కొడుకు నిర్ణయం
Koduku Nirnaya - Telugu Family Story | Sanka Sobharani
కొడుకు నిర్ణయం - తెలుగు కుటుంబ కథ | సంకా శోభారాణి
Published in manatelugukathalu.com on 03/11/2026
సంకా శోభారాణి రచించిన ‘కొడుకు నిర్ణయం’ ఒక హృదయాన్ని కదిలించే తెలుగు కుటుంబ కథ. వృద్ధ తండ్రిని నిర్లక్ష్యం చేసిన కొడుకుకు, తాతపై అపారమైన ప్రేమ చూపించిన మనవడు తీసుకున్న నిర్ణయం కుటుంబ బంధాల విలువను తెలియజేస్తుంది.
రాజారావు ఒక్కగానొక్క కొడుకు సూర్యం. కలిగినంతలోనే సూర్యాన్ని డిగ్రీ వరకు చదివించాడు.
అదృష్టం కొద్దీ సూర్యానికి బ్యాంక్‌లో ఉద్యోగం వచ్చింది. రాజారావు కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేసి ఒక ఇంటివాడిని చేశాడు.
రాజారావు భార్య గతించి సుమారు 20 సంవత్సరాల పైమాటే.
ఉద్యోగరీత్యా సూర్యం పట్నం వెళ్లాల్సి వచ్చి ఒంటరిగా ఉన్న తండ్రితో సహా పట్నం చేరాడు.
అప్పటికే ఒక మగబిడ్డకు తండ్రి కూడా అయ్యాడు. బిడ్డకు సుధీర్ అని పేరు పెట్టి పెంచసాగారు.
సుధీర్ పెరిగి పెద్దవాడయ్యాడు, ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీలో వచ్చిన ప్లేస్‌మెంట్‌లో ఉద్యోగానికి సెలెక్ట్ అయ్యాడు.
సుధీర్‌కు తాత రాజారావు అంటే పంచప్రాణాలు! చిన్నతనంలో తాత చెప్పే కథలు, దేశనాయకుల గాథలు వింటూ, తాతతో ఆడుతూ పాడుతూ పెరిగాడు.
అందుకే తల్లిదండ్రుల కన్నా తాత అంటేనే ఎంతో ఇష్టం. అయినప్పటికీ ఉద్యోగం కోసం అన్ని వదిలి వెళ్లాల్సి వచ్చి సుధీర్ బెంగళూరుకు వెళ్లి సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాడు.
ఇంతలో రాజారావుకి వయసు పైబడటంతో ఆరోగ్యం కాస్త క్షీణించి నీరసపడ్డాడు. అందుకని సూర్యం ధర్మాసుపత్రిలో మందులు తెచ్చి వాడటం మొదలుపెట్టాడు. అయినప్పటికీ ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో పెద్ద హాస్పిటల్‌కి తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నాడు సూర్యం.
"నాన్నా! నాన్నా! లేవండి... లేచి ఇడ్లీ తినండి, పెద్దాసుపత్రికి వెళ్దాం," అంటూ ఆటోలో ఎక్కించి తీసుకువెళ్లాడు.
అలా వెళ్తున్న సూర్యానికి రాత్రి తన భార్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి:
"ఏమండీ! మీ నాన్నగారికి వయసైపోయింది, మందులు వాడినా ప్రయోజనమేముంది? పైగా ఆయన మంచాన పడితే చాకిరీ చేయాలంటే ఎంత కష్టం చెప్పండి! అందుకని ఆయన్ని ఎలాగోలా అనాథ శరణాలయంలో చేర్పించి రండి. ఆయనకు, మనకు మంచిది... ఆలోచించండి!" అని భార్య అన్న మాటలు గుర్తుకు వచ్చాయి.
అంతలోనే తన చిన్నతనంలో తల్లి చనిపోతే తన స్వార్థం చూసుకోక తండ్రి మరో పెళ్లి కూడా చేసుకోలేదని, పైగా చిన్నతనంలో తనకు నరాల వ్యాధి వచ్చి బెడ్ మీద కదల్లేకపోతే రెండు సంవత్సరాలు నాన్న తనను కంటికి రెప్పలా కాపాడిన సంఘటనలు గుర్తు వచ్చి వర్తమానంలోకి వచ్చాడు.
