top of page

కస్తూరి రంగ రంగా!! 4

కథ వినడానికి ప్లే బటన్ క్లిక్ చేయండి.








కథను యు ట్యూబ్ లో చూడటానికి క్రింది లింక్ క్లిక్ చేయండి

'Kasthuri Ranga Ranga Episode 4'

Telugu Web Series

Written By Ch. C. S. Sarma


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


సిహెచ్. సీఎస్. శర్మ గారి ధారావాహిక కస్తూరి రంగ రంగా నాలుగవ భాగం


గత ఎపిసోడ్ లో

కిడ్నాపర్లలో తనకు దొరికిన వ్యక్తిని విచారిస్తాడు ఎస్సై సుల్తాన్.

కిడ్నాపర్లు ఉన్న స్థలంలో దొరికిన సిల్వర్ రింగ్ తన అన్న ఇర్ఫాన్ దని అనుమానిస్తాడు.

ఇర్ఫాన్ నేరస్థుడైతే అతన్ని అరెస్ట్ చేయడానికి వెనుకాడనని తన తల్లిదండ్రులతో చెబుతాడు.

ఇక కస్తూరి రంగ రంగా - ఎపిసోడ్ 4 చదవండి...



సమయం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతం. సయ్యద్... మిత్రులు బ్రహ్మయ్య... పుండరీకయ్యలను కలసి తన చిన్న కొడుకు చెప్పిన మాటలను వారికి చెప్పి... పెద్దకొడుకు ఇర్ఫాన్ ను పట్టుకొనేటందుకు సుల్తాన్ హైదరాబాద్ వెళ్లాడని చెప్పి... ఇంటికి తిరిగి వచ్చాడు.


“ఎక్కడినుంచి రాక..." అడిగింది ఫాతిమా.

"బ్రహ్మయ్య దగ్గరనుండి... "

“చిన్నోడు హైదరాబాదు... వెళ్లిన విషయం చెప్పావా?...”

“ఆ... చెప్పాను...”


“ఎందుకు చెప్పారు?...”

“మనవాడు వెళ్లాడు కాబట్టి చెప్పాను!..."


"ఇర్ఫాన్ మీద అనుమానంతో వెళ్లాడని చెప్పారా?...".

“చెప్పలేదు...” మెల్లగా చెప్పాడు.


ఫాతిమా తన్ను ఆ ప్రశ్న అడగటంలోని ఆంతర్యం... సయ్యద్ కు తెలుసు. బిడ్డలు ఎంత చెడ్డవారైనా వారిని నిందించడం, బెదిరించడం... మరీ కోపమొస్తే రెండు తగిలించడం... తన హక్కే అనుకొంటుంది ప్రతి మాతృమూర్తి.


అదేపని భర్త చేస్తే... అతన్ని విమర్శిస్తుంది.... తప్పు చేశారని భర్తతో వాదిస్తుంది తల్లి...

బిడ్డలకు బుద్ధి చెప్పే హక్కు... తనదిగా తల్లి భావిస్తుంది. తన దృష్టిలో తనకున్న ఆ హక్కు తన భర్తకు పిల్లలపై లేదనే ఆ తల్లి భావన. అందుకే అంటారు తల్లికి మించినది జగతిన లేదని....


ఫాతిమాలోని ఆ తత్వాన్ని ఎరిగిన సయ్యద్ ఆమెకు యదార్థం చెబితే బాధ పడుతుందని అబద్ధం చెప్పాడు...

"చిన్నోడు హైదరాబాద్ చేరి వుంటాడా?...".

"ఇప్పుడు గంట ఎనిమిది. దాదాపు పన్నెండు గంటల ప్రాంతంలో చేరుతాడు."


"నేను ఒకటి అడుగుతాను..."

"అడుగు..."


“ఒకవేళ ఇర్ఫాన్ దే ఆ ఉంగరం అయ్యి... వాడే ఆ నేరం చేసివుంటే చిన్నోడు... పెద్దన్న అనే ప్రేమ లేకుండా పెద్దోణ్ణి అరెస్టు చేస్తాడా?...” అడిగింది ఫాతిమా.

"అమ్మా!...” పిలిచింది బషీర్

"ఏందే?..."


