ఒకే ఒక్కఛాన్స్

Oke okka Chance - Telugu Moral Story | Madhupatra Sailaja Uppaluri
ఒకే ఒక్కఛాన్స్ - తెలుగు నీతి కథ | మధుపత్ర శైలజ ఉప్పలూరి
Published in manatelugukathalu.com on 03/11/2026
రిటైర్మెంట్ తర్వాత కూడా కొత్త కలలు కనడానికి వయస్సు అడ్డంకి కాదని భావించిన జయశ్రీ, టీవీ సీరియల్‌లో నటించాలనే ఆశతో అడుగులు వేస్తుంది. అయితే ఆమెకు వచ్చిన ‘ఒకే ఒక్క ఛాన్స్’ ఎలాంటి అనుభవాన్ని మిగిల్చిందో హాస్యం, వ్యంగ్యం కలగలిపిన ఈ కథలో చదివి ఆనందించండి.
“ఏమండోయ్!” అంటూ పేపర్‌లో వాంటెడ్ కాలమ్స్ చూస్తున్న జయశ్రీ పెట్టిన పొలికేకకు, పెరట్లో మొక్కలకి నీళ్ళు పోస్తున్న సుందర్రావు “ఏమిటే? ఏమయ్యింది అంత గావుకేక పెట్టావు?” అని వచ్చి జయశ్రీ పక్కనే కూర్చుంటూ అడిగాడు.
“ఓసారి ఈ వాంటెడ్ కాలమ్ చదవండి” అంటూ జయశ్రీ భర్తకి పేపరందించింది. “ఏముందే ఇందులో?” అంటూ జయశ్రీ చూపించిన వార్తను చూస్తూ, “కావలెను.. మేము కొత్తగా తీస్తున్న T.V. సీరియల్‌లో నటించటానికి ఆసక్తి ఉన్న మహిళలు ఫోటోతో క్రింది చిరునామాకు వివరాలను పంపండి” అని చదవటం పూర్తిచేసి, “ఇందులో నువ్వు అంతగా కేకలు పెట్టి ఆనందించాల్సిన విషయం ఏమీ లేదే?” ఆశ్చర్యంగా అన్నాడు సుందర్రావు.
“మరదేనండి! చాలాకాలం నుండి నాకు ఏదైనా T.V. సీరియల్‌లో నటించాలనుందని మీకు చెపుతూనే ఉన్నాను కదా! ఇంతకాలానికి మంచి ఛాన్స్ దొరికింది. అందుకే నా ఫోటో పంపిస్తానండి. కాస్త పంచాంగం చూసి మంచిరోజు చెప్పండి” అంటూ అడిగింది జయశ్రీ.
“ఓసినీ! ఈ వయస్సులో నీకిదేం పోయే కాలమే? చేసినన్నాళ్ళు టీచర్‌గా ఉద్యోగం బాగానే చేశావు. రిటైరయ్యావు. హాయిగా కడుపులో చల్ల కదలకుండా విశ్రాంతి తీసుకో, లేకపోతే నలుగురు పిల్లలకి ట్యూషన్స్ చెపుతూ కాలక్షేపం చేసుకో.
అంతే కానీ ఇలా సీరియల్స్‌లో నటించాలనే పిచ్చేమిటే నీకు? అయినా తప్పంతా నాదేనే జయా. ‘రిటైరయ్యాను. ఉన్న ఒక్కగానొక్క అమ్మాయికి పెళ్ళిచేసి అత్తగారింటికి పంపేశాం. నా కాలక్షేపానికి T.V. కొనుక్కుందామండీ. చిప్స్ ప్యాకెట్స్ గంపెడు కొనుక్కుని, వాటిని తింటూ రోజూ రకరకాల సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేయాలనుంది. ఇంతకాలంగా మిమ్మల్ని ఏవీ అడగలేదు’ అని నువ్వు గోముగా అడగంగానే ఊరంత పెద్ద T.V. కొనిపడేశాను చూడు, అదే ఇప్పుడు నా కొంప మీదికి తెచ్చింది.
ఆ T.V. వచ్చినప్పటి నుండి వారానికోసారి వంటలు చేసి ఫ్రిజ్‌లో పెట్టేసినవి ప్రతిరోజూ తింటూ, అవి చాలనప్పుడు టిఫిన్ సెంటర్ నుండి నీకు కావలసిన వాటిని తెప్పించుకుంటూ, నీ సీరియల్ వీక్షణానికి ఆటంకం లేకుండా చేసుకుంటున్నావు కదా! హాయిగా వాటిని చూస్తూ ఎంజాయ్ చేయక, ఇంకా ఈ వయస్సులో నటిస్తానంటావేమిటి?” కోపంగా అన్నాడు సుందర్రావు.
