'Khalunaku Niluvella Visham' - New Telugu Story Written By Ayyala Somayajula Subrahmanyam
'ఖలునకు నిలువెల్ల విషం' తెలుగు కథ
రచన : అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
ఎక్కడ పుట్టిందో, ఎక్కడపెరిగిందో కానీ మహాతల్లి కైకతో పాటు పుట్టింటి అరణంగా ఆమెకు దాసిగా అయోధ్య చేరింది మంధర. రాణి వాసంలో తిష్ట వేసింది.
ఒకరోజు తెల్లవారే సారికి అయోధ్యంతా కోలాహలంగా ఉంది. పట్టణమంతో అందంగా అలంకరించి ఉంది. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. ఇక నిలవలేకా పోయింది. దోవన పోతున్న మరో దాసిని అడిగింది. ”ఏమిటే ఆ హడావుడి అంతా?” అని.
“రాములోరికి పట్టాభిషేకం” ఆనందంతో మెలికలు తిరిగిపోతూ చెప్పింది ఆ దాసి. అసలు మంధర
పుట్టుకే వంకర. దాని మనసు వంకర. బుద్ధీ వంకరే. తిన్నగా కైక అంతఃపురానికి వెళ్ళింది.
వెళుతునే ‘ఇంకేముంది తల్లి; అంతా అయిపోయింది’ అంటూ గుండెలు బాదుకుంది. కైక శయనమందిరం నుంచి బయటకొచ్చి ‘ప్రొద్దున్నే ఏమిటా ఏడుపు? వంట్లో బాగాలేదా? ఏమైంది నీకు?” అని కొంచెం విసుగ్గా అడిగింది.
”నాకేంటీ నిక్షేపంలా వున్నాను. నీకే కష్టకాలం దాపురించింది. దశరథ మహారాజు రాముడిని యువరాజు చేస్తూన్నాడు. నీ మీద ప్రేమ నటిస్తూనే నిన్నూ నీ కొడుకునీ మోసం చేస్తున్నాడు. సంపదంతా ఆ కౌసల్యకు కట్టబెడుతున్నాడు. భరతుణ్ణి గుట్టు చప్పుడు కాకుండా తాతగారింటికి
పంపించేసి దొడ్డిదారిన రాముడికి రాజ్యం కట్టబెడుతున్నాడు. పిచ్చిదానివి నీకేమైనా తెలీదు
తెల్లనివన్నీ పాలు, నళ్ళనివన్నీ నీళ్ళు అనుకుంటావు. ఇఫటికైనా మించిపేయింది లేదు. రాజ్యం వాళ్ళకి
పోకుండా చూసుకో. నువ్వు సుఖంగా వుంటేనే మేమంతా సుఖంగా వుండేది’ అంది మంధర.
మనసు నిప్పుల కొలిమిలా చేసుకుని మంధర తన మాటల్లో ఎంతగా పొగలు, సెగలు చిమ్మినా కైక మాత్రం “ఎంత మంచి మాట చెప్పావే మంధరా; రాముడు పట్టాభిషిక్తుడవుతుంటే అంతకంటే కావలసినదేముంది నాకు రాముడికీ, భరతుడికీ తేడా ఏముందండీ?” అంటూ తన మెడలోంచి ఒక హారము తీసి మంధర మెడలో వేయబోయింది.
మంధర అడ్డుకుంది.
కోపాన్ని, ఏడుపునీ కలబోస్తూ ‘ఎంత అమాయకురాలివే తల్లా: నీ సవతి కౌసల్యకు పట్టపగ్గాలుండవు. నువ్వు దాసిలా వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఆమె వెనక తిరుగుతూ వుంటే నీ కొడుకు రాముని వెంట తిరుగుతాడు. మీతో పాటు నేనూ తిరుగుతూ వుంటే’ అంది.
కైక విని విననట్టు వూరుకుంది. అయినా మంధర ఆపలేదు.
రాముణ్ణి గురించి చాలా దురుసుగా మాట్లాడుతోంది.
కైక కల్పించుకుని ”మంధరా; ఆపు. రాముడిని గురించి నీకింకా తెలుసునని మాట్లాడుతున్నావు. రాముడు ధర్మజ్ఞుడు. మహారాజు గారి పెద్దకొడుకు. అతనే యువరాజు కావాలి. రాముడు రాజాతో రాజ్యం సుభిక్షంగా ఉంటుంది. చక్కగా పాలిస్తాడు.
