో స్టేట్ ఫస్టుగా వచ్చాక కొడుకు భూషణ్ కుమార్ రేపల్లెకు వచ్చి... హైదరాబాదులో మంచి కాలేజీలో కస్తూరిని చేరుస్తానని... చదువు పూర్తి అయేవరకు ఆమెను జాగ్రత్తగా చూచుకొంటానని దుర్గాదేవి ఎంతో ప్రీతితో గోపాలయ్యకు చెప్పింది. ఆమె తేనెజాలువారే మాటల పరమార్థాన్ని ఎరిగిన గోపాలయ్య.... అందుకు అంగీకరించ లేదు.


మొదటిసారి అంటే... కస్తూరి యుక్తవయస్సుకు వచ్చినపుడు... అన్నగారు తన మాటను కాదన్నందుకు... చిన్నపిల్లే కదా చదవనీ... నన్నుదాటి ఎక్కడకి పోతుందని... అనుకొంది దుర్గాదేవి... గోపాలయ్య యావత్ ఆస్తి... కస్తూరిని తన పెద్దకొడుకు భూషణ్ కుమార్ కు ఇచ్చి వివాహం చేసి తన హస్తగతం చేసుకోవాలని దుర్గాదేవి దురాశ.


ఈసారి... తనతో కూతురును గోపాలయ్య హైదరాబాద్ కు పంపి అక్కడ చదువుకొనేలా చేయాలనే తన నిర్ణయాన్ని కాదన్నందుకు... అన్నయ్యగారి మీద ఆగ్రహం కలిగింది. ఏరీతిగాననైనా కస్తూరిని తన కోడలిగా చేసుకోవాలనే నిర్ణయించుకొంది. తన నిర్ణయాన్ని కొడుకు భూషణ్ కుమార్ కు చెప్పింది.


అందానికే అందం... అయిన అపరంజి బొమ్మ కస్తూరిని భూషణ్ అపుడపుడూ రేపల్లెకు విజయవాడకు వచ్చి చూచి... మామయ్యను పరామర్శించి... కస్తూరితో సరససల్లాపాలను జరిపి... ఆనందపడిపోతూవుండేవాడు భూషణ్ కుమార్. కస్తూరికి భూషణ్ మాటలు.. చర్యలంటే అసహ్యం.


అతను వచ్చి వెళ్లే వరకు అతని నడవడికను రంగా గమనిస్తూ వుండేవాడు.

భూషణ్ కస్తూరి పట్ల హద్దులు దాటి ప్రవర్తించబోయే సమయంలో తాను ప్రవేశించి... భూషణ్ దుష్టచేష్టలకు అడ్డు తగిలేవాడు. వారిరువురికి మధ్యన వయస్సు వ్యత్యాసం ఎనిమిది సంవత్సరాలు.


ఆ కారణంగా... భూషణ్ కు రంగా మీద కోపం... పగ... ద్వేషం.. ఏర్పడ్డాయి. వయోభారం... అనారోగ్యం... కారణంగా కస్తూరి నాయనమ్మ కస్తూరి బి.యస్.సి. సెకండ్ ఇయర్లో వుండగా... రెండు వారాలు జ్వరం సోకటంతో గతించారు. ఆమె అంత్యక్రియలకు వచ్చిన దుర్గాదేవి... కార్యక్రమాలు ముగిసిన తర్వాత గోపాలయ్యతో కస్తూరి... భూషణ వివాహ ప్రసక్తిని ప్రస్తావించింది.


ఈసారి ఆమె మాటలను విన్న కస్తూరి... తన తండ్రి... చిన్నాన్నా... అన్నయ్య శశాంక్ ల సమక్షంలో... తాను మరో మూడేళ్లు వివాహం చేసుకోనని... భూషణ్ అంటే తనకు ఇష్టం లేదని తేటతెల్లంగా చెప్పింది కస్తూరి.