"పిచ్చి పిచ్చి ప్రశ్నలడిగి ఎందుకు బాబాను వేధిస్తావ్?... నేరం చేసినోడు ఎవడైనా సరే శిక్ష అనుభవించాల్సిందే కదా అమ్మా!..."

'అవును' అన్నట్టుగా తల ఆడిస్తూ మాట్లాడకుండా నవ్వాడు సయ్యద్.


"అమ్మా!... లే!... అన్నం తిని పడుకొందాం..." చెప్పింది బషీర్

“నాకు ఆకలిగా లేదు... నీవు బాబా తినండి..." అంది ఫాతిమా మనోవేదనతో... విరక్తిగా...

ఆమెకు తెలుసు... తన పెద్దకొడుకు సరైన దారిన నడవడంలేదని... అయినా తల్లికదా... వాడు తప్పు చేసినా క్షమించే మనస్సు ఆమెది.


అలాగే... చిన్నవాడు సుల్తాన్... ముక్కుకు సూటిగా నడిచేవాడని... అతనికి 'నిప్పు' అనేది మారుపేరని... ఆ తల్లికి తెలుసు.


సయ్యద్ పెద్దవాడి విషయంలో ఎన్నోసార్లు సలహా ఇచ్చాడు. తత్వాన్ని మార్చుకో... మంచి మనిషిగా బ్రతకమని ప్రాథేయపూర్వకంగా చెప్పాడు. చిన్నవయస్సు నుండి అమ్మమ్మగారి ఇంట్లో హైదరాబాద్లో వుంటూ... తన మేనమామ ఖాజా పిల్లలతో చేరి రౌడీగా తయారైనాడు. పెండ్లి చేసుకొని ఆరునెలల లోపలే ఆ అమ్మాయికి 'తల్లాక్' చెప్పాడు.


ఆ కారణాలవల్ల సయ్యద్... ఇర్ఫాన్ తన చేతిని దాటి పోయాడని నిర్ణయించుకొన్నాడు. ‘చేసుకొన్నవారికి చేసికొన్నంత మహదేవా అన్నట్టు... వాడి ఖర్మను వాడు అనుభవించక తప్పదనే నిర్ణయానికి వచ్చాడు. అతన్ని గురించి తెలిసినవారు అడిగితే వారికి జవాబుగా క్లుప్తంగా హైదరాబాద్ లో వాళ్ల మామ దగ్గర వుంటూ వ్యాపారం చేసికొంటున్నాడని చెప్పి... టాపిక్ ను మార్చేవాడు.


“బషీర్!... ఖానా లగావ్ భేటీ!..." చెప్పాడు సయ్యద్.

"హా బాబా !..." బషీర్ రెండు ప్లేట్లలో బిరియానీ వుంచి తండ్రికి తల్లికి అందించింది.... గ్లాసులో మంచినీళ్లు ప్రక్కన పెట్టింది.


“అమ్మా!.. నీవు?...” అడిగాడు సయ్యద్...

“నేను తిన్నాను బాబా!!..” మీరు నెమ్మదిగా తినండి!...” తండ్రి తల్లి ముఖాల్లోకి ప్రీతిగా చూస్తూ చెప్పింది బషీర్...


భోంచేసి ముగ్గురూ పడుకొన్నారు. ఎవరి ఆలోచనలు వారివి... పోలీసులకు దొరికి పోలీస్టేషన్లో కస్టడీలో వున్న వాడికి పోలీసులు ఇచ్చిన ట్రీట్మెంట్ ను భరించలేక... తన బాస్ 'ఇర్ఫాన్...' అనే పేరు వాడు చెప్పాడు.


ఆ విషయాన్ని హెడ్కానిస్టేబుల్ సాంబయ్య ఫోన్ మూలంగా సుల్తాన్ కు తెలియజేశారు. ఆ సమాచారం విన్న తర్వాత... అంతవరకూ.. మనస్సున ఒక మూల వున్న 'ఇర్ఫాన్ కాదేమో' అనే భావన చెదిరిపోయింది. తన అన్న పసిపిల్లలను కిడ్నాప్ చేసే లెవెల్ కు దిగజారినందుకు మనస్సుకు బాధ... చేసిన రాక్షస చర్యకు అతనిపై అసహ్యం... మానవత్వంలేని మనిషిగా మారినందుకు ద్వేషం... ఇర్ఫాన్ పట్ల సుల్తాన్ కు కలిగాయి.