“మీరెప్పుడైనా కూర్చుని సీరియల్స్‌ని శ్రద్ధగా గమనిస్తే కదా వాటిల్లో నటించేవాళ్ళు ఎలా నటిస్తున్నారో తెలిసేది? వాళ్ళకన్నా నా వాచకం, సంభాషణలు ఎంతో మెరుగ్గా ఉంటాయి. వాళ్ళకి బయటవారెవరో చెప్పిన డబ్బింగ్‌తో డైలాగులు ఉంటాయి.
కానీ నా డైలాగులు నేనే చెప్పుకుంటాను. నేను ఫోటోతో పాటుగా కొన్ని డైలాగులు ప్రాక్టీస్ చేసి ఆడియో, వీడియో కూడా పంపిస్తాను.
నాకు ఖచ్చితంగా వాళ్ళ నుండి పిలుపు వస్తుంది, మీరు చూస్తూండండి” అంటూ సెల్ పట్టుకుని పడకగదిలోకి విసవిసా వెళ్ళిపోయింది జయశ్రీ.
రెండు రోజుల పాటు ‘కార్తీకదీపం’ సీరియల్‌లోని ‘దీప’ అత్త పాత్ర డైలాగ్స్, ‘పాపే జీవనజ్యోతి’ సీరియల్‌లోని ‘జీవన’ పెద్దమ్మ డైలాగ్స్ కొన్నింటిని నేర్చుకుని, వాటిని ఆడియోతో పాటు వీడియో చేసి, తన ఫోటోను జతచేసి ఆ ప్రకటన ఇచ్చిన వారికి పంపించింది.
ఒక నెల గడిచిపోయినా వారి నుండి ఏమీ సమాధానం రాలేదు. “నీ నటనకి వాళ్ళు భయపడిపోయి ఉంటారు, అందుకే పిలుపు రాలేదు” అని సుందర్రావు ఎగతాళి చేయటం, జయశ్రీ ఉడుక్కోవటం పరిపాటి అయిపోయింది.
అలా ఎదురుచూస్తున్న జయశ్రీకి ఓ రోజు ఆ ప్రకటన ఇచ్చిన వారి నుండి ఫోను వచ్చింది. “మేము తీస్తున్న సీరియల్‌లో మీకో పాత్ర ఉంది. ఫలానా చోట షూటింగ్ జరుగుతుంది, మీరు తప్పక రావలసింది” అన్న సమాచారం వినగానే ఎగిరి గంతేయాలనిపించింది జయశ్రీకి. కానీ తన వయస్సు గుర్తుకువచ్చి “ఏమండోయ్..” అంటూ సుందర్రావు చెవులు పోయేలాగా కేక పెట్టింది.
“ఏమయ్యిందే?” అంటూ పరుగులాంటి నడకతో వచ్చాడు సుందర్రావు.
“నన్ను వెంటనే హైదరాబాద్‌కి రమ్మనమని ఆ సీరియల్ తీసేవాళ్ళు ఫోను చేశారండి” చెపుతున్న జయశ్రీ ముఖం ఆనందంతో అరవిందమయ్యింది.
“నిజంగానా? ఇంతకీ నీ పాత్రేమిటో?” ఆతృతతో అడిగాడు సుందర్రావు.
“ఏమోనండీ, వెడితేనే తెలుస్తుంది. నాకు శనివారం నాటికి బస్ టిక్కెట్ కొనేయండి. అక్కడున్న మన అమ్మాయి వాళ్ళకి విషయం చెప్పండి. మనం ఇవాళో రేపో షాపింగ్‌కి వెళ్ళాలి. మేకప్ కిట్, చీరలు, ఫ్యాన్సీ నగలు కొనుక్కోవాలి” అంటూ కొనాల్సిన వస్తువుల లిస్ట్ రాయటం మొదలుపెట్టింది జయశ్రీ.
ఆ రాత్రంతా వింతవింత కలలలో తేలిపోయింది జయశ్రీ. పక్కనే పడుకున్న భర్త వీపుపై చర్రున ఓ దెబ్బవేసి “ఏమే! వంకాయ ఫ్రై చేయమంటే బెండకాయ కూర చేస్తావా? నీకు అత్త మాటంటే లక్ష్యం లేకుండా పోతోంది, తాట తీస్తా” అంటూ కోపంగా డైలాగ్స్ చెపుతోంది.