ఆమె నిర్ణయాన్నే గోపాలయ్య చెప్పి... దుర్గాదేవి ఆశను అడియాసగా చేశాడు. గోపాలయ్య తమ్ముడు బ్రహ్మయ్య... బ్రహ్మయ్య కొడుకు శశాంక్ కస్తూరిని గురించిన ఆశలను మనస్సు నుంచి తొలగించి... వయస్సు మీరక మునుపే భూషణు వేరే పిల్లను చూచి వివాహం జరిపించవలసిందిగా మేనత్త దుర్గాదేవికి స్పష్టంగా చెప్పారు. ఆశ నిరాశ అయిన దుర్గాదేవి మనస్సున... అంతవరకూ కస్తూరి విషయంలో తన మనస్సున ఉన్న ప్రేమాభిమానాల స్థానంలో పగ... ద్వేషం ప్రబలాయి... తన కసినంతా కొడుకు ముందు వెళ్లగ్రక్కి... కస్తూరిని నాశనం చేయమని కొడుకుని ప్రేరేపించింది.


భూషణ్ కుమార్ తరచుగా విజయవాడ... రేపల్లె చుట్టూ తిరిగేవాడు. కస్తూరి నాయనమ్మ గతించటంతో కస్తూరి తోడుగా రంగా నాయనమ్మను గోపయ్య రంగాతో మాట్లాడి రంగమ్మను విజయవాడకు మార్చాడు.


అటు నాయనమ్మకు... ఇటు కస్తూరికి సాయంగా... మగదిక్కుగా రంగా ఎక్కువ సమయం విజయవాడలో వుండేవాడు.

కస్తూరికి రంగా సాన్నిధ్యంలో నిర్భయం... స్వేచ్ఛ... ఆనందం. కృష్ణానది ఒడ్డున రంగాతో ఆనందంగా తిరిగేది.... కాలాన్ని ఎంతో సంతోషంగా గడిపేది. హాయిగా చదువుకొనేది.


భూషణ్ కుమార్ వారిరువురూ కలసి తిరుగుతూవున్న సమయంలో వారిని ఫాలోచేసి ఫొటోలు తీసేవాడు. అతని నిర్ణయం రంగాను దూరం చేయాలని... భూషణ్ ఆ ఫొటోలతో గోపాలయ్యను కలిశాడు. వాటినన్నింటిని మామగారికి చూపించి... రంగా మీద తన నోటికి వచ్చినట్టు అబద్ధాలు చెప్పి గోపాలయ్య నమ్మేటట్టుగా చేశాడు.


గోపాలయ్య రంగా సామర్ధ్యాన్ని తన కుమార్తె విద్యావిధానం సవ్యంగా సాగేదానికి వాడుకొన్నాడు అంతే... ఆ కారణంగా ఫొటోలను సాక్ష్యాలుగా చూపి... చెప్పిన భూషణ్ మాటలను గోపాలయ్య నమ్మాడు. రంగాను పిలిచాడు. నోటికి వచ్చినట్టు తిట్టాడు. అవమానించాడు. కంటపడితే చంపేస్తానని బెదిరించి వూరినుండి వెళ్లగొట్టాడు. రంగా కన్నీటితో రేపల్లె నుండి కృష్ణమ్మను దాటాడు.


తన మనవడు రంగాను గోపాలయ్య తిట్టి అవమానించి తరిమేసిన కారణంగా రంగా నాయనమ్మ ఎంతగానో బాధపడింది. సంపదకు వారు పేదవారే... కానీ గుణాలకు మాత్రం పేదవారు కాదు. పరువుకు ప్రాణాన్ని ఇస్తారు... తన మనవడికి జరిగిన అవమానానికి... రంగా వూరు విడిచి వెళ్లిపోయినందుకు... బాధతో రంగమ్మ కళ్లుమూసింది.