'వీడు ఒక్కడే కాదు... వీడి వెనకాల ఇంకా ఎంతమంది వున్నారో!... ఒక్కడుగా చేసే పని కాదిది.... వాణ్ణి పట్టుకొంటే తీగను లాగితే డొంక కదిలినట్లు... అందరూ బయటపడతారు..." అనుకొన్నాడు సుల్తాన్.


కోదాడలో టిఫిన్ టీ త్రాగి ముందుకు సాగారు. సమయం రాత్రి పన్నెండు గంటల ప్రాంతం. డ్రైవర్ సోము దీక్షగా రోడ్డువంక చూస్తూ జీప్ నడుపుతున్నాడు. మానవజీవితం చాలా విచిత్రమైనది. పుట్టిన దగ్గరనుండి... వూహ తెలిసేవరకు తల్లీ తండ్రి అండన పెరుగుతాం. ఆపై చదువు, ఉపాధికి ఉద్యోగం... ఇంటి పేరు వంశం పేరును నిలిపేదానికి వివాహం.... సంతానం... ఆర్జన... పిల్లలను కని సాకి మన తల్లిదండ్రులు మనకు చేసినట్టే మనం మన సంతతికోసం చేయడం...


వర్గభేదం రీత్యా... ఉపాధి మార్గాల రీత్యా... నిమ్నోన్నతాలు.. కలిమిలేములు... ఆశలు... ఆశయాలు.. ఆచరణకు అందకపోవడం... డబ్బు... డబ్బు... డబ్బు... ప్రతిదీ డబ్బుకు సంబంధించినదిగా ఎదుట నిలవటం... అవసర నిమిత్తం... ఆశయాలను అటకపై వుంచి వర్తమాన కర్తవ్య నిర్వణకోసం... తప్పని తెలిసీ... ఆ తప్పుదారినే నడవవలసిన స్థితి... నడిచి... ఒక తప్పును కప్పిపుచ్చుకొనేందుకు మరో తప్పు విచక్షణా రహితంగా చేయడం... మానవులుగా పుట్టినవారు అమానుషంగా మారి పగ కక్ష... ప్రతీకారాలకు ప్రత్యర్థులు కావడం... ఇదీ నేటి కొందరి మానవుల జీవిత విధానం…


హైవేలో... సుల్తాన్ జీప్ పైనా... రేపల్లెలో సయ్యద్ ఇంట్లో... బ్రహ్మయ్యగారి ఇంట్లో పన్నెండు ప్రాంతంలో బాంబు ప్రేలుళ్లు... జరిగాయి. జీప్ లోని వారు.... సయ్యద్, భార్య ఫాతిమా, బషీర్.. బ్రహ్మయ్య, కుసుమ. శాలివాహన దారుణంగా మరణించారు. ఉదయం టీవీ న్యూస్ లో... వార్తాపత్రికల్లో... 'రాత్రి హైవేలో రేపల్లె సబ్ స్పెక్టర్ జీప్ బాంబు ప్రేలుడుకు ధ్వంసం... డ్రైవర్ సోము.. హెడాకానిస్టేబుల్ గంగరాజు... సబ్ స్పెక్టరు సుల్తాన్ గుర్తు తెలియని స్థితిలో మరణం..."


'రేపల్లెలో హైస్కూలు హెడ్మాస్టరు బ్రహ్మయ్యగారింట్లో... సైన్సు టీచర్ సయ్యద్ గారి ఇంట్లో నడిరేయి... బాంబు ప్రేలుడు... బ్రహ్మయ్యగారు వారి సతీమణి కుసుమ... మనుమడు శాలివాహన... సైన్సు మాస్టర్ సయ్యద్... వారి భార్య ఫాతిమా.... కుమార్తె బషీర్ మంటల్లో కాలి మసైపోయారు.'