సుందర్రావు నిద్రలేచి “అబ్బా! నీ సీరియల్ నటన తగలెయ్యా! నాపైనే ప్రయోగిస్తూ నాకు నిద్రలేకుండా చేశావు కదటే?” అంటూ మరో రూంలోకెళ్ళి పడుకున్నాడు. అలా సుందర్రావు భార్య నటనని గమనిస్తూనే ఉన్నాడు.
ఆ రోజు రానే వచ్చింది. హైదరాబాద్‌లోని కూతురింటికి జేరిన జయశ్రీని షూటింగ్ స్పాట్‌కి తీసుకువెళ్ళటానికి ఆ యూనిట్‌వాళ్ళ వెహికిల్ వచ్చింది. అప్పటికే దాంట్లో అయిదారుగురు ఉన్నారు. వారితో మాటామంతి కలిపి విషయాలను రాబట్టటానికి ప్రయత్నిస్తున్న జయశ్రీతో “మేమందరం ఎక్స్‌ట్రా ఆర్టిస్టులం. అక్కడ వాళ్ళు చెప్పిన పనులను చేయాలి. రోజుకి Rs.500/- ఇస్తారు“ అంటూ చెప్పుకొచ్చారు.
“నాకిచ్చే పాత్రకు ఆ సీరియల్‌లో చాలా ప్రాధాన్యం ఉంటుంది. మీరు షూటింగ్‌లో చూస్తారుగా, నా నట విశ్వరూపం!” తన గురించి చాలా గొప్పలు చెప్పుకుంది జయశ్రీ.
ఆ మాటలను వింటున్న వ్యానులోనివారు “మొదటిసారి అనుభవం ఇలాగే ఉంటుంది” అనుకున్నారు. ఒకరి మొగమొకరు చూసుకుంటూ నవ్వుకున్నారు. మాటల్లోనే వారంతా షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారు.
షూటింగ్ హడావిడి మొదలయ్యింది. వచ్చిన ఈ ఎక్స్‌ట్రా నటీనటులను సెట్టింగ్స్ తుడవమని, ఫ్లవర్ వాజ్‌లను సర్దమని, హీరోహీరోయిన్‌లకు కావలసిన సేవలు చేయమనడం లాంటి చిన్నచిన్న పనులతో రోజంతా గడిపేసి రాత్రి తొమ్మిది గంటలకు ప్యాకప్ చెప్పి, మనిషికి అయిదు వందలు చేతిలో పెట్టి పంపించారా యూనిట్‌వాళ్ళు.
ఇలా ఓ వారం రోజులు గడిచిపోయాయి. ప్రతిరోజూ జయశ్రీ తన పాత్ర కోసం యూనిట్‌వాళ్ళను సతాయిస్తూనే ఉంది.
ఆమె పోరు భరించలేక ఆ రోజు జయశ్రీతో చిన్న వేషం వేయించారు. “అమ్మా! ఈ వియ్యపురాళ్ళంతా స్వర్గం నుండి దిగివచ్చిన దేవతల్లా, ఆడపిల్లను కన్నందుకు ఆమె తల్లిదండ్రులకు శిక్ష వేస్తారు. ఎంతో హీనంగా చూస్తారు” అంటున్న వంటామె చంద్రమ్మ పాత్రను జయశ్రీతో చేయించి, ఆమెకు ఓ వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి “ఈ సీరియల్‌లో మీ పాత్ర ఇంతే. వేరే యాడ్స్‌లో ఏమయినా పాత్రలుంటే ఫోను చేస్తాం” అని పంపించేశారు. జయశ్రీకి అదే ఎంతో గొప్పగా అనిపించింది. ఆ రాత్రే తన ఊరికి బస్సెక్కింది.
ఓ నెల రోజులకు ఆ సీరియల్ టెలికాస్ట్ కావటం మొదలయ్యింది లగాయితు అయినవారికి, కానివారికి కూడా ఫోను చేసి ఆ సీరియల్ చూడమని పదేపదే చెప్పింది జయశ్రీ.
తనతో పాటు పనిచేసి రిటైరయిన టీచర్లు, ఇంకా ఉద్యోగంలో ఉన్నవారి ఫోన్ నెంబర్లు అతికష్టం మీద సంపాదించి, తాను నటించిన సీరియల్‌లోని చంద్రమ్మ పాత్ర గురించి వివరించి చెప్పి తన నటన ఎలా ఉందో చెప్పమని అడిగింది జయశ్రీ.