హైదరాబాదులో స్నేహితుడు శంకరం వద్దకు చేరిన రంగా... నాయనమ్మ మరణవార్త విని రేపల్లెకు వచ్చి మిత్రుల సాయంతో నాయనమ్మకు అంతిమ సంస్కారాలను కర్మలను నిర్వహించాడు. గోపాలయ్య తన మనుష్యుల ద్వారా రంగడికి డబ్బు పంపాడు. రంగా ఆ డబ్బును తీసుకోలేదు. తన పడవను అమ్మి నాయనమ్మ అంత్యక్రియలను ముగించి ఎవరికీ చెప్పకుండా హైదరాబాద్ వెళ్లిపోయాడు. అది జరిగి ఇప్పటికి పదిహేను సంవత్సరాలు..


కాలం చాలా శక్తివంతమైనది... ఆ కాల మహిమకు.. మానవ జీవితాల్లో ఎంతోమార్పు... ఆ మార్పు వున్నతి కావచ్చు.. పతనం కావచ్చు... అంతా ఆపై దైవనిర్ణయం... ఇది ఆస్తిక వాదం.


రంగడు... కస్తూరి... వారి కుటుంబాలు ఆస్తికులే... వారిరువురుకీ సర్వేశ్వరులను... మనసా... వాచా... కర్మలూ... నమ్మినవారే!!!...


"సార్!..." పిలిచాడు వసంత్... రంగాకు గత జ్ఞాపకాలు చెదిరి పోయాయి. తొట్రుపాటుతో కళ్లు తెరిచాడు. కస్తూరి రంగ... వసంత్ ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచాడు.

“సార్!... విజయవాడలో ప్రవేశించాము. టీ త్రాగుతారా!..."

"ఆ... లెఫ్ట్ సైడ్ హోటల్ని చూచి అపు..." చెప్పాడు రంగ.


"సరే సార్!..." కొద్ది నిముషాల్లో వసంత్ కారును హెూటల్ ముందు ఆపాడు. ఇరువురూ దిగారు. లోనికి వెళ్లి టీ త్రాగారు. బయటకు వచ్చి కారును సమీపించారు.

రంగా ... డ్రైవర్సీట్లో కూర్చున్నాడు.

వసంత్ ప్రక్కన కూర్చుంటూ...

“సార్... ఇక్కడినుండి రేపల్లె ఎంత దూరం సార్!..." అడిగాడు వసంత్.


"సెవెంటీ కేయం...." అంటూ కస్తూరి రంగా కారును స్టార్ట్ చేశాడు...

"మీరు ఈ వూరును వదిలి ఎంతకాలం అయింది సార్!..."

"ఫిఫ్టీన్ ఇయర్స్ ఓవర్..."

"మీ బంధువులు ఎవరైనా ఉన్నారా....?

రంగా విరక్తిగా నవ్వాడు.


ఆ నవ్వును గమనించిన వసంత్ "సార్... మీ నవ్వులో విచారం ఉంది....".

'అవును' అన్నట్టు తల ఆడించాడు కస్తూరి రంగ.


"రక్త సంబంధీకులు ఎవరూ లేరు... కులంవారు... దూరపు బంధువులు.. స్నేహితులు వుండేవారు... పదిహేను సంత్సరాలు గడచిపోయాయిగా!... ఎవరున్నారో!... ఎవరు లేరో... వూరిలోకి వెళ్లి విచారిస్తే... తెలుస్తుంది!...

వసంత్ రంగా ముఖాన్ని పరీక్షగా చూచాడు. అతని వదనంలో విచారం గోచరించింది వసంత్ కి.

సార్!...

"అడుగు!..."


"నేను మిమ్మల్ని అడగకూడని ప్రశ్నలు అడిగి నొప్పించానా సార్!!..." కస్తూరి రంగ ముఖంలోకి విచారంగా చూస్తూ అడిగాడు వసంత్.

గొంతు సవరించుకొని రంగ..... "లేదు మిత్రమా!!..." చిరునవ్వుతో జవాబు చెప్పాడు రంగా.

కొన్ని నిముషాలు వారిమధ్యన మౌనంగా జరిగిపోయాయి.


వసంత్ రోడ్డు రెండు వైపులా వున్న పచ్చని పైరు పొలాలను చూస్తూ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తున్నాడు.