పై రెండు విషాదకరమైన వార్తలు... హైదరాబాద్ ను వుడికించాయి. యావత్ విశాలాంధ్ర ప్రజానీకాన్ని ఎంతగానో కలవరపరిచాయి.


ఢిల్లీ నుండి బ్రహ్మయ్య కొడుకు శశాంక్ వారి భార్య నిర్మల పిల్లలు కవిత.. కమలలు రేపల్లెకు వచ్చారు. హాస్పిటల్ మార్చురీలోన వున్న శవాలను స్మశానానికి తరలించారు.

సయ్యద్ పెద్దకుమారుడు ఇర్ఫాన్ అతని మేనమామ ఖాజాసాబ్ వచ్చారు. వారూ వారి సంప్రదాయం ప్రకారం... సయ్యద్ సార్ ను, సయ్యద్ సార్ భార్య ఫాతిమా బేగము, కుమార్తె మున్నీ బషీర్లను ఖబరస్తాన్ లకు చేర్చారు. వచ్చిన బంధువులేకాక వూరిజనం అందరూ... కంటికి మింటికి ఏకధారగా ఏడ్చారు.


రోజులు భారంగా గడిచాయి. శశాంక్ తన వారికి చేయాల్సిన అంతిమ సంస్కారాలను సవ్యంగా నెరవేర్చి... తన కుటుంబంతో వెళ్లిపోయాడు. అదే రీతిగా ఇర్ఫాన్ తనవారి అంత్యక్రియలను ముగించి హైదరాబాద్ కు వెళ్లిపోయాడు.


ఆ బాంబు ప్రేలిన రాత్రి సమయంలోనే... కిడ్నాప్ విషయంలో జైల్లో వున్న ఖైదీ పారిపోయాడు...


పుండరీకయ్య తన ప్రాణమిత్రులు ఇరువురూ ఇండ్లల్లో ఒకేసారి బాంబు ప్రేలుడులో కుటుంబ సభ్యులందరూ చనిపోయినందుకు ఎంతగానో బాధపడ్డాడు.

లోకల్ ఎమ్మెల్యేని కలసి తన మిత్రుల మరణానికి కారకులైన వారిని పట్టుకొని కఠినంగా శిక్షించాలని... పోలీస్ యంత్రాంగానికి... మీరు ఆదేశాలు ఇవ్వాలని కోరాడు.


ఎమ్మెల్యేగారు “తప్పకుండా!...” అంటూ చేతిని పైకెత్తి హామీ ఇచ్చారు...

తన ఇతర మిత్రులతో సంభవించిన దారుణ హింసాకాండను గురించి. చెప్పుకొని కన్నీరు కార్చడం పుండరీకయ్య వంతయింది.

***


ఎస్.పి. కస్తూరి రంగ...

తన కార్యాలయంలో కూర్చొని వున్నాడు.

సెల్ మ్రోగింది.

“హలో!...” అన్నాడు

" ఆ... రంగా!..." అన్నాడు శశాంక్.


“చెప్పండి బావా!...” అన్నాడు కస్తూరి రంగ.

“నేను నా కర్తవ్యాన్ని పూర్తిచేసుకొని వచ్చాను. చిన్నితో మాట్లాడావా?" అడిగాడు రంగ

"రెండు వారాలుగా నేను మాట్లాడలేదు" విచారంగా చెప్పాడు శశాంక్.

"నేను మాట్లాడాను బావా!... షి ఈజ్ ఫైన్!...".చెప్పాడు కస్తూరి రంగ.


“ఆమెకు ఇంకా ఎంతకాలం ఈ అజ్ఞాతవాసం?...”. అడిగాడు శశాంక్

“బావా! నాలుగైదు మాసాలు అంతే!... నాకు కోల్ కత్తానుండి హైదరాబాదుకు ట్రాన్సఫర్ అయింది.” చెప్పాడు కస్తూరి రంగ.


“హైదరాబాద్ కా?...” అన్నాడు శశాంక్

"అవును... బావా... మనం వేట ప్రారంభించాల్సింది అక్కడేగా!...".. అన్నాడు కస్తూరి రంగ.