అంతేగాక బంధువుల ఇళ్ళకి, చుట్టుప్రక్కల ఇళ్ళకి కూడా వెళ్ళి పేరంటానికి పిలిచినట్లుగా తాను నటించిన సీరియల్ గురించి చెప్పి తన నటన మీద అభిప్రాయాలను చెప్పమంది.
వాళ్ళు కూడా జయశ్రీ మాటలకి బాగా ముచ్చటపడి “మీకు భలేగా అవకాశం వచ్చింది. ఈ సీరియల్ దెబ్బతో మీ పేరు తెలుగు రాష్ట్రాలలో మారుమోగిపోతుంది చూడండి.
అపైన మీకు వరసగా సీరియల్స్‌లో నటించమని ఆఫర్లు వచ్చిపడతాయి. అప్పుడు మా సంగతి మర్చిపోకండి. ఏదో ఇరుగుపొరుగున ఉంటున్నాం, కష్టసుఖాలను పంచుకుంటున్నాం.
మీ నటనా రంగంలో ఏదైనా అవకాశం వస్తే మాత్రం మమ్మల్ని కూడా ఇరికించేయండి. అప్పుడు ‘కళాకారుల వీధి’ అని మన వీధికి గొప్పగా పేరు వస్తుంది” అంటూ జయశ్రీని ఆకాశానికి ఎత్తేసారు.
ఓ సోమవారం మొదలయిన “కోడలూ కాబోయే అత్తే” ఎపిసోడ్ చూడటానికి అందరూ ఎంతో ఉత్కంఠతతో T.V.ల ముందు కూర్చున్నారు. వంటమనిషి ‘చంద్రమ్మ’ పాత్రధారిణి జయశ్రీ వంటింటిలో వంట చేస్తోంది.
హాల్‌లో నుండి “చంద్రమ్మా! కాఫీ తీసుకురా” అంటూ హీరోయిన్ తల్లి పిలుస్తుంది. స్కూల్‌లో టీచర్‌లాగా ఠీవిగా నడుస్తూ క్లాస్‌గా కాఫీ కప్‌తో వచ్చి హీరోయిన్ తల్లికిస్తూ “అమ్మా! అమ్మాయిగార్ని ఆరి అత్తారింటికి పంపకండమ్మా” అంటూ ఎంతో కోపంగా డైలాగ్ చెప్పింది చంద్రమ్మ.
“ఇదేమిటి? నేను చెప్పిన డైలాగ్ ఒక్కటి కూడా రాలేదు. ఏవో కొత్త మాటలు వచ్చాయి” అనుకుంటూ తలపట్టుకు కూర్చుంది జయశ్రీ.
అదే సీరియల్ చూస్తున్న జయశ్రీ వియ్యపురాలికి అరికాలి మంట నెత్తికెక్కింది. కోడలి వైపు తిరిగి “ఏం లతా! నేనేమన్నా నిన్ను కాల్చుకు తింటున్నానా? రాచిరంపాన పెడుతున్నానా? సీరియల్‌లో పాత్రే ఐనా మీ అమ్మ అలా అనటం ఏం బాగాలేదు.
నన్ను ఉద్దేశించి అన్నట్లే ఉందిగా! నటనే అనుకున్నా అలాంటి డైలాగ్స్ చెప్పననాలి గానీ..” అంటూ టప్‌మని T.V. ఆఫ్ చేసేసింది.
“అది నటనేగా అత్తయ్యా” అంది లత. కోడలి వైపు కోపంగా చూస్తూ తన గదిలోకి వెళ్ళిపోయిందామె.
“ఒకే ఒక్క సీనులో అత్తగా నటించే ఆమెకి చంద్రమ్మ కాఫీ తీసుకువచ్చి, ఇచ్చేటప్పుడు ఒకే ఒక్క డైలాగ్ చెప్పటం” చూసిన జయశ్రీ స్నేహితురాళ్ళు, బంధువులు, ఇరుగుపొరుగువాళ్ళు "ప్చ్! ‘ఒకే ఒక్క ఛాన్స్’ వస్తే బాగుండునని ఎదురుచూసి చూసి, తెలిసినవాళ్ళకి తెలియనివాళ్ళకి తాను నటించిన సీరియల్ వస్తోందని ఎంతగా డబ్బా కొట్టి చెప్పిందో! తీరా చూస్తే ‘ఒకే ఒక్క ఛాన్స్’ అన్నందుకు ‘ఒకే ఒక్క సీను’లో ‘ఒకే ఒక్క డైలాగ్’ చెప్పించారు. బాగా అయ్యింది జయశ్రీకి” అనుకుంటూ ఎగతాళిగా నవ్వుకుంటూ “భలే అయ్యిందండీ! ‘ఒకే ఒక్క ఛాన్స్’గా ‘ఒకే ఒక్క డైలాగ్’ చెప్పారు. ఏమయినా మీకు కంగ్రాట్స్” అంటూ ఫోన్లు చేయటం మొదలుపెట్టారు.