ప్రజలంతా సంతోషిస్తారు. నాకు భరతుడు ఎక్కువేమిటి? రాముడు తక్కువేమిటీ?నిజానికి రాముడు అందరి కంటే ఎక్కువ నాకు. రాముడికి కూడా అంతే. నేనంటానా అతనికి ఎక్కువ ప్రేమ. రాముడికి రాజ్యం వచ్చిందంటే భరతుడికి వచ్చినట్టు కాదా?ఏమిటా పిచ్చిమాటలు?” అని మందలించింది.
మంధర పెద్దా నిట్టూర్చింది.
“కైకమ్మా; నీకు తెలియడం లేదు. నువ్వు చెప్పిందే ధర్మసమ్మతమైతే ఎప్పటికీ రాజు పెద్దకొడుకే రాజు
కావాలి తప్ప, ఇంకెవరూ రాజు కావడానికి వీలులేదు. ఇప్పుడు రాముడు రాజైతే ఆ తరువాత అత
నికి పుట్టే పెద్దకొడుకు రాజవుతాడు. నీ కొడుకు జన్మలో రాజు కాలేడు. నువ్వు రాజమాతవు కాలేవు.
మీరిద్దరూ శాశ్వతంగా రాజమర్యాదలకు దూరమవుతారు. అనాధలవుతారు. మీతో పాటు నేను కూడా..
రాముడు మంచివాడంటూ నువ్వు ఊబిలో కూరుకుపోతున్నావు. రాముడు రాజు కాగానే చేసే మొట్ట
మొదటి పని ఏమిటో తెలుసా? భరతుని పీడ విరగడం చేసుకోవడం. అందుకోసం అతనిని చంపనైనా
చంపుతాడు. లేదా దేశాంతరమైనా పంపించివేస్తాడు. కౌసల్య మాత్రంగా తక్కువదనుకుంటున్నావా?
ఇన్నాళ్ళూ దశరథమహారాజు నీవాడన్న గర్వంతో ఆమెను ఈసడించావు. ఇప్పుడు ఆవిడ రాజమాత అయ్యాక నిన్ను అవమానించకుండా, పరాభవించకుండా వుంటుందా? ఇంతకింతా తీర్చుకోదూ?
నీకూ నీకొడుకుకీ రాబోయేవన్నీ కష్టాలే. ఆలోచించుకో. ఎలాగో అలా నీ కొడుక్కి రాజ్యం వచ్చేలా చూసుకో. ఆలస్యం చేయకుండా ఏదైనా ఉపాయం ఆలోచించుకో” అంది.
మాటలకున్న శక్తి అంతా ఇంతా కాదు. అవి ఏమన్నా చేయగలవు. కైక మంధర మాటలకు లొంగిపోయింది. కమలం లాంటి కైక మనస్సు అనుమానాలతో మలినపడింది.
రాజ్యలాభం, పదవీవ్యామోహం ఆమెను నిలబడకుండా చేశాయి. ’ఈ నాడే రాముణ్ణి అడవులకు పంపుదాం. భరతుణ్ణి రాజును చేద్దాం. అందుకు సరైన ఉపాయమేదో చెప్పు‘ అంది బతిమాలుతున్నట్టుగా.
మంధర ముఖం విప్పారింది.
“నిజంగా చెప్పనా? నేను చెప్పినట్టే చేస్తావా?”
‘చేస్తానని చెబుతున్నానుగా. త్వరగా చెప్పు’ అని తొందర పెట్టింది కైక.
‘ఒకప్పుడు దేవాసుర యుద్ధం జరిగినప్పుజు నీ భర్త వెంట నువ్వు వెళ్ళావు. ఆ యుద్దంలో మహారాజు క్షతగాత్రుడై మూర్చపోతే నువ్వు ఆయుధం ధరించి శత్రువుల్ని నిర్జించుచూ మహారాజును రక్షించావు. అందుకు సంతోషించి ఆయన వరాలు రెండు కోరుకొమ్మని నిన్ను సంతోష
పెట్టడానికి అడిగాడు. నీవు వాటి అవసరం వచ్చినప్పుడు కోరుకుంటానన్నావు. మహారాజు సరేనన్నాడు.