"ఆ..ఆ.. అదీ మాటే!... నీవు ఢిల్లీ వచ్చి... ఇక్కడినుండి హైదరాబాద్ వెళుదువుగాని... ఎపుడు వస్తావు?..." అన్నాడు శశాంక్

“నేనా!..." సాలోచనగా అన్నాడు కస్తూరి రంగ.


"ఆహా నేను...” నవ్వాడు శశాంక్, “ఇక్కడికి నీవు వచ్చావంటే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి రంగా!...".

"ఆ... అవును బావా!... పై ఆదివారం వస్తున్నాను... సరేనా?..."


"ఆ... మంచిది. తప్పకుండా రా... ఇక్కడ ఓ నాలుగురోజులు విశ్రాంతిగా వుండి హైదరాబాద్ బయలుదేరుదువుగాని...."

“ఆ... అలాగే బావా!..."

"సరే రంగా జాగ్రత్తగా రా!...."

"బావా!..."


"ఏం రంగా?..."

“చిన్ని ఎలా వుంది?...".

"చాలాచాలా బాగుంది..." ఆనందంగా నవ్వాడు శశాంక్.

శశాంక్ సెల్ కట్ చేశాడు....


కస్తూరి రంగా సెల్ మ్రోగింది.

“హలో!...

.............

యస్ సార్!... వెంటనే బయలుదేరుతున్నా సార్!

..............

"అలాగే సార్!...".


సెల్ వాయిస్ కట్ అయింది. వేగంగా లేచి వెళ్లి కార్లో కూర్చున్నాడు రంగ.

"సార్.... ఎక్కడికి ?...” అడిగాడు డ్రైవరు.

"ఐ.జి. ఆఫీస్ !.."

“ఓకే సార్!..."


రంగా ఫోన్ మ్రోగింది.

“హలో డియర్....” నవ్వుతూ పలికాడు కస్తూరి రంగా...

“ఆ.. ఏం.. నిన్న ఫోన్ చేయలేదు?..."

"ఓ... సారీ!... సారీ!.. నిజం చెప్పనా!... అబద్ధం చెప్పనా!...".


"ఈమధ్యన అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకొన్నారా!... నేను దగ్గరలేని కారణంగా!...".

"నో.. నో... మేడమ్... అలాంటివేవీ నేర్చుకోలేదు.”

"మనం కలసి ఎన్నిరోజులయింది?..."

“ఆ... ఆ...” ఆలోచనలో కస్తూరి రంగ

“అది కూడా గుర్తులేదా?....”


"ఆ...ఆ... వుంది!..."

"అయితే... చెప్పండి!..."

“గంటలు.. నిముషాలు.. సెకండ్లతో చెప్పనా!...” సగర్వంగా నవ్వాడు రంగ.

“తమరికి అంత జ్ఞాపకమా!...".


"నేను చెప్పిన తర్వాత... ఆవిషయం నీవే చెప్పాలి సుమా!..."

"సరే చెప్పండి!...”

రంగా తన చేతి వాచీని చూచాడు.....

"రెండు నెలలు... ఇరవైఒక్కరోజు... పదిహేను గంటలు... ఇరవైనాలుగు నిముషాలు... ముప్ఫైరెండు సెకన్లు మేడమ్!..." ఆనందంగా నవ్వాడు రంగ.


"అబ్బా!..."

"ఆ... ఏమయింది?...."

"మీరు చెప్పింది కాగితంపై వ్రాసి వుంచుకొని చదివారా!..." నవ్వింది చిన్ని.


"ఆ..... అవును... అవును... ఈరోజు నాలుగు గంటలకు నా ప్రియమణి... ఫోన్చేసి... నన్ను ఒక యక్ష ప్రశ్న వేయబోతుందని మొన్న కలగన్నాను. ఆ ప్రశ్న మన కలయికకు సంబంధించిందే... అందుకుగా నేను ఇపుడు తమరికి చెప్పిన ప్రవరను మరచిపోకుండా కాగితంపై వ్రాసి జేబులో పెట్టుకొని వున్నాను. మీరు అడగడంతోటే... చూచి చదివాను." పకపకా నవ్వాడు కస్తూరి రంగ.