“ఏమిటండీ మీరేం మాట్లాడరు?” అంటూ సీరియల్ అయ్యాక భర్తనడిగింది జయశ్రీ.
“నీ నటనెక్కడుందే అందులో? నువ్వున్న కాసేపు కూడా కెమెరా ఆ హీరోయిన్ తల్లి పాత్రవైపేగా ఉంది. ఇందుకోసమేనా ముప్పై వేలు ఖర్చుపెట్టావు ‘ఒకే ఒక్క ఛాన్స్’ అంటూ?” వెక్కిరించాడు సుందర్రావు. ఇంతలో ఫోను మోగింది.
“చూడండి, నా నటనను మెచ్చుకుంటూ ఎవరో అప్పుడే ఫోను కూడా చేస్తున్నారు” అంటూ ఫోను తీసుకుని “హలో..” అంది జయశ్రీ.
“హలో లేదు పొలో లేదు. నువ్వు అర్జెంట్‌గా మా అత్తగారికి క్షమాపణలు చెప్పు. నీ సీరియల్ పిచ్చి నా కాపురానికి ముప్పు తెచ్చేలా ఉంది” అంటూ కసురుకుంది లత.
“మా బాగా అయ్యింది చంద్రమ్మగారి పని” అంటూ “ముందుగా నాకు వేడివేడిగా అన్నం పెడతావా? లేక మీ వియ్యపురాలికి క్షమాపణలు చెప్తావా?” అన్నాడు సుందర్రావు అల్లరిగా నవ్వుతూ.
“ఒకే ఒక్క ఛాన్స్” చివాట్లకే మిగిలిందిగా అంటూ వాపోయింది జయశ్రీ.
***
📢 మనతెలుగుకథలు.కామ్ WhatsApp ఛానల్‌ను ఉచితంగా ఫాలో అవ్వండి!
మనతెలుగుకథలు.కామ్‌లో ప్రచురించే కథలు • కవితలు • ప్రత్యేక వ్యాసాలు • సీరియల్ ఎపిసోడ్స్ - వాటి తాజా లింక్స్‌ను మా WhatsApp ఛానల్‌లో పొందవచ్చు.
✅ ఛానల్‌ను Follow చేయండి✅ WhatsAppలో Updates → Channels ద్వారా మా పోస్టులు చూడండి✅ మీకు నచ్చిన కథ లేదా పోస్టు లింక్‌పై క్లిక్ చేసి చదవండి✅ కొత్త పోస్టులు మిస్ కాకుండా Notifications 🔔 ON చేసుకోండి✅ మీ స్నేహితులు, సన్నిహితులతో మా ఛానల్‌ను Share చేయండి
👉 మా WhatsApp ఛానల్: https://whatsapp.com/channel/0029VbE7RFB3mFY84MHHSb3y
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి కొన్ని ఇతర రచనలు:
మధుపత్ర శైలజ ఉప్పలూరి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
రచయిత్రి పరిచయం: మధుపత్ర శైలజ ఉప్పలూరి

ఒక స్పూర్తి కలిగించే వార్తను చదివినా, దృశ్యం చూసినా దానిలోని కదిలించే గుణం అవ్యక్తభావన రచయిత లేదా రచయిత్రి మదిలో పడితే అక్షరాన్ని ఆయుధంగా మలచుకుని వారు ఆ సంఘటనను సృజనాత్మకతతో, కల్పనతో ఓ కవితగానో, ఓ కథగానో, ఓ నవలగానో రూపాంతరం చేసి దానిని అనేకమందికి చేరవేయటం ద్వారా విశ్వవ్యాప్తి చేస్తారు. ఆ కోవకు చెందినవే నా కవితలు, కథలు. గత 20 సంవత్సరాలుగా చేస్తున్న ఈ సాహితీ సేద్యంలో ఒక కవితా సంపుటి (మధుపత్రాలు), మూడు కథా సంపుటాలను (మధుమాలిక, మధువనం, మధుమంజీరాలు) ప్రచురించాను. 100 కవితలను, 300 పైగా కథలను రచించాను. అనేక సాహితీ సంస్థలు నా రచనలకు బహుమతులనిచ్చి, ప్రచురించి నన్ను ప్రోత్సహిస్తున్నాయి.













Comments