'Kodi Kutha' New Telugu Story
Written By Ch. C. S. Sarma
'కోడి కూత' తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
'కొక్కోరోకో!.. కొక్కోరోకో!.. తెల్లవారు ఝామున కోడి కూత.. సమయం వేకువన నాలుగున్నర.. తూర్పున అరుణుని అరుణ కిరణాల అలంకారవేళ.
ప్రతి నిత్యం రంగమ్మ, రాజయ్యలకు.. అదే సమయానికి ఆ కోడి తన కూత వినిపిస్తుంది.
ఆ కూత ఆ దంపతులకు మేలుకొలుపు.. నిద్రలేచి దినచర్యను ప్రాంభించేదానికి సంకేతం.. వారే కాదు.. చుట్టుప్రక్కల ఇళ్ల వారూ మేల్కొనేవారు. రంగమ్మ, రాజయ్య పేదవారు. రెండు గేదలు వారి జీవనాధారం. వారికి ఒక కొడుకు. ప్రక్కనే వున్న పట్నంలో కాలేజీలో బి ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పేరు రఘు. గొప్ప తెలివితేటలు. క్లాస్ లో అన్నింటా వాడే ఫస్ట్.. ఆ కారణంగా అందరికీ అభిమాన పాత్రుడు..
భూపతి సంపన్నుడు. వారి భార్య మంగమ్మ.. మేనరికం.. చాలా సొత్తుతో ఆ ఇంటి కోడలయింది. ఆ దంపతుల ఏకైక కూతురు సుందరి.
అమ్మాయి.. పేరుకు తగ్గట్టు గానే బహు సుందరి. రఘు చదివే కాలేజీలోనే చదువుతూవుంది. భూపతికి పట్నంలో ఒక ఇల్లు వుంది తన తల్లి రంగమ్మను కూతురిని ఆ ఇంట వుంచి.. సుందరిని పట్నంలో చదివిస్తున్నాడు..
ఒక వూరివారు.. ప్రక్క ప్రక్క ఇండ్లవారు అయిన రఘు సుందరిలకు చిన్ననాటినుంచి స్నేహం.. సుందరి కన్నా రఘు ఐదు సంవత్సరాలు పెద్ద.
మంగమ్మ తల్లి దుర్గమ్మ.. ఆమెకు మంగమ్మ తర్వాత ఒక కొడుకు శ్రీపతి. దుర్గమ్మకు సుందరికి శ్రీపతికి వివాహం జరిపించాలనే ఆశ. వారిరువురికి వయస్సున పన్నెండు యేళ్ళు వ్యత్యాసం.. భూపతికి తన బావమరిదికి తన కూతురుని ఇచ్చి వివాహం చేస్తే తన కూతురు తనకు దగ్గరగా వుంటుందని.. ఆ ఇంటి పెత్తనం కూడా తన చేతుల్లోకి వస్తుందనే ఆశ. మంగమ్మకు భూపతి ఆశ నచ్చలేదు. 'వాడు నాకు తమ్ముడైతే కావచ్చు.. వయస్సున చాలా పెద్ద. నా కూతురుకు వాడికి పెండ్లి జరగదు. వేరే మంచి సంభంధం చూచి చేస్తాను. తన నిర్ణయాన్ని భర్తకు చెప్పింది మంగమ్మ.
భూపతి భార్యను ఎన్నడూ ఎదిరించ లేదు. కానీ ఈ విషయంలో ఎదిరించాలని నిర్ణ యించుకొన్నాడు. పంతులుగారిని పిలిచి కూతురు జాతకాన్ని చూపించాడు.
ఆ స్వామివారు.. అమ్మాయి గారి వివాహం మీ ఇష్టానుసారంగానే జరుగుతుందని అబద్ధం చెప్పాడు.