“మొత్తానికి ఈరోజు అబ్బాయిగారు చాలా జాలీగా వున్నట్టున్నారు. కారణం ఏమిటో!..." అడిగింది చిన్ని.

“ఏమైవుంటుందో వూహించు డియర్!..."


"అబ్బా!... ఏమిటండీ ఇది... విషయం ఏమిటో చెప్పండి!..." చిరుకోపంతో రుసరుసలాడుతూ చెప్పింది చిన్ని.

“చిన్నీ!...”.

"ఆ...!"


“కనిపెట్టు చూద్దాం!...” నవ్వాడు రంగ.

“నాలోని సహనానికి పరీక్షపెడుతున్నారూ!..." ఆవేశంగా బెదిరించినట్టు అంది చిన్ని..

"ఓం శాంతి... ఓం శాంతి... ఓం శాంతిహి..." నవ్వాడు రంగ.


"చినూ!..."

“నేను మాట్లాడను..." గోముగా అంది చిన్ని.


"ఏమిటీ.... ఈ అసహ్యమైన పిలుపు.....” కోపంగా అరిచింది.

“ఓసారీ... సారీ... డియర్.. నైన్... ట్వెల్వ్... ట్వన్టీవన్..."


"ఏంటా నెంబర్లు... ఆవేశంగా అడిగింది చిన్ని.

"అవి నెంబర్లు కాదు... నెంబర్ల రూపంలో ఉన్న వున్న ఆంగ్ల అక్షర ప్రేమసంకేతం.

"ఓహెూ... అలాగా!... ''

"అవును... కనిపెట్టు చూద్దాం!..." సగర్వంగా నవ్వాడు.

"అసలు విషయం చెప్పకుండా మీరు చేసే అనవసర ప్రసంగానికి నాకు కోపం వస్తుంది. నైన్...ట్వెల్వ్... ట్వంటీవన్... జవాబును ఆ విషయాన్ని... నేను ఐదు వరకు లెక్కించేలోపల చెప్పకపోతే... సెల్ కట్చేస్తాను. ఆ తర్వాత మీరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా నేను ఎత్తను..." ఖచ్చితంగా చెప్పింది చిన్ని....


"దేవీ!... అంతటి ఆగ్రహానికి ఈ జీవుడు తాళగలడా!... నెంబర్ వన్ మనం పై ఆదివారం ముంబైలో మీ అన్నయ్య అదే మా బావగారి ఇంట్లో కలవబోతున్నాము.

రెండవది తమరి యక్షప్రశ్నకు జవాబు... నౌవ్... బారా... ఇక్కీస్... అంతే..." సీరియస్ గా చెప్పాడు రంగ.


“ఆ... ఏమన్నారు?....” కోపంగా అరిచింది చిన్ని.

“అది నేను అనడం కాదు... తమరి ప్రశ్న... అదే తొమ్మిది... పన్నెండు.... ఇరవై ఒకటికి నా జవాబు డార్లింగ్!..." ఆనందంగా నవ్వాడు రంగ.


అతను చెప్పిన తీరుకు... పలికిన చివరి పదం ఉచ్ఛారణా సొంపుకూ... చిన్నీకి నవ్వు వచ్చింది... గలగలా నవ్వింది.

"చిన్నీ!..."

"ఆ... చెప్పండి..."


“నా రిక్వెస్ట్... హైదరాబాద్ కు ట్రాన్స్ఫర్ అప్రూవ్డ్... రెండు రోజుల్లో ఆర్డరు రానుంది.... ఇకపై మనం వేరువేరుగా వుండవలసిన అవసరం లేదు. దేనికీ భయపడనవసరంలేదు. పాత తప్పుడు లెక్కలన్నింటినీ... అందరినీ... క్రమంగా సరిచేస్తాను. నీకు ఇచ్చిన మాట ప్రకారం... నీకు మా బావగారికి ఆనందం కలిగిస్తాను. స్వర్గస్థులైన వారందరి ఆత్మలకు శాంతిని కలిగిస్తాను... వారి ఆశయాలను నెరవేరుస్తాను..." కాస్త ఆవేశంగా చెప్పాడు యస్.పి.రంగ.


చిన్నీకి ఎంతో సంతోషం....