అంతలో అక్కడ ఉన్న రామాలయం వద్ద ఆటో ఆపించి, "నాన్నా! ఇక్కడ ఈ అరుగు మీద కూర్చోండి. నేను హాస్పిటల్‌కి వెళ్లి అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తాను, మిమ్మల్ని తీసుకువెళ్తాను," అని చెప్పి తండ్రిని గుడి వద్ద వదిలి వెళ్లిపోయాడు సూర్యం.
చీకటి పడుతోంది, అయినా సూర్యం రాలేదు. గుడి తలుపులు కూడా మూసివేశారు. అలా ఒంటరిగా కూర్చుని ఉన్నాడు రాజారావు. తన మనసులో ఎన్నో భయాలు... తన కొడుకు ఇంకా రాలేదని, ఏమైందో అని కంగారుపడుతున్నాడు.
అటుగా వెళ్తున్న ఒక యువకుడు చూసి, "అయ్యో... తాతా! ఎక్కడికి వెళ్లాలి? చీకటి పడింది చెప్పండి, నేను నా బైకు మీద దింపుతాను," అన్నాడు.
"నా కొడుకు ఆసుపత్రికని తీసుకొచ్చాడు. అపాయింట్‌మెంట్ తీసుకుని వస్తానని పొద్దున అనగా వెళ్లాడు, ఇంకా రాలేదు. వాడికి ఏమైందో అని భయంగా ఉంది," అని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు.
అంతలో ఆ యువకుడు, "అయ్యో... తాతా! మీరు చాలా పెద్దవారు, ఏమీ తినలేదు కదా! ఉండండి," అంటూ ఎదురుగా ఉన్న చిన్న హోటల్లో ఇడ్లీ తెచ్చి తినిపించాడు. "హా... తాతా! ఇప్పుడు చెప్పండి, మీ అబ్బాయి ఫోను నంబరు చెప్పండి ఫోన్ చేస్తాను," అన్నాడు.
"అయ్యో! నాకు నంబరు తెలియదు బాబూ!"
"అయితే బండి మీద కూర్చోండి, మీ ఇంటి దగ్గర దింపుతాను," అన్నాడు.
"సరే బాబూ!" అంటూ బండి మీద కూర్చున్నాడు రాజారావు.
"ఆ... ఆ... ఇక్కడే బాబూ! ఇదే మా ఇల్లు," అంటూ ఇంటి దగ్గర దిగగానే ఇల్లు తాళం వేసి ఉంది.
ఆ యువకుడు, "తాతా! మీరు ఇక్కడ ఉండండి. పక్క ఇంటివాళ్లకు మీ అబ్బాయి నంబరు తెలుసేమో అడుగుతాను," అంటూ పక్క వాటాలో ఉండే సూర్యం కొలీగ్‌ని అడిగి నంబరు తీసుకుని ఫోన్ చేశాడు.
ట్రింగ్ ట్రింగ్ అని మోగింది. అవతలి కంఠం, "ఎవరండి మీరు?" అని పలికింది.
"మీ నాన్నగారిని వదిలి వెళ్లారట కదా, మీ ఇంటికి తీసుకొచ్చాను," అని యువకుడు అనడంతో...
"మేము ఊళ్లో లేమండి, ఆయన్ని అనాథ శరణాలయంలో అప్పజెప్పండి!" అన్నాడు సూర్యం.
ఆ మాటలకు ఆ యువకుడు, "తాతా! మీ అబ్బాయి మిమ్మల్ని అనాథ శరణాలయంలో చేర్చమన్నాడు. ఆయన వస్తే మిమ్మల్ని చేర్చుకోరని, మిమ్మల్ని వదిలించుకోవడానికి ఇలా చేశాడు మీ అబ్బాయి. చాలా గొప్పోడు తాతా నీ కొడుకు!" అంటూనే అనాథాశ్రమానికి తీసుకొచ్చాడు. రాజారావుని అక్కడ దింపి వివరాలు చెప్పి అనాథ అని చేర్పించాడు.
రాజారావు ఉండే శరణాలయానికి 'చిట్టి టీవీ' వాళ్లు అనాథల మీద డాక్యుమెంటరీ చిత్రం తీస్తున్నారు.