"సార్!..."

"ఆ... "

"మీకు పంట భూములు ఏమైనా ఉన్నాయా... సార్!..."


"నేను చాలా పేదవాణ్ణి. మా నాన్నగారు కృష్ణానదిపై... వచ్చేస్తున్నాం కదా.... చూద్దువుగాని... పెనుముడి మా వూరివైపు నుండి ఆవలి దరికి... అంటే పులిగడ్డ వైపుకు పడవను నడిపేవాడు. వారు చనిపోయాక నేను నాలుగు సంవత్సరాలు నడిపాను. తర్వాత నా తలవ్రాత మారిపోయింది. వూరినే వదిలేయాల్సి వచ్చింది. వదిలేశాను....

"మీకధను నాకు వినాలని వుంది...” చెబుతారా!... నేను కధనంగా వ్రాస్తాను.. "

రంగా నవ్వాడు.... తల ఆడిస్తూ... "అ నీకే తెలుస్తుంది... సమయం వచ్చినపుడు..." అన్నాడు రంగా...


కారు కృష్ణానదిమీద నిర్మించిన (వంతెన) బ్రిడ్జిని సమీపించింది. రంగా కారును ఆపి దిగాడు.


ఆ బ్రిడ్జి నేమ్ ప్లేట్ వున్న వైపుకు నడిచాడు. వసంత్ అతన్ని అనుసరించాడు. ఆంధ్రద్రేశ్ ఆర్ అండ్ బి సంస్థవారి యాజమాన్యంలో 2006 సంవత్సరం మేనెల 27వ తేదీన కృష్ణానదిపై పులిగడ్డ - పెనుముడిల మధ్యన నిర్మించిన వారధి జాతికి అంకితం చేసినట్టు.. అప్పటి ఆంధ్రరాష్ట్ర ముఖ్యమంత్రిగారు కీర్తిశేషులు డా వై.యస్. రాజశేఖరరెడ్డి గారు ప్రారంభోత్సవం జరిపినట్టు ఆవిష్కరించిన శిలాఫలకాన్ని కస్తూరి రంగ, వసంత్ లు చూచారు. ఫొటోలు తీసుకొన్నారు. కారును సమీపించి కూర్చొని రంగా స్టార్ట్ చేశాడు. వసంత్ పక్కన కూర్చున్నాడు. కారు కదిలింది.


"వసంత్!..."

"సార్!... ఈ వంతెన ప్రారంభోత్సవం జరిగింది !... "


"రెండువేల ఆరు... మేనెల... యిరవై ఏడవతేదీ సార్!..." రంగా పూర్తిచేయక మునుపే వసంత్ వేగంగా చెప్పాడు. క్షణం తర్వాత "ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయింది సార్!..." అన్నాడు వసంత్.

"బాగా నోట్ చేశావే వసంత్!..." నవ్వాడు కస్తూరి రంగ.


"సార్!... మన పని అదేకదా సార్... అందులో ఇపుడు మనం ఇక్కడికి వచ్చింది అతిముఖ్యమైన...”

"కేసు విషయంమ్మీద..." వసంత్ ను అడ్డుకుంటూ మాట్టాడాడు కస్తూరిరంగా.


వసంత్ క్షణంసేపు రంగా ముఖంలోకి ఆశ్చర్యంగా చూచి... రంగా ముఖంలోని భావాలను గమనించి... చిరునవ్వు నవ్వాడు.


కారు రేపల్లెలో ప్రవేశించింది. హెూటల్ను చూచి కారును రోడ్డుకు ప్రక్కగా ఆపాడు కస్తూరి రంగా. ఇరువురూ కారునుండి దిగారు. హెూటల్లో భోజనానికి ప్రవేశించారు....

---------------------------------------------------------------------------------

ఇంకా వుంది...

----------------------------------------------------------------------------------

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).Twitter Link


Podcast Linkమనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.40 views0 comments

Comments


bottom of page