"ఏమండీ!..."

“ఆ.. చెప్పు చిన్నీ...”.

"ట్రాన్స్ఫర్ తప్పక వస్తుంది కదూ!...”

"తప్పక... తప్పక వస్తుంది. నేను నిన్ను ఢిల్లీలో ఆర్డర్ తోనే కల్సుకొంటాను చిన్నీ..." ప్రీతిగా చెప్పాడు రంగ.


“థ్యాంక్స్ అండీ!... మంచి వార్తను చెప్పారు. చాలా సంతోషం!..."

జీప్ ఐజీ ఆఫీసు ఆవరణలో ప్రవేశించింది.

“ఓకే!... చిన్నీ... బాస్ ను కలవబోతున్నాను. తర్వాత మాట్లాడుతాను...”.

సెల్ కట్ చేసి కారునుండి దిగాడు రంగ.


ఐ.జీ. క్యాబిన్ ను సమీపించాడు. సెక్యూరిటీ సెల్యూట్ చేశాడు.

అతను... లోనికి వెళ్లి ఐ.జి.గారికి రంగా రాకను తెలియచేశాడు. వారు రంగాను లోనికి పంపమని చెప్పారు.


సెక్యూరిటీ బయటికి వచ్చాడు. నవ్వుతూ...

“సార్... లోనికి వెళ్లండి.." చెప్పాడు.

యస్.పి.రంగ గదిలోకి ప్రవేశించాడు.

ఐ.జి.గారికి ఠీవిగా సెల్యూట్ చేశాడు.


"డియర్ రంగా... ప్లీజ్ టేక్ యువర్ సీట్ !..." చిరునవ్వుతో చెప్పాడు ఐ.జి. మనోజ్ చక్రవర్తి.

"ధాంక్యూ సార్..." కూర్చున్నాడు రంగ...


"రెండు వారాల క్రింద ఆంధ్రాలో జరిగిన బాంబు ప్రేలుడు జరిగింది మీ వూర్లోనేనా?..."

“యస్ సార్!..."

“వూర్లో ఆరుగురు... రోడ్లో ముగ్గురు... తొమ్మిదిమంది దాదాపు ఒకే సమయంలో బాంబ్ అటాక్ లో మరణించారు కదూ!..."


"అవును సార్!..."

మనోజ్ చక్రవర్తి డ్రాయర్ తెరచి ఒక కవర్ బయటకు తీశాడు... చిరునవ్వుతో...

“రంగా!... ఇది నీ ట్రాన్స్ఫర్ ఆర్డర్.. ప్లీజ్ హ్యావిట్!...”

రంగా లేచి రెండు చేతులతో ఆ కవర్ అందుకున్నాడు.


"ధ్యాంక్ ఎ లాట్ సర్!...” ఎంతో వినయంగా చెప్పాడు.

టేబుల్ మీద ఉన్న మరో కవర్ ను అందిస్తూ...

“రంగా!... దిసీజ్ మై సర్టిఫికెట్ టూయూ... మెరిట్ సర్టిఫికెట్....".

ఈసారి చక్రవర్తి లేచి... ఎంతో అభిమానంతో రంగాకు అందించాడు.


“ప్లీజ్ సిటౌడౌన్!...” చెప్పి చక్రవర్తి కాలింగ్ బెల్ నొక్కాడు.

సెక్యూరిటీ లోన ప్రవేశించాడు.


"సార్!..."

"టీ..."

“యస్ సర్...”

సెక్యూరిటీ వెళ్లిపోయాడు.


చక్రవర్తి రంగా ముఖంలోకి చూచాడు... చిరునవ్వుతో...

"రంగా!... యదార్థంగా నీ ట్రాన్స్ఫర్ నాకు ఇష్టంలేదు. నీలాంటివాడు నాతో కలసి పనిచేయడం... నాకు ఎంతో ఇష్టం... కానీ జరిగిన ప్రమాదంలో గతించిని నీ బంధువులు... నీ మనస్సుకు ఎంత బాధగా వుంటుందో నేను వూహించాను. నేరస్థులు ఎవరైనా సరే... పట్టుకొని శిక్షించడం మన వృత్తి ధర్మం... కొందరు స్వార్ధపరులు మూలంగా సాక్ష్యం పేరుతో ధర్మం జైలు పాలు... అధర్మం పబ్లిక్ ఫోర్వేలో... నీవారి విషయంలో అలా జరుగకూడదు. నేరస్థులు శిక్షను అనుభవించాల్సిందే!...