రాజారావు మాట్లాడుతూ, "నేను అందరూ ఉన్న అనాథను. నా కోసం ఎవరూ రారు... నా కొడుకు నన్ను గుడి దగ్గర వదిలేసి వదిలించుకున్నాడు," అంటూ ఏడవసాగాడు.
టీవీ టెలికాస్ట్ అంతా బెంగళూరులో ఉన్న సుధీర్ కంట పడింది. 'ఏమిటీ! తాతలా ఉన్నాడు?' అనుకుంటూ స్క్రోలింగ్‌లో ఇచ్చిన నంబరుకు ఫోన్ చేశాడు. ఆశ్రమం వాళ్లు వివరాలు చెప్పడంతో హుటాహుటిన బయలుదేరి ఆశ్రమం చేరుకున్నాడు సుధీర్.
"తాతా! రా తాతా, ఇంటికి వెళ్దాం," అంటూ చేయి పట్టుకున్నాడు.
"వద్దురా! మీ నాన్నకు నేను అక్కర్లేదు, ఇక్కడే ఉంటాను," అన్నాడు రాజారావు.
బలవంతం చేసి తాతను తన అమ్మానాన్నల దగ్గరకు తీసుకువచ్చాడు సుధీర్.
"మీరు చేసిన పనేంటి నాన్నా? అమ్మ! నువ్వైనా నాన్నకు చెప్పొచ్చుగా... తాతను అనాథాశ్రమంలో వదిలేస్తారా? ఇక తాత లేని ఈ ఇల్లు, మీరు నాకు వద్దు! తాతను తీసుకుని నేను వెళ్లిపోతాను. ఈరోజు నుంచి మీరే అనాథలవుతారు!" అంటూ తాతతో కలిసి వెళ్లిపోయాడు సుధీర్.
తల్లిదండ్రులు తాము చేసిన తప్పు క్షమించమని అడిగినప్పటికీ... "మీరు చేసిన తప్పు క్షమించరానిది! మీరు తప్పకుండా శిక్ష అనుభవించాల్సిందే. ఇదే నేను మీకు విధించే శిక్ష... మీకు, నాకు ఎలాంటి సంబంధం లేదు! ఇదే నా నిర్ణయం," అంటూ విసురుగా తాతను తీసుకుని వెళ్లిపోయాడు సుధీర్.
వారు చేసిన తప్పుకు సూర్యం, అతని భార్య చింతించని రోజు లేదు. కొడుకు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియని పరిస్థితి. ఫోన్ చేసినప్పటికీ 'ఫోన్ మనుగడలో లేదు' అని రావడంతో కొడుకు నిర్ణయానికి తలవొగ్గక తప్పని పరిస్థితి అయింది. కాలంతో రాజీపడి కొడుకు ఎప్పటికైనా రాకపోతాడా అని ఎదురుచూస్తూనే ఉన్నారు ఆ దంపతులు!
- శుభం -
- సంకా శోభారాణి
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
సంకా శోభారాణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

పరిచయం: నా పేరు సంకా శోభారాణి.
నేను చిన్ననాటినుండి మా నాన్నగారితో కలిసి రేడియో వినే అలవాటు ఉండేది.
ఆ అలవాటు నుండి రేడియోలో కవితలు, కథానికలు రాసి రెమ్యునిరెషన్
తీసుకునే స్థాయికి వచ్చాను. నాకు రేడియోలో RJ గా చేయాలనే కోరికతో తెలుగు NRI ఆన్లైన్ రేడియో లో 7సంవత్సరాలు నుండి rj గా చేస్తూ ఆ రేడియోలో 25 నిమిషాల నిడివిగల లైవ్ నాటికలు రచించి, నిర్వహించి, పాత్రధారిగా చేశాను. గణేష్ కర్నూలు పత్రికలో రోజు కవిత పబ్లిష్ అవుతుంది. సాహితీ సదస్సులలో పాల్గొంటూ 200లకు పైగా సన్మానాలు పొందాను. నిత్య అక్షర సాధకురాలు జాతీయ అవార్డ్, స్త్రీశక్తి, కధామంజరి, ఇలా అవార్డ్స్
రావడం జరిగింది.











Comments