నువ్వే చెప్పావు.
ఇప్పుడు సమయం వచ్చింది. ఆవరాలు రెండు కోరుకో. ఒకటి. భరతుడికి పట్టాభిషేకం జరగాలి.
రెండు రాముడు పదునాలుగేళ్ళు వనవాసం చేయాలి. అర్థమైందా?
ఇదిగో; వరాలు వచ్చే వరకు ఒళ్ళో పడకు. కోపం నటించు. జుత్తు విరబోసుకో. నేల మీద పడుకో. నీ భర్త రాగానే ఎదురు వెళ్ళి ఎప్పటిలా ముసిముసి నవ్వులు నవ్వుతూ స్వాగతం చెప్పకు. అసలు ఉలకకు. పలకకు. నీ భర్తకు నువ్వంటే వల్లమాలిన ప్రేమ. నీకోసం ఏమైనా చేస్తాడు. అలా అని దగ్గ
రకు తీసుకోగానే కరిగిపోయేవు.
కరిగిపోతే నష్టపోయేది నువ్వే; మణులిస్తానంటాడు. మాణిక్యాలిస్తా నంటాడు. వజ్రవైఢూర్యాది ఆభరణా లిస్తానంటాడు. అవేవి అక్కరలేదు. - భరతుడుకి పట్టాభిషేకం, రాముడికి వనవాసం. ఈ రెండే నాకు కావలిసినవి అని ఖచ్చితంగా చెప్పు. వాటికి ఆయన ఒప్పుకునే వరకూ నిరసనవ్రతం, మౌనవ్రతం చెయ్యి.’ అని మంధర దుర్భోధ చేసింది.
కైక లొంగిపోయింది.
తరువాత కథ మనందరికి తెలుసు. దశరథుకు వచ్చాడు. బతిమాలి బతిమాలి భంగపడ్డాడు. ఏడ్చాడు. మూర్ఛపోయాడు. నేల మీద పడి దొర్లాడు. అయినా కైక పట్టించుకోలేదు. పట్టు వీడలేదు. కైక మనస్సులో
ఉన్నట్టుండి ప్రజ్వరిల్లిన ఈర్ష్య అసూయలకు, చెలరేగిన దుమారం రాజ్యమంతా చలించింది.
సీతారామలక్ష్మణులు అడవికి వెళ్ళారు. అయోధ్య విలపించింది. దశరథుడు మరణించాడు. ఏ వెలుగూ
లేకుండా అయోధ్య మొత్తం చీకటైంది. అయోధ్య ప్రజలు తండ్రులేని బిడ్రలయ్యారు.
అంతా సవ్యంగా జరిగిపోతోందనుకున్నప్పుడు ఏ మూల నుంచో ఒక రాయి వచ్చి మీద పడుతుంది. ఎవరు విసిరారో కూడా ఎవరికి తెలీదు. దాంతో అంతా అతలా కుతలమౌతుంది. కుటుంబ విషయాల్లో కానివ్వండి. పరిపాలనా వ్యవహారాల్లో కానివ్వండి. చేరగూడని వ్యక్తులు చేరి చెప్పగూడని మాటలు చెబితే, ఆ మాటలు వింటే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. మాటలతో ప్రాణాలు నిలబెట్టేవాళ్ళు కొందరైతే, ప్రాణాలు తీసేవారు మరికొందరు.
ఇది మనందరికి ఓ పాఠం
———తస్మాత్ జాగ్రత్త——
—————శుభంభూయాత్————
అయ్యల సోమయాజుల సుబ్రహ్మణ్యము గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత పరిచయం
రచనలు -ఆర్థిక ,రాజకీయ, సామాజిక, అధ్యాత్మిక వ్యాసాలు.
అధ్యాత్మిక, సామాజిక, కుటుంబ, చారిత్రక కథలు, నవలు., కవితలు.
ప్రచురించిన పత్రికలు- జాగృతి, తెలుగువెలుగు, ప్రజాడైరీ, శ్రీ వేంకటేశం,
ఆంధ్రభూమి, " ఈ" పత్రికలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.
కథ తెలిసిందే అయినా వినిపించిన తీరు బాగుంది-అభినందనలు.