ఆ బాధ్యత వేరే వారికి సంక్రమిస్తే... నేరస్థులు శిక్షితులౌతారనే నమ్మకం నాకు లేదు. ఆ కారణంగా నీ ట్రాన్స్ఫర్ కు ఆమోదించాను. మనం కలసి పనిచేసిన ఈ మూడు సంవత్సరాల కాలం... మనం నిర్వర్తించిన ఉద్యోగ ధర్మం... నేను జీవితాంతం మరువలేనివి... మనస్సున ఒక మూల నీలాంటి ఉత్తమ అధికారి నానుండి దూరం అవుతున్నాడే అనే బాధ. రంగా!...


ఎక్కడున్నా... నీవు నిప్పులా వెలిగిపోవాలి. నీవారిని హతమార్చిన ఆ నరరూప రాక్షసులను నీవే పట్టుకోవాలి. వారికి తగిన శిక్షపడేలా చేయాలి. ఐ విషయూ ఆల్ సక్సెస్ ఇన్ యువర్ ఫ్యూచర్ డియర్!..." లేచి రంగా చేతిని తన చేతిలోకి తీసుకొని కరచాలనం చేశాడు ఐ.జి. మనోజ్ చక్రవర్తి.


"ధన్యవాదాలు సార్!..." కరచాలనం తర్వాత రంగా చేతులు జోడించాడు.

టీ వచ్చింది.

టేబుల్ పై ట్రేని వుంచాడు సర్వర్.....

ఫ్లాస్క్ లోని టీని రెండు కప్పుల్లో పోశాడు సర్వర్. ఆ ఇరువురికీ అందించాడు.

ఇరువురూ ఎవరి ఆలోచనల్లో వారు టీ త్రాగారు.

కప్పును ట్రేలో వుంచాడు రంగా...

చిరునవ్వుతో లేచి నుంచున్నాడు.


మనోజ్ చక్రవర్తి ఐ.జి. లేచి క్యాబిన్ తలుపు తెరిచాడు.

రంగా బయటకు వెళ్లి డోర్ ను పట్టుకొన్నాడు.

ఐ.జి. మనోజ్ చక్రవర్తి గదినుండి బయటకు వచ్చాడు.

ఇరువురూ... చిరునవ్వుతో పోర్టికోలో ప్రవేశించారు.

"సార్... బహుత్ బహుత్ షుకిరియా!..." చిరునవ్వుతో చేతులు జోడించాడు రంగ...


మనోజ్ ఆ చేతులు పట్టుకొని...

"ఈ చేతులు బంగారు చేతులు... ధర్మాన్ని కాపాడేవి... ఎల్లపుడూ బలంగా.... వర్థిల్లాలని ఆశిస్తున్నాను యస్.పి. కస్తూరి రంగా సాబ్!..." స్వచ్ఛమైన తెలుగులో నవ్వుతూ చెప్పాడు మనోజ్ చక్రవర్తి ఐ.జి.


సీనియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడకి వచ్చారు... అందరికీ కరచాలనం చేసి.... తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశాడు యస్.పి. కస్తూరి రంగ...

"రంగా!..." మనోజ్ చక్రవర్తి పిలుపు

"సార్!...” సమీపించాడు.

"నీకు ఎప్పుడు ఏది అవసరమైనా... అది ఏ సమయమైనా నాకు ఫోన్ చేయి... సరేనా!..." ప్రీతిగా అడిగాడు ఐ.జి.


“అలాగే సార్!...” నవ్వుతూ చెప్పాడు రంగా.

చేతులు జోడించి అందరికీ నమస్కరించి... రంగా తనకారును సమీపించి కూర్చున్నాడు.

డ్రైవరు కార్ స్టార్టు చేశాడు.

ఇంకా వుంది...



సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం



మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.



మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



42 views0 comments
bottom of page