ఆమాట భూపతికి ఎంతో ఆనందం కలిగించింది. అదే సమయానికి వారికి నమ్మిన బంటు అయిన గోవిందు వాయు వేగంతో వచ్చి వారికి ఒక షాకింగ్ న్యూస్ చెప్పాడు. 'అయ్యా!.. మన అమ్మాయి గారు ఆ రంగమ్మ.. రాజయ్యల కొడుకు రఘుతో పట్నంలో తెగ తిరుగుతోందయ్యా!..' అగ్గిపుల్లను గీచి అంటించి.. గోవిందు వెళ్లిపోయాడు..
* * *
సుందరికి తన తండ్రి నిర్ణయం తల్లి ద్వారా తెలిసింది. తన తండ్రి భూపతి ఎంత మూర్ఖుడో తనకు తెలుసు.. "అమ్మా.. నేను మన పక్కింటి రఘును ప్రేమించాను. అతనికీ నేనంటే ఎంతో ఇష్టం. నీవు మా పెళ్లి జరిపించాలమ్మా!.." దీనంగా బ్రతిమాలింది సుందరి.
మంగమ్మ కూతురి కోర్కెను తీర్చాలని నిశ్చయించుకొంది.. 'నీ పెండ్లి రఘుతోనే జరిపిస్తానమ్మా!..' కూతురికి మాట ఇచ్చింది మంగమ్మ.
భూపతి.. భార్య కూతుళ్లు కోర్కెను ధిక్కరించాడు. తన ఇష్టానుసారంగా తన బావమరిది శ్రీపతికి చెప్పి.. నిశ్చితార్ధానికి.. ముహూర్తం పెట్టించాడు. శుభలేఖలు అచ్చువేయించాడు. వూరంతా పంచాడు.. "మీరు చేసిన పని సరైంది కాదు.." అని భార్య మంగమ్మ ఆక్షేపించింది. నిశ్చితార్థానికి గడవు వున్నది మూడు రోజులు. భూపతి ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాడు.
భూపతి, రఘు తండ్రి రాజయ్యను పిలిపించి ఓ పందెం కాచాడు. 'రోజు కూసే నీ కోడి యెల్లుండి కూయదు.. కూసిందంటే నీ కొడుకేనా 'అల్లుడు..' అన్నాడు.
'కూసి తీరద్దీ సామీ..' అంటూ ఆనందంగా చెప్పి, ఇంటికి చేరి భార్యకు కొడుక్కు విషయం చెప్పాడు రాజయ్య. భూపతి మంచి పెట్టకోడిని తెప్పించి తన ఆవరణలో వదిలాడు. రాజన్న పుంజుకోడి దాని చెంతకు చేరింది. ఇరువురికీ స్నేహం కుదిరింది.
తన అనుచరులచేత రేపు పెండ్లి అనగా రాజయ్య కోడిని పట్టి చంపి తన తోట గెస్ట్ హౌస్ లో గోవిందుతో సురాపాన సేవలో రాజయ్య పుంజుకోడి మాంసంతో ఆనందించాడు. రాత్రి రెండు గంటలకు ఇంటికి వచ్చి పడుకొన్నాడు.
వేకువన నాలుగున్నరకు రాజన్న కోడి కూసింది. వులిక్కిపడి లేచాడు భూపతి. ప్రక్కన భార్య లేదు. హడా విడిగా ఆమె పేరును పెద్దగా పిలిచాడు.. జవాబు లేదు. కోడి మరోసారి కూసింది.
గోవిందు పరుగున వచ్చి, ‘‘అందరూ పట్నం పోయారంట.. అక్కడ రఘుకు సుందరికి ఆరు గంటలకు పెళ్లిట.." చెప్పాడు.
ఆశ్చర్యంతో నేల కూలాడు భూపతి.
‘'రాత్రి మనం తిన్న కోడి రాజన్నది కాదు. వదినమ్మ మార్చేసింది..’’ బిక్క మొఖంతో చెప్పాడు గోవిందు. తాను ఓడినందుకు తల బాదుకొన్నాడు భూపతి.
* * *
|
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.
అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.
మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.